నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Monday, August 01, 2011

ఋతుభ్రమణంఇంకా రాలేదు. ఎంత కాలం ఈ ఎదురుచూపులు?

ఏమై వుంటుంది?

ఒక వేళ..? ఊహూ..అయి ఉండదు. తప్పనిసరిగా అదై ఉండదు. ఆమె తన మనసు కి తానే సర్ది చెప్పుకుంది.
ఒక పచ్చి పుండు ను లోపల దాచుకున్నట్లు ఉంది ఆమె కు. కళ్ళు మూసుకుంటే వేడి అలలు దేహాన్ని ఆవరించుకుంటున్నాయి. ఉక్కపోత గా అనిపించింది. ఏదో ఉక్కిరిబిక్కిరితనంగా కూడా అనిపించింది.
నెమ్మదిగా లేచి కిటికీ తలుపు తీసింది. ఉత్తరపు గాలి మొహాన్ని ఒక్క సారిగా ముద్దు పెట్టుకుంది. ఆ చలిగాలి శరీరాన్ని,
మనసుని సేదతీరుస్తోంది.

ప్లీజ్! ఆ తలుపు వేసేయరాదూ! అసలే చలిగా ఉంది అంటూ దుప్పటి ముసుగు లోకి మరింతగా ముడుచుకున్నాడు అతను.
నెమ్మదిగా కిటికీ తలుపు వేసేసి శబ్దం కాకుండా బయట తలుపు తీసి ఆరుబయట వరండా లోకి వచ్చింది. చల్లగాలి ఇప్పుడు మరింత ఎక్కువగా దగ్గరకు తీసుకుంది . చీర కొంగు ను భుజాల మీదుగా కప్పుకొని అక్కడున్న అరుగు మీద కూర్చుంది.
ఎవరన్నారు ఒంటరితనం బాధాకరమని?
ప్రాణ వాయువు లాగా అది కూడా ఓ తప్పనిసరి అవసరం కదా! మనుష్యుల మధ్య ప్రేమ ఎంత ఎవసరమో, ఒంటరి తనం కూడా అంత అవసరం. అప్పుడే కదా మన లోపల్లోపలికి తొంగి చూసుకోగలం. ఎవరికీ తెలియకుండా రాక్షసుడి ప్రాణ రహస్యం దాచుకున్నట్లు ఆ ఏకాంతానికి ఎన్ని అరలు? ఎన్నో రహస్యాలు తెలిసిన ప్రాణస్నేహితుడిలా!
ఆమె, చెట్లు, పుట్టలు, ఆకాశం, నక్షత్రాలు, తీతువు పిట్ట అన్నీ రాత్రి భాష మాట్లాడుకున్నాయి. అలసట పోయి శరీరానికి కొత్త ఉత్సాహం వచ్చినట్లనిపించింది. కనురెప్పల్ని నిద్ర కమ్ముకుంటుంటే నిశ్శబ్దంగా లోపలకు వచ్చింది. పిల్లలిద్దరి ఒంటి మీద దుప్పట్లు సరి చేసి వారి పక్కన నడుం వాల్చింది ఆమె.

పడుకున్నా ఆమె లో ఆలోచనలు సాగుతూనే వున్నాయి.

అసలు ఈ నెల రాదా? ఒక వేళ రాకపోతే ...ఆదేనా...పోనీ ఆ హోమ్ కిట్ వాడితే తెలిసిపోతుంది కదా....వద్దులే.....ఇంకో రెండు మూడు రోజులు వెయిట్ చేద్దాము.

ప్రతి నెలా ఓ ఎదురుచూపు. ఇంకేమీ పని లేనట్లూ, జీవితానికి వేరే లక్ష్యమేమీ లేదన్నట్లు ఆ డేట్ ఎప్పుడా, లెక్క సరిగ్గా ఉందా, వస్తోందా, రావడం లేదా, హార్మోన్లలో తేడా వస్తోందా? ఆహారపుటలవాట్లు ఏమైనా మార్చాలా? జీవితమంతా ఆ ఋతువు చుట్టూ తిరుగుతూ ఉంటుంది కదా అనిపిస్తోంది. రావడం లో ఉండే ఇబ్బందులు. రాకపోవడం లో ఉండే ఇబ్బందులు. ఇటైనా, అటైనా ఇబ్బందులు తప్పవు. అందరికీ ఆరు ఋతువులైతే ఆడవారికేమిటో ప్రతి నెలా ఈ ఋతువు.
ఋతువు అనుకోగానే ఋతుక్రమం గుర్తుకు వచ్చింది. తన జీవితమంతా దాని చుట్టూ ఎలా అల్లుకుపోయిందో అవన్నీ ఎవరికో చెప్పుకుంటున్నట్లు ఒకొక్కటిగా గుర్తు చేసుకోవటం మొదలుపెట్టింది.
******
ఋతుక్రమం అనే మాట పదకొండేళ్ళకే తెలిసింది. రజస్వల అయినప్పుడు మాత్రం భలే సంతోషమేసింది. ఎందుకంటే అప్పటి దాకా నువ్వుల ఉండ దొంగచాటుగా తినదమే తప్ప సరిగ్గా తినలేదు '. చిమ్మిరి తింటే నువ్వు కూడా అప్పుడే కూర్చుంటావే అమ్మా' ! అంటూ అమ్మ దూరం పెట్టేది. అయినా అక్కను బతిమిలాడి దాని దగ్గర నుంచి కొంచెం పెట్టించుకొని తినేవాళ్లం. ఇప్పుడు నాకు చిమ్మిరి ఉండ తినే హక్కు వచ్చేసింది కదా అనుకున్నాను. రజస్వల అయితే ఎంచక్కా ఓణీ వేసుకోవచ్చు. కాలిగోళ్ల తో సహా మొత్తం గోరింటాకు పెట్టుకోవచ్చు అనుకోని తెగ సంబరపడిపోయాను. అదేమిటో, సమర్తాడేవరకూ కాలి గోళ్ళకు గోరింటాకు పెట్టుకోకూడ దంటుంది అమ్మ. అమ్మకి అన్నీ ఇలాంటి చాదస్తాలు ఎక్కువ.
నెల నెలా వచ్చే ఆ ఋతువు లోని కాస్తాలు ఇప్పుడు కదా తెలిసి వచ్చాయి. నెల గిర్రున తిరిగోచ్చేసేది. అప్పట్లో ఇన్ని సౌకర్యాలుండేవి కావు. అవి వాడటం లో ఉండే ఇబ్బందులు, ఎవరికీ తెలియకుండా ఉంచుకోవాలనుకునే తాపత్రయం. ఎవరికైనా తెలిసిపోతే ఉండే సిగ్గు. రకరకాల సందేహాలు.
అమ్మనడిగితే ఆ విషయాలన్నీ దాపరికంగా ఉంచాలనేది. 'మూడు రోజులు దూరం గా కూర్చుంటే అందరికీ తెలిసిపోతుంది కదమ్మా, ఇంకేమిటి అందులో దాపరికం ' అంటే ' అదంతేలే, యక్ష ప్రశ్నలు వేయకు, నోరు మూసుకో ' అని నా నోటికి, నా సందేహాలకు తాళం వేసేసేది.
కాలేజీలో కాస్త డబ్బు, ఇంకాస్త ఎక్కువ పరిజ్నానం కలిగిన స్నేహితురాళ్ళ వల్ల దాని చుట్టూ ఉండే ఓ రహస్య వలయాన్ని ఏదో ఛేదించాం. కొంత తెలుసుకున్నామన్న సంతోషం. కానీ మాకు ఆ రహస్యమేమిటో తెలుసు అని పైకి చెపితే ఒప్పుకోరు కదా! తెలిసినట్లు చెప్పుకోనివ్వరు కదా! ఎందుకే, ఆ పెద్ద వాళ్ళ విషయాలు మీకు అంటూ అసలేవిషయం చెప్పకుండా గుంభనంగా మాట్లాడుకునేవారు .
అది కొత్తగా టీవీ రంగప్రవేశం చేసిన రోజులు. పుస్తకాల్లోనో, టీవీలోనో శానిటరీ నేప్ కీన్స్ అడ్వర్టైజ్ మెంట్లు వస్తే అదేమిటో, అవి ఆడవాళ్ళకు ఎందుకు అవసరమో అన్నయ్యలకు తెలిసిపోతుందని సిగ్గు తో తల దించేసుకున్నా , దానికి సంబంధించి కొత్త పద్ధతుల గురించి తెలుసుకోవాల్సిన విషయాలన్నీ దొంగ చాటు గా తెలుసుకొని ఏమీ తెలియని అమాయకపు మొహం వేసుకొని అమ్మా వాళ్ళ ముందు తిరిగే వాళ్లం.
అక్కకు నెలసరి ముందు విపరీతమైన కడుపు నొప్పి వచ్చేది. నాకు మాత్రం నడుం నోప్పే కానీ మొన్న మొన్నటి వరకూ కడుపు నొప్పి ఉండేది కాదు. అక్క కి అమ్మా, వదిన కలిసి ' బెరాల్గాన్' మాత్ర ఇచ్చేవారు. బయట జేరాక ఆ నొప్పి ఒక్కోసారి ఇంకా ఎక్కువయ్యేది. " కాస్త ఓర్చుకో తల్లీ! ఆ పెళ్ళి జరిగి కార్యం అయిపోతే ఇలాంటి నొప్పులేమీ ఉండవు. అప్పటి దాకా ఈ ముట్టు శూల ఎలాగోలా ఓర్చుకోమ్మా!' అంటూ అమ్మ దూరం నుంచే ధైర్యం చెప్పేది. నాకైతే అక్క ను తాకి పక్కన కూర్చొని కాసేపు కాళ్ళు పిసకాలనిపించేది. నా ఒళ్ళో పడుకోబెట్టుకొని చేత్తో నిమురుతూ ఉండాలనిపించేది. మైల మైల అంటూ మూడ్రోజులు దూరం పెట్టేవారు.
ఇక ఆ ముట్టు స్నానం అదో తతంగం.
తెల్లారగట్ట సూర్యోదయం కాకముందే ముట్టు స్నానం చేసేయాలట. దాంతో అమ్మ తెల్లవారుఝామునెప్పుడో నిద్ర లేపేసేది. అమ్మ వచ్చి పై నీళ్ళు పోసి పసుపు ముద్ద చేతి లో వేసి కొంచెం నీళ్ళు పోసి నాలుగు దిక్కులకు తిరిగి " తెలిసి చేసిన పాపం, తెలియక చేసిన పాపం, అన్నం పెళ్ళ తొక్కిన పాపం, సూర్యుడ్ని చూసిన పాపం, ఆవును తాకిన పాపం, సర్వ పాప హరణం" అంటూ చెప్పించి బావి దగ్గర స్నానం చేయించేది.
' అమ్మా, సూర్యుడ్ని చూడటం, ఆవును తాకడం కూడా పాపమా' అని అడిగితే ' ఔను కదటే, ఇలాంటి పాపపు సమయం లో పంచభూతాల్ని చూడకుండా చీకట్లోనే వుండాలే! అసలు ముట్టు దాని మోహమే చూడకూడదని, మమ్మలను రోజుల్లో ఎదురు కూడా పడనివ్వకుండా గాలి, వెలుతురు రాని చీకటి ముట్టు గది లో వుంచేసేవారే!' అంటూ రోజుల్లో వాటి గురించి చెప్పుకునే కథలేవో చెప్పేది. సూర్యుడిని చూడకుందా, అగ్ని తాకకుండా ఎక్కడో మూల గది లో పడి ఉండొచ్చు. కానీ పంచ భూతాల్లో ఒకటైన వాయువు ని పీల్చకుండా ఎలా బతికి ఉంటాము?అన్న నా సందేహాన్ని విని ' శాస్త్రాలనే ప్రశ్నించి ధిక్కరించేంత దానివా?' అంటూ మా అమ్మ గుడ్లెర్రజేసేది. " చాల్లేమ్మా, వీధిలో వాళ్ళు మమ్మల్ని చూసి నవ్వుతున్నారు. కాలం లో కూడా ఇవన్నీనా అని?" అంటే " మీకేం మీరు బాగానే ఉంటారు, రేపు పెళ్లిళ్లు అయి అత్తవారిళ్లకెళితే ముట్టు, మడి, మైల, ఆచారం సరిగ్గా నేర్పించలేదని అమ్మని నన్ను కదా అందరూ విమర్శిస్తారు, అందరి చేతా నన్ను నానా మాటలు అననివ్వండే" అంటూ గుడ్ల నీరు కక్కుకునేది. ఏడుపు పర్వానికి గుండెలు కరిగిపోయేవి. అమ్మ కళ్ల నీళ్ళు చూసి జాలేసేది. పెళ్ళయితే కష్టాలు పోతాయో పోవో గానీ ముట్టు కష్టాలు పోతే బావుండు అనుకునేవాళ్లం మా అక్క చెల్లెళ్ళాం.
తెల్లారిన తర్వాత చాకలిది వచ్చి మా మైల బట్టలు ఉతికేందుకు తీసుకెళ్తుంటే దాని సంగతేమో కానీ మాకైతే లోపల సిగ్గుతో చితికిపోయే వాళ్లం. మనకు మైల అయింది చాకలి దానికి ఎందుకు కాదమ్మా? అని అడిగితే ' వాళ్ళను దేవుడు పుట్టిం చిందే మన మైల ను పోగొట్టడానికి. అమ్మ రుణమైనా తీర్చుకోగలం కానీ అందుకే చాకలి దాని రుణం తీర్చుకోలేమంటారే ' అంటూ అమ్మ మరో క్లాస్ చెప్పేది.
'అమ్మా, అన్నం తిన్న కంచాలు బయట తోముకుంటుంటే ఎదురింటి డాక్టర్ గారి అబ్బాయిలు అంతా తమకేదో తెలిసిపోయినట్లు మొహాలు పెడుతున్నారే, చచ్చే సిగ్గు గా ఉంది. ప్లీజ్ అమ్మా, స్నానం చేసి లోపలకు వచ్చేస్తాం' అని ఒక్కో సారి బతిమిలాడేవాళ్ళం. అయినా అమ్మ గుండెకరిగేది కాదు. " ఇప్పటికీ జరుగుతున్నా అనాచారం చాలు. కాలేజీలో శూద్రులతో స్నేహాలు, వాళ్ళను తాకిన బట్టలతో ఇంట్లోకి రావడాలు, ఇవి చాలు" అని మళ్ళీ అమ్మ నోరు నొక్కుకునేది.
చదువు పూర్తయి పెళ్లయిన తర్వాత దేనికి స్వాతంత్ర్యం వచ్చినా రాకపోయినా మా ముట్టు కి మాత్రం బోలెడు స్వేచ్చ వచ్చింది.
ఎందుకు రాదూ? బయట కూర్చుంటే పనులెవరు చేస్తారు? అందుకని లోపలకు రానిచ్చేసేవాళ్ళు. అప్పటికి కానీ అర్థం కాలేదు. ఆ మూడు రోజులు పని లేకుండా శరీరానికి విశ్రాంతి ఇవ్వడం కోసం అలా దూరం గా పెట్టేవారని ఒక ఆచారం వెనక వున్న అసలు కారణం కొంచెం అర్థమయింది. ఇప్పటి కాలాన్ని బట్టి మనకు అందులో తప్పొప్పులు, న్యాయాన్యాయాలు కనిపిస్తున్నా, ఆ కాలం లో ఆడవారి ఆరోగ్యం కోసమే ప్రధానంగా అలా దూరం పెట్టేవారని తెలిసినా, దాని చుట్టూ పాపం, మైల, అనాచారం లాంటివి వేరే ప్రయోజనాల కోసం సృష్టించినవన్న జ్నానం వచ్చింది.

ఇప్పుడు బయట జేరినా, ఇంట్లోనే వున్నా తప్పించుకోలేని పని. కడుపుతో వున్నప్పుడు ఓ తొమ్మిది నెలలు ఈ ముట్టు గొడవ పోయింది కదా అని సంతోషమేసింది. వేరింటి కాపురం కాబట్టి హాయిగా బైట జేరగానే తలారా స్నానం చేసేసి లోపలకు వచ్చేసిన మొదటి సారి ప్రపంచాన్ని జయించిన సంతోషం. ఒక అనాచారాన్ని బద్దలు కొట్టిన గొప్ప ఫీలింగ్ తో ఎగిరి గంతులెయాలనిపించింది. మళ్ళీ తలస్నానం చేయకుందా లోపలకు రావడానికి మాత్రం మనసొప్పేది కాదు. అదేదో గిల్టీ ఫీలింగ్ లోపల నుంచి తన్నుకొచ్చేది. పూజ గది చూడగానే ఏదో తప్పు చేసిన ఫీలింగ్ అలా నిలబెట్టేసేది. అందుకే ఆ మూడు రోజులు దేవుడి గది లోకి వెళ్లకుండా జాగ్రత్త పడేదాన్ని.

వెంట వెంటనే కాన్పులు, పిల్లల పెంపకంతో పెద్దగా ఈ ముట్టు ఇబ్బంది పెట్టిందో లేదో గమనించే స్థితి లో లేను. ఈ మధ్యనే రెండేళ్ల బట్టి మరీ కడుపు నొప్పి ఎక్కువవుతోంది. అమ్మకు చెపితే " నలభై రాకుండానే ఈ బాధలేమిటో నాకు తెలియటం లేదమ్మా " అనేది . ' నేనైతే నలభై అయిదేళ్ళ వరకూ క్రమం తప్పకుండా బైటజేరెడాన్ని. యాభై వస్తుంటే ముట్లుడిగే దశ వస్తోందనే వారు. నా చాలే మీకు కూడా వస్తుందనుకున్నాను. అదేమిటో, మీకు ఇంత తొందరగా ముట్లుడిగి పోతున్నాయి. ఇదే మరి కలికాలం . అనుకుంటాం కానీ, నెలా నెలా ఆ ముట్టు వచ్చేస్తేనే ఆడదానికి ఆరోగ్యమమ్మా, రాకపోతేనే నానా తిప్పలు. మీరేమో, ఆ...అంటే...ఊ....అంటే...గర్భ సంచీ తీయించుకుంటే పోలా? అంటారు.అసలు ఆ చెడు రక్తం ప్రతి నెలా పోతేనే ఆడది నిండు నూరేళ్ళు ఆరోగ్యం గా బతుకుతుంది " అంటుంది అమ్మ నోరు విప్పితే ఆడ వైద్యం గురించి చెపుతూ.
అలా గతం లోకి జారిపోయి ఆ గతంలో నుంచి నిద్ర లోకి వెళ్లిపోయింది ఆమె.
*******

పొద్దుట లేస్తూనే ఆ ఆలోచన తోనే ఆమె కు మెలకువ వచ్చింది. శరీరం లో మార్పు కోసం చూసింది కానీ నిరాశే ఎదురయింది. ఆమె చేసిన మొదటి పని కాలెండర్ దగ్గరకెళ్ళి తెలిసిన లెక్క మళ్ళా చేసింది. అదే అప్పటికి ఎన్ని రోజులయిందో లెక్కపెట్టడం. 27 వ రోజుకు ఎర్ర ఇంకుతో సున్నా పెట్టింది. ఇవాళ 28 వ రోజు. ఇవాళైనా...? వస్తాడో, రాదో తెలియని అతిథి. పీడ కల కోసం కూడా ఎదురుచూపులా? అవును. తొందరగా ఆ పీడకల వచ్చేస్తే ఎంత బావుంటుంది? ఎంత హాయి? ఎంత తేలికదనం శరీరానికి, మనసుకి....

ఒక పక్కమెదడు లో ఆలోచనలు సాగుతూనే వున్నాయి. చేతులు అలవాటైన పనులు చేస్తూనే వున్నాయి. పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ రెడీ చేయటం, అందరికీ లంచ్ బాక్సులు తయారు చేయడం, పిల్లలను నిద్ర లేపి స్కూల్ కి రెడీ చేయటం అన్నీ కూడా ఏదో మెషీన్ ని ఆన్ చేసినట్లు గా చేసేస్తుంది ఆమె శరీరం. ఆలోచనలు మాత్రం ఎగసి పడే అలల్లాగా ఒకదాని వెంట ఒకటి అలా వచ్చి పడుతూనే వున్నాయి.

ఔను, ఇవాళ 28 వ రోజు కదూ, అమ్మ లెక్క ప్రకారం ప్రతి 27, 28 రోజులకు నెలసరి రావాలి. ప్రతి నెలా బహిష్టు స్నానం నుంచి 13 వ రోజుకి అండం విడుదలవుతుందట. ఇలా లెక్క గా జరిగితే ఏ రోగం రోష్టూ లేకుండా సంపూర్ణ స్త్రీత్వం తో ఉంటామట. అంటే ఇప్పుడు నేను సంపూర్ణ స్త్రీని కానా? ఈ మధ్య హార్మోన్లలో మార్పులు వచ్చినట్లు వున్నాయి. మోకాళ్ళ మీద సన్నగా వెంట్రుకలు మొలుస్తున్నాయి.

మొన్నామధ్య బస్సు లో ఒకావిడ ను చూశాను. పెదాల మీద మగవాళ్లలా సన్నటి మీసాలు. అందరూ అదే పని గా ఆవిడ మొహం వంక, మీసాల వంక అదే పనిగా చూస్తుంటే పాపం ఆమె సిగ్గు తో తలదించుకుంది ఏదో తప్పు చేసినట్లు. ఆవిడ శరీరం లో వస్తున్న హార్మోన్లలో తేడా తప్ప అది ఆమె స్త్రీత్వం లో వచ్చిన మార్పు కాదని నాకున్న మిడి మిడి జ్నానంతో నైనా సరే వాళ్లందరికీ చెప్పాలనిపించింది.
ఇంతకీ నాకు ఈ నెల ముట్టు వస్తుందా ? రాదా? ఇపుడే టెస్ట్ చేసుకుంటే సరిగ్గా తెలియకపోవచ్చు . ఎప్పుడో ఓ అయిదేళ్ళ క్రితం ఓ సారి చూసుకున్నాను. ఇప్పుడు మార్కెట్ లో కొత్త కొత్త రకాలు వస్తున్నాయి. చిన్న గా ముద్దోచ్చే ప్యాకెట్. అది అవునో, కాదో అంతా ఓ సన్నటి పింక్ లైన్ చెప్పేస్తుంది.

పింక్ లైన్ అనుకోగానే మొన్ననే చదివిన ' అండర్ ది థిన్ పింక్ లైన్ ' కొత్త నవల గుర్తుకు వచ్చింది. ఆ కామెడీ వెనుక కనిపించని ఎందరో ఆడవాళ్ళ జీవన విషాదం దాగి ఉందనిపించింది.

ప్రతినెలా ఓ ఎదురుచూపు ఎంత విషాదం. ఓ అమ్మాయి ప్రెగ్నెన్సీ కోసం ఎదురుచూస్తుంటుంది. ఇంట్లోనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని చూసుకుంది ఆతృతగా. కడుపుతో వున్నట్లు గుర్తుగా టెస్ట్ లో పింక్ లైన్ వచ్చింది. బాయ్ ఫ్రెండ్ తో సహా అందరికీ కడుపుతో వున్నట్లు చెప్పేస్తుంది. అయితే అలా జరిగిన రెండు మూడు రోజులకే పీరియాడ్స్ వచ్చేస్తాయి. ఏం చేయాలో మొదట అర్థం కాదు. కానీ చూద్దాం. అందరికీ చెప్పేశాను కదా...వచ్చే నెల ప్రెగ్నెన్సీ రావచ్చు కదా అనుకుంటూ రాని కడుపు ని నటిస్తుంది. కాబోయే తల్లిగా తెలిసిన వాళ్ళంతా తను వస్తుంటే డోర్ తీయటం దగ్గర నుంచి బస్సు లో, రెస్టారెంట్ లో సీట్ ఇవ్వడం వరకూ ప్రత్యేకంగా చూడటం ఆమెకు బావుంటుంది. అసలు విషయం తెలిసిన ఒక ఫ్రెండ్ మాత్రం ఆమెను పిచ్చిదానివంటాడు. కడుపు అనేది దాచుకునేది కాదు , అందరికీ బయటకు తెలియాలి కదా...నాలుగైదు నెలలు పోయాక గుడ్డ ముక్కలతో కుట్టిన పిల్లో ను లోపల పెట్టుకొని తొమ్మిది నెలల దాకా మేనేజ్ చేస్తుంది. కడుపు రాకపోయినా , కడుపు తో వున్న వాళ్ళు ఏమేం చేయాలో ఏమేం చేయకూడదో అన్నీ తెలుసుకొని అచ్చంగా అలాగే ప్రవర్తిస్తుంటుంది. చివరకు నాటకీయంగా తొమ్మిది నెలలు నిండుతుండగా కనాల్సిన అవసరం లేకుండా ఆమెకు చర్చి దగ్గర ఓ పసి బిడ్డ దొరుకుతుంది. లోకానికి తన బిడ్డగా పరిచయం చేసేందుకు దేవుడిచ్చిన వరంగా ఆమె ఆ బిడ్డ ను తీసుకుంటుంది.
ఎక్కడైనా అలా జరుగుతుందా? ఎవరైనా కడుపుతో లేకపోయినా ఉన్నట్లు నటిస్తారా? పైగా ఎలాంటి బలమైన కారణం లేకుండా? ఊరికే తమాషాకు ఇదంతా చేస్తారా? అనుకుంది తాను ఆ నవల చదివినప్పుడు. దాని కన్నా తాను ఎక్కువ ఆలోచించిన అంశం ఆ ప్రెగ్నెన్సీ టెస్ట్ గురించి. సో...అది అప్పుడప్పుడు అలా తప్పులు చేస్తుందన్న మాట. ఎందుకైనా మంచిది. దాని మీద ఆధారపడకుండా డాక్టర్ దగ్గరకు వెళ్ళి పరీక్ష చేయించుకోవడమే మంచిదన్న మాట.
చూద్దాం. ముందు ఈ నెల గడవాలి కదా. రాకపోతే అప్పుడు చూద్దాం. పాప పుట్టినప్పుడే తాను ఆపరేషన్ చేయించుకుంటా నన్నది. కానీ బాగా వీక్ గా వున్నానని డాక్టర్ ఒప్పుకోలేదు. కిరణ్ తాను చేయించుకుంటానని చెప్పి అయిదేళ్లయింది కానీ ఇంతవరకూ చేయించుకోలేదు. వేరే పద్ధతులు ఏమైనా వాడమని చెపితే కిరణ్ కి అవి నచ్చవు
. దాంతో ప్రతి నెలా ఇదో నరకం. వస్తుందా, రాదా? రాకపోతే...మళ్ళీ కడుపు వస్తే...బాబోయ్ అబార్షనా? పురిటి నొప్పుల కంటే ఎక్కువట..అందరూ చెప్తుంటారు. నా వల్ల కాదు. ఈ సారి ఏమైనా కానీ, కిరణ్ ని బలవంతంగా తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించాలి.

ఈ టెన్షన్ కి తోడు ఈ పి.ఏం.ఎస్. ప్రాబ్లెమ్. పీరియడ్స్ కి ముందు చాలా చికాకుగా, కోపం గా అనిపిస్తోంది. ఊరికే విసుగు. అలసట. ఓ పక్క ఇంట్లో పని, మరో పక్క ఆఫీస్ లో పని ఒత్తిడి. పెరుగుతున్న పిల్లలు. వాళ్ళ హోమ్ వర్క్ లు. వీటిన్నంటి మధ్య మరింత ఎక్కువ నలిగి పోతున్నట్లనిపిస్తోంది. ఒక్కో సారి చచ్చిపోదామా అన్న ఆలోచనలు వస్తుంటాయి. తననెవరూ పట్టించుకోవడం లేదన్న ఫీలింగ్. తెలియకుండానే ఏడుపు వచ్చేస్తోంది. ఎక్కడికైనా పారిపోదామా అనిపిసుంది. కానీ ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికెళ్ళినా మన శరీరం , మన మనసు మనతోనే ఉంటాయి కదా. అవి చాలదా? మన బాధ మనం మరిచిపోకుండా చేయటానికి.

పాపం పిల్లలకు ఇవన్నీ ఏం తెలుస్తాయి? అప్పటికీ పాపం వాళ్ళు అల్లరి తక్కువే చేస్తారు. తనకు ఆ కాస్త కూడా తట్టుకునే శక్తి లేదనిపిస్తుంది. కిరణ్ కి చెప్తుంటే ఈ నెలా ఆఫీస్ లో సెలవు దొరకాగానే ముందు ఆ పనే చేయించుకుంటాను అని ప్రతి నెలా ఠంచను గా చెప్తాడు కానీ ఆ సెలవు ఎప్పుడు దొరుకుతుందో? ఆ పని ఎప్పుడు జరుగుతుందో మాత్రం తెలియదు. రాత్రి కి చెప్పినప్పుడు సరే అని తల బుద్ధిగా వూపుతాడు. తెల్లారేటప్పటికీ అంతా మామూలే. అన్నీ మర్చిపోతాడు. ఆ పది రోజులు నా జోలికి రావద్దు, నాతో అనవసరంగా తగువు పడొద్దు అంటే వింటాడా? కాస్త బాగుందనప్పుడైనా వంట చేయడమో, ఇల్లు సర్దడమో, పిల్లల హోమ్ వర్క్ చేయించడమో చేయమంటే సరే, సరే అంటాడు. మళ్ళీ కథ మామూలే. ప్రతి నెలా చెప్పటమే తప్ప...ఇద్దరికిద్దరం, ఏదో చిన్న మాట చిలికి చిలికి పెద్దాడవుతుంది. తెలియని ఆవేశం లో తాను కూడా ఏవో మాట్లాడటం తో అతనూ రెచ్చిపోతాడు. ఓ వారం మౌన యుద్ధం. తరువాత మళ్ళీ ఒకరికొకరు సారీ లు చెప్పుకోవటం. క్షమించుకోవటం.

అంతా అయిన తర్వాత " అయినా నీకు ఆ కోపం ముక్కు చివరే ఉంటుందోయ్! అక్కడ వెంట్రుకలు పడ్డాయి, ఇక్కడ సరిగ్గా తుడవలేదు అంటూ నీ క్రమ శిక్షణ తో మా ప్రాణాలు తోడెస్తున్నావు. పి.ఏం.ఎస్. అనో, మెనో పాజ్ అనో అంటావు కానీ అంతకు ముందు మాత్రం నీకు కోపం లేదా? పీరియడ్స్ కి ముందు పి. ఏం. ఎస్. అంటావు. మళ్ళీ పీరియడ్స్ గొడవ ఓ వారం. అది కాగానే ఓ పది రోజులు ప్రశాంతం. మళ్ళీ నీ పీరియడ్స్ కోసం ఎదురుచూపులు. నీకన్నా మాకే చచ్చే చావుగా ఉందోయ్ ..పోనీ అంత సమస్య గా ఉంటే ఆ యుటెరేస్ తీయించుకోవచ్చు కదా....మీ స్త్రీవాదులకు అదేమంతా బాధ కాదు కదా అంటూ నన్ను మరింత రెచ్చగొడుతుంటాడు.

అసలు నొప్పి కంటే ఆ తలతిక్క వాదన మరీ కోపం తెప్పిస్తుంది. పైగా " నీకు ఈస్ట్రోజన్ తక్కువైందా? లేకపోతే టెస్టోస్టిరాన్ హార్మోన్ విడుదల్ ఎక్కువైందనుకుంటాను. అందుకే నీలో కొన్ని మగలక్షణాలు నెమ్మదిగా వస్తున్నట్లున్నాయి. పోనీ హార్మోన్ రీప్లేస్ మెంట్ థెరపీ చేయించుకోవచ్చు కదా. మాకు కూడా ప్రాణానికి హాయిగా ఉంటుంది" అంటూ తనకు కూడా స్త్రీల శరీరాలకు సంబంధించి చాలా విషయాలు తెలిసినట్లు పేపర్లలో చదివేదంతా ముక్కున పట్టి అప్పచెప్పాడు.
తనకు ఆ మాటలు వింటుంటే మరీ చికాకు ఎక్కువవుతుంది. అప్పుడిక తను కూడా సైంటిఫిక్ గా, లాజికల్ వాదించటం మొదలుపెడుతుంది.
"అసలు స్త్రీత్వమంటే ఏమిటి? పురుషత్వం అంటే ఏమిటి? లేబుల్ వెనుక వున్నది కేవలం శారీరక ధర్మాలేనా? స్త్రీలు గానో, పురుషులు గానో కొన్ని అవయవాలతో పుట్టడం కాదు, స్త్రీలు స్త్రీలు గా, పురుషులు పురుషులుగా తయారు చేయబడటం గురించి జెండర్ థియరీ ని చర్చకు పెడుతుంది. అయినా మీకు, మాకు మధ్య తేడా ఒక్క క్రోమోజోమే కదా. దానికే ఇంత భిన్నంగా ఉండాలా?
ఈస్ట్రోజిన్ తక్కువైతే నేను స్త్రీని కానా? కాళ్ళ మీదో, పెదాల మీదో జుట్టు పెరుగుతుంటే నేను మగవాడినైపోతున్నట్లా? సరే...నువ్వు చెప్పినట్లే ఈస్ట్రోజిన్ పిల్స్ మింగితే నేను మరింత ఆడదాన్ని అవుతానన్న మాట. అంటే నన్ను నియంత్రించేది, శాసించేది, నిర్ణయించేది ఈస్ట్రోజిన్ పిల్ నే కానీ నా మనసో, నా ఆలోచనలో, నా ఉద్వేగాలో కాదన్న మాట. అయినా ఎవరు చెప్పారు నీకు ఆడవాళ్ళకు కోపమొస్తే పి.ఏం.ఎస్, డిప్రెషన్ వస్తే మెనో పాజ్ అని. వాళ్ళ మనసు లో జరిగే సంఘర్షణ ను, వాళ్ళ శరీరాలపై, మనసు లపై సాగుతున్న ఒత్తిడి ని మీరు మానవీయంగా అర్థం చేసుకొని సహకరించలేరా " అని అడిగితే చేతులెత్తి మరీ దణ్ణం పెడుతూ " అమ్మా, ఫెమినిస్ట్ గారూ, మీరు సైకాలజీస్టో, గైనకాలజిస్టో అయితే సమాజానికి, స్త్రీ జాతికి మరింత లాభముండేది " అంటూ కిరణ్ తెలివి గా తన వాదనను ముగించేస్తాడు.
ఒక్క క్షణం ఆలోచనలు ఆగగానే మెదడు ఒంటి నొప్పులను గుర్తుపట్టింది. తల దిమ్ము గా ఉంది. ఒళ్ళంతా నొప్పులు. తొడలు పగలగొట్టడమేమిటో ఏమిటో మళ్ళీ మళ్ళీ తెలుస్తోంది. తాజా కాఫీ గింజల వాసన ఉత్తేజాన్ని , ఓ ఉద్వేగాన్ని కూడా ఇస్తోంది. కెఫీన్ ఎక్కువైతే...ఫోలిక్ యాసిడ్ తక్కువైతే...ఊహూ...లాభం లేదు. డైట్ పట్ల జాగ్రత్త గా ఉండాలి. ఉప్పు తగ్గించాలి. ఎక్సర్ సైజ్ లు చేయాలి. స్వీట్స్ మానేయ్యాలి. స్వీట్స్ ఎక్కువ తింటే కోపం మరింత ఎక్కువవుతుందట...ఎక్కడో చదివినది ఆమెకు వెంటనే గుర్తుకు వచ్చింది. ఆమె బుర్ర నిండా అలాంటి ప్రణాళికలు ఎన్నో...ఆచరణ కు వచ్చేసరికి ఏవో ఆటంకాలు.

జీవితాన్ని మొత్తం ఒక ప్లానర్ లో పెట్టి వేటికి చెక్ మార్క్ పెట్టాలో చూసుకుంటోంది. ప్రతి ఉద్వేగాన్ని, ప్రతి ఆలోచనను , ప్రతి డైట్ ని త్రాసు లో వేసి చూస్తోంది ఆమె. ఏది ఎక్కువ తీసుకోవాలి? ఏది తక్కువ తీసుకోవాలి? ఎక్కడో సమతుల్యత లోపించిందని తెలుసు. అది తన కు, మిగతా వారికి మధ్య నా? స్త్రీ, పురుషుల ఆలోచనల్లోనా? మొత్తం సమాజం లోనే ప్రతి ఒక్క దాంట్లోనూ ఈ అసమతుల్యత ఉందా? ఎక్కడో మొదలు పెట్టి ఆమె ఆలోచనలు ఎక్కడికో పోతున్నాయి. సమతుల్యత గురించి ఆలోచించగానే 'మానవ సంబంధాలన్నీ అసమ సంబంధాలే ' అన్న స్టేట్మెంట్ గుర్తుకు వచ్చింది.
ఆమె లోపలి ఆలోచనలు ఆమె చేస్తున్న పనులకు ఎలాంటి అంతరాయం కలిగించలేదు. శరీర భాష ఒకలా ఉంది నొప్పులను చెపుతూ.... శరీరం లో వచ్చిన మార్పులకు ఒక్కో సందర్భం లో మనసు స్పందించిన తీరుని, అనుభవాలను మనసు కొన్ని జ్నాపకాలుగా గుర్తు చేస్తోంది. మైండ్, బాడీ ల మధ్య బాలెన్స్ లోపించింది. రెండూ చెరో భాగం గా ఆమె ని రెండు ముక్కలు చేసి చూపిస్తున్నాయి.

రెండు ముక్కలని కలిపి కుట్టేసి అలా ఆ దేహాన్ని తీసుకెళ్లి ఆఫీస్ లో కూలబడేసింది . తన కేబిన్ లో కూర్చొని బయట కనిపిస్తున్న కొలీగ్స్ ని చూస్తూంటే ఆమె ఆలోచనలు మళ్ళీ క్రితం రోజు ఆఫీస్ లో జరిగిన సంఘటన పైకి మళ్ళాయి.
' మేడమ్ కి అసలే కోపం ఎక్కువ. ఈ మధ్య అదీ మరీ ఎక్కువైనట్లుంది. పి.ఏం.ఎస్. అనుకుంటాను. లేదా అప్పుడే మెనోపాజా? అరే, నీకు తెలీదా? పి. ఏం. ఎస్. అంటే ప్రీ మెను స్త్రువల్ సిండ్రోమ్ ఒక్కటే కాదు. ప్రీ మెనో పాజ్ సిండ్రోమ్ కూడా. నేను మొన్ననే విమెన్స్ పేజీ లో ఆర్టికల్ చదివాను. అది వున్న వాళ్ళు అంతే. ప్రతి చిన్న దానికి రెచ్చిపోతుంటారట, ఏ మాట అన్నా కయ్యిమని లేస్తారట. నువ్వు చూసావు కదా, మేడమ్ ఇదివరకు అప్పుడప్పుడూ కోపం గా ఉన్నా, సామాన్యం గా నవ్వుతూ ఉషారుగా , ఉత్సాహంగా ఉండేవారు. ఇప్పుడు చూడు. ఎప్పుడు చూసినా చిటపటలు. ముఖం మాడ్చుకోవటాలు. పైగా మనమేదో చేసినట్లు మన మీద అయిన దానికి,కాని దానికి ఎగరటాలు. ఇంట్లో వాళ్ళ ఆయన, పిల్లలు ఎలా భరిస్తున్నారో? ' అని ఒక కింది ఉద్యోగి ఉవాచ.

మరో ఆయన దానికి వత్తాసు పలుకుతూ ' అయినా, ప్రతి దానికి మేం సమానం అంటూ వస్తారు కానీ వీళ్ళు సరిగ్గా పని చేసేది ఎక్కడా? వీళ్ళు ఎలా పని చేస్తారో, వీళ్ళకు ప్రమోషన్లు ఎలా వస్తాయో మనకు తెలీదా? హాయిగా మాకు పి. ఏం. ఎస్. అని మెడ లో బోర్డ్ కట్టుకోవచ్చు కదా కుక్క పిల్లల్లాగా , అందరికీ తెలిసేలాగా...అది చూసైనా మన లాంటి సంస్కారవంతులు , చదువుకున్నవారు కొందరైనా జాలి పడతారు కదా' అంటూ పళ్ళు ఇకిలిస్తూ తన జోక్ కి తానే విరగబడి నవ్వాడు.

కేంటిన్ నుంచి తిరిగి వస్తూ, వర్క్ గురించి ఏదో మాట్లాడడమని వాళ్ళ దగ్గరకు వెళ్లబోయినదల్లా ఆ మాటలు, అవి తన గురించేనని తెలుసుకున్నాక అలా నిలబడి వింటూ ఉండిపోయింది. అడ్డూ అదుపు లేకుండా సాగిపోతున్న ఆ కామెంట్ల కు తలపోటు వచ్చి మళ్ళీ కేంటిన్ వైపు కి మళ్ళింది ఆమె నిస్సత్తువ గా. వాళ్ళ మాటలకో, శరీరం లోని అలసట కో కానీ కళ్ళు బైర్లు తిరిగిపోతున్నాయి. స్పృహ తప్పుతున్నట్లనిపిస్తోంది.

నిన్నటి వాళ్ళ మాటలు మళ్ళీ మళ్ళీ గుర్తుకు వచ్చి మనసు ని తూట్లు పొడుస్తున్నాయి. ఎందుకిలా మాట్లాడతారు కొందరు? కొంత మంది కొలీగ్స్ మగవాళ్లైనా ఎంత సెన్సిబుల్ గా వుంటారు వర్క్ విషయం లోనైనా, పెర్శనల్ విషయాల్లోనైనా.. అదేమిటో కొందరు కాలం తో పాటు వయసు ని పెంచుకుంటారు కానీ బుద్ధి మాత్రం అణు మాత్రం కూడా ఎదగనివ్వకుండా జాగ్రత్త పడతారు.

మగ బాస్ లు కోపం గా ఉంటే అబ్బో చండ శాసనుడు అంటూ భయపడతారు. అదే ఆడబాస్ లు స్ట్రిక్ట్ గా ఉంటేనో, కోపం గా అరిస్తే నో వెంటనే పి.ఏం.ఎస్., మెనో పాజ్ అంటూ టాగ్స్ కట్టేస్తారు. నిజానికి అలాంటి శారీరక స్థితులు అటు మానసికంగానూ, ఇటు దేహ పరంగానూ ఎంత నరకాన్ని చూపిస్తాయో అటు ఇంట్లో మగవాళ్ళకు, ఇటు ఆఫీస్ల్లో కొలీగ్స్ కి కూడా అర్థం కాదు.

పి.ఏం .ఎస్.లు, మెనో పాజ్ లాంటివి మగవాళ్ళకు కూడా తెలిసిపోయినందుకు సంతోషించాలా? అవి కూడా వాళ్ళకు ఆడవాళ్ళ మనసు లాగానే అర్థం కాకుండా మిగిలిపోయినందుకు బాధ పడాలా?

మనకు కనీసం ఎందుకిలా ఉంటోందో అర్థమవుతోంది. పాపం మన అమ్మలకు, అమ్మమ్మలకు, బామ్మలకు ఆ కొద్ది వెసులుబాటు కూడా లేదు. వాళ్ళు ఎన్ని బాధల్ని కడుపు లో దాచుకొని జీవితాల్ని వెళ్లమార్చారో తల్చుకున్న కొద్దీ దుఃఖం వస్తోంది.
ఇప్పుడర్థమవుతోంది ఆడవాళ్ళకు గతం లో హిస్టీరియాలు, మానసిక రోగాలు ఎందుకు ఎక్కువ వచ్చేవో? అసలు నిజంగా అవి ఆ జబ్బులో లేక ఇలాగే వాళ్ళ బాధల్ని పట్టించుకోకుండా వాళ్ళు కొంచెం ఉద్వేగం గా ప్రవర్తిస్తే హిస్టీరియా అని పేర్లు పెట్టేసేవారో ఎవరికి తెలుసు? ఇలా వాళ్ళు లోపల్లోపల కోపాల్ని, ఆవేశాల్ని, బాధల్ని అన్నింటిని కుళ్లబెట్టుకొని, కుళ్లబెట్టుకొని ఇంకెంత మానసిక హింస అనుభవించేవారో కదా!

మెనో పాజ్, పి.ఏం. ఎస్. స్త్రీ శరీర సహజ ధర్మాలని, అది వారి జీవితం లో ఓ అనివార్యమైన దశ అని , కుటుంబం సహకరిస్తే దాన్ని సమర్థం గా ఎదుర్కోగలరని వీళ్ళకు అర్థమయ్యాలా ఎవరు చెప్తారు? ఈస్త్రోజిన్ లోనే స్త్రీత్వం ఉండదని, అది మన లోపలి మానవీయ ఆలోచనల్లో ఉందని వీళ్ళకు ఎలా చెప్పాలి? అనుకుంటూ ఆమె ఆవేదన తో కళ్ళు మూసుకుంది.

ఆమె గాయ పడ్డ హృదయానికి సంకేతమా అన్నట్లు లోపల నుంచి ఒక రక్తస్రావం జీవ్వున ఎగసి ప్రవాహం లా ముందుకు ఉరికురికి వస్తోంది.
******
( ఈ కథ 'వార్త' ఆదివారం సంచికలోనూ ( 2003 లోనో, 2004 లోనో), ఏపీవీక్లీ డాట్ కామ్ లోనూ ప్రచురితం)

9 వ్యాఖ్యలు:

Anonymous said...

చాలా సున్నితమైన సమస్యని చాలా సునిశితంగా చర్చించారు. ఉద్యోగాలూ, పిల్లల బాధ్యతలతో సతమవుతున్న ఆడదానికి "మా కాలంలో ఇలా లేమమ్మా" అంటూ ప్రతీ దానికీ గిల్ట్-ట్రిప్ మీద తీసికెళ్ళే అత్తా మామల్ని కూడా కలపండి. నలభై యేళ్ళ స్త్రీలకి మానసిక సమస్యలు వచ్చే అవకాశమ యెక్కువ అని ఈ మధ్యే ఎందుకు ఋజువైందో బోధపడుతుంది.


మీరొక్క చిన్న విషయం గమనించారా? ఇంట్లో ఎవరి సమస్యైనా అది గృహిణి సమస్యే! ("వాడికి ఆకలేస్తోంది" అన్న వాక్యం మా ఇంట్లో ఐతే పాశుపతాస్త్రం లా వాడతారు! దాంతో నేను ఊపిరి పీల్చుకోవటం కూడా మానేసి సదరు ఆకలేసిన వ్యక్తి తిండి ఏర్పాట్లకెళ్ళాలన్నమాట!) కానీ గృహిణి సమస్య మాత్రం అచ్చంగా ఆమెదొక్కర్తిదే. దాన్ని పరిష్కరించుకుంటుందో, ఏం చేసుకుంటుందో ఆమె ఇష్టం! ఇట్ ఈజ్ హర్ ప్రాబ్లం!


ఇలా ఆలోచిస్తే సెల్ఫ్-పిటీ ఎక్కువైపోతుందేమోననిపిస్తుంది.

చాలా బాగా రాసారు.

వనజ వనమాలి said...

పురుషులు లైట్ గ తీసుకునే గైనిక్ సమస్యల్ని ..శారీరక,మానసిక సమస్యగా అర్ధం చేసుకోవాలని.. మీరు చెప్పిన విధం బాగా నచ్చింది. ముఖ్యంగా " ఆమె గాయ పడ్డ హృదయానికి సంకేతమా అన్నట్లు లోపల నుంచి ఒక రక్తస్రావం జీవ్వున ఎగసి ప్రవాహం లా ముందుకు ఉరికురికి వస్తోంది." తప్పని.. తప్పని సరి అయిన ,తప్పు అయితే..రాని..ఋతుక్రమం..స్త్రీలకి..వరము-శాపం..కూడా..
మీ అనుభవాలు లాటివే ..మా అనుభవాలు.. కూడా.. గుర్తుకు తెప్పించారు. పోస్ట్ కి ధన్యవాదములు కల్పన గారు.

మాగంటి వంశీ మోహన్ said...

ఏవండోయ్

కొన్ని కప్పి చెప్పాలి, కొన్ని విప్పి చెప్పాలి....చెప్పాల్సినవి, చెప్పకూడనివి తేడా లేకుండా ఇల్లా చెబుతే ఎలాగు?

దొడ్డికి గోడల్లేకపోతే ఊళ్ళో పశువులన్నీ మన ఇంట్లోనే.....కాబట్టి మీరు ఎంతో కొంత ఎత్తులో గోడలు కట్టుకోవాలి.....

అప్పట్లో ఏ ఉద్దేశంతో రాసారో కానీ, నాకు తెలిసింది ఇప్పుడే కాబట్టి - అందుకున్నా.....అయితే కొద్దిగా చదవగానే పరుగులు పెట్టాల్సి వచ్చింది....దిక్కు తోచక....

పోనీ బోల్డు జాలిరసం కుమ్మరించారనుకుని కొద్దిగా గరిటెతో అందుకుని మీద పోసుకుందామా అంటే, ఉహూ - ఒప్పుకోకుండా, వీర రసం ఆవహిస్తోంది.....జుట్టు పెద్దగా లేదనుకోండి, అయినా సరే ఆ ఉన్నదే విరబోసేసుకుని కత్తిపీట ధరించి నా మానిటరు మీద పడి మర్దించాలన్నంత ఆవేశం వచ్చింది ఈ కథ చదివితే....

మీకు కోపం వచ్చినా సరే - అత్తెసరులో ఉన్న గంజి అందులోనే ఇంకిపోయినట్టు - ఇల్లాటివి మనలోనే ఇంకిపోనిస్తే బాగుంటుంది......

భవదీయుడు
వంశి

Anonymous said...

వంశీ గారు,
దయచేసి మీరు రాసే వ్యాఖ్యలు నలుగురికి అర్థమయ్యే విధంగా, సరళం గా రాయండి. మీరు రాసే వ్యఖ్యలు మాలంటి మొద్దు బుర్రలకు అర్థం కావటం లేదు. ప్రస్త్బుతం ఇండియాలో వుండేవారికి మీస్థాయి తెలుగు తెలియదని మీరు తెలుసుకోవాలి.


SrIRam

Ruth said...

జీవితాన్ని మొత్తం ఒక ప్లానర్ లో పెట్టి వేటికి చెక్ మార్క్ పెట్టాలో చూసుకుంటోంది. ప్రతి ఉద్వేగాన్ని, ప్రతి ఆలోచనను , ప్రతి డైట్ ని త్రాసు లో వేసి చూస్తోంది ఆమె. ఏది ఎక్కువ తీసుకోవాలి? ఏది తక్కువ తీసుకోవాలి? ఎక్కడో సమతుల్యత లోపించిందని తెలుసు. అది తన కు, మిగతా వారికి మధ్య నా? స్త్రీ, పురుషుల ఆలోచనల్లోనా? మొత్తం సమాజం లోనే ప్రతి ఒక్క దాంట్లోనూ ఈ అసమతుల్యత ఉందా? ఎక్కడో మొదలు పెట్టి ఆమె ఆలోచనలు ఎక్కడికో పోతున్నాయి.

Excellent lines ! Not just WRT the topic of this post but in every aspect of life for a woman.
A recently survay says that 87% of the Indian women are always stressed out. And this is the highest in the world.

Kalpana Rentala said...

@అనానిమస్ గారూ,
కథ లో ముఖ్యమైన పాయింట్ ని మీరు పట్టుకున్నారు. అవును. కాలం మారుతోంది. చాలా విషయాల్లో.కానీ మన మౌలిక సమస్యలు మాత్రం అలాగే ఉండటం సిగ్గు చేటు. ఇలా బాధ పడటం కూడా మీరు చెప్పినట్లు " ఇట్స్ హర్ ప్రాబ్లెమ్". సెల్ఫ్ పీటీ ఏమీ కాదు లెండి. మనకు సమస్యల గురించి మాట్లాడుకునే హక్కు, స్వేచ్చ వచ్చినందుకు సంతోషించాలి.

@వనజా వనమాలి--నా కథలోని అనుభూతి తో మీరు సహానుభూతి చెందటం సంతోషం.
@వంశీ గారూ, సారీ.మీకు ఈ కథ మరోలా అర్థమయినందుకు. నాకైతే ఈ కథ రాయటం తప్పనిసరి అని తెలుసు. నో రిగ్రెట్స్ ఫర్ దట్. గంజి నీళ్ళు ఇంక బెట్టుకున్నట్లు ఇంకా ఎన్ని, ఎన్నాళ్ళు ఇంక బెట్టుకోవాలి చెప్పండి.ఇలాంటి కథలు చదవటం కష్టమే. రాయటం ఇంకా కష్టం.
@శ్రిరామ్ గారూ, ఎందుకందీ పాపం వంశీ గారిని అన్ని మాటలు అనడం. నాకైతే ఆయన తెలుగు అర్థమయింది.భావం కూడా.
@రూత్, అవునండీ. సర్వేలు అవే వెల్లడిస్తాయి. మన ఆనుభవాలు అవే చెప్తాయి. అయినా ఇంకా చాలామందికి ఆ పెయిన్, ఆ భారం అర్థం కాదు.

మాగంటి వంశీ మోహన్ said...

కల్పన గారు

ఒక చిన్న వివరణ.....మీర్రాసిన కథ మీర్రాసినట్టుగానే అర్థమయ్యింది....మరోలా కాదు.....అయినా నేను రాసిన కామెంటు భావం మీకర్థమయ్యిందన్నారు కాబట్టి సంతోషం....ఒకటి చెప్పాలె....మా ఊళ్ళో స్మడ్ (SMUD) అనగా శాక్రమెంటో మునిసిపాలిటీ యుటిలిటీ డిస్ట్రిక్ట్ అని ఎవరైనా అనగానే కళ్ళముందు లీలగా ఒక "ఫాంటం ఫిస్ట్" (దయ్యపు పిడికిలి) కొరడా పుచ్చుకు సాక్షాత్కరిస్తుంది. ఆ పిడికిట్లో ఉన్నది మామూలు కొరడా కాదండోయ్. కరంటు కొరడా. ఆ కొరడా పుచ్చుకుని ఓ దెబ్బేస్తే వాతబియ్యం నోట్లో పోసిన జీవి కూడా ఒక్క ఉదుటున లేచి , కన్నూ మిన్నూ కానని ఉత్సాహంతో ఉస్సేన్ బోల్టును కూడా ఉప్పురాయిలా తొక్కేసే జవజీవాలు సంతరించుకుంటుందన్నమాట. అల్లాటి కొరడా దెబ్బలాటి మాట - "రాయటం ఇంకా కష్టం" - అని అనేసారు.......

అవును ఇల్లాటివి రాయటం చాలా కష్టం....అయితే ఒహటి, కష్టపడ్డందుకు ఫలితం నాస్తిక పక్షం కాకూడదని కోరుకుంటున్నాను...... "అందరూ మీలా సునిశితంగా చెప్పలేరుగా" (READ THE QUOTE IN BOLD BOLD BOLD font PLEASE)....

ఈ కథ చూసి కొద్దిమందైనా, అనగా ఇతర రచయితలు - నాస్తిక పక్ష తీవ్రవాదులైపోతే మాబోటి పాఠకులు వడగాడ్పులకు గురైపోతారేమోనన్న భయం....ఇప్పటికే వాసి దృష్ట్యా చాలా దిగజారిపోతున్నాం.......

ఉంటానండి.....అనగా ఇంతే సంగతులు చిత్తగించవలెను.... :)

భవదీయుడు
వంశి

dhaathri said...

oh this is very moving.....and its very relevant kalapanagaru....if u permit let us make it to english....love u j

Kalpana Rentala said...

@వంశీ గారూ, మీరేం భయపడకండి. ఇప్పటివాళ్లు ఎవరూ దీని మీద రాయరు. కారణాలు కథలోనే చెప్పాను కదా. మీరు చిత్తగించవలెను అని ముగించేశారు కాబట్టి నేను కూడా ఉషశ్రీ గారి టైపు లో ' స్వస్తి ' అంటాను. ఆయన ' స్వస్తి' చెప్పే తీరే వేరు. నాకిష్టం ఆయన ప్రవచనం.
@ధాత్రి,కథ మీకు నచ్చినందుకు , అనువాదం చేస్తానని ముందుకొచ్చినందుకు సంతోషం. తప్పకుండా చేయండి.
తెలుగు లోనే కాకుండా ఈ కథ ఇంగ్లీష్ లోకి కూడా వెళ్లాలా?అని వంశీ గారూ కంగారూ పడతారేమో:-))

 
Real Time Web Analytics