నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Sunday, August 14, 2011

వేలాది ‘ పూరో’ ల వేదన ఒక ‘ పింజర్’!


ముందస్తు హెచ్చరిక


ఇది ఈ ఆగస్ట్ 15 , స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షల పోస్ట్ కాదు . ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు జరిగిన రక్తపాతం, హింస, స్త్రీలపై జరిగిన అత్యాచారాలు గుర్తు చేసుకునే విషాద సందర్భం. మరో సారి ఆ పీడ కల ను ఒక సినిమా ద్వారా గుర్తు చేయాలనిపించింది. దేశ విభజన మీద కథలు, నవలలు, సినిమా లు అనేకం వచ్చాయి. వాటిల్లో నాకు బాగా నచ్చిన పుస్తకాలు రెండు. ఒకటి అమృతా ప్రీతం రాసిన నవల ' పింజర్'. రెండోది రీతూ మీనన్, కమలా భాసిన్ ల పరిశోధానాత్మక పుస్తకం ' బోర్డర్స్ అండ్ బౌండరీస్'. పింజర్ నవల 2003 లో సినిమా గా విడుదలయింది.
ముందుగానే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఇది బటానీలో, పాప్ కార్నో నములుకుంటూ రిక్లైనర్ మీద కాళ్ళు జాపుకొని రిలాక్సెడ్ గా చూడగలిగే కాలక్షేపం సినిమా కాదు. మీకు కదిలిపోయే మనసుంటే, ఏడవగలిగే కన్నీళ్ళుంటేనే ఈ సినిమా చూడండి. పోనీ సినిమా చూడలేము అనుకుంటే ఈ సినిమా రెండు సార్లు చూసిన నా అనుభూతుల అనుభవాల్లోకి ఒకసారి వెళ్లాలనిపిస్తే ఇక్కడకు వెళ్ళి రండి.

2 వ్యాఖ్యలు:

Anonymous said...

* కృష్ణ వంశీ సినిమాల్లో లాగా దేశ భక్తి అంటే ఆవేశ పూరితమైన ప్రసంగాలుండవు. కేవలం ఏం జరిగిందో మాత్రం చెప్తుంది సినిమా.*
ఈ వ్యాసం లో కృష్ణ వంశీ సినిమాల గురించి ప్రస్థావించటం ఎమీ బాగా లేదు. ఆయన తీసిన సినేమాలు 1990 సం || కాలం లో జరిగిన సంఘటనల ఆధారం గా తీసినవి. మీరు రాసిన సినేమా 1940 సం|| కాలం నాటి కథ. కృష్ణ వంశీ సినిమాల్లో సగటు మనిషి భావోద్వేగాలను చూపిస్తాడు. మీలాంటి ఉదార హృదయం/భావ వైశాల్యం గల(అని మీరనుకొంట్టుటారు)వారి ఆలోచనలు ఆయన సినేమాలలో చూపించడు.
అమేరికాకు వేళ్లినా సాహిత్య సేవ పేరుతో హిందూ స్రీల సమస్యలను గురించి బ్లాగులో రాసే మీరు, ఎప్పుడైనా తెలుగు నాట ఇతర మతస్థుల స్రీల సమస్యల గురించి రాశారా? రాస్తే ఎన్ని వ్యాసాలు రాసి వుంటారు?
ఆ వ్యాసాలు ఎక్కడ వున్నాయో చెప్పండి, చదువుతాం.

శ్రీరాం

Kalpana Rentala said...

శ్రీరాం గారు,

చాలా బిజీ గా ఉండటంతో మీకు సమాధానం కొంత ఆలస్యమయింది. నా భావ వైశాల్యం గురించి మీకు ఏవో అభ్యంతరాలున్నట్లున్నాయి. నా గురించి ఇతరులు ఏమనుకుంటారో అన్న దాని కన్నా, నా మీద నాకున్న అభిప్రాయమే ముఖ్యమనుకుంటాను. కృష్ణ వంశీ సినిమాలను ప్రస్తావించటానికి నా వరకు నాకొక కారణం ఉంది. దేశ విభజన సమయంలో జరిగిన అల్లర్లు, స్త్రీల పై జరిగిన హింస " దేశభక్తి" కి సంబంధించినవే. కృష్ణవంశీ సినిమాల్లోనో, ఇంకో సందర్భాల్లోనో కూడా మనకు దేశ భక్తి అంటే " పొరుగు" దేశం వాళ్ళనో, మతం వాళ్లనో తిట్టదమే. పక్క దేశం వాడిని తిట్టదమే మన దేశాభిమానానికి కొలమానమై పోయింది. పక్క భాష వాళ్ళను తిట్టదమే తెలుగు భాషాభిమానమై కూర్చుంది. అమెరికా ను దుయ్యబడితే కానీ భారత దేశం మీద భక్తి వున్నట్లు కాదన్నట్లు కొంత మంది రాస్తుంటారు. వీటన్నింటి వల్ల నేను ఆ వాక్యం రాయాల్సి వచ్చింది అన్నది వివరణ కాదు. వాస్తవం.
ఇక నేను అమెరికా లో ఉంటూ తెలుగు సాహిత్యం గురించి రాయటం లో మీ అభ్యతరమేమితో నాకు అణు మాత్రం అర్థం కాలేదు. నేను అమెరికా రాకముందు నుంచే సాహిత్య రంగం లో వున్నాను.
ఇక హిందూ స్త్రీల గురించి మాత్రమే రాయటమేమిటి? నాకు తెలిసిన స్త్రీల సమస్యల గురించి రాస్తాను. నాకు ఎవరి గురించి ఎక్కువ తెలిసి ఉంటుంది అన్న దానిని బట్టి నేను రాయగలను . నాకు దళిత స్త్రీల సమస్యల గురించి లోతు గా తెలిసి ఉండకపోతే రాయలేను. అది నా వాస్తవ పరిమితి.

 
Real Time Web Analytics