నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Monday, February 15, 2010

నామినీ, కొంచెం బడాయి తగ్గించుకో! (రంగనాయకమ్మ గారి ప్రతిస్పందన)

(ఫిబ్రవరి 15 ఆంధ్ర జ్యోతి వివిధ లో వచ్చిన వ్యాసం ఇది. నామిని వ్యాఖ్యలపై ఎలాంటి నిరసనను ప్రచురించకుండా వున్న ఆంధ్రజ్యోతి ఎట్టకేలకు రంగనాయకమ్మ గారి వ్యాసం ప్రచురించింది. రంగనాయకమ్మ సూటిగా, కొంచెం మెత్తగా, కొంచెం కరుకుగా రాసిన వ్యాసం ఇది.)

ఏ కూలి మనిషికీ, ఏ బీద రైతుకీ, ఏ ధనికుడూ సన్మానాలు చెయ్యడు. కులసంఘాలు అయినా, ఆ కులంలో వున్న బీదల మొహాలు చూడవు. ఏ నిరుద్యోగి అయినా, 'నేను బీదవాణ్ణి, 10 లక్షలతో నాకు సన్మానం చెయ్యండి' అంటే ఆ బీదవాడి మాట ఎవరైనా వింటారా? బీదవాళ్ళకి దాన ధర్మాలు చేస్తారు గానీ, సన్మానాలు చెయ్యరు.

నువ్వు 'పచ్చనాకు సాక్షి' కబుర్లు చెప్పిన కాలంలో, నిన్ను గోర్కీగా ఎంచుకుని ముచ్చటపడ్డాం. కానీ, అసలు గోర్కీలో ఎక్కడా మిడిసిపాటు కనపడలేదు. ఇవ్వాళ నిన్ను చూసి ఆశ్చర్యం కలుగుతోంది. ఏ మనిషి అయినా, 'నేను అందరికన్నా చాలా గొప్ప వాణ్ణి' అన్నాడంటే, అనుకున్నాడంటే, ఆ మనిషి, మొదట అల్పుడు! తర్వాత మూర్ఖుడు! నువ్వు చాలా గొప్పవాడివే అయితే, ఆ మాట నీ గురించి ఇతరులు చెప్పుకోవాలి. నిన్ను నువ్వే వర్ణించుకోవడం కాదు.

ఇంత చిన్న విషయం తెలయని ఏ మనిషి అయినా, గొప్ప వాడయ్యేది, అల్పత్వంలోనే! నువ్వు నీ సన్మానాల గురించి సంజాయిషీలు మొదలు పెట్టావెందుకు? ఈ ప్రపంచం నిండా సన్మానాలూ, బహుమానాలూ, బిరుదులూ, అవార్డులూ, తమ శ్రమతో ఏ మాత్రమూ సంబంధం లేని ధన రాసుల్ని నొల్లుకోడాలూ, అన్నీ గొప్ప సంస్కృతిగా చలామణీ అయిపోతూనే వున్నాయి. వాటి కోసం కళాకారులందరూ ఎగబడుతూనే ఉన్నారు. అందరూ చేసే పనే నువ్వూ చేశావు. చేస్తావు.

దానికి నిన్నెవరు తప్పు పట్టారు? తప్పు పడతారు? నీ సన్మానం గురించి నిన్నెవరో నిందిస్తారన్నట్టు రక రకాల దబాయింపు వాదనలు సాగించావెందుకు? 'నాకు ఉద్యోగం లేదు. బీదతనం వచ్చింది. అందుకే సన్మానాలు చేయించుకుంటున్నా' అని, నీ సన్మానాలకి ఒక కారణం చెప్పుకున్నావు. మళ్ళీ దానికే విరుద్ధంగా, 'నాకు సన్మానాలు చెయ్యవలసింది నా బీదతనం చూసి జాలితో కాదు; నా విద్వత్తుని చూసి చెయ్యాలి' అన్నావు.

నీకు సన్మానం చేసిన వాళ్ళు నీ విద్వత్తుకే చేశారు. నీ బీదతనానికి కాదు. బీదలు లోకం నిండా కుప్పతెప్పలుగా వున్నారు. ఏ కూలి మనిషికీ, ఏ బీద రైతుకీ, ఏ ధనికుడూ సన్మానాలు చెయ్యడు. కులసంఘాలు అయి నా, ఆ కులంలో వున్న బీదల మొహాలు చూడవు. ఏ నిరుద్యోగి అయినా, 'నేను బీదవాణ్ణి, 10 లక్షలతో నాకు సన్మానం చెయ్యండి' అంటే ఆ బీదవాడి మాట ఎవరైనా వింటారా? బీదవాళ్ళకి దానధర్మాలు చేస్తారు గానీ, సన్మానాలు చెయ్యరు. బీదతనాల్ని చూసి జాలిపడే వాళ్ళ దగ్గర సన్మానాలు చేసేటంతంత ధనరాసులు వుండవు. నీకు జరిగే సన్మానం, నీ బీదతనాన్ని చూసి కాదు; పుస్తకాలు రాశావు అనే కారణానికే.

'నాది బీదతనం కాబట్టి , సన్మానాలు చేయించుకుంటా' అని ఒక వేపూ, 'నా బీదతనానికి కాదు, నా విద్వత్తుకే సన్మానం జరగాలి' అని ఇంకో వేపూ- రెండూ నువ్వే అంటున్నావు. సన్మానాల్ని ఎలా సమర్థించుకోవాలో తోచని ఇబ్బందిలో పడిపోయావు. ఎందుకింత కష్టం నీకు? 'అందరూ చేసేదే నేనూ చేస్తాను' అంటే సరిపోదూ? నీకు సన్మానాలు చేసే వాళ్ళూ, చేయించే వాళ్ళూ, నీ కుల సంఘాల వాళ్ళూ, అంతమంది నీ చుట్టూ వున్నప్పుడు, నీ సన్మానాలకు ఆ కారణాలు చాలవూ? నిన్నెవరైనా, ఏమైనా అంటే, 'నాకు సన్మానాలు చేసే నా వాళ్ళు వున్నారు, మీకూ మీ వాళ్ళు వుంటే మీరూ చేయించుకోండి!' అంటే చాలదూ? అసలు ఆ మాటలు మాత్రం ఎందుకు? సన్మానం ఎందుకని ఎవరు అడిగారు నిన్ను? 'పిల్లలకి, పెద్దలకి అందరికీ పనికివచ్చే పుస్తకాలు రాశాను.

నా పుస్తకాలు చదివితే మంచి మంచి రసాలు ఊరతాయి. అంత మంచి పుస్తకాలు మీరందరూ ఎందుకు కొనరు? నా పుస్తకాలు కొంటే, ఆ డబ్బుతో నేను బతుకుతాను కదా? నా పుస్తకాలు మీరు ఎందుకు కొనరు?' అని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావు. ఇదేం తగువు? ఇష్టమైతే కొంటారు, లేకపోతే లేదు. ఇతర రచయితల పుస్తకాల్లో మంచి రసాల పుస్తకాలన్నీ నువ్వు కొంటున్నావా? కొనకపోయినా ఎలాగో సంపాదించి చదువుతున్నావా?

నీ పుస్తకాలు కొందరైనా కొన్నారు. చదివారు. చదివిన వాళ్లందరికీ మంచి రసాలే ఊరినట్టయితే వాళ్ళు నీ పుస్తకాల్ని చాలా ప్రచారం చెయ్యాలి. వాళ్లు అలా చెయ్యటం లేదంటే, వాటి వల్ల మంచి రసాలు ఊరలేదేమో అనే ప్రశ్న నీకు రావాలి. రాలేదా?

నువ్వు నీకు తెలిన మాండలీకంలో, నీకు తెలిసిన బీద రైతు జీవితాల్ని చిత్రించావు. కొన్నిచోట్ల ముచ్చటగొలిపేలా రాశావు; కొన్నిచోట్ల చీదర పుట్టేలా రాశావు. మాండలికం ముసుగులో ఎంతెంత చీదరలకైనా రక్షణ దొరుకుతుంది. ఎవరు ఎలాంటి పుస్తకం రాసినా, దాన్ని చదివే వాళ్ళూ; కొనే వాళ్ళూ; కొనేసి చదవని వాళ్ళూ, కొనకుండా చదివే వాళ్ళూ; రకరకాలుగా వుంటారు. నువ్వూ అలాగే వుంటావు. మంచి పుస్తకాలన్నీ నువ్వు మాత్రం కొనగలవా?

'నా పుస్తకాలు మీరు కొనరు కాబట్టి నేను బీదవాణ్ణి అయ్యాను' అన్నావంటే, నీకు లోకజ్ఞానమే లేనట్టు కనపడుతోంది. పుస్తకాల మీద బతికే రచయిత లెవరూ ఈ దేశంలో లేరు. పాఠకులు, రచయితలందరి పుస్తకాలూ కొనేసి, రచయితలు పెట్టిన డబ్బు అంతా లాభాలతో సహా తిరిగి వచ్చే లాగచెయ్యాలంటే, మొదట పాఠకులందరూ బికారులై కూర్చుంటారు.

రచన అనేది ఒక 'కళే' గానీ, ఒక 'వృత్తి' కాదు. ఏ రచయిత అయినా, తన జీవనోపాధి కోసం ఏదో ఒక వృత్తి కూడా చేసుకోవలిసిందే. నీకు పత్రికలవాళ్ళు ఉద్యోగాలు ఇవ్వకపోతే, ఆ వృత్తినే మార్చుకోవాలని, మహా రచయితవి నీకు తెలీదా? ఆటోనో, టాక్సీనో నడుపుకోలేవూ? వాచ్‌మన్ పనిచేసుకోలేవూ? ప్రైవేట్లు చెప్పుకోలేవూ? ఒకటిరెండు స్కూళ్ళలో, టీచరు పని చేసుకోలేవూ?

గోర్కీ బండ వృత్తులు అనేకం చేశాడు. గోర్కీ అంతటి నువ్వూ అలాగే చేసుకోవాలి. లోకంలో పత్రికల వాళ్ళే ఉన్నారా ఉద్యోగాలివ్వడానికి? 'చేస్తే పత్రికలో పనే చేస్తా. ఇంకే పనీ చెయ్యను' అలా అంటావా? అలాగైతే, బీదగా బతకడానికే సిద్ధపడాలి. మాటి మాటికి బీద అరుపులు అరిచే నీకు, తాగుడు ఖర్చు ఎందుకు? బీదలు కూడా తాగుళ్ళకి అలవాటుపడతారు. కానీ వాళ్లు 'బీదలం, బీదలం' అనుకోరు. వాళ్ళ కోసం ఎవరో ఏదో చెయ్యాలనీ ఆశించరు. వాళ్లు, ఒక పని పోతే ఇంకో పని చేసుకుంటారు.

వాళ్ళ డబ్బు తోటే వాళ్ళు తాగుతారు. వాళ్ళు గొప్ప రచయితలు కారు కాబట్టి, బీదరికలో కూడా వాళ్ళు తాగుడు తప్పు చేస్తారు. కానీ, నువ్వు గొప్ప రచయితవి! నీ పుస్తకాలు మంచి రసాలు ఊరిస్తాయి! పుస్తకాల వల్ల డబ్బు రాకపోయినా, ఉద్యోగం లేకపోయినా, తాగుడు కోసం ఖర్చు పెట్టే వాడికి, లేదా ఇతరులు పోయిస్తే తాగే వాడికి, జీవితం మీద ఎంత బాధ్యత ఉన్నట్టు? మంచి రసాలు ఊరే నీ పుస్తకాల వల్ల నువ్వెంత నేర్చుకున్నట్టు?ఆ రసాలన్నీ మా కోసమేనా? నీ కోసం కాదా? పుస్తకాలు నీకు తాగుడు ఎలా నేర్పాయి?

నీ సన్మానాలకోసం డబ్బు అందించినవాళ్లకి, నీ పుస్తకాల మీద లక్ష్యం లేదని నువ్వే అంటున్నావు. నీ పుస్తకాలు నీలో ఆత్మాభిమాన రసాన్ని ఊరించలేదా? 'నేను బీదగా వున్నాను కాబట్టి, డబ్బుకోసం సన్మానాలు చేయించుకుంటా' అంటున్నావంటే, నీ వాదంలో, బీద గా వున్నందుకూ సన్మానమే; విద్వత్తు ఉన్నందుకూ సన్మానమే! చాలా తెలివైన దారి!

'ఒక్క ఎకరం వున్న తండ్రి గల వాణ్ణి కాబట్టే బీదరైతుల జీవితాల్ని బాగాచెప్పగలిగాను; ఐదెకరాల ఇంట్లో పుడితే అలాచెప్పలేకపోదును' అన్నావు. ఆ లెక్కన చూస్తే, ఇప్పుడు నువ్వు 10 లక్షల వాడివయ్యావు. ఇంకా అవుతావు కూడా. ఇక ఇప్పటి నించీ నువ్వు చెప్పగలిగే మంచి రసాల రచనలేవీ వుండవని అర్ధమేకదా? నీ వాదన ప్రకారమే, ఇక నామిని అస్తమించాడన్న మాటే కదా?

నామినీ, ఎందుకిలా నీ భుజాలు నువ్వు తడుముకుంటున్నావు? సంజాయిషీలతో మొదలుపెట్టి, దబాయింపుల్లోకి దిగిపోయావు. 'నేను ఇంత గొప్ప, అంత గొప్ప' అని మిడిసిపాటు ప్రదర్శించావు. బొత్తిగా, నిష్కారణంగా చాలా యాతన పడ్డావు.

కొంచెం వివేకం తెచ్చుకో! నీ సన్మానాల గురించి ఎవరైనా నిన్ను తప్పు పడితే, 'అందరూ చేసే పనే నేను చేశాను' నా కన్నా ముందు సన్మానాలు జరిగిన వాళ్ళందర్నీ తప్పు పట్టి, ఆ తర్వాత నన్ను తప్పు పట్టండి' అని చెప్పు, సరిపోతుంది. నువ్వు గతంలో ఎప్పుడైనా సన్మానాలకు వ్యతిరేకంగా మాట్లాడివుంటే, 'అప్పుడు బుద్ధి లేక అలా మాట్లాడాను. ఇప్పుడు బుద్ధి తెచ్చుకున్నాను' అని చెప్పు! అది ఇంకా సరిపోతుంది.

కులసంఘాల వాళ్ళ నించీ డబ్బు అందుకుని, 'వికారంగా కులసంఘా ల డబ్బు' అంటూ బడాయి మాటలు విసిరి, కులసంఘాల వాళ్ళకి ఒళ్ళు మండించకు! ఎందుకీ తుంటరి మాటలు? నీ విద్వత్తుకో, నీ బీదరికానికో, దేనికో దానికి నిన్ను స్థితిమంతుణ్ణి చేస్తోంటే, వాళ్ళకి వినయం చూపించు.

వాళ్ళకి అణగి మణిగి వుండు. చక్కగా వేద మంత్రాలతో, మంగళ వాయిద్యాలతో బాజా భజంత్రీలతో, వంది మాగధులతో ఎబికె ప్రసాద్ వంటి మహా మేధావుల ఆశీస్సులతో, బడా పారిశ్రామిక వేత్తల జ్యోతి ప్రజ్వలనాలతో, వందన సమర్పణలతో, రంగరంగ వైభవంగా సన్మానం చేయించుకో! ముచ్చటగా నెలకో సన్మానంతో నెలకో లక్ష అందుకో! ఎంతకాలం దాకా ఇస్తారో అంతకాలం దాకా అందుకో! వాళ్ళు ఇచ్చింది వాళ్ళ కష్టార్జితం కాదులే. వాళ్ళు దోచుకునే దాంట్లో నువ్వూ ఒక వాటా సంపాదించుకో.

నువ్వు ఇప్పుడు ఒక్క ఎకరం బీద రైతు కుమారుడివి కావు; బడా బడా పారిశ్రామికవేత్తల అత్యున్నత దేవస్థానం ప్రముఖుల ముద్దబిడ్డవి! ఇన్నా ళ్ళూ బీదరైతుల కథలు రాసిన నీ కలం నించి, ఇక ఇప్పటి నించి, సన్మానా లూ, ధనరాసులూ, ఎంత రుచికరమైనవో, నీ వంటి గొప్ప రచయితలకు అవి అందడం ఎంత న్యాయమో, ఎంత అభ్యుదయమో వర్ణిస్తూ నీ వాదనలతో రాబోయే నీ కొత్త రసాల రచన కోసం ఎదురు చూస్తాం నామినీ! సరేనా?

- రంగనాయకమ్మ



41 వ్యాఖ్యలు:

శరత్ కాలమ్ said...

ఈ సన్మానాల గొడవ అంతా ఎక్కడ జరుగుతోందీ? ఆంధ్రజ్యోతిలోనేనా లేక సాహితీ పత్రీకల్లోనా లేక ఇంకా వేరే వేదికలమీదనా? రంగనాయకమ్మగారి దబాయింపు బావుంది కానీ ఈ వివాదం మూలస్వరూపాలు నాకు తెలియవు. నామినీ గారి వర్షన్ ఎక్కడ చూడొచ్చంటారు? ఆంధ్రజ్యోతిలోనేనా? ఎప్పుడో ఏదో చదివినట్లు లీలగా గుర్తుకువుంది.

Unknown said...

నామినీ గారి వర్షన్ : http://thisisanwar.blogspot.com/2010/01/blog-post_25.html

శరత్ కాలమ్ said...

@ సత్యప్రసాద్
ధన్యవాదాలండి. ఇక చదవాలి.

నిషిగంధ said...

I'm speechless! నామిని గారి ప్రసంగం చదివినతర్వాత ఆయన రచనల పరిస్థితికి చాలా బాధ కలిగింది.. ఇప్పుడు రంగనాయకమ్మ గారి ప్రతిస్పందన చదువుతుంటే 'హ్మ్మ్, నిజమే కదా!' అనిపిస్తుంది!! ఆవిడ మాటల్లోని గొప్పతనమే అదిలేండి.. ఏం చెప్పినా చాలా కన్విన్సింగ్ గా ఉంటుంది! కానీ 'తాగుడు ' అంటూ ఆయన వ్యక్తిగత అలవాట్ల జోలికి వెళ్ళకుండా ఉండాల్సిందేమో!?!?

Anonymous said...

రంగనాయకమ్మ గారి చురకలు చాలా చాలా బాగున్నాయి. నామిని ప్రసంగం చదివినాక నాకూ అలాంటి feelings వచ్చాయి, పాపం నామిని కి పదిలచ్చలు ఇచ్చినోళ్లు దబ్బు ఇచ్చి శని పట్టినట్లు తిట్టించుకొన్నందుకు ఎలా feel అయ్యారో అనిపించింది.
రంగనాయకమ్మ గారు దానిని మాటలలో మంచిగా పెట్టగలిగినందుకు అభినందనలు చెప్పాల్సిందే. కాకపోతే నామిని ఇప్పతికీ నా అభిమాన రచయతలలో ఒకడు :)

సుజాత వేల్పూరి said...

రంగనాయకమ్మ గారు చెప్పేదాకా కొన్ని పాయింట్లు అసలు బుర్రకు తట్టనే తట్టవు.నోరెత్తి మాట్లాడలేని కొన్ని పాయింట్లు ఇక్కడ ఉన్నాయి.

ఆమె తిడుతుంటే కూడా హాయిగా ఉంటుంది.(మనల్నైనా సరే)! ఇంకా బాగా తిడితే బాగుండనిపిస్తుంది. ఎందుకంటే ఆ తిట్లలో గొప్ప లాజిక్ ఉంటుంది.

నిషిగంధ చెప్పినట్లు వ్యాసం ఆయన వ్యక్తిగత అలవాట్ల జోలికి(ఇక్కడ చదివే దాకా ఆయనకు ఆ అల్వాటున్నట్లు నాకు తెలీదు) వెళ్ళకుండా ఉంటే బాగుండేదేమో!


దీనికి నామినేం మాట్లాడతారో చూడాలి!

S said...

నిజమే, రంగనాయకమ్మ గారు అన్న పాయింట్లు ఆమె మాటల్లో వింటే కరెక్టనే అనిపిస్తున్నాయి. నామిని ఇంటర్వూ చూసినప్పుడే - ఒక్కోచోట చిరాకేసింది. లక్షకాపీలు వేశాక, అవి ఇంకా ఖర్చవకపోతే పాఠకుల్ని నిందిస్తే ఎలా? అని. అంటే - ముందోవ్యాసంలో మీరు అన్నట్లు - వెయ్యి కాపీలు అమ్ముడుపోడానికే చానాళ్ళు పడుతూ ఉంటే, లక్షకి ఎంత టైం పట్టాలి? అందులోనూ, మాండలీకంలో చేసిన రచన - కొంతమంది అర్థంకాదు అనకుని కూడా కొనకపోవచ్చు. ఏమైనా, మొత్తంగా కాకపోయినా, షరామామూలుగా రంగనాయకమ్మ గారు మంచి జవాబిచ్చారు. వ్యాసం బ్లాగులో పంచుకున్నందుకు థాంక్స్. లేకుంటే, నాకు తెలిసేది కాదు..

Anonymous said...

If any other writer of Namini's caliber went thru what Namini has gone thru, they would have talked the same way.
Namini has expressed his frustration just the same way he penned his stories.
We are sure Many writers are in the same boat like Namini but do not express it due to either modesty or lack of a platform.
Ranganayakamma has no business to come down so heavily on Namini.
Namini is a common mans writer and he'd tilt the scale on any day compared to Nayakamma

Kathi Mahesh Kumar said...

నామినిది ఆక్రోశమైతే రంగనాయకమ్మది ఉక్రోషం. మొదటిదానికి కారణముంది.రెండోది కేవలం రియాక్షన్. అంతే!

అక్షర మోహనం said...

Ranganayakamma garu has given good dose to Naami. Let him digest..All is well..

oremuna said...

I am with Namini.

If there is a monitory benifit, Telugu lit. can be much more prosporous.

బొందలపాటి said...

I tend to agree with anonymous above. Everybody in the society is not an ideal person. People, including Rnayakamma, make mistakes. A person who is on the verge of compromisisng and regretting his own compromise deserves to be understood in a better way. The critic could have been written from a more sympathetic standpoint. Does not ranganayakamma find any other violators in our society than Namini to criticize so harshly..? kcr, cbn, ysr, jagan..etc looters. Does she have guts to do personal criticism against , say Jagan? Criticizing Namini would do nothing but divert attention from these dacoits.

కొండముది సాయికిరణ్ కుమార్ said...

కల్పన గారు సింపుల్ గా షాంపు ఇచ్చి ఊరుకుంటే, రంగనాయకమ్మ గారు కూర్చోబెట్టి మరీ తలంటు పోసారు.

తెలుగు వెబ్ మీడియా said...

రంగనాయకమ్మ గారు నామిని గురించి "మానవ సమాజం" పుస్తకంలో కూడా వ్రాసారు.

Samaikya said...

మనిషి కారెక్టర్ పరస్పర విరుధ్ధమైన కోరికల సమాహారం. మనలో చాలా మంది ఆదర్శం గా ఉండాలనుకొన్నా, సర్వైవల్ కోసం ఉండలేము. అదే నామిని మాటలలో ధ్వనించింది.ఈ కోణం లో ఇంట్రాస్పెక్షన్ తో ఆలోచించినప్పుడు మనల్ని మనం నామిని లో ఐడెంటిఫై చేసుకోవచ్చు. రంగనాయకమ్మ గారి ఖండన లో ఈ ఇంట్రాస్పెక్షన్ లోపించింది. చివరి గా నామిని తన తల్లితంద్రులను తన కథల లో భాగం గా చేసినందుకు బాధ పడటం ఆయన నిజాయితీకి ఒక ప్రూఫ్. ఇక పోతే లక్షలు ఇచ్చిన వాళ్ళని పొగడకపోవటం..ఇది కూడా మన జీవితం లో మనం ఎప్పుడన్నా చేస్తూ ఉండేదే. ఎదుటి వాడికి రుణ పడి ఉండటం అనేది అంత సౌకర్యమైన ఆలోచన కాదు. అవసరం లో మన ఫ్రెండ్ ఎవరో రికమెండేషన్ తో ఒక జాబ్ ఇప్పిస్తే, మనం ఇయిష్టం గనే అ జాబ్ చేయక తప్పదు కదా..

bandi said...

మనం ఎంతో కష్టపడి రాసిన విషయం ఉన్న పుస్తకాలు సక్సెస్ అవ్వాలని మనలో ఎంత మందికి ఉండదు. వాతిని తగినంతగ జనాలు కొనక పోతే (ముఖ్యం గా వాళ్ళకి అభిరుచి లేక పోవటంవలన) ఈ జనాలు కొనక పోతే మనకి ఎంతో కొంత బాధ గానే ఉంటుంది కదా. ఐతే ఆ బధని మనం బయట పెట్టుకోము. నామిని నిజాయితీ గా బయట పడ్డాడు. అంతే తేడా. ఇదే నామిని ఏ మలయాళం లోనో ఫ్రెంచ్ లోనో రచయిత అయితే డబ్బులకి ఇబ్బంది పడవలసి వచ్చేది కాదు.కాబట్టీ తెలుగు పాఠకులపై నామిని అలుగుడు కొంత వరకూ న్యాయమే.
కత్తి మహేష్ గారూ అప్పుడప్పుడూ మీరు అద్భుతమైన వ్యాఖ్యలు రాస్తూంటారండీ. కరక్టే!! "నామినిది ఆక్రోశమైతే రంగనాయకమ్మది ఉక్రోషం. మొదటిదానికి కారణముంది.రెండోది కేవలం రియాక్షన్."

వేణు said...

మహేష్ గారూ! నామిని ఆక్రోశానికి కారణముంది సరే, ఆ కారణం సరైనదేనని మీ అభిప్రాయమా?

ఇక రంగనాయకమ్మ గారిది ‘ఉక్రోషం’ అన్నారు. ఆ ఉక్రోషం ఏమిటో, అది ఎందుకో కూడా మీరు వివరిస్తే బావుంటుందండీ!

Anonymous said...

సుజాత గారికీ, నిషిగంధ గారికీ ఒక ప్రశ్న. "తాగుడు" అనేది నామిని గారి వ్యక్తిగత విషయం అయితే, ఆయన బీదరికం ఆయన వ్యక్తిగత సమస్య కాదా?
నిజానికి రెండూ సామాజిక విషయాలే. ఫలానా ఆయన తాగుతాడూ, అది ఆయన సొంత విషయం అని అనుకోవడం చాలా అమాయకత్వం. తాగుడు అనేది ఒక మనిషి వ్యక్తిగత ఆరోగ్యాన్ని పాడు చేసి ఊరుకోదు. అది మద్య పరిశ్రమని పోషిస్తుంది. శ్రమ దోపిడీకి చాలా దోహదం చేస్తుంది. తన మీద ఆధారపడిన వాళ్ళని నానా కష్టాలూ పడేలా చేస్తుంది. "ఆయన భార్యని ఆయన తిట్టుకుంటాడూ" అనేది ఎంత వ్యక్తిగత విషయమో, "ఆయన తాగుడు ఆయన తాగుతాడూ" అనేదీ అంతే వ్యక్తిగత విషయం. ఒక మనిషి అలవాటు వల్ల ఎప్పుడైతే ఇతరుల పైన ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ప్రభావం పడుతుందో, అప్పుడది వ్యక్తిగత అలవాటు అయి వూరుకోదు. తాగుడుకి ఖర్చు పెట్టుకుంటూ, బీదరికం అరుపులు అరిస్తే, ఎవరన్నా విమర్శిస్తారు మరి. అందులోనూ పేదల కష్టాలు ఎంతో వివరంగా రాసిన రచయిత విషయంలో మరీనూ.

వేణు గారు కత్తి గారిని మంచి ప్రశ్నే అడిగారు. జవాబు కోసం ఎదుర చూస్తున్నాను. అది తెలియకుండా, రంగనాయకమ్మ గారికి ఉక్రోషం అని కత్తి ఎందుకు తేల్చారో అర్థం చేసుకోవడం కుదరదు మరి.

శరత్ కాలమ్ గారి అభిప్రాయం మరీ విడ్డూరం. ఏమీ చదవకుండానే, ఏమీ తెలియకుండానే, ఆ వ్యాసం రంగనాయకమ్మ గారి దబాయింపు అని తేల్చేశారు. ఒక సరైన తర్కం లేకుండా, చేతికి ఏది వస్తే అది రాసేస్తే, ఏం చెప్పగలం?

ఒక రచయిత మీద గానీ, రచయిత్రి మీద గానీ ఒక దురభిప్రాయం వున్నప్పుడు, వారేం రాసినా అయిష్టంగానే వుంటుంది ఒక సరైన కారణం అంటూ ఏమీ లేకుండా.

ఇప్పటి నామిని మాటలూ, అలవాట్లూ, గట్రా ఆయన రాసిన మంచి విషయాలని మార్చవు. ఆ విషయాల విలువ ఎప్పటికీ అలాగే వుంటుంది. అలాగే ఆయన రాసిన తప్పుడు విషయాల తప్పుడు విలువలు కూడా అలాగే వుంటాయి. ఎటొచ్చీ ఒక రచయిత గురించి, తన నిజ జీవితంలోని ప్రవర్తన గురించి, బాగా తెలిసినప్పుడు, ఆ ప్రభావం ఆ రచయిత పుస్తకాలు చదువుతున్నప్పుడు తప్పకుండా పాఠకుల మీద పడుతుంది, వాళ్ళు చదువుతూ ఆలోచిస్తే. చదువుతున్న విషయం చక్కగా వున్నప్పటికీ, రాసింది ఒక కపటత్వపు మనిషి అని తెలిస్తే, మనసుకి కష్టంగానే వుంటుంది. దీనర్థం రాసింది చక్కగా లేనట్టు కాదు.

ఇక అనానిమస్ గారు నామిని విషయం రంగానాయకమ్మ గారికి అనవసరం అని రాశారు (ఇంగ్లీషులో రాసిన అనానిమస్ గారు). "పాఠకులని క్షమించను" అని నామిని రాస్తే, దానికి బదులు ఇవ్వడం రంగానాయకమ్మగారి బిజినెస్ కాదా? ఎందుకూ? నామిని రచనలకి రంగానాయకమ్మగారు పాఠకురాలు కాదా? నా పుస్తకాలు అందరూ కొని తీరాలని నామిని తగువు పెట్టుకుంటే, అది ఎవరి బిజినెస్ కాదూ, జవాబు చెప్పడానికి? నామిని తన ఇంట్లో కూర్చుని లక్ష విషయాలు తనలో తాను అనుకుంటే, అది ఎవరి బిజినెస్సూ కాదు. శ్రీ శ్రీ చెప్పినట్టు, పబ్లిక్కులోకి వచ్చి అంటే, ఏమైనా అంటాం, ఏమైనా అడుగుతాం? అది రంగనాయకమ్మగారి బిజినెస్ కాదని అనానిమస్ అన్నప్పుడు, ఈ విషయం అనడం అనానిమస్ గారి బిజినెస్ ఎలా అయ్యిందీ? ఆలోచించకుండా, నోటికి వచ్చినట్టు అనేస్తే, అది చర్చ అవదు, తిట్టుకుని, కొట్టుకోవడం అవుతుంది.

రంబొండలపాటి గారికి ఒక్కటే జవాబు - అదేమంటే, రంగనాయకమ్మ గారి రచనలు చదివి తన ప్రశ్నలకి జవాబులు తెలుసుకోమని. ఏ రచయిత గురించి ప్రశ్నలున్నా, ఆ రచయిత రచనలు చదివి జవాబులు తెలుసుకోవడం తప్ప వేరే మార్గం లేదు మరి.

కొంతమంది అభిప్రాయాలు మరీ ప్రాధమిక స్థాయిలో వున్నాయి. వాటి గురించి ప్రస్తావించడం అనవసరం.

Anonymous said...

I totally agree with " Anonymous-10:59 AM, February 18, 2010" posting.janalu E pustakalu konalo vaddo kuda telchukOlenanta aGnanulani ankunE rachayitalakO namaskaram.
Katti Mahesh garu, Ranganayakamma garidi ukrosham ani endukanipinchindi meeku ?

సుజాత వేల్పూరి said...

వేణు గారి తర్వాతి వ్యాఖ్య రాసిన anonymas గారూ,ఇంత వివరంగా వ్యాఖ్య రాసిన మీరు "ఎవరో" నేను ఊహించగలుగుతున్నాను.

నాకు సంధించిన ప్రశ్నకు నేను జవాబు రాయగలను గానీ తమ ఐడెంటిటీని చెప్పుకోడానికి ఇష్టపడని వారికి ఇతరులను ప్రశ్నించే హక్కు ఉంటుందని నేననుకోను.అందువల్ల మీకు జవాబు రాదు.(అసలు బ్లాగు రచయిత కల్పన గారికంటే ముందు మీరే అందరి వ్యాఖ్యలకూ జవాబు రాశారే! మంచిదే అనుకోండి)

కాకపోతే రంగనాయకమ్మ గారు అడిగిన ప్రశ్నల్లో గొప్ప తర్కం ఉంది కాబట్టే నామినితో నాకు వ్యక్తిగత పరిచయం ఉన్నా, ఆయన రచనలంటే ఎంతో అభిమానం ఉన్నా (వ్యక్తిపూజకు నేను వ్యతిరేకం కాబట్టి)నిర్ద్వంద్వంగా వాటిని ఒప్పుకున్నాను.


మహేష్,
నేనూ అడుగుతున్నాను చెప్పండి! రంగనాయకమ్మ గారు ఉక్రోష పడాల్సిన అంశం ఇక్కడేముందో వివరించండి? తనకు సన్మానాలు, మెమెంటోలూ అందడం లేదనా? అలాటి వాటికి ఆమె ఆమడ దూరంలో ఉంటారని మీకు తెలీదని నేననుకోను.

ఆమె మాటల్లో దబాయింపు గానీ, ఉక్రోషం గానీ ఎక్కడా ఎంత వెదికినా నాకు కనపడలేదు. ఆమెకు ఉక్రోషం ఎందుకు రావాలో, ఈ వ్యాసంలో ఉక్రోషం ఎక్కడ ఎలా మీకు కనపడిందో దానికి కారణాలేమిటో మీరు చెప్పాల్సిందేనండీ!

Kalpana Rentala said...

సుజాత,
వ్యాసం రాయడం తేలిక. కామెంట్లకు సమాధానాలు చెప్పడం మాత్రం నిజంగా పెద్ద పని. ఒక్కోసారి బద్దకం కూడా వేస్తుంది. చాలా టైమ్ పడుతుందని అసలు టపాలు రాయకుండా వుందటం కన్నా కామెంట్లలోని విషయాన్ని గ్రహించి నీర క్షీర న్యాయం లాగా వుందటం బెట్టర్ అన్న నిర్ణయానికి వచ్చాను.
ఇక మొదట మీరు, నిషిగంధ అడిగిన నామిని తాగుడు అలవాటు గురించి. అది ఉమా ఇంటెర్వ్యూ లో నే వుంది. బహుశా మిస్ అయినట్లు వున్నారు. ఈ తాగుడు మీద ఒక టపా రాయాల్సినంత విషయం వుంది. ఒకప్పుడు పత్రికల్లో తాగుడు విషయం ప్రస్తావించినందుకు ఎంత పెద్ద వివాదం జరిగిందో నాకన్నా అఫ్సర్ బాగా రాయగలరు. అఫ్సర్ చాలా సంవత్సరాల క్రితం ‘ మో’ ని ఇంటర్వ్యూ చేసినప్పుడు అనుకుంటాను చాలా పెద్ద రచ్చ జరిగింది.
ఇప్పుడు నామిని ఇంటర్వ్యూ లో అది పెద్ద విషయం కాదు. పత్రికల్లో వస్తున్న అనేకానేక మార్పులకు ఇలాంటివి చిన్న చిన్న ఉదాహరణలు.
అది తప్ప, వొప్పా అన్నది కాదు నేను మాట్లాడుతోంది. అది అసలు పాఠకులకు అవసరమా, కాదా అన్నది .
ఇక ఈ అనానిమసులు ఎవరో మీరు వూహించారు. మరి నాకు కూడా చెప్పవచ్చు కదా.
రంగనాయకమ్మ గారి సమాధానం గురించి నేను పైన బ్రాకెట్లలో రాసేశాను నా అభిప్రాయం. సూటిగా, కొంచెం మెత్తగా, కొంచెం కరుకుగా వుంది అని. అది చాలు.
మహేశ్ అన్న మాటలకు అతనే సమాధానం చెపితే బాగుటుంది.
అబ్బా. కామెంట్ చాలా పెద్దదైపోయింది బాబు...
కొందముది అన్న మాట మాత్రం నాకు నచ్చేసింది. నేను షాపూ ఇస్తే రంగనాయకమ్మ గారు తలంటి పోసారని. థాంక్స్ కిరణ్ కుమార్ గారు.

సుజాత వేల్పూరి said...

కల్పనా
మీరు ఓపిగ్గా ప్రతి వ్యాఖ్యకూ జవాబు రాస్తుంటారు నాకు తెలిసి.మీరింకా దేనికీ ప్రతిస్పందించకముందే అనానిమస్ గారు ప్రతి వ్యాక్యనూ ప్రస్తావించి జవాబు రాస్తే కొంచెం ఆశ్చర్యం వేసింది.

మో గారి ఇంటర్వ్యూ విషయం ఏమిటో తెలుసుకోవాలని ఇప్పుడు మరీ ఉత్సుకత ఎక్కువైంది. ఆ టపా ఏదో మీరే రాయండి, అఫ్సర్ గారి సహాయంతో! దానిమీద ఎంత చర్చ జరుగుతుందో చూద్దాం!

Anonymous said...

సుజాత గారూ, కల్పన గారూ,

నిన్న ఒక పెద్ద కామెంటు పోస్టు చేసింది నేనే నండీ.

నా పేరు జె. యు. బి. వి. ప్రసాద్ అండి. నాకు జిమెయిలు అకౌంటు వున్నట్టు లేదు. ఎప్పుడో ఏదో పాత అకౌంటు వుంది అని అనుకుని, ఆ అకౌంటూ, పాసువర్డూ ప్రయత్నిస్తే, ఈ వెబ్ సైటు తీసుకోలేదు. నాలుగు సార్లు ప్రయత్నించాను. ఇక విసుగు పుట్టి, అనానిమస్ అన్నది సెలెక్టు చేసుకుని, క్లిక్కు చేస్తే వెంటనే వెళ్ళి పోయింది. అప్పుడు గమనించాను సంతకం చెయ్యలేదని. ఆ తర్వాత పనుల్లో పడి, ఆ విషయం అప్పటికి వదిలేశాను. ఇప్పుడే మీ కామెంట్లు చూసి, జరిగినది రాస్తున్నాను. ఇప్పటికీ ఈ బ్లాగుల్లో కామెంటు రాయడం చాలా కష్టమైన విషయం నాకు. నిన్న వేణు గారు ( వేణువు బ్లాగు రచయిత) ఈ చర్చ లింకు మెయిల్లో పంపారు. ఆయన్ని ఈ చర్చ ఆయన బ్లాగులో మొదలుపెట్టమనీ, నేను కూడా పాల్గొంటాననీ ఈమెయిల్లో అడిగితే, బదులుగా ఈ లింకు పంపారు. వేరే సైటుకి వెళ్ళి, అక్కడ టైపు చేసి, ఇక్కడ కొచ్చి పోస్టు చేసి, అన్నీ ముగించే సరికి, అంతా కంగాళీ కంగాళీగా తయారయింది. అదండీ సంగతి.

ఇప్పుడు కూడా అనానిమస్ అన్నదే సెలెక్టు చేసుకుని, పోస్టు చేస్తున్నానండి. నా పాత జిమెయిలు అకౌంటు పని చేస్తున్నట్టు లేదు.

నామినితో వ్యక్తిగత పరిచయం నాకూ వుందండీ. అవి వేరే సంగతులు. అది కాకుండా, నేను తాగుడు అనేది వ్యక్తిగత విషయం కాదనే విషయంలో మాత్రమే మిమ్మల్ని ప్రశ్నించాను. అంతేగానీ మీరు రంగనాయకమ్మగారి తర్కాన్ని వ్యతిరేకించారని నేననలేదండీ.

కల్పన గారన్నట్టు, నేను కూడా నామిని వ్యాసంపై ఏమన్నా నిరసన వ్యాఖ్యలు ప్రచురిస్తారేమోనని ఎదురు చూశాను. ఆఖరుగా ఈ వ్యాసం వచ్చింది.

- జె. యు. బి. వి. ప్రసాద్

Anonymous said...

నామిని గారి తాగుడు విషయం వ్యక్తిగత విషయం కాదు
===================================================================

ఇంకో విషయం మర్చిపోయాను ఇంతకు ముందు పోస్టులో. నామిని గారి తాగుడు అనే విషయం వ్యక్తిగతంగా తెలుసుకున్న విషయం కాదు. "తిమురుబట్టిన నామిని కత" అనే వివిధలో వచ్చిన వ్యాసంలో ఆర్ ఎం ఉమా మహేశ్వరరావు అనే ఆయన, నామిని గారిని ఇంటర్వ్యూ చేస్తూ రాసిన విషయం. అది పబ్లిక్ లోనే వుంది. కాబట్టీ కూడా అది వ్యక్తిగత విషయం కాదు.
వివరాలకి, http://www.andhrajyothy.com/editshow.asp?qry=/2009/dec/28vividha1 చూడండి.
ఇందులోని వాక్యాలు, "రాగి చెంబులో నీళ్ళు.. గాజు గ్లాసులో మందు.. రా అబ్బా అని లోపలకి పిలిచాడు."
కాబట్టి ఇది పబ్లిక్ లోకి వచ్చిన విషయమే. వ్యక్తిగతంగా తెలుసుకున్న విషయం కాదు.

రెండో విషయం - కత్తి మహేష్ గారు జవాబివ్వక ముందే, ఆయన అన్న "ఉక్రోషం" మాటకి చిన్న జవాబు. చాలా ఏళ్ళ క్రిందట రంగనాయకమ్మ గారు చెప్పటం వల్లనే మదనపల్లె లోని వేకప్ సంస్థ "పచ్చ నాకు సాక్షిగా" పుస్తకం అచ్చు వేసింది. సాహిత్యాభిమానులకి ఈ విషయం తెలుసు. అలాగే ఉదయం పత్రికలో "పచ్చ నాకు సాక్షిగా" కథలు వస్తున్నప్పుడు, ఒకసారి అవి ఆగిపోతే, రంగనాయకమ్మ గారు ఆ పత్రిక్కి ఉత్తరం రాశారు ఎందుకు ఆగిపోయాయీ అని. దానికి ఎ బి కె ప్రసాద్ గారు జవాబిచ్చి, తర్వాత కాలంలో కొన్నాళ్ళు మళ్ళీ వేసి, ఆపారు. ఈ విషయాలను బట్టి చూస్తే, "ఉక్రోషం" అన్న పదం ఎంత అర్థ రహితమైనదో అర్థం అవుతుంది. విషయాలు తెలుసుకోకుండా ఒకరి మీద అభాండాలు వేయడం ఎందుకూ?

ఆఖరుగా ఇంకో విషయం - ఎవరి బ్లాగులోనన్నా ఒకరు ఒక వ్యాఖ్యానం రాస్తే, అందులో విషయం ఏముందని చూస్తామా, లేక ఎవరు రాశారూ అని చూసి, దానికి రక రకాల అర్థాలు తీస్తామా? కామెంటులో ఏమున్నదన్నది ప్రధానం. ఎవరు రాశారన్నది ఎప్పుడూ సెకండరీ విషయమే. ఏదో పేరు వున్నా, రాసిన వారి గురించి అందరికీ ఏం తెలుస్తుంది, వారు ప్రసిద్ధి కెక్కిన మనుషులు అయితే తప్ప. విషయాన్ని, దాన్ని రాసిన తీరుని బట్టీ కాకుండా, రాసిన వారి పేరు తెలిస్తేనే జవాబు చెబుతాను అనేది అంత తర్క సహితమైన విషయం కాదు.

ఇవి తెలియజేద్దామని ఈ పోస్టు.

- జె. యు. బి. వి. ప్రసాద్

Kalpana Rentala said...

జె.యు.బి.వి. ప్రసాద్ గారు,
ఎలా వున్నారు? కొన్ని సంవత్సరాల క్రితం మనం ఫోన్ లో మాట్లాడుకున్నట్లు, మీ కథల గురించి చర్చీంచుకున్నట్లు గుర్తు. మీకు బ్లాగ్ వుందా>? వుంటే అడ్రెస్ ఇవ్వగలరు.
ఇక మీరు అనానిమస్ గా కామెంట్ పెట్టడం వల్ల ఏమీ ఇబ్బంది లేదు . ఎందుకంతే మీరు ఒక పాయింట్ తో, సూటిగా మాట్లాడారు. చాలా మంది అనానిమస్ పేర్లతో తిడుతూ వెధవ రాతలు రాస్తారు. వాటితో కాస్త ఇబ్బంది.
నా కామెంట్ బాక్స్ లో నా, మీ జీమేల్ ఆకౌంట్ తోనా ఇబ్బంది? నా దగ్గరే ఇబ్బంది అని మీరు చెప్పినా నేను పరిష్కరించలేను.ఎందుకంతే అందులో సాంకేతిక విషయాలు నాకు తెలియవు.
మీరు అడిగినవి సహేతుకమైన ప్రశ్నలు. చూద్దాము మహేశ్ గారి సమాధానం కోసం.
నామిని తాగుడు గురించి ఉమా ఇంటర్వ్యూ లో నే వుంది. అది నేను కూడా ప్రస్తావించాను.

Anonymous said...

కల్పన గారూ,
బాగున్నానండీ. నాకు ఎటువంటి భ్లాగూ లేదండి. సాధారణంగా నేను బ్లాగుల్లోకి వెళ్ళనండీ. నాకు సరైన జిమెయిలు అకౌంటు లేదనుకుంటాను. వేణూ గారు లింకు ఇస్తే, ఇక్కడ విషయాలు చదివాను.
మిగిలిన వారు స్పందిస్తేనే గానీ, విషయాలు తెలియవు.
ప్రసాద్

oremuna said...

రచయతల తాగుడు మొన్నగు అలవాట్ల గురించి ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఒక వ్యాసం వచ్చింది. ఎవరిదగ్గరన్నా లింకు ఉందా ? అది చదివితే కనీసం రచయతకు దగ్గరవారన్నా వారిని అర్థం చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. రచయతలకు కూడా తమ్ము తాము అర్థం చేసుకోవటానికి పనికి వస్తుంది అనుకోండి :)

Anonymous said...

శరత్ కాలమ్ గారికి 'వివాదం మూలస్వరూపాలు' తెలియకుండానే రంగనాయకమ్మగారి విమర్శ దబాయింపుగా అనిపించిందా?
విచిత్రంగా వుంది.
నిషిగంధగారూ, సుజాతగారూ - నామినిగారి తాగుడు విషయం ఆయన పబ్లిక్కుగా చెప్పుకున్నదే. అది తెలీకుండా 'ఆయన
వ్యక్తిగత అలవాట్ల జోలికి వెళ్ళకుండా వుండాల్సింది' అని అంటే ఎలా?
కత్తిగారూ, ఉక్రోషం అన్న పదానికి అర్థం తెలుసుకుని వాడితే బాగుంటుందేమో. మీ నిఘంటువులో అతిశయానికి
ఆక్రోశమూ, విమర్శకి ఉక్రోషమూ అని తప్పు పదాలున్నట్టున్నాయి.
రంబొండలపాటిగారూ - అట్లా జనరలైజ్ చెయ్యకుండా, రంగనాయకమ్మగారి విమర్శలో ఏవైనా తప్పులుంటే చెప్పగలరు.
భవానీప్రసాద్ గారికి రంగనాయకమ్మగారి విమర్శలోనే జవాబుంది. - భూషణ్, హోసూరు

Anonymous said...

ఫలాని పిసి గారితోనో, ఫలాని కేసి గారితోనో మీకు పరిచయం ఉంది. ఏవండి, మీరు అని పిలుచుకునే పరిచయం కాదు, ఏరా, ఏమే, నువ్వు అని పిలవగలిగే పరిచయం. ఆ పిసి గారు మీకు నచ్చని మాటలేవో మాట్లాడేడు, మీకింటరెస్ట్ వున్న విషయంమీద, మీది అని మీరనుకుంటున్న విషయం మీద. మీరు ఆయన్నో, ఆవెనో కలసినప్పుడో, లేకపోతే ఫోను ద్వారానో, ఉత్తరం ద్వారానో, ఈ-మైలు ద్వారానో ఒరే నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు, ఒసే నువ్వు మాట్లాడిన మాటలు బాగలేవు అనడం పద్దతి. కాదు, పిసి గారో, కేసీ గారో మాట్లాడిన మాటల్ని (వారితో మీరు స్వయంగా మాట్లాడగలిగే అవకాశం వున్నా కూడా) మీరు పత్రికా ముఖంగా ఖండించ దలచుకున్నారు. సర్వ తెలుగు ప్రజలకందరికీ మీ దృష్టిలో వారి తప్పుని తెలియజేయదలచుకున్నారు. అప్పుడు మీరు రాసే విమర్సలో, ఫలాని పీసీ గారు, ఫలాని కేసీ గారు అనే వ్రాస్తారు గానీ, నువ్వు, అది, వాడు అని మాట్లాడరు. మనుషలతో మనకున్న సాన్నిహిత్యంతో సంబంధం లేకుండా, పబ్లీకున మాట్లాడేప్పుడు ఒక మర్యాద అని ఏడ్చింది లోకంలో. అంత గొప్ప రంగనాయకమ్మ గారికి ఆ మర్యాద తెలీదనుకోవాలా? రచయిత, కవి ఎలా బ్రతకాలో, ఏవిధవైన విలువల్ని పాటించాలో అంత చులాగ్గా ముఫ్ఫై రెండు, అరవై నాలుగు సలహాలిచ్చిన అంత గొప్ప రచయిత్రికి ఆ కనీస మర్యాదలుకూడా తెలీవనుకోవాలా? హఠాత్తుగా మీరు ఇవాళ సాహిత్య స్వాములుగా, పాస్టరులుగా మారిపోయి మీరు చెప్పిన నీతులన్నీ నామిని గారి కోసవేనా, మీరు కనీస మర్యాదలు పాటించనవసరం లేదా?

"నువ్వు అందరి కన్నా గొప్పవాడవే అయితే, ఆ మాట నీ గురించి ఇతరులు చెప్పుకోవాలి, నిన్ను నువ్వే వర్ణించుకోవడం కాదు." అమ్మా రంగనాయకమ్మ, మీరు కూర్చున్న ఆ ఎత్తైన సింహాసనం మీదనుంచి మీకు మరెవరూ మీకు సమానంగా కనపడరేవో, కొంచం, మీరు పెట్టుకున్న నేనే గొప్ప కళ్ళద్దాల్ని తీసి చూడండి, నామిని గారు తెలుగు సాహిత్యంలో తీసుకొచ్చిన విప్లవం మీకు కనపడుతుంది (మీకిదివరకు కనపడింది కూడాను). మెల్ల చూపులు చూస్తా, రబ్బరు చెప్పులేసుకుని ఎగరేసుకుని, ఎగరేసుకుని నడిచే ఆయనకి సన్మానం జరిగిందంటేనే (పది లక్షలివ్వటంలో ఉద్దేశం ఏదైనా) ఆయన గొప్ప రచయిత కాబట్టే, ఆ విషయాన్ని, ఇప్పుడు ఆయన్ని గోర్కీతో పోల్చడం ద్వారా మీరుకూడా మరోసారి ఒప్పుకున్నారు.

అయినా నాకు తెలవక మందలకోసం అడుగుతున్నా రంగనాయకమ్మ గారు, నామిని గార్ని గోర్కీతో పోల్చేరు, గోర్కీలా నామిని గారుండలేదని ఆయన్ని నానా మాటలన్నారు. మంచికో చెడుకో అనెయ్యటం అనేసేరు, అదొక పెద్ద పని కాదు కాబట్టి. మీరు గోర్కీ అమ్మలో అమ్మలాగున్నారా? మళ్ళా చూస్తే మీరు బంజారా హిల్స్ లోనో, జూబ్లీ హిల్స్ లోనో కడుపులో చల్ల కదలకుండా, నాయనా ఈ రోజు ఎసట్లోకి గుప్పెడు బియ్యం ఎట్టరా భగవంతుడా అనే సమస్యలేవీ లేకుండా, రేపు నాకు జబ్బొస్తే, నేనే ప్రభుత్వాసుపత్రికి బలైపోతానో అనే భయవేవీ లేకుండా చక్కగా కూర్చోని మీరు చెప్పే రాజకీయాలన్నీ మళ్ళా ఆ ఎసుట్లోకి బియ్యం కోసం నానా పాట్లు పడేవాళ్ళకోసవేనయ్యే.

రంగనాయకమ్మ గారు, మీరు చెప్పినట్టే నామిని గారికి సన్మానం ఆయన విద్వత్తుకే చేసేరు. కానీ సన్మానవంటే, ఏ శాలువా కప్పటవో, ఏ గ్నాపికనియ్యదవో, లేకపోతే వాటిల్తోపాటు ఏపదో, పాతికో వేలు ఇయ్యడవే వుందిగాని. పది లక్షలు ఇవ్వడం వుందా? దాంట్లో ఏవిటి అర్థం, నాయనా నామిని, నువ్వు గొప్ప రచయితవే, అందుకే ఈ సన్మానం, కానయితే రచయితగా నువ్వు గొప్పోడివేగాని, అర్జనలో నువ్వొక పోరంబోకోడివి అందుకని, సన్మానం తో నీ విద్వత్తుని గుర్తించడవే కాదు, ఆవరకే అయితే నువ్వొప్పుకోవు, అందుకని ఇదిగో ఈ పదిలక్షల చెక్కు నీ కిస్తాం, ఇంత ఆజానుబాహువైన చెక్కుని అర్జనలో మొరగుజ్జువైన నువ్వెలాగు కాదనలేవులే అనిచెప్పడవే కాదా. అందులో ఆయన బీదతనాన్ని ఎత్తి చూపడవే కాదా. అందుకాయిన కూడా తప్పుపట్టలేదు, కాకపోతే అంత పెద్ద చెక్కుముందు, ఆయన్ని మొరగుజ్జుగా నిలబెట్టిన పాఠకులమీద ఆయన నిష్టూరపొయ్యాడు. అంత నిస్టూరపోకపోతే ఒద్దని చెప్పొచ్చుగా అని మీరంటారేవో రంగనాయకమ్మ గారు. అనగలరు కూడా, గోర్కీనో, మరొకర్నో తోడు తెచ్చుకోగలరు. ఎందుకంటే పది లక్షలు మీకొక లెక్క కాదు కదా. అయినా గాని రంగనాయకమ్మ గారు, గోర్కీనే మీకు కనిపించాడు గాని, జీవితంలో ఒక ఉద్యోగవన్నది ఎప్పుడూ చెయ్యని, ఒక సంపాదనంటూ ఎప్పుడూ లేని కారల్ మార్క్స్ గారు మీకు కనపళ్ళేదా. మళ్ళా మీ రచనలనిండా ఆయనే కదా. ఒక కేపిటలిస్టు, ఒక కర్మాగారపు యజమాని ఏంగెల్సు, మార్కు గారికి ఆర్ధికంగానూ, రాజకీయంగానూ, మేధోపరంగానూ దన్నియ్యకపోతే ఆయన పరిస్తితి ఏవయ్యుండేది. ఆయన్ని మీరు, ఏవయ్యా మార్క్సు నువ్వెంత బీదోడివైనా, ఆ కర్మాగారపు యజమాని ఏంగెల్సుతో చేరతావా అనరు కదా. అనరు ఎందుకంటే ఆయన మీరు రాయి విసిరినా, మీరెంత సింహాసనం మీద అందరికన్నా ఎత్తులో కూర్చోనున్నా, ఆ ఎత్తునించి కూడా మీ విసురికి అందనంత ఎత్తులో వున్నారు. అదితెలియని అమాయకులేంకాదు మీరు.

Anonymous said...

తరువాయి భాగం


మార్క్సులు, గోర్కీలు, లెనిన్లు, టాలస్టాయిలు, కాప్కాలు, జాక్ లండన్లు, మార్క్ ట్వేన్ లు, నెరూడాలు, మాయా ఏంజేలోలు, చే గువేరాలు, భగత్ సింగులు, పిఎస్లు, పుల్లా రెడ్లు, గురజాడలు, శ్రీశ్రీలు, కేవీఅర్లు, రావీ శాస్త్రులు, నామిని సుబ్రమణ్యం నాయుళ్ళు, రంగనాయకమ్మలు మొదలైన వారికి ఏవైనా వ్యక్తిగత బలహీనతలు వుంటే మాకెందుకు, వాటితో మాలాటి సామాన్య మానవులకి, సామాన్య పాఠకులకి అనవసరం. అయినా ఎంతెత్తున సింహాసనం మీద కూర్చున్నా తరచి చూస్తే ఆ సింహాసనం క్రింద జనాలకి నచ్చని, జనాలు ఒప్పని విషయాలెన్నో అందరికీ వుంటాయి కదా. వుండవా రంగనాయకమ్మ గారు?

Anonymous said...

తరువాయి భాగం


ఇక్కడ నామిని గారి గొప్పతనవేవిటంటే, అయ్యా, నాయన్లారా మీరు నాకేదో పాతిక వేలిచ్చి సన్మానవంటే, అహె పో నాకు మీసన్మానవొద్దు, పాడూ వద్దు అనుండేవాడ్ని, కానీ మీరు సన్మానం పేరుతో పది లక్షలు నాకు దానవిస్తా వుండారు, నేను ఆ పది లక్షలని కాదనలేను. అయితే నేను ఆ లక్షలని తీసుకుంటుండా కాబట్టి, మీకు నేను సాష్టాంగ నమస్కారాలేవీ చెయ్యను. మీకు కష్టవేసినా సరే నేను నిజవే చెప్తా. మీరు నన్నీరోజు ఇక్కడ మొరగుజ్జులాగా నిలబెట్టేరు ఈ ఆజానుబాహువైన చెక్కు ముందు. నా అవసరం నాది, నేను మొరగుజ్జునే అందుకే తీసుకుంటుండా ఈ భిక్ష. కానీ మీరు ఈ రకంగా కాకుండా, నా పుస్తకాలు మీరు కొనుక్కునుంటే, అసలు పుస్తకాలు కొనుక్కోటం, వాటిని చదవటం కూడా అవసరవని మీరు పిల్లకాయలకి నేర్పించుంటే నాకే నలభయ్యో, ఎనభయ్యో వేలొచ్చేవి, తక్కువే, కానీ అయ్యి, నాకు బిక్షగా వచ్చేయి కాదు. అంతే కాదు ఆ రకవైన విధానం పిల్లలకి సాహిత్యం పట్లా, బతుకుని, అనుభవించి, పలవరించి, దాంట్లో లోతుల్నీ, ఎత్తుల్నీ చూసి వ్రాసిన ప్రజా రచయితల సాహిత్యం పట్లా కుతూహలాన్ని, ఆశక్తిని, అందుమీద ఒక మహత్తరవైన జీవితానిభవాన్ని ఇచ్చుండేది. దాన్నొదిలేసి, మీరు నాకీ పది లక్షలని భిక్షగా ఇస్తుంన్నందుకు మిమ్మల్ని నేను తప్పు పడుతున్నాను, మిమ్మల్ని క్షమించలేక పోతున్నాను అని నామిన గారు చెప్పిన మాటలు కళ్లకద్దుకోవాల్సిన మాటలు గావా.



అయితే రచన అనేది ఒక కళ, వృత్తి కాదు అని, అని ఆ వృత్తి ద్వారానే సింహాసనవెక్కిన మీరు ఇప్పుడు ప్రవచిస్తున్నారు. పాపం వృత్తి కళా కారులందరిని, మీలాగే సింహాసనాల మీద కూర్చున్న వాళ్ళని, పాపం కడుపు కోసం నానా పాట్లు పడే వృత్తి కళా కారుల్ని (మీ రాజకీయాల్లో వీళ్ళు చాలా మందే వున్నారు, అయినా మీకు పోయేదేవుంది, మీ కడుపు నిండుగానే వుంది కదా, మీ ఇల్లు పచ్చగానే వుంది కదా, మీకు ప్రభుత్వాసుపత్రి భయం లేదు కదా) అందర్నీ ఒకే గాటన కట్టి, పాపం సముద్రంలోకి విసిరేస్తున్నారు. ఇక మీరు చెప్పిన తర్వాత వాళ్ళు ఆ కళ మీదే బతకాలని అనుకుంటే వాళ్ళ ఖర్మ.


పాపం, మీకుతెలీదేవో గానీ, తెలీకుండా ఎందుకుంటదిలే. మేవు మీ పుస్తకాలు మొదట మా ఊర్లలో గ్రంధాలయాల్లోనే చదువుకునే వాళ్ళం. ఆ గ్రంధాలయాలకి మీ పుస్తకాలమ్మడానికి, మీరు కాదేవో, కానీ మీ పబ్లిషరు ఏఏ రాజకీయ కనక్షన్లని ఉపయోగించుకున్నాడో, ఎందరి ప్రభుత్వాధికారుల్ని మచ్చిక చేసుకున్నాడో, మీరు చెయ్యకపోయినా, మీరీరోజు అంతెత్తున సింహాసనంమీద కూర్చోని నీతులు ప్రవచిస్తున్నా, నిజం తెలియని అమాయకులు కాదుకదా మీరు. మీరివాళ మోరల్ పోలీసుగా మారి, నామిని గారి ప్రవేటు జీవితాన్నిబజారుకీడుస్తున్నారు. విచిత్రవేవిటంటే మీరు కూడా ఈ మోరల్ పోలీసులు జనాల వ్యక్తిగత జీవితాలతో చేసే నానా ఖంగాళీనీ ఎదుర్కున్నవాళ్లే ఒకప్పుడు.


ఆఖరగా, నామిని గారి పుస్తకాల్లో చీదరని మీరివాళ చూడగలిగేరు. మాండలికం ముసుగులో ఎంతెంత చీదరకైనా రక్షణ దొరుకుతుకుతుందని చెప్పగలిగేరు మీరు. నామిని పుస్తకాల్లో ప్రత్యేకంగా చీదర ఎక్కడ కపడ్డదో మీకు. నాకు మాత్రం బతుకు కనబడ్డది. అది చీదర బతుకైనా సరే, బతుకే కనపడ్డది. అది మాండలీకం ముసుగులో నామిని గారు పాఠకుల రంజు కోసం ప్రత్యేకంగా సృష్టించిన చీదర కాదండీ, మహా రచయిత్రి రంగనాయకమ్మ గారు. నా అనుమానవేవిటంటే ఈ విమర్శ వ్రాసింది రంగనాయకమ్మ గారేనా. రచయిత్రి రంగనాయకమ్మగారేనా అని. ఆవిడ ఇంత దిగజారుడుగా, ఇంత లేకిగా, ఇంత అసహ్యంగా, అసలేమాత్రం లాజిక్కే లేని, తిట్ల పురాణాన్ని వ్రాయగలగరా అని.

ఇదిలా వ్రాసుకుంటూ పోతుంటే వస్తానే వుంటది. ఎందుకంటే ఇది అమెరికాలోనో, హైదరాబాదులోనో పెద్ద, పెద్ద బడుల్లో కులుక్కుంటా తిరిగే ఏ సాహిత్య పేరసైట్లో ఈ విమర్శ చేసుంటే అసల పట్టింపే లేకపోను. కానీ ఈ విమర్శ చేసింది రంగనాయకమ్మ గారు. నెత్తిమీద పెట్టుకుని ఊరేగతావుండే మీయమ్మే వున్నట్టుండి సినిమాల్లో సూర్యకాంతవైపోతే మీకు కడుపు మండిపోదా.

Anonymous said...

తరువాయి భాగం
ప్రసాదు గారు, మరియూ త్రాగుడు గురించి రెంటాల గారి బ్లాగులో చాలా బైట్లని త్రాగేసిన వారికందరికీ కూడా. మీరెవరూ ఎప్పుడూ, ఒక్క సారి కూడా రాగిచెంబుతో నీళ్ళు, గాజు గ్లాసులో మందు అంటే కష్టం కాని, గాజు గ్లాసులో మందుని చప్పరించలేదా. ఒక వేళ చప్పరించకపొయ్యుంటే మీ దురదృష్టం. కానీ అందువలననే మీకు మా పైన ఒక గొప్ప మోరల్ ఎలివేషనేవీ రాదు, దానికంత సీనూ లేదు.


నేను నా స్నేహితుడి బ్రతుకుని నలుగురుకి తెలియజెయ్యదలచుకుంటే, లేకపోతే ఆ స్నేహితుడే నా బ్రతుకుని రెంటాల గారి బ్లాగులో పెట్టదలచుకుంటే ఎవరూ ఏవీ చెయ్యలేం. కానీ అది సభ్యత కాదని మీకూ, నాకూ, ప్రసాదు గారికి కూడా తెలుసు. నామిని గారితో నాక్కూడా పరిచయం వుంది. ఆ పరిచయంలోనో, స్నేహంలోనో మీకుతెలిసిన ఎప్పుడో అప్పుడప్పుడూ మీరు ఆ వ్యక్తిలో చూసిన విన్న విషయాల్ని మీరు పత్రికా ముఖంగా చర్చించదలచుకుంటే, ఆ పరిచయానికి, స్నేహానికి అర్థవే లేదు. అలాటి చర్చ, అలాటి చర్య అతి నీతి బాహ్య విషయంగా నాకనిపిస్తుంది. ప్రసాదు గారు దానినే సమర్ధిస్తున్నారు. అసలు వ్యక్తితో సంభందంలేని రచనలని, వ్యక్తిగతంగా విమర్సిస్తున్నారు. ఏ సౌదీ అరేబియాలోనో, ఇరాన్ లో లాగానో మోరల్ పోలీసింగ్ చేస్తున్నారు. వారి విలువల్ని పాటించని మనుషుల్ని ఖండ ఖండాలుగా శారీరకంగా కాకపోయినా, మానసికంగా నరికేస్తున్నారు.

ప్రసాదు గారినో, రెంటాల గారినో మరొకర్నో అండవెందుకు, నా గురించి, నాకున్న బలహీనతల గురించి, నా పెళ్ళావో, నా స్నేహితుడో బజారుకెక్క దలచుకుంటే, ఆవగింజంత దాన్నీ, గుమ్మడికాయంత చెయ్య దలచుకుంటే, అసలు నా వ్యక్తిత్వంతోనూ, నా ప్రొఫషన్తోనూ, నా మంచి చెడులతోనూ సంబంధం లేకుండా వారా విషయాల్ని బహిరంగ పరచదలచుకుంటే ఎవరుమాత్రం గొప్పగా కనిపిస్తారు. నేను కనిపిస్తానా, మీరు కనిపిస్తారా, ప్రసాదు గారు కనిపిస్తారా, రంగనాయకమ్మ గారు కనిపిస్తారా. సంఘం నచ్చని, మెచ్చని విషయాలేవీ మన బతుకుల్లో లేవా, నా వెనకా, ప్రసాదు గారి వెనకా, రంగనాయకమ్మ గారి వెనక ఏ మచ్చలూ లేవా? ఏవి మనవేవి మనుషులవు కావా? దేవతలక్కూడా ఒళ్ళంతా ఉండాయే మచ్చలు.

శ్రీశ్రీ అన్నట్టు, ఎవరి ప్రవేటు జీవితాలు వాళ్ళవే, కానీ పబ్లిలోకొస్తే ఏవైనా అంటాం. కానీ వారి పబ్లికు జీవితాల గురించే, మనతో సంబంధంలేని వారి ప్రవేటు బతుకుల గురించి కాదు. అలా కాదని వారి ప్రవేటు బతుకుల్ని వీధికీడ్చదలచుకుంటే (రంగనాయకమ్మ గారి లాగా), ఆ ఈడ్చేవారి జీవితం కూడా వీధిలో జనాలకి మహా రంజుగా కనపడుతుందని నా మనవి.


నాయనా నేను తెలుగు సాహిత్యానికి ఒక గొప్ప ఒరవడినిచ్చిన రచయితనైనా, నేను పేదోడిగానే మిగిలిపోయినా, నేనేవీ ఎవ్వరిదగ్గర నా చేయిజాచిందిలే ఏ రోజూ. ఈ రోజు మీరు నాకు నేకాదనలేని భిక్ష నాకేస్తావని వచ్చారు, మీ భిక్ష నేతీసుకుంటుండా, అంతమాత్రం చేత నేను మీకు సలావులేవీ చెప్పను. మీరు నాకీ భిక్షకి బదులు, నలుగురు పిలకాయలకి నాలుగు పుస్తకాలు చదివే అలవాటు చేసుంటే, నాకు నాలుగు డబ్బులే వచ్చుండేయి, కానీ ఆ నాలుగు డబ్బులూ నన్ను మీముందు, మీ చెక్కుముందు మొరగుజ్జులాగా, తింగిరి తింగిరిగా నిలబెట్టుండవు అనే ఆ మాహా ఋషి, ఆ మహా మనీషి చెప్పింది. సింహాసనం మీద కూర్చోని చూసేవాళ్ళకు ఆ నాలుగు మాటలు నిజంగా ఎక్కడో తగిలిండొచ్చు, అంత మాత్రంచేత వాళ్ళు భుజాలు అంతగా తడువుకోవాల్సిన పనేం లేదు.



రవికిరణ్ తిమ్మిరెడ్డి.

Anonymous said...

రవికిరణ్ గారి దీర్ఘ వ్యాఖ్యలో ప్రస్తావించి జవాబు చెప్పడానికి ఏమీ లేదు.
నా గురించి నేను మాత్రం చెప్పుకోవాలి.
రవికిరణ్ గారు, "ప్రసాదు గారు, మరియూ త్రాగుడు గురించి రెంటాల గారి బ్లాగులో చాలా బైట్లని త్రాగేసిన వారికందరికీ కూడా. మీరెవరూ ఎప్పుడూ, ఒక్క సారి కూడా రాగిచెంబుతో నీళ్ళు, గాజు గ్లాసులో మందు అంటే కష్టం కాని, గాజు గ్లాసులో మందుని చప్పరించలేదా. ఒక వేళ చప్పరించకపొయ్యుంటే మీ దురదృష్టం. కానీ అందువలననే మీకు మా పైన ఒక గొప్ప మోరల్ ఎలివేషనేవీ రాదు, దానికంత సీనూ లేదు." అని రాశారు.

పేకాడ్డం, సిగరెట్లు తాగడం, మందు తాగడం లాంటి చెత్త అలవాట్లు నాకు లేవు. ఒక విషయంలో రవికిరణ్ చెప్పింది కరెక్టు. ఈ చెత్త అలవాట్లు లేకపోవడం వల్ల ఎటువంటి మోరల్ ఎలివేషనూ వుండదు. అయితే అటువంటి చెత్త అలవాట్లు వుంటే, నైతిక దిగజారుడు (మోరల్ డిమోషన్) మాత్రం వుంటుంది. ఒక మనిషి సరిగా వుండడం అనేది చాలా మామూలు విషయం. అందులో గొప్ప ఏమీ వుండదు. వుండకపోతే మాత్రం డిమోషన్ వుంటుంది.

- జె. యు. బి. వి. ప్రసాద్

Anonymous said...

ప్రసాదు గారు,


మీ జవాబుతో నాకేవవసరం. నా మనసుకి తోచిందేదో నేను వ్రాశాను. ఇక త్రాగుడు మొదలైన చెత్తలవాట్లు మీకు లేవని మీరు వ్రాశారు. మంచిది. ఐతే ఆ అలవాట్లు లేనందువలన మీకేవీ నైతిక ఎలివేషన్ ఉండదని వ్రశారు. మా బాగుంది. కానీ ఆ అలవాట్లున్న మాకు నైతిక దిగజారుడు తనం ఉంటుందని కూడా శలవిచ్చారు. తమని తాము మీ సొంత మాటల్తోనే పైకెగదోసుకున్నారు. మంచిది మీరు ఆ పైమెట్టుమీదున్నాననే భ్రమలోనే ఉండండి, నిజవిని కూడా నమ్మండి. మాకేవభ్యంతరం లేదు. కానీ చెప్పేటందుకే ఉన్నాయని నీతులు మాత్రం మాకు చెప్పకండి. మీక్కావాలసిన వాళ్ళకి చక్కగా చెప్పుకోండి, కానీ మాకు చెప్పకండి. తాగుడు నైతిక దిగజారుడుతనానికి లక్షణవని, మీరు ప్రపంచంలో నూటికి తొంభైతొమ్మిదిమందిని నేరస్తులను చేయకండి. మీరివాళ ఉంటూ, అన్నంతింటున్న ఈ దేశంలో త్రాగుడు ఆ సంస్కృతిలో లక్షణవని, ఆ తల్లికి నైతిక దిగజార్చుడు అంతగట్టటం పాలు త్రాగిన రొమ్మునే గుద్దడవనీ తెలుసుకోండి.

మీ మంచి చెడుల్తో, మీతో మాకవసరం లేదు ప్రసాదు గారు. మీరు నలుగురి కోసం వ్రాసిన వ్రాతల్తోనే మాకవసరం. మా విమర్శలు ఒకవేళుంటే వాటిమీదనే తప్ప మడి గుడ్డల వెనకాల వున్న నీతిమంతుల గురించి కాదు.

రవికిరణ్ తిమ్మిరెడ్డి.

Anonymous said...

మార్క్సు గారి మీదకు ఆవిడ గారు రాయెయ్యదని వ్రాశాను. అది నా పొరపాటే. నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది ఆవిడ గారు ఇంతకుముందు కారల్ మార్క్సు గారి గడ్డవు ఎంత బూర్జువా లక్షణవో అనే దానిమీద ఒక వ్యాసం వ్రాసున్నారు శ్రీ రంగనాయకమ్మ గారు. కాబట్టి రాయి వెయ్యటవనే ప్రయత్నవైతే చేసేరు మార్క్సు గారి పైన కూడా. అది నాకు సమయానికి గుర్తుకురాకపోవటం బహుశా నా సిగరెట్లు, త్రాగుడు మొదలైన అలవాట్ల మూలానేవో అయ్యుండొచ్చు. కానీ అలాటి విమర్శ వ్రాయడానికి వీటన్నిటీనీ మించి మరింకెన్ని, మరింకెంత గీర్వాణం ఉండాలో మీకెవరికైనా తెలిస్తే, మీకు గడ్డం లేకపోతే చెప్పండి. మీరు త్రాగుడు, సిగరేట్లు మొదలైన అలవాట్లు లేకుండా, లేకపోతే ఏ ముమయిథ్ ఖాన్నో, మరో చొక్కా ఇప్పిన ఖాన్నో చూసి ఒక క్షణం మనసు పారేసుకోకుండా మడిగట్టుకునుంటే, దాన్ని మీ మనసులో మీరు నిజంగా నిజవని నమ్ముంటే చెప్పండి.
రవికిరణ్ తిమ్మిరెడ్డి.

ఆ.సౌమ్య said...

బాగా చీవాట్లు పెట్టారు రంగనాయకమ్మగారు,
నామిని వ్యాసం చదివినప్పుడు నాకూ కాస్త చిరాకనిపించింది. సొంతడబ్బా పదే పదే కొట్టుకున్నట్టు అనిపించింది. పచ్చనాకు సాక్షిగా చదివి నా మనసు కకావికలమయిపోయింది. నామిని మీద గౌరవం ఎంతో పెరిగింది. ఆయన గొప్ప రచయితే కాదనట్లేదు, కానీ ఈ డబ్బా మాత్రం పనికిరాదు, ఆయనే కాదు ఎవరికైనా

"మంచి రసాలు ఊరే నీ పుస్తకాల వల్ల నువ్వెంత నేర్చుకున్నట్టు?ఆ రసాలన్నీ మా కోసమేనా? నీ కోసం కాదా? పుస్తకాలు నీకు తాగుడు ఎలా నేర్పాయి?"....బాగా అడిగారు.

నాకు స్వీట్ హోం లో చెల్లెలిని మందలించే అక్క కనిపిస్తొంది ఈ వ్యాసంలో

Anonymous said...

రవికిరణ్, నీకు నోరు బలిసినంత మెదడు బలవలేదోయ్ !

Anonymous said...

కల్పన గారు, ఈ పొడిగింపు అనవసరం అనుకుంటే ప్రచురించకండి. మీ బ్లాగులో నా వ్రాత మీకేవైనా కష్టం కలిగించుంటే నా క్షమాపనలు.

కిరణ్

ఆకాశరామన్న గారు,

మీరు నాలుగు మాటలే అన్నా, మీరన్న మొదటి రెండు మాటల్లో కొంచం నిజవుంది, తర్వాతి రెండు మాటలు పూర్తిగా అబద్దం కాదు. కానీ ఏం చెయ్యమంటారు, మీలాటి వాళ్ళు ముందుకొచ్చి నాలుగు మాటలు వ్రాయకపోతే, ఇక నాలాటి వాళ్ళే వ్రాయాల కదా.

ఏదో ఒక విమర్సో, ఒక వ్యాసవో వస్తే, దానికి బొమ్మా, బొరుసు రెండు రకాల కోణాలు వుంటాయి. ఆ ప్రచురణ ఎందుకు నచ్చిందో, ఎందుకు నచ్చలేదో కొంచం వివరంగా, లాజికల్ గా, వ్యక్తిగత వివరాల జోలికి పోకుండా అభిప్రాయాలు వ్రాస్తే మాలాటి వాళ్ళు వాటినించి కొద్దో, గొప్పో నేర్చుకోగలం. కల్పన గారు నామిని ఇంటర్వ్యూ, ఉపన్యాసం మీద అలాటి అభిప్రాయవే వ్రాశారు. వివరంగా వ్రాశారు, వారి లాజిక్ అందరికీ నచ్చాలని లేదు. కానీ ఆకాశరామన్న గారు, అలాటి వివరవైన అభిప్రాయాలు ఒక పార్శాన్నే చూపే విధంగా వస్తున్నాయి. నూటికి తొంభై మంది ఒక పార్శాన్నే చూసినా, మిగిలిన పదిమంది రెండో కోణం చూస్తారు కదా వారిలో కొందరైనా అంతే వివరంగా అపోసింగ్ ఒపీనియన్ వ్రాయాలి కదా. అది మృగ్యమైపోయింది అంతర్జాలంలో. ఇంతకు ముందు గురజాడ గారి మీద, శ్రీశ్రీ గారి మీద, నామిని గారి మీద (ఇవి ఒదాహరణలు మాత్రవే) అంతర్జాల పత్రికలలో ఏవగింపు కలిగించేలా వచ్చిన వ్యాసాల మీద అభిప్రాయాలే కరువైపోయ్యాయి. నేను ఓపిగ్గానే చూశాను, నా వానా కాలపు వ్రాతలు వ్రాయకుండా, ఈ దేశంలో, భారద్దేశంలో ఈ అంతర్జాల పత్రికల్ని చూసే ఇంతమందిలో కూడా ఎవరికీ ఈ అన్యాయపు వ్రాతలు అన్యాపు వ్రాతలుగా కనపడలేదా అని. ఒక పదం మీదో, నిర్మాణం మీదో, కవితలో ఒక లైను మీదో ఫుంకాలు ఫుంకాలుగా వ్యాఖ్యలు వ్రాసే ఇంత మంది తెలుగు మహా జనులల్లో కొందరికైనా గురజాడని వీధికీడ్చడం కనపళ్లేదా, శ్రీశ్రీని వ్యక్తిని, కవిత్వాన్ని కూడా నాశనం చెయ్యడం కనపళ్ళేదా అని. దురదృష్టం కొద్దీ కనపళ్ళేదో, కనపడిన వారు మీలాగే ముసుగుల క్రింద, నాలుగు పదాలతోనే సరిపెట్టుకున్నారో, మళ్ళా అక్కడా కూడా నాలాటి నోరే పెగలాల్సొచ్చింది.


రంగనాయకమ్మ గారు గొప్పవారే, సందేహం లేదు, కొంచవైన సందేహం లేదు. అందులోనూ నాకెంతో ఇష్టవైన రచయిత్రి కూడానూ. కానీ కల్పన గారి విమర్శని, రంగనాయకమ్మ గారి విమర్శని పరికించి చూడండి. కల్పన గారి అభిప్రాయంలో విమర్శ కనిపిస్తుంది, ఆ విమర్శ నచ్చినా నచ్చకపోయిన. అదే రంగనాయకమ్మ అభిప్రాయం చూడండి. అందులో ఒక లాజికల్ విమర్శ కనిపిస్తుందా. అబాండాలు, అభియోగాలు, వీధికీడ్చడాలు తప్పితే. ఆఖరికి నామిని గారు మాండలీకం ముసుగులో చీదర గొలిపేలా వ్రాశారని కూడా చెప్పేరు, ఆ చీదర ఏవిటో, ఎక్కడో మాత్రం చెప్పకుండా. ఇదొక్కటే కాదు, ఒకటిన్నరెకరం రైతులు, వేద మంత్రాలు, తిరుమల కొడ ప్రభువులు, విచిత్రవైన విషయం ఏవిటంటే, రంగనాకమ్మ గారు కుల సంఘాలని ఇండైరెక్టు గానే కానీయండి సమర్ధించడం. ఈరకంగా ఇది కూడ సుధీర్గంగా సాగిపోగలదు, అందుకని ఇంకొక్క మాట చెప్పి ఆపేస్తా.


మీలాటి నాలుగూ తెలిసిన వాళ్ళు, ముసుగులు తీసేసి, పోనీయండి ముసుగులున్నా ఫరవాలేదు. పేరులో ఏవుంది, ఆకాశరామన్న పేరు బాగనే వుంది, బయటకు రాండి. మీలో విభేదించే కోణాల్ని చూడగలిగిన వాళ్ళు, ఆ చూసిందాన్ని విపులంగా, సౌమ్యంగా చెప్పగలిగిన వారు కొందరన్నా ఉండే వుంటారు. అప్పుడు నాలాటి వానా కాలం చదువుల వాళ్ళు కడుపు మండి నోరు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అదేం పెద్ద కష్టం కాదు. ఈ సారి ఆరు పదాల్లో వ్రాశారు, ఒచ్చే సారి పన్నెండు పదాల్లో వ్రాయండి (మనుషుల గుణగణాల గురించి కాకుండా), ఆ తర్వాత ఇరవై నాలుగు, నలభై ఎనిమిది. ఈ లోపల మీ బుర్ర బలుస్తుంది. నాలాటి వాళ్ళ నోరూ తగ్గుతుంది.

రవికిరణ్ తిమ్మిరెడ్డి.

Kalpana Rentala said...

రవికిరణ్,
క్షమాపణలు పెద్ద మాట. మీ ఆవేదనలో నిజాయితీ వుంది.అందుకే ప్రచురించాను. కాకపోతే రంగనాయకమ్మ గారు రాసిన దాంట్లో మీకు నచ్చని విషయాల్ని కొంచెం మామూలు మాటలతో సంయమనం తో చెప్పి వుంటే బావుండేది. ఒక గీత మీరు దాటారనే అనిపించింది. అయితే అది మీరు కావాలని చేసి వుండకపోవచ్చు.
తాజా అనానిమస్ గారు , మీరు కూడా ఒక ఆవేశం తో అనేశారు రవి కిరణ్ గారిని. ఇప్పుడు రవి కిరణ్ రాసిన వ్యాఖ్యల మీద మీ సూటి అభిప్రాయాలు రాస్తే బావుంటుంది.
రంగనాయకమ్మ గారి వ్యాఖ్యల మీద రవికిరణ్ అభ్యంతరాలు మీరు చదివారు. ఆయన చెప్పిన పాయింట్ల మీద మీ ఖండన సహేతుకం గా రాస్తే మనం ఇంకాస్త వివరంగా మాట్లాడుకోవచ్చు.
రవికిరణ్, “ తెలుగు సాహిత్యం పై చిన్న చూపు ఎందుకు?” అన్న నా వ్యాసం మీద మీ నిర్మొహమాటమైన విమర్శ ఆశిస్తున్నాను.

Sreelatha said...

Question: Why do you like Namini's stories
Answer: They are straight from heart, there is no pretention and very close to life
Quesiton: Why don't you like Namini's recent speech
Answer: It is straight from heart, there is no pretention and very close to life

hmmmm...
I am confused !!

rAm said...

ఆంధ్రజ్యోతి వివిధ లో రవికిరణ్ గారు రాసిన "అమ్మ గారి చీదర విమర్శ" ఇక్కడ
http://www.andhrajyothy.com/i/2010/mar/29-03-10vividha.pdf

జె.యు.బి.వి.ప్రసాద్ గారి ప్రతిస్పందన "మళ్ళీ అదే పాటా !"ఇక్కడ
http://www.andhrajyothy.com/vividhaNewsShow.asp?qry=2010/apr/12/vividha/12vividha4&more=2010/apr/12/vividha/vividhamain

 
Real Time Web Analytics