నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Wednesday, May 19, 2010

ఒక మామూలు మరణం!


సునీల్ ఆ బాంబు ప్రేలుడు లో చనిపోయాడు.
అతను మాకు పండ్లు అమ్మేవాడు.
ఏ బాంబు ప్రేలుడు అని మీరడగవచ్చు.
అది నిజం గా ఏ బాంబు ప్రేలుడైతేనేం?
టౌన్ హాల్ లో ఎన్నికల ర్యాలీకి అతను వెళ్ళాడు. అప్పుడు ఆ బాంబు ప్రేలుడు సంభవించింది. సునీల్ చనిపోయాడు. అంతే. రెండు రోజుల తర్వాత నేను ఇంటికి వచ్చినప్పుడు నాకు చెప్పిన విషయం ఇదే.
సునీల్ సోమవారం చనిపోయాడు అంతకు ముందు శనివారమే నేను అతన్ని . కాల్ పెట్టీ మార్కెట్ లో కలుసుకున్నాను.
“ పాపా” అన్నాడు అతను. నన్ను అతను అలాగే పిలుస్తాడు. నాకు ఇరవై ఏళ్ళు వచ్చినా సరే, అతను నన్ను పాపా అనే పిలుస్తాడు. నాతో మాట్లాడేటప్పుడు మా అమ్మని గురించి ప్రస్తావించాల్సి వస్తే అమ్మా అని అంటాడు కానీ ఆమె ఎదురుగా మాత్రం అలా పిలవడు.
అమ్మకు అతను పండ్లు అమ్మదల్చుకున్నప్పుడు మాత్రం “ పాప కు ఇవంటే ఇష్టం “ అంటాడు. నాకు పండ్లు అమ్మాలనుకున్నప్పుడు “ అమ్మ ఎప్పుడూ ఇవే కొంటుంది “ అంటాడు. అలాంటప్పుడు స్థానికం గా దొరికేవి కాకుండా దిగుమతి చేసుకున్న ఆరెంజ్ పండు నో , ఒక యాపిల్ నో ఈవ్ లా పట్టుకుంటాడు.
ఏమైతేనెం, ఆ శనివారం సునీల్ “ పాపా, కమలాపండ్లు కావాలా?” నన్ను అడిగాడు
“ అమ్మను అడుగుతాను” చెప్పాను నేను. “ అమ్మా!” అమ్మ వైపు తిరుగుతూ “ నీకు కమలాపండ్లు కావాలేమో అడుగుతున్నాడు సునీల్ “ అన్నాను.
అమ్మ కూరగాయల వాడి దగ్గర వున్నదల్లా సునీల్, నేనూ వున్న దగ్గరకు వచ్చింది.
అమ్మ ఎప్పుడూ ఆ కూరగాయల వాడి దగ్గర దోసకాయ, వంకాయ, పాతోలా,తలానా బాటు కొంటూ వుంటుంది.
“ కమలా పండ్లా? వద్దులే. అయినా ఎంతకిస్తున్నావు వాటిని? “ అమ్మకు ఇలా బేరం ఆడటం అంటే ఎంతో ఇష్టం. ఏవైనా సరే తనకు కొనడం ఇష్టం లేదని చెప్పడం, మళ్ళీ దేన్నైనా సరే వాటి ధరను కనుక్కోవడం ఆమెకు ఇష్టమైన పని. ఆ ధరను బట్టి ఆమె తనకు అవి కావాలో వద్దో నిర్ణయించుకుంటుంది. సునీల్ మంచి ధర చెప్పాడు. సంచీలో ఆరు కమలాపండ్లు పెట్టాడు.
“ బొప్పాయి “ అంటూ ఆశగా అమ్మ వంక చూశాడు సునీల్. ఆమె వద్దని తల అడ్డంగా వూపింది. ఆ ఆరు కమలాపండ్లకు డబ్బు చెల్లించటానికి అమ్మ తన పర్స్ బయటకు తీసింది. దానికి ప్రతిస్పందనగా సునీల్ “ పండ్ల రసం కోసం బొప్పాయి “ అన్నాడు సింపుల్ గా.
“ ఎంత?” మా అమ్మ అడిగింది. సునీల్ బొప్పాయి ని కూడా బ్యాగ్ లో పెట్టాడు. మా ఇద్దరి పక్కనే అంత సేపూ నిలబడ్డ సునీల్ నన్ను చూసి నవ్వాడు. నేను కూడా అతన్ని చూసి తిరిగి నవ్వాను. నేనూ, మా అమ్మ ఇద్దరం కారు దగ్గరకు వెళ్ళాము. ఆ రోజు శనివారం. సునీల్ సోమవారం నాడు చనిపోయాడు.
అతను ఆ స్టేజీ కి అంత దగ్గరగా ఏం చేస్తున్నాడు అని నేను ఆలోచిస్తున్నాను ఎవరితోనైనా మాట్లాడటానికి వేదిక మీదకు వెళ్లాడా? అతనికి ఇష్టమైన రాజకీయ నాయకులతో ? లేదా ఎవరైనా రాజకీయ నాయకుడి మీద కంప్లయింట్ చేయడానికా? లేదా తను వోటు వేయాలనుకున్న రాజకీయ నాయకుడి కోసమా?
ఆ బాంబు ప్రేలుడు లో పది మంది చనిపోయారు. పది మంది సాధారణ ప్రజలు. అందులో మాకు పండ్లు అమ్మే సునీల్ ఒకడు. అతనికి భార్య, నాలుగేళ్ళ కొడుకు వున్నారు. సునీల్ కి భార్య, నాలుగేళ్ళ కొడుకు వుండేంత వయస్సు వున్నట్లు నాకనిపించదు. నా కళ్ళకు అతను పంతొమ్మిది ఏళ్ల వాడిలా కనిపిస్తాడు.
డబ్బు సంపాదించేందుకు అనేక అవకాశాలున్న విదేశాలకు అమ్మ తన మొదటి సంతానాన్ని చూసేందుకు వెళ్ళినప్పుడూ సునీల్ కి, నాకూ మధ్య మంచి వొప్పందం కుదిరింది. నేను ఆఫీస్ కి వెళ్ళబోయేముందు, ఉదయం ఎనిమిది గంటలకు సునీల్ వచ్చేవాడు. కారు లో నా బ్యాగ్ పెడుతూ నాకు కావాల్సిన పండ్ల జాబితా అతనికిచ్చేదాన్ని. ఆ జాబితా లో ఆ ఋతువు కి సంబంధించిన పండ్లు అదనంగా చేరేవి. అరటిపండ్లు, కమలాపండ్లు, బొప్పాయి, పైనాపిల్ ఎప్పుడూ కొనే పండ్లు, మామిడిపండ్లూ, మాంగో స్టీన్, సీతాఫలం, అవకాడా, ఉడ్ ఆపిల్, బెల్లి, సవర్ సప్, రంబుతాన్, జామ, ఉసిరి, ద్రాక్ష పండు ఆయా ఋతువు ని బట్టి ఇంటికి వచ్చేవి. మధ్యాహ్నం భోజనం చేసేందుకు నేను ఇంటికి వచ్చినప్పుడు , సునీల్ బాధ్యత గా పండ్లు పట్టుకొని వచ్చేవాడు. అతను ఎంత చెపితే అంత డబ్బు అతనికి ఇచ్చేసేదాన్ని. మూడురోజులకొకసారి అతను మళ్ళీ రావాలన్న నిబంధనతో అతను వెళ్లిపోయేవాడు. మూడు రోజుల తర్వాత అతను తిరిగి వచ్చినప్పుడు పాడైపోయినవి, చేదు గా వున్నవి, సరిగా పండనివి, రుచి గా వుండని పండ్ల గురించి అతనికి చెప్పేదాన్ని. అందుకు ప్రతిఫలంగా అతను అదనంగా ఒక అరటిపండో, మామిడి పండో, కమలాపండో బాగ్ లో పెట్టేవాడు. నేను సునీల్ గురించి మా బంధువులకు, స్నేహితులకు పరిచయం చేయాలని ప్రయత్నించాను. కానీ అదెందుకో ఎక్కువకాలం కొనసాగేది కాదు.
మా అమ్మ తిరిగి వచ్చాక మా ఇంటికి సునీల్ రాకపోకలు ఆగిపోయాయి. మా అమ్మకు ప్రతి రోజూ మార్కెట్ కి వెళ్ళి రావడం ఓ వ్యసనం. అందుకే ఆమె సునీల్ తో “ పాప లాగా బద్దకించను నేను. రోజూ నేనే నీ పండ్ల దుకాణానికి వస్తాను.ఇంటికి రావద్దని “ సునీల్ కి చెప్పేసింది . ఈ వొప్పందం సునీల్ కి ఇష్టమో, కాదో నాకు స్పష్టం గా తెలియదు. మా అమ్మ అతని పండ్లను అతి సునిశితం గా శల్య పరీక్ష చేసి బాగా మంచి పండ్లని ఎంపిక చేస్తుంది.బొప్పాయి పండ్లను , మామిడి పండ్లను ఆమె ఎంతో అనుభవమున్న తన వేళ్ళతో పరీక్షిస్తుంది. గట్టి పిడికిలి తో వుడ్ యాపిల్స్ ని, బెల్లీస్ ని వూపి చూస్తుంది. నిర్దాక్షిణ్యం గా అవకాడా లను పిసుకుతుంది. మా అమ్మ కంటే నేనంటేనే సునీల్ కి ఎక్కువ ఇష్టమని నాకు ఖచ్చితం గా తెలుసు.
బాంబు ప్రేలుడు లో చనిపోయిన సునీల్ కొంచెం సన్నగా , పొట్టిగా వుంటాడు. నల్లటి జుట్టు ను పొట్టిగా కత్తిరించుకొని వుంటాడు. నుదుటి మీద మాత్రం కొంచెం జుట్టు పడుతూ వుంటుంది. అతనెప్పుడూ , ఎప్పుడూ పొడుగ్గా వుండే బ్యాగీ షార్ట్స్, అతని సైజు కంటే పెద్దదైన టీ షర్ట్ వేసుకుంటాడు. దీని వల్ల అతను చిన్నగా, పొట్టిగా, సన్నగా కనిపిస్తాడు.
మా అమ్మ రోజూలాగానే మంగళవారం మార్కెట్ కి వెళ్లింది. మా నాన్న ఎప్పుడూ అంటుంటారు మా అమ్మ కు కిందటి జన్మలో తప్పనిసరిగా మార్కెట్ తో ఏదో అనుబంధం వుండి వుంటుందని. అమ్మ ఫ్లూ తో బాధపడుతున్నా, మంచం మీద నుంచి కష్టంగానైనా సరే లేచి, అంత నీరసం లో కూడా తన శరీరాన్ని లాక్కుంటూ మార్కెట్ కి వెళ్తుంది. కానీ ఆ మార్కెట్ కాంపౌండ్ లోకి అడుగుపెట్టగానే ఏదో అద్భుతం జరిగినట్లు ఒక శక్తివంతమైన ఇంజెక్షన్ తీసుకున్నట్లు ఎంతో ఉత్సాహంతో , ఎంతో శక్తి తో తను రోజూ తిరిగే స్టాల్స్ అన్నింటికి వెళుతుంది. ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం ఒక చిన్న సంచీ వస్తువులతో మాత్రమే వస్తుంది. ఇలా తక్కువ కొనడం వల్లనే ఆమె రోజూ మార్కెట్ కి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడప్పుడూ , ఆమె మార్కెట్ నుంచి ఇంట్లోకి అడుగుపెట్టగానే, ఏదో ఒక వస్తువు మర్చిపోయినట్లు గుర్తుకు వస్తుంది. ఎవరైనా ఆమెను ఆపే లోగానే, ఆమె మళ్ళీ కారులోకి దుమికి కూర్చొని మళ్ళీ మార్కెట్ కి వెడుతుంది. అసలు మార్కెట్ పక్కనే ఇల్లు కొని వుంటే పెట్రోల్ ఖర్చు తగ్గి వుండేదని మా నాన్న అనుకుంటూ వుంటారు. మా అమ్మకు ఇల్లొక ఖైదు లా వుంటుంది. అటూ ఇటూ తిరుగుతోందని ఎవరూ నిందారోపణలు చేయకుండా ఆమె న్యాయబద్ధం గా వెళ్లగలిగిన ఒకే ఒక్క ప్రదేశం మార్కెట్ కి మాత్రమే అనుకుంటాను.
మా అమ్మ మంగళవారం మార్కెట్ కి వెళ్ళినప్పుడు మార్కెట్ లో ఒక పక్క మొత్తం తెల్ల జండాలు వేలాడుతూ వుండటం చూసింది. ఆ మార్కెట్ చాలా పెద్దది. చాలా పురాతనమైంది కూడా. నెలకొకసారి, మార్కెట్ కి సంభందించి ఎవరో ఒకరు చనిపోతుంటారు. తమ ఆత్మీయుల మరణం తో వాళ్ళు కొత్తగా పెట్టిన ఆ స్టాల్ దగ్గరకు వెళ్ళి చూసి తన సంతాపం ప్రకటించి మళ్ళీ మార్కెట్ పనిని కొనసాగిస్తుంది. ఈ సారి మాత్రం ఆమె నేరుగా కూరగాయల దుకాణానికి వెళ్ళటానికి ముందు పండ్ల దుకాణం దగ్గరకు వెళ్ళింది. ఆ దుకాణం ముందు నిల్చున్నప్పుడు తన పక్కకు వచ్చి ఓ మాంత్రికుడి దర్శనం లా సునీల్ వచ్చి నిలబడలేదని ఆమెకు గుర్తొచ్చింది.
“ సునీల్ ఎక్కడ?” అని అతని అసిస్టెంట్ ని ఆమె అడిగింది. అలా ఆమెకు , తమకు రోజూ పండ్లు అమ్మే సునీల్ టౌన్ హాల్ లో జరిగిన బాంబు ప్రేలుడు లో మరనించాడన్న సంగతి తెలిసింది. అతను వెళ్ళిన ఎన్నికల సమావేశం తర్వాత కొల్లనావ పార్లమెంట్ సభ్యుడితో మాట్లాడటానికి వేదిక కు దగ్గరగా వెళ్ళినప్పుడు సూసైడ్ బాంబర్ బాంబును ప్రేల్చగా, ఆ బాంబు ఎవరిని చంపటానికి ఉద్దేశించినదో ఆ ప్రెసిడెంట్ బదులు సునీల్ చనిపోయాడు.
౮౮౮

మూలం: శ్రీలంక రచయిత్రి అమీనా హుస్సేన్
అనువాదం : కల్పనారెంటాల
( ఈ కథ సాక్షి పత్రికలో మే పంతొమ్మిది న ప్రచురితమైమ్ది )

0 వ్యాఖ్యలు:

 
Real Time Web Analytics