తొలి నవల ‘ సుప్త భుజంగాలు ‘ తోనే తనకంటూ ఓ విశిష్ట స్థానాన్ని సాహిత్య లోకం లో సంపాదించుకున్న రచయిత్రి సి. సుజాత కలం నుండి దాదాపు పాతికేళ్ల విరామం తర్వాత వెలువడ్డ మరో నవల “ రాతిపూలు”. రంగుల కల లాంటి సినీ పరిశ్రమకు, ఆధునిక కార్పొరేట్ జీవితానికి దర్పణం ఈ నవల. కార్పొరేట్ సంస్కృతి కాళ్ళ కింద నలిగిపోయిన జీవితాల్లోని సంఘర్షణ ఈ నవలకు ఆయువుపట్టు. కాలక్షేపం కోసం కాకుండా ఈనాటి నగర జీవన సంస్కృతి అనే వూబి లో కూరుకుపోతున్న జీవితాలను గురించి లోతుగా తెలుసుకోవాలనుకునేవారు తప్పక చదవాల్సిన, చదివింపచేసే గుణం వున్న నవల ‘ రాతిపూలు’.
హైదరాబాద్ రణగొణద్వనుల మధ్య పరుగులు పెట్టె ట్రాఫిక్ లో పగలు, రాత్రి మన చుట్టూరా కనిపించే వ్యక్తుల అసలు సిసలు తెరవెనుక జీవితాలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది ఈ నవల. పట్టణం లో అందంగా కనిపించే అబద్ధపు జీవితాలు ప్రాణం లేని, వాసన రాని రాతిపూల లాంటివి.చూడటానికి అందంగా వుండి, సున్నితంగా కనిపిస్తూ ఎప్పటికీ వాడిపోకుండా నిత్య నూతనంగా ఉంటాయి ఈ రాతిపూలు. కానీ జీవం,పరిమళం లేని వొట్టి రాతిపూలు అవి.
నగర జీవితమంటే ఇవాళ అందరికీ కనిపిస్తున్నది వస్తు వ్యామోహమే. కానీ దాని వెనుక విఫలమైన ప్రణయాల్ని, కూలిపోయిన కాపురాల్ని చూపిస్తుంది రచయిత్రి ఈ నవల లో. భవంతుల కోసం భార్యల్ని తాకట్టు పెట్టే రసజ్నలు, వస్త్రాపహరణాలు చేసి దోచుకునే సురేంద్ర లు, తప్పని తెలిసి ఆ తప్పును చేయకుండా నిగ్రహించుకోలేకపోయిన అహల్య లాంటి శమంతల కథ ఇది.
ఈ నవలలోని ప్రధాన స్త్రీ పాత్రలన్నీ మధ్య తరగతి నేపధ్యం నుంచి వచ్చి కెరియర్ నిచ్చెన మెట్లు ఎక్కి పైకి ఎదగాలనుకొని ఆశపడి, ఆ క్రమం లో తమ వ్యక్తిత్వాల్ని, తమ నమ్మకాల్ని, తమ ఆశల్ని, జీవితం పట్ల తమ ప్రేమని పణంగా పెట్టి వొడిపోయిన వాళ్ళే. డబ్బు చుట్టూ అల్లుకున్న సక్సెస్ వూబిలో పడి కూరుకుపోయినవాళ్ళే. నైతికానైతికాల త్రాసు లో తూచి ఈ నవలలోని పాత్రల్ని విశ్లేషించలేము. నగర జీవిత చిత్రణ లో రచయిత్రి కున్న జర్నలిస్ట్ వృత్తి అనుభవం, సామాజిక సమస్యల పట్ల అవగాహన మనకు ఈ నవలలో కనిపిస్తుంది. శమంత, కిన్నెర, జమున లాంటి స్త్రీల మీద జాలో, సానుభూతో, లెదంటే అసహ్యమో కాకుండా ఓ మనిషి లో వుండే మామూలు బలహీనతలతో వాళ్ళను అర్ధం చేసుకోవాలనిపిస్తుంది ఈ నవల చదివాక.
ఒక సారి చదవటం మొదలుపెట్టాక ఆపకుండా చదివించే శైలితో సాగుతుంది. ఈ నవల చదవటం పూర్తి చేశాక, ఒక అద్దం లో నగరాన్ని, మన జీవితాల్నీ కలిపి ఎదురుగా అక్షర కాన్వాస్ మీద చూస్తున్నట్లు అనిపిస్తుంది .
కార్పొరేట్ జీవన శైలిలో ఒక్కోసారి కుటుంబం, మానవ సంబంధాలు, కట్టుబాటు అన్నీ ఎట్లా దూదిపింజెల్లా ఎగిరిపొతాయో. కోరుకున్న జీవితం కోసం శరీరం తో, మనసు తో వ్యాపారం చేయడం ఒక్కోసారి ఎలా అనివార్యమవుతుందో విశ్లేషిస్తుంది రచయిత్రి ఈ నవల లో. ఒక మనిషి ఉనికిమొత్తం డబ్బే అయినప్పుడు లెక్కలు మారిపోతాయి. జీవితాలు మారిపోతాయి. అనుబంధాలన్నీ మారిపోతాయి. డబ్బుతో వచ్చే సౌఖ్యాలతో హాయిగా వుండాలనుకుంటాం. ఆ దారిలో నడుస్తాం. గమ్యం చేరాక నిజంగానే ఆనందం గా వుంటామనుకుంటాము. కానీ అది నిజం కాకపోవచ్చు. ఆ దారి లో మనం ఎన్నింటినో, ఎందరినో కోల్పోతాం . మనం కోరుకున్న, ఆశపడ్డ డబ్బులు మనకు అందాక మన దగ్గర చూసుకుంటే శాంతి వుండదు. ప్రశాంతత మిగలదు. డబ్బు తెచ్చే సౌఖ్యాలు, ఎలాంటి సంతోషాన్ని మిగల్చవు. నడిచొచ్చిన దారి, మనం పోగొట్టుకున్నవి అప్పుడు స్పష్టం గా కనిపిస్తాయి. కానీ జీవితాన్ని తిరిగి మన చేతుల్లోకి తీసుకోలేము.కేవలం పశ్చాత్తాపపడటమో,బాధపడటమో తప్ప.
ఈ నవలలో కథానాయిక శమంత అందుకే తను చేసిన వాటిని తప్పొప్పులతో పోల్చుకోదు. వాటిని కేవలం పనులుగా చూస్తుంది.ఎందుకంటే ఆమె తన శరీరంతో, మనసుతో చేసిన దాన్ని ఒక వ్యాపారంగానే భావించింది. జీవితాన్ని వ్యాపారం గా మలుచుకోవటం లో ఒక రాతిపువ్వు లాగా మారిన శమంత మళ్ళీ కావాలనుకుంటే మనిషి గా మారగలదా? ఆ ప్రయత్నం అటు రసజ్న, ఇటు శమంత ఇద్దరూ మొదలుపెట్టాలి. అది కష్టమైనా అసాధ్యం కాదు. అలా జీవితం పట్ల తిరిగి ఆ ప్రేమ ను, ఆ నమ్మకాన్ని ఈ నవల ద్వారా రచయిత్రి సి. సుజాత అందిస్తుంది.
రాతి పూలు (నవల)
నవ్య వీక్లీ లో ధారావాహిక ప్రచురణ
ప్రతులకు:అన్నీ పుస్తకాల షాప్ లు
రచయిత్రి ఫోన్ నెం: 9553586086
ఈమైల్ : sujata.c@hmtv.in
(ఈ చిన్న పరిచయం వ్యాసం నుంచి కొంత భాగం జూలై 4 ఆదివారం ఆంధ్రజ్యోతి లో ప్రచురితమైంది)
కల్పనారెంటాల
3 వ్యాఖ్యలు:
అవునండీ కల్పనా, నాకు భలే నచ్చింది ఈ పుస్తకం! అసలు గుక్క తిప్పుకోనివ్వకుండా చదివిస్తుంది.శమంత పాత్ర చిత్రణ అద్భుతం! ఆమెలోని సంఘరషణ, బయటికొచ్చినపుడు దాన్నికి ముసుగేసి ఉంచడం ఇవన్నీ ఎంత బాగా చిత్రించారో చెప్పలేను.ఇలాంటివాళ్ళు మన చుట్టూ ఎంతమంది ఇలా డబ్బు కోరల్లో నలిగి అనుబంధాలకు అతీతులైపోతున్నారో !
నిజంగా రసజ్ఞ లాంటి మొగుళ్ళు ఉంటారంటారా?
కలివిడిగా మాట్లాడుతూ సాదా సీదాగా కనిపించే సుజాత గారు ఎంతటి పరిశీలకులో అనిపించింది.
నవలంతా పూర్తయ్యాక ఒక పెద్ద రణగొణ ధ్వనులు నిండిన వీధిలోంచి బయటపడ్డట్లు మెదడు ఖాళీగా ఉండిపోయి ఆ తర్వాత క్రమేణా నవల గురించిన ఆలోచనలు ఒక్కొక్కటీ పూడుకోవడం మొదలుపెట్టాయి.
"నెరుసు" కథా సంకలనం గురించి కూడా రాయకూడదూ!
సుజాత,
రసజ్న లాంటి భర్తలు ,శమంత లాంటి వారూ వున్నారు అందుకేగా ఈ నవల అంత బాగా వచ్చింది. కొన్ని విషయాలు పైకి బాహాటం గా కనిపించవు. రచయితలు పట్టుకొని చూపించినప్పుడు వాటి అసలు స్వరూపం మనకు అర్ధమవుతుంది. ఒక్క నెరుసు ఏమిటి? తన రెప్పచాటు ఉప్పెన కథాసంకలనం లోని కధలైనా, సుజాత కథల సంపుటి పేరుతో వచ్చిన పుస్తకం లోని కథలు అన్నీ నాకు బాగా ఇష్టమైన కథలు.తన కథల మీద రాసిన పాత వ్యాసం ఒకటి వుంది. అది పెడతాను. మీ కాలాతీత వ్యక్తుల మీద వ్యాసం చదవలేదు. నేను దాని గురించి రాశాక చదువుతాను.
కల్పన
బాగుంది కల్పనా, పరిచయం. ఈవిడపేరు ఈమధ్యనే చూశాను కానీ చాలాకాలంగా రాస్తున్నారని తెలీదు.
Post a Comment