నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Sunday, March 07, 2010

పార్వతి మూడో కన్ను!

అప్పటివరకూ అర్ధనారీశ్వరుల్లా తాండవమాడిన ఆదిదంపతులు అలసట తీర్చుకుంటుండగా నారదుడి రంగ ప్రవేశం. ముల్లోకాల్లోని విశేషాలను విశదం చేస్తూంటే ఏదో అడగబోయి "నాథా" అంటూ శివుణ్ణి నెమ్మదిగా పిలిచింది పార్వతీదేవి.

"మధ్యలో నీ గోలేమిటి? " అంటూ శివుడు విసుక్కోవడం తో ఆ క్షణం లో పార్వతి కి తామిద్దరం వేర్వేరు అన్న స్పృహ కలిగింది. తన అస్తిత్వమేమిటో తెలిసి వచ్చినట్లనిపించింది. ఏమిటీ ఈయన గారి గొప్ప? పక్కన శివుడు లేకపోతే నేనేక్కడికి వెళ్లలేనా? ఏం చేయలేనా? అనుకుంటూ నెమ్మదిగా అక్కడి నుంచి లేచి భూలోక సంచారానికి బయలుదేరింది.


అలా భూలోకం లో హైదరాబాద్ కి విచ్చేసిన పార్వతి కి నగరం లో ఇంటి పట్టున వుండే ఆడవాళ్ళు ఏం చేస్తుంటారో తెలుసుకోవాలనిపించింది. అదృశ్య రూపంతో బంజారా హిల్స్స్ లో వుండే ఓ ఇంట్లో దూరింది. ఎనిమిది చేతులతో, రెండే కాళ్ళతో ఓ స్త్రీ మూర్తి వంటింట్లోకి, హాల్లోకి, పిల్లల గదుల్లోకి పరుగులు తీస్తోంది. పార్వతి కళ్ళకు అదొక లయబద్ధమైన నృత్యం గా కనిపించింది. ఆ స్త్రీ కి రెండే కాళ్ళున్నా అన్నీ చేతులెందుకున్నాయో ఒక్క క్షణం తెలియకపోయినా ఓ అయిదు నిముషాలు ఆమె ఏం చేస్తోందో గమనించేటప్పటికి అన్ని చేతులు ఆమెకు ఎందుకు అవసరమో పార్వతిదేవి కి అర్ధమైపోయింది. టిఫిన్లు, వంట, కారియర్లు సర్దటం, బస్ స్టాప్ ల్లో పిల్లల్ని వదిలి రావడం, పతి దేవుడికి కావాల్సినవి సమకూర్చి పెడుతున్న ఆ స్త్రీ మూర్తి పట్ల పార్వతి కి చిన్నపాటి సానుభూతి కలిగింది. ఆమె నుదుట పట్టిన చెమటను సుతారంగా తన పమిట కొంగుతో అద్దింది. ఒక్క క్షణం ఆ స్పర్శ కు ఆ స్త్రీ మూర్తి కి అలసట అంతా పోయినట్లనిపించింది.


ఇంట్లో వున్న వాళ్ళందరూ బైటకెళ్ళిపోగానే పని మనిషికి గిన్నెలు, బట్టలు బైట పడేసి ఓ చెంబు నీళ్ళు గుమ్మరించుకొని దేముడి ముందు ఓ నమస్కారం పడేసి ఆమె కర్మ యోగం నుండి క్రియా యోగం లోకి ప్రవేశించింది. చేతులకు గ్లోవ్స్ , తలకు శిరస్త్రాణం ధరించి తన కైనెటిక్ యాక్టివ్ బయిటకు తీసి పరుగులు పెట్టించి ఓ యోగా సెంటర్ ముందు బండి ఆపి లోపలకు వెళ్ళింది. ప్రాణా యామం అయిదు నిముషాలు, ఆసనాలొక అరగంట చేసి చివరగా శవాసనం వేసింది. శవాసనం లో కనీసం పది నిముషాలైనా శరీరానికి విశ్రాంతి ఇవ్వాల్సి వున్నా చేయాల్సిన పనుల జాబితా గుర్తుకు వచ్చి దాన్ని రెండు నిముషాలకు కుదించి మళ్ళీ బైట పడింది.


ఆదిత్య ఎన్ క్లేవ్ లోకి వెళ్ళి పి.సి. కి కావాల్సిన ఎక్స్ టర్నల్ స్పీకర్లు, వెబ్ కామ్ కొనుక్కోని సోమాజి గూడా వైపు బండిని పరుగులు పెట్టించింది. కళానికేతన్ లోకి వెళ్ళి తనకొక రెండు మంచి చీరలు, అమ్మాయికి నాలుగు మంచి డ్రెస్సులు కొన్నది. వచ్చే నెలలో వున్న పెళ్ళిళ్ళు, పై వారం లో వున్న పార్టీల లిస్ట్ కళ్ళ ముందు కదలాడుతుంటే ఆ కొత్త బట్టల్ని తీసుకొని అటు నుంచి అటే టైలర్ దగ్గరకెళ్ళి పోయింది. అప్పుడు గుర్తోంచ్చింది ఈ సేవా సెంటర్ కెళ్ళాలని. అక్కడ ఫోన్ బిల్లు, కరెంటు బిల్లు కట్టేసింది. సెల్ ఫోన్ లో రీఛార్జ్ కార్డు వేయించుకుంటుంటే ఎల్ ఐ సి ప్రీమియమ్ సంగతి యాదిలోకొచ్చి ఆ పని కూడా పూర్తి చేసెసింది.


ఇంతలో సెల్ మోగింది. “ హాయ్ ! హానీ! హౌ ఆర్ యూ? ఎక్కడున్నావు? ఏముందిలే. ఇంట్లో హాయిగా టివి చూస్తూ ‘ అవాక్కయి ‘ పోయింటావు. నీకేం హౌస్ వైఫ్ వేగా? నీ టైం నీ చేతుల్లో వుంటుంది. నువ్వేం కావాలంటే అవి చేసుకోవచ్చు. టెన్షన్ లెస్ జాబ్ కదా” అంటూ దండకం చదివేశాడు పతిదేవుడు. సర్లే కానీ, విషయం చెప్పు, ఏం పని చేయాలి అని అడగగానే, “ కొంచెం ఆ ICICI బాంక్ లో మన హౌస్ లోన్ గురించి మాట్లాడకూడడూ! ఆ మేనేజర్ గాడికి ఆడవాళ్లంటే బోలెడు కన్సర్న్. నువ్వు అసలే మంచి ఫిజిక్ మైం టైన్ చేస్తున్నావుగా, మన లోన్ వెంటనే శాంక్షన్ అయిపోతుంది ‘ అంటూ ఓ కుళ్ళు జోక్ విసిరాడు అవతలివైపు నుంచి.


ఇలా అన్నీ పనులు చేసుకొని ఇంటికి చేరేసరికి సాయంత్రం నాలుగు కావచ్చింది. ఇంక లంచ్ ఏం చేస్తాంలే, స్కిప్ చేస్తే వొళ్ళు అయినా తగ్గుతుందనుకొని ఏవో నాలుగు స్నాక్స్ తిని ఓ కప్పు టీ తాగేసరికి పిల్లలు ఇంటికొచ్చేశారు. పిల్లలతో పేరెంట్స్ గా కాకుండా స్నేహితుల్లా మిలగాలని ‘ చిట్టక్క ‘ చెప్పిన సలహాలను తూ.చా. తప్పకుండా పాటించేందుకు ప్రయత్నం మొదలు పెట్టింది. పిల్లల హోమ్ వర్క్ లో సహాయం చేస్తూ, వాళ్ళ కిష్టమైనా టీవీ ప్రోగ్రామ్ లు వాళ్ళతో చూస్తూ డిన్నర్ చేసేటప్పటికీ రాత్రి పది ఎలా వచ్చేసిందో ఆమెకు తెలియలేదు.


అందరికీ గుడ్ నైట్లు చెప్పి పర్సనల్ డైరీ కం ప్లానర్ తీసుకొని పక్క మీద వాలింది. ఇవాళ చేయాలనుకున్న పనులు, చేసిన పనులు , చేయలేకపోయిన పనులు అన్నీ మార్క్ చేసుకుంది. నెక్ట్స్ వీక్ ఇంట్లో పార్టీకి కావాల్సినవి, చుట్టాలింట్లో పెళ్ళికి వేసుకోవాల్సిన డ్రెస్ లు, నగలు , ఫేషియల్ అపాయింట్ మెంట్ అన్నీ చెక్ చేసుకుంది. బెడ్ పక్కన టేబుల్ మీద తను ఎప్పటి నుండో చదవటం మొదలుపెట్టాలనుకొని తెచ్చుకున్న పుస్తకం “ ఇన్ హెరిటెన్స్ ఆఫ్ లాస్ “ ఆమెను చూసి నా సంగతేమిటని అడుగుతున్నట్లనిపించి గుడ్ నైట్ బుక్ అంటూ ఆమె నిద్ర లోకి జారుకుంది.


ఆ రోజంతా ఆమె ను నీడ లాగా ఫాలో అయిన పార్వతి దేవి కి ఆ దినచర్య అంతా చూసి వొళ్ళు జలదరించింది. ఇండియాలో హౌస్ వైఫ్ లాగా బతికే కంటే కైలాసం లో శివుడు చెప్పే కబుర్లు వింటూ తాండవం చేయడమే మేలనుకుంటూ తిరిగి పయనమైంది మన పార్వతీదేవి. తనకి కూడా వున్న మూడో కన్ను గురించి శివుడి కి తెలియకుండా దాచేసుకొని ఏమీ ఎరగనట్లు కైలాసం లొకి చిరునవ్వుతొ అడుగుపెట్టింది.

కల్పనారెంటాల
( నూరేళ్ళ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు )

25 వ్యాఖ్యలు:

కత్తి మహేష్ కుమార్ said...

మీరు శివతత్వాన్ని తెలుసుకోకుండా హిందూదేవుళ్ళని అవమానించారని అభియోగం మోపాల్సొస్తుంది.

ఉష said...

కల్పన, ఈ అభిశంసని సహృదయంతో స్వీకరిస్తారనే.. నేను అగ్నిప్రవేశం మీద కవితని కాస్త అధ్యయనం చేసి రాయాల్సివుండాల్సింది అనుకున్నాను [అరుదుగా నాకు కలిగే అనుభవం..] మీరు అర్థనారీశ్వరతత్వాన్ని ఇంకాస్త తెలుసుకోవాల్సివుందంటారా? అలాగే కాస్త వ్యంగ్యం మిళితం చేసినా పార్వతీదేవిని [నాకు ఆ దేవితో కాస్త ఓ సెంటిమెంట్ ముడిపడివుంది లేండి ;)] యేమో నేను అంగీకరించలేనేమో.. చూద్దాం మిగిలిన అభిప్రాయాలు ఎలా వుంటాయో..

సుభద్ర said...

కల్పనగారు,
సూపర్ గా ఉ౦ది..మీ ఐడియా చాలా బాగు౦ది.మీ సినియార్టి చూపి౦చారు..
స్త్రీ శక్తిని చాలా చాలా గొప్పగా చూపి౦చారు.
కాని స్త్రీ శక్తిని చూపి౦చడానికి శివుడ్ని తక్కువ చేసినట్లుగా అనిపి౦చిది.
మీకు బాధకల్గితే క్షమి౦చగలరు.

Kalpana Rentala said...

మహేశ్,
నేను ఇది సరదాగా రాసిందే అన్న విషయం మీతో పాటు అందరికీ తెలుస్తుందనే అనుకుంటున్నాను.
ఉషా,
తప్పకుండా మీ విమర్శ ని సహృదయం తోనే స్వీకరిస్తున్నాను. ఇది సరదా గా రాసిందే తప్ప, ఎవరి మనోభావాలు కించపరిచేందుకు రాసింది కాదు. గమనించగలరు.
సుభద్ర,
అయ్యో, సీనియార్టీ నా , ఇంకేమైనా నా? ఇవాళ మన గొప్ప మనమే చెప్పుకోవాలి అని పాపం శివుడి తో పాటు పార్వతి కి కూడా మూడో కన్ను లాంటి జ్నాన నేత్రం వుంటుందన్న ఒక వూహాతో రాసింది ఇది. ఇవాళ ఒక్క రోజు శివుడు కంటే పార్వతి గొప్ప అనుకుంటే వచ్చే నష్టం ( శివుడి కి ) ఏమీ వుండదు లే అనుకోని రాసేశాను.

Paadarasam said...

మీరు ఎంత సరదాకి రాసినా,ఎవరి మనో భావాలను కించ పరచాలని
బహుశా టపా రసేటప్పుడు అనుకుని, కామెంటు రాసేటప్పుడు అనుకోక పోయినా ..........

"శివుని సొల్లు కబుర్లు వింటానికి" అన్న పద ప్రయోగం నా మనో భావాలని తీవ్రంగా దెబ్బ తీసింది. సదరు వాక్యాన్ని ఉపసమ్హరించుకుంటారని ఆశిస్తున్నను.

rAm said...

మీ గొప్పలు చెప్పుకోటం కి పరమేశ్వరుడికే ఎసరు పెట్టరు గా? :D నా ఊహ కి అందలేదు కాని మీ 'సరదా ఊహ', మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

btw..వోల్గా రచించిన “మృణ్మయనాదం” కధలు గుర్తుకు వచ్చాయి.

Kalpana Rentala said...

“ సోల్లు” తీసేశానండీ. ఇక హాయిగా చదువుకోండి.

కత్తి మహేష్ కుమార్ said...

నియో-హిందుత్వంలో మతపరమైన సృజనాత్మక స్వాతంత్ర్యం లేదు.కేలెండర్ ఆర్ట్ తప్ప ఐకనోగ్రఫీ ఆఫ్ హిందూయిజం,హిందూమత చరిత్ర ఏమాత్రం తెలీని హిందువులే ఈ మధ్యకాలంలో బ్లాగుల్లో మసలుతున్నారు. వాళ్ళ మనోభావాలు మీ టపాతో ఖచ్చితంగా గాయపడతాయనే ఊహతోనే నేను వ్యాఖ్యానించాను. ఆ ఆనవాళ్ళు ఇప్పటికే కనిపిస్తున్నాయి.

మీరు రాసిన సునిశితమైన సెటైరు నాకు అర్థమయ్యింది. I enjoyed it for sure.కానీ వాటిని ఆస్వాదించే భావవైశాల్యం అందరికీ ఉందా అనేదే నా సందేహం.

Anonymous said...

బాగుంది.

' కత్తి 'కి శివ తత్వం అర్థమయ్యే పంది మాంసం మీద దేవతల ఫోటోలు వేయడం చిల్లరగా అనిపించలేదు గాబోలు! హ్హా. హ్హ్వా..హ్వా..

Paadarasam said...

ధన్యవాదములు !

కత్తి మహేష్ కుమార్ said...

మీరు "సొల్లు" తీసేసి నా మనోభావాల్ని గాయపర్చారు. ఇప్పుడెలా!

Anonymous said...

శివతత్వం కత్తి గారికొక్కరికే అర్థమయినట్టుంది. అందుకే ఎవరు మనోభావాలు ఏమైనా నాకేంటి అని , బీఫ్ బర్గరు మీద హిందూ దేవుళ్ళ బొమ్మలు వేసుకుని ఆరగించారు.

హేతువాదం అంటే హింసావాదం కాదనే చిన్న విషయం అర్థం కాలేక పోయినా శివతత్వం మీద మాట్లాడే వారే! హన్నా!

Anonymous said...

శివతత్వం కత్తి గారికొక్కరికే అర్థమయినట్టుంది. అందుకే ఎవరు మనోభావాలు ఏమైనా నాకేంటి అని , బీఫ్ బర్గరు మీద హిందూ దేవుళ్ళ బొమ్మలు వేసుకుని ఆరగించారు.

హేతువాదం అంటే హింసావాదం కాదనే చిన్న విషయం అర్థం కాలేక పోయినా శివతత్వం మీద మాట్లాడే వారే! హన్నా!

భావన said...

ఇక్కడ మన ముప్పై మూడు చేతులు 360 పనుల గురించి కూడా రాయాల్సింది. బాగుంది కల్పన. నిజమే కదా నేను నా ఫ్రెండ్స్ అందరం అదే అనుకుంటాము వుద్యోగం చేస్తేనే కొంచం టైం వుంటుంది. వుద్యోగాల మధ్య లో బ్రేక్ లలో నాకైతే కార్ డ్రైవ్ చేస్తూ వున్నట్లే వుండేది నిద్ర లో కూడా..జనాలు అసలు పాయింట్ వదిలి కొసరు విషయాల గురించి మాట్లాడుతున్నారే. :-)

కత్తి మహేష్ కుమార్ said...

@ఎస్: లయకారకుడూ, చర్మధారి,శ్మశానజీవి,సురాప్రేమి,మాంసభక్షకుడైన శివుడి తత్వం బీఫ్ బర్గర్ తినే నాకన్నా మీకు తెలుసని నేననుకోను. హింసావాదం,వెక్కిరింపువాదాలు మీవంతు. I am talking about logic and reason here.

Kalpana Rentala said...

భావనా,
మీరు చెప్పింది నిజం. ఇక్కడి జీవితం గురించి రాయలేదు. ఎందుకంటే ఈ చిన్న గల్పిక ఇప్పుడు రాసింది కాదు.మూడేళ్ల క్రితం నేను ఇండియా వెళ్ళినప్పుడు రాసింది. అదే ఇప్పుడు పోస్ట్ చేశాను. ఈ సారెప్పుడో ఇక్కడ జీవన విధానాల గురించి రాద్దాము లెండి.

అక్షర మోహనం said...

paarvathi moodo kannupai mee pennu
vinaya - vijaya tandavam chesindi.

కొత్త పాళీ said...

కవితాత్మకంగా ఆర్ద్రంగా రాశారు.

శ్రీలలిత said...

కల్పనగారూ,
పార్వతీదేవికి కూడా కనపడని మూడో నేత్రం వుంటుందని చెప్పిన మీ వూహ బాగుంది. కాని ఆమె అందరికీ తల్లి కనుక ఆనేత్రం ఙ్ఞాన నేత్రం కాకుండా మనో నేత్రం అయితే అందరి బిడ్డలనీ మనసుతో చూచే చల్లని తల్లి అవుతుందనిపిస్తోంది. మీరు చెప్పినట్టే పైనుంచి క్రిందివరకూ అందరి అవసరాలూ చూడవలసిన తల్లి నేత్రం మనో నేత్రం అయితే మన మనసుకి మరింత దగ్గరవుతుందేమో ననిపించింది. మీకు చెప్పేంతటిదానిని కాది కాని ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. ఒక ఇల్లాలి దినచర్య ఎంత క్లిష్టమైనదో బాగా వ్రాసారు..
అక్కడి ఇల్లాళ్ళు+ ఉద్యోగినుల దినచర్య వ్రాయాలంటే అమ్మో.. ఇక్కడి పనిమనిషిని, డ్రైవర్ ని తీసేసి వాళ్ళలోకి కూడా తల్లులే పరకాయప్రవేశం చెయ్యాలి. మీరు వ్రాయండి. బాగుంటుంది..

sowmya said...

చాలా బాగా రాసారండీ...పార్వతి మూడో కన్ను....బాగుంది :)

ఇప్పుడే కౌముది లో మీ అయిదో గోడ కథ చదివాను...అద్భుతం. కథకి మీరిచ్చిన ముగింపు అమోఘం. ఎంత అందగా రాసారండీ....కౌముది లో "అస్త్రం" వ్యాసాల తరువాత నాకు నచ్చినది మీరు సంధించిన ఈ అస్త్రమే. ఇన్నాళ్ళు నేను ఈ కథని చూసుకోనందుకు కాస్త బాధపడినా, ఇప్పటికైనా చదివినందుకు సంతోషిస్తున్నాను.

Chimpesh said...

Do you have any idea what a desperate housewife means?

Praveen Communications said...

నేను అయిదో గోడ కథను జూన్, 2009లో చదివాను. అప్పట్లో ఆ కథని చాలా మంది విమర్శించారు కానీ నాకు మాత్రం ఆ కథ బాగా నచ్చింది. విశ్వనాథ సత్యనారాయణ భూస్వామ్య సాహిత్యాన్ని ఆరాధించేవాళ్ళకి స్త్రీవాద కథలు నచ్చవు.

rAm said...

"విశ్వనాథ సత్యనారాయణ భూస్వామ్య సాహిత్యాన్ని ఆరాధించేవాళ్ళకి స్త్రీవాద కథలు నచ్చవు."

praveen-

నువ్వు ఏం రాస్తావో నీకు అన్నా అర్ధం అవుతుందా??అయిదో గోడ కథ నచ్చినది అని చెప్పవు బావుంది.అక్కడితో ఆగిపోవచ్చు అనుకుంటా.నాలుగు తెలుగు పదాలు /నలుగురు రచయితల పేర్లు తెలుసు అని తోచినది రాయకు.

TIA

Anonymous said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...
This comment has been removed by a blog administrator.
 
Real Time Web Analytics