నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Thursday, September 30, 2010

టెక్సాస్ " గుడివాడ" లో సాహిత్య సందడి- పాటల పందిరి!

మా ఆస్టిన్ కి దగ్గర్లో టెంపుల్ అనే చిన్న వూరు, అందులో ఒక మంచి గణపతి ఆలయం వున్నాయి. దానికి మా మందపాటి సత్యం గారు అనుకుంటాను " గుడి వాడ" అని నామకరణం చేశారు. సత్యం గారి థియరీ ప్రకారం మా ఆస్టిన్ హస్తినాపురం, సత్యం గారు వుండే ఫ్లూగర్ విల్ బలరామ పురం. ప్లూగర్ అంటే నాగలి కాబట్టి ఆయన ఈ పేరు పెట్టారు. కాబట్టి మా తెలుగు సాహిత్య సదస్సు ల్లో మా వూర్లను ఈ ముద్దు పేర్లతోనే పిలుచుకొని ఆనందిస్తుంటాము

.వై. వి రావు గారి ఆధ్వర్యం లో “ గుడివాడ" లో 25 వ టెక్సాస్ తెలుగు రజతోత్సవ సాహిత్య సదస్సు సెప్టెంబర్ 25 వ తేదీ చాలా చక్కగా జరిగింది. ఈ టపా ఆ సదస్సు లో కొన్ని విశేషాల గురించి...

సదస్సు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం అయిదున్నర వరకూ జరిగింది. ఒక అరగంట విరామం తర్వాత వంగూరి ఫౌండేషన్ , వేగేశ ఫౌండేషన్ వారి ఆధ్వర్యం లో మూడున్నర గంటల పాటు ఘంటసాల ఆరాధనోత్సవాలు వీనుల విందుగా జరిగాయి.

ఆటా, తానా లాంటి జాతర్లలో కాదు కానీ విడిగా ఏ వూర్లోనైనా సాహిత్య సదస్సు జరిగితే ప్రేక్షకుల సంఖ్య ఆంధ్రాలో జరిగే సాహిత్య సమావేశాల కన్నా ఎక్కువగా వుంటుంది. చాలా ఆసక్తికరంగా కూడా జరుగుతాయి. ఈ సారి ఈ గుడివాడ రజతోత్సవ సదస్సు మామూలు వాటికంటే ఇంకా బాగా జరిగింది. డాలస్, శాన్ ఆంటోనియో, ఆస్టిన్, హ్యూస్టన్, టెంపుల్ నుంచిమొత్తం వందమందికి పైగా ఈ సదస్సు లో పాల్గొన్నారు. మేము ఒక అరగంట ఆలస్యం గా వెళ్ళటం తో ఠంచన్ గా మొదలైన సదస్సు లో మొదట్లో కొన్ని కార్యక్రమాలు మిస్ అయ్యాము.

మేం వెళ్ళేసరికి మా హాస్య చిట్టెలుక చిట్టెన్ రాజు గారు ప్రసంగం చివర్లో వుంది. ఆయన రచనలు ఎంత బాగా నవ్విస్తాయో, ఆయన ప్రసంగాలు కూడా అంతకన్నా ఎక్కువ హాస్య చతురత తో నిండి వుంటాయి. ప్రసంగాల్లో ఎక్కువ భాగం హాస్యం గానూ, సరదాగానూ వుండటం తో ఒక రోజంతా జరిగినా కూడా ఎక్కడా బోర్ కొట్టలేదు.

గుడివాడ గిరీశం ఫేమ్ గిరిజా శంకర్ గారి గిరీశం లెక్చర్లు , ఆయన రాసిన హైదరాబాద్ తో హ్యూస్టన్ బై త్రిశంకు ఎయిర్ లైన్స్ హాస్య గల్పిక , సుధేష్ " పుక్కిట పురాణం" ఇర్షాద్ గారి “ నిలబడే హాస్యం”, చిట్టెన్ రాజు గారి " ఘంటసాల-కంఠశోష", నెల్లుట్ల సుదర్శన రావు గారి " తెలుగు సాహిత్యం లో హాస్యం" అన్నీ కూడా బావున్నాయి.

గోవిందరాజు మాధవరావు గారు" చెప్పుకోండి చూద్దాం" పేరిట కొన్ని సినిమా పాటలు వినిపించి అవి ఏ సినిమా నుంచి, రాసింది ఎవరు? సంగీత దర్శకత్వం ఎవరూ? అంటూ అడిగిన క్విజ్ లో అందరూ పోటీలు పడి మరీ సమాధానాలు చెప్పారు. చివరి బెంచీ లో కూర్చొని సుధేష్, జేవి అరుణ్ ఆద్యంతం అల్లరి చేశారు.

తెలుగు నేర్పించటం లో , నేర్చుకోవటం లో తమ బడి లో చేపట్టిన వినూత్న విధానాల గురించి రాం డొక్కా , ఐ ఫోన్ లో తెలుగు గురించి శ్రీకాంత్ చింతల, వేమనపద్యాలు -సీత ముత్యాల ఇంగ్లీష్ అనువాదం గురించి చిట్టెంరాజు, అల్లసాని పెద్దన గురించి తుర్లపాటి ప్రసాద్, పద్యాలు, సామెతలు, పొడుపు కథల గురించి వై వి రావు, ఎక్కడి నుంచి ఎక్కడిదాకా శీర్షికన ....తెలుగు భాష చేసిన ప్రయాణం గురించి సత్యం మందపాటి చక్కటి ప్రసంగాలు చేశారు.

తెలుగు సాహిత్యానికి సంబంధించి కవిత్వం-మౌలిక భావనల గురించి విస్తృతమైన అంశాన్ని ప్రసంగం కోసం సింపుల్ గా కవిత్వం అనే బ్రహ్మపదార్ధం ఎలా అర్థం చేసుకోవచ్చో చంద్ర కన్నెగంటి, ఇంటర్నెట్ యుగం తెలుగు సాహిత్యం మీద తెచ్చిన మార్పు, బ్లాగుల సాహిత్య సేవ గురించి అఫ్సర్, కొసరాజు కవితా వైభవం గురించి మద్దుకూరి చంద్రహాస్, చలం గీతాంజలి గురించి సాయి రాచకొండ, గుంటూరు శేషేంద్ర శర్మ కవిత్వం , ఆయన రచించిన " నా దేశం - నా ప్రజలు" గురించి సురేశ్ కాజా చక్కగా ప్రసంగించి చాలా రోజుల తర్వాత మంచి సాహిత్య సదస్సు కి వెళ్ళిన అనుభూతి కలిగించారు.

ఆ తర్వాత అనంత్ మల్లవరపు, సుమ పోకల, మీనాక్షి చింతపల్లి, పద్మ, శేషిగిరావు దేవగుప్తాపు, రమణి విష్ణుభొట్ల, ప్రసాద్ కాకి, తదితరులు ( నాకు గుర్తున్నంతవరకూ రాశాను...ఎవరినైనా మర్చిపోతే సారీ) తమ తమ స్వీయ రచనలు చదివి వినిపించారు.

మధ్యలో మంచి విందు భోజనం, టీ, అల్పాహారం లాంటివి సదస్సు లో చెప్పిన విషయాల కంటే కూడా రుచికరం గా వున్నాయి.

కీర్తన ప్రయాగ , ప్రియాంక రెడ్డి, రిత్విక్ మర్యాల, కవితా మర్యాల,రోహన్ సాని, అఖిల రెడ్డి తెలుగు పద్యాలు చెప్తుంటే, నాలుగేళ్ళ పాప ఎక్కడ తడుముకోకుండా మా తెలుగు తల్లికి మల్లెపూదండ అలవోకగా పాడుతుంటే అమెరికా పిల్లల దగ్గర ఇంకా తెలుగు భాష సజీవం గా వుందని ఆనందం వేసింది.

మూడు భాగాలుగా జరిగిన ఈ సమావేశాలకు ఏలేటి వెంకటరావు గారు, దివాకర్ల సురేఖామూర్తి( తిరుపతి వెంకట కవుల్లో ఒకరి మునిమనవరాలు , అద్భుతమైన గాయని) శేషగిరిరావు దేవగుప్తాపు అధ్యక్షతలు వహించారు.

ఈ మొత్తం కార్యక్రమాన్ని వోపికగా కూర్చొని వీడియా తీశారు ఉరిమిండి నరసింహారెడ్డి.

కార్యక్రమానికి హైలెట్ ఈ తరం వారికి సినీ నటుడిగానే తెలిసినా, గిరీశం పాత్రతో ఆంధ్ర దేశాన్ని ఒక కుదుపు కుదిపేసిన జేవి రమణమూర్తి గారి జ్నాపకాలు. జేవి రమణమూర్తి గారు మనకు చెప్పాల్సినవి, ఆయన నుంచి మనం తెలుసుకోవాల్సినవి చాలా వున్నా, ఈ సదస్సు లో సమయాభావం వల్ల ఆయన ఎక్కువ సేపు ప్రసంగించలేకపోవటం విచారకరం.

సాహిత్య సదస్సు తర్వాత దివాకర్ల సురేఖా మూర్తి ( అపర జానకి) మణి శాస్త్రి , బాల కామేశ్వర రావు( అపర ఘంటసాల ) ముగ్గురూ ఘంటసాల పాటలు (ఆయన సంగీత దర్శకత్వం లో వచ్చినవి కూడా) పాడి ప్రేక్షకుల్ని కట్టి పడేశారు. మరీ మూడు గంటలు కాకుండా ఒక రోజంతా ఈ పాటల పందిరి కొనసాగి వుంటే బావుండేది. ఇలా ఒక రోజంతా సంగీత సాహిత్యాలతో మాకు పొద్దుపోయింది.

5 వ్యాఖ్యలు:

నాగేస్రావ్ said...

"..వీడియా తీశారు ఉరిమిండి నరసింహారెడ్డి"
అదృష్టవంతులు, రోజంతా సాహిత్యాస్వాదన గుడివాడలో. ఆయొక్క విడియో ఎవరైనా 'మీగొట్టం'లో ఎక్కిస్తే మేమూ ధన్యులమౌతాం.

తెలుగుయాంకి said...

అధ్యక్ష!! కల్పనగారెందుకు మాటాడలేదు? ఇది మేము తీవ్రముగా నిరసిస్తున్నాము :-)

prince said...

వీడియోలు ఇక రెండు వారాలలో లభ్యమవుతాయి...మొత్తం నాలుగు డివిడి లలో కుదించబడినది.

Kalpana Rentala said...

భావన has left a new comment on your post "టెక్సాస్ " గుడివాడ" లో సాహిత్య సందడి- పాటల పందిరి!...":

అబ్బ వింటుంటేనే చాలా ఆనందమేసింది. ఇక అక్కద వున్నవారి అదృష్టమేమో.. మేము ఇక్కడ వూరులు అలానే పిలుచుకుంటాము. ట్యూక్స్ బరీ ను టుక్కలపర్తి అని, ష్రూస్ బరీ ని చెప్పులూరు అని, నేషువా ని నాగారం అని అచ్చం గా పల్లెటూళ్ళ పేరులు పెట్టీ పిలుచుకుంటాము. అది గుర్తు వచ్చింది.

కొత్త పాళీ said...

బాగుంది. మీ ఊళ్ళ పేర్లు మరీ బాగున్నై. :)

 
Real Time Web Analytics