అది ఒకానొక సంవత్సరం.(1985-90 మధ్య)
స్థలం: విజయవాడ
విజయవాడ నార్త్ రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో మాట్లాడటానికి సరస్వతీ పుత్ర,, పద్మశ్రీ శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు గారు వచ్చారు. ఆయన బహు భాషా పాండిత్యం గురించి మా నాన్న గారి దగ్గర విని ఉండటమే కాకుండా, శివతాండవం లాంటివి ఒక సారి అలా తిరగేసిన మిడి మిడి జ్నానంతో ఆయనను ఇంటర్వ్యూ చేయటానికి సాహసం చేసి వెళ్ళాను.
కడప నుంచి ఆ మీటింగ్ కోసం వచ్చిన పుట్టపర్తి వారు విజయవాడ బస్ స్టాండ్ ఎదురుగుండా వున్న దుర్గాభవన్ లాడ్జీ లో దిగారు. నేను వెళ్ళేసరికి అప్పటికే పుట్టపర్తి గారి దగ్గర నాగళ్ళ గురుప్రసాద రావు గారు, పుట్టపర్తి గారి అనుంగు శిష్యుడు,( దత్తపుత్రుడులాంటి) కవి, ఆకాశవాణి ఉద్యోగి శశిశ్రీ వున్నారు.
పుట్టపర్తి వారిది మంచి నిండైన విగ్రహం. ఖద్దర్ జూబ్బా, ధోవతీ కట్టుకున్నారు.ఎడమచేతి పై కండువా వేసుకొని కూర్చొని వున్నారు. ఆయనవి పద్మాల్లాంటి కళ్ళు.
14 భాషలు ఆయన సొంతం
పుట్టపర్తి వారు14 భాషల్లో పండితుడు. శతాధిక గ్రంథ కర్త. కవి, విమర్శకుడు, వాగ్గేయకారుడు. సాంప్రదాయికంగా గురువు దగ్గర సంగీత, నాట్యాలను అభ్యసించారు ఆయన. 14 భాషలను కేవలం చదవటానికో, మాట్లాడటానికో మాత్రమే నేర్చుకోలేదు. ఆయా భాషల్లో రచనలు చేసేంత సామర్ధ్యం సంపాదించారు. “Leaves in the Wind" అనేది ఆయన ఇంగ్లీష్ కవితల సంకలనం పేరు. " భక్తాచే గాథే" అనేది ఆయన మరాఠీ పుస్తకం పేరు. విశ్వనాథ సత్యనారాయణ గారి " ఏకవీర" నవలను మలయాళం లోకి పుట్టపర్తి వారు అనువాదం చేసిన సంగతి చాలా మందికి తెలియదు. " శివ సహస్రం " ఆయన సంస్కృత రచన. జీవితాంతం ఆయన జాతీయవాదిగా గడిపారు. గాంధీజీ మరణం తో ఆయన రాసిన " గాంధీజీ mahaaప్రస్థానం" మరువ లేని రచన గా చెప్పుకుంటారు. అనంతపురం జిల్లా పెనుగొండ వాసి కావడం తో తెలుగు , కన్నడ భాషలు సహజంగానే వచ్చాయి. శ్రీవైష్ణవుడు కావడం తో తమిళం అలవడింది. సంత్ సాహిత్యం చదవడం కోసం మరాఠీ, గుజరాతీ భాషలు నేర్చుకున్నారు. హిందీ భాష అంటే ఆయనకు ప్రాణం. పుట్టపర్తి వారి కుటుంబం లోని వారందరికీ తులసీ దాస్ రాసిన " రామచరిత మానస్ " కంఠతా వచ్చు. అది వారికి నిత్య పారాయణ గ్రంథం. పుట్టపర్తి వారి సతీమతి కనకమ్మ కూడా గొప్ప పండితురాలు. కవయిత్రి. శ్రీవైష్ణవులకు శరణాగతి వేదం లాంటి వాల్మీకీ రామాయణం లోని ఆరు కాండ లను 24 గంటల్లో పారాయణ చేసి ఉద్యాపన చెప్పగలిగిన భక్తురాలు. ఆ సరస్వతి పుత్రుడి కి ఆమె నిజంగా సహ ధర్మచారిణి.
శివాయ విష్ణురూపాయ!
సంప్రదాయ శ్రీ వైష్ణవ కుటుంబం లో పుట్టి విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ఆచరించినప్పటికీ శైవ, విష్ణు భేదాలు ఆయన్ని కట్టి పడేయలేదు .' శివాయ విష్ణురూపాయ' అని మనస్ఫూర్తిగా నమ్మారు కాబట్టే ఆయన ప్రొద్దుటూరు లోని అతి పెద్ద ఆగస్తీశ్వర స్వామి గుళ్ళో నియమంగా 108 ప్రదక్షిణాలు ప్రతి రోజూ చేసి అక్కడ కూర్చొని రాసిన రచన " శివ తాండవం". నేను ప్రొద్దుటూరు వెళ్ళి ఆ గుడి ని దర్శించి పుట్టపర్తి వారిని, వారి ' శివతాండవాన్ని' తలుచుకున్నప్పుడు " సంగీత, నృత్య , సాహిత్యాల సమ సమ్మేళనమైన ఆ రచన కేవలం దైవకృప కు నిదర్శనమని" ఆయన చెప్పిన మాట గుర్తొచ్చి కళ్ళు చెమర్చాయి.
ఆయన జీవించినది 76 ఏళ్ళు మాత్రమే . కానీ ఆయన చేసిన సాహిత్య కృషి మాత్రం ఒక జీవిత కాలం కంటే ఎంతో ఎక్కువ. " సరస్వతి పుత్ర" అన్న ప్రతిష్టాత్మకమైన బిరుదు ఆయనకు అక్షరాలా సరిపోతుంది.
ఇంత ప్రతిభావంతుడి కి ఎలాంటి అకడమిక్ క్వాలిఫికేషన్స్ అక్కరలేదు. పరీక్షల ద్వారా ఆయన పాస్ అయినది మద్రాస్ విశ్వ విద్యాలయం నుంచి తెలుగు లో " విద్వాన్" కోర్సు మాత్రమే. పద్నాలుగేళ్లకే కవి, రచయిత అయిన కుర్రవాడికి అకడమిక్ చదువులు నిజంగా అవసరమా? అవసరం లేదని ఒక చిన్న ఉదాహరణ ద్వారా చెప్పవచ్చు. పుట్టపర్తి వారు విద్వాన్ పరీక్షలకు వెళ్లినప్పుడు ఆయన రచన ' పెనుగొండ లక్ష్మి' ఆయన పాఠ్య గ్రంథంమయింది. ఆయన రచన కు ఆయనే విద్యార్థి. ఇది ఒక్క పుట్టపర్తి వారి విషయం లో తప్ప బహుశా ఏ రచయిత జీవితం లోనూ జరిగి ఉండదు.
ఉత్తమ పాఠకుడే సద్విమర్శకుడు
స్వ పరిచయం చేసుకొని వచ్చిన పని చెప్పగానే ' పుట్టపర్తి ' వారు ఎంతో ఆదరంతో ' దానికేం భాగ్యమమ్మా కూర్చో' అన్నారు. అటు నాగళ్ళ గారు, ఇటు పుట్టపర్తి వారు కూడా మొదట మా నాన్నగారి గురించి కుశల ప్రశ్నలు వేశారు.
తర్వాత నాగళ్ళ వారు " ఈ తెలుగు సాహిత్య విమర్శకులంతా అదేమిటో రాయలసీమ వారే. కట్టమంచి రామలింగారెడ్డి, రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ, రాచమల్లు రామచంద్రారెడ్డి, వల్లంపాటి అందరూ రాయలసీమ వారే. ఆంధ్రా నుంచి టి. ఎల్. కాంతారావు లాంటి వారు వున్నారనుకోండి' అన్నారు. అప్పుడు పుట్టపర్తి వారు సాహిత్య విమర్శ, విమర్శకులకు సంబంధించి తన అభిప్రాయాలూ ఇలా చెప్పారు. సీరియస్ సాహిత్య విమర్శకులంతా అంటూ ఒక తిట్టు పదం లాంటిదేదో ఉపయోగించారు. సీనియర్ సాహిత్య విమర్శకులుగా పేరు పడ్డ వాళ్ళ గురించి
విమర్శిస్తూ ఆయన , విమర్శకుడు అనే వాడు ఎలా వుండాలో చెపుతూ " ఉత్తమమైన పాఠకుడే మంచి విమర్శకుడు కాగలడు. వాళ్ళ జీవిత సంస్కారం, అభిరుచి ఇవన్నీ కలిసి ఒకరిని మంచి పాఠకుడి గా తయారుచేస్తాయి" అన్నారు. ఆ రోజు ఆయన చెప్పిన ఆ మాట అలా నా మది లో నిలిచిపోయింది. ఇప్పటికీ " కొందరి సాహిత్య విమర్శలు" చూస్తే ఆ రోజు పుట్టపర్తి వారు అన్న మాట గుర్తుకు వస్తుంది.
సరే, ఇలాంటి మామూలు మాటలేవో అయ్యాక నాగళ్ళ గారు సెలవు తీసుకున్నారు.
నన్ను పరీక్ష చేసేందుకొచ్చినావా ఏందీ?
ఆ తర్వాత నా ఇంటర్వ్యూ మొదలయింది." మీరు బహు భాషా పండితులు కదా. 14 భాషల్లో కూడా రాయడం, చదవడం అంతా క్షుణ్ణంగా వచ్చా?" అని నెమ్మదిగా మొదటి ప్రశ్న వేశాను.
" ఏమ్మా! ఇప్పుడు గానీ నువ్వు నన్ను పరీక్ష చేసేందుకొచ్చినావా ఏందీ? " అంటూ ఆయన నోరారా నవ్వేశారు.
' అయ్యయ్యో లేదు లేదు, నా ఉద్దేశం అది కాదు. మీకు తెలియనిది కాదు, పాఠకులకు తెలియటం కోసం కొన్ని ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది" అంటూ నేను నీళ్ళు నములుతుంటే తల వూపుతూ అడుగు లే అన్నారు.ఇక అక్కడి నుంచి నేను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు వివరంగా చెప్పుకుంటూ వచ్చారు.
ఆ ఇంటర్వ్యూ లో ఆయన తన ప్రసిద్ధ రచన ' శివతాండవం' గురించే కాకుండా ఆనాటి సాహిత్య విమర్శ, విలువల
గురించి కూడా ఎన్నో విలువైన అభిప్రాయాలు వెలువరించారు. ' సాహిత్యం అనేది పిచ్చివాడి చేతిలో రాయి లాగా
మారిపోయిందని' ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కారల్ మార్క్స్ ఓ మహర్షి అని మెచ్చుకున్నారు.
మహోన్నత మూర్తులు
ఆ ఇంటర్వ్యూ కి వెళ్ళే ముందు మా నాన్నగారు నన్ను కూర్చొబెట్టుకొని పుట్టపర్తి వారి గొప్పతనం ఎలాంటిదో,
ఆయన ప్రతిభా వ్యుత్పత్తులు ఎలాంటివో చెప్పుకొచ్చారు. దానితో పాటు కొన్ని హెచ్చరిక లు కూడా చేశారు.
పుట్టపర్తి లాంటి పండితుడి ని ఇంటర్వ్యూ చేయటానికి వెళ్లినప్పుడు ఎంత వినయం గా ఉండి ప్రశ్నలు వేయాలో ,
అసలు ఆయనను కలుసుకొని మాట్లాడటం ఎంత అదృష్టమో వివరించి చెప్పారు. నిజంగా పుట్టపర్తి వారిని కలిసి ఆయన ఇంటర్వ్యూ తీసుకున్నాక మా నాన్నగారు చెప్పిన విషయాలు ఎంత అక్షర సత్యాలో నాకు అర్థమయింది. అంత పండితుడి లో లేశమాత్రమైనా గర్వపు ఛాయలు కనిపించలేదు. ఆయనకంటే వయస్సులోనే కాదు , జ్నానం లో కూడా అతి చిన్న దాన్ని అయిన నన్ను ఆయన ఎంత ప్రేమ గా, ఎంత గౌరవించి మాట్లాడారో తలుచుకున్నపుడు మన పూర్వ తరం నుంచి మనం నేర్చుకోవాల్సిన సంస్కారం ఇదే కదా అనిపిస్తుంది. తన కూతురు ఒక పండితుడి ని కలుసుకొని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లినప్పుడు పెద్దవారితో వినయంగా ఎలా మాట్లాడాలో ఒక తండ్రి నేర్పి పంపిస్తే, మరో 'అయ్య ' అపర సరస్వతీ పుత్రుడైనప్పటికీ వచ్చినది తన సొంత బిడ్డ అన్నట్లు ప్రేమాభిమానాలతో ఆదరించి విలువైన విషయాలను విశదంగా చెప్పి పంపారు.
పద్మశ్రీ వస్తే ఏంటీ? నా నిద్ర చెడగొడతావా?
పుట్టపర్తి వారి వర్థంతి అనుకోగానే రేడియో రోజుల నాటి నాకు పరిచయమున్న వారి కుమార్తె నాగపద్మిని గుర్తొచ్చారు. ఆమెకు ఫోన్ చేస్తే మా అయ్య అంటూ ఎన్నో విలువైన జ్నాపకాలను నాతో ఆత్మీయంగా పంచుకున్నారు. పద్మశ్రీ అవార్డ్ వచ్చినప్పుడు ఏం జరిగిందో ఆమె చెప్పారు.
" రాత్రి పన్నెండున్నర గంటలప్పుడు అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ పేరిట " పుట్టపర్తి వారి సాహిత్య కృషి కి గుర్తింపు గా పద్మశ్రీ అవార్డ్ ను అందచేస్తున్నట్లు" టెలిగ్రామ్ వచ్చింది. అప్పటి దాకా నిద్ర పట్టక అవస్థ పడుతున్న అయ్య అప్పుడే నిద్ర లోకి జారుకున్నారు. పద్మశ్రీ అవార్డ్ వచ్చిందన్న సంతోషం తో నేనేళ్లి అయ్య ను నిద్ర లేపి అవార్డ్ సంగతి చెప్పాను. అయ్య అసలు ఆ అవార్డ్ ని ఏ మాత్రం పట్టించుకోలేదు. " పద్మశ్రీ వస్తే ఏం? నా నిద్ర చెడగొట్టి చెప్పాలా? వస్తే వచ్చింది. పొద్దుట చూసేవాడిని కదా" అన్నారు. అయ్య అంత సింపుల్ గా వుండేవారు.
పుట్టపర్తి కల నెరవేరెనా?
మార్క్స్, అరబిందో సిద్ధాంతాల మేలుకలయిక తో ఓ కొత్త సిద్ధాంతానికి రూపకల్పన చేయాలని పుట్టపర్తి ఎంతో తపించారు. ఆ కొత్త సిద్ధాంతమే సమాజం లోని అన్నీ సమస్యలకు పరిష్కారమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆకాశవాణి వారి కి ఇచ్చిన నాలుగన్నర గంటల సుదీర్ఘ ఇంటర్వ్యూ లో తన తండ్రి పుట్టపర్తి వారు చెప్పిన ఈ సంగతి ని గుర్తు చేసుకొని ఆయన కల సాకారమయ్యే సుదినం ఏదో ఒక నాడు వస్తుందేమో ఆశిద్దామని ఆమె అన్నారు.
లక్ష్మీ కటాక్షం లేని సరస్వతి పుత్రుడు
ఆ అపర సరస్వతి పుత్రుడికి సహజంగానే పెద్దలు చెప్పినట్లు లక్ష్మీ కటాక్షం కలగలేదు. ఎన్నో క్లిష్టమైన ఆర్థిక సమస్యల్లో వున్నప్పుడు స్నేహితులు, ఆయన దగ్గర విద్య నేర్చుకున్న విద్యార్థులు ఆయనకు సహాయపడ్డారు. " ప్రబంధ నాయికలు" లాంటి పుట్టపర్తి వారి రచనలు కొన్ని విశ్వవిద్యాలయాల్లో పాఠ్య పుస్తకంగా పెట్టినప్పటికీ అది ఆయనకు ఆర్థికంగా ఎలాంటి ఉపయోగం లభించలేదు. భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డ్ తో సత్కరించినా, ప్రతిష్టాత్మకమైన " సరస్వతి పుత్ర" " మహాకవి" లాంటి బిరుదులు ఆయనను వరించినా ఆయనకు లభించింది కీర్తి మాత్రమే కానీ కుటుంబ జీవనానికి అవసరమైన కాసులు ఆయనకు దక్కలేదు.
'శివతాండవ' కృతికర్త మాటలు
శివతాండవం రచన ను 1985 లో గుంటూరు కు చెందిన రవి కళాశాలల అధినేత, సహృదయుడు ' ధన్' పునర్ముద్రించినప్పుడు పుట్టపర్తి వారు తన ముందుమాట లో శివతాండవం రచన గురించి రాసుకున్న మాటలు ఈ సందర్భం లో గుర్తు చేసుకోవడం ఎంతైనా సముచితం.
" ఇప్పటికీ శివతాండవం కనీసం పది సార్లు అయినా ప్రింట్ అయి ఉంటుంది. కానీ నేను ఆర్థికంగా లాభపడింది మాత్రం చాలా తక్కువ. కారణాలు అనేకాలు. ముఖ్యంగా ఈ రాయలసీమ చీకటి ఖండం. ఈ ప్రాంతాల్లోనే గడ్డకు వచ్చి ఒక పేరూ, ప్రతిష్టా సంపాదించుకోవాలంటే చాలా కష్టం. సాహిత్యకంగా నా జీవితం లో ఎన్నో కల్లోలాలు ఎదుర్కోవలసి వచ్చింది. ఒక సారి గుంటూరు కి సాహిత్య మిత్రులు కొందరు నన్ను ఆహ్వానించినారు. నాకు శరీర ఆరోగ్యం కూడా సరిగా లేదు అప్పుడు. ప్రయాణానికి కావల్సిన జాగ్రతలన్నీ వారే చూచుకున్నారు.రామాయణం పైన నా ఉపన్యాసం. ఒక వెయిన్నూట పదహార్లు ఇచ్చి సత్కరించినారు. ఆ సందర్భం లో శ్రీ ధన్ గారు నాకు పరిచయమైనారు. ఆయన సాహితీ ప్రేమికుడు. జీవితం లో కష్టసుఖాలనేరిగిన వాడు. నన్ను గూర్చి వారికంతకు ముందే తెలుసు. వారు కొన్ని వేలు ఖర్చు పెట్టి మంచి బొమ్మలతో పాటు శివతాండవాన్ని మరలా ముద్రించి ఇస్తానని పూనుకున్నారు. వారి యౌదార్యాన్ని నేనెట్లు గౌరవించవలెనో నాకు తెలియదు. చిరంజీవి రామమోహనరాయ్, మరి కొందరు వారి ప్రయత్నానికి హర్షించి వారికి తోడైనారు. వీరందరికిన్నీ గూడా మనస్ఫూర్తిగా కృతజ్నతలు తెలుపుకోవడం తప్ప మరేమీ చేయలేను.
'శ్రీశ్రీ' గారి ' మహా ప్రస్థానం' లాగా ' శివతాండవా'న్ని ముద్రించి వెల పెట్టి నాకార్థికంగా యేదైనా ఉపయోగపడేటట్లు చూడాలని శ్రీ ధన్ గారు సంకల్పించారు. ఋణానుబంధాలు మహా విచిత్రంగా ఉంటాయి. భౌతికాలైన కారణాలతో వాని స్వరూప నిర్ణయాన్ని చేయడం నా యోగ్యత కు మించిన పని.
నా పుస్తకాలలో నాకు ఎక్కువ ఖ్యాతి తెచ్చింది శివతాండవమేనని చెప్పవచ్చు. అనేక సంవత్సరాలుగా, అనేక సభల్లో వినిపించడం జరిగింది. వినిపించిన చోటంతా దాన్ని గూర్చిన పొగడ్తలే తప్ప , మరేమీ వినలేదు. ఇతర భాషల వారూ, తెనుగు రాని వారూ కూడా దీన్ని విని ఎంతో మెచ్చుకునేవారు. తిరువాన్ కూర్ లో వున్నప్పుడు , ఢిల్లీ లో వున్నప్పుడు గూడా దీన్ని గూర్చిన పొగడ్తలే. ఢిల్లీ లో రష్యన్ ఎంబసీ వారు కూడా ' శివ తాండవా'న్ని చదివించుకొని విన్నారు. ఆ కావ్యం లో అనుభూతంగా వచ్చే ' లయ' వాళ్లనంతగా ఆకర్షించి ఉంటుందనుకున్నాను. దీనిని వ్రాసేటప్పుడు ప్రొద్దుటూరు లో ఆగస్తీశ్వర స్వామికి చాలా నియమం గా ప్రదక్షిణాలు చేసేవాడిని. రోజూ 108 ప్రదక్షిణాలు. కోవెల చాలా పెద్దది. అప్పుడు వ్రాసినదీ కావ్యం. కావ్యం చాలా చిన్నగా ఉందని, కొద్దిగా పెంచుదామని ఎంతెంతో ప్రయత్నించినాను. కానీ నాకు సాధ్యం కాలేదు. భగవదిచ్చ ఇంతేనెమో అనుకున్నాను.
ఈ కావ్యం లో సంగీత , నాట్య, సాహిత్య సంకేతాలు పెనవేసుకొని వున్నాయి. ఆ మూడింటి యొక్క సాంప్రదాయాలు కొంతకు కొంత తెలిస్తే గానీ, ఈ కావ్యం అర్థం కాదు. దీనిపైన చిన్న వ్యాఖ్యానం వ్రాస్తే బావుంటుందని చాలా మంది నాకు సూచించినారు. కానీ కొన్ని విషయాల్లో ఎందుకో నేను చాలా ఉదాసీనం. ఆ పని ఎప్పుడూ చేయలేదు.
అంతమాత్రమే కాదు. ఈ కాలం లో ఒక పుస్తకం వ్రాయడం ఒక నేరం చేసినంత పని. రాస్తే, ప్రింట్ కావడం కష్టం. ఎవ్వడో పబ్లిషర్ వేటగాడి వలె కాచుకొని ఉంటాడు. ఇక మనమే అమ్ముకోవాలంటే హత్యానేరం చేసినవాడు తప్పించుకోవడానికి చేసేంత ప్రయత్నం చేయాలి. ఈ బాధలు ప్రతి రచయితా అనుభవిస్తున్నవే.
నేను సుమారు నూటికి పైగా గ్రంథాలు వ్రాసినాను. గద్యము, పద్యమూ రెండూ వున్నాయి. మరి యెందుకో నా పేరు శివతాండవ గ్రంథం పెనవేసుకొని పోయినవి. ఇది కూడా ఒక భగవత్ చిత్రమే. ఈ గ్రంథం ఇతర భాషల్లో కూడా పరివర్తితమయింది. జర్మన్ లోకి ఎవరో చేసినారు.హిందీ లోకి ఇద్దరు ముగ్గురు పరివర్తించినారు.నేను వానిని చూచినాను కూడా. ఇటువంటి గ్రంథాలు పరివర్తించడం కూడా చాలా కష్టం. ఇటువంటి కార్యాల గౌరవం ముఖ్యంగా శబ్దం పైన ఆధారపడుతుంది. ఇంగ్లీష్ లోకి తెద్దామని నేనే ఎన్ని సార్లు ప్రయత్నించినాను. కానీ ఆ భాషాంతీరీకరణం ఎప్పుడూ నాకు తృప్తీ నిచ్చింది లేదు. కాళిదాసు ఎన్నో గ్రంథాలు వ్రాసినాడు. ఆయన మేఘసందేశానికేందుకో గొప్ప అదృష్టం పట్టింది. విశ్వనాథ వారు ఎక్కడకు పోయినా కిన్నెరసాని పాటల్నే చదవమనేవారు.
శ్రీ బాపు గారు ప్రసిద్ధ చిత్రకారులు. వారికేన్నో పనులు. బహుకార్యవిష్టులైన్నీ నాపై దయ తో చిత్రాలని గీచి ఇచ్చినారు.వారికి నా మనః పూర్వక కృతాంజలి. ఇంకొక సారి శ్రీ ధన్ గారికి, తక్కిన మిత్రులకు నా కృతజ్నతలు తెలుపుకుంటున్నాను.
పుట్టపర్తి నారాయణాచార్య , నవంబర్, 1985.
సరస్వతీ పుత్రుడు ఒక్కడే!
పుట్టపర్తి వారు తన బిరుదు కు తగినట్లు నిస్సందేహం గా సరస్వతి పుత్రుడు. ఆ బిరుదు కేవలం ఆయనకొక్కరికే
సొంతం. ఆ బిరుదు ఆయన పేరుతో చక్కగా కలిసిపోయింది. తెలుగు సాహిత్య లోకం లో మనకున్నది ఒకే ఒక్క
సరస్వతి పుత్రుడు. ఆ పేరు చెప్పగానే ఎవరికైనా స్పురించేది, స్ఫురించాల్సింది పద్మశ్రీ పుట్టపర్తి
నారాయణాచార్యులు మాత్రమే. ఆ బిరుదు ని ఇవాళ్టి వార్తాపత్రికల్లో " సరస్వతి పుత్రుడికి సహాయం చేయండి" లాంటి శీర్షికల దగ్గర చూస్తుంటే కొంచెం బాధ కలుగుతుంది. తెలివైన విద్యార్థి అనో, పేద విద్యార్థి అనో రాస్తే సరిపోయే దానికి అని ఓ పదో క్లాస్ లో మంచి మార్కులు సాధించిన విద్యార్థి ని " అపర సరస్వతీ పుత్రుడు" అనటం ఎంత సమంజసమో పత్రికల వారు ఆలోచించుకోవాలి.
సెప్టెంబర్ 1, 1990 న పుట్టపర్తి వారు భౌతికంగా కాల ధర్మం చెందారు. ఇది ఆయన 21 వ వర్థంతి. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు కానీ తెలుగు సాహితీ లోకం ఆయనను ఎన్నటికీ మరువదు.ఎప్పటికీ ఆయనొక్కడే " సరస్వతి పుత్రుడు".
కల్పనా రెంటాల
13 వ్యాఖ్యలు:
కల్పన గారూ,
పూజ్యులు పుట్టపర్తి నారాయణాచార్యుల వారి గురించి చక్కటి వివరాలు తెలియజేశారు. మీకు నా కృతజ్ఞతలు.
మీరు చెప్పినది సత్యము. వారు సరస్వతీపుత్రులు. వారి మాటలను కూడా చదవగలిగినందుకు చాలా ధన్యతను పొందినట్టు భావిస్తున్నాను. చాలా సంతోషం.
Kalpana garoo..I am very Happy.. malle vraasthaanu.. choosina santhoshamlo.. ee spandana.
కల్పన గారు.. చాలా సంతోషం. పుట్టపర్తి గారి గురించి మీరు వ్రాయడం మీకు ఒక రకంగా అదౄష్టం. ఆయనని సమీపంగా చూడగల్గడం,వారిని ఇంటర్వ్యూ చేయగల్గడం. ఇప్పుదు వారి గురించి ఈ పొస్ట్ వ్రాయగల్గడం ..కూడా.
"శివతాండవం" కావ్యం పేరు వినగానే..పుట్టపర్తి వారు గుర్తుకు రావడం అంటెనే ..ఒడలు పులకరిస్తుంది. . ఆ కావ్య రచన వైభవం అంత గొప్పది. నాకైతే శతవసంత సాహితీమంజీరాలు కార్యక్రమంలొ..ప్రయాగ వేదవతి గారు..తన కంచు కంఠంతో వినిపించిన శివతాండవం పరిచయ కార్యక్రమం విని పుస్థకాల దుకాణాల వెంట తిరిగి మరీ సేకరించి చదివాను.(ఇప్పుడు లేదు పుస్తక ప్రియులు అరువు తీసుకుని స్వాహా చేసారు.అది వాళ్ళకి వరమే అనుకుంటాను)ఆకాశవాణి కడప కేంద్ర ప్రసారాలు వినడం అలవాటు మూలంగా నాకు పుట్టపర్తి వారి పై ప్రత్యేక అభిమానం. మీరు చెప్పడం వల్ల మరిన్ని విశే షాలు తెలుసుకున్నాం. నిజంగా అలాతి సాహితీ స్రస్ట మనవారు అయినందులకు మన అందరికి గర్వకారణం.వారి వ్యక్తిత్వం అబ్బురం.
మీరు చెప్పిన విషయం సరస్వతి పుత్రుడు కి..అర్ధం మారిన, మారిపోతున్న విధం నిజంగా విచారకరం.. ఇన్ని విశేషాలు అందించిన మీకు ధన్యవాదములు.
చాలా బావుందండీ టపా..
అవును, ఆయనొక్కడే సరస్వతీ పుత్రుడు! అది ఆయన పేరులో భాగంగా కల్సిపోయింది.
టపా చాలా బాగుంది.
కల్పనగారూ..
మా అయ్యగారిపట్ల మీకున్న అపారమైన గౌరవమంతా తొణికిసలాడుతూంది మీ రచనలో!
ఆ రోజులు మళ్ళీ వస్తే ఎంతబాగుణ్ణు..అనిపించింది..కాలచక్రాన్ని గిర్రున వెనక్కి తిప్పే కిటుకు ఎలాగైనా తెలుసుకోవాలన్నంత తపన,ఆర్తి,కలుగుతుంది ఇలాంటి రచనలు చదివితే! మా అయ్యగారి మాట తీరును యధాతథంగా వ్రాసి,వారి ధీరగంభీర మూర్తిని కళ్లముందు నిలిపారు. అయ్యగారి 21వ పుణ్యతిధినాడు వారి పవిత్రస్మృతులతో కన్నులు చెమ్మగిల్లేలా చేశారు. నిజానికి వారిని గుర్తు చేసుకోని రోజులు అసలు ఉండవు.కానీ ఈరోజు మరీ మనసు శూన్యమయింది. ఇంకేమిచెప్పను?.మీ నాగపద్మిని
మందాకిని గారు,
వ్యాసం మీకు నచ్చినందుకు సంతోషం. ఆయన మీద వున్న గౌరవ భావానికి మనం చేయగలిగింది ఇంత మాత్రమే.
వనజా, అవును. నేను ఆయనను అప్పుడు కలిసి మాట్లాడటం నిజంగా నా అదృష్టం. ఆ సమయం లో కరుణశ్రీ జంద్యాల పాపయ్య శాస్త్రి గారిని, శ్రీరంగం గోపాల రత్నం గారి లాంటి ప్రముఖులను కలిసి ఇంటర్వ్యూ చేయడం నిజంగా నా జీవితం లో మరువలేని మధుర ఘట్టాలు. శివతాండవం దైవ దత్త రచన. వేదవతి గారి స్వరం మీరు చెప్తుంటే నా చెవుల్లో మోగుతోంది.
తృష్ణ,సుజాత థాంక్స్.
నాగపద్మిని గారు,
అవును. కాలచక్రాన్ని వెనక్కు తిప్పగలిగే శక్తి మనకు లేదు. కానీ ఇలాంటి జ్నాపకాల ద్వారా ఆ కాలాన్ని ఇప్పటికీ అరువు తెచ్చుకొని చూసుకోగలగటం మాత్రమే మనం చేయగలము. నాన్నగారితో మీ అనుబంధాన్ని, మీ జ్నాపకాలను మీరు తప్పక రాయటం ప్రారంభించవలసిందిగా విన్నపం.
ఉదయాన్నే మీ టపా చదవడం, అందునా పుట్టపర్తివారి గురించి చదివి రోజు ప్రారంభించడం సాక్షాత్తూ పరమశివుణ్ణి తలచుకుని రోజు ప్రారంభించడమే. కృతజ్ఞతాంజలి కల్పన గారు!
పుట్టపర్తి వారు యుగకవి. సందేహం లేదు.
వారి రచనలలో అంతర్లీనంగా కనిపించేది భక్తి తత్వం మాత్రమే. ఆ భక్తి తత్వం - ప్రాంతీయాభిమానం (పెనుగొండలక్ష్మి)తో మొదలై, ఆంధ్రదేశం (మేఘదూతం), భారతదేశం (గాంధీజీ, సిపాయిపితూరీ వగైరా), సాంస్కృత్యాభిమానం (మహాభారత విమర్శనం), దైవభక్తి (శ్రీనివాస ప్రబంధం, పండరీభాగవతం వగైరా), ఆత్మార్పణం (పాద్యము, విభూతి) ఇలా అనేక రూపాలుగా వికసించించింది. వేల పద్యాలతో ఆయన శ్రీనివాసప్రబంధం రచించారు. మన ప్రాచీన ప్రబంధస్థాయికి ఏ మాత్రం తీసిపోని కావ్యం అది. ఉధృతమైన జలపాతం దూకుడు వంటి శైలి, మధ్యమధ్యలో చుఱుక్కుమనే హాస్యం ఆయన సొంతం.
శ్రీనివాస ప్రబంధం లో ఒకచోట దేవతలు మన్మథుడిని ప్రార్థిస్తారు. అక్కడ ఆయన చెబుతారు - లోకంలో విలుకాండ్రు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికి చీల్చే శక్తి మాత్రమే ఉంది (వస్తుద్విధాకరణక్షముల్), అయ్యా, నీకు మాత్రమే సంధానించే శక్తి ఉంది. నిజమైన అద్వైతివి నీవే. ఓ చిత్రవిశ్వానరుడా, శివుణ్ణి, పార్వతిని కలుపవయ్యా, వారికి పుట్టే యిసుగు లోకాల్ని కాపాడాలి! ఉధృతంగా కథ చెబుతూ, మధ్యలో ఇది అయ్యగారి తీరు!
ఆయన గురించి ఎంతైనా వ్రాయవచ్చు కానీ బాధాకరమైన విషయం ఆయన రాయలసీమలో పుట్టటం. అణాకాణీ కవుల రచనలు దొరికుతున్నా, శతాధిక గ్రంథాల రచనలు చేసిన ఆయన రచనల్లో ముఖ్యమినవి ఓ పది కూడా బయట దొరకట్లేదు. ఇది దౌర్భాగ్యం తప్ప మరొకటి కాదు.
అజ్ఞాత గారూ,
మీరు ఎవరో కానీ, చాలా బాగా రాస్తున్నారు. మీ బ్లాగులోనైనా, మరింత రాయమని విన్నపం.
కల్పన గారూ..
అయ్యపై మీరు వ్రాసిన విషయాలు కదలించాయి..
నేను వారి చివరి కుమార్తెను. నా పేరు అనూరాధ.
ఒకసారి ఇద్దరు మళయాళీ అమ్మాయిలు కడపలో బి యే పరీక్ష రాయడానికి వచ్చారు.దారి తప్పో..అదృష్ట వశాత్తో మా ఇంటికి వచ్చి ఇక్కడ వుండడానికి యేవైనా లాడ్జీలు అందుబాటులో వున్నాయా..?
మేము కేరళ నుంచీ వచ్చాము..మాకు తెలుగు రాదు అని చెప్పారు..
అయ్య అప్పుడు ఇంట్లోనే వున్నారు..
ఎందుకమ్మా లాడ్జీలు పైగా ఆడపిల్లలు దూరం నుంచీ వచ్చారు..
మా ఇంట్లోనే వుండండి అని అయ్య వారిని ఇంట్లోనే వుండమన్నారు..
సరే అని వారు మిద్దె పైన ముందు రూములో తమ సూట్కేసులు పెట్టుకొని చదువుకున్నారు..అలా నెల రోజులు మా ఇంట్లోనే వుండి పరీక్షలు వ్రాసి వెళ్ళి పోయారు..
పొద్దుటే మొహం కడుగుకొని కాఫీ తాగి పైకెళ్ళి చదువుకోవడం..
మళ్ళీ వచ్చి టిఫెను తిని స్నానం చేసి పైకెళ్ళి చదువు కోవటం..
మళ్ళీ భోజనం.. ఇలా భాష తెలియకుండానే
పరాయి ఊరిలో పరాయి రాష్ట్రంలో పరాయి ఇంట్లో స్వంత ఇంట్లో ఉన్నంత స్వేచ్చగా ..స్వతంత్రంగా..క్షేమంగా..
వున్నారు..
ఆ ఒక్కసారే కాదు మళ్ళీ ఓ పది సార్లకు పైనే పరీక్షలకు నెలరోజులు ముందుగా వచ్చే వారు..
ఇప్పుడు ఆలోచిస్తే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది..
వారు సూట్ కేసులతో రాగానే అయ్య వచ్చారా అన్నట్లు చూడటం అంతే..
వారికి యే విధమైన అసౌకర్యమూ జరిగేది కాదు..
ఆ పెద్దతరం పోయింది..
మనసులూ..మనుషులూ..ఇరుకై పోయారు..
మీకు ప్రశంసగా నేనేదో రాసాను..
ఏమో భావాలు పంచుకోవాలనిపించింది..అంతే..
వుంటాను..
పుట్టపర్తి అనూరాధ.
కల్పన గారూ..
అయ్యపై మీరు వ్రాసిన విషయాలు కదలించాయి..
నేను వారి చివరి కుమార్తెను. నా పేరు అనూరాధ. ఒకసారి ఇద్దరు మళయాళీ అమ్మాయిలు కడపలో బి యే పరీక్ష రాయడానికి వచ్చారు.దారి తప్పో..అదృష్ట వశాత్తో మా ఇంటికి వచ్చి ఇక్కడ వుండడానికి యేవైనా లాడ్జీలు అందుబాటులో వున్నాయా..?
మేము కేరళ నుంచీ వచ్చాము..మాకు తెలుగు రాదు అని చెప్పారు..
అయ్య అప్పుడు ఇంట్లోనే వున్నారు..
ఎందుకమ్మా లాడ్జీలు పైగా ఆడపిల్లలు దూరం నుంచీ వచ్చారు..
మా ఇంట్లోనే వుండండి అని అయ్య వారిని ఇంట్లోనే వుండమన్నారు..
సరే అని వారు మిద్దె పైన ముందు రూములో తమ సూట్కేసులు పెట్టుకొని చదువుకున్నారు..అలా నెల రోజులు మా ఇంట్లోనే వుండి పరీక్షలు వ్రాసి వెళ్ళి పోయారు..
పొద్దుటే మొహం కడుగుకొని కాఫీ తాగి పైకెళ్ళి చదువుకోవడం..
మళ్ళీ వచ్చి టిఫెను తిని స్నానం చేసి పైకెళ్ళి చదువు కోవటం..మళ్ళీ భోజనం.. ఇలా భాష తెలియకుండానే
పరాయి ఊరిలో పరాయి రాష్ట్రంలో పరాయి ఇంట్లో స్వంత ఇంట్లో ఉన్నంత స్వేచ్చగా ..స్వతంత్రంగా..వున్నారు..
ఆ ఒక్కసారే కాదు మళ్ళీ ఓ పది సార్లకు పైనే పరీక్షలకు నెలరోజులు ముందుగా వచ్చే వారు..
ఇప్పుడు ఆలోచిస్తే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది..
వారు సూట్ కేసులతో రాగానే అయ్య వచ్చారా అన్నట్లు చూడటం అంతే..
వారికి యే విధమైన అసౌకర్యమూ జరిగేది కాదు..
ఆ పెద్దతరం పోయింది..
మనసులూ..మనుషులూ..ఇరుకై పోయారు..
మీకు ప్రశంసగా నేనేదో రాసాను..
ఏమో భావాలు పంచుకోవాలనిపించింది..అంతే..
వుంటాను..
క్షేమంగా..
పుట్టపర్తి అనూరాధ.
కల్పనగారూ, చాలా కాలం తర్వాత మళ్లీ ఇలా కలుస్తున్నాను. పుట్టపర్తి వారి గురించి poddu.net లో చాలా మంచి జ్ఞాపకాలు వచ్చాయి మీరు చూశారు కదూ.
పుట్టపర్తి అంతర్ముఖం
http://poddu.net/2011/node836/
పుట్టపర్తి వారితో నా పరిచయ స్మృతులు
http://poddu.net/2011/node805/
నా స్మృతిమంటపంలో మహాకవి పుట్టపర్తి
http://poddu.net/2011/node802/
నేటితరం మాడు పగులగొట్టే మెరుపువాక్యం ఆయనదే. కింద చూడండి.
“చూడరా సుబ్బయ్యా, మీది సిగ్గూ ఎగ్గూ లేని తరం. మీకు చదువరంటే గౌరవం లేదు. ముఖ్యంగా ఆత్మగౌరవం లేదు. మా తరం వేరు.ఎవరైనా నారాయణాచార్లు కవి కాదంటే నేను బాధపడను. కోపం చేసుకోను. నేను రాసే కవిత్వం ఆయనకు నచ్చలేదేమోలే అనుకుంటాను. కానీ నాకు చదువు తక్కువంటే మాత్రం భరించలేను. నిజంగా తక్కువే ఐతే చదువుకుంటాను. చదువుకు వయస్సు అడ్డు రాకూడదు.” అన్నారు.
పుట్టపర్తివారి మూర్తిమత్వం అంటే ఇదీ..
పై మూడు లింకులూ, మీ లింకులూ కలిపి చదవితే ఇంకా బాగుంటుంది. అందుకే వీటిని ఇక్కడ పెడుతున్నాను.
Post a Comment