నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Saturday, July 21, 2012

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా !

సాక్షి ఆదివారం సంచిక లో (జూలై 22) ప్రవాసం శీర్షిక కోసం నేను రాసిన వ్యాసం ఇది.






అమెరికాలో నివసిస్తున్న తెలుగువారు తమ కోసం ఓ లిటిల్ ఇండియాను సృష్టించుకుంటుంటే, ఇండియాలోని వారు అక్కడొక మినీ అమెరికాను ఏర్పాటు చేసుకుంటున్నారు.

అమెరికన్ సమాజంలో ఇండియన్‌లాగా జీవించటంలో ఉండే అనుభవాల గురించి మాట్లాడాల్సి వస్తే... ముందుగా రెండు దేశాల మధ్య వైరుధ్యం కన్నా రెండు దేశాల జీవన విధానంలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్న మార్పుల గురించి చెప్పాలనిపిస్తుంది. ఈ వ్యాసం మొత్తంలో నేను అన్నది వైయక్తికమైన నేను కాకుండా సామాజికమైన నేనుగా వాడుతున్నాను.

పదేళ్లుగా అమెరికాలో నివసించటం మొదలుపెట్టిన దగ్గర నుంచీ నేను, నాలాంటివాళ్లు ఎందరో ఎదుర్కొనే అతి సాధారణ ప్రశ్న/మొదటి ప్రశ్న-‘నువ్వు నీ మాతృదేశాన్ని మిస్ అవుతున్నావా?’ మిస్ అవటమన్న సంకర పద ప్రయోగంలోనే మనం చాలావరకు మారిన పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. మిస్ అవటమంటే... దూరంగా ఉన్న అనుభూతి, ఏదో కోల్పోయిన అనుభూతి. నేను నిజంగా మాతృదేశాన్ని, మాతృభాషను పోగొట్టుకున్నానా? లేదు. కేవలం భౌతికమైన దూరంలో బతుకుతున్నాను.
 
 అప్పుడు-ఇప్పుడు

గత ఇరవై ఏళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా సాంకేతికపరంగా, ఆర్థిక వ్యవస్థలో వచ్చిన ఉదారవాద సంస్కరణల ఫలితంగా అమెరికా-ఇండియాల మధ్య దూరం బాగా తగ్గిపోయింది. ఓడ ఎక్కితే కానీ మొదటి తరం తెలుగువారు అమెరికా రాలేకపోయారు. ఇప్పుడు 15 నుంచి 18 గంటల ప్రయాణంతోనే అటూ ఇటూ రాకపోకలు సాగుతున్నాయి. 30 ఏళ్ల క్రితం ఆంధ్ర దేశం నుంచి వచ్చిన ఓ స్నేహితు రాలికి తల్లి మరణవార్త పది రోజుల తర్వాత ఉత్తరం ద్వారా తెలిసింది.

ఇవాళ అలాంటి పరిస్థితి లేదు. ఇవాళ ఇండియా-అమెరికాల మధ్య స్కైప్‌లు, వానేజీ ఫోన్లు, రోకూ బాక్సులు, ఇంటర్నెట్ టీవీలు, ఈమెయిల్స్, చాట్‌లు, సోషల్ నెట్‌వర్కులు, టీవీ చానెళ్ల ప్రత్యక్ష ప్రసారాలు ఎన్నో వచ్చేశాయి. ప్రతి కొత్త తెలుగు సినిమా అటు ఇండియా, ఇటు అమెరికాలో ఒకేసారి విడుదల అవుతోంది. టీవీ కార్యక్రమాల సంగతి చెప్పనే అక్కరలేదు. రెండు దేశాల మధ్య కాలమానం తేడాలున్నప్పటికీ, ఇండియాలో ఏ టీవీ చానెల్‌లో ప్రసారమయ్యే కార్యక్రమమైనా, అదే సమయంలో అమెరికాలో ఉన్నవారు కూడా ఆ కార్యక్రమాన్ని వీక్షించే సదుపాయాలు వచ్చేశాయి.

ఆహార వ్యవహారాలు, పండుగల పబ్బాల విషయానికి వస్తే... మామూలుగా మహారాష్ట్ర, గుజరాత్‌లలో పండే అల్ఫాన్సా, కేసర్ మామిడిపళ్లతో సరిపెట్టుకునే ఇండియన్ అమెరికన్లు ఇవాళ బంగినపల్లి మామిడిపళ్లను కూడా ఆరగించగలుగుతున్నారు. అమెరికాలోని ప్రతి నైబర్‌హుడ్‌లోనూ ఓ రెండు, మూడు యోగా సెంటర్లు ఉంటాయి.

హిందూ దేవాలయం లేని అమెరికా పట్టణాలు అతి తక్కువ. రెండోతరం, మూడోతరం పిల్లలు, యువతీ యువకులు తెలుగు భాషను, మన బడులు-తెలుగుబడుల్లో నేర్చుకుంటున్నారు. తెలుగువారిని పెళ్లి చేసుకున్న అమెరికన్లు కూడా ఆసక్తిగా తెలుగు నేర్చుకుంటున్నారు. తెలుగు వంటకాలను రుచి చూస్తూ, ఆచార వ్యవహారాలను ఆకళింపు చేసుకుంటున్నారు.

సాహిత్యపరంగా వచ్చిన మార్పులను చూస్తే, ప్రవాసాంధ్ర తెలుగు సాహిత్యం అనేది ప్రధాన స్రవంతి తెలుగు సాహిత్యంలో ఒక ముఖ్యమైన భాగం అయిపోయింది. అమెరికాను చుట్టపు చూపుగా చూడటానికి వచ్చి వెళ్లిపోయే వాళ్ల అమెరికా అనుభవాల నుంచి మాత్రమే ఒకప్పుడు తెలుగువారు అమెరికా గురించి తెలుసుకునేవారు. గత పదేళ్లలో అమెరికాలో నివసిస్తున్న పాత, కొత్త రచయితల కలాల నుంచి అమెరికాలో తెలుగువారి జీవితాల గురించిన సాహిత్య చిత్రణ ఎక్కువయింది.

ఈ మార్పులన్నింటి ద్వారా ఏం అర్థమవుతోంది? అమెరికాలోని తెలుగువారు తమ భాషను కాని, తమ సంస్కృతిని కాని, ఆచార వ్యవహారాలను కాని, తమ భారతీయతను కాని వేటినీ వదులుకోవటం లేదు. తమ మూలాల్ని వదులుకోవటానికి వారెవ్వరూ సిద్ధంగా లేరు. తమ భారతీయతను దేనికీ ఫణంగా పెట్టడం లేదు.

అమెరికాలో ఇండియన్‌లాగా నివసించటంలో చెప్పుకోదగ్గ ఇబ్బందులు లేవు. కానీ ఇప్పుడు ఇండియాలో ఇండియన్‌లాగా నివసించటం మీదనే నాకు అనేక సందేహాలున్నాయి.
రెండు దశాబ్దాల కిందట భారతదేశం తన ఆర్థిక వ్యవస్థ తలుపుల్ని బార్లా తెరిచినప్పుడు ఏం జరుగుతుందో అని ఆందోళనతోను, ఆసక్తితోను అందరూ గమనించటం మొదలుపెట్టారు.

ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలాంటి పెను మార్పులు సంభవించాయో ఎవరైనా సులభంగా తెలుసుకోవచ్చు. షాపింగ్‌మాల్స్, గ్లాస్ పానెల్డ్ ఆఫీస్ బిల్డింగులు, ఎస్కలేటర్లు పుట్టుకొచ్చాయి. పల్లెటూళ్ల స్వరూపం మారిపోయింది. పట్టణాలు ఆధునికత వికృత స్వరూపానికి నకళ్లుగా మారాయి. ఇండియా అంటే ఎప్పటి ఇండియా అని అడగాలనిపిస్తుంది.

అమెరికాలో తెలుగు నేర్చుకున్న రెండోతరం, మూడోతరం తెలుగు యువతీయువకులు సెలవుల్లోనో, పరిశోధన కోసమో ఇండియా వెళ్లి వెనక్కి వచ్చాక, ‘అక్కడి వాళ్ల కన్నా మేమే మంచి తెలుగు మాట్లాడుతున్నాం’, ‘అక్కడ మేం తెలుగులో మాట్లాడుతుంటే అందరూ మాతో ఇంగ్లిష్‌లో మాట్లాడుతున్నారు’ అని చెప్తున్నారు. తెలుగు సినిమాలు చూడటానికి ఇంగ్లిష్, హిందీ వస్తే చాలు తెలుగు రానక్కరలేదు అన్నది ఇవాళ అమెరికాలో ఉన్న తెలుగు పిల్లల మనోభావం. మన తెలుగు సినిమాల్లో తెలుగు నేతి బీరకాయల్లో నెయ్యి చందాన ఉంటోందన్నది అక్షర సత్యం.

తెలుగు తిట్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నేను అనటం లేదు కానీ, అవి పుష్కలంగా ఇంకా అమెరికాలో తెలుగువారి నోళ్లల్లో ‘నీయమ్మ, నీయబ్బ’లుగా నానుతూనే ఉన్నాయి. కానీ ఇండియాలో అమెరికన్ తిట్లు, లేదా ఊతపదాలు ‘ఎఫ్-వర్డ్’, ‘ఎస్-వర్డ్’ ఎలాంటి సంకోచాలు లేకుండా వాడటం కనిపిస్తోంది.

అమెరికాలో తెలుగు పిల్లలు చక్కగా లంగా ఓణీలు వేసుకుని సంగీతం, కూచిపూడి లాంటి లలితకళలను శ్రద్ధగా అభ్యసిస్తుంటే తెలుగుదేశంలో పిల్లల వస్త్రధారణ, టీవీ కార్యక్రమాల్లో వారి ప్రదర్శనలు చూస్తుంటే అటుదిటు, ఇటుదటు మారిపోయినట్లు అనిపిస్తోంది. వస్త్రధారణల్లో వచ్చిన మార్పులు, ఇంగ్లిష్ భాష మాట్లాడటం ఒక నేరంగా నేను ఎత్తి చూపటం లేదు.

ఒక మార్పుకి సంకేతంగా మాత్రమే చెప్తున్నాను. ఇండియాలో తెలుగు పిల్లలకు మాట్లాడే తెలుగు వస్తే గొప్ప. అమెరికాలో తెలుగు పిల్లలు తెలుగులో చదవటమే కాదు, తెలుగులో రాయగలిగే స్థాయికి వెళ్తున్నారు. రాబోయే తరం నుంచి ఓ అమెరికన్ ఇండియన్ తెలుగులో ఓ పుస్తకం రాసే రోజు కూడా ముందు ముందు ఉందన్న ఆశ కలుగుతోంది.

అమెరికనైజ్ అయిపోతున్న ఇండియా నన్ను ఆందోళన పరుస్తున్నది. మొన్నటి మెక్‌డొనాల్డ్స్, నిన్నటి వాల్‌మార్ట్‌లు, ఇవాళ్టి స్టార్ బక్స్, అమెజాన్ మార్కెట్ల రంగప్రవేశంతో నాకు ఇండియా ఇండియాలాగా కనిపించటం లేదు. అమెరికాలో నివసిస్తున్న తెలుగువారు తమ కోసం ఓ లిటిల్ ఇండియాను సృష్టించుకుంటుంటే, ఇండియాలోని వారు అక్కడొక మినీ అమెరికాను ఏర్పాటు చేసుకుంటున్నారు. కాబట్టి ఎవరైనా భారతీయతను కోల్పోవటం అంటూ జరిగితే అది అమెరికాలో జరగటం లేదు. భారతదేశంలోనే మనం మన భారతీయతను కోల్పోతున్నామేమో అనిపిస్తోంది.

ప్రపంచమొక కుగ్రామం అన్న మాట ఈ పదేళ్ల ప్రవాస జీవితం తర్వాత బాగా అనుభవంలోకి వస్తోంది. అమెరికా రావటానికి ముందు ఈ దేశం గురించి నా ఆలోచనలు, నా అవగాహన వేరు. కానీ ఇక్కడికొచ్చాక నాకు కలిగిన అనుభవాలు వేరు. ఆ అనుభవాలు నాకు అమెరికా గురించిన అవగాహనను పెంచడంతో పాటు నా మాతృదేశాన్ని చూడాల్సిన దృష్టిని కూడా ఇచ్చాయి.

ఈ రెండు దేశాలు నాకు రెండు కళ్లలాగా, సొంత ఇళ్లలాగానే కనిపిస్తున్నాయి. సామాజికంగా, సాంస్కృతికంగా, భాషల పరంగా ఈ రెండు దేశాలు భూగోళానికి చెరోవైపు ఉన్నాయి. కానీ నా మనసులో రెండింటికీ ఒకటే స్థానం ఉంది. ఒకటి పుట్టిల్లు, ఒకటి అత్తిల్లు కాదు. రెండూ పుట్టిళ్ల లాగానే కనిపిస్తున్నాయి. కేవలం ఒక కంటితో మాత్రమే చూసే పాక్షిక దృష్టి నాకొద్దు.

ఈ రెండు దేశాల జీవితానుభవంతో సమగ్రమైన దృష్టికోణం అలవడింది. ఆ సమ్యక్ దృష్టితోనే ఈ ప్రవాస సమాజంలో కూడా నా ఉనికిని నేను కాపాడుకోగలుగుతున్నాను. నా మూలాల్ని నేను గుర్తుపెట్టుకోగలుగుతున్నాను.నేను అమెరికాలో నివసిస్తున్న భారతీయురాలిని అని సగర్వంగా చెప్పుకోగలను.

-కల్పనా రెంటాల

6 వ్యాఖ్యలు:

Anonymous said...

తన దగ్గర లేని దానికోసం వెంపర్లాడటం మానవ నైజం. అదే జరుగుతోంది ఇరుపక్కలా.

వనజ తాతినేని/VanajaTatineni said...

ఈ రెండు దేశాలు నాకు రెండు కళ్లలాగా, సొంత ఇళ్లలాగానే కనిపిస్తున్నాయి

చాలా బాగుంది కల్పన గారు. .అక్కడ ఇక్కడ లాగా ఉంది .ఇక్కడ అక్కడ కన్నా వేలం వెర్రి గాను ఉంది అనుకుంటాను నేను.

the tree said...

దేశం గురించి చక్కగా ఆలోచిస్తున్నారు, మంచి విషయం.

Padmarpita said...

ఏదైనా ఎక్కడైనా మనం అడ్జస్ట్ అయి అలవరుచుకోవడంలో ఉంటుందని నా అభిప్రాయం....చక్కగా వ్రాసారు!

Hima bindu said...

నిన్న సాక్షిలో చదివి బ్లాగ్ లో మీ వద్దకి వచ్చి ఈ వ్యాసం మీద మీకు అభినందనలు చెబుదామని వచ్చాను సో ఇక్కడ బ్లాగ్ లో ప్రత్యక్షం !చాల బాగా విశ్లేషించారు

Venkat said...

Excellent Analysis Kalpana garu,This is what exactly happening.I read your article in Sakshi , Google your name and came to your blog.

Keep it up.

 
Real Time Web Analytics