అఫ్సర్ నా నోరు మూయించారని నేను బ్లాగుముఖంగా వొప్పుకునేటప్పటికి ఎంత మంది పురుషులు కళ్ళు, యాంటీ స్త్రీవాదుల కళ్ళు చల్లబడ్డాయో.....నాకు తెలుస్తూనే వుంది...
అఫ్సర్ నాకు చెప్పిన విషయ కథాక్రమంబెట్టిదనిన....
ఇంక హాస్యం గా రాయటం మన వల్ల కాదు బాబు....నా ఒరిజినల్ స్టయిల్ లోకి వచ్చేస్తున్నాను....
శారద నటరాజన్, రావూరి భరద్వాజ, ఆలూరి భుజంగరావు ముగ్గురూ తెనాలిలో వుండగా మంచి మిత్రులు..ఒకే చోట కలిసి బతికారు. స్నేహాన్ని, ప్రేమను, కష్టాల్ని కన్నీళ్ళను కలిసి పంచుకున్న ముగ్గురు ప్రాణ స్నేహితులు. శారద నటరాజన్ హోటల్ లో సర్వర్ గా పనిచేసిన సమయం లో రావూరి భరద్వాజ గారు ఏవో చిన్న చిన్న కూలీ పనులు చేసుకొని బతికారట. సరే, ఇక ఆలూరి భుజంగరావు గారి వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా మనకు వివరాలు తెలియదు కానీ ఆయన ది కూడా దాదాపు ఇదే పరిస్థితి. ఆయన కొన్ని రచనలు అచ్చం చలం లాగా రాశారట. మరీ ముఖ్యంగా డబ్బు కోసం రాసిన శృంగార/ డిటెక్టివు రచనల్లో చలం శైలిని బాగా అనుసరించరే వారట.
ఇక శారద కథ “స్వార్థ పరుడు” విషయానికి వస్తే, ఆ కథ వెనక కథ ఏమిటో మనకి కచ్చితంగా తెలిసే అవకాశం లేదు.
ముగ్గురూ కలిసి మెలిసి వుంటున్న ఆ కాలంలో సాహిత్య చర్చలు చేసేటప్పుడు కొన్ని రకాల ఇతివృత్తాల్ని అనుకొని వాటి మీద రచనలు చేయాలని అనుకొనివుండొచ్చు. అంతే తప్ప రావూరి భరద్వాజ గారికి శారద రచనల్ని అనుసరణ చేయాల్సిన అవసరం వుంటుందనుకోనని అఫ్సర్ అంటాడు. పైగా, వాళ్ళ మధ్య వున్న స్నేహబలం కూడా గట్టిదే.
శారద సాహిత్యాన్ని 2002 లో తెనాలి లో శారద సాహిత్య వేదిక వాళ్ళు ప్రచురించి ఆవిష్కరణ సభ చేసినప్పుడు రావూరి భరద్వాజ ఆ సభలో ప్రసంగించి అనేక ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారట. ఆలూరి భుజంగరావు గారు శారద జీవితం గురించి " సాహిత్య బాటసారి శారద" పేరుతో ఒక పుస్తకమే ప్రచురించారు. ఈ పుస్తకం తనకి నచ్చిన పుస్తకాల్లో వొకటి అంటాడు అఫ్సర్. రచయితల మధ్య స్నేహాలు కనుమరుగయిపోతున్న ఈ కాలంలో ఆ పుస్తకం ప్రతి వొక్కరూ చదవదగిందని అంటాడు.
ఇంత చెప్పాక...ఇక నోరు తెరిచి మాట్లాడటానికి ఏముంటుంది? అసలైనా డ్రైవింగ్ చేసేటప్పుడు సాహిత్య చర్చలేమిటి? అంటూ సన్నగా సన్నాయి నొక్కులు నొక్కుతూ తల పక్కకు తిప్పేసుకున్నాను.
నా గ్రహచారం బాగలేదని తెలుసు కానీ ఇంత అడ్డంగా అఫ్సర్ కి దొరికిపోతాననుకోలేదు..
సరే, ఈ విషయం గురించి నేరుగా రావూరి భరద్వాజ గారినే అడిగి ఆయన ఏం చెప్తారో తెలుసుకుందామనుకున్నాను కానీ పాపం ఆయనకు వొంట్లో బాగుండక ఆస్పత్రి లో వున్నట్లు తెలిసింది. నిజానికి ఆయన ఆరోగ్యం బాగుంది వుంటే, ఈ వారం టెంపుల్ టెక్సాస్ లోనూ, వచ్చే నెల ఇండియానాపాలిస్ లోనూ జరగనున్న సాహిత్య సభలకి రావాల్సింది.
ఎన్నో మంచి మంచి అనువాదాలు చేసి చివరి రోజుల వరకూ సాహిత్యపరం గా ఎంతో యాక్టివ్ గా వున్న ఆలూరి భుజంగరావు గారు రెండేళ్ళ క్రితమే మరణించారు...ఎవరికైనా భుజంగరావు గారి " సాహిత్య బాటసారి శారద" పుస్తకం దొరికితే మనకు శారద జీవితం గురించి , సాహిత్యం గురించి మరీన్ని వివరాలు తెలిసే అవకాశం వుంది.
చివరగా నేను చెప్పబోయేదేమిటంటే....ఇంతకు ముందు పెట్టిన డిమాండ్ నే మళ్ళీ పెట్టడం....
అఫ్సర్ బుర్రలో చాలా సాహిత్య విశేషాలున్నాయి. ఇలా ఏదో సందర్భం వచ్చినప్పుడు నాకు చెప్తూనే వుంటారు గానీ వాటిని అక్షరబద్ధం చేయమంటే బద్దకిస్తూ వుంటారు.
చాలా సంవత్సరాలు ఆంధ్ర జ్యోతి తదితర సాహిత్య పేజీలు, ఆదివారం సంచికల నిర్వాహకులుగా వుండడమే కాక, చాసో నించి ఈ తరం రచయితల దాకా కనీసం మూడు తరాల సాహిత్య వేత్తలతో తనకి వున్న సన్నిహిత పరిచయాలు ఎంతో విలువయినవి. అలాగే, ఎన్నో వాద వివాదాలకి ప్రత్యక్ష సాక్షి కూడా. వాటి గురించి విలువైన సమాచారాన్ని తన బ్లాగు ద్వారానైనా మనందరికి తెలియచేస్తే బావుంటుంది కదా....
ఈ పోస్ట్ రాయడానికి ప్రధాన కారణం కొన్ని సార్లు కొన్ని విషయాల్లో పైకి కనిపించేది చూసి అదే నిజమని మనం పొరపాటు పడతాం. భరద్వాజ గారిది అనుసరణేమో అని నేను పొరపాటు పడ్డాను అని వొప్పుకోవటమే ఈ టపా ఉద్దేశం...
శారద రచనల మీద సమగ్ర వ్యాసం రాయటం, ఆయన కథ ను చర్చకు పెట్టడం ద్వారా ఈ చర్చకు మూల కారణమైన మాలతి గారికి కృతజ్నతలు...
5 వ్యాఖ్యలు:
బాగుంది...ఈ మధ్యే ఎక్కడో సరిగ్గా గుర్తుకు రావట్లేదు ....శారద గారి గురించి చదివినట్లు గుర్తు
కల్పనా, మంచి విషయాలు బయటికి వచ్చేయి. సంతోషం. నిజానికి ఇలాటి "సాహిత్య చరిత్ర" వెలుగులోకి రావలసిన అవుసరం ఎంతైనా ఉంది.
@ భాను, హుమ్. నాబ్లాగులో కాదు కదా :p.
అఫ్సర్ బుర్రలో చాలా సాహిత్య విశేషాలున్నాయి. ఇలా ఏదో సందర్భం వచ్చినప్పుడు నాకు చెప్తూనే వుంటారు గానీ వాటిని అక్షరబద్ధం చేయమంటే బద్దకిస్తూ వుంటారు
_____________________________________
idi correct!
మాలతి గారు శారద గారి గురించి సాక్షి లో చదివాను. మీరు రాసింది ఇంకా చదవలె. చదువుతానండి.
ఆఫ్సర్ గారు అలా చెప్పినప్పుడల్లా విని...మీరు పుస్తకం.నెట్ కు చెప్పండి. మిగితా సంగతి నేను చూసుకుంటా :-)
Post a Comment