నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Monday, July 18, 2011

ఓ నాన్న!...ఓ సాహితీ తపస్వీ!
( మా నాన్నగారు రెంటాల గోపాల కృష్ణ గారు కీర్తి శేషులై ఇవాళ్టికి పదాహారేళ్ళవుతోంది. ఆ సందర్భంగా సాక్షి దినపత్రిక సాహిత్య పేజీ వారు అడగగా మా తమ్ముడు జయదేవ రాసిన వ్యాసం ఇది. ఇందులో కొంత భాగాన్ని ఇవాళ సాక్షి పత్రిక ప్రచురించింది.దాన్ని ఇక్కడ చూడగలరు. నిజానికి ఈ వ్యాసం మా తమ్ముడి ఇష్టపది బ్లాగు లో రావాల్సింది. కానీ జయదేవ ప్రయాణం లో ఉండి నెట్ కి దూరం గా వుండటం తో నేను ఇక్కడ పంచుకుంటున్నాను)

నాకు ఊహ తెలిసే నాటికే నాన్న గారు రెంటాల గోపాల కృష్ణ పేరున్న రచయిత, జర్నలిస్ట్. విజయవాడ లోని సత్యనారాయణ పురం లో రైల్వే స్టేషన్ ( ఇటీవలే తీసేశారు) దగ్గర పురుషోత్తం వీధి లో రైలు కట్టాను ఆనుకొని మా ఇల్లు రైలు భోగీల్లాంటి మూడు గదులు. అరటి చెట్లు, మల్లె చెట్లు, తులసి కోట ఉన్న ఓ చిన్న పెరడు. ఓ చేద బావి. అగ్గి పెట్టె లాంటి ఆ అద్దె ఇల్లే మాకు అపర బృందావనం. తోబుట్టువులైన మా ఎనిమిది మంది తోబుట్టువుల్లో ఆరుగురం లోకం లీ కళ్ళు టేరించి ఆ ఇంటి ముందు గది లోనే! ఆఖరుకు నాన్న గారు కన్ను మూసింది ఆ గది లోనే! ఆ గది ఓ ఆయన ప్రత్యేకంగా ఇనుప ర్యాంకులతో చేయించుకున్న చెక్క బీరువా నిండా వందల కొద్దీ పుస్తకాలు. కాళిదాసు నుంచి కార్ల్ మార్క్స్ దాకా , ' బృహజ్జాతకం' నుంచి బృహత్ స్త్రోత రత్నాకరం దాకా, బెర్నార్డ్ షా నాటకాల నుంచి బాల్జాక్ కథల దాకా సంగీతం, సాహిత్యం, నృత్యం , నాటకం, జ్యోతిష్యం, పురాణేతిహాసాలు - ఇలా వైవిధ్యభరితమైన అంశాల్లో తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్ ల్లో అరుదైన గ్రంధాలు అక్కడ కొలువై ఉండేవి. ప్రపంచం లోకి నాన్న గారు మాకిచ్చిన కిటికీ అది.
ఈ విస్తారమైన అభిరుచి కి ఒక రకంగా కారణం - నాన్న గారు పుట్టిన పండిత కుటుంబం, పెరిగిన వాతావరణం, తిరిగిన ఊళ్ళు, మనుషులు. గుంటూరు జిల్లా పల్నాడు తాలూకా రెంటాల గ్రామం లో 1920 సెప్టెంబర్ 5 ఆయన జన్మదినం. వాళ్ళ అమ్మగారికి ఆయన అష్టమ సంతానం. పైగా పుట్టింది కృష్ణాష్టమి నాడు! ఆయన పేరు వెనుక కథ అది. గురజాల, మాచర్ల, మాచవరం, నరసారావుపేట ప్రాంతాల్లో బడి, గుంటూరు లో కాలేజీ చదువులు చదివిన ఆయన ఆ చిన్న వయస్సులోనే స్వశక్తి ని నమ్ముకొని విజయవాడ కు వచ్చేశారు. ' పార్వతీశ శతకం' , ఆ పైన పదహారో ఏట ' రాజ్యశ్రీ' అనే చారిత్రక నవల తో మొదలు పెట్టి 75 వ ఏట మరణించే దాకా 60 ఏళ్ల పాటు ఆయన అలుపెరగకుండా రచనా యాత్ర సాగించడం ఓ ఆశర్యకరమైన వాస్తవం. కవి , రచయిత, నాటక కర్త, అనువాదకుడు, జర్నలిస్ట్ , వక్త-- ఇన్ని కోణాలు ఒకే వ్యక్తి లో ఉండటం నాన్న గారి గొప్పదనం. ఒక రకంగా అరుదైన అదృష్టం. కానీ , వేదాలు,వాదాలు, అభ్యుదయ నాదాలు, అనువాద భేదాలు-- ఇలా ఎన్నో పాయలుగా చీలిన ప్రతిభ, పాండిత్యం కారణంగా నాన్న గారు ఏకాగ్ర దృష్టి తో ఏదో ఒక రంగానికే పరిమితం కాలేదు. ఫలితంగా, ఆయనకు రావలసినంత గుర్తింపు రాలేదేమోనని అనిపిస్తుంటుంది.
నాన్న గారికి ఆప్త మిత్రులనగానే -- అనిసెట్టి సుబ్బారావు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, బెల్లంకొండ రామదాసు, అవసరాల సూర్యారావు, కుందుర్తి ఆంజనేయులు, దాశరథి కృష్ణమాచార్య, గిడుతూరి సూర్యం, ఈ నెల మొదట్లో కన్నుమూసిన ' ఉదయిని'--' ఎర్ర జెండాల ' గంగినేని వెంకటేశ్వరరావు, చదలవాడ పిచ్చయ్య, ప్రచురణకర్తల్లో ' ఉమా పబ్లిషర్స్' కాండూరి సుబ్రహ్మణ్యం, ప్రస్తుత విశ్రాంత జీవితం గడుపుతున్న ' జయంతి పబ్లికేషన్స్ ' మువ్వల పెరుమాళ్ళు, సినీ జీవి ' నవయుగ' కాట్రగడ్డ నరసయ్య వగైరాల పేర్లు నాకు ఠక్కున గుర్తుకొస్తాయి. అనిసెట్టి, ఏల్చూరి, బెల్లంకొండ లు బడి చదువుల రోజుల నుంచి నాన్న గారికి మిత్రులైతే, మిగిలిన చాలా మంది అభ్యుదయ రచయితల సంఘం ( అరసం) తొలి రోజుల నుంచి ఆంధ్ర దేశం లో ప్రజా నాట్య మండలి ప్రభ వెలిగిపోతున్న కాలం మీదుగా, ప్రపంచ సాహిత్యానువాదాల ప్రచురణ పరిశ్రమ గా కొనసాగిన కాలం లో ఆయనకు సహచరులు, సహవ్రతులు.
నేను కళ్ళు తెరిచే సరికి అత్యధిక సర్క్యులేషన్ ఉన్న ' ఆంధ్రప్రభ' దినపత్రిక సంపాదకవర్గం లో నాన్న గారు కీలక వ్యక్తి. ఎడిటర్ కాకపోయినా ఎన్నెన్నో విలువైన సంపాదకీయాలు రాసిన నిబద్ధ జర్నలిస్ట్. ప్రతి శుక్రవారం వచ్చే ' సినిమా పేజీ ' కి ఆయనే ఎడిటర్. సాహితీ, సాంస్కృతిక , సినీ రాజధానిగా వెలుగొందిన ఆనాటి విజయవాడ చరిత్ర లో ఆయన అంతర్భాగం . ఆ రోజుల్లో ఏ సభ జరిగినా, అందులోనూ కొత్తగా రిలీజైన సినిమాల అభినందన సభలు, ఇష్టాగోష్టులు అయితే, రెంటాల గారు తప్పనిసరిగా వేదిక మీది త్రిమూర్తుల్లో ఒకరు .( రెంటాల, తుర్లపాటి కుటుంబరావు, వీరాజి- ఈ ముగ్గురు 1970-'80 ల నాటి విజయవాడ సినీ సభలకు త్రిమూర్తులు). ' పంచకళ్యాణి- దొంగలరాణి', ' కథానాయకురాలు' సినిమాలకు ఆయన రచయిత కూడా! వాల్మీకీ గురించి అనర్గళంగా మాటాడి, రామాయణ కాలం నాటి లాంకా ఉనికి పై కుహనా పరిశోధనల్ని పూర్వ పక్షం చేస్తూ పొద్దున్నే గంభీరమైన సంపాదకీయ వ్యాఖ్యలు రాసిన వ్యక్తే. సాయంత్రం సినిమా సభ లో వాణిశ్రీ గురించి, ఆమె పై చిత్రీకరించిన ' దసరా బుల్లోడు' పాట గురించి అంతే ఛలోక్తి గా సభారంజకంగా మాట్లాడేవారు. చిన్నప్పుడు ఉండే సినిమా మోజు, సినిమా ప్రివ్యూ చూసి రాగానే నాన్న గారు రాసే చిత్ర సమీక్ష ను ప్రింట్ లో రాక ముందే చూడడం, పురాణాల మొదలు ' బాలజ్యోతి' మాస పత్రిక లో పిల్లల సీరియళ్ళు దాకా ఆయన రాస్తున్నప్పుడే వేడి వేడి గా చదివేయడం- ఇలాంటివన్నీ నాన్న గారిని నా దృష్టి లో హీరో ను చేశాయి. ఇంకా చెప్పాలంటే, తెలియకుండానే నా అంతరాంతరాళ్ళో ఓ రోల్ మోడల్ ను నిలబెట్టాయి. పోగుబడిన ఆ వాసనలే మా పెద్దన్నయ్యనూ ( రెంటాల సత్యనారాయణ) మా అక్కయ్యను ( కల్పనా రెంటాల), నన్నూ అక్షరాల వైపు పరుగులు తీయించాయి.
నాన్న గారు ఉదయం నిద్ర లేచి, కాలకృత్యాలు తీర్చుకోగానే కాస్తంత కాఫీ త్రాగుతూ రాసుకోవడానికి కూర్చోనేవారు. ఆయన ప్రత్యేకంగా చేయించుకున్న టేకు కుర్చీ, టేబుల్, ఆ టేబుల్ లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు తీసి, అక్కరలేదన్నప్పుడు లోపలకు నెట్టేయడానికి వీలుండే రాత బల్ల ఉండేవి. పురుళ్ళూ , పుణ్యాలు, ఇంటికి వచ్చే బంధుజనమ్, పిల్లల ఆటలు, పాటలు, చదువులు, కేరింతలు, అరుపులు, కేకలు, కొట్లాటలు, ఆఫీస్ ఒత్తిళ్ళు --ఇన్నింటి మధ్య కూర్చొని ఆయన రోజూ గంటల తరబడి రాసుకుంటూ ఉంటే, పంచాగ్ని మధ్యంలో సాహితీ తపస్వీ లా కనిపించేవారు.
మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, ' రసన' సమాఖ్య కె. వేంకటేశ్వర రావు, సుంకర కనకారావు, మాచినేని వెంకటేశ్వరరావు, కోగంటి గోపాలకృష్ణయ్య, కర్నాటి లక్ష్మీనరసయ్య, మోటూరి ఉదయం, ' అనామిక' విజయలక్ష్మి, మహీధర రామమోహనరావు, ఆవంత్స సోమసుందర్, కె.వి. రమణారెడ్డి, ఏటుకూరి బలరామమూర్తి, బొమ్మారెడ్డి - ఇలా ఒకరా, ఇద్దరా ఆ నాటి ప్రసిద్ధ సాంస్కృతిక, సాహిత్య, పత్రికా రంగా ప్రముఖులందరూ మా ఇంటికి తరచూ వస్తుండేవారు. ఇంటికి ఎవరోచ్చినా వాళ్ళను సాదరంగా ముందు గది లో కూర్చోబెట్టి, ముందుగా మంచినీళ్ళు, ఆ తరువాత అమ్మ చేతి కమ్మని కాఫీ, ఆ పైన ప్రత్యేకంగా మద్రాస్ నుంచి తెచ్చిన కొయ్య పేటిక లో నుంచి ఘుమ ఘుమలాడే వక్కపొడి ఇచ్చి మర్యాద చేయాలి. అది నాన్న గారు, అమ్మ మాకు నేర్పిన పద్ధతి . నిజం చెప్పాలంటే, తెల్లవారుతూనే తీసిన తూర్పు వాకిటి గుమ్మం మళ్ళీ రాత్రి ఎప్పుడో పడుకునేటప్పుడు తప్ప మధ్యలో మూసే పనే లేదు. వచ్చిన పెద్దలతో ముందు గది లో ఎప్పుడూ ఏవో సాహితీ చర్చలు. చొక్కా లాగు వయసు లో విన్నవి తలకెక్కాయో లేదో కానీ, మాకు తలపులు పెంచాయి. సమాజం లోకి తలుపులు తెరిచాయి.
గమ్మత్తేమిటంటే, నరసరావు పేట లో ' నవ్య కళా పరిషత్' వారి ' నయాగరా' ( అనిసెట్టి పెళ్ళికి మిత్రులిచ్చిన కావ్య కానుక) కవి మిత్రుల్లో ఒకరైన నాళ్ళ నుంచి , ప్రభుత్వానికి నిషేధానికి గురైన ' కల్పన' కవితా సంకలనం సంపాదకత్వ రోజుల దాకా నాన్న గారి జీవితమంతా ప్రధానంగా కవిత్వం, రంగస్థలమే! అభ్యుడయ కవిత్వం లో మైలు రాళ్ళుగా నిలిచిన ' సంఘర్షణ', తెలంగాణ ప్రజా పోరాటం పై దృష్టి పెట్టిన ' సర్పయాగం' కవితా సంపుటాలు, ' శిక్ష ', ' ఇన్స్పెక్టర్ జనరల్', ' అంతా పెద్దలే ' లాంటి నాటకాలు రచనా జీవితపు తొలి నాళ్ళల్లోనే నాన్న గారికి పేరు తెచ్చిన సాహితీ శిల్పాలు. " అమ్మా! ఉమా ! రుమా! హీరోషిమా! విలపించకూ పలపించకూ..." అంటూ హీరోషిమా పై అణుబాంబు దాడి ఉదంతం వస్తువు గా రాసిన కవిత అప్పట్లో ఎంతో మంది దృష్టి ని ఆకర్షించింది. శ్రీశ్రీ ఎంతో మెచ్చుకొని , 1952 ప్రాంతం లో జపాన్ నుంచి వచ్చిన శాంతి సంఘం ప్రతినిధులకు అప్పటికప్పుడు ఆ కవిత ను ఇంగ్లీష్ లోకి అనువదించి, వినిపించారు.
అభ్యుదయ భావాలు, ఆర్ష సంస్కృతి మూలాల కలనేత నాన్న గారు. సంప్రదాయ కుటుంబం లో పుట్టి , ఆ సాహిత్యమంతా చదివి, అభ్యుదయం వైపు పయనించి, ఆది నుంచి ' అరసం ' లో సభ్యుడిగా, కమ్యూనిజమే తారక మంత్రం గా కొనసాగిన నాన్న గారికి శ్రీశ్రీ అంటే ప్రాణం. అదే సమయం లో విశ్వనాథ (సత్యనారాయణ) అంటే గురుభావం. శ్రీశ్రీ మానసిక వైకబ్ల్యానికి గురైన రోజుల్లో విజయవాడ లో ఆసుపత్రి గది వద్ద కాపున్న నాన్న గారే, విశ్వనాథ ఇంటికి వెళ్ళి శిష్యుడి లా కూర్చొని, ' నవభారతి' పత్రిక కు ' మధ్యాక్కఱలు' రాయించుకొని తెచ్చేవారు. విశ్వానాథ ను అనేక సార్లు ఇంటర్వ్యూ చేసిన నాన్న గారు, ఆ కవిసమ్రాట్ అస్తమించినప్పుడు ' ఆంధ్రప్రభ' దినపత్రికలో ' వాగ్దేవి కటాక్షం పొందిన కవి మూర్దన్యుడు ' అంటూ సంపాదకీయం రాసి, అక్షరాంజలి ఘటించారు. ఒక సిద్ధాంతాన్ని నమ్మినంత మాత్రాన, ఇతర సిద్ధాంతాల వారందరూ ఆగర్భ శత్రువులన్న వైమనస్యం లేని విశాల సాహితీ దృక్పథం నాన్న గారిదేమో అనిపిస్తుంది. అయితే, కష్టాలను కడతేర్చే తారకమంత్రం కమ్యూనిజం అని నమ్మాక, ఓ దశ లో కమ్యూనిస్ట్లు పార్టీలో వచ్చిన నిట్టనిలువు చీలిక ఎంతో మంది అభ్యుదయ సాహితీప్రియుల లాగానే నాన్న గారిని కూడా విచారం లోకి నెట్టింది. ఉమ్మడి కమ్యూనిస్ట్ నేపథ్యం లో నుంచి వచ్చిన వారందరూ చెట్టుకొకరు, పుట్టకొకరు అయినప్పుడు ఆయనా జీవిత సమరం లోకే వెళ్ళిపోయారు.
నాన్న గారి ఆరు దశాబ్దాల రచనా జీవితంతో దాదాపు నాలుగు దశాబ్దాల పత్రికా రచనా జీవితం పెనవేసుకుంది. చల్లా జగన్నాత్తమ్ సంపాదకత్వం లో గుంటూరు నుంచి వచ్చిన ' దేశాభిమాని' పత్రిక తో జర్నలిస్ట్ జీవితం మొదలుపెట్టారాయన. ఆ తరువాత వివిధ పత్రికలకు రచనలు చేస్తూనే , చదలవాడ పిచ్చయ్య ' నవభారతి' మాసపత్రిక కు ఇంచార్జ్ ఎడిటర్ గా పని చేశారు. ఆ తరువాత నీలంరాజు వెంకట శేషయ్య సంపాదకత్వం లో ' ఆంధ్రప్రభ ' దినపత్రిక లో చేరి, 1980 ల చివరి వరకూ అక్కడే వివిధ హోదాల్లో గురుతర బాధ్యతలు నిర్వహించారు. రచనలు చేశారు. శీర్షికలు నిర్వహించారు. సమీక్షలు, సంపాదకీయాలతో సహా అనేకం రాశారు. సమాజాన్ని సరైన దోవ లో నడిపించేందుకు కలం పట్టాలన్న తరానికి చెందిన నాన్న గారి దృష్టి లో జర్నలిజం ఉద్యోగం కాదు. వృత్తి! ఆసక్తి, అభిరుచి ఉన్న వారే తప్ప, గడియారం చూసుకొని పని చేసే గుమాస్తా గిరి మనస్తత్త్వం జర్నలిస్ట్ లకు పనికి రాదని ఆయన నమ్మారు. ఆచరించారు. పత్రికా రచన ప్రతిష్టాత్మకమైన ఆ రోజుల్లో ఆయన సహోద్యోగులు పండితారాధ్యుల నాగేశ్వర రావు, జి. కృష్ణ, ఏ.బి.కె. ప్రసాద్, అజంతా, మాదల వీరభద్రరావు, అప్పటి యువతరం పురాణపండ రంగనాథ్, వాసుదేవ దీక్షితులు, కె. రామచంద్రమూర్తి, వేమన వసంత లక్ష్మి--ఇలా ప్రసిద్ధులు ఎందరెందరో! నండూరి రామ్మోహన రావు, సి. రాఘవాచారి, పురాణం సుబ్రహ్మణ్య శర్మ, ' స్వాతి' బలరాం లాంటి ఆప్త పత్రికా మిత్రుల జాబితా ఇంకా పెద్దది. రచయిత, జర్నలిస్ట్ లు రిటైర్మెంట్ లేదని నమ్మిన నాన్న గారు పదవీ విరమణ చేసినా, కడదాకా ' ఆంధ్ర ప్రభ' ' స్వాతి' పత్రికలకు రచనలు చేస్తూనే వచ్చారు.
నాన్న గారికి మేము ఎనిమిది మంది సంతానం. మా ఎనిమిది మంది చదువులు, ఏడుగురి పెళ్ళిళ్ళ కోసం ఆయన ఎత్తిన కలం దించకుండా ఎన్ని వేల పేజీలు రాశారో! దాదాపు 200 పుస్తకాలు లెక్క తేలాయి. అందులో 150 కి పైగా ప్రచురితాలు. కానీ, ఇవాళ సంస్కృత మూలంతో సహా తెనిగించిన ' వాత్స్యాయన కామ సూత్రాలు' లాంటి కొన్ని మినహా అనేకం అందుబాటు లో లేవు. చివరి రోజుల్లో ఆయన తన మూడో కవితా సంపుటం ' శివధనువు ' ప్రచురించాలని ఎంతో తపించారు. కానీ, స్వహస్తాలతో పుస్తకంగా కుట్టుకున్న ఆ కవితల పత్రికాప్రతుల సాక్షిగా 1995 జూలై 18 న కీర్తి శేషులయ్యారు. ఆ పైన ' శివధనువు' కవితా సంపుటాన్ని, కొన్ని అముద్రిత నాటకాలను మార్కెట్ లోకి తెచ్చేసరికి, ఆర్థికంగా బలం లేని మాకు వెన్ను విరిగింది. అయితేనేం, పిత్రూణాం కొంతైనా తీర్చుకోగలిగామనే ఆత్మ తృప్తీ మిగిలింది.
' అష్ట గ్రహ కూటమి' అన్నది మా ఎనిమిది మంది పిల్లల మీద నాన్న గారి ఛలోక్తి. అమ్మతో కలిపి నాన్న గారి జాతకం లో మేము ' నవగ్రహాలు' అన్న మాట! ( చిన్న తనం లోనే బాల జోస్యుడిగా పేరు తెచ్చుకున్న రెంటాలకు జ్యోతిష్యం లో లోతైన అబినివేశం ఉండేది). సెలవు పెట్టకుండా ఆఫీస్ పని లోనే మునిగి తేలే ఆయనకు నిత్యం సభలు, సమావేశాలు, ఇంట్లోనేమో ఉదయం, సాయంత్రం సృజనాత్మక వ్యాసంగం--వీటికే సరిపోయేది! ఇరవై నాలుగు గంటల జీవితం లో ఆయన మమ్మల్ని లాలించలేదు. బుజ్జగించలేదు. చేయి పట్టుకొని నడిపించలేదు. ఇలా ఉండాలని ప్రత్యేకించి చెప్పలేదు. ఇలాగే ఉండండని శాసించలేదు. బోధనలో ఆయనది మౌనంగా ఉంటూనే, శిష్యుల సందేహాలను పటాపంచలు చేసే దక్షిణామూర్తి సంప్రదాయమని అనిపిస్తుంటుంది.
నాన్న గారి ఈ విజయాలన్నింటి వెనుకా అదృశ్యం గా నిలిచింది మా అమ్మ-- పర్వత వర్ధని. ఊరు కానీ ఊళ్ళో, భాష రాని అమ్మ, నాన్న గారి రచనా జీవితానికి ఇబ్బంది లేకుండా పుట్టింటిని సైతం మర్చిపోయింది. ఇంటి బాధ్యతలు నెత్తిన వేసుకొని, రెక్కలు ముక్కలు చేసుకుంది. అమ్మ ఎప్పుడూ తెర వెనుకే! ఆయన పేరు చదవడం కోసం అప్పట్లో కష్టపడి కూడబలుక్కొని తెలుగు చదవడం నేర్చుకున్న అమ్మ, ఆయన పోయాక ఆయన పుస్తకాలు ప్రచురిస్తుంటే, వాటిని చూడటం కోసం రాత్రిళ్ళు లేజర్ ప్రూఫ్ ల కోసం కాచుకు కూర్చున్న అమ్మ --ఇవాళ్టికీ ఆయనకు లభించిన కొండంత సిరి.
అప్పటికీ, ఇప్పటికీ ఎక్కడైనా, ఎవరైనా అడిగినప్పుడు పూర్తి పేరు చేపప్గానే, ' ఫలానా రెంటాల గోపాల కృష్ణ గారు మీకు ఏమవుతారు?' అనే ప్రశ్న మా ఇంట్లో అందరికీ అనేక సందర్భాల్లో ఎదురయ్యే అనుభవం. ' ఆయన మా నాన్న గారు' అనగానే అవతలి వ్యక్తి కళ్ళల్లో ఓ చిన్న వెలుగు, మాటలో ఓ చిన్న మెరుపు. అదే నాన్న గారు మాకిచ్చిన మూలధనం. బతకడానికి కావల్సిన బడి చదువులేవో చెప్పించి, మనిషి గా జీవించడానికి మార్గమేమితో చెప్పకుండానే చేతల్లో చూపించిన పాత తరం పెద్ద మనిషి నాన్న గారు. అందుకే, ఆయనంటే మా ఇంటిల్లపాదికీ ప్రేమ, గౌరవం, ఆరాధన! నాన్న గారు కీర్తి కాయం తో చిరంజీవులై పదహారేళ్ళవుతున్నా, ఇప్పటికీ ఆయన ప్రస్తావన వస్తే పూదూకుపోయే గొంతు పేగుల్చుకొని మరీ మా కల్పనా కవిత లో మాటలే చెప్పాలని ఉంది--

" నాన్నా! ఇవాళ్టికీ మన మధ్య ఎంత దూరమో, అంత దగ్గర!"

డా. రెంటాల జయదేవ

23 వ్యాఖ్యలు:

Praveen Sarma said...

ఈ రోజే గూగుల్ ప్లస్‌లో అఫ్సర్ గారు ఇచ్చిన లింక్ చూసి చదివాను. పుస్తకాలు కొనడమే ఆర్థిక భారమనుకునేవాళ్ళు ఉన్న దేశంలో అద్దె ఇంటిలో ఉంటూ పుస్తకాలు కొనడం గొప్పే.

SRRao said...

కల్పన గారూ !

మీ తండ్రి గారు రెంటాల గోపాలకృష్ణ గారికి నివాళులు ఆర్పీస్తూ.. ఆయనపై చక్కటి వ్యాసాన్ని అందించిన మీకు, జయదేవ గారికి ధన్యవాదాలు.

sri said...

PRODDUNNA SAKSHI LO CHADIVANU,MALLI EDIT CHEYABADANI EEE VYASAM CHUSANU.
KAALAM MALLI VENAKKI VELLI EE FEELINGS UNTE,KALLA MUNDU RENTALA UNTE ENTA BAVUNTUNDO KADA.
AYUNA RENTALA PHYSICAL GAA MATRAME LERU,MAANASIKAM GA MEETONE VUNNARU KADA, AAYANAKU PUTTINA MEE ASHTA GRAHA KUUTAMI ANTA DHANYULU.
MAY GOD BLESS U ALL.
V SRINIVASA RAO,KHAMMAM

జంపాల చౌదరి said...

మిమ్మల్ని కలిసినప్పుడు నేనూ అదే ప్రశ్న అడిగాను. సాహిత్యంలో బహుముఖప్రజ్ఞాశాలి మీ నాన్నగారి గురించి జయదేవ హృద్యంగా చెప్పారు.

kasturimuralikrishna said...

రెంటాల గోపాలకృష్ణ గారు చేసిన ప్రాచీన సంస్కృత కావ్యాల అనువాదాలు, నా లైబ్రరీలో విశ్వనాథవారి పుస్తకాల సరసన వుంటాయి. ఆయన అనువాదాలు పక్కన పెట్టుకుని, మూల సంస్కృత కావ్యాన్ని చదువుతూ నేను ఎంతో ఆనందాన్ని పొందాను. నేర్చుకున్నాను. వారిని నా మనస్సుమాంజలులు.

భాను said...

చాలా రోజుల తర్వాత కల్పనా గారూ...
మీ నాన్న గారికి నివాళులు అర్పిస్తూ...మీ నాన్న గారి గురించి ఎన్నో విషయాలు తెలిసాయి.

సుజాత said...

అందుబాటులో లేని ఆయన రచనలూ, అనువాదాలూ మీ అష్టగ్రహ కూటమి పూనుకుని తిరిగి ప్రచురించి సాహితీ ప్రేమికులందరికీ అందుబాటులోకి తెస్తే బాగుంటుంది. (మరీ ఖర్చు దారీ అయిడియా చెప్పినట్టున్నా)

ఇప్పుడు మీ నాన్నగారి లైబ్రరీ ఎవరి దగ్గర ఉంది.అందులో పుస్తకాలన్నీ భద్రంగానే ఉన్నాయా? అరుదైన రచనల్ని తిరిగి ప్రచురించడానికి సాహితీ ప్రేమికుల ఆర్థిక సహాయం కూడా(తప్పేముంది, తలా ఒక చెయ్యేస్తేనే కొన్ని పనులు పూర్తవుతాయి...ఒక్కరుగా చేయలేనప్పుడు)తీసుకోవచ్చేమో చూడండి.

umamaheswara rao c said...

Kalpana garu,and also Jayadeva garu thanks for enriching our memories of your father, definitely his relentless contributions to Telugu literature will be ever remembered by our generation of hot seventies.When we were of the opinion that all old is reactive to progressivism,he has introduced some positive things of classics and meanings of certain practices in the process of human development and culture. He never supported discrimination and exploitation in any form.

కృష్ణప్రియ said...

చాలా చక్కని వ్యాసం. జయదేవ గారు ఆయన కొడుకు అని తెలుసు కానీ మీరు వారి అమ్మాయి అని తెలియదు.

మీ తండ్రి గారికి నివాళులు అర్పిస్తూ..

వనజ వనమాలి said...

కల్పన గారు.. చాలా బాగా చెప్పారు.హర్ట్ టచింగ్ గా ఉంది.నిలువెత్తు సాహితీమూర్తి ప్రతిబింబాలు మీరు.భావనలొ,భావాలలొ..వారు జీవించి ఉన్నారు. సుజాత గారి సూచన బాగుంది. మీ నాన్న గారి గురించిన స్పందన నన్ను చాలా సేపు కాదు కాదు కొన్ని గంటలు మౌనంగా,భారంగా..ఉంచింది.
జయదేవ్ గారికి..ధన్యవాదములు.లింక్ ఇచ్చిన మీకు దన్యవాదములు.

ఆ.సౌమ్య said...

నిన్ననే చదివానండీ, చాలా బావుంది. ఇవాళ నేను నా బజ్జులోనూ, గూగల్ ప్లస్ లో పెట్టుకున్నాను కూడా

Anonymous said...

srinivas garu, mee spandana bagundandi

Kalpana Rentala said...

ఈ వ్యాసం చదివి స్పందించిన వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. మీ అందరి అభిమానాన్ని, ప్రేమ ను పంచుకోగలిగిన మా నాన్నాగారు, మేము కూడా అదృష్టవంతులం.
ప్రవీణ్, మీ కామెంట్లు చూసి చాలా రోజులయింది.
ఎస్.ఆర్. రావు గారు, ధన్యవాదాలు.
శ్రీనివాస్ గారు,మీ ఆప్యాయత కు కృతజ్నతలు.
జంపాల గారు, అవును. మీ ప్రశ్న నాకు గుర్తుంది. బహు కాల దర్శనం. ఎలా వున్నారు?
కస్తూరి మురళి కృష్ణ గారు, అవును. తన రచనలకు పాఠకులు ఉండటం, తన రచనలు మిగిలి ఉండటం వీటి కన్నా యే రచయిత కైనా కావాల్సింది ఏముంటుంది? మీకే మా నమస్సులు.
సుజాత, పుస్తకాలన్నీ భద్రం గా వున్నాయి. కాకపోతే కొన్ని బాగా చిరిగిపోయే స్థితి లో వున్నాయి. పుస్తకాలు అన్నీ కాకపోయినా ముఖ్యమైనవి కొన్ని అయినా మళ్ళీ ప్రచురించాలని ఆలోచన వుంది. ఖర్చు కి సంబంధించిన సమస్య ఒక వైపు మాత్రమే. వాటిని మేము వేసినా ఎంత మంది చదవటానికి సిద్ధంగా వున్నారు ? అన్నది మాత్రం తెలియటం లేదు.
ఉమా మహేశ్వర రావు గారు, ఎంత కాలమయింది మిమ్మల్ని ఈ రకంగానైనా చూసి? మీరు వ్యాసం చదవతమే కాకుండా వచ్చి కామెంట్ కూడా పెట్టినందుకు థాంక్స్. మళ్ళీ " అంకురం" సినిమా కూడా కళ్ల ముందు కదులుతోంది.
వనజా వనమాలి గారు, మీరు కేవలం చదవటం కాకుండా అందులో లీనమయ్యారని నేను చెప్పగలను. ధన్యవాదాలు.
ఆ.సౌమ్య, నిజంగా థాంక్స్.
కృష్ణప్రియ గారు, అన్యాయమండీ, వాడి కన్నా నేను ముందు పుట్టాను. :-)) జస్ట్ కిడ్డింగ్.థాంక్స్ ఫర్ రీడింగ్.
భాను, మీరు కూడా చాలా కాలానికి కనిపించారు.

Praveen Sarma said...

అగ్రెగేటర్ నిర్మాణ పనుల్లో ఉండి కామెంట్లు వ్రాయలేదు. http://teluguwebmedia.in ఈ ప్రొజెక్ట్ పనుల్లో ఉండే నేను కామెంట్లు వ్రాయలేకపోయాను.

శరత్ చంద్ర said...

కల్పన, చాలా మంచి వ్యాసం. ఎడిట్ చేసిన దానికంటే ఇదే బావుంది. ఆయన బ్రతికున్నప్పుడు మీ అష్టగ్రహ కూటమిలో ఆయన సాహితీ వారసత్వం ఎవరికయినా వెళ్తుందని ఆయన గుర్తించారా?

రవి said...

కల్పన గారూ, మీ బ్లాగు చాలాకాలం క్రిందట మొదటి సారి చూసినప్పుడు, నేను అదే ప్రశ్న "మీరు గోపాలకృష్ణ గారి అమ్మాయా?" అని అడుగుదామనుకున్నాను. అంతలోనే అవునని తెలిసింది.

శ్రీ గోపాలకృష్ణ గారి సింహాసనద్వాత్రింశిక కథలు బాలజ్యోతి మధ్యపేజీలలో వచ్చే రోజుల్లో నా బాల్యం గడిచింది. దాదాపు మూడేళ్ళు ఆ సీరియల్ వచ్చిందనుకుంటాను. ఆయన పేరు వింటే ఇప్పటికీ ఆ సీరియలే గుర్తొస్తుంది. అలా మీ తండ్రిగారు నాలాంటి ఎంతోమంది పిల్లలను చేయిపట్టుకు నడిపించి ఉంటారు.

ఆ బాలజ్యోతి పుస్తకాలు మీ వద్ద ఉంటే డిజిటైజ్ చేసి పెట్టడమే మీరు మీ నాన్న గారికి చూపించే నివాళి. ఈ విన్నపం తప్పక పరిశీలించండి.

Kalpana Rentala said...

శరత్, అవును. గుర్తించారు. చెప్పారు కూడా . కాకపోతే ఆయన వారసులమే కానే, నిజమైన సాహితీ వారసత్వం మాకేవ్వరికీ రాలేదని నాకు వ్యక్తిగతం గా అనిపిస్తుంది. మా ఎనిమిది మంది లో మా పెద్దన్నయ్య, నేను, మా తమ్ముడు ముగ్గురికి ఈ సాహిత్యం పట్ల ఆసక్తి అబ్బింది.
రవి, అవును.మీ సూచన తప్పక గుర్తు పెట్టుకుంటాము. బాలజ్యోతి లోనే బొమ్మలు చెప్పిన కథలు కూడా సీరియల్ గా వచ్చింది. అది కూడా చాలా బావుంటుంది. విక్రమార్కుది కి సాలభంజికలు చెప్పిన కథలు.

రవి said...

బొమ్మలు చెప్పిన కథలేనండి. మూలం సంస్కృతంలోని సింహాసనద్వాత్రింశిక కథలు అనుకుంటాను. పేరు గుర్తు రాక అలా చెప్పాను.

కొత్త పాళీ said...

very nice.

Kalpana Rentala said...

కొత్తపాళి, థాంక్స్.

రవి గారు, బొమ్మలు చెప్పిన కథలలాగానే భేతాళ పంచ వింశతి కథలు కూడా ' అసలు భేతాళ కథలు ' అని వఃచాయి. అప్పట్లో టీవీ లో భేతాళ కథల కింద కల్పిత కథలు వచ్చేవి.అందువల్ల కాబోలు నాన్నగారు ఆ పేరు పెట్టారు. ఇవి కాక చిలుక చెప్పిన కథలు కూడా వచ్చినట్లు గుర్తు. మీరు ఒకటి అడగానే నాకు ఇవన్నీ గుర్తొచ్చాయి. మీరు అడిగినట్లు బొమ్మలు చెప్పిన కథలు పిల్లల కోసం వేయగలమెమో చూస్తాము. వాటికి మంచి బొమ్మలు కూడా వేయించుకొని వేస్తే బావుంటుంది కానీ ఖర్చు పెరిగిపోతుంది. :-((

వేణూ శ్రీకాంత్ said...

చాలా బాగుందండి..
వ్యాసానికి "ఎంత దూరమో అంత దగ్గర" అంటూ మీరు ఎన్నుకున్న శీర్షిక కూడా చాలా బాగుంది.

తృష్ణ said...

చాలా ఆలస్యంగా చూశాను టపా..చాలా బాగా రాసారు జయదేవ్ గారు. అదృష్టవంతులు మీరు.

Kalpana Rentala said...

వేణుశ్రీకాంత్, తృష్ణ థాంక్స్. అవును. మేం అదృష్టవంతులమే.

 
Real Time Web Analytics