నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Thursday, December 13, 2012

కవిత్వం ఓ తీయని బాధ!
కవిత్వం ఎలా పుడుతుంది? ఎందుకు పుడుతుంది?

కవి అయిన వాళ్ళు, కాని వాళ్ళు కూడా సాధారణంగా ఈ ప్రశ్నల గురించి ఏదో ఒక సందర్భం లో తప్పకుండా ఆలోచిస్తారు. కవిత్వం ఒక రస విద్య లాంటిదని చెప్పుకోవచ్చు. కవిత్వం రాయాలని ఉన్నా, రాయలేని వాళ్ళు ఎందరో! ఎలా రాస్తామో కూడా తెలియకుండానే అలా రాసుకుంటూ వెళ్లిపోయే సహజ కవులు మరెంతమందో! కవిత్వం రాసేవాళ్ళను ఎలా రాస్తారు అని కానీ, ఎందుకు రాస్తారు అని కానీ అడిగి చూడండి. కవిత్వ నిర్మాణం ఇలా జరుగుతుంది, ఒక కవిత ఇలా పుడుతుంది, ఇందుకోసం కవిత్వం రాస్తాము అని విడమర్చి చెప్పగలిగిన వాళ్ళు అతి కొద్ది మంది కూడా ఉండరు. ఎక్కువ మంది రాయకపోతే ఉండలేమనో, రాయలనుకున్నప్పుడు అప్రయత్నంగానే అలా లోపల నుంచి భావాలు వచ్చేస్తాయనో, లేదా రాస్తే బావుంటుంది కాబట్టి రాస్తామనో, రాయకపోతే ఊపిరి ఆగిపోయినట్లు ఉంటుంది కాబట్టి రాస్తామనో...ఇలా కవిత్వం రాసేవాళ్ళు ఒకొక్కరూ ఒక్కో విధంగా ఒక్కో రకమైన సమాధానాలు ఇస్తారు.

 పై రెండు ప్రశ్నలను ఇంకో కోణం నుంచి అడిగినప్పుడు, స్త్రీలు కవిత్వం రాయటానికి, పురుషులు కవిత్వం రాయటానికి తేడా ఉందా? అలాగే ట్రాన్స్ జెండర్ వ్యక్తులు కానీ, గే , లెస్బియన్ లు కానీ కవిత్వం రాస్తే అది భిన్నంగా ఉంటుందా? రేసిస్ట్ లు, సెక్సిస్ట్  లు కవిత్వం రాస్తే ఎలా ఉంటుంది? నల్ల వాళ్ళు, తెల్ల వాళ్ళు, గోధుమరంగు వాళ్ళు, వెనుకబడ్డ దేశాల వాళ్ళు, అగ్రవర్ణ దేశాల వాళ్ళు, అణిచివేయబడ్డ వాళ్ళు, తిరగబడ్డ వాళ్ళు, విప్లవ యోధులు, విప్లవాన్ని వ్యతిరేకించేవాళ్ళు, ప్రక్తృతి గురించి మాత్రమే రాసేవాళ్ళు, పిల్లలు, వృద్ధులు, చెవిటి వారు, అంధులు ....ఇలా రకరకాల వర్గాల వారు, వర్ణాల వారు, జాతుల వారు కవిత్వం రాస్తే ఆ కవిత్వం మామూలు మెయిన్ స్త్రీమ్ కవిత్వం కంటే భిన్నంగా ఉంటుందా?
అందరూ ఒకేలాగా రాస్తారా? రాయగలరా? అని ఆలోచించినప్పుడు ఎవరికీ వారికి ఒక సరైన సమాధానం దొరుకుతుంది. వ్యక్తులందరిలోనూ ఒకేరకమైన చీము, నెత్తురు ఉన్నప్పటికీ అనుభవాలు అనేవి ఎవరికి వారికి ప్రత్యేకంగా ఉంటాయని, ఎవరి దృక్కోణం  లేదా చూపు లేదా సొంత అనుభవం   మిగతా వారికంటే కొంత  భిన్నంగా ఉంటుందని అందరూ అంగీకరించేదే.
ఇప్పుడు ఈ మొత్తం చర్చ నుంచి ఒకే ప్రశ్న తీసుకుందాము. అమెరికా లోనైనా, ఆంధ్రా లో నైనా కవిత్వం అనేది స్త్రీల దృష్టి నుంచి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? స్త్రీలు కవిత్వం లో ఏమేం విషయాలు రాస్తారు ? పాఠకులు లేదా సాహిత్య సమాజం వాటిని ఎలా స్వీకరిస్తుంది? అన్న మూడు అంశాలను ఆధారం గా తీసుకొని స్త్రీల  కవిత్వాన్ని పరిశీలిద్దాము.
మాయా యాంజీలో రాసిన ' Men' అనే కవిత తీసుకుందాము.
Men

 When I was young, I used to
Watch behind the curtains
As men walked up and down the street. Wino men, old men.
Young men sharp as mustard.
See them. Men are always
Going somewhere.
They knew I was there. Fifteen
Years old and starving for them.
Under my window, they would pause,
Their shoulders high like the
Breasts of a young girl,
Jacket tails slapping over
Those behinds,
Men.

One day they hold you in the
Palms of their hands, gentle, as if you
Were the last raw egg in the world. Then
They tighten up. Just a little. The
First squeeze is nice. A quick hug.
Soft into your defenselessness. A little
More. The hurt begins. Wrench out a
Smile that slides around the fear. When the
Air disappears,
Your mind pops, exploding fiercely, briefly,
Like the head of a kitchen match. Shattered.
It is your juice
That runs down their legs. Staining their shoes.
When the earth rights itself again,
And taste tries to return to the tongue,
Your body has slammed shut. Forever.
No keys exist.

Then the window draws full upon
Your mind. There, just beyond
The sway of curtains, men walk.
Knowing something.
Going someplace.
But this time, I will simply
Stand and watch.

Maybe.
Maya Angelou

పురుషుల గురించి మాయా రాసిన ఈ కవిత  సూటిగా స్పష్టం గా ఉంటుంది. అప్పుడే యవ్వనం లోకి అడుగిడుతున్న  బాలిక తన శారీరక అనుభవం గురించి మాట్లాడుతోంది.  మొదటి స్టాంజా లో యవ్వనంలోకి అడుగిడిన బాలికలు పరదాల చాటు  నుంచి రోడ్డు మీద వెళ్ళే మగవాళ్ళను రహస్యం గా , కుతూహలం తో గమనించటం అనే చర్య ను కవిత్వీకరించింది.అలాగే వివిధరకాల మగవాళ్ళను గురించి చెప్తూ వాళ్ళు ఎప్పుడూ ఎక్కడికో వెళ్తూ ఉండటాన్ని గమనించి చెప్పింది. మగవాళ్ళు ఆడిపిల్లలను గమనించటం అనేది అందరికీ తెలిసినదే. కానీ కవయిత్రి ఈ కవిత ద్వారా ఆడపిల్లలు కూడా మగవాళ్ళను గమనిస్తూ ఉంటారని చెప్పటమే కాకుండా ఓ పదిహేనేళ్ళ అమ్మాయి వారి కోసం ఆకలితో ( ప్రతీకాత్మకం గా) ఉన్నట్లు కూడా ఒప్పుకుంది. 
రెండో స్టాంజా లో ఆమె శారీరక అనుభవం లోకి పాఠకులు వెళ్లగలుగుతారు.  పదిహేనేళ్ళ బాలిక ఆ రకంగా ఆ అనుభవం కోసం ఎదురుచూడటం గురించి ఊహాత్మకం గా తెలియటం వేరు, నిజంగా ఆ అనుభవం లోకి రీడర్ వెళ్ళగలగటం వేరు . చదివేవారిని ఆ అనుభవం లోకి కవిత తీసుకెళ్తుంది. ఆ స్టాంజా చదివాక రీడర్ ఒక్క క్షణం ఆగిపోయి తన మొదటి శారీరక అనుభవం ఎలాంటిదో గుర్తుకు తెచ్చుకుంటారు.  శారీరక అనుభవం మొదట్లో ఎలా ఉంటుందో, ఆ చర్య జరుగుతున్న కొద్దీ ఎలా ఉంటుందో రెండింటిని కవయిత్రి సున్నితం గా చెప్పింది ( raw egg, first sqeeze is nice)అందంగా మొదలయిన అనుభవం లో ఆ తర్వాత ఒక బాధ, ఒక భయం చోటు చేసుకోవటాన్ని కవయిత్రి వ్యకీకరించింది. ( head of the kitchen match shattered) ఆ తర్వాత ఆమె కు వాస్తవం అర్థమయింది. ఒక శారీరక అనుభవం కోసం ఆమె కన్న కలలు, ఆమె ఊహాలు చెదిరిపోయి వాస్తవికత లో నిలబడింది. అప్పుడు ఏం జరిగిందో  ఇలా చెప్తుంది. " Your body has slammed shut. Forever. No keys exist. "
ఇక చివరి స్టాంజా చూడండి. ఇప్పుడు కవయిత్రి కి తానేం కోరుకుందో, ఏం దక్కిందో తెలుసు.ఆ తెలుసుకున్నదాంట్లోంచి ఏం చెప్తోందో చూడండి. తన హృదయం మీద పరదాలు కప్పెసుకొంది. రోడ్డు మీద నుంచి మామూలుగానే మగవాళ్ళు నడిచి వెళ్తూ ఉంటారు, ఏదో ఒక తెలుసుకున్నతనంతో. కానీ ఈ సారి తానేం చేస్తుందో చెప్తుంది. "  I will simply Stand and watch. Maybe "అంటూ కవిత ను ముగిస్తుంది. ఆ చివరి పదం Maybe చదవగానే రీడర్ కి ఓ నిట్టూర్పు కలుగుతుంది. మొత్తం కవిత లో ఏం చెప్పిందో కన్నా ఆ Maybe అన్న పదం తో బోలెడంతా చెప్పకుండా వదిలేసింది కవయిత్రి. ఆమె చెప్పకుండా వదిలేసినంత మాత్రణా రీడర్ కి అర్థం కాదా అంటే చెప్పినదానికన్నా బాగా అర్థమవుతుంది.
నిజానికి కవిత్వాన్ని ఇలా ఖండఖండాలుగా విభజించి అంతరార్థాన్ని చెప్పుకోవటం అసలు బాగుండదు. కానీ  స్త్రీల కవిత్వం ఎలా ఉంటుందో, ఎవరి అనుభవాలు ఎలా కవిత్వమవుతాయో విశ్లేషించుకోవటం కోసం కాబట్టి ఈ ప్రక్రియ తప్పటం లేదు.

కల్పనారెంటాల

9 వ్యాఖ్యలు:

teresa said...

Good attempt kalpana!

వనజవనమాలి said...

బాగుంది.. కల్పన గారు ,

కవిత్వంలో స్త్రీల మనోభాలు ..సిరీస్ గా వ్రాయడం మొదలెట్టారా ? కొనసాగించండి మేడం.

ఆసక్తిగా ఉంది 21 శతాబ్దంలో స్త్రీల కవిత్వం గురించి విపులంగా తెలుసుకోవాలని ఉంది.

రవి said...

వీలయితే పుట్టపర్తి కనకమ్మ (నారాయణాచార్యుల వారి అర్ధాంగి) గారి యశోధర, సీత ల గురించిన పద్యాలు చదవండి. అగ్నివీణ - కవితాసంకలనం పేరు.

Kalpana Rentala said...

థెరేశ, ఇదొక ప్రయత్నమే.

వనజవనమాలి, ఎలా వున్నారు? సిరీస్ గా రాయాలని ఒక ప్రయత్నం. ఎప్పటికప్పుడు చదివి మీ అభిప్రాయాలూ, ఆలోచనలు పంచుకోండి.
రవి, తప్పకుండా. అయితే నా ఇబ్బంది మీకు తెలుసనుకుంటాను. ఆన్ లైన్ లో ఉంటే తప్ప చదవలేము కదా ఇక్కడ నుంచి. కాబట్టి ఆన్ లైన్ లింక్ ఇవ్వండి. ఆమె రాసేవారని తెలుసు కానీ మొత్తం పద్యాలు ఎప్పుడూ చదవలేదు. ఒకటో, రెండో ఎవరో ప్రస్తావించినప్పుడు విన్నాను. మీరిచ్చే లింక్ కోసం ఎదురు చూస్తాను.

kapilaram said...

నిజానికి కవిత్వాన్ని ఇలా ఖండఖండాలుగా విభజించి అంతరార్థాన్ని చెప్పుకోవటం అసలు బాగుండదు. కానీ స్త్రీల కవిత్వం ఎలా ఉంటుందో, ఎవరి అనుభవాలు ఎలా కవిత్వమవుతాయో విశ్లేషించుకోవటం కోసం కాబట్టి ఈ ప్రక్రియ తప్పటం లేదు. > రెంటాల కల్పన, మీ అభిప్రాయంతో ఏకీభవిస్తాను. తప్పకుండా సఫలీకృతులు కావాలని కోరుకుంటాను.

Krishna Prasad said...

చాలా బాగుంది కల్పనా రెంటాల గారూ మీ వ్యాసం, విశ్లేషన.కృతజ్ఞతలు.

BUCHI REDDY said...

baagundhi kalpana garu---buchi reddy

BUCHI REDDY said...

baagundhi kalpana garu---buchi reddy

Anonymous said...

laudable effort.

 
Real Time Web Analytics