నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Thursday, August 05, 2010

గిరిజనుల చీకటి బతుకుల్లో దీపం మహాశ్వేతా దేవి!


మారుమూల అడవుల్లో వొదిగి వుండే అమాయక జనం-గిరిజనం. నది వొడ్డుని ఆనుకుని, ఏ కొండ కొమ్ము నో కాసింత నీడ వెతుక్కొని , ప్రకృతి ప్రసాదించిన ఏ కొద్దిపాటి ఆహార వనరులనో నమ్ముకొని బతికే గిరిజనానికి బయటి లోకపు పోకడలేమీ తెలియవు. బయటి లోకపు రోడ్లు, వంతెనలు, ఇతరేతర సౌకర్యాలు ఏవీ వాళ్ళ దరి చేరవు.కానీ పట్టేడు నేల కనిపిస్తే చాలు , కబళీంచి కాసులుచేసుకోవాలనుకునే దురాశ జీవులు ఇప్పుడు కొండల్ని కరిగిస్తున్నారు. చెట్లని నరికెస్తున్నారు. అడవుల్లో దొరికే ప్రతి సంపదనీ కొల్లగొట్టి, లాభాలతో తమ సంపదల్ని పెంచుకుంటున్నారు.గిరిజనం జన్మ హక్కయిన భూముల్ని ఆక్రమించి , ఆ భూమ్మీద బతికే గిరిజనాన్ని వెళ్ళగోడ్తున్నారు. ఎదురు తిరిగిన వాళ్ళని, దోపిడీ దొంగలుగా ముద్ర వేస్తున్నారు. లెక్కలు,పట్టాలు, దస్తావేజులు, చట్టాలు ఏమీ తెలియని అమాయక ఆదివాసులు నమ్ముకున్న భూమిని వదులుకొని, చెట్టుకొకరు, పుట్టకొకరుగా చెదిరిపోతున్నారు. వాళ్ళతో పాటు వాళ్ళ ఇళ్ళూ వాకిళ్ళే కాదు, ప్రకృతి అందాలన్నీ చెదిరిపోతున్నాయి. వాళ్ళ ఆటలూ పాటలతో ప్రతిద్వణించాల్సిన అడవులు దెయ్యాల గూళ్ళవుతున్నాయి.అలా చెదిరిపోతున్నఆదివాసులకు ఏ ప్రభుత్వామూ అండగానిలవడం లేదు. వాళ్ళ హక్కులేమిటో వాళ్లకే తెలియక అజ్నానమ్ లో , ఆవిద్య లో , అంధకారం లో కూరుకుపోతున్న ఆదివాసీ జన సమూహాల్లోకి, వాళ్ళ చీకటి బతుకుల్లో ఒక దీపం లా నడిచి వచ్చింది మహాశ్వేతా దేవి.


ఆదివాసులంటే భయంకరమైన మనుష్యులనీ, వాళ్ళకు సభ్యతా సంస్కృతి లేవన్న అపోహల్ని ఆమె బద్దలు కొట్టింది. కొండ ప్రాంతాలంటే దొంగలు, దోపిడీ ముఠాలు నెలవుండే చోటన్న కట్టుకథల్నీ ఆమె చెదరగొట్టింది. అక్కడి మనుష్యులు రాక్షసులైన అసురతేగలకి చెందిన వాళ్ళన్న ప్రచారాల్నీ ఆమె పట్టించుకోలేదు. ఆత్మ స్థైర్యాన్నే దివ్వెగా వెలిగించుకొని, ఆమె అడవుల్లోకీ వెళ్లింది. నగర జీవితం లో పుట్టి పెరిగిన మహాశ్వేతా దేవి కీకారణ్యాల గుండెల్లో ఏ మారుమూలనో దాక్కుని బతుకుతున్న అడివి బిడ్డల ఆక్రందనల్నీ వింటూ వాళ్ళ గుండెల్లోకి అడుగుపెట్టింది. భయం, ఆకలి, దారిద్ర్యం, అమాయకత్వం ....వీటన్నింటికి పర్యాయ పదాలుగా బతుకుతున్న ఆదివాసులకి కొండంత అండగా నిలబడింది. ఇప్పుడు ఆమె అడివి బిడ్డలకుఅమ్మ. తరతరాల దోసిళ్లకు ఆనవాలుగా మిగిలిన గిరిజనానికి కనుపాప. ఒకవైపు ఆయుధాలతో కొండ బతుకుల్నీ తీర్చిదిద్దే నక్సల్బరీ పోరాటం సాగుతున్న దశ లోనే ఒకే ఒక్క కలం బలంతో తానే ఒక సైన్యం గా పోరాడి గెలిచిన యోధ మహా శ్వేత దేవి.


ఇప్పటికీ ఎనభై ఏండ్ల క్రితం ఢాకా లోని ఒక సాహిత్య సంప్రదాయ కుటుంబం లో పుట్టిన మహా శ్వేతా దేవి చిన్న వయస్సులోనే ‘ గణ నాట్య ‘ అనే ఒక ధియేటర్ బృందం తో కలిసి పని చేసింది. 1930,40 ల్లో ‘ గణ నాట్య ‘ అంటే సామాజిక రాజకీయ విప్లవ సంకేతం. ఆనాడు బెంగాల్ లోని పల్లె సీమల్లో ‘ గణ నాట్య ‘ గజ్జెల మోత వినిపించని ఊరు లేదు. ‘ గణ నాట్య ‘ అడుగు పెట్టిన చోట అజ్నానానికి నిలవ నీడ లేదు. కలకత్తా విశ్వ విద్యాలయం లో ఆంగ్ల సాహిత్యం లో ఎమ్మే చదువుతున్న కాలం లో కూడా మహాశ్వేత ‘ గణ నాట్య ‘ ప్రభావం తో ఎప్పుడూ ఏదో ఒక సామాజిక రంగం లో తలమునకలుగా వుండేది. అతి కొద్ది కాలం లోనే ఆమె అధ్యాపకురాలిగా , పత్రికా రచయితగా ఉద్యోగ జీవితం లోకి అడుగిడింది.

మన దేశాన్ని చేజిక్కించుకొని దుష్ట పాలన సాగిస్తున్న తెల్లవాళ్లని గజ గజ వణికించిన వీరనారి ఝాన్సీ లక్ష్మీ బాయి జీవితాన్ని ఆధారం గా తీసుకొని చేసిన ప్రయోగాత్మక రచన “ ఝాన్సీర్ రాణి ‘ తో ఆమె సాహిత్య జీవితం 1956 లో మొదలైంది.


కేవలం గ్రంధాలయాలు శోధించి, చరిత్ర పుస్తకాల ఆధారాలతోనే ఆమె ఈ జీవిత చరిత్ర రాయలేదు. ఎక్కడైతే ఝాన్సీ లక్ష్మీబాయి వీరోచితంగా పోరాడి నేలకొరిగిందో, ఆ నేల మీద జీవిస్తున్న సామాన్య జన హృదయాలో ఝాన్సీ లక్ష్మీ బాయి ఎలా శాశ్వతం గా నిలిచి పోయిందో, ఇప్పటికీ ఆ నేల మీద, ఆ ప్రజానీకం లో ఆ వీరనారి జ్నాపకాలు ఏ విధంగా సజీవం గా వున్నాయో రికార్డు చేయడం ఈ రచనలో మహా శ్వేత చేసిన ప్రయోగం. నిరుద్యోగ రక్కసి ఒక వైపు పట్టి పీడిస్తున్నా, కుటుంబం లో భార్య భర్తలిద్దరికీ ఉద్యోగం కూడా లేని దుర్భర స్థితి వున్నప్పటికీ నాలుగు వందల రూపాయలు అప్పు చేసి బుందేల్ ఖాండ్ కి ప్రయాణమైంది మహా శ్వేత. బుందేల్ ఖాండ్ చుట్టూరా ఎన్నో ఉర్లు తిరిగింది. మామూలు జనం తో ముఖ్యం గా స్త్రీలతో కలిసి మాట్లాడింది. తరాలుగా చెప్పుకునే కథల్ని రికార్డ్ చేసింది. ఆ పరిశోధన ఫలితమే ఆమె మొదటి రచన ‘ ఝాన్సీర్ రాణి’.

ఆ తరువాత నాలుగు దశాబ్దాల పైబడిన సాహిత్య జీవితం లో ఆమె ఇరవై సంపుటాల కథలు, వందకి పైగా నవలలు, వందల కొద్దీ వ్యాసాలూ, ఉపన్యాసాలూ ఆమె బహుముఖ ప్రతిభా కి నిలువుటద్దాలు. భారత దేశం లోనే అత్యున్నతమైన, ప్రతిష్టాత్మకమైన జ్నానపీఠ పురస్కారాన్ని ఆమె గెలుచుకుంది. ‘ ఆసియా నోబెల్ ‘
గా పేరు పొందిన రామన్ మెగాసెసే అవార్డ్ ఆమెకు దక్కింది. ఒక తల్లి ఆత్మ ఘోష ని అక్షరబద్ధం చేసిన ‘ హజార్ చౌరాసీ మా ‘నవల ప్రసిద్ధ దర్శకుడు గోవింద్ నిహలానీ దర్శకత్వం లో చిత్రం గా వెలువడి , ఆమె కీర్తి ని అంతర్జాతీయ పటం మీద నిలబెట్టింది.


1965 లో పలమావు అనే ఒక గిరిజన గూడేన్ని చూసిన తర్వాత మహాశ్వేత లో చాలా మార్పు వచ్చింది. “ ఈ ఊరు గిరిజన భారతానికి అద్దం” అని ఆమె అనుకుంది. ఆ ఊళ్ళోని భూమి లేని నిరుపేద గిరిజనుల దారుణ జీవన స్థితిగతులూ, భూమి వున్న ధన స్వాముల అరాచకాలూ ఆమె ఆలోచనల్ని మేల్కొలిపాయి. నిజమైన భూమి బిడ్డలకీ, భూమి ని బలవంతాన స్వాధీనం చేసుకొని గిరిజనుల నోటి మట్టికొట్టి విలాసం గా బతుకుతున్న భూస్వాములకీ మధ్య జీవితం లో ఇన్ని వ్యత్యాసలున్నాయా అని ఆమె ఆశ్చర్యపోయింది. అప్పు పేరిట గిరిజనుల మీద పెత్తనం సాగిస్తున్న భూస్వాముల దాష్టీకాన్ని ఎండ కట్టాలని ఆనాడే ఆమె ప్రతిజ్న చేసింది. ఇంక కాలినడకన గిరిజన గూడేలన్నీ తిరగడం మొదలుపెట్టింది.


తన జీవితాన్ని అక్షరాలకే పరిమితం చేయలేదు మహా శ్వేత. రచయిత అంటే తన గదిలో తాను భద్రం గా కూర్చుని రాసేవారు మాత్రమే కాదని, తాను ఎవరికోసమైతే రాస్తున్నారో ఆ పీడితుల నిజ జీవితం లో, వాళ్ళ కష్ట సుఖాల్లో భాగం పంచుకోవాలన్న దృక్పథం మహాశ్వేత దేవిది.


ఒక వైపు దేశం 21 వ శతాబ్దం లోకి ఉరుకులు పరుగులు తీస్తోందని గొప్పలు చెప్పుకుంటున్న దశ లోనే మరో వైపు అభివృద్ధి ఫలాలు ఏవీ దక్కక ఆదివాసులు బాధిత, పీడిత ప్రేక్షక జన సమూహాలుగా మిగిలిపోయే పరిస్థితి పోవాలని, వాళ్ళ అమాయక జీవితాల్లో చైతన్యం నింపాలని కంకణం కట్టుకుంది. అడవి బిడ్డల హక్కుల సాధన కోసం నడుం బిగించింది. వివిధ అవార్డుల నుంచి తనకు అందిన వేల కొద్దీ ధనాన్ని గిరిజనుల కోసమే వెచ్చించింది. ఆమె కేవలం రచయిత్రి గా కాకుండా ఒక క్రియాశీల కార్యకర్త గా భారతీయ గిరిజన జీవిత చరిత్ర పైన చెక్కు చెదరని ముద్ర వేసింది.
గిరిజనల బతుకుల్లో వెలుగులు నింపే దశ లో ఆమె మొదటి మెట్టు: వాళ్ళ ఆర్ధిక స్థాయి ని పెంచడం, జీవన స్థితి ని మెరుగు పరచడం. ఇప్పటికే గిరిజనులకు అందుబాటు లో వున్న వ్యవసాయం, పాడి సంపాదల్ని ఆధారం గా తీసుకొని , వాటిని ఇంకా ఎలా మెరుగుపరచాలో శాస్త్రీయం గా శిక్షణ ఇవ్వడం మహాశ్వేత సాధించిన తొలి విజయం. అదే సమయం లో వాళ్ళను అక్షరాస్యులుగా చేయడం. అందుబాటు లో వున్న వనరులు, అక్షరాస్యత రెండూ గిరిజనుల బతుకుల్ని మార్చాయంటుంది మహా శ్వేత. ఇంతకు ముందు ఒకే ఒక్క పంట వేసి, భూమిని పోడు తో పాడు చేసే స్థితి నుంచి ఇప్పుడు అదే భూమి లో మూడు పంటలు వేసే స్థితి కి గిరిజనులు వెళ్లారు. దాంతో గిరిజనులు ఆర్ధిక స్థితి మారడమే కాదు, జీవన ప్రమాణాలు పెరగడమే కాదు, వాళ్ళలో కొండంత ఆత్మ విశ్వాసం మేల్కోంది. ఇంతకు ముందు పూట కింత సరిపోయేటంత మాత్రమే పండించిన గిరిజనం ఇప్పుడు శక్తి సామర్ధ్యాలున్న రైతులుగా మారి, ధాన్యం తో పాటు బంగాళా దుంపలు, వేరుశనగల్లాంటివి కూడా పండిస్తున్నారు. కాసింత నమ్మకమిస్తే చాలు, కొండల్ని పిండి చేస్తాం అనే గొప్ప జీవన సూత్రం ఇప్పుడు వాళ్ళను ముందుకు నడిపిస్తోంది.


ఇక గిరిజన మహిళల జీవితాల్లో మహాశ్వేత తీసుకు వచ్చిన వెలుగులు లెక్కలేనన్నీ. కుటుంబం, పిల్లల పోషణ, ఆరోగ్య పరిరక్షణ లాంటి విషయాల్లో ఇప్పుడు ఆ గిరిజన మహిళలు సభ్య సమాజానికే పాఠాలు చెప్పగలరు. 500 నుంచి 600 గిరిజన కుటుంబాలు ఇప్పుడు తమ చేతి వృత్తుల్ని, హస్త కళా నైపుణ్యాన్ని వినియోగం లోకి తీసుకువస్తున్నాయి. వాళ్ళ చేతుల్లోంచి తయారైన అద్భుతమైన , కళాత్మకమైన వస్తువులు ఇప్పుడు ప్రపంచ మార్కెట్ లోకి వెళ్తున్నాయి. అడవిలో దొరికే చిన్న వస్తువునైనా అద్భుతమైన కళగా మలచగలమన్న లక్ష్యం తో వాళ్ళు చేస్తున్న ప్రయోగాలు అనేకం. ప్రపంచీకరణ పుణ్యమా అని ఛిన్నాభిన్నామయిపోతున్న స్థానిక కళా రూపాలకు పునర్జన్మనిస్తున్నారు ఈ గిరిజన మహిళలు.


కొన్ని తరాలుగా నేరస్తులుగా ముద్ర వేయబడి, నేరమే జీవితం గా మారిన గిరిజన తెగల మధ్య పనిచేయడం మహా శ్వేత ఇటీవలి గొప్ప విజయం. సమాజం, అధికార వ్యవస్థ చెక్కిన వికృత నేర శిల్పాలుగా మారిన దాదాపు రెండున్నర కోట్ల మందిని నేర కబంధ హస్తాల నుంచి విముక్తం చేయాలన్నది మహా శ్వేత శపథం. విషాదం ఏమిటంటే పురిలియా లోని ఖేరియా శబర అనే తెగకు చెందిన వీళ్లని గిరిజనుల్లోని మిగిలిన తెగలవారు కూడా నేరస్తులు గానే పరిగణించే ఈ తెగను అక్కున చేర్చుకుని, వారి జీవితాల్నీ మార్చడానికి, వాళ్ళ పట్ల సమాజ దృక్పథం లో మార్పు తీసుకురావడానికి మహాశ్వేత పోరాడుతోంది. దారుణం ఏమిటంటే , పోలీసు వ్యవస్థ వీళ్లను ఇంకా నేరస్తులు గానే మారుస్తోంది.
9 ఏళ్ల క్రితం శబర తెగకు చెందిన బుధాన్ అనే ఒక గిరిజనుడ్ని పోలీసులే కొట్టి చంపిన ఉదంతం తో ఈ పోరాటానికి నాంది పలికింది మహా శ్వేత. బుధాన్ ని కొట్టి చంపిన పోలీసుల్ని కలకత్తా హై కోర్ట్ కి ఈడ్చి న్యాయపోరాటం మొదలెట్టింది మహాశ్వేత . ఈ పోరాటం లో శబర తెగ విజయం సాధించింది. ఇన్నేళ్ళ చరిత్ర లో మొట్ట మొదటిసారిగా ఒక శబర గిరిజనుడు కోర్టులో నిలదొక్కుకొని విజయం సాధించాడు.


మహాశ్వేత పోరాటంతో అనేక సంఘాల కళ్ళు తెరుచుకున్నాయి. తరతరాలుగా నేర జీవితం వైపు నెత్తివేయబడిన శబర తెగల హక్కుల పోరాట సంఘం ఏర్పడింది. అప్పటి నుంచీ శబర గిరిజనుల సంక్షేమానికి మహాశ్వేత అంకితమైంది. దేశం నలుమూలలా తిరిగి శబర గిరిజనుల వివరాలు సేకరించింది. వాళ్ళ కష్టాల్ని రికార్డ్ చేసింది. “ డీ నోటిఫైడ్ ట్రైబ్స్ అండ్ కమ్యూనిటీస్ రైట్ యాక్షన్ గ్రూప్ “ అనే ఒక సంష్ట ఆమె ఆలోచనలకు అక్షర రూపం. దేశం లోని రెండు వందలకు పైగా గిరిజన తెగల్ని ఈ సంస్థ పరిధి లోకి తీసుకువచ్చింది.


2006 లో ఫ్రాంక్ఫర్డ్ లో జరిగిన ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ పుస్తక మహోత్సవానికి మహాశ్వేత దేవి విశిష్ట అతిధిగా హాజరైంది. ఇది భారతీయ సాహిత్యానికి, భారత దేశం లో పీడిత ఉద్యమాలకీ గర్వ కారణం. ఆ ఉత్సవంలో మహాశ్వేత కీలకోపన్యాసానికి కరగని గుండే లేదు. ఆమె మాట్లాడుతున్నంత సేపు ఆ ఉత్సవానికి వచ్చిన వందల కొద్దీ రచయితల కళ్ళు చెమరుస్తూనే వున్నాయి. భారతీయ సంస్కృతి అంటే అనేక కులాల మతాల హరివిల్లు అనీ, దురదృష్టవశాత్తూ అది ఇప్పుడు ఒకే ఒక్క నెత్తుటి రంగుని పులుముకుందని ఆమె బాధ పాడింది. దుష్ట శక్తుల పన్నాగం లో భిన్న సంస్కృతుల నాగరికత అణిగిపోయిందనీ ఆవేదన పడింది.


( 2007 లో ఈటీవీ -2 మార్గదర్శి కార్యక్రమం కోసం రాసి ఇచ్చిన స్క్రిప్ట్)

8 వ్యాఖ్యలు:

భాను said...

చాల చక్కగా మంచి విశ్లేషణతో ఆ మహా రచయిత్రి గురించి తెలియచేసారు

Anonymous said...

avunu nijame-----

gajula said...

chaduvutuntene kallalo neellu thirugutunnai.nijangaa oka nibaddato vunde vaallu ela vundalo mahaatalli mahaswetadevini chusi nerchukovali.mahaswetadevigaari gurinchi entha raasina takkuve avutundi.thanq u madam.

Satyavati said...

హాయ్ కల్పన
ఎలా ఉన్నావ్?నీ బ్లాగ్ చూస్తున్నా.చదువుతున్నా.
మహశ్వేత వ్యాసం భుమికలో వెయ్యనా.
నీకు అభ్యంతరముందా?
ఈటీవి వాళ్ళకు అభ్యంతరముంటుందా?
మహాశ్వేత గురించి చదివితే ప్రాణం లేచివచ్చినట్టు ఉంటుంది.నీ వ్యాసాన్ని అందరి చేత చదివించాలని నా కోరిక.
వ్యాసం చాలా బావుంది.

Kalpana Rentala said...

@స్పందించిన వారికి ధన్యవాదాలు. నేను మహాశ్వేత దేవి కథల మీద రాసిన వ్యాసం నేను పోగొట్టుకున్న నా రచనల్లో వుంది. అది కూడా పెట్టి వుంటే మహాశ్వేత దేవి గురించి సమగ్ర వ్యాసం అయి వుండేది. మరో సారి వీలు చూసుకొని ఆమె సాహిత్యం గురించి రాస్తాను.

@సత్యా --ఎలా వున్నావు? చాలా కాలమైంది. తప్పకుండా భూమిక లో పెట్టడానికి నాకైతే అభ్యంతరం లేదు. ఈటీవీ వాళ్ళకు అభ్యంతరం వుంటుందంటావా? కింద వల్ల సౌజన్యం తో అని ఇస్తాము కదా...మరి నువ్వు అక్కడే వుంటావు కాబట్టి ఆ విషయం చూసుకో.

భావన said...

చాలా బాగా పరిచయం చేసేవు కల్పన ఒక మహా వ్యక్తి జీవితం గురించి. ఆమె ఫ్రాంక్ ఫర్డ్ లో చెప్పిన స్పీచ్ దొరుకుతుందేమో చూస్తున్నా. నీకు తెలిస్తే లింక్ ఇవ్వు. అంతరించ బడి, వివక్షత కు గురి కాబడుతున్న ఆ తెగల కు ప్రతినిధి కావటం నిజంగా అధ్బుతం. చాలా మంచి పోస్ట్.

Kalpana Rentala said...

భావనా, మొత్తం ఆమె స్పీచ్ ఆన్ లైన్ లో నుండి నే అప్పుడు తీసుకున్నాను. అందులో నుండి నేను కొన్ని మాటలు కోట్ చేశాను. వెతికి లింక్ పంపిస్తాను.

Anonymous said...

తన జీవితాన్ని అక్షరాలకే పరిమితం చేయలేదు మహా శ్వేత. రచయిత అంటే తన గదిలో తాను భద్రం గా కూర్చుని రాసేవారు మాత్రమే కాదని, తాను ఎవరికోసమైతే రాస్తున్నారో ఆ పీడితుల నిజ జీవితం లో, వాళ్ళ కష్ట సుఖాల్లో భాగం పంచుకోవాలన్న దృక్పథం మహాశ్వేత దేవిది...చాలా మంచి పోస్ట్.

 
Real Time Web Analytics