నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Sunday, March 06, 2011

“ కొసమెరుపు” కథారచయిత ఓ.హెన్రీ మ్యూజియం


వందేళ్ల క్రితం ఒక అమెరికన్ రచయిత ఎలా జీవించి వుంటాడు? అతని రోజువారీ జీవితం , రచనా జీవితం ఎలా వుండేవి? ఈ ప్రశ్నలకి సమాధానం కావాలంటే మనం టెక్సాస్ ఆస్టిన్ లో వున్న ఓ హెన్రీ అలనాటి ఇంటిని చూసి తీరాల్సిందే. కరెంటు లేని రెండు బెడ్ రూముల చిన్న ఇల్లు. ముందు గదిలో అరువు తెచ్చుకున్న పియానో. వొక చిన్న సోఫా. వొక కుర్చీలో చెల్లా చెదురుగా పడి వున్న అప్పటి పత్రిక “సాటర్ డే పోస్ట్” సంచికలు. వొక మూల చిన్న పుస్తాకాల అల్మరా. ఇంకో మూల చలి కాచుకోడానికి నిప్పుల గూడు. ఇంకో మూల రచయిత రాసుకునే చిన్న టేబులూ, కుర్చీ. ఒక అతిధి వచ్చినా ఇరుకు అనిపించే ఆ చిన్న లివింగ్ రూమ్. దానికి కుడివైపు చిన్న పడక గది. రచయిత అతని భార్యా కలిసి పడుకున్న అప్పటి మంచం. వాళ్ళ పాపాయి వూగిన చిన్ని వూయెల. ఆ పాపాయి కోసం ప్రేమగా ఓ.హెన్రీ కొన్న బొమ్మలు, కొంచెం లోపలికి వెళ్తే, ముగ్గురు పట్టే డైనింగ్ టేబులు, చిన్న వంట గది. రెఫ్రిజేటర్లు, గాస్ పొయ్యి లేని కాలంలో వాడిన వస్తువులూ...ఇది లోకానికి “ కొసమెరుపు” కథల రుచి చూపించిన గొప్ప అమెరికన్ రచయిత ఓ హెన్రీ ఇల్లు!

మనకి చిన్నప్పుడు స్కూల్లో నాన్ డీటైలెడ్ టెక్స్ట్ బుక్ లో “ రాన్ సమ్ ఆఫ్ రెడ్ చీఫ్” కథ చదువుకున్నప్పటి నుంచి ఓ హెన్రీ తెలుసు. నా మటుకు నాకు ఆ తర్వాత “ ది లాస్ట్ లీఫ్” కథ చదివాక అతని కథలతో పాటు అతని మీద అభిమానం పెరిగింది. రాన్ సామ్ ఆఫ్ రెడ్ చీఫ్ లో తుంటరి పిల్లవాడు “ రెడ్ చీఫ్” చేసే అల్లరి ఆకట్టుకుంటే, లాస్ట్ లీఫ్ లో అనారోగ్యం , మరణం వెనుక దాగి వుండే మానసిక అంశాలు మనసు ని కదిలించి వేస్తాయి. ఓ హెన్రీ కథల్లో విశిష్టత ఒక్క మాట లో చెప్పాలంటే ఏ కథ కూడా మనం వూహించినట్లు వుండదు. చివరలో ఒక కొసమెరుపు మొత్తం కథ నే మార్చివేస్తుంది. కథ చదువుతున్నంత సేపూ పాఠకుడు వూహిస్తున్నదానికీ భిన్నమైన ముగింపు తో కథ ముగుస్తుంది. ఆ రకంగా ఆ కథలు, వాటిని సృజించిన రచయిత ఓ హెన్రీ ఇద్దరూ పాఠకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటారు.
దాదాపు 600 కు పైగా కథలు రాసి అమెరికన్ సాహిత్య చరిత్రలోనే ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్న కథా రచయిత ఓ హెన్రీ టెక్సాస్ లోని ఆస్టిన్ లో 12 ఏళ్ల పాటు నివసించాడు. ఈ పన్నెండేళ్లూ అతని జీవితం అనేక మలుపులు తిరిగింది. అతను నివసించిన ఇంటిని మ్యూజియంగా మార్చి 1934 నుంచి అంటే గత 77 ఏళ్ళుగా ప్రదర్శనకు ఉంచారు. ఆస్టిన్ వచ్చినప్పటి నుంచి ఓ హెన్రీ మ్యూజియం చూద్దామనుకుంటున్నా ఎప్పుడూ ఏవో అవాంతరాలు. ఇండియా నుంచి కవి, కథకుడు, జర్నలిస్ట్ మిత్రుడు కూర్మనాథ్ ఇటీవల ఆస్టిన్ కి వచ్చినప్పుడు మా వూర్లోని వింతలు విశేషాలు చూపించే క్రమం లో భాగంగా నేను, అఫ్సర్, కూర్మనాథ్ ముగ్గురం ఆస్టిన్ డౌన్ టౌన్ లోని ఓ హెన్రీ మ్యూజియం చూడటానికి ఎలాగైతేనేం వెళ్లగలిగాము.

నిరంతరం ట్రాఫిక్ రద్దీతో , కార్ల రణగొణధ్వనుల మధ్య వీటన్నింటికి అతీతంగా రోడ్డు పక్కన ప్రశాంతంగా సాహితీప్రియులను పలకరించే ఓ చిన్న ఇల్లు. ఇంటి ముందు కొన్ని గులాబీ మొక్కలు. ఇంటి పక్కన, వెనక కూడా కొన్ని చెట్లు. తలుపు కొట్టి లోపలకు వెళ్ళగానే అక్కడ కూర్చొని పుస్తకం చదువుకుంటున్న టూర్ గైడ్ వచ్చి మమ్మల్ని సాదరంగా ఆహ్వానించింది. ఇల్లంతా తిప్పి చూపించింది., ఆ ఇంట్లో హెన్రీ వాడిన వస్తువులు అన్నీ ఓపికగా ఒకొక్కదాని గురించి వివరించింది. ఓ. హెన్రీ జీవితచరిత్ర అంతా ఏ మాత్రం విసుగు లేకుండా అప్పుడే మాకేమొదటి సారి ఆ వివరాలు చెప్తున్నంత ఉత్సాహంగా చెప్పింది.

విలియం సిడ్నీ పోర్టర్ ( ఓ. హెన్రీ అసలు పేరు ఇదే) 1893 లో ఈ ఇంట్లో చేరే నాటికి అదొక అద్దె ఇల్లు. అప్పటికి ఆ ఇంట్లో గ్యాస్, కరెంటు లాంటి సదుపాయాలు ఏవీ లేవు. కిరోసిన్ దీపాలే వెలిగించుకునేవారు. బొగ్గుల కుంపట్లు వాడేవారు.అప్పట్లో ఓ.హెన్రీ నివసించిన ఇల్లు ఇదే కానీ ఈ అడ్రెస్ మాత్రం కాదు. ఇప్పుడు మ్యూజియం వున్న ఇంటికి కొన్ని బ్లాకుల దూరం లో వుండేది. ఆ ఇంటిని పడగొట్టబోతుంటే ఇంటి యజమాని ఆ ఇంటిని ఆస్టిన్ సిటీ కి అప్పగించారు. పురాతనమైన ఆ ఇంటిని చెక్కు చెదరనీయకుండా అలాగే కొన్ని బ్లాకుల ముందుకుజరిపి అవసరమైన పునరుద్ధరణ పనులు చేసి 1934 లో మ్యూజియంగా మార్చి ప్రదర్శనకు వుంచారు. అమెరికన్ సాహిత్య చరిత్రలో ఒక విశిష్టమైన కథా రచయితగా పేరు పొందిన ఓ.హెన్రీ దాదాపు 12 ఏళ్ల పాటు నివసించిన ఇంటిని గత 74 ఏళ్ళుగా కొన్ని వేల మంది సందర్శించి స్ఫూర్తి పొంది ఉంటారు. ఓ.హెన్రీ ఇంట్లో వాడిన వస్తువులు, ఫర్నిచర్, అలాగే ఆ కాలానికి సంబంధించిన కొన్ని పీరియడ్ పీస్ లు అతి జాగ్రత్తగా ఇక్కడ పొందుపరిచారు. 1994-95 లో మ్యూజియం ను కొంత పునరుద్ధరించారు. ఇప్పుడు ఈ ఇల్లు సిటీ ఆఫ్ ఆస్టిన్ పార్క్స్, రిక్రియేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యం లోని చారిత్రాత్మక ప్రదేశాల్లో ఒకటి.

విలియం సిడ్నీ పోర్టర్ సెప్టెంబర్ 11 1862 లో నార్త్ కరోలినా లోని గ్రీన్స్ బరో కి దగ్గరలో పుట్టారు. 1865 లో తల్లి మరణం తర్వాత సిడ్నీ పోర్టర్ తండ్రి గ్రీన్స్ బరో కి తన నివాసం మార్చుకున్నారు. 1882 లో విపరీతమైన దగ్గుతో బాధపడుతున్న సిడ్నీ పోర్టర్ డాక్టర్ జేమ్స్ కె. హిల్ తో కలిసి టెక్సాస్ రాష్ట్రాన్ని చూద్దామని వచ్చారు. శాన్ ఆంటోనియా లో హిల్ కి చెందిన రాంచ్ లో వున్నంత కాలం సిడ్నీ పోర్టర్ పుస్తకాలు చదువుకుంటూ గడిపేశారు. 1884 లో రిచర్డ్ హిల్ తో కలిసి పోర్టర్ ఆస్టిన్ కి వచ్చారు. అప్పటి నుంచి 14 ఏళ్ల పాటు ఆస్టిన్ లోనే ఆయన వుండిపోయారు. సిడ్నీ పోర్టర్ ఆస్టిన్ లో వున్నప్పుడు ఒక సిగార్ స్టోర్ లోనూ , మందుల షాప్ లోనూ, రియల్ ఎస్టేట్ ఆఫీస్ లోనూ పనిచేశారు. మంచి గాత్రం వున్న పోర్టర్ గిటార్, మాండలిన్ వాయించేవారు. ఆస్టిన్ లో వున్నప్పుడే పోర్టర్ కి అతోల్ ఎస్టేట్స్ తో పరిచయమయింది. అతోల్ తల్లితండ్రులు వీరి ప్రేమను వొప్పుకోకపోవడంతో ఇద్దరూ ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లిచేసుకున్నారు. 1889 లో వీరికి ఒక పాప పుట్టింది. పేరు మార్గరెట్. అప్పట్లో ఆయనకు నెలకు వంద రూపాయల జీతంవచ్చేది. ఇదే సిడ్నీ పోర్టర్ జీవితం లో అతి సంతోషకరమైన సమయం. ఆ తర్వాత ఆయన జీవితం అనేక మలుపులు తిరిగింది.



ఉద్యోగం పోవడం తో సిడ్నీ పోర్టర్ ఆస్టిన్ ఫస్ట్ నేషనల్ బాంక్ లో టెల్లర్ గా చేరారు. ఆయన ప్రస్తుతం వున్న ఇంట్లో కి మారేటప్పటికి ఆయన జీవితం మరింత కష్టం గా మారింది . భార్య ఆరోగ్యం క్షీణించటం, ఉద్యోగబాధ్యతలు సరిగా నిర్వరించలేకపోవటం తో ఆయన పరిస్థితి రాను రాను మరింత క్లిష్టమయింది. 1894 లో బాంక్ లో పూర్తి స్థాయి లో పనిచేస్తున్నపుడే సిడ్నీ పోర్టర్ “ The Rolling Stone” ( ది రోలింగ్ స్టోన్ ) అనే వారపత్రికను ప్రచురించేవారు. ఆ పత్రిక తొలి కాపీలు కొన్ని ప్రదర్శనలో ఇప్పటికీ అతి జాగ్రత్తగా గ్లాస్ కింద భద్రపరిచి వున్నాయి.ఈ వారపత్రికలో పేరుకు తగ్గట్లు ఎక్కువగా హాస్య రచనలు, కథలు, కవితలు . కార్టూన్లు, ఉత్తరాలు ప్రచురితమయ్యేవి. ఈ వారపత్రిక బాగానే అమ్ముడు పోయేది. హాస్య చతురత, కథ చెప్పే విధానంలో అద్భుతమైన శైలి వీటన్నింటితో సిడ్నీ పోర్టర్ కి మంచి పేరు కూడా వచ్చింది. అయితే ఇవేమీ ఆయన ను ఆర్థికంగా నిలదొక్కుకొనివ్వలేదు. కుటుంబ పోషణ కష్టం కావటంతో సిడ్నీ ఏడాది తర్వాత పత్రిక మూసివేశాడు.
పత్రిక మూతపడటం ఒక రకమైన నష్టం అయితే బాంక్ లో నిధుల స్వాహా బయటపడటం సిడ్నీ కి ఎదురైన మరో పెద్ద కష్టం. ఉద్యోగం పోగొట్టుకొని ఆరునెలల పాటు దుర్భరమైన నిరుద్యోగాన్ని సిడ్నీ కుటుంబం అనుభవించింది. “ The Houston Post” తమ పత్రికకు రచయిత గా తీసుకోవటంతో సిడ్నీ ఆస్టిన్ వదిలి హ్యూస్టన్ వెళ్ళాడు. ఈ పత్రికలో సిడ్నీ రాసిన కాలమ్స్ కి మంచి ప్రశంసలు లభించాయి. అక్కడ నుంచి సిడ్నీ ఒక రచయిత గా తన కెరియర్ ను ప్రారంభించాడు. అయితేహ్యూస్టన్ లో ఈ రకమైన జీవితం కేవలం 8 నెలల పాటు మాత్రమే గడిచింది. ఆస్టిన్ బాంక్ లో నిధుల కుంభకోణం విచారణ కు రావడం తో సిడ్నీ భార్య, పిల్లలను ఆస్టిన్ కి పంపేశాడు. అయితే కుటుంబం, స్నేహితుల ముందు కోర్టు విచారణ ఎదుర్కొలేననుకున్న సిడ్నీ రైలెక్కి న్యూ ఆర్లీన్స్ కి , అక్కడ నుంచి ఓడెక్కి హోండూరస్ కి వెళ్ళాడు. హోండూరస్ లో ఆరునెలల పాటు వుండటం వల్ల సిడ్నీ కి తన రచనలకు కావలసిన బోలెడంత సమాచారం దొరికింది కానీ భార్యా పిల్లలను కలుసుకోవటం మాత్రం వాస్తవంగా సాధ్యం కాలేదు. క్షయ వ్యాధితో బాధపడుతున్న భార్య బాగోగులుచూసుకునేందుకు తప్పనిసరిగా సిడ్నీ ఆస్టిన్ వచ్చి చట్ట పరమైన చర్యలను ఎదుర్కోవటానికి సిద్ధపడ్డాడు. 1897 లో భార్య ను పోగొట్టుకున్న ఏడు నెలల తర్వాత సిడ్నీ కేసు విచారణ జరిగింది. ఈ సమయంలో నే సిడ్నీ మొదటి చిన్న కథ ను ఒక నేషనల్ పబ్లికేషన్ కొనుక్కుంది. తన మూడు రోజుల కోర్టు విచారణ లో సిడ్నీ పెదవి విప్పి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా వుండిపోయాడు.అయితే సాక్ష్యాలు మాత్రం అతడిని అపరాధిగా నిలబెట్టాయి. నేరం నిర్ధారణ కావటం తో అయిదు సంవత్సరాల కారాగార శిక్ష విధించారు. ఒహాయో లోని కొలంబస్ లో ని ఫెడరల్ జైలు కి సిడ్నీ ని పంపారు. ఇక ఆ తర్వాత సిడ్నీ టెక్సాస్ కి తిరిగి రాలేదు.

జైల్లో వున్నప్పుడు సిడ్నీ తన రచనా వ్యాసంగం మీద ఎక్కువ దృష్టి పెట్టగలిగారు. అక్కడ వున్నపుడే ఆయన ఓ.హెన్రీ అనే కలం పేరు పెట్టుకొని కథలు రాశారు.మూడున్నర ఏళ్లకే జైలు నుంచి బయటకు వచ్చేనాటికి ఓ.హెన్రీ కలం పేరు కింద దాదాపు 14 కథలు ప్రచురితమై మంచి రచయిత గా పేరు సంపాదించుకున్నాడు.

1902 లో ఒహాయో జైలు నుంచి బయటకు వచ్చాక , పిట్స్ బర్గ్ లో అమ్మమ్మ, తాతయ్యల దగ్గర పెరుగుతున్న కూతురు మార్గరెట్ తో కొద్ది కాలం గడిపాడు. అప్పటికి మార్గరెట్ వయసు 13 ఏళ్ళు. ఆ అమ్మాయికి తండ్రి జైలు కి వెళ్లిన సంగతి తెలియదు. వ్యాపార పని మీద తన తండ్రి వేరే దేశాలు తిరుగుతున్నట్లు ఆమె ను నమ్మించారు. ( సిడ్నీ చనిపోయాక మాత్రమే ఆమెకు తండ్రి మీద వున్న కేసు, ఆయన జైల్లో వున్న వివరాలు తెలిసాయి. ). కూతురిని తిరిగి కలుసుకోవటం పట్ల సిడ్నీ ఎంతో సంతోషంగా వున్నప్పటికీ రచనా వ్యాసాంగం మీద జీవనం గడపటానికి గాను పబ్లిషర్స్ కి దగ్గరలో వుండేందుకు గాను న్యూయార్క్ లో స్థిరపడ్డాడు. నిరంతరం మేల్కొని వుండే ఆ నగరం సిడ్నీ కి ఎన్నో రకాలుగా స్ఫూర్తి నిచ్చింది. చివరకు అదే ఆయన స్థిర నివాసమయింది. విజయపు అంచులను ఆయన చవి చూచినది అక్కడే. జైల్లో వున్నప్పుడు రాసి ప్రచురితమైన కథలకు మంచి పేరు రావడంతో , అప్పట్లో విశేష ప్రజాదరణ పొందిన “ The New York World Sunday Magazine” తో కాంట్రాక్ట్ కుదుర్చుకొని ప్రతి వారం వారికి ఒక కథను అందించారు. ఆయన జీవితం లోని చివరి ఎనిమిది సంవత్సరాల్లో సిడ్నీ పోర్టర్ మొత్తం 381 కథలు రాశారు.ఆయన కథల్లోని సామాన్య పాత్రలు, హాస్యం, చదివింపచేసే శైలి, కథ ను నడిపించే విధానం, పదాల ఎంపిక, వూహించలేని మలుపులు, పాత్ర చిత్రణ ఇవన్నీ కూడా ఆయనను అమెరికా కు చెందిన ఉత్తమ కథకుడిగా తీర్చిదిద్దాయి.

ఓ.హెన్రీ కి దక్కిన కీర్తి సిడ్నీ పోర్టర్ గా ఆయనకు ఏమాత్రం ఉపయోగపడలేదు. జూదం, తాగుడు లాంటి వ్యసనాల వల్ల పబ్లిషర్స్ నుంచి ముందే పెద్ద మొత్తం లో పొందిన అడ్వాన్స్ లకు సరిపడా ఎప్పటికప్పుడు రచనలు సాగించాల్సి వచ్చింది. ఒకప్పుడు బాంక్ టెల్లర్ గా పనిచేసిన సిడ్నీ తన జీవితం లో ఎప్పుడూ కూడా ఆర్థిక వ్యవహారాలను కానీ, తన ఆరోగ్యాన్ని కానీ సరిగ్గా చూసుకోలేకపోయాడు.
డయాబిటీస్, లివర్ సంబంధిత వ్యాధి, గుండెజబ్బులతో 48 ఏళ్లకే ఓ.హెన్రీ గా ప్రపంచ సాహిత్య చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్న సిడ్నీ పోర్టర్ జూన్ 5, 1910 వ తేదీన కన్ను మూశాడు. ఓ.హెన్రీ గా ఆయన కన్ను మూసి వందేళ్లు గడిచినప్పటికీ ప్రపంచ సాహిత్యం ఆయనను మర్చిపోలేదు.

భారతదేశం లో లాగా కాకుండా అమెరికా లో రచనల్ని , రచయితలను గౌరవించి, గుర్తుంచుకొని సదా స్మరించే సత్సంప్రదాయం వుంది. ఆయన నివసించిన ఇంటిని మ్యూజియం గా వుంచటంద్వారా ఆయన రచనలనే కాకుండా ఆయన జీవితాన్ని కూడా భావితరాలకు తెలియచెప్తోంది ఈ ఓ.హెన్రీ మ్యూజియం. ప్రసిద్ధ ఓ.హెన్రీ క్లాసిక్ స్టోరీ “ Gifts of the Magi” రాయటానికి స్పూర్తినిచ్చిన ఆయన రైటింగ్ డెస్క్, వికర్ రాకింగ్ ఛైర్ ను ఈ మ్యూజియం లో చూసినప్పటి అనుభూతి వర్ణనాతీతం. ఆయన వాడిన డిక్షనరీ, ఆయన తన కూతురు కోసం కొన్న బొమ్మలు, సిడ్నీ భార్య వాయించిన పియానో, ఆయన జీవించిన కాలానికి సంబంధించిన వస్తువులు అవన్నీ అక్కడకు వచ్చే సందర్శకులను మౌనంగా పలకరిస్తూ వుంటాయి. వాటిని ఎవరూ తాక రాదు, ఫోటోలు కూడా తీసుకోకూడదు. ఆస్టిన్ సిటీ మేనేజిమెంట్ డొనేషన్ లు సేకరించి ఆ మ్యూజియం చూడటానికి వచ్చేవారికి టూర్ గైడ్ గా వ్యవహరించేందుకు పార్ట్ టైం సిబ్బంది ని కూడా నియమించింది.
ఓ.హెన్రీ మ్యూజియం చూసినంత సేపూ ఒకటే ఆలోచన. మన దేశం లో, మన రాష్ట్రం లో ఒక గొప్ప రచయిత కు ఇంతటి గౌరవం ఎప్పుడైనా లభించి వుంటుందా? అని. అలా అనుకోగానే ఆదరణకు నోచుకోని మహా కవుల, రచయితలు నివసించిన శిధిల భవనాలు కళ్ళముందు కదలాడాయి.


కల్పనారెంటాల

(మార్చి 7, ఆంధ్రజ్యోతి వివిధ లో ఈ వ్యాసం ప్రచురితం)

10 వ్యాఖ్యలు:

కొత్త పాళీ said...

చాలా సంతోషం. ఎప్పుడైనా చికాకుగా ఉన్నప్పుడు మనసుని కాస్త ఉల్లాసపరుచుకోడానికి ఓహెన్రీ కథ చదువుకోవచ్చు. టెక్సస్ బేంకు వాతావరణం నేపథ్యంగా కూడా ఆయన కొన్ని కథలు రాశారు. ఒక కథ, పేరు గుర్తు లేదుగాని లీలగా గుర్తొస్తున్నది. మనిషి విలువ, స్నేహం విలువ తెలిపే కథ అది.
ఇక రచయితల జ్ఞాపకాల్ని భద్రపరుచుకోవడం గురించి - గురజాడకే దిక్కులేదు. రాజమహేంద్రి వెళ్ళినప్పుడు శ్రీపాదవారి ఇంటికోసం చాలా వెతికాను. మన ఖర్మ. అంతెందుకు, తెవికీలో మీకిష్టమైన తెలుగు రచయిత గురించి వెతకండి - ఎంత సమాచారం దొరుకుతుందో చూద్దాం!

lalithag said...

చనిపోయిన తర్వాత గౌరవం ఏమో గానీ, మనసుని ఉల్లాస పరిచే కథలను రాసిన రచయిత జీవితం ఇంత కష్టమయమని తెలిస్తే బాధేస్తోంది.

Rao S Lakkaraju said...

Really touching story well written. Thanks.

mmkodihalli said...

7వ తేదీ పత్రికలో రాబోయే వ్యాసం 6వ తేదీనే పోష్టు పెడితే ఎలాగండీ? పత్రికలో వచ్చిన తర్వాత ఒక రోజు లేదా కనీసం కొన్నిగంటలు అయిన తర్వాత బ్లాగులో పెడితే ఆ పత్రిక వాళ్ళను గౌరవించినట్టుంటుంది.

KumarN said...

వెరీ ఇంట్రస్టింగ్. ఏమిటో చిన్నప్పటినుంచీ చదివిన పెద్ద పెద్ద రచయితల యొక్క ఊహించుకున్న భౌతిక జీవితపు ఆనవాళ్ళని, ఇప్పుడు దగ్గరనించి చూస్తే, వివిధ రకాలుగా ఆశ్చర్యం.

రచయిత కాకపోయినా, మా ఊళ్ళో హారీ ట్రూమాన్ గారి ఇల్లు ఉంది. ఇప్పటికి మూడు సార్లెళ్ళి చూసొచ్చా. ప్రెసిడెంటుగా రిటైర్ వచ్చేసిన తర్వాత కూడా ఆ ఇంటిలో ఆయన అన్ని సార్లు ఉండి, ఆ చుట్టు పక్కల రోజూ వాకింగ్ కి వెళ్ళేవాడంటే నాకు ఎన్నో ఆలోచనలు వచ్చేవి. హిరొషిమా,నాగసాకిల గురించి ఆ ఇంట్లో ఎన్ని సార్లు ఆలోచించి ఉంటాడా అనిపించేది.

సుజాత వేల్పూరి said...

one dollar eighty sents కథ ద్వారా చిన్నప్పుడు ఓ హెన్రీ పరిచయం నాకు. కథ పేరు అదేనో కాదో కానీ, భర్తకు వాచీ చైను బహుమతి ఇవ్వడానికి భార్య తన నిడుపాటి జుట్టుని కట్ చేసి అమ్మేస్తే, భార్య జుట్టు కోసం భర్త తన వాచీ అమ్మేసి మంచి రాళ్ళు పొదిగిన దువ్వెన పట్టుకొస్తాడు.

అలాంటి గొప్ప రచయితల జీవితానికి సంబందించిన గుర్తులు చూడ్డం బాగుంటుంది.

సెంట్ లూయిస్ లో మార్క్ ట్వైన్ జ్ఞాపకార్థాలు చూసి ఆయన్నే చూసినంత సంతోషం వేసింది.

@ కొత్తపాళీ,

హంపీ వెళ్ళినపుడు కమలాపురంలో 'తిరుమల రామచంద్ర గారిల్లు" ఎక్కడని అడిగితే ఒక్కరూ చెప్పలేదు:-(

Anonymous said...

very nice post ! he is one of my all time favs. i just love his works.

మాలతి said...

కల్పనా, ఓహెన్రీమీద వ్యాసం చాలా బాగుంది. నాచిన్నప్పుడు నాకు స్ఫూర్తినిచ్చిన రచయితలలో ఒకరు. ఈమధ్య The Best stories of O'Henry పుస్తకం తీసి చూస్తే ఎందుకో అంత ఉత్సాహంగా అనిపించలేదు, ప్చ్. నీవ్యాసం చదివేక మళ్ళీ చదవాలనిపిస్తోంది. చూస్తాను.

కొత్త పాళీ said...

@ సుజాత .. The story is The Gift of the Magi

కంచర్ల said...

గౌII కల్పనా రెంటాల గారికి,
నమస్కారములు.
అనేక మార్లు మీరు గుర్తుకు వచ్చారు.
పత్రికల్లో మీ రచనలు చూసినప్పుడల్లా ..
మరీ మరీ గుర్తుకు వస్తుంటారు.
నేను మీకు గుర్తుందో..లేదో ...
ఒకప్పుడు బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరుకు ఆంధ్రభూమిలో పనిచేసాను.
గుంటూరులో జరిగిన అప్పాజ్యోస్యుల కళాపరిషత్ లో చుసానంతే.
విచారిస్తే.. USA లో వున్నారని తెలిసింది.
ఓ సారి మిమ్మల్ని పలుకరిద్దామని వుంది.
దయతో .. మీ మొబైల్ నెంబర్ పంపండి.
మీ బ్లాగ్ చూసాను. చాలా సంతోషం. అభివందనములు.
Email: kancharlasubbanaidu@gmail.com

 
Real Time Web Analytics