నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Saturday, April 10, 2010

మా ఇంటి జ్ఞాపకాల భరిణ మూత తీసి చూస్తే.....!



ఏప్రిల్ 1, 2010: కొత్త ఇంట్లోకి మారాము.

ఇల్లు మారటం గురించి బాల్యం నుంచి ఎన్నో జ్ఞాపకాల పుటలు / వూహల ఉయ్యాలలు.

చిన్నప్పటి నుంచి ఇల్లు మారటం అంటే ఎంతో ఇష్టంగా వుండేది. ఎందుకంటే నేను పుట్టినప్పటి నుంచి 30 ఏళ్ళు ఒకే ఇంట్లో వున్నాను. ఆ ఇల్లు అంటే ఎంతో ఇష్టం. ఎన్నో తీపి గురుతులు. అయినా కొత్త ఇంటికి మారటం, ఆ ఇంటిని మనకు కావాల్సిన పద్ధతి లో సర్దుకోవటం అక్కడ కొత్త జీవితం మొదలుపెట్టడం ఇలాంటి మధురమైన వూహాలు ఏ పసితనంలో, యే యవ్వన వనం లో వుండవు?


సత్యనారాయణ పురం రైల్వే గేటుకి ఆనుకొని వున్న ఓ సందులో చివరాఖరున వున్న ఇళ్ళల్లో మాది ఒకటి. మా ఇంటి పక్కన ఓ ఇల్లు. ఆ ఇంటి తర్వాత రైలు పట్టాలు. పాతిక అడుగుల దూరం లో సత్యనారాయణ పురం రైల్వే స్టేషన్. మా అమ్మా, నాన్నగారు పెళ్ళి అయ్యాక ఆ ఇంట్లోకి వచ్చారు. మా అన్నయ్య దగ్గర నుంచి ఆఖర్ణ తమ్ముడు వరకూ ఆరుగురం ఆ ఇంట్లోనే పుట్టాము. మేము ఆ ఇంట్లో వున్నప్పుడు పుట్టడం కాదు. ఆ ఇంట్లోనే పుట్టాము. మా అమ్మ అన్నీ పురుడ్లు ఇంటి దగ్గరే పోసుకుంది. ప్రసవం నొప్పులు వచ్చేవరకూ అన్నీ పనులు తానే చేసుకునేదట. నొప్పులు వస్తుంటే నర్స్ కి కబురు పెట్టి వేడి నీళ్ళు, బట్టలు కూడా సిధ్ధం చేసుకొని రెడీ గా వుండేదట. ఆ విషయాలు మా అమ్మతో ఎన్ని సార్లు చెప్పించుకున్నా ప్రతి సారీ కళ్ళ నీళ్ళు వస్తాయి. ఇంకా నొప్పులు మొదలు కాకుండానే బెంబేలెత్తిపోయి సిజేరియన్ చేసేయమని అడిగే తల్లులు, కూతుర్లు, డబ్బులు ఎక్కువ వస్తాయని అవసరం లేకపోయినా ఆపరేషన్లు చేసే కొందరు డాక్టర్లు వున్న ఈ కాలం లో మా అమ్మ తరం స్త్రీలు నాకేప్పుడూ నమ్మలేని నిజాలుగా, అచ్చంగా నిలువెత్తు గాయలుగా కనిపిస్తుంటారు.


మా అందరి పెళ్ళిళ్లు, వాళ్ళకు పిల్లలు అన్నీ ఆ ఇంట్లో వుండగానే జరిగాయి. అయిదో, పదో రూపాయల అద్దెతో చేరిన మేము ఆ ఇంటి నుంచి ఇక తప్పనిసరై దాదాపు ఓ పదేళ్ళ క్రితం ఖాళీ చేసాము. ఇంతా చేసి అదేమీ పది గదుల బంగళా కాదు. ముచ్చటగా మూడు ఏక వరుస గదులు. వెనక ఓ పెద్ద బావి. దాని చుట్టూ ఒక చప్టా. దానికి ముందు నిత్యం ఉదయ, సాయంత్రాలు దీపారాధనతో వెలిగిపోయే తులసి కోట. గదుల కంటే పెద్ద గా వుండే పెరడు. అందులో కొబ్బరి, అరటి, కాకర, బూడిదాగుమ్మడి, సొర పాదులు. ఆ పక్కనే ఒక రెండు బాత్ రూమ్ లు. ఇదీ మా రాజ సౌధం. ఇల్లు ఎంత ఇరుకుగా వుండేదో నేను ప్రత్యేకం గా చెప్పక్కరలేదు. కానీ మనసులు, ప్రేమలు ,అనుబంధాలు, ఆత్మీయతలు మా మధ్య విశాలంగానే వుండేవి.


స్కూల్లో కొత్త వూర్ల నుంచి వచ్చే స్నేహితులు, సందులో ఏవో కొన్ని ఇళ్ళల్లోకి ఎప్పటికప్పుడు వచ్చి చేరే కొత్త మనుష్యులు వాళ్లందరిని చూసి అబ్బా, మనకు కూడా ట్రాన్సఫర్ అయితే బాగుండు, ఏదైనా కొత్త ఇంట్లో చేరవచ్చు. సామానంతా తీసేసి ఈ ఇల్లు ఖాళీగా బోసిగా వుంటే ఎలా వుంటుందో చూడొచ్చు. కొత్త ఇల్లు ఇంకొంచెం పెద్దగా వుంటే, ఎవరికి వారికి విడిగా గదులు వుంటే, వాటిని మనకిష్టం వచ్చినట్లు సర్దుకోవచ్చు.కొత్త ఇంట్లో సరికొత్తగా జీవితం మొదలుపెట్టవచ్చు అనుకుంటూ రకరకాల రంగుల కలలు కనేదాన్ని.


మా నాన్నగారు నేను పుట్టక ముందు నుంచీ ఒకటే ఉద్యోగం లో వున్నారు. ఆ ఉద్యోగం మారేది లేదు. అందులో ట్రాన్స్ ఫర్లు లేవు. అయినా కూడా ఇల్లు మారవచ్చు. కానీ మా నాన్నగారికి ఎందుకనో ఆ ఇల్లు వదలటం ఇష్టం వుండేది కాదు. ఆయనకు తన సొంత వూరు, సొంత ఇల్లు పల్నాడు వదిలి రావటం ఎంత తీవ్రమైన వేదనో చివరి క్షణం వరకూ చెప్తూనే వున్నారు. ఇంక అద్దె ఇల్లు అయినా ఇదే మన ఇల్లు అనేవారు. సొంత ఇల్లు , సొంత వూరు, పొలాలు వదులుకోవటం అంత వేదనను కలిగిస్తుందని మా నాన్న ను చూసి తెలుసుకున్నా నాకు అప్పట్లో ఆయనవి అన్నీ పెద్దవాళ్ళ చాదస్తాలుగా అనిపించేవి . ఇల్లు మారితే ఏమవుతుంది? మన పాత ఇంటి జ్ఞాపకాల పెట్టెలు, బట్టలు, వస్తువులుమనతోనే వుంటాయి కదా, అది కోల్పోవటం ఎందుకవుతుంది అనుకునేదాన్ని. ఇల్లు , వూరు, దేశం, భాష మారటం లో వున్న ఇబ్బందులు స్వానుభవం లోకి వచ్చాక మానాన్న బాధ ఏమిటో తెలిసి వచ్చింది. కానీ అప్పటికే చాలా ఆలస్యమైందనుకుంటాను.


జీవితం లో ఒక వయస్సులో ఎప్పుడూ ట్రాన్సఫర్లు అవుతూ వుండేవాడిని పెళ్ళి చేసుకోవాలనుకున్న నా వూహ కు ఇప్పుడు నవ్వొస్తుంది. పెళ్ళి అంటే మరీ అంత చవక ఆలోచనలు అప్పట్లో వుండేవా అని.
సరే, బాల్యం నుంచి అలా ఇల్లు మారటం ఒక తీరని కోరికగా జీవితం లో ఒక దశ వరకూ మిగిలింది. 95 నుంచి నా మూవింగ్ టైం స్టార్ట్ అయింది. 97 దాకా ఏవో చిన్న చిన్న ఇళ్ళ మార్పులు. 97 లో హైదరాబాద్ కి నివాసం మార్పు. పెట్టెల నిండా పుస్తకాలు, కాగితాలు. ఏవో నామ్ కే వాస్తే లాగా కొన్ని బట్టలు, గిన్నెలు.


హైదరాబాద్ లో వున్నది రెండేళ్ళు. మారింది మూడు ఇళ్ళు. ఆ తర్వాత అనంతపురంకు మకాం మార్పు. అక్కడ వున్నది నాలుగేళ్ళు కానీ ఒకటే ఇంట్లో వున్నాము.అక్కడి నుంచి ఎవరో తన్నినట్లు అమెరికా వచ్చి పడ్డాము.మాడిసన్ లో వున్న నాలుగేళ్ళలో రెండు ఇళ్ళు . 2007 లో ఆస్టిన్ వచ్చాక ఈ మూడేళ్ళలో ఇది ముచ్చటగా మూడో ఇల్లు. ఈ దెబ్బతో అసలు ఇల్లు మారటం మీదున్న మోహం, వ్యామోహం మొత్తం వదిలిపోయాయి. మొహం మొత్తేసింది. పాకింగ్, ఆన్ పాకింగ్ లో బోలెడు మెలకువలు, ఎదురుదెబ్బలు, విసుగులు, నిట్టూర్పులు, చికాకులు.అనేక పాఠాలు నేర్చుకున్నాము. పుస్తకాలే జీవితం, ప్రాణం అనిపించినా ఇల్లు మారేటప్పుడు మాత్రం వాటి అసలు బరువు అర్ధమవుతుంది. గిన్నెలు, బట్టలు సునాయాసం గా , ఎలాంటి సంకోచాలు లేకుండా అవతల పారెయ్యగలం కానీ ఒక్క కాగితం ముక్క కూడా అబ్బా, దీనితో పనేముందిలే పడేద్దాము అనిపించదు. ప్రతి పేపర్ అదేదో పెద్ద పెన్నిధి లాగా, ఎప్పుడూ అవసరం వస్తుందో అన్నట్లు భుజం మీద పెద్ద మూటల్లాగా భేతాళుడిలా మోసుకు తిరగటం. కొత్త ఇంట్లోకి రాగానే ఏమైనా కానీ ఇక ఇల్లు మారకూడదు అనుకోవటం. ఏదో ఒక కారణం తో రెండేళ్ళకు మళ్ళీ పిల్లి పిల్లల్ని మోసుకు తిరుగుతున్నట్లు ఇంకో ఇంటికి మారటం ఆనవాయితీ గా వస్తోంది. ఆ ఆనవాయితీ ని బ్రేక్ చేయాలని మనం అనుకున్నంత మాత్రానా సరిపోతుందా? కాలం కలిసి రావద్దా?


ఇల్లు మారటం బాధనా ? సంతోషమా? అంటే ఇదీ అని చెప్పలేని ఒక అనుభూతి. పాత ఇల్లు వదిలిపెడుతున్నప్పుడు లోపల నుంచి తన్నుకొచ్చే ఫీలింగ్ ని ఇదీ అని నిర్వచించలేము. ఆ ఇంటికున్నవి కేవలం గోడలేనా? అందులో వున్నది ఇసుక, సిమెంటు, కొన్ని చెక్కలేనా? గడపలు, ద్వారబంధాలేనా? ఇన్నాళ్ళు మనం ఆ ఇంట్లో వున్నప్పుడు ఆ గోడలతో మనం చాలా మాట్లాడి వుంటాము. మన మాటలు ఆ ఇల్లు చెవి వొగ్గి చాలానే విని వుంటుంది. .మన రహస్యాలన్నీ దానికి తెలిసిపోయి వుంటాయి. మన ప్రణయ కలహాలు, తీపి కబుర్లు, చిలిపి అలకలు, పిల్లల అల్లరి. వాళ్ళ బాల్యపు మిఠాయి వుండలు ఎన్ని వుంటాయి ఒక్కో ఇంట్లో? మనం వచ్చేశాక, మరో జంట అందులోకి వస్తుంది. వాళ్ళ పిల్లలు కొత్త ఆశల నిచ్చెనలు వేసుకుంటారు. ఆ జంట చేయి చేయి పట్టుకొని ఎన్నో వూసులు ఆ గదుల్లో చెప్పుకుంటారు. మనం ఒకరి తర్వాత ఒకరం వస్తూ వుంటాము. వెళ్ళి పోతూ వుంటాము. ఇల్లొక రైల్వే స్టేషన్. కొన్ని అరైవల్స్, కొన్ని డిపార్చర్స్. అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్లు, మౌనం గా, నిశ్శబ్దం గా , మూగగా మనకు ఆహ్వానాలు, వీడ్కోలు పలుకుతూ ఆ నాలుగు గోడల గదులు మరో అయిదో గోడను మన అపరిచిత, అపరిష్కృత సంక్షోభాల్ని, సంభాషణల్ని భుజాల మీద మోస్తూ గోమటేశ్వరుడి లాగా నిలబడి వుంటాయి.


ఇప్పుడు వదిలి వచ్చిన ఇంటి వెనక ఓ పెద్ద అడివి లాంటిది వుంది. కాన్యన్ సీనరీ. పెద్ద పెద్ద చెట్లు, వాటి మీద వాలే రంగు రంగుల పక్షులు, వాటి కూతలు, రాత్రి కాగానే మా ఇంటికి ఆతిధ్యానికి విచ్చేసే రెండు నల్లగా భీకరం గా కనిపించే రకూన్ లు. అవన్నీ తిథి వార నక్షత్రాలు చూడకుండా మా ఇంటికి వచ్చేసే అతిథులు. రకూన్స్ నా అని కంగారు పడకండీ. మొదట మేము కూడా కొంచెం భయపడ్డాము కానీ. మంచి గా కనిపించి క్రూరం గా మసిలే మనుష్యుల కన్నా క్రూరంగా కనిపించినా మంచిగా మసీలేవీ ఆ రకూన్ లు. నేను బయట పెట్టిన బ్రెడ్, అన్నం, ఏదైనా సరే తినేసి ఇంకాస్త పెడతారా అన్నట్లు ఆ పేటియో తలుపు వెనకాల నుంచి చూస్తూ నిలబడేవి. వుయి మిస్ దెమ్.


ఇప్పుడు మారిన మా కొత్త ఇల్లు బావుంది. కానీ కాన్యన్ లేదు. ఒక చిన్న పేటియో. మన భాష లో పెరడు అనుకోండి. పెరట్లో ఓ మూలన పెద్ద కుంకుడుకాయ చెట్టు లాంటి చెట్టు. దానికి ఆకుల కన్నా కాయలే ఎక్కువేమో అనిపిస్తాయి. తెల్లవారేటప్పటికి పెరడంతా ఆకులు, కాయలు, పూల ధూళి అంతా ఆకుపచ్చగా పర్చుకొని వుంటుంది. ఆ చెట్టు మీద కూడా రకరకాల పక్షులు వాలతాయి. తెల్లారగట్ల ముందుకూ వెనక్కూ వూగే రాకింగ్ ఛైర్ లో కూర్చుంటే గతం లోకి, భవిష్యత్తు లోకి వెళ్ళి వస్తున్నట్లు వుంటుంది. అక్కడ కూర్చొని నా మొదటి కాఫీ తాగుతున్నప్పుడో, వంటింటిలో వంట చేస్తున్నప్పుడో ఆ పక్షులు, కొత్తగా ఆ చెట్టు కి తగిలించిన కొన్ని గాలిగంటల ( విండ్ చైమ్) శబ్దాలు ఏవేవో కబుర్లు చెప్తూ నన్ను పొద్దుపుచ్చుతాయి. ఆ గాలి గంటలతో నేస్తం చేసేందుకు మల్లె, మందార మొక్కల్ని కూడా తెచ్చిపెట్టాము. ఇవాళే ఒక మందారం పూసింది. గుండు మల్లె చెట్టు కి మొగ్గలున్నాయి. తొందర్లోనే మా పెరడంతా , నా మనసంతా మల్లెపూల గుబాళింపు పరిమళం. ఆ గాలి గంటల మృదు మధుర మంజీర నాదాల మధ్య మా పాత ఇంటిని పూర్తిగా మర్చిపోలేదు కానీ ఈ కొత్త ఇంటిని సరికొత్తగా ప్రేమించడం మొదలుపెట్టాను.


ఇల్లు మారటం అంటే ఉగాది పచ్చడి లా తీపి, చేదు, వగరు, పులుపు, కారం అనేక రుచుల సమ్మిళితం.


ఈ ఇళ్ళు మారటం లో నేను ఏం పొందాను అనే దానికన్నా ఎన్నెన్ని పోగొట్టుకున్నాను అన్నది మరో సారి....ఎప్పుడో...ఇంకో ఇల్లు మారటానికి ముందు.....

ఇంతే సంగతులు.
ఇట్లు
ఓ అద్దె ఇంటి అమ్మాయి






16 వ్యాఖ్యలు:

cbrao said...

శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం అనే పదాలకు ఇప్పుడు అదనంగా గృహ వైరాగ్యం కూడా చేర్చాలేమో. ఎంతో ప్రాణమయిన పుస్తకాలు ఇల్లు మారే సమయంలో భారంగా తోచటం వైచిత్రమే మరి. తోచటమే కాదు అవి నిజంగానే ఎంతో బరువనిపిస్తాయి కూడా. ఇంటి నిలువ శక్తికి మించిన పుస్తకాలు దుమ్మును ఆకర్షించే గుణం కలిగి ఉంటాయి. ఎంతైనా, పాత ఇంటితో మనకు తెలియని ఆత్మానుబంధం ఉంటుంది.

తెలుగు వెబ్ మీడియా said...

మాది సొంత ఇల్లే కానీ సొంత ఇంటిలో శాస్వతంగా ఉండాలని లేదు. నేను ఉన్న ఊర్లో నా వ్యాపారం నడవకపోతే నేను వ్యాపారాన్ని వేరే ఊరికి షిఫ్ట్ చెయ్యాల్సి రావచ్చు. మీ ఇంటి పేరు చూస్తుంటే తెలిసిపోతుంది, మీది పల్నాడు నుంచి వచ్చిన కుటుంబం అని. రెంటాల గ్రామం పల్నాడులోని రెంటచింతల దగ్గర ఉంది. ఉద్యోగం కోసమో, వ్యాపారం కోసమో ఇల్లు, ఊరు మారాల్సి రావడం పెద్ద విషయమేమీ కాదు. మా పూర్వికులు ఒరిస్సా నుంచి వచ్చారు. మేము ఉండేది ఆంధ్రాలో.

మరువం ఉష said...

నాకొచ్చిన సమస్య భరిణెలు ఎక్కువ, మూతలు తక్కువ. కనుక కొన్ని మూతలేనివి/మూసివేయలేనివి పలుకరిస్తూనేవుంటాయి.

ఇల్లు మారటం అన్నది మేము చాలా తరుచుగా అనుభవించిన క్షణాలు.
ఇక,

"మా అమ్మ తరం స్త్రీలు నాకేప్పుడూ నమ్మలేని నిజాలుగా, అచ్చంగా నిలువెత్తు గాయలుగా కనిపిస్తుంటారు."

మా అమ్మ నన్ను అలాగే అచ్చెరువుకి, అనిశ్చితికి గురిచేసేవారు. ఆఖరుకి ఎన్నో ప్రశ్నాకర్థకాలు మిగిలుండగానే విడిచి వెళ్ళిపోయారు.

"ఇల్లు మారటం అంటే ఉగాది పచ్చడి లా తీపి, చేదు, వగరు, పులుపు, కారం అనేక రుచుల సమ్మిళితం."

ఏ జ్ఞాపకపు భరిణె విప్పినా అంతేగా? అసలు హృదయం మొత్తం చిన్ని చిన్ని అరల భరిణె. ఒకదాన్నుంచి ఒకటి తెరుచుకుపోతూవుంటాయి.

ఎన్నో ఇళ్ళలో వసించాము. కానీ కొన్నే గాఢానుభూతిని ఇచ్చాయి. అవి అన్ని రకాల వయసుల్లోనూ సంభవించాయి.

ఇప్పుడు ఇది నా స్వంత ఇల్లు + ఇక్కడే జీవితంలో మొదటిసారిగా ఎక్కువ కాలం గడిపినదీను. తరిచిచూస్తే కొన్ని క్షణాలు కూడా అరలడిగేంత చిక్కనివి.

కొత్త పాళీ said...

జిందాబాద్ అద్దిల్లు! :)

Sujata M said...

చాలా బావుంది. నా చిన్నప్పుడు మద్దెల పాలెం లో తాతగారిల్లు గుర్తు వచ్చింది. ముందుకు ప్రహరీ లో కమ్మని ఘాటైన తీయని వాసనలతో విరగబూసే సంపెంగ చెట్టు, దానికి ఆనుకునున్న చిలక కట్టిన వెదురు కర్రా (చిలకతో మెలిక పెట్టి కింద నుండే కొమ్మల మీది పూలు తెంపొచ్చు), మెట్ల కింద లక్క ముక్కలు (తాతగారి వి- ఏవో సీలు చెయ్యడానికి అనుకుంటాను) - ఇంకా ఆరుబయట మా స్నానాలు - పెరట్లో ఓ మూల బీచీలో సముద్రం ఎత్తుకుపోగా మిగిలిన పిల్లల అరజత (ఒక్క) జోళ్ళూ - అన్నీ ఒక్కసారి కళ్ళ ముందు మెదిలాయి. ఇప్పటికి మేమూ చాలా ఇళ్ళు మారాం. అన్నీ ప్రత్యేకమైనవే ! అన్నిటికీ ఓ సారి నమోన్నమః !

Bolloju Baba said...

wonderful
"మా అమ్మ తరం స్త్రీలు నాకేప్పుడూ నమ్మలేని నిజాలుగా, అచ్చంగా నిలువెత్తు అద్బుతాలుగా కనిపిస్తుంటారు."
అని చదువుకొన్నాను.

నన్ను కనటానికి ముందురోజు అరబస్తా మినువులు తిరగలిపై ఆడిందట మా అమ్మ. మా ఆరుగురిలో మా చెల్లిదితప్ప అందరవీ ఇంట్లోకానుపులే. ఆనాటి పురుళ్ల మంచం చాన్నాళ్లు ఉండేది.

మా అమ్మాయి కడుపులో ఉన్నపుడు మా ఆవిడ ఏడోనెలనుంచీ దాదాపు బెడ్ రెస్ట్ తీసుకోవలసివచ్చింది. :-)

ఉద్యోగరీత్యా ఇప్పటికి ఆరిళ్లు మారాం. ఇక త్వరలో మారబోయేది సొంతిల్లు కావటం ప్రస్తుతానికి ఆనందంగానే ఉంది, దూరపు ట్రాన్స్ఫర్ల భయం ఉన్నప్పటికీ.

కొండేపూడి నిర్మల ఎక్కడో అంటుంది

ఇల్లు ఖాళీ చేసినపుడు
గోడక్కొట్టిన మేకు
బాధతో ఒంగింది ---- అని

అద్బుతమైన ఎక్స్ ప్రెషన్. ఇల్లు మారినపుడల్లా ఆకవిత గుర్తొస్తూంటుంది.

బొల్లోజు బాబా

తెలుగుయాంకి said...

మీ అద్దిల్లు విశేషాలు బాగున్నాయి. అద్దిల్లులు మారటము వలన ఇంకో రెండు గొప్ప ఉపయోగాలున్నాయి. నాలాగా మీరు కూడా ఎక్కడి వస్తువులక్కడే పడేసే టైపు అయితే, ఎంచక్కా మారిన ప్రతిసారీ అన్నీ చక్కగా అమరిపోతాయి. అలాగే మీకు తెలియని, లేకపోతే మరిచిపోయిన ఎన్నో నిధినిక్షిప్తాలు గూడా బయట పడతాయి.

తెలుగు వెబ్ మీడియా said...

సుజాత గారు. మా అమ్మగారు ఆంధ్రా యూనివర్శిటీలో చదువుకునే రోజుల్లో మద్దిలపాలెంలోనే ఉండేవారు. అప్పట్లో మువ్వలవానిపాలెం (MVP) చేపలు పట్టేవాళ్ళ గ్రామం. మద్దిలపాలెంలో ఇంటి మేడ మీద నుంచి చూస్తే మువ్వలవానిపాలెం సముద్ర తీరం కనిపించేది. మద్దిలపాలెం అద్దె ఇంటిలో ఉన్నప్పుడు మెడికల్ కాలేజి సీటు కోసం పరీక్షలు వ్రాసారు. అప్పట్లో కోస్తా ఆంధ్రలో ఉన్నవి రెండే మెడికల్ కాలేజిలు. ఒకటి వైజాగ్ లో, ఇంకొకటి కాకినాడలో. మెడికల్ కాలేజిలో సీట్ దొరక్క MSc చదివారు. మద్దిలపాలెంలోని వాళ్ళ అద్దె ఇంటికి ఆంధ్రా యూనివర్శిటీ ఔట్ గేట్ దగ్గరగా ఉండేది.

Unknown said...

చాలా బాగా రాసారు, చక్కటి కధలా.
అదేంటో చిత్రం ,మీ జ్ఞాపకాల భరిణ చూసి నా జ్ఞాపకాల మల్లెలు విచ్చుకున్నాయి!!

Rajendra Devarapalli said...

ప్రవీణూ ఈ మధ్య భౌగోళిక,గృహనామాల,గ్రామనామాల చరిత్రకారుడివి అవ్వాలని కృషిచేస్తున్నాటున్నావు.మంచిదే,కానీ కేవలం నీ బుర్రను నమ్ముకోకుండా కాస్త పుస్తకాలు కూడా చదవరా బాబు.
"అప్పట్లో కోస్తా ఆంధ్రలో ఉన్నవి రెండే మెడికల్ కాలేజిలు. ఒకటి వైజాగ్ లో, ఇంకొకటి కాకినాడలో--మరి గుంటూరులో మెడికల్ కాలేజీని యేం చేసావు?లేక గుంటూరు కోస్తాలో లేదనుకుంటున్నావా?ఆంధ్రామెడికల్ కాలేజి-1923లో అంటే ఆంధ్రవిశ్వకళాపరిషత్తు కంటే మూడు సంవత్శరాలు ముందు యేర్పాటు చేసారు,గుంటూరు మెడికల్ కాలేజీ1946,కాకినాడ రంగరాయమెడికల్ కాలేజీ1958లో వచ్చింది.
మద్దిలపాలెంలోని వాళ్ళ అద్దె ఇంటికి ఆంధ్రా యూనివర్శిటీ ఔట్ గేట్ దగ్గరగా ఉండేది.---
మద్దిలపాలెంకి ఏయు ఔట్ గేట్ దగ్గరా??

తెలుగు వెబ్ మీడియా said...

ఇక్కడ రా అని పిలవడం బాగాలేదు రాజేంద్ర కుమార్ గారు. మా తాతయ్య నాకు వైజాగ్, కాకినాడ మెడికల్ కాలేజిల గురించి చెప్పారు. అతను గుంటూరు వెళ్ళలేదు.

Anonymous said...

పగిలిపోయిన ఇంటి ముందరుగులు
కిరకిరకిరమని పాట పాడే బావి
పక్కింటోళ్ళ ఇంటిలోకి వంగిన కొమ్మకి
విరగ కాసే జాంకాయలు
ఎవరికీ చెందకపోయినా
మనింట్లోనే వుండే వీధి కుక్క
మన చేతుల్లో పెరిగిన మొక్కలు
మన మసుల్లో పూసిన పూలు
పక్కింటి శీది గాడు
ఎదురింటి పద్మక్క
సందు చివర అర్థణాకి దొరికే
సెట్టెమ్మ పెద్ద బొరుగు ముద్ద
అలమారలో పేరుకుపోయిన పుస్తకాల వాసన
మధ్యింటిలో వేసిన కిటికీతలపుల ఇవతల
మసక చీకటిలో వెలుగుతున్న దీపారాధన
పండగలకి పెరట్లో తవ్విన గాడిపొయ్యి
నెయ్యిలో కలుపుకుతిన్న నిప్పటి పిండి

గోడ మీద నుంచి పెట్టెలోకి సర్దుకున్న ఫోటో
వదిలిన తెల్లని మచ్చలా ు
మకిలి పట్టిన ఆ బాడుగిల్లు
మనసులో మల్లెపూవై పోతుంది
ముడుచుకుని మనసు మూలల్లోకెళ్ళిపోయినా
విచ్చుకున్న క్షణం మాత్రం
గుండెమీద కనిపించీ కనిపించని
చారికని మాత్రం వదుల్తుంది
ఆ గాటు ఇంటి కోసవా?
తిరిగిరాని గతం కోసవా?

రవికిరణ్ తిమ్మిరెడ్డి.

Rajendra Devarapalli said...

సరే ప్రవీణూ,నాకంటే ఓ పాతికేళ్ళు చిన్నవాడివి నువ్వు,అయినా నిన్ను రా అంటం తప్పే ఒప్పుకుంటున్నా.
ఇక విషయానికొద్దాం.
రెంటాల అన్న ఇంటిపేరు వినగానే,గుంటూరుజిల్లా పల్నాడుప్రాంతంలోని రెంటచింతల దగ్గర ఉన్న రెంటాల గ్రామం ..ఇలా తెలిసిపోతుందా?గుంటూరులో1946నుంచీ ఉన్న మెడికల్ కాలేజీ గురించేమో మీ తాతగారు చెప్పలేదా?
ఇంతకీ మద్దిలపాలెంకి ఏయూ ఔట్ గేట్ ఎంతదగ్గరో చెప్పలేదు నువ్వు?
నువ్వు బాగా చదువుతావు,నీకు వీలయైనంతవరకూ రాస్తావు కాబట్టే ఇంత వివరంగా చెప్పటం,ఇకముందైనా కాస్త సమాచారం ఒకసారి సరిచూసుకో అప్పుడు రాయొచ్చు కామెంటు.

Anonymous said...

"భేతాళుడిలా మోసుకు తిరగటం" సరి కాదనుకుంటాను. "విక్రమార్కుడిలా మోసుకు తిరగటం" అనుకుంటాను. మోసింది భేతాళుడిని, మోసుకు తిరిగింది విక్రమార్కుడు. చందమామలో ఇలాగే ఉంది. :-)

మాలా కుమార్ said...

ఇళ్ళు మారటము గురించి , మీ అంభవాలు బాగాచెప్పారు . మేము ఇప్పటికి వక్క హైదరాబాద్ లోనే పదకొండు ఇళ్ళు మారాము . ఇహ బయటి వూళ్ళ లో మారినవి చెప్పక్కర్లేదు . ప్రతి రెండేళ్ళకు మారుతునే వుంటాము . దాదాపు అన్ని సొంత ఇళ్ళే .

Kalpana Rentala said...

కామెంట్లకు సమాధానాలు ఇవ్వటం సరైన బ్లాగు మర్యాద నే కానీ, నా మీదున్న పని వొత్తిడి వల్ల గత కొన్ని పోస్టులకు వచ్చిన కామెంట్లకు స్పందించలేకపోయాను.
అనానిమస్ గారు, మీరు చెప్పింది కరెక్టే. నాది తప్పు.
నది –సప్తపది కవిత నుండి ఈ తాజా పోస్ట్ వరకు అందరికీ ఇదే సమాధానం గా భావించి , మన్నించి, అభిమానిస్తారని ఆశిస్తూ.....

 
Real Time Web Analytics