ప్రముఖ కథా రచయిత్రి, అనువాదకురాలు శారద కథల పుస్తకం “ నీలాంబరి” గురించి 2013 లో నేను రాసిన చిన్న పరిచయం, వీడియో మెసేజ్ అనుకోకుండా కంటికి కనిపిస్తే బ్లాగు పాఠకులతో పంచుకుంటున్నాను. శారద ఇప్పటివరకు దాదాపు 50 కథలు రాసారు. అనేక అనువాద రచనలు చేసారు. ప్రతి కథ లోనూ తనదైన ఒక ప్రత్యేక కోణాన్ని ఆవిష్కరించగలిగిన మంచి రచయిత్రి శారద. ఆమె కథల పుస్తకం “ నీలాంబరి” కినిగె లో ebook గా కూడా లభ్యమవుతుంది. ఈ పుస్తకం లో ఆమె రాసిన 18 కథలున్నాయి.
” ఒకే రచయిత రాసిన కథల్లో వైవిద్యం వస్తువు లో, శైలి లో, శిల్పం లో , పాత్ర చిత్రణ లో, భాష లో, సందర్భాలలో , సంఘర్షణలలో, మనస్తత్వ చిత్రణ లో కనిపిస్తాయి. ఆ ఒక్క రచయిత యొక్క అనుభవాలు గానీ, తన చుట్టూ ఉన్న సమాజం లో గమనించిన విశేషాలూ , సంఘర్షణలూ ఉంటాయి. శారద కథల్లో ఈ వైవిధ్యం చూస్తాము. ఈ కథల్లో హాస్యం ఉంది. వ్యంగం ఉంది. సమాజం లో జరిగే ఆకృత్యాల మీద వ్యాఖ్యానం ఉంది. మనస్తత్వ చిత్రణ ఉంది. ” అంటారు నిడదవోలు మాలతి శారద కథల పుస్తకం “నీలాంబరి” కి రాసిన ముందు మాట లో.
నీలాంబరి ! ఎంత చల్లని రాగమో, ఆ పేరుతొ వచ్చిన శారద కథల పుస్తకం లో కథలు కూడా ఆ పేరు లాగానే అంత బావున్నాయి. నీలాంబరి చక్కటి జోల పాటలకు వాడే రాగమైనా, ఈ పుస్తకం లోని కథలు మనల్ని నిద్రపుచ్చని కథలు. సమాజం లో అనేక విషయాల్లో పేరుకుపోయిన అసమానత, వివక్ష, అరాచకాలు, అన్యాయాల గురించి మనల్ని ఆలోచింప చేసి మనల్ని మేల్కొలిపే కథలు. అనుబంధాలు, ప్రేమ, ఆప్యాయతల వైపు మనసుల్ని మరల్చే కథలు ఇవి.
శారద కథల్లోని స్త్రీ పాత్రలు ముగ్ధలు కారు. ఆత్మవిశ్వాసం తో తల ఎత్తుకొని నడిచే అతివలు. మతం కంటే , దేశం కంటే స్నేహం గొప్పదని నమ్మే సరళ, ఒంటరి స్త్రీ గా ఇద్దరి పిల్లలను పెంచటమే భారంగా ఉన్నప్పటికీ అనాథ గా మారిన మరో ఆడపిల్లను అక్కున చేర్చుకున్న విమల, ఒక మహిళా దినోత్సవం రోజు తానెవరో తెలుసుకోగలిగిన సైంటిస్టు స్వర్ణ, అతిథి లా వచ్చిన చిలుక తో నేస్తం కట్టిన ఓ అమ్మాయి, భర్త కిడ్నాప్ కు గురైన క్లిష్ట పరిస్థితుల్లో కూడా కేవలం మన కుటుంబ సభ్యల శ్రేయస్సు కోసం తీవ్రవాదుల్ని విడిచిపెట్టడం ప్రజా సంక్షేమం కాదని నిక్కచ్చిగా చెప్పగలిగిన స్వాతి, మతం, దేశం ఇవేమీ ఇద్దరి మధ్య స్నేహానికి సరిహద్దులుగా నిలబడకూడదని విశ్వసించె సరళ,(ఎల్లలు) అమ్మ ని ఏ అమ్మాయి మరచిపోదు. ఆకాశాన్ని చూసినా, విరబూసే పువ్వుల్ని, నిష్కల్మషంగా నవ్వే పసిపిల్లలని చూసినా సంపూర్ణ అమ్మ తనంతో నీలంబరమై...నీలాకాసమై పోతుంది. కొండంత వెలుగైన అమ్మ లు ప్రతి అమ్మాయి జీవితం లో ఉంటారు. తల్లి,కూతురు, మనవరాలు, మునిమనవరాలు...ఇలా ఒక స్త్రీ నుంచి మరో స్త్రీ ఒక్కో అమ్మగా పుట్టుకొస్తూనే ఉంటారని మనసు కు ఆర్ద్రం గా తట్టి చెప్పే కథ “ నీలాంబరి” . శారద కథల అంతః సారాన్ని సూచిచే విధంగా ఉంది పుస్తకానికి ఈ కథ పేరు పెట్టడం.
ఇవి కేవలం స్త్రీల ప్రధానమైన కథలు మాత్రమె కావు. కొన్ని కథలలో పురుషులు ప్రధానమైన పాత్రలు. కథల్లో ఈ సమతౌల్యం పాటించటం వాళ్ళ శారద కథలకు ఒక సంపూర్ణత్వం వచ్చింది. జీవితమనే బండి చక్రానికి స్త్రీపురుషులిద్దరూ అవసరం, ఒకరికొకరు అంతే సమానం అన్న మౌలికమైన సత్యాన్ని తన కథల్లో శారద సమర్థవంతం గా చిత్రించింది. ఆవృతం కథ అందుకు ఒక ఉదాహరణ గా చెప్పవచ్చు. ఆడవాళ్ళ జీవితం లో మార్పు వచ్చిందా? రాలేదా? అన్న విషయాన్ని స్త్రీల వైపు నుంచి కాకుండా ప్రధాన పాత్ర వినయ్ దృష్టి కోణం ద్వారా చూపించింది రచయిత్రి. అంతేకాకుండా స్త్రీల జీవితాల్లో మార్పు కేవలం పురుషుల ఆలోచనల్లో మార్పు వస్తే సరిపోదు. కానీ స్త్రీల ఆలోచనల్లో మార్పు రాకపోతే మళ్ళీ అదొక లోపంగానే మిగిలిపోతుంది. అది చాల సటిల్ గా సున్నితంగా ఎత్తి చూపింది శారద తన ఆవృతం కథలో. కథలోని వినయ్ తరతరాలుగా నానమ్మ,అమ్మ ల జీవితాలు ఎలా గడుస్తున్నాయో చూస్తూ వచ్చాడు. ఒక మంచి మగవాడిగా నిలబడ్డాడు. అయితే అలాంటి మార్పు కవిత లాంటి స్త్రీల లో రాకపోవటం వాళ్ళ సమాజం లో రావాల్సిన మార్పు రాకపోవటం విషాదకరం. కవిత లాంటి కొందరు నవతరం అమ్మాయిలకు కట్నం ఇవ్వడం ఆత్మాభిమానానికి సంబందిమ్చిమ అంశం కాదు కేవలం ఆర్థికపరమైన అంశం, ఆడపిల్ల అయితే తల్లే అబార్షన్ చేయించు కుంటాననటం కేవలం స్వేచ్ఛ, నిర్ణయాధికారం కు సంబంధించిన అంశం మాత్రమె కావటం ఇవాల్టి కొందరు అమ్మాయిల ఆలోచనాధోరణి కి ఉదాహరణ.
అలాగే డబ్బులుకోసం ఒంటి మీద నూలుపోగులతో నర్తించే కాంతి లాంటి సెలబ్రిటీలను చూసి స్త్రీని గౌరవించే సంస్కారం ఉన్న ఆమె తండ్రి లాంటి వాళ్ళు సిగ్గు పడటం,,,ఇవన్నీ శారద కథల్లోని పురుష పాత్రల పాజిటివ్ అంశాలు. ఆడవాళ్ళను సమర్థించటం, మగవాళ్లను విమర్శించటం కాదు స్త్రీవాదం చేయాల్సిన పని. తప్పు ఎవరిదిడైతే వారిని విమర్సిమ్చాతమే అసలు స్త్రీ వాదం. మంచి ఆలోచన, జీవితావగాహన, రాసే కథల పట్ల నిబద్ధత, శైలి,శిల్పం, భాష పట్ల పట్టు ఉన్న మంచి రచయిత్రి శారద. రాసిన అన్నీ కథలు కాకుండా కొన్ని కథలతో మాత్రమె ఈ పుస్తకం తీసుకురావటం కథాభిమానులకు ఒక చిన్న లోటే.
0 వ్యాఖ్యలు:
Post a Comment