నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Wednesday, August 03, 2011

'మో' కోసం!

( మో! సాహిత్య ప్రపంచం మిమ్మల్ని ఇలా సంతోషంగానే గుర్తు పెట్టుకుంటుంది)


మొన్నో, నిన్నో, ఇవాళో, కవి ' మో ' వెళ్లిపోయాడు 'చితి-చింత'లోకి. బ్రెయిన్ హెమరేజీ. బ్రెయిన్ డెడ్ కానీ ఇంకా సన్నగా గుండె కొట్టుకుంటోంది అంటూ మొన్న రాత్రి ( మా) నుంచి ఏవో వార్తలు మాకు చేరుతున్నాయి. కవిత్వపు ' మత్తు' లోనే బతికిన కవి కి మెదడు ఆగిపోయినా ఇంకేదో చివరి కవిత లో అసంపూర్తి వాక్యాన్ని ఒకటి పూరించాలని గుండె ఇంకా కొట్టుకుంటున్నట్లు అనిపించింది.


మొన్న రాత్రి ఇంకా నిద్రపోకుండా ఏదో పుస్తకం చదువుతూ కూర్చున్నప్పుడు ఆత్మీయస్నేహితుడు కె. శ్రీనివాస్ నుంచి టెక్స్ట్ మెసేజి. మో కి సీరియస్ గా ఉంది, ఆస్పత్రి లో చేర్చారని. వెంటనే అఫ్సర్ కి కాల్ చేసి చెప్పాను. వెంటనే విజయవాడ , ఖమ్మం ఫోన్ లు చేసి వివరాలు కనుక్కున్నాడు. ' అంతా అయిపోయిందట' అన్న వార్త. కాసేపు ఇద్దరం బాధపడ్డాము. మనసు ఉండబట్టలేక మళ్ళీ ఇండియా కాల్ చేస్తే...' అయిపోయినట్లే కానీ, ఒక రోజు ఆగితే కానీ అనౌన్స్ చేయలేరు' అని చెప్పారు. మరణాన్ని కూడా మో ఒక రోజు వాయిదా వేయించాడు ఆ మరణ శయ్య మీద నుంచి. మిణుకు మిణుకు మంటూ బలహీనం గా కొట్టుకుంటున్న ఆ గుండెచప్పుడు మో రాయలనుకుంటున్న చివరి కవిత కు సంకేతమా అనిపించింది.


మో కేవలం మా వూరి కవి గా మాత్రమే మాకు దగ్గర కాదు. అఫ్సర్ కి ఆత్మీయమైన కవుల్లో మో ఒకరు. కేవలం ఆ స్నేహం కవిత్వ పునాదుల మీద మాత్రమే నిలబడి లేదు. అంతకు మించిన బంధమెదో వారి మధ్య ఉండేది. ఆ రకంగా ముఖ పరిచయం మాత్రమే వున్న మో నాకు మరింత దగ్గరగా తెలిశాడు.


ఆయన కవిత్వాన్ని గురించి మాట్లాడి, విశ్లేషించి చెప్పే గురుతర బాధ్యత ను వేరే వాళ్ళకు వదిలిపెట్టి నాకు తెలిసిన మో గురించి ఈ సందర్భంగా మరో సారి గుర్తు చేసుకుంటాను, ఇక్కడ ఇలా ఈ విషాద సన్నివేశం లో.
ఎన్నో సార్లు మో ని కలిసుంటాము, ఎన్నో సభల సందర్భంగా, ఎన్నో సార్లు వ్యక్తిగతం గా.


మొదటి మాట. ఆయన కవిత్వం నాకు బ్రహ్మాండంగా, సంపూర్ణంగా అర్థమయిందని నేను చెప్పను, చెప్పలేను కూడా.


ఒక కవిని, ఆ కవిత్వాన్ని అర్థం చేసుకోవాలంటే మొత్తంగా ఆ కవి తాత్త్వికత (ఫిలాసఫీ) అర్థం కావాలి. అయిదో, పదో కవితలు రాసేవారి సంగతి వేరు. కవి తెలియకపోయినా, ఆ కవిత వరకు అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. మో అలాంటి కవి కాడు. అబ్బా, ఏం రాశాడండీ ఆయన అని మో ని పొగిడేవాళ్లను ఆయన కవిత్వం మీద పది నిముషాలు మాట్లాడమనో, ఒక రెండు పేజీ లు రాసివ్వమనో అడిగితే, మామూలు స్థాయి పాఠకులు తలకిందులైపోవడం నాకు తెలుసు. అందులో నేను మొదటి వ్యక్తినేమో. మో కవిత్వాన్ని ఒక్కో కవిత గా చూడలేము. ఆయన కవిత్వ తాత్త్విక ఆత్మ తెలిసిన వాడికే ఆయన కవిత్వం అనుభవం లోకి వస్తుంది. అందుకే నాకు మో కవితలు చదవాలంటే ఒక బెరుకు, ఒక భయం. ఎంతకూ కోరుకుడు పడని ఆ కవిత ను ఎవరో ఒకరు అరటిపండు చేతిలో వొలిచి పెట్టినట్లు , టీకా తాత్పర్య సహితంగా అర్థం చెప్తారేమోనని చూస్తూ ఉంటాను.


ఇప్పుడు ఈ విషయం మాట్లాడటం సందర్భమో, అసందర్భమో నాకు తెలియదు . మో ని, మందు ని విడదీసి చూడలేం. మొదటి సారి ఆయన ను ఇంటి దగ్గర కలిసినప్పుడు ఆయన అలా తాగి తాగి మాట్లాడుతుంటే నాకు ఏదో తెలియని ఇబ్బందిగా అనిపించింది. సుజాత గారికి అలవాటై పోయుంటుందేమో కానీ నాకు మాత్రం ఎందుకో మోహన్ ప్రసాద్ రాయని, ఎప్పటికీ రాయలేని కవితగా ఆవిడ అనిపించింది ఆ క్షణంలో.

ఆ మత్తు లో కూడా ఆయన మా పట్ల ప్రేమగా మాట్లాడుతుంటే ఆయన లోపలి మనిషి ఎంతో కొంత తెలిసినట్లు అనిపించింది. ఆయనది నిరంతర కవిత్వ మత్తు అని అర్థమయింది . ఆయన కవిత్వం రాయటం కోసం తాగలేదు. తాగినప్పుడు ఆయన లోపలి కవి మరింత బాగా అర్థమవుతాడు. కవిత్వాన్ని ఆయన అనుభవించి, పలవరించి రాస్తాడు. అందుకే ప్రతి కవిత లోనూ అంత చిక్కదనం, అంత గాఢత.
కేవలం తెలుగు భాష తెలిసిన వారికి మో అర్థం అవాలని లేదు. మో కవిత్వాన్ని అర్థం చేసుకోవటానికి మనకోక స్థాయి ఉండాలి. అందుకే ఆయన కవిత్వం పట్ల చాలా మందికి చాలా అభ్యంతరాలుంటాయి నాలాగే, సులభంగా అర్థం కాదనే నెపాలుంటాయి. ఆయన ఎవరికో అర్థం కావాలని మన స్థాయి కి దిగి వచ్చి కవిత్వం రాయలేదు. తానున్న స్థితి కి మనల్ని తీసుకెళ్లి తన కవిత్వాన్ని మన చేతుల్లో పెడతాడు. అందుకే మో కవిత్వాన్ని ఒక అఫ్సరో, మరో కె. శ్రీనివాస్ నో . ఒక సీతారాం నో, మరో శ్రీకాంత్ నో , ఇంకో వంశీకృష్ణ నో బాగా అర్థం చేసుకొని మాట్లాడగలగుతారు. నేను చెప్పిన ఈ పేర్లలో ఏ ఒక్కరూ మో కవిత్వం గురించి ఒకేలా చెప్పరు. ఒకొక్కరికి ఒక్కో పార్స్వం నుంచి మో అర్థమవుతాడు. ఆయన తాత్త్వికత గురించి ఒకొక్కరిది ఒక్కో దృక్పథం.


మో మనసు మంచిది. అందరినీ గొప్పగా ప్రేమించగలడు. ఎదిగే బాల్యమంటే ఆయనకు ఇష్టం.

మా అనిందు పుట్టినప్పుడు పసి పిల్లాడిలా బుజ్జి అఫ్సర్ పుట్టాడని ( నాకు మీరు ఆ మాట అన్నందుకు ఇంకా కోపంగానే ఉంది మో...పోనీలీ ఇప్పుడు క్షమించేస్తాను మిమ్మల్ని) సంతోష పడుతూ వారానికో సారి హైదరాబాద్ లో వున్న మాకు ఫోన్ చేసేవాడు. హైదారాబాద్ కు వచ్చినప్పుడు తప్పనిసరిగా వాడిని చూసి వెళ్ళేవాడు. వాడి పేరు దగ్గర మాకు, మో కి జరిగిన టెలిఫోన్ సంభాషణ తప్పక చెప్పి తీరాలి.
నిజానికి మా అనిందు కి మొదట పెట్టాలనుకున్న పేరు 'అనింద్య '. అంటే ఎవరి చేతా నిందించబడని వాడు అని అర్థం. అప్పటికీ, ఇప్పటికీ మాకు అత్యంత ఆత్మీయులు, మా ' అప్పాజోశ్యుల సత్యనారాయణ ' గారు సూచించిన పేరు అది. అనింద్య అని పెట్టి అనిందో అని పిలుచుకోవాలని మా ఊహ. మో ఫోన్ చేసి పేరు గురించి అడిగారు. మేమనుకుంటున్న పేరు చెప్పాము. ఆయన కి నచ్చలేదు. అసలు ఎవరైనా ఆ పిల్లవాడిని ఎందుకు నిందించాలి?అసలు మిమ్మల్నో, వాడినో ఎవరో నిందిస్తారని మీరేందుకు అనుకోవాలి? ఆ పేరు వద్దు మారుస్తారా? లేదా అని పట్టుబట్టి కూర్చున్నారు. సరే ఆలోచిస్తాము అంటే వింటే కదా, మళ్ళీ మళ్ళీ రాత్రంతా ఫోన్ చేసి ఏవేవో చెప్పి, ఏడ్చేసేవాడు( నిజంగా ఏడ్చేసేవాడు) . ఇక లాభం లేదు, ఆ పేరు మార్చాలని అనుకున్నాము.వెంటనే మాకు మరో ఆత్మీయులు, తెలుగు భాష కి సంబంధించి ఏమైనా సందేహాలొస్తే నేను ఎప్పుడూ సంప్రదించే ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారికి ఫోన్ చేశాను. విషయం చెప్పాను. మో చెప్పిన దానికి ఆయన కూడా అంగీకరించారు. ఆయన ఒక సవరణ చెప్పారు. అనింద్య ను తెలుగు లోకి మార్చి అనిందు చేశారు. ఇందు అంటే చంద్రుడు, అనిందు అంటే చంద్రుడు కాని వాడు. అంటే సూర్యుడు అని అర్థం వస్తుంది. అద్భుతమైన పేరు. వాడు కవి,రవి రెండూ అవుతాడు అన్నారు. అప్పుడు మో కి ఆ పేరు చెపితే ఆయనకు కూడా నచ్చింది. అదీ మా అనిందు పేరు, దాని వెనక వున్న మో పట్టదల.
నిజానికి మా వాడికి ఏ పేరు పెట్టినా ఆయనకు వొరిగే నష్టం ఏమీ లేదు. కానీ మో కి ప్రతి పిల్లవాడు తన పిల్లవాడే. బాల్యాన్ని ప్రేమించలేని వాడు ఎప్పటికీ కవి కాలేడు కదా.


ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో జ్నాపకాలు. కానీ ముఖ్యమైన ఒక జ్నాపకం చెప్పి ముగిస్తాను.


2001
సంవత్సరం అనుకుంటాను. విజయవాడ కవి మిత్ర బృందం ( కథకుడు చంద్రశేఖర రావు ఆధ్వర్యం లో) ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దాని పేరు' కవిత్వం తో ఒక సాయంకాలం' అనుకుంటాను. ఆ మీటింగ్ ప్రతి ఏడాది అప్పట్లో జరిగేది. ఆ మీటింగ్ కు కేవలం తెలుగు కవులుకాకుండా, వేరే భారతీయ భాషల కవుల ని కూడా ఆహ్వానించేవారు. ఆ మీటింగ్ లో అందరూ చదివిన కవిత్వాన్ని ఆ ఏడాది ఒక పుస్తకం గా కూడా ప్రచురించేవారు. అలా ఆ మీటింగ్ కి నన్ను, అఫ్సర్ ని ఆహ్వానించారు. అప్పుడు మేం అనంతపురం లో వుండేవాళ్లం. ఆ మీటింగ్ కి ఒక నియమం ఉండేది. కొత్త కవితలు మాత్రమే చదవాలి. అలా అప్పుడు ఆ సందర్భం కోసం రాసినదే ' ఎవ్వతెవీవు?' కవిత. మీటింగ్ లో ఆ కవిత నేను చదివినప్పుడు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మళయాళ కవి రాజీవన్ థచంపాయిల్ వచ్చి తనను తాను పరిచయం చేసుకొని ఆ కవితను మళయాళం లోకి అనువాదం చేస్తానని చెపుతూ అక్కడ జరిగే కవి సమ్మేళనానికి నన్ను ఆహ్వానించాడు. దానికన్నా నన్ను సంతోష పెట్టిన విషయం ఏమిటంటే మీటింగ్ ఆయిపోగానే మో వచ్చి చేతులు పట్టేసుకొని ' ఈ కవిత నేను తప్ప మరెవ్వరూ ఇంగ్లీష్ లోకి ట్రాన్స్ లేట్ చేయకూడదు' అంటూ ఒట్టు వేయించుకున్నాడు. ' రేపు పొద్దుట మా ఇంటికి వస్తావు కదూ, అప్పుడు నీ స్క్రిప్ట్ నాకు ఇచ్చి వెళ్ళు. నీవి రెండు కవితలు అనువాదం చేస్తాను. కానీ ఒక షరతు ' అన్నాడు. మో లాంటి వాడికి నా కవిత నచ్చటం, అది అనువాదం తానే చేస్తానని , ఇంకేవ్వరికీ ఇవ్వవద్దని పట్టుబట్టడం ....నమ్మశక్యం కాక నిండా ఆనందం లో మునిగిపోయి వున్న నేను ఏమిటి? అన్నట్లు ప్రశ్నార్థం కగా చూశాను. " నేను అనువాదానికి డబ్బులు తీసుకుంటాను. నువ్వు డబ్బులిస్తేనే నా ఇంగ్లీష్ వెర్షన్స్ నీకు ఇస్తాను. ఒక్కో కవిత కు ఇంత డబ్బు ఇవ్వాలి.ఈజ్ దట్ క్లియర్?అంటూ ఒక మొత్తాన్ని చెప్పాడు.. అనువాదం లో వుండే కష్టమే కాదు, ఒక సృజనాత్మక రచనకు ( అనువాదం కూడా సృజనాత్మక రచనే) గౌరవ పారితోషకం గా ఎంతో కొత్త ఇవ్వటం మర్యాద అని తెలిసిన నాకు , ఆయన అంత స్పష్టంగా, ముక్కు సూటి గా అడగటం నచ్చింది. అదీ మో అంటే.


ఎక్కడ నిజాయితీగా, నిక్కచ్చిగా ఉండాలో తెలిసిన మనిషి. మంచి కవిత ఎక్కడున్నా ఆదరించి అక్కున చేర్చుకునే మంచి మనస్తత్వ్వం ఆయనది. తానొక గొప్ప కవినని తనకు తెలిసినా, ఆ గొప్పలు మన దగ్గర చూపించకుండా, మనతో ఎలాంటి భేషజాలు లేకుండా మనతో కలిసి పోయి మాట్లాడే కవి మో. అగ్ర అధికార పీఠాలనేక్కి కింద స్థాయి కలింక్వులను చిన్న చూపు చూసే కవికులం వాడు కాదు ఆయన. ఆయన కవిత్వం కన్నా, అందుకిష్టం నాకు మో అంటే.


మో, మీకు అనిందు తెలుసు. కానీ వాడికి మీ కవిత్వం అర్థమై అది మీకు చెప్పాలనుకుంటే బహుశా మీకోసం వాడొక కవిత రాస్తాడేమో! ఏ మో’!

కల్పనారెంటాల

(ఆగస్ట్ 3, 2011-ఆస్టిన్)

పి.ఎస్. : ' మో' గురించి కే.శ్రీనివాస్ రాసిన సద్విమర్సనాత్మకమైన సంపాదకీయం ఇక్కడ, అఫ్సర్ 'మో' కోసం రాసిన కవిత ఇక్కడ , నరేష్ నున్న రాసిన వ్యాసం ఇక్కడ , మో రాసిన 'నిషాదం' పుస్తకాన్ని కినిగె లో కొనుక్కునో, అద్దెకు తీసుకునో చదవాలనుకుంటే ఇక్కడ చూడండి. తనికెళ్ళ భరణి పురస్కారాన్ని ఇటీవల అందుకున్న సందర్భంగా ' మో' తన కవిత్వం గురించి , దానిపై వచ్చిన 'విమర్శ' ల గురించి చేసిన ప్రసంగం పిడిఎఫ్ ఉంది. అది మో ఆఖరి ప్రసంగం అవటం ఒక్కటే దాని ప్రాధాన్యం కాదు. అందులో ఆయన చెప్పిన మాటలు ముఖ్యమైనవి. వీలయితే మీ అందరి సౌకరార్థం ఆ పిడిఎఫ్ ని యూనికోడ్ లో కంపోజ్ చేసి పెట్టాలని ఉంది కుదిరితే. ఎవరికైనా అది చదవాలని ఉంటే నాకొక మెయిల్ పంపిస్తే ఆ పిడిఎఫ్ మీతో పంచుకుంటాను.


13 వ్యాఖ్యలు:

వనజ వనమాలి said...

కల్పనగారు..జ్ఞాపకాలు ఊరుతూనే ఉంటాయి.పంచుకున్నదుకు సంతోషమో-విచార"మో"!
:))))))

Anil said...

I understand your feelings..

తృష్ణ said...

honourable tribute kalpana gaaru..

koduri vijayakumar said...

కల్పన గారూ..'మో' తో పెనవేసుకుపోయిన మీ జ్ఞాపకాలను మాతో పంచుకున్నందుకు కృతజ్ఞతలు ... నాకు అప్పుడప్పుడూ అనిపిస్తుంది...నేను 'సీరియస్ కవిత్వం' లోకి వోచ్చేనాటికే, కొన్ని circles లో ఆయన కవిత్వం పట్ల చాలా తీవ్ర స్థాయిలో స్థిరపడిపోయిన కొన్ని prejudices [అస్పష్టమనీ, అర్థం కాదనీ...వగయిరా] నన్ను మో కవిత్వాన్ని అంత సీరియస్ గా చదవకుండా చేశాయని...కానీ...ఆ తరవాత కాలంలో మో కవిత్వాన్ని కాస్త సీరియస్ గా చదవడం మొదలు పెట్టాక అనిపించింది...'I missed his poetry '.....బహుశా, తెలుగు కవిత్వంలో ఎవరి కవిత్వం కూడా ఇంతగా prejudices కి గురి కాలేదనుకుంటా...
నాకు వున్న వొక అభిప్రాయం ఏమిటంటే...'మో' ని సీరియస్ గా చదువుకుని...ఆయన కవిత్వాన్ని పలవరించిన మొదటి వరుస వ్యక్తులలో నరేష్ నున్న వొకడని...[మరేం లేదు...మీరు ప్రస్తావించిన పేర్లలో తన పేరు లేకపోవడం చూసి కొంత ఆశ్చర్య పోయాను]

dhaathri said...

aardrangaa undi kalapanagaroo oka shock tho ghaneebhavinchina dukham mee aksharalato kanneerai sravistondi...vijayawada asok book festival lo kalusukunnapudu naa peru nachcindani mecchukunnaru ade o theeyani jnapakam naku....love j

Kalpana Rentala said...

@వనజా వనమాలి, అనిల్, తృష్ణ ...థాంక్స్.
@విజయకుమార్...మీరన్నది కరెక్తే. నరేష్ పేరు ఉదహరించకపోవటం నా పొరపాటే. మో కవిత్వానికి జరిగిన పొరపాటే నరేష్ విమర్శకు కూడా జరుగుతోందనుకుంటాను.:-))
ఆ పేర్లు రాసేటప్పుడు నరేష్ పేరు కన్నా, నన్ను ఆలోచింప చేసిన విషయం మరొకటి ఉంది. అది కూడా మిమ్మల్నే అడుగుతున్నాను. వీలైతే , మీకు తెలిస్తే సమాధానం చెప్పండి. రచయిత్రుల్లో ఎవరైనా మో కవిత్వం గురించి ఎక్కడైనా రాసారా? అని ఆలోచించాను,నాకు ఒక్క పేరు కూడా గుర్తుకు రాలేదు. మీరు ఎవరివైనా చదివి ఉంటే నాకు చెప్పండి. ఘంటసాల నిర్మల ఎక్కడైనా రాసిందేమో అనుకున్నాను కానీ స్పష్టంగా గుర్తు లేదు. దానికి కారణాలు కూడా వెతుక్కోవాలనుకోండి మనం.
@ ధాత్రి...గుర్తుంది మనం కలుసుకోవటం. అవును, అది మంచి జ్నాపకం.

కె. శ్రీనివాస్ said...

తన కవిత్వంలో అనేక వాచకాలు ఉన్నాయని 'మో' నే అన్నారు. ఇంతకాలం తెలుగు సాహిత్య సమాజం విముఖంగా ఉన్నది ఒకానొక వాచకానికి మాత్రమే కావచ్చు. ఆయన కవిత్వంలో పోస్ట్ డేటెడ్ వాచకాలే ఎక్కువ. ..

కల్పన గారూ, మీ జ్ఞాపకాలు ఎంతో ప్రేమగా ఆర్తిగా మో స్మృతిని స్పృశిస్తున్నాయి. మో మరింత పరిచయం అయ్యారు.

Kalpana Rentala said...

శ్రీనివాస్, థాంక్ యు.
పి.ఎస్. : ' మో' గురించి కే.శ్రీనివాస్ రాసిన సద్విమర్సనాత్మకమైన సంపాదకీయం ఇక్కడ, అఫ్సర్ 'మో' కోసం రాసిన కవిత ఇక్కడ , నరేష్ నున్న రాసిన వ్యాసం ఇక్కడ , మో రాసిన 'నిషాదం' పుస్తకాన్ని కినిగె లో కొనుక్కునో, అద్దెకు తీసుకునో చదవాలనుకుంటే ఇక్కడ చూడండి. తనికెళ్ళ భరణి పురస్కారాన్ని ఇటీవల అందుకున్న సందర్భంగా ' మో' తన కవిత్వం గురించి , దానిపై వచ్చిన 'విమర్శ' ల గురించి చేసిన ప్రసంగం పిడిఎఫ్ ఉంది. అది మో ఆఖరి ప్రసంగం అవటం ఒక్కటే దాని ప్రాధాన్యం కాదు. అందులో ఆయన చెప్పిన మాటలు ముఖ్యమైనవి. వీలయితే మీ అందరి సౌకరార్థం ఆ పిడిఎఫ్ ని యూనికోడ్ లో కంపోజ్ చేసి పెట్టాలని ఉంది కుదిరితే. ఎవరికైనా అది చదవాలని ఉంటే నాకొక మెయిల్ పంపిస్తే ఆ పిడిఎఫ్ మీతో పంచుకుంటాను.

Kalpana Rentala said...

సారీ. పైన కామెంట్ లో లింక్ లు పనిచేయటం లేదు. కాబట్టి పోస్ట్ లో పి.ఎస్. కింద ఈ లింక్ లు చేర్చాను. లింక్ లు కావాల్సిన వారు పోస్ట్ లోనే చదుకోవలసిందిగా ప్రార్థన.:-))

వాసుదేవ్ said...

కల్పనగారు నమస్తె....వైజాగ్ వదిలి, ఇండియా వదిలి చాన్నాళ్ళు కావటంతో ఇటువంటి సందర్భాలకి, కొంతమంది గొప్ప వ్యక్తులకి దూరం జరిగిపోయాను.....సాహిత్యాభిలాష తప్ప మెప్పించె కవిత్వాల్లాంటివాతికి దగ్గరకాలేకపోయాను...మో గురించి విని ఆయన కవిత్వం చదివి అర్ధంకాక వదిలేసిన వారిలో నేనూ ఒకణ్ణి....అప్పట్లో బహుశా అంతపరిపక్వత లేకపోవడం కావొచ్చు లేక జీవనపోరాటాల్లో భాగంగా అంత మనసు పెట్టి వదివుండకపోవచ్చు..ఏదిఏమైనా ఇప్పుడు మళ్ళీ మో ని భరణి పురస్కారసభలో టీవీలో చూసి ఇంకా ఆ జ్ఞాపకం మరోజ్ఞాపకంతో రిప్లేస్ కాకమునుపే ఇలాజరగడం ఇంకా షాకింగ్ గానే ఉంది.... ఆ ప్రసంగాన్ని చదవాలని ఉంది...కానీ మీ మెయిల్ ఐడి లేదు...మీకు అభ్యంతరంలేకపోతే నా ఐడికి పంపిస్తారా? (adarinandu@gmail.com) ధన్యవాదాలు.....వాసుదేవ్

RENUKA AYOLA said...

mo meeda chalabaga rasaru kalpana.!

RENUKA AYOLA said...

mo meeda chalabaga rasaru kalpana.!

RENUKA AYOLA said...

mo meeda chala baga rasaru kalpana.!

 
Real Time Web Analytics