నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Saturday, March 20, 2010

నది –సప్తపది!


అగ్నిహోత్రం లా నది
చుట్టూ సప్తపది
***
ఒక ఒడ్డున నువ్వు
మరో తీరాన నేను
నది సాక్షిగా నిరీక్షణ
***
వెను తిరిగి వెళ్ళిపోతున్న నువ్వు
నా మీద నుంచి నడిచివెళుతున్న నది
***
నా నదీ దేహం లోకి
నడిచి వచ్చిన పడవ
ఎందుకు వచ్చిందో, ఎందుకు ఆగిందో—
పడవ చేసిన గాయంతో
సుళ్ళు తిరుగుతున్న నది
***
నా పాదాల్ని ముద్దిడుతున్న నది
నా కోసమే విచ్చిన మంచు పూలు
రెండు గట్లతో చెట్టాపట్టలేసుకొని
వచ్చిన వెన్నెల దీపం
జాలరి వలలో చిక్కిన రవి కిరణాలు
అన్నీ నా సొంతమనుకున్నా!
ఎంత పిచ్చిదాన్ని!
నడుస్తూ నడుస్తూ వుండగానే
ఆనకట్ట కౌగిలి లోంచి
ఎక్కడో కాలం జారీ పడిపోయింది
నే చూడనే లేదు!


కల్పనారెంటాల

(వార్త ఆదివారం అనుబంధం 8-3-1998)

7 వ్యాఖ్యలు:

మరువం ఉష said...

బాగుంది అనేకన్నా బలంగా తాకింది, పోటెత్తిన నదిలా కల్పన.

కొండముది సాయికిరణ్ కుమార్ said...

"నది" అన్న శీర్షిక తీసుకున్నారు. "నది" ఉపమానంగా కూడా చెప్పారు. అందుకని, నాలుగు లైన్ల కోసారి "నది" వాడారా? నదెక్కువై, కవిత్వం పలుచబడిందని నా అభిప్రాయం.

భావన said...

బాగుంది కల్పన. జారిపడిపోయిన కాలాన్ని నది గులకరాళ్ళు చేసి వుంచుతుంది గట్టున, చూసుకుని నడూ ఈ సారి. :-)

Bolloju Baba said...

కవిత చాలా బాగుంది

ఎక్కడో కాలం జారీ పడిపోయింది
ఇక్కడ జారీ అనే అచ్చుతప్పుని కాస్త అటూ ఇటూ సవరించి ఇలా చేస్తే
ఎక్కడో కాలం రాజీ పడిపోయింది

కవితకు మరో డైమెన్షన్ వచ్చినట్లనిపిస్తుంది కదండీ.

వండర్ ఫుల్ పోయెం

బొల్లోజుబాబా

తెలుగు వెబ్ మీడియా said...

చిన్నప్పుడు ఒరిస్సాలోని రాయగడ పట్టణం దగ్గరలో జలపాతం దగ్గర స్నానం చేసిన రోజులు గుర్తొస్తున్నాయి.

Anonymous said...

నదెక్కువై, కవిత్వం పలుచనైందని అన్నారు సాయికిరణ్ గారు. కానీ నాకేవో నదీ కనపడలేదు, కవితా కనపడలేదు కల్పన గారు.

రవికిరణ్ తిమ్మిరెడ్డి.

కొండముది సాయికిరణ్ కుమార్ said...

రవికిరణ్ గారు - నాకు కనిపించిన కవిత్వం...

నా నదీ దేహంలోకి
నడిచి వచ్చిన పడవ
ఎందుకు వచ్చిందో, ఎందుకు ఆగిందో
పడవ చేసిన గాయంతో
సుళ్ళు తిరుగుతూ నేను

 
Real Time Web Analytics