నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Sunday, October 31, 2021

స్నేహ శీలి సుజాత కి ప్రేమతో..

 

జీవితం నాకిచ్చిన కొందరు మంచి స్నేహితుల్లో సి.సుజాత ఒకరు. 

ఎప్పటి స్నేహం మా ఇద్దరిదీ
? విజయవాడ లో 90 ల నాటి మాట. ఆంధ్రభూమి లో ఉద్యోగం, రేడియో లో కాజువల్ న్యూస్ రీడర్, స్వాతి లో వ్యాసాలు, అనువాదాలు, అప్పటికే ఆంధ్రజ్యోతి వార పత్రిక లో కాలమిస్ట్ గా పేరు. నీలి మేఘాలు వచ్చిన కొత్తల్లో దూసుకొచ్చిన ఉత్సాహం. సుజాత అప్పుడు ఉదయం పత్రిక లో  పని చేసేది. అప్పట్లో ఈ సెల్ ఫోన్లు ఇంకా రాలేదు. ఆటో నగర్ లో ఆంధ్రభూమి ఆఫీసు నుంచి బయటకు రాగానే అక్కడున్న టెలిఫోన్ ఆఫీసు ముందున్న బూత్ లో నిలబడి సుజాత ఆఫీసు కో, ఇంటికో ఫోన్ చేస్తే గంటల తరబడి మాట్లాడుకునే వాళ్ళం. కథా చర్చల నుంచి సాహిత్య లోకం లో అప్పుడు నడుస్తున్న గాసిప్స్ దాకా. సుజాత జోకులకు ఇటు పక్క నా నవ్వులు చూసి ఆ వైపు నడిచి వెళ్ళే వాళ్ళు నేను ఎవరితో ఫోన్ లో ఉన్నానో అన్నట్లు చూసే అనుమానపు చూపుల్ని మరింత బాగా ఎంజాయ్ చేసిన సందర్భం అది అప్పట్లో. 

ఉదయం ఆదివారం సండే లో వచ్చే కథల గురించి బోలెడు చర్చలు. సుజాత రాసిన నీడ , రెప్ప చాటు ఉప్పెన, సుప్తభుజంగాలు నవల, మహీధర రామ్మోహన్ గారి రథచక్రాల గురించి సీరియస్ గానే సాహిత్య చర్చలు నడిచేవి ఆ ఫోన్ కాల్స్ లో. అందులోనే కన్నీళ్ళు, నవ్వులు, బాధలు అన్నీ. రెప్ప చాటు ఉప్పెన చదివాక బద్దలు కానీ స్త్రీ హృదయం ఉంటుందా అనేదాన్ని సుజాత తో. ఎంతో నవ్వించే సుజాత, అలా ఏడిపించే కథలు రాయగలదు అని, అలాంటి కథకురాలు నా బెస్ట్ ఫ్రెండ్ అని ఎవరికి వారు అనుకునేంత స్నేహశీలి. గబగబా, లొడలొడ  మాట్లాడుతుందని కొందరు తిట్టుకుంటారు మనసులో సుజాత ని. ఆ విషయం కూడా మా ఇద్దరికీ తెలుసు. వాళ్ళకు స్నేహం విలువ తెలియదని కూడా మా ఇద్దరికీ తెలుసు.

కాలం లో సంవత్సరాలు దొర్లాయి. బాధలు తగ్గి సంతోషం ముందుకొచ్చింది. లేదా రివర్స్. సంతోషం తగ్గి బాధలు ఎక్కువయ్యాయి. ఫోన్ కాల్స్ ఈమైల్స్ అయ్యాయి. లేదా వాట్స్ఆప్ మెసేజ్ లు  గానో, ఫేస్ బుక్ పోస్ట్ లు గానో మారిపోయాయి. 


సోషల్ మీడియా  విస్తృతమయ్యాక స్నేహాలు లైక్ లు గాను, ఫ్రెండ్స్ అన్ ఫ్రెండ్స్ అవటం లేదా బ్లాకు చేయబడటం  చాలా మామూలు అయిపోయింది. నేను బ్లాగు లోకం లోకి వచ్చాను. సుజాత కూడా బ్లాగు తెరిచింది. తన్హాయి తర్వాత నేను మళ్ళీ వేరే పనులతో బిజీ అయిపోయాను. మా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ కూడా తగ్గిపోయింది. కానీ తన విషయాలు నాకు, నా విషయాలు తనకూ తెలుస్తూనే ఉండేవి. ఎంత దూరం లో ఉన్నా, మాట్లాడుకోకపోయినా, మా స్నేహం అలాగే నిలిచి ఉంది. 

మేము సారంగ వెబ్ మాగజైన్ మొదట ప్రారంభించినప్పుడు మళ్ళీ సుజాత నా స్మృతి పథం లో మెదిలింది. సుజాత రాసిన 24/7 నవల ను సీరియలైజ్ చేశాము. అదో గొప్ప వేడుక మళ్ళీ మా ఇద్దరి స్నేహానికి. 

ఇన్నింటి మధ్యా నా అయిదో గోడ వచ్చింది. ముందు మాట నో , వెనుక మాట నో రాయరాదా అని పుస్తకం వేసేటప్పుడు సుజాత ని అడిగాను. నేను రాయకపోయినా నీ స్నేహితురాలినే అని చెప్పగలిగిన నిగర్వి. మంచి కథకురాలు. స్నేహితురాలు సుజాత.సుప్త భుజంగాలు తర్వాత మరో మంచి నవల రాసినా కూడా ఆ మొదటి నవల తోనే తెలుగు సాహిత్యం లో నిలిచి పోగలిగిన రచయిత్రి. తన చుట్టూరా ఉన్న స్నేహితులను, కోలీగ్స్ ని అందరినీ  ఎలా లిఫ్ట్ చేయాలో తెలిసి, తనను తాను లిఫ్ట్ చేసుకోలేకపోయిన ఒక మంచి రచయిత్రి, నా స్నేహితురాలు సుజాత కు ఏమివ్వగలను కాసింత ప్రేమ, స్నేహం పంచి ఇవ్వటం తప్ప.

స్నేహితురాలికి రాసుకున్న ఈ  ప్రేమలేఖలో ఎడిట్స్ రిగ్రెట్స్ లేవు.

ప్రౌడ్ ఆఫ్ యు సుజాత !

కల్పనారెంటాల 

అక్టోబర్ 30, 2021


Wednesday, October 27, 2021

అయిదో గోడ ఓ ఘనీభవ పర్వతం - కాత్యాయనీ విద్మహే

 


సాంస్కృతిక భావజాల సంబంధమైన అయిదో గోడను బద్దలు కొట్టటం కష్టం. ఎందుకంటే అది అనేక వేల సంవత్సరాల కాలం మీద నిర్మించబడుతూ , ప్రచారం చేయబడుతూ ఎప్పటికప్పుడు  రకరకాల పద్ధతులలో సామాజిక సమ్మతిని కూడగట్టుకొని ఘనీభవించిన పర్వతం. ఆ పర్వతాన్ని బద్దలుకొట్టే ప్రయత్నంలో భాగంగా వచ్చినవే కల్పన కథలు. వాటికి ప్రతినిధి కథ అయిదో గోడ. కల్పన కథల తలుపులు తెరిచే  తాళం చెవి ఈ కథ.  

పుట్టుకతో వచ్చే లింగభేదం వల్ల శరీరం ఆడదీ కావచ్చు మగదీ కావచ్చు. కానీ ఆ శరీరాన్ని నిర్వచించి , నియంత్రించే భావజాలం మాత్రం సామాజిక నిర్మితం. లింగ వివక్ష ఉన్న సమాజాలలో  అది సహజంగా పురుష సాపేక్షతలో రూపం తీసుకొంటూ ఉంటుంది. ఫలితం  శరీరం ఒక వాస్తవం కాగా దాని చుట్టూ అల్లబడిన మాయావరణం లో బందీలుగా స్త్రీలు హింసకు గురి అవుతుంటారు. దాని  గురించిన ఎరుకగా,  అభివ్యక్తీ కరణగా స్త్రీవాద సాహిత్యం కొత్త వస్తువుతో మొదలైంది. శరీరం , బహిష్టు రక్తస్రావంసంభోగ సంతోష విషాదాలుగర్భంఅబార్షన్   అన్నీ కవితా వస్తువులయ్యాయి.  అవే కల్పనకు  కథా వస్తువులైనా వాటిని ఆమె నిర్వహించిన తీరు విలక్షణం.

 

కాత్యాయనీ విద్మహే 

ప్రముఖ స్త్రీవాద సాహిత్య విమర్శకురాలు


 

 

 

 

 

 

 






Friday, October 22, 2021

నీలాంబరి- చల్లని రాగం- చక్కని కథలు



Tuesday, October 19, 2021

వైవిధ్యమైన కల్పన కథలు - నిడదవోలు మాలతి

 



    కల్పనా రెంటాలకి నాపరిచయం అఖ్ఱర్లేదు. నాలుగు దశాబ్దాలుగా కవితలు, కథలు, నవల, విశ్లేషణాత్మక వ్యాసాలు రాస్తున్న రచయిత్రి. పాత్రికేయురాలు. ఈకథలన్నీ విశేషాదరణ పొందినకథలు. ఇతివృత్తాలలో వైవిధ్యం ఉంది. సంఘర్షణ ఉంది. వివాదాస్పదమైన అంశాలు, స్త్రీలసమస్యలు, అమెరికా జీవనసరళి  - ఏ అంశం తీసుకున్నా అనేకకోణాలు పరిశీలించి అవిష్కరించినట్టు కనిపిస్తుంది.

    అసలు అపరక్రియలే తగ్గిపోతున్న ఈరోజులలో అందులో ఒకభాగమైన సంచయనంగురించి ఇంత వివరంగా ఆవిష్కరించినకథ ఇదొక్కటేనేమో. అమ్మకో ఉత్తరం. తల్లి అమెరికా రావడానికి ఏర్పాట్లు చేస్తానంటూనే అమెరికాసౌకర్యాలు వర్ణించడంలో రచయిత్రి ప్రతిభ కనిపిస్తుంది. ఇందులో చక్కని వ్యంగ్యం ఉంది. ఏకథ తీసుకున్నా కథాంశాలలో ఆమె తీసుకున్న శ్రద్ధ కనిపిస్తుంది.


     
తెలుగుభాషమీద మంచిపట్టు గల కల్పన తెలుగుసంస్కృతికి సంబంధించిన ఇతివృత్తాలతో జానుతెలుగులో ఇంకా ఇంకా మంచికథలు రాయగలరనీ ఆశిస్తూ, శుభాకాంక్షలతో

                                                                                    - నిడదవోలు మాలతి

ప్రముఖ రచయిత్రి, అనువాదకురాలు 


కల్పనారెంటాల కథల సంపుటి "అయిదో గోడ" ప్రీ సేల్

 






 " అయిదో గోడ " కథల సంపుటి అమెజాన్ ఇండియా లోను, ఇతర పుస్తకాల షాపుల్లోనూ ఈ వారం లభ్యం. ప్రీ సేల్ మొదలైంది.  వివరాలు ఈ దిగువన చూడవచ్చు. అమెరికా లో ప్రతులు కావాల్సిన వారు kalpana.rentala@gmail.com కు మెయిల్ చేసి పొందవచ్చు. 

 bit.ly/chaayabooks ద్వారా ఛాయా స్టోర్ కి వెళ్ళవచ్చు. ప్రీ సేల్ లో అమెజాన్ లో  ₹130 , యూఎస్ లో $8.పోస్టల్ చార్జెస్ లేవు.

డైరెక్ట్ గా కావలసిన వాళ్ళు ₹120 Gpay ద్వారా 9848023384 కి పంపి ' బుక్ ' చేసు కోవచ్చు.

Monday, October 18, 2021

చదివించే గుణమున్న కథలు

 


Sunday, October 17, 2021

అయిదో గోడ కథల సంపుటి త్వరలో విడుదల

నా కథల సంపుటి అయిదో గోడ ఛాయా పబ్లికేషన్స్ నుంచి అతి త్వరలో మార్కెట్ లోకి విడుదల కానుంది. పుస్తకం అమెజాన్ లోను, అన్నీ పుస్తకాల షాపుల్లోనూ దొరుకుతుంది. 

 

Saturday, October 16, 2021

మళ్ళీ బ్లాగు లోకం లోకి ..!

 దాదాపు పదేళ్ళు దాటిపోయింది. బ్లాగుల్లో యాక్టివ్ గా పాల్గొని. అప్పుడప్పుడు నా రచనలు ఇక్కడ పోస్ట్ చేసినప్పటికీ , ప్రత్యేకంగా బ్లాగు కోసం ఏమీ రాయలేదు. 

ఇప్పుడు మళ్ళీ బ్లాగులో రాయలనిపిస్తోంది. ఇదివరకటి లాగా బ్లాగు లు ఇప్పుడు యాక్టివ్ గా ఉన్నాయో, లేదో తెలియదు. బ్లాగర్లు, రీడర్స్ లో కూడా ఎక్కువ మంది ఫేస్ బుక్ లోకి వెళ్లిపోయారనుకుంటాను. 

నేను ఫేస్బుక్ లోకి వెళ్లలేదు. కానీ సమయాభావం వల్ల బ్లాగులు మాత్రం అడపాదడపా చూడటం తప్ప ఎక్కువ చదవలేదు.  

మళ్ళీ బ్లాగులోకం లోకి రావటం ఒక రకంగా సొంత ఇంటికి రావటం లాగా ఉంది. అది కూడా ఒక మంచి వార్త తో.. 

నా కథల పుస్తకం " అయిదో గోడ " ప్రకటన తో.. 



 
Real Time Web Analytics