అయిదో గోడ పుస్తకం మీద సోషల్ మీడియా లో సమీక్షలు, చర్చా కార్యక్రమాలు నెమ్మదిగా వస్తున్నాయి. ఈ రోజు ఫేస్బుక్ లో ఆర్. ఎస్. వేఙ్కటేశ్వరన్ గారు రాసిన ఈ రివ్యూ ఉదయమే ఒక మంచి సంతోషపు తెమ్మెర ను మోసుకొచ్చింది. థాంక్ యు వేఙ్కటేశ్వరన్ గారు. మా ఇద్దరికీ పరిచయమే లేదు. ఈ పుస్తకం ఒక రచయితకు, ఒక రీడర్ కు మధ్య బంధాన్ని ఇలాగే అక్షరాలతో పెనవేస్తుంది. క్షరం లేనిది అక్షరం.
అయిదో గోడ: కల్పనా రెంటాల కథలు
(ఛాయ ప్రచురణలు: అక్టోబర్ 2021:వెల:130/-)
-----------------------------------------------------------------
"కథల పుస్తకం వేయటం ఒక సంతోషం. ఒక దుఃఖం కూడా. మన కథలు మనం మళ్ళీ చదువుకున్నప్పుడు కొన్ని పాత గాయాలు మళ్ళీ సలుపుతాయి. వద్దన్నా చరిత్ర గుర్తుకొస్తుంది. ఏ సందర్భంలో ఏ కథ పుట్టింది? ఏ కథ మీద ఏం మాట్లాడారు? ఏ కథ రాయటానికి ఎన్ని సంకోచాలు? జీవితపు రాజీ లెక్కల్లో ప్రతి అడ్జస్ట్ మెంట్ ఒక ఘర్షణే" అంటారు ఈ పుస్తకం ఆఖరున రచయిత్రి కల్పన గారు "ఒక సంతోషం - ఒక దుఃఖం" అన్న శీర్షికలో ఈ పుస్తకంలో కథలు ఎందుకు పుట్టాయో? వివరిస్తూ. ఈ మాటలు చదివితే కల్పన గారు కథలు రాయటం అనే విషయాన్ని గురించి ఎంత గంభీరంగా ఆలోచిస్తారో అర్ధం అవుతుంది. ఏ రచయితకైనా తను రాసిన రచనల పట్ల అంత తీక్షణమైన ఆత్మావలోకనా స్పృహ వుంటే ఆ రచనలు ఎలా వుంటాయో వేరే చెప్పనక్కర్లేదు.
మొదటి కథ "అయిదు శాజరాక్ ల తర్వాత" విఫలమైన సృష్టి అనే అమ్మాయి ప్రేమ కథ. ప్రేమ విఫలమవ్వడానికి గల కారణాలు గానీ, విఫలమైన తీరు కథలో ప్రత్యేకంగా చిత్రణ కనిపించదు కానీ కథ పూర్తి అయ్యేసరికి పాఠకుడికి ఓ అవగాహన కలుగుతుంది. కథా స్థలం కూడా కథకు లోతు, అందం తీసుకొచ్చింది. అమెరికాలో కత్రీనా తుఫాన్కి గురైంది న్యూ ఆర్లియన్స్ నగరం. భౌతికంగా ఆ తుఫాన్కు గురైన లోగన్ అక్కడే నివసిస్తున్న వ్యక్తి. విఫలమైన ప్రేమ తుఫానులో చిక్కుకొన్న సృష్టి ఆ నగరానికి వస్తే అంతరంగ తుఫానులో చిక్కుకొన్న సృష్టికి తీరం దాటేందుకు సహాయపడతాడు లోగన్. ప్రేమ జీవితంలో ముఖ్యమైనదే కానీ మనుగడే ముఖ్యమైనప్పుడు ప్రేమ కూడా చిన్న అంశమే అని తెలియజెప్పే కథ. విఫలమైన ప్రేమ వలన ఏర్పడిన దుఃఖం గోడను కూలగొట్టి ముందుకు సాగాలని చెప్పిన కథ.
రెండవ కథ క్రైమ్ సీన్. స్నేహితురాలి ప్రోద్బలంతో కాలేజీ కుర్రాళ్ళ రాత్రి పార్టీకి వెళ్ళిన శ్రియ ఆ కాలేజీలోనే ఫుట్బాల్ ఆటలో మంచిపేరొందిన బెన్ తో కాస్త చనువుగా మెసిలేసరికి, బెన్ తనపై చేసిన అత్యాచారాన్ని ప్రతిఘటించలేకపోతుంది. ఆ కాలేజీ పేరొందిన ఐవీ కాలేజీల్లో ఒకటి కావడం వలన శ్రియ కంప్లైంట్ చేసినా కొన్ని శక్తులు అడ్డంపడతాయి. వాటినీ, కంప్లైంట్ చేయడం వలన శ్రియ శరీరంలో ప్రతీ భాగాన్ని పరీక్షించే కఠినమైన ప్రక్రియనీ అతి కష్టమ్మీద తట్టుకొని పోరాడాలనుకున్నా సొంత తండ్రి పరువు కోసం కంప్లైంట్ ముందుకు తీసుకుపోవద్దని, సెటిల్మెంట్ చేసుకోమని హితబోధ చేయడం కథలో నాకు అసలు సిసలైన క్రైమ్ సీన్ అనిపించింది. శ్రియ బెన్ ద్వారా చెరచబడ్డదానికన్నా తండ్రి ప్రవర్తన వల్లే ఎక్కువగా బాధపడుతుంది. శ్రియ తండ్రికి వేసిన ఎదురు ప్రశ్నలకు తండ్రి దగ్గర జవాబు వుండదు. తల్లి, అన్నయ్య మాత్రమే శ్రియను సమర్ధిస్తారు. కనిపించని ఐదో గోడ బద్దలు కొట్టడం ఎంత కష్టమో తెలియజేసే కథ. ఎన్నో ఏళ్ళ క్రితం ప్రఖ్యాత తమిళ రచయిత జయకాంతన్ రాసిన "అగ్ని స్నానం" కథ గుర్తొచ్చింది. అయితే ఆ కథలో వర్షం పడే రోజున లిఫ్ట్ కోసం కారెక్కితే మానభంగానికై గురైన కూతురు ఇంటికి వస్తే విషయం తెలుసుకున్న తండ్రి "నీ తప్పేం లేదు. నేను మంత్రాలు చదువుతూ అగ్ని స్నానం చేయిస్తాను. నువ్వు పరిశుద్దవవుతావు. జరిగినది మనిద్దరి మధ్య సమాధి కావాలి" అని స్నానం చేయిస్తాడు. తమిళ సాహిత్యంలో ఈ కథ గొప్ప కలకలం రేపింది. న్యాయపోరాటం చేయమని తండ్రి ప్రోత్సాహించక పోయినా నైతికంగా కూతుర్ని సమర్ధిస్తాడు. అయితే అగ్ని స్నానం కథలో కుటుంబం ఒక బ్రాహ్మణ కుటుంబంగా చిత్రించడంతో కలకలం కాస్త ఎక్కువగానే చెలరేగింది.
మూడవ కథ "అయిదో గోడ" నాకు చాలా నచ్చిన కథ. భర్త చనిపోయిన ఒక నెల తరువాత శారద తనకు ఒక తోడు కావాలని పేపర్లో ప్రకటన ఇవ్వడం కూతురు ఆర్తికి జీర్ణమవ్వదు. నెల తిరక్కుండానే పేపర్లో అలాంటి ప్రకటన ఇవ్వడం చాలా తప్పని తల్లితో ఆర్తి వాదిస్తుంది. ఈ వాదులాటలో తల్లి జీవితం సంసారం జీవితం గురించి తెలుసుకున్నాక సానుభూతితో పేపర్లో ప్రకటన ఇవ్వడం సరేనని సమర్ధిస్తుంది. కథ అలా ముగించిన రచయిత్రి శ్రీవిద్యకు మాత్రం సంతృప్తిగా అనిపించదు. "ఏమిటీ! నీ కథ ఇంకా పూర్తి కాలేదా?" అని అడుగుతూ అక్కడికి వచ్చిన భర్త శశికి చదవమని ఇస్తుంది. అతడు కూడా కథ చదివి ఏ అమెరికాలో అయితే ఫర్వాలేదు కానీ ఇండియాలో నువ్వు రాసినది సరికాదు. కావాలంటే నీ ఫ్రెండ్స్ కి కూడా చూపించి అభిప్రాయం తెలుసుకో" అంటాడు. ఈలోగా కథలో పాత్ర శారద శ్రీవిద్యతో "నేను చేసిన పనికి సామాజిక ఆమోదం లభించాలని ప్రయత్నం చేయలేదూ?" అని నిలదీస్తుంది. శ్రీవిద్య కూడా కథలో పాత్ర శారదతో "నీ పాత్ర ఉన్నతంగా కనిపించాలని ఆరాటపడ్డాను………నీ కూతురు అడిగినట్లు కోర్కెలతో కాలిపోతూండటం వల్లే పెళ్ళి చేసుకుంటున్నట్లు రాస్తే ఏమవుతుందో తెలుసా?" అంటుంది. శారద ఫక్కున నవ్వుతూ " చూశావా? నీకు ఉన్న విషయం రాసే ధైర్యం లేకపోయింది. ఒక స్త్రీ ఎందుకు పెళ్ళి చేసుకోవాలో? ఎలా చేసుకోవాలో ఈ సమాజం ముందే నిర్ణయించేసింది. నీకు ఆ చెలియలికట్ట దాటాలని వుంది. కానీ నీకు తెలియకుండానే మళ్ళీ ఓ సరిహద్దుని గీస్తున్నావు. నన్ను ఓ సరిహద్దు నుండి మరో సరిహద్దుకు పంపుతున్నావు. నీ లోపల గోడను చూసుకో" అని వెళ్ళిపోతుంది. ఈ గోడ మనందరిలో వున్నదే. ఆ గోడను ఈ కథ పూర్తిగా పగలగొట్టకపోయినా కొన్ని ఇటుకల్ని కదిలించింది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు.
(ఈ పుస్తకంలో నాకు నచ్చిన మిగిలిన కథల గురించి మరోసారి రాస్తాను.)
ఆర్.ఎస్. వెంకటేశ్వరన్.
0 వ్యాఖ్యలు:
Post a Comment