కథానుభవం-8
' మృణ్మయనాదం' లో అహల్య హెచ్చరిక
అపురూప సౌందర్య రాశి అహల్య ను నైతికానైతికతల త్రాసు లో తూచి చలనం లేని శిల ను చేశారు. రాముడి పాద స్పర్శ తో శాప విమోచనం జరిగిందని చెప్పి అసలు విషయం మీద జరగాల్సిన చర్చకు అవకాశం ఇవ్వకుండా అహల్య కథ ను ముగించేశారు. పంచ మహా పతివ్రతల్లో ఒకరుగా ఆమె ను చేర్చి ఆ తర్వాత ఘనకీర్తులందించారు.అహల్య మారు వేషం లో వున్న ఇంద్రుడిని గుర్తించిందా? లేదా? మారు వేషం లో వచ్చింది ఇంద్రుడని తెలిసి తెలిసీ అహల్య ఆ తప్పు చేసిందా ? లేక ఇంద్రుడి చేతిలో ఆమె మోసగించబడ్డదా? యుగాల నుంచి అహల్య తప్పొప్పుల గురించి ఈ చర్చ జరుగుతూనే వుంది.
" విచారణ జరపడం అంటే అపనమ్మకమే కదా. దాని కంటే ఏదో ఒక నమ్మకం నయం కదా!" అన్న ప్రధానమైన ప్రశ్న ను అహల్య పాత్ర ద్వారా లేవనెత్తుతుంది ఓల్గా తన ' మృణ్మయ నాదం ' కథలో. .మన మీద ఒకరు అధికారం తో, పశు బలం తో చేసే విచారణ వెనుక వున్న కుట్ర గురించి అహల్య మాట్లాడుతుంది. నా తప్పొప్పులను మీరు నిర్ణయించటం కాదు, అసలు వాటిని విచారించే అధికారం మీకెవరు ఇచ్చారు? అని ప్రశ్నిస్తుంది . అంతేకాదు." ఎవరి సత్యం వారిది.సత్యాసత్యాలు నిర్ణయించగలిగే శక్తి ఈ ప్రపంచం లో ఎవరికైనా వుందా?" అని కూడా నిలదీస్తుంది.
అహల్య నుంచి , సీత నుంచి, రేణుక నుంచి ఇప్పటి దాకా కుటుంబాల్లో, చట్టాల్లో, కోర్టుల్లో, నడి రోడ్డు మీద స్త్రీలుతమ మనసు ల్లో ఏమనుకుంటున్నారో, శరీరాలు ఏం కోరుకుంటున్నాయో, ఏం చేస్తున్నాయో ఎన్ని సార్లు చర్చలు, విచారణలు జరిగి ఉంటాయో కదా! ఈ రోజు కి కూడా ఎక్కడో ఓ చోట, ఎవరో ఒక స్త్రీ మీద ఏదో ఒక రకమైన విచారణ జరుగుతూనే వుంది. ఆమె తప్పొప్పులను ఎవరో ఒకరు వెయ్యి కళ్ళతో నిర్ధారిస్తూనే వున్నారు. ఓల్గా ఈ కథ ద్వారా మాట్లాడుతోంది దాని గురించే. మన మనఃశరీరాల విచారణలో ముందు స్త్రీలకు తమ మీద తమకు అధికారం ఉంటుంది. అది మరెవ్వరి హక్కు కాదు. సొంతం కాదు అని అహల్య పాత్ర ద్వారా ఓల్గా మరో సారి స్పష్టం చేస్తోంది.
తొలి సారి అహల్య ని కలిసినప్పుడు " మీరు చేయని తప్పుకు దోషి గా నిలబడ్డారు " అని సీత ఆమె పట్ల జాలిపడుతుంది.
" ఈ లోకం లో అనేక మంది ఆడవాళ్ళు అలా నిలబడాల్సిందే గదా సీతా!" అంటుంది అహల్య.
" మీకు తెలియదు గదా అతను మీ భర్త కాదని" అన్న సీత సందేహానికి
" మారు వేషం లో వచ్చింది నా భర్త కాదని నేను గుర్తించానా, లేదా? లోకం లో అనేక మందిని వేధించే ప్రశ్న ఇది. నా భర్త కు మాత్రం ఆ తేడా లేదు. నాకు తెలిసినా, తెలియకపోయినా ఆయనాకొకటే. ఆయన వస్తువు తాత్కాలికంగా నైనా పరహస్తమయింది. మైలపడింది. మైల, శౌచం, పవిత్రం, అపవిత్రం, శీలం, పతనం -- ఈ పదాలను బ్రాహ్మణ పురుషులెంత బలంగా సృష్టించారంటే ఇందులో సత్యాసత్యాల ప్రసక్తే లేదు. విచక్షణే లేదు" అన్న అహల్య సమాధానం ఎంత సూటిగా, ఎంత నిర్భయంగా, ఎంత స్పష్టం గా ఉందో చూడండి.
అహల్య అంత స్పష్టం గా చెప్పినా సీత కు ఇంకా పూర్తిగా అనుమాన నివృత్తి కాలేదు. రాముడి మాటలు నిజమేనేమో, అహల్య సౌశీల్యవతి కాదేమో అనుకుంది. అప్పుడు అహల్య మరింత స్పష్టంగా యుగాల తరబడి తన మనసు లో దాచుకున్నవాటిని ప్రకటించించింది.
" నాలా మాట్లాడే స్త్రీలను భరించటం కష్టం సీతా. నేను తప్పు చేశానని ఒప్పుకుంటే భరిస్తారు. పాపానికో ప్రాయశ్చిత్తం ఉంటుంది. తప్పు చేయలేదని వాదిస్తే నా మీద జాలి పడతారు. అన్యాయంగా దోషం ఆరోపించారని నా పక్షం వహిస్తారు. కానీ నా తప్పొప్పులతో మీకేమిటి సంబంధం? అది విచారించే హక్కు, అధికారం మీకెవరిచ్చారంటే మాత్రం ఎవరూ సహించరు".
" ఆ అధికారం గౌతమ మహర్షి కి కూడా లేదా?" భార్యల శీలం మీద భర్తలకు అధికారం వుంటుందని అందరూ చెప్పే మాటలను నమ్ముతూ అమాయకంగా ప్రశ్నిస్తుంది సీత.
" లోకం ఆయనకు ఆ అధికారాన్ని ఇచ్చింది. నేనివ్వలేదు. నేనివ్వనంత వరకూ ఎవరూ నా మీద అధికారాన్ని పొందలేరు" అంటుంది అహల్య.
చేసిన తప్పుకు అహల్య శిలలా పడి ఉందని అందరూ అనుకునే దానికి అహల్య చెప్పిన సమాధానం ఇది " ఇన్నేళ్లూ నేను ఈ విశ్వం లో నా అస్తిత్వాన్ని గురించి ఆలోచిస్తున్నాను. ప్రపంచం ఏ నీతుల మీదా, ధర్మాల మీద నడుస్తోందో, వాటికి మూలమేమితో తెలుసుకున్నాను. నేనెంతో జ్నానమ్ సంపాదించాను. సత్యం ఎప్పుడూ ఒక్కలాగే వుండదని, నిరంతరం మారుతూ ఉంటుందని తెలుసుకోవటమే నేను సంపాదించిన జ్నానం. "
సీత, అహల్య ల కలయిక, వారిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ అంతా కూడా అరణ్యవాస సమయం లో జరిగింది. చివరగా వెళ్లబోయే ముందు అహల్య, సీత కి ఒక హెచ్చరిక లాంటి సలహా కూడా ఇస్తుంది. " ఎన్నడూ విచారణకు అంగీకరించకూ సీతా. అధికారానికి లొంగకు" .
రావణ సంహారం తర్వాత సీత ను అగ్నిపరీక్షకు సిద్ధం కమ్మని లక్ష్మణుడు రాముడి ఆజ్న ను తీసుకువచ్చినప్పుడు సీత కు మొట్టమొదట అహల్య గుర్తొచ్చింది. ఆమె చెప్పిన ప్రతి మాట స్ఫురణకు వచ్చింది. అయినా సరే సీత రాముడి కోసం అగ్నిపరీక్ష కు సిద్ధపడింది. లోకం ముందు రాముడు నిస్సహాయుడు, బలహీనుడు అని సీత కు అర్థమయింది. లోకమంటే అది చెప్పే నీతి సూత్రాలు, ధర్మశాస్త్రాలు అని సీత కు తెలుసు. లోకం నుంచి తన రాముడి ని రక్షించడానికి, అతని కన్నీరు తుడిచి అతనికి బలం ఇవ్వటానికి తాను తప్ప ఆ సమయం లో మరెవ్వరూ సహాయం చేయలేరని సీత కు తెలుసు. తాను అగ్ని పరీక్ష కు సిద్ధపడి రాముడి ని లోకం ముందు ధర్మం తప్పనివాడిగా నిలబెట్టింది సీత.
అగ్నిపరీక్ష తర్వాత అయోధ్య కి తిరిగివచ్చాక సీత కు అహల్య ని చూసి ఆమె తో మాట్లాడాలని బలంగా అనిపించింది. అందుకోసం ఒక సారి మళ్ళీ అరణ్యానికి వెళ్ళి రావాలనుకుంది. ఆమె అరణ్యానికి ఒక సారి వెళ్ళి రావాలని ఒకందుకు కోరుకుంటే , రాముడు ఆమె ను శాశ్వతంగా మళ్ళీ అరణ్యవాసానికి పంపించివేశాడు. నిండు గర్భిణీగా వున్న సీత ను ఏమైనా కావలసినది ఉంటే సందేహించక చెప్పమని వాల్మీకి మహర్షి అడిగినప్పుడు అహల్య ని చూడాలనుకుంటున్నానని చెప్తుంది సీత.
రావణ సంహారం తర్వాత నుంచి గడ్డకట్టుకుపోయిన సీత మనసు అహల్య ని చూడగానే , ఆమె స్నేహ స్పర్శ లో అది కరిగి నీరైపోయింది. సత్యాసత్యాల గురించి ఆనాడు అహల్య చెప్పిన మాటల అర్థం ఈ జరిగిన వాటన్నింటి వల్ల తనకు తెలిసినట్లు సీత వొప్పుకుంది. అంతే కాదు, తాను విచారణకు సిద్ధమయింది కేవలం రాముని కోసమే కానీ, తన కోసం కాదని చెప్తూనే అయినప్పటికీ అది ఎప్పటికీ అలా వెంటాడుతూనే వుంటుందా? అని సీత అడిగినప్పుడు " రాముని కోసం కాక నీ కోసం నువ్వు నిర్ణయాలు తీసుకునేవరకూ ఇది నిన్ను వెంటాడుతూనే వుంటుంది సీతా. నువ్వున్నావు. బాధ అనుభవిస్తునావు. ఎవరి కోసమో అనుభవిస్తున్నానని అనుకుంటున్నావు. ఎవరి కోసమో కర్తవ్యాన్ని పాలించావని అనుకుంటున్నావు. నీ ధైర్యం, నీ మనో నిబ్బరం అన్నీ పూర్తిగా ఇతరులకిచ్చావు. నీ కోసం ఏం మిగుల్చుకున్నావు?" అని అడుగుతుంది అహల్య.
నేనంటే ఎవరిని ? అని సీత అడిగినప్పుడు " నువ్వు శ్రీరాముని భార్యవు మాత్రమే కాదు. అంతకు మించినది, అసలైనదీ నీలో వుంది. అదేమిటో తెలుసుకోవాలని స్త్రీలకెవరూ చెప్పరు. పురుషుల అహం ఆస్తులలో, ప్రతాపాలలో, విద్యలో, కులగోత్రాలలో ఉంటే స్త్రీల అహం పాతివ్రత్యం లో, మాతృత్వం లో ఉంటుంది.ఆ అహంకారాన్ని దాటాలని స్త్రీలకెవరూ చెప్పరు. విశాల ప్రపంచం లో తాము భాగమని వారు గుర్తించరు. ఒక వ్యక్తి కి, ఒక ఇంటికి, ఒక వంశ గౌరవానికి పరిమితమవుతారు. ఆహాన్ని పెంచుకోవడం, ఆ అహం లోనే కాలీ బూడిదై పోవడం స్త్రీల గమ్యమవుతుంది. సీతా, నువ్వేవరో, నీ జీవిత గమ్యమేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించు. అది అంత తేలిక కాదు. కానీ ప్రయత్నం ఆపకు. చివరకు తెలుసుకుంటావు. నీకా శక్తి ఉంది. శ్రీరామచంద్రుడిని కాపాడగలిగిన దానివి నిన్ను నువ్వు కాపాడు కోలేవా--ఇదంతా ఎందుకు జరిగిందని విచారించకు.ఇది నీ మంచి కోసమే. నిన్ను నువ్వు తెలుసుకునే క్రమం లో భాగం గానే జరిగింది.ఆనందం గా ఉండు. ఈ ప్రకృతి ని, సకల జీవ రాశి పరిణామ క్రమాన్ని పరిశీలించు. అందులో నిరంతరం జరిగే మార్పు ని గమనించు. అరణ్యం లో ఆశ్రమాలే కాదు, అనేక జాతుల ప్రజలున్నారు. వాళ్ళ జీవితాలు గమనించు. ఈ మొత్తం ప్రపంచం లో నువ్వున్నావు. ఒక్క రామునికే కాదు. నీకు మాతృత్వం అనుభవమవబోతోంది. దానిని కూడా ఆనందించు. ఏ కోరికలు, ఆశలు పెంచుకోకుండా లేడి పిల్లలను పెంచినల్టు నీ పిల్లలను పెంచు ."
నీ జీవితం, నీ కర్తవ్యం మొత్తం భర్త, పిల్లలు,ఆ కుటుంబం కోసం మాత్రమే కాదు. నీకు నువ్వు మిగలాలి. నీ కోసం నువ్వు నిర్ణయాలు తీసుకోవాలి. అహల్య అనుభవ పూర్వకంగా చెప్పిన ఈ మాటలు ఆ సీత కే కాదు, ఆధునిక సీత లకు కూడా నిస్సందేహంగా ఉపయోగపడే జ్నాన సంపద.
చెప్పవలసిన దంతా సీతకు చెప్పాక " సీతా! నా విషయం లో సత్యమేమిటో చెప్పమంటావా?" అన్న అహల్య మాటలకు సీత " వద్దక్కా, ఏదైనా ఒకటే. దానికే అర్థం లేదు" అంటుంది. నిజమే , అహల్య చేసింది తప్పో, వొప్పో తెలుసుకోవాలని ఇవాళ ఏ స్త్రీ ఆతృతపడటం లేదు.
అహల్య అందించిన జ్నానాన్ని, తన స్వానుభవ సారాన్ని మేళవించుకున్నాక, లవకుశులను ఆదరించి అక్కున చేర్చుకొని తన కోసం రాముడు చాచిన చేతిని అందుకోకుండా సీత తన గమ్యాన్ని తాను నిర్ణయించుకొని తన తల్లి భూదేవి చెంతకు చేరుకుంటుంది.
"సీత సహాయం లేని రాముడు జీవితం లో మొదటి సారి ఓటమిని రుచి చూశాడు. బయట నుంచి వచ్చే అధికారానికి లొంగని సీత, తన లోపల తన మీద తనకున్న అధికార శక్తిని మొదటి సారి సంపూర్ణంగా అనుభవించింది. "
ఇతిహాస పాత్రలను నేటి సమాజానీకనుగుణంగా ఎలా అర్థం చేసుకోవాలో చెపుతూ ఓల్గా ఒక వరుస క్రమం లో రాసిన కథల సమాహారం " విముక్త". ఈ పుస్తకం లో ఈ మృణ్మయ నాదం కథ తో పాటు, సమాగమం, సైకత కుంభం, విముక్త, బంధితుడు కథలున్నాయి. ఒక్కో కథ మీద ఒక చిన్న పరిచయం ఇలాగే మీ కోసం....
8 వ్యాఖ్యలు:
very nice
నిన్ననే ఈ పుస్తకం తీసుకొన్నాను. అది చదివాక మీ పోస్ట్ చదువుతా.
శివ గారూ థాంక్స్. వీలైతే పుస్తకం సంపాదించి చదవండి.
భాను, ఇంకేం, పుస్తకం మీ చేతి లో వుంది కాబట్టి ఆ కథలు ఎంత బాగున్నాయో నేను చెప్పక్కరలేదు. మీకే తెలుస్తుంది.
కొందరు కథలు పెడితే బావుండు అని అడుగుతున్నారు. తప్పకుండా ప్రయత్నిస్తాను కంపోజ్ చేయటానికి.
ఇది నేను ఏదో పత్రిక లో చదివాను. అలాగే ఆవిడ రాసిన ఊర్మిళ కథ కూడా చాలా టచింగ్ గా ..చదివాక చేదుగా అనిపిస్తుంది..
కృష్ణప్రియ,
అవును. ఓల్గా ఈ కథలు ఒక వరుస క్రమం లో రాశారు. అనీ కథలు కలిపి విముక్త గా ప్రచురించారు. ఇందులోని కథలన్నీ నాకు బాగా ఇష్టం.
కల్పన గారికి,
మీ 'కథానుభవం' నాకు చాలా చాలా వుపయోగపడింది. ఒకవేళ ఇదే పుస్తకాన్ని నేను తీసుకుని చదివి వుంటే... మీరు పరిచయం చేసిన కోణంలో నేను అర్థం చేసుకుని వుండేవాణ్ణో లేదో...
any which way, thanks a ton.
మీ ఈ కధ చదివాక ఈ పుస్తకాన్ని కొనాలని నిర్ణయించేసుకున్నాను. అలాగే నాకనిపించిన రెండు విషయాలు
1) వోల్గా గారు ఈకధలో పరిచయంచేసిన సీత చివరికి కొంతైనా స్వాభిమానాన్ని ప్రదర్శించింది, ఒరిగినల్ కావ్యాల్లో ఒరిజినల్ నాయికలు తమతమ భర్తల విషయంలో అంతటి ఆత్మాభిమానాన్ని ప్రదర్శించారా? నాకు ఇందులోని సీతె నిస్సందేహంగా నచ్చింది కానీ ఇది అసలు పాత్రను బోధిస్తున్న ఆదర్శానికి అనుగుణంగా మలచడం (మార్చడం) కాదా? ఆయా పాత్రలకి లేని సుగుణలను వారికి ఆపాదించి ఎలాగోలా వారిని గ్రోరిఫై చేసేకంటే కావాల్సిన సుగుణల్లతో క్రొత్త ఆదర్శపాత్రల(role modelsను తయారుచేసుకోవచ్చుకదా.
2) ఇందులోని వ్యక్తివాదభావనలు ఒక్క స్త్రీలకే అనికాకుండా పురుషులకు కూడా ఒకడోసు పడితే మంచిది. ఎందుకంటె మనందరమూ ఒకదాన్ని న్యాయమని నమ్మి, అదెన్నటికీ మారదని తీర్మానించేసుకొని, ఆ మూస్దకి సరిపోయేలా మన స్వాతంత్ర్యాలను తెగ్గొట్టుకుని జీవించడానికి అవైరామంగా కృషిచేస్తున్నాము.
ఓ కథ వ్రాసాక ఈ పోస్ట్ చదివాను
ఆలోచింపజేసే సమీక్ష ఇది.
విముక్త ని నెను ఇంకా చదవలేదు. వెంటనే చదవాలి అనుకుంతున్నాను. థాంక్యూ కల్పన గారు
Post a Comment