నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Monday, July 18, 2011

ఓ నాన్న!...ఓ సాహితీ తపస్వీ!




( మా నాన్నగారు రెంటాల గోపాల కృష్ణ గారు కీర్తి శేషులై ఇవాళ్టికి పదాహారేళ్ళవుతోంది. ఆ సందర్భంగా సాక్షి దినపత్రిక సాహిత్య పేజీ వారు అడగగా మా తమ్ముడు జయదేవ రాసిన వ్యాసం ఇది. ఇందులో కొంత భాగాన్ని ఇవాళ సాక్షి పత్రిక ప్రచురించింది.దాన్ని ఇక్కడ చూడగలరు. నిజానికి ఈ వ్యాసం మా తమ్ముడి ఇష్టపది బ్లాగు లో రావాల్సింది. కానీ జయదేవ ప్రయాణం లో ఉండి నెట్ కి దూరం గా వుండటం తో నేను ఇక్కడ పంచుకుంటున్నాను)

నాకు ఊహ తెలిసే నాటికే నాన్న గారు రెంటాల గోపాల కృష్ణ పేరున్న రచయిత, జర్నలిస్ట్. విజయవాడ లోని సత్యనారాయణ పురం లో రైల్వే స్టేషన్ ( ఇటీవలే తీసేశారు) దగ్గర పురుషోత్తం వీధి లో రైలు కట్టాను ఆనుకొని మా ఇల్లు రైలు భోగీల్లాంటి మూడు గదులు. అరటి చెట్లు, మల్లె చెట్లు, తులసి కోట ఉన్న ఓ చిన్న పెరడు. ఓ చేద బావి. అగ్గి పెట్టె లాంటి ఆ అద్దె ఇల్లే మాకు అపర బృందావనం. తోబుట్టువులైన మా ఎనిమిది మంది తోబుట్టువుల్లో ఆరుగురం లోకం లీ కళ్ళు టేరించి ఆ ఇంటి ముందు గది లోనే! ఆఖరుకు నాన్న గారు కన్ను మూసింది ఆ గది లోనే! ఆ గది ఓ ఆయన ప్రత్యేకంగా ఇనుప ర్యాంకులతో చేయించుకున్న చెక్క బీరువా నిండా వందల కొద్దీ పుస్తకాలు. కాళిదాసు నుంచి కార్ల్ మార్క్స్ దాకా , ' బృహజ్జాతకం' నుంచి బృహత్ స్త్రోత రత్నాకరం దాకా, బెర్నార్డ్ షా నాటకాల నుంచి బాల్జాక్ కథల దాకా సంగీతం, సాహిత్యం, నృత్యం , నాటకం, జ్యోతిష్యం, పురాణేతిహాసాలు - ఇలా వైవిధ్యభరితమైన అంశాల్లో తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్ ల్లో అరుదైన గ్రంధాలు అక్కడ కొలువై ఉండేవి. ప్రపంచం లోకి నాన్న గారు మాకిచ్చిన కిటికీ అది.
ఈ విస్తారమైన అభిరుచి కి ఒక రకంగా కారణం - నాన్న గారు పుట్టిన పండిత కుటుంబం, పెరిగిన వాతావరణం, తిరిగిన ఊళ్ళు, మనుషులు. గుంటూరు జిల్లా పల్నాడు తాలూకా రెంటాల గ్రామం లో 1920 సెప్టెంబర్ 5 ఆయన జన్మదినం. వాళ్ళ అమ్మగారికి ఆయన అష్టమ సంతానం. పైగా పుట్టింది కృష్ణాష్టమి నాడు! ఆయన పేరు వెనుక కథ అది. గురజాల, మాచర్ల, మాచవరం, నరసారావుపేట ప్రాంతాల్లో బడి, గుంటూరు లో కాలేజీ చదువులు చదివిన ఆయన ఆ చిన్న వయస్సులోనే స్వశక్తి ని నమ్ముకొని విజయవాడ కు వచ్చేశారు. ' పార్వతీశ శతకం' , ఆ పైన పదహారో ఏట ' రాజ్యశ్రీ' అనే చారిత్రక నవల తో మొదలు పెట్టి 75 వ ఏట మరణించే దాకా 60 ఏళ్ల పాటు ఆయన అలుపెరగకుండా రచనా యాత్ర సాగించడం ఓ ఆశర్యకరమైన వాస్తవం. కవి , రచయిత, నాటక కర్త, అనువాదకుడు, జర్నలిస్ట్ , వక్త-- ఇన్ని కోణాలు ఒకే వ్యక్తి లో ఉండటం నాన్న గారి గొప్పదనం. ఒక రకంగా అరుదైన అదృష్టం. కానీ , వేదాలు,వాదాలు, అభ్యుదయ నాదాలు, అనువాద భేదాలు-- ఇలా ఎన్నో పాయలుగా చీలిన ప్రతిభ, పాండిత్యం కారణంగా నాన్న గారు ఏకాగ్ర దృష్టి తో ఏదో ఒక రంగానికే పరిమితం కాలేదు. ఫలితంగా, ఆయనకు రావలసినంత గుర్తింపు రాలేదేమోనని అనిపిస్తుంటుంది.
నాన్న గారికి ఆప్త మిత్రులనగానే -- అనిసెట్టి సుబ్బారావు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, బెల్లంకొండ రామదాసు, అవసరాల సూర్యారావు, కుందుర్తి ఆంజనేయులు, దాశరథి కృష్ణమాచార్య, గిడుతూరి సూర్యం, ఈ నెల మొదట్లో కన్నుమూసిన ' ఉదయిని'--' ఎర్ర జెండాల ' గంగినేని వెంకటేశ్వరరావు, చదలవాడ పిచ్చయ్య, ప్రచురణకర్తల్లో ' ఉమా పబ్లిషర్స్' కాండూరి సుబ్రహ్మణ్యం, ప్రస్తుత విశ్రాంత జీవితం గడుపుతున్న ' జయంతి పబ్లికేషన్స్ ' మువ్వల పెరుమాళ్ళు, సినీ జీవి ' నవయుగ' కాట్రగడ్డ నరసయ్య వగైరాల పేర్లు నాకు ఠక్కున గుర్తుకొస్తాయి. అనిసెట్టి, ఏల్చూరి, బెల్లంకొండ లు బడి చదువుల రోజుల నుంచి నాన్న గారికి మిత్రులైతే, మిగిలిన చాలా మంది అభ్యుదయ రచయితల సంఘం ( అరసం) తొలి రోజుల నుంచి ఆంధ్ర దేశం లో ప్రజా నాట్య మండలి ప్రభ వెలిగిపోతున్న కాలం మీదుగా, ప్రపంచ సాహిత్యానువాదాల ప్రచురణ పరిశ్రమ గా కొనసాగిన కాలం లో ఆయనకు సహచరులు, సహవ్రతులు.
నేను కళ్ళు తెరిచే సరికి అత్యధిక సర్క్యులేషన్ ఉన్న ' ఆంధ్రప్రభ' దినపత్రిక సంపాదకవర్గం లో నాన్న గారు కీలక వ్యక్తి. ఎడిటర్ కాకపోయినా ఎన్నెన్నో విలువైన సంపాదకీయాలు రాసిన నిబద్ధ జర్నలిస్ట్. ప్రతి శుక్రవారం వచ్చే ' సినిమా పేజీ ' కి ఆయనే ఎడిటర్. సాహితీ, సాంస్కృతిక , సినీ రాజధానిగా వెలుగొందిన ఆనాటి విజయవాడ చరిత్ర లో ఆయన అంతర్భాగం . ఆ రోజుల్లో ఏ సభ జరిగినా, అందులోనూ కొత్తగా రిలీజైన సినిమాల అభినందన సభలు, ఇష్టాగోష్టులు అయితే, రెంటాల గారు తప్పనిసరిగా వేదిక మీది త్రిమూర్తుల్లో ఒకరు .( రెంటాల, తుర్లపాటి కుటుంబరావు, వీరాజి- ఈ ముగ్గురు 1970-'80 ల నాటి విజయవాడ సినీ సభలకు త్రిమూర్తులు). ' పంచకళ్యాణి- దొంగలరాణి', ' కథానాయకురాలు' సినిమాలకు ఆయన రచయిత కూడా! వాల్మీకీ గురించి అనర్గళంగా మాటాడి, రామాయణ కాలం నాటి లాంకా ఉనికి పై కుహనా పరిశోధనల్ని పూర్వ పక్షం చేస్తూ పొద్దున్నే గంభీరమైన సంపాదకీయ వ్యాఖ్యలు రాసిన వ్యక్తే. సాయంత్రం సినిమా సభ లో వాణిశ్రీ గురించి, ఆమె పై చిత్రీకరించిన ' దసరా బుల్లోడు' పాట గురించి అంతే ఛలోక్తి గా సభారంజకంగా మాట్లాడేవారు. చిన్నప్పుడు ఉండే సినిమా మోజు, సినిమా ప్రివ్యూ చూసి రాగానే నాన్న గారు రాసే చిత్ర సమీక్ష ను ప్రింట్ లో రాక ముందే చూడడం, పురాణాల మొదలు ' బాలజ్యోతి' మాస పత్రిక లో పిల్లల సీరియళ్ళు దాకా ఆయన రాస్తున్నప్పుడే వేడి వేడి గా చదివేయడం- ఇలాంటివన్నీ నాన్న గారిని నా దృష్టి లో హీరో ను చేశాయి. ఇంకా చెప్పాలంటే, తెలియకుండానే నా అంతరాంతరాళ్ళో ఓ రోల్ మోడల్ ను నిలబెట్టాయి. పోగుబడిన ఆ వాసనలే మా పెద్దన్నయ్యనూ ( రెంటాల సత్యనారాయణ) మా అక్కయ్యను ( కల్పనా రెంటాల), నన్నూ అక్షరాల వైపు పరుగులు తీయించాయి.
నాన్న గారు ఉదయం నిద్ర లేచి, కాలకృత్యాలు తీర్చుకోగానే కాస్తంత కాఫీ త్రాగుతూ రాసుకోవడానికి కూర్చోనేవారు. ఆయన ప్రత్యేకంగా చేయించుకున్న టేకు కుర్చీ, టేబుల్, ఆ టేబుల్ లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు తీసి, అక్కరలేదన్నప్పుడు లోపలకు నెట్టేయడానికి వీలుండే రాత బల్ల ఉండేవి. పురుళ్ళూ , పుణ్యాలు, ఇంటికి వచ్చే బంధుజనమ్, పిల్లల ఆటలు, పాటలు, చదువులు, కేరింతలు, అరుపులు, కేకలు, కొట్లాటలు, ఆఫీస్ ఒత్తిళ్ళు --ఇన్నింటి మధ్య కూర్చొని ఆయన రోజూ గంటల తరబడి రాసుకుంటూ ఉంటే, పంచాగ్ని మధ్యంలో సాహితీ తపస్వీ లా కనిపించేవారు.
మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, ' రసన' సమాఖ్య కె. వేంకటేశ్వర రావు, సుంకర కనకారావు, మాచినేని వెంకటేశ్వరరావు, కోగంటి గోపాలకృష్ణయ్య, కర్నాటి లక్ష్మీనరసయ్య, మోటూరి ఉదయం, ' అనామిక' విజయలక్ష్మి, మహీధర రామమోహనరావు, ఆవంత్స సోమసుందర్, కె.వి. రమణారెడ్డి, ఏటుకూరి బలరామమూర్తి, బొమ్మారెడ్డి - ఇలా ఒకరా, ఇద్దరా ఆ నాటి ప్రసిద్ధ సాంస్కృతిక, సాహిత్య, పత్రికా రంగా ప్రముఖులందరూ మా ఇంటికి తరచూ వస్తుండేవారు. ఇంటికి ఎవరోచ్చినా వాళ్ళను సాదరంగా ముందు గది లో కూర్చోబెట్టి, ముందుగా మంచినీళ్ళు, ఆ తరువాత అమ్మ చేతి కమ్మని కాఫీ, ఆ పైన ప్రత్యేకంగా మద్రాస్ నుంచి తెచ్చిన కొయ్య పేటిక లో నుంచి ఘుమ ఘుమలాడే వక్కపొడి ఇచ్చి మర్యాద చేయాలి. అది నాన్న గారు, అమ్మ మాకు నేర్పిన పద్ధతి . నిజం చెప్పాలంటే, తెల్లవారుతూనే తీసిన తూర్పు వాకిటి గుమ్మం మళ్ళీ రాత్రి ఎప్పుడో పడుకునేటప్పుడు తప్ప మధ్యలో మూసే పనే లేదు. వచ్చిన పెద్దలతో ముందు గది లో ఎప్పుడూ ఏవో సాహితీ చర్చలు. చొక్కా లాగు వయసు లో విన్నవి తలకెక్కాయో లేదో కానీ, మాకు తలపులు పెంచాయి. సమాజం లోకి తలుపులు తెరిచాయి.
గమ్మత్తేమిటంటే, నరసరావు పేట లో ' నవ్య కళా పరిషత్' వారి ' నయాగరా' ( అనిసెట్టి పెళ్ళికి మిత్రులిచ్చిన కావ్య కానుక) కవి మిత్రుల్లో ఒకరైన నాళ్ళ నుంచి , ప్రభుత్వానికి నిషేధానికి గురైన ' కల్పన' కవితా సంకలనం సంపాదకత్వ రోజుల దాకా నాన్న గారి జీవితమంతా ప్రధానంగా కవిత్వం, రంగస్థలమే! అభ్యుడయ కవిత్వం లో మైలు రాళ్ళుగా నిలిచిన ' సంఘర్షణ', తెలంగాణ ప్రజా పోరాటం పై దృష్టి పెట్టిన ' సర్పయాగం' కవితా సంపుటాలు, ' శిక్ష ', ' ఇన్స్పెక్టర్ జనరల్', ' అంతా పెద్దలే ' లాంటి నాటకాలు రచనా జీవితపు తొలి నాళ్ళల్లోనే నాన్న గారికి పేరు తెచ్చిన సాహితీ శిల్పాలు. " అమ్మా! ఉమా ! రుమా! హీరోషిమా! విలపించకూ పలపించకూ..." అంటూ హీరోషిమా పై అణుబాంబు దాడి ఉదంతం వస్తువు గా రాసిన కవిత అప్పట్లో ఎంతో మంది దృష్టి ని ఆకర్షించింది. శ్రీశ్రీ ఎంతో మెచ్చుకొని , 1952 ప్రాంతం లో జపాన్ నుంచి వచ్చిన శాంతి సంఘం ప్రతినిధులకు అప్పటికప్పుడు ఆ కవిత ను ఇంగ్లీష్ లోకి అనువదించి, వినిపించారు.
అభ్యుదయ భావాలు, ఆర్ష సంస్కృతి మూలాల కలనేత నాన్న గారు. సంప్రదాయ కుటుంబం లో పుట్టి , ఆ సాహిత్యమంతా చదివి, అభ్యుదయం వైపు పయనించి, ఆది నుంచి ' అరసం ' లో సభ్యుడిగా, కమ్యూనిజమే తారక మంత్రం గా కొనసాగిన నాన్న గారికి శ్రీశ్రీ అంటే ప్రాణం. అదే సమయం లో విశ్వనాథ (సత్యనారాయణ) అంటే గురుభావం. శ్రీశ్రీ మానసిక వైకబ్ల్యానికి గురైన రోజుల్లో విజయవాడ లో ఆసుపత్రి గది వద్ద కాపున్న నాన్న గారే, విశ్వనాథ ఇంటికి వెళ్ళి శిష్యుడి లా కూర్చొని, ' నవభారతి' పత్రిక కు ' మధ్యాక్కఱలు' రాయించుకొని తెచ్చేవారు. విశ్వానాథ ను అనేక సార్లు ఇంటర్వ్యూ చేసిన నాన్న గారు, ఆ కవిసమ్రాట్ అస్తమించినప్పుడు ' ఆంధ్రప్రభ' దినపత్రికలో ' వాగ్దేవి కటాక్షం పొందిన కవి మూర్దన్యుడు ' అంటూ సంపాదకీయం రాసి, అక్షరాంజలి ఘటించారు. ఒక సిద్ధాంతాన్ని నమ్మినంత మాత్రాన, ఇతర సిద్ధాంతాల వారందరూ ఆగర్భ శత్రువులన్న వైమనస్యం లేని విశాల సాహితీ దృక్పథం నాన్న గారిదేమో అనిపిస్తుంది. అయితే, కష్టాలను కడతేర్చే తారకమంత్రం కమ్యూనిజం అని నమ్మాక, ఓ దశ లో కమ్యూనిస్ట్లు పార్టీలో వచ్చిన నిట్టనిలువు చీలిక ఎంతో మంది అభ్యుదయ సాహితీప్రియుల లాగానే నాన్న గారిని కూడా విచారం లోకి నెట్టింది. ఉమ్మడి కమ్యూనిస్ట్ నేపథ్యం లో నుంచి వచ్చిన వారందరూ చెట్టుకొకరు, పుట్టకొకరు అయినప్పుడు ఆయనా జీవిత సమరం లోకే వెళ్ళిపోయారు.
నాన్న గారి ఆరు దశాబ్దాల రచనా జీవితంతో దాదాపు నాలుగు దశాబ్దాల పత్రికా రచనా జీవితం పెనవేసుకుంది. చల్లా జగన్నాత్తమ్ సంపాదకత్వం లో గుంటూరు నుంచి వచ్చిన ' దేశాభిమాని' పత్రిక తో జర్నలిస్ట్ జీవితం మొదలుపెట్టారాయన. ఆ తరువాత వివిధ పత్రికలకు రచనలు చేస్తూనే , చదలవాడ పిచ్చయ్య ' నవభారతి' మాసపత్రిక కు ఇంచార్జ్ ఎడిటర్ గా పని చేశారు. ఆ తరువాత నీలంరాజు వెంకట శేషయ్య సంపాదకత్వం లో ' ఆంధ్రప్రభ ' దినపత్రిక లో చేరి, 1980 ల చివరి వరకూ అక్కడే వివిధ హోదాల్లో గురుతర బాధ్యతలు నిర్వహించారు. రచనలు చేశారు. శీర్షికలు నిర్వహించారు. సమీక్షలు, సంపాదకీయాలతో సహా అనేకం రాశారు. సమాజాన్ని సరైన దోవ లో నడిపించేందుకు కలం పట్టాలన్న తరానికి చెందిన నాన్న గారి దృష్టి లో జర్నలిజం ఉద్యోగం కాదు. వృత్తి! ఆసక్తి, అభిరుచి ఉన్న వారే తప్ప, గడియారం చూసుకొని పని చేసే గుమాస్తా గిరి మనస్తత్త్వం జర్నలిస్ట్ లకు పనికి రాదని ఆయన నమ్మారు. ఆచరించారు. పత్రికా రచన ప్రతిష్టాత్మకమైన ఆ రోజుల్లో ఆయన సహోద్యోగులు పండితారాధ్యుల నాగేశ్వర రావు, జి. కృష్ణ, ఏ.బి.కె. ప్రసాద్, అజంతా, మాదల వీరభద్రరావు, అప్పటి యువతరం పురాణపండ రంగనాథ్, వాసుదేవ దీక్షితులు, కె. రామచంద్రమూర్తి, వేమన వసంత లక్ష్మి--ఇలా ప్రసిద్ధులు ఎందరెందరో! నండూరి రామ్మోహన రావు, సి. రాఘవాచారి, పురాణం సుబ్రహ్మణ్య శర్మ, ' స్వాతి' బలరాం లాంటి ఆప్త పత్రికా మిత్రుల జాబితా ఇంకా పెద్దది. రచయిత, జర్నలిస్ట్ లు రిటైర్మెంట్ లేదని నమ్మిన నాన్న గారు పదవీ విరమణ చేసినా, కడదాకా ' ఆంధ్ర ప్రభ' ' స్వాతి' పత్రికలకు రచనలు చేస్తూనే వచ్చారు.
నాన్న గారికి మేము ఎనిమిది మంది సంతానం. మా ఎనిమిది మంది చదువులు, ఏడుగురి పెళ్ళిళ్ళ కోసం ఆయన ఎత్తిన కలం దించకుండా ఎన్ని వేల పేజీలు రాశారో! దాదాపు 200 పుస్తకాలు లెక్క తేలాయి. అందులో 150 కి పైగా ప్రచురితాలు. కానీ, ఇవాళ సంస్కృత మూలంతో సహా తెనిగించిన ' వాత్స్యాయన కామ సూత్రాలు' లాంటి కొన్ని మినహా అనేకం అందుబాటు లో లేవు. చివరి రోజుల్లో ఆయన తన మూడో కవితా సంపుటం ' శివధనువు ' ప్రచురించాలని ఎంతో తపించారు. కానీ, స్వహస్తాలతో పుస్తకంగా కుట్టుకున్న ఆ కవితల పత్రికాప్రతుల సాక్షిగా 1995 జూలై 18 న కీర్తి శేషులయ్యారు. ఆ పైన ' శివధనువు' కవితా సంపుటాన్ని, కొన్ని అముద్రిత నాటకాలను మార్కెట్ లోకి తెచ్చేసరికి, ఆర్థికంగా బలం లేని మాకు వెన్ను విరిగింది. అయితేనేం, పిత్రూణాం కొంతైనా తీర్చుకోగలిగామనే ఆత్మ తృప్తీ మిగిలింది.
' అష్ట గ్రహ కూటమి' అన్నది మా ఎనిమిది మంది పిల్లల మీద నాన్న గారి ఛలోక్తి. అమ్మతో కలిపి నాన్న గారి జాతకం లో మేము ' నవగ్రహాలు' అన్న మాట! ( చిన్న తనం లోనే బాల జోస్యుడిగా పేరు తెచ్చుకున్న రెంటాలకు జ్యోతిష్యం లో లోతైన అబినివేశం ఉండేది). సెలవు పెట్టకుండా ఆఫీస్ పని లోనే మునిగి తేలే ఆయనకు నిత్యం సభలు, సమావేశాలు, ఇంట్లోనేమో ఉదయం, సాయంత్రం సృజనాత్మక వ్యాసంగం--వీటికే సరిపోయేది! ఇరవై నాలుగు గంటల జీవితం లో ఆయన మమ్మల్ని లాలించలేదు. బుజ్జగించలేదు. చేయి పట్టుకొని నడిపించలేదు. ఇలా ఉండాలని ప్రత్యేకించి చెప్పలేదు. ఇలాగే ఉండండని శాసించలేదు. బోధనలో ఆయనది మౌనంగా ఉంటూనే, శిష్యుల సందేహాలను పటాపంచలు చేసే దక్షిణామూర్తి సంప్రదాయమని అనిపిస్తుంటుంది.
నాన్న గారి ఈ విజయాలన్నింటి వెనుకా అదృశ్యం గా నిలిచింది మా అమ్మ-- పర్వత వర్ధని. ఊరు కానీ ఊళ్ళో, భాష రాని అమ్మ, నాన్న గారి రచనా జీవితానికి ఇబ్బంది లేకుండా పుట్టింటిని సైతం మర్చిపోయింది. ఇంటి బాధ్యతలు నెత్తిన వేసుకొని, రెక్కలు ముక్కలు చేసుకుంది. అమ్మ ఎప్పుడూ తెర వెనుకే! ఆయన పేరు చదవడం కోసం అప్పట్లో కష్టపడి కూడబలుక్కొని తెలుగు చదవడం నేర్చుకున్న అమ్మ, ఆయన పోయాక ఆయన పుస్తకాలు ప్రచురిస్తుంటే, వాటిని చూడటం కోసం రాత్రిళ్ళు లేజర్ ప్రూఫ్ ల కోసం కాచుకు కూర్చున్న అమ్మ --ఇవాళ్టికీ ఆయనకు లభించిన కొండంత సిరి.
అప్పటికీ, ఇప్పటికీ ఎక్కడైనా, ఎవరైనా అడిగినప్పుడు పూర్తి పేరు చేపప్గానే, ' ఫలానా రెంటాల గోపాల కృష్ణ గారు మీకు ఏమవుతారు?' అనే ప్రశ్న మా ఇంట్లో అందరికీ అనేక సందర్భాల్లో ఎదురయ్యే అనుభవం. ' ఆయన మా నాన్న గారు' అనగానే అవతలి వ్యక్తి కళ్ళల్లో ఓ చిన్న వెలుగు, మాటలో ఓ చిన్న మెరుపు. అదే నాన్న గారు మాకిచ్చిన మూలధనం. బతకడానికి కావల్సిన బడి చదువులేవో చెప్పించి, మనిషి గా జీవించడానికి మార్గమేమితో చెప్పకుండానే చేతల్లో చూపించిన పాత తరం పెద్ద మనిషి నాన్న గారు. అందుకే, ఆయనంటే మా ఇంటిల్లపాదికీ ప్రేమ, గౌరవం, ఆరాధన! నాన్న గారు కీర్తి కాయం తో చిరంజీవులై పదహారేళ్ళవుతున్నా, ఇప్పటికీ ఆయన ప్రస్తావన వస్తే పూదూకుపోయే గొంతు పేగుల్చుకొని మరీ మా కల్పనా కవిత లో మాటలే చెప్పాలని ఉంది--

" నాన్నా! ఇవాళ్టికీ మన మధ్య ఎంత దూరమో, అంత దగ్గర!"

డా. రెంటాల జయదేవ

Tuesday, April 26, 2011

అప్పుడు బాత్ రూమ్ గోడలు...ఇప్పుడు ఫేస్ బుక్ వాల్ !




సంచలనం
సృష్టించినఏషియన్స్ ఇన్ ది లైబ్రరీవీడియో


అప్పుడు బాత్ రూమ్ గోడలు...ఇప్పుడు ఫేస్ బుక్ వాల్ పోస్టులు, ట్వీట్ లు , యూ ట్యూబ్ వీడియోలు.
ఇప్పుడున్నది ఫేస్ బుక్ తరం. 4 జి ఫోన్ల తరం, ట్వీట్ లు చేయకపోతే బతకలేని తరం, యూట్యూబ్ లో ఏదైనా వీడియో పోస్ట్ చేయకపోతే వాళ్ళు కూల్ గైస్ కాదనుకునే తరం, దీనికి దేశాలు, ఖండాలు ఏమీ తేడా లేదు. ఎక్కడైనా ఎవరికైనా పక్కవారిని ఏడిపించటం, వాళ్ళ మీద వీలైతే నాలుగు పుకార్లు ప్రచారం చేయటం, లేదా వాళ్ళ మీద ద్వేషం కురిపించటం ఇవన్నీ మన లోపల మనకే తెలియకుండా ఉండే లక్షణాలు.
ప్రపంచమంతటా ఇప్పుడు ఆన్ లైన్ బుల్లియింగ్ సీజన్ నడుస్తోంది. ఇందుకోసం నవతరం కున్న తాజా సాధానాలు ఫేస్ బుక్, ట్విట్టర్, యూ ట్యూబ్.
ఒకప్పుడు స్కూల్లోనో, కాలేజీలోనో చదువుకునేటప్పుడు మన స్నేహితుల్లోనో, తోటి విద్యార్థుల్లోనో ఎవరి మీదైనా కోపం వస్తే, ఎవరి గురించైనా ఒక పుకారు లేవదీయాలనుకుంటే, మనల్ని రాగింగ్ చేసి ఏడిపించేవాళ్లను ఎదురుగా నిలబడి ఏమీ చేయలేక దొంగ చాటుగా నైనా ఏదో ఒకటి చేసి తీరాలని ఉక్రోషంతో, ఆవేశంతో నే ఏదైనా రాయలనుకుంటే, బాత్ రూమ్ గోడలు పనికివచ్చేవి. ఫలానా వారు అంటూ వాళ్ళ గురించి ఏదో ఒకటి చివర టకారం చేర్చేసి ప్రచారం చేసెసేవాళ్ళు.
ఒక తరం లో బాత్ రూమ్ గోడల నీలి రాతలు ఎవరైనా తుడిపెసే అవకాశం కొంతైనా ఉంది. రాతలు, మాటలు ఒక స్కూల్ కొ, ఒక వూరికో, ఒక ప్రాంతానికో, ఒక వార్తా పత్రికకొ , ఒక టీవీ చానల్ కొ పరిమితమయ్యేవి. ఆన్ లైన్ సాధనాలతో అది కుదరదు. ఒక సారి నెట్ లో ఏదైనా పోస్ట్ చేస్తే, ఏదైనా రాస్తే, అది ఇక శాశ్వతం, ఎవరైనా దాన్ని స్క్రీన్ షాట్ కింద సేవ్ చేసుకొని ప్రచారం చేయవచ్చు. దాన్ని వెంటనే డౌన్ లోడ్ చేసి మళ్ళీ అప్ లోడ్ చేయవచ్చు. ఆంతర్జాల మాయాజాల ప్రపంచంలో సాలీడులా ఇరుక్కుపోయిన యువతరం తెలుసుకోవాల్సిన విషయాలు, నేర్చుకోవాల్సిన అంశాలు ఇంకాఅనేకం ఉన్నాయి.
బుల్లియింగ్ స్వరూప స్వభావాలు ఇప్పుడు ఏమీ మారలేదు కానీ వాటిని అమలు చేసే విధానం, బుల్లియింగ్ ని ఎదుర్కొనే విధానం రెండూ మారాయి.
ఎక్కడో మన ఫేస్ బుక్ వాల్ మీద మనం రాసే కామెంట్లు, రాతలు, కూల్ గా ఉంటుందనో, మన అభిప్రాయాలూ, మన మాటలు, మన చేతలు మనిష్టం , అది నా ప్రాధమిక హక్కు అనుకొని వెబ్ కామ్ ముందు కూర్చొని ఏవేవో మాట్లాడి వీడియో తీస్తే అది మీ జీవితానికే ముప్పు తీసుకురావచ్చు. తాను యూట్యూబ్ లో పెట్టిన మూడు నిమిషాల వీడియో, అందులో వెలిబుచ్చిన అభిప్రాయాలూ అమెరికాలోని ఒక విద్యార్థి జీవితాన్ని సమూలంగా మార్చేసింది. “ వీడియో తీసినప్పుడు నాలో ఏదో దెయ్యం ప్రవేశించి ఉంటుంది, కాలాన్ని వెనక్కు తిప్పగలిగే శక్తి లేదా అవకాశం ఉంటే నేను చేసిన పని ని తుడిపేస్తాను అంటుంది అలెక్జాండ్రా వాలెస్. ఇంతకూ వాలెస్ చేసిన తప్పెమిటంటే తనతో పాటు కాలేజీ లో చదువుకుంటున్న ఏసియన్ విద్యార్థుల గురించి తన అభిప్రాయాలను, అభ్యంతరాలను వెబ్ కామ్ ద్వారా వీడియో తీసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేయటం. “ ఏషియన్స్ ఇన్ ది లైబ్రరీపేరిట వాలెస్ పెట్టిన ఆసియా వ్యతిరేక వీడియో కేవలం అమెరికాలోనే కాకుండా ప్రపంచమంతటా సంచలనం రేపింది.
లాస్ యాంజలెస్ లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ( UCLA) లో పోలిటికల్ సైన్స్ మూడో సంవత్సరం చదువుతున్న అలెక్జాండ్ర వాలెస్ తన కాలేజీ లైబ్రరీ లో తోటి ఏసియన్ విద్యార్థుల మాట తీరుని, ఉచ్ఛారణ ని , వారి జీవిత విధాన్నాన్ని వెక్కిరిస్తూ ఒక మూడు నిముషాల వీడియా ని యూట్యూబ్ లో పెట్టింది. వాలెస్ వీడియో లో మాట్లాడింది మూడు నిముషాలే కానీ అందులో ఆమె చేసిన వ్యాఖ్యానాలు చాలానే వున్నాయి. యూసీఎల్ లాంటి యూనివర్సిటీ లో చదువుకోవటానికివచ్చే వాళ్ళు అమెరికన్ మేనర్స్ నేర్చుకోవాలన్నది ప్రధాన మైన వ్యాఖ్య. అది కాకుండా ఏషియన్స్ తమ పిల్లలు సొంత కాళ్ళ మీద నిలబదనీయకుండా వారాంతాల్లో వారి అపార్ట్మెంట్లకు వచ్చి బట్టలు ఉతకటం, వారాని కి సరిపోయే ఆహారాన్ని వండి పెట్టడం లాంటివి చేస్తారన్న రేసిస్ట్ వెక్కిరింపులు ఏషియన్ కమ్యునిటీ మనోభావాలను ఎంతగానో దెబ్బతీసాయి. వీడియో నెట్ లో విపరీతంగా ప్రచారమైంది. ఎంత గా ప్రచారమయిందంటే న్యూయార్క్ టైమ్స్ పేజీల్లోకి కూడా ఎక్కేంతగా.
జరిగినదేమిటంటే ఇటీవల జపాన్ లో సునామీ, భూకంపం సంభవించినప్పుడు జపాన్ లో తమ బంధువులు, స్నేహితుల వివరాలు తెలుసుకోవాలనుకునే అనేకమంది ఏషియన్ విద్యార్థులు కాలేజీ లైబ్రరీలో నుంచే సెల్ ఫోన్ లో మాట్లాడారు. పరీక్షలు జరుగుతున్నందున లైబ్రరీ లో చదువుకుంటున్న వాలెస్ కి అది ఇబ్బందికరంగా అనిపించింది.వెంటనే ఏషియన్ ప్రవర్తన గురించి తన అభిప్రాయాలను వీడియో ద్వారా తెలిపింది. వీడియో పెట్టగానే వచ్చిన నెగెటివ్ ప్రతిస్పందన చూడగానే వెంటనే ఆమె వీడియో ని తీసెసింది. కానీ అప్పటికే వీడియోని అనేకమంది డౌన్లోడ్ చేసుకొని ఉందటం వల్ల తిరిగి యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు.
వీడియో ని ఇక్కడ చూడండి.
ఇక వాలెస్ ఆసియా ప్రజల (జపనీస్) గురించి చేసిన అభ్యంతరకరమైన కామెంట్ల కి , సైబర్ బుల్లియింగ్ వీడియో కి స్పందనగా అనేక మంది వీడియో లు చేసి యూ ట్యూబ్ లో పెట్టారు. అయితే అన్నింటి కన్నా వర్థమాన గాయకుడు జిమ్మీ వాంగ్ ఎంతో సరదాగా, నమ్రతగా వాలెస్ చేసిన రేసిస్ట్ కామెంట్లకు సమాధానంగా నాలుగు నిముషాల ఒక పాట ద్వారా తన నిరసన ని తెలియచేసాడు. దాని పేరుచింగ్ చాంగ్ ఏషియన్స్ ఇన్ ది లైబ్రరీ సాంగ్” . వీడియో కి బహుళ ప్రచారం లభించింది . దాదాపు ఎనిమిది లక్షల మంది ఇప్పటి వరకూ వీడియో ని చూశారు. పాటను ట్యూన్స్ లో అమ్మకానికి కూడా పెట్టారు. జిమ్మీ వాంగ్ వీడియో ని ఇక్కడ చూడొచ్చ్చు.

వాలెస్ చేసిన సైబర్ బుల్లియింగ్ కి సమాధానం చెప్పటంతో కథ ఆగిపోలేదు. ఆమెకు , ఆమె కుటుంబానికి చంపేస్తామన్న బెదిరింపులు వచ్చాయి. కాలేజీ నుంచి ఆమె ను తొలగించకపోయినా, కాలేజీ కి వెళ్ళి పరీక్షలు రాసే వీలు లేక వాలెస్ ప్రస్తుతానికి కాలేజీ మానేసింది. వూరు కూడా వదిలి వెళ్ళే పరిస్థితులు వున్నాయి. కానీ ఎక్కడికెళ్లినాఅదుగో, ఆమె రేసిస్ట్ వాలెస్అనే ముద్ర పడిపోయింది. ఆమె జీవితం ఇదివరకటి లాగా ఇక ఎప్పటికీ వుండబోదు.
ఇవాల్టి ప్రపంచంలో పేరు చాలా తొందరగా వచ్చేస్తుంది. ఎంత తొందరగా అంటే మనం వూహించలేనంత. అయితే అది మంచి పేరు కావచ్చు. చెడ్డపెరు కావచ్చు. వాలెస్ కథ ఒక హెచ్చరిక. ఆన్ లైన్ లో పబ్లిక్ లైఫ్ వున్న వారందరికీ వాలెస్ కథ ఒక కనువిప్పు కాగలదని ఆశిద్దాం.

( ఈ వ్యాసం ఏప్రిల్ 24 సాక్షి ఆదివారం అనుబంధం ఫన్ డే “ లో ప్రచురితం)

Sunday, March 06, 2011

“ కొసమెరుపు” కథారచయిత ఓ.హెన్రీ మ్యూజియం


వందేళ్ల క్రితం ఒక అమెరికన్ రచయిత ఎలా జీవించి వుంటాడు? అతని రోజువారీ జీవితం , రచనా జీవితం ఎలా వుండేవి? ఈ ప్రశ్నలకి సమాధానం కావాలంటే మనం టెక్సాస్ ఆస్టిన్ లో వున్న ఓ హెన్రీ అలనాటి ఇంటిని చూసి తీరాల్సిందే. కరెంటు లేని రెండు బెడ్ రూముల చిన్న ఇల్లు. ముందు గదిలో అరువు తెచ్చుకున్న పియానో. వొక చిన్న సోఫా. వొక కుర్చీలో చెల్లా చెదురుగా పడి వున్న అప్పటి పత్రిక “సాటర్ డే పోస్ట్” సంచికలు. వొక మూల చిన్న పుస్తాకాల అల్మరా. ఇంకో మూల చలి కాచుకోడానికి నిప్పుల గూడు. ఇంకో మూల రచయిత రాసుకునే చిన్న టేబులూ, కుర్చీ. ఒక అతిధి వచ్చినా ఇరుకు అనిపించే ఆ చిన్న లివింగ్ రూమ్. దానికి కుడివైపు చిన్న పడక గది. రచయిత అతని భార్యా కలిసి పడుకున్న అప్పటి మంచం. వాళ్ళ పాపాయి వూగిన చిన్ని వూయెల. ఆ పాపాయి కోసం ప్రేమగా ఓ.హెన్రీ కొన్న బొమ్మలు, కొంచెం లోపలికి వెళ్తే, ముగ్గురు పట్టే డైనింగ్ టేబులు, చిన్న వంట గది. రెఫ్రిజేటర్లు, గాస్ పొయ్యి లేని కాలంలో వాడిన వస్తువులూ...ఇది లోకానికి “ కొసమెరుపు” కథల రుచి చూపించిన గొప్ప అమెరికన్ రచయిత ఓ హెన్రీ ఇల్లు!

మనకి చిన్నప్పుడు స్కూల్లో నాన్ డీటైలెడ్ టెక్స్ట్ బుక్ లో “ రాన్ సమ్ ఆఫ్ రెడ్ చీఫ్” కథ చదువుకున్నప్పటి నుంచి ఓ హెన్రీ తెలుసు. నా మటుకు నాకు ఆ తర్వాత “ ది లాస్ట్ లీఫ్” కథ చదివాక అతని కథలతో పాటు అతని మీద అభిమానం పెరిగింది. రాన్ సామ్ ఆఫ్ రెడ్ చీఫ్ లో తుంటరి పిల్లవాడు “ రెడ్ చీఫ్” చేసే అల్లరి ఆకట్టుకుంటే, లాస్ట్ లీఫ్ లో అనారోగ్యం , మరణం వెనుక దాగి వుండే మానసిక అంశాలు మనసు ని కదిలించి వేస్తాయి. ఓ హెన్రీ కథల్లో విశిష్టత ఒక్క మాట లో చెప్పాలంటే ఏ కథ కూడా మనం వూహించినట్లు వుండదు. చివరలో ఒక కొసమెరుపు మొత్తం కథ నే మార్చివేస్తుంది. కథ చదువుతున్నంత సేపూ పాఠకుడు వూహిస్తున్నదానికీ భిన్నమైన ముగింపు తో కథ ముగుస్తుంది. ఆ రకంగా ఆ కథలు, వాటిని సృజించిన రచయిత ఓ హెన్రీ ఇద్దరూ పాఠకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటారు.
దాదాపు 600 కు పైగా కథలు రాసి అమెరికన్ సాహిత్య చరిత్రలోనే ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్న కథా రచయిత ఓ హెన్రీ టెక్సాస్ లోని ఆస్టిన్ లో 12 ఏళ్ల పాటు నివసించాడు. ఈ పన్నెండేళ్లూ అతని జీవితం అనేక మలుపులు తిరిగింది. అతను నివసించిన ఇంటిని మ్యూజియంగా మార్చి 1934 నుంచి అంటే గత 77 ఏళ్ళుగా ప్రదర్శనకు ఉంచారు. ఆస్టిన్ వచ్చినప్పటి నుంచి ఓ హెన్రీ మ్యూజియం చూద్దామనుకుంటున్నా ఎప్పుడూ ఏవో అవాంతరాలు. ఇండియా నుంచి కవి, కథకుడు, జర్నలిస్ట్ మిత్రుడు కూర్మనాథ్ ఇటీవల ఆస్టిన్ కి వచ్చినప్పుడు మా వూర్లోని వింతలు విశేషాలు చూపించే క్రమం లో భాగంగా నేను, అఫ్సర్, కూర్మనాథ్ ముగ్గురం ఆస్టిన్ డౌన్ టౌన్ లోని ఓ హెన్రీ మ్యూజియం చూడటానికి ఎలాగైతేనేం వెళ్లగలిగాము.

నిరంతరం ట్రాఫిక్ రద్దీతో , కార్ల రణగొణధ్వనుల మధ్య వీటన్నింటికి అతీతంగా రోడ్డు పక్కన ప్రశాంతంగా సాహితీప్రియులను పలకరించే ఓ చిన్న ఇల్లు. ఇంటి ముందు కొన్ని గులాబీ మొక్కలు. ఇంటి పక్కన, వెనక కూడా కొన్ని చెట్లు. తలుపు కొట్టి లోపలకు వెళ్ళగానే అక్కడ కూర్చొని పుస్తకం చదువుకుంటున్న టూర్ గైడ్ వచ్చి మమ్మల్ని సాదరంగా ఆహ్వానించింది. ఇల్లంతా తిప్పి చూపించింది., ఆ ఇంట్లో హెన్రీ వాడిన వస్తువులు అన్నీ ఓపికగా ఒకొక్కదాని గురించి వివరించింది. ఓ. హెన్రీ జీవితచరిత్ర అంతా ఏ మాత్రం విసుగు లేకుండా అప్పుడే మాకేమొదటి సారి ఆ వివరాలు చెప్తున్నంత ఉత్సాహంగా చెప్పింది.

విలియం సిడ్నీ పోర్టర్ ( ఓ. హెన్రీ అసలు పేరు ఇదే) 1893 లో ఈ ఇంట్లో చేరే నాటికి అదొక అద్దె ఇల్లు. అప్పటికి ఆ ఇంట్లో గ్యాస్, కరెంటు లాంటి సదుపాయాలు ఏవీ లేవు. కిరోసిన్ దీపాలే వెలిగించుకునేవారు. బొగ్గుల కుంపట్లు వాడేవారు.అప్పట్లో ఓ.హెన్రీ నివసించిన ఇల్లు ఇదే కానీ ఈ అడ్రెస్ మాత్రం కాదు. ఇప్పుడు మ్యూజియం వున్న ఇంటికి కొన్ని బ్లాకుల దూరం లో వుండేది. ఆ ఇంటిని పడగొట్టబోతుంటే ఇంటి యజమాని ఆ ఇంటిని ఆస్టిన్ సిటీ కి అప్పగించారు. పురాతనమైన ఆ ఇంటిని చెక్కు చెదరనీయకుండా అలాగే కొన్ని బ్లాకుల ముందుకుజరిపి అవసరమైన పునరుద్ధరణ పనులు చేసి 1934 లో మ్యూజియంగా మార్చి ప్రదర్శనకు వుంచారు. అమెరికన్ సాహిత్య చరిత్రలో ఒక విశిష్టమైన కథా రచయితగా పేరు పొందిన ఓ.హెన్రీ దాదాపు 12 ఏళ్ల పాటు నివసించిన ఇంటిని గత 74 ఏళ్ళుగా కొన్ని వేల మంది సందర్శించి స్ఫూర్తి పొంది ఉంటారు. ఓ.హెన్రీ ఇంట్లో వాడిన వస్తువులు, ఫర్నిచర్, అలాగే ఆ కాలానికి సంబంధించిన కొన్ని పీరియడ్ పీస్ లు అతి జాగ్రత్తగా ఇక్కడ పొందుపరిచారు. 1994-95 లో మ్యూజియం ను కొంత పునరుద్ధరించారు. ఇప్పుడు ఈ ఇల్లు సిటీ ఆఫ్ ఆస్టిన్ పార్క్స్, రిక్రియేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యం లోని చారిత్రాత్మక ప్రదేశాల్లో ఒకటి.

విలియం సిడ్నీ పోర్టర్ సెప్టెంబర్ 11 1862 లో నార్త్ కరోలినా లోని గ్రీన్స్ బరో కి దగ్గరలో పుట్టారు. 1865 లో తల్లి మరణం తర్వాత సిడ్నీ పోర్టర్ తండ్రి గ్రీన్స్ బరో కి తన నివాసం మార్చుకున్నారు. 1882 లో విపరీతమైన దగ్గుతో బాధపడుతున్న సిడ్నీ పోర్టర్ డాక్టర్ జేమ్స్ కె. హిల్ తో కలిసి టెక్సాస్ రాష్ట్రాన్ని చూద్దామని వచ్చారు. శాన్ ఆంటోనియా లో హిల్ కి చెందిన రాంచ్ లో వున్నంత కాలం సిడ్నీ పోర్టర్ పుస్తకాలు చదువుకుంటూ గడిపేశారు. 1884 లో రిచర్డ్ హిల్ తో కలిసి పోర్టర్ ఆస్టిన్ కి వచ్చారు. అప్పటి నుంచి 14 ఏళ్ల పాటు ఆస్టిన్ లోనే ఆయన వుండిపోయారు. సిడ్నీ పోర్టర్ ఆస్టిన్ లో వున్నప్పుడు ఒక సిగార్ స్టోర్ లోనూ , మందుల షాప్ లోనూ, రియల్ ఎస్టేట్ ఆఫీస్ లోనూ పనిచేశారు. మంచి గాత్రం వున్న పోర్టర్ గిటార్, మాండలిన్ వాయించేవారు. ఆస్టిన్ లో వున్నప్పుడే పోర్టర్ కి అతోల్ ఎస్టేట్స్ తో పరిచయమయింది. అతోల్ తల్లితండ్రులు వీరి ప్రేమను వొప్పుకోకపోవడంతో ఇద్దరూ ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లిచేసుకున్నారు. 1889 లో వీరికి ఒక పాప పుట్టింది. పేరు మార్గరెట్. అప్పట్లో ఆయనకు నెలకు వంద రూపాయల జీతంవచ్చేది. ఇదే సిడ్నీ పోర్టర్ జీవితం లో అతి సంతోషకరమైన సమయం. ఆ తర్వాత ఆయన జీవితం అనేక మలుపులు తిరిగింది.



ఉద్యోగం పోవడం తో సిడ్నీ పోర్టర్ ఆస్టిన్ ఫస్ట్ నేషనల్ బాంక్ లో టెల్లర్ గా చేరారు. ఆయన ప్రస్తుతం వున్న ఇంట్లో కి మారేటప్పటికి ఆయన జీవితం మరింత కష్టం గా మారింది . భార్య ఆరోగ్యం క్షీణించటం, ఉద్యోగబాధ్యతలు సరిగా నిర్వరించలేకపోవటం తో ఆయన పరిస్థితి రాను రాను మరింత క్లిష్టమయింది. 1894 లో బాంక్ లో పూర్తి స్థాయి లో పనిచేస్తున్నపుడే సిడ్నీ పోర్టర్ “ The Rolling Stone” ( ది రోలింగ్ స్టోన్ ) అనే వారపత్రికను ప్రచురించేవారు. ఆ పత్రిక తొలి కాపీలు కొన్ని ప్రదర్శనలో ఇప్పటికీ అతి జాగ్రత్తగా గ్లాస్ కింద భద్రపరిచి వున్నాయి.ఈ వారపత్రికలో పేరుకు తగ్గట్లు ఎక్కువగా హాస్య రచనలు, కథలు, కవితలు . కార్టూన్లు, ఉత్తరాలు ప్రచురితమయ్యేవి. ఈ వారపత్రిక బాగానే అమ్ముడు పోయేది. హాస్య చతురత, కథ చెప్పే విధానంలో అద్భుతమైన శైలి వీటన్నింటితో సిడ్నీ పోర్టర్ కి మంచి పేరు కూడా వచ్చింది. అయితే ఇవేమీ ఆయన ను ఆర్థికంగా నిలదొక్కుకొనివ్వలేదు. కుటుంబ పోషణ కష్టం కావటంతో సిడ్నీ ఏడాది తర్వాత పత్రిక మూసివేశాడు.
పత్రిక మూతపడటం ఒక రకమైన నష్టం అయితే బాంక్ లో నిధుల స్వాహా బయటపడటం సిడ్నీ కి ఎదురైన మరో పెద్ద కష్టం. ఉద్యోగం పోగొట్టుకొని ఆరునెలల పాటు దుర్భరమైన నిరుద్యోగాన్ని సిడ్నీ కుటుంబం అనుభవించింది. “ The Houston Post” తమ పత్రికకు రచయిత గా తీసుకోవటంతో సిడ్నీ ఆస్టిన్ వదిలి హ్యూస్టన్ వెళ్ళాడు. ఈ పత్రికలో సిడ్నీ రాసిన కాలమ్స్ కి మంచి ప్రశంసలు లభించాయి. అక్కడ నుంచి సిడ్నీ ఒక రచయిత గా తన కెరియర్ ను ప్రారంభించాడు. అయితేహ్యూస్టన్ లో ఈ రకమైన జీవితం కేవలం 8 నెలల పాటు మాత్రమే గడిచింది. ఆస్టిన్ బాంక్ లో నిధుల కుంభకోణం విచారణ కు రావడం తో సిడ్నీ భార్య, పిల్లలను ఆస్టిన్ కి పంపేశాడు. అయితే కుటుంబం, స్నేహితుల ముందు కోర్టు విచారణ ఎదుర్కొలేననుకున్న సిడ్నీ రైలెక్కి న్యూ ఆర్లీన్స్ కి , అక్కడ నుంచి ఓడెక్కి హోండూరస్ కి వెళ్ళాడు. హోండూరస్ లో ఆరునెలల పాటు వుండటం వల్ల సిడ్నీ కి తన రచనలకు కావలసిన బోలెడంత సమాచారం దొరికింది కానీ భార్యా పిల్లలను కలుసుకోవటం మాత్రం వాస్తవంగా సాధ్యం కాలేదు. క్షయ వ్యాధితో బాధపడుతున్న భార్య బాగోగులుచూసుకునేందుకు తప్పనిసరిగా సిడ్నీ ఆస్టిన్ వచ్చి చట్ట పరమైన చర్యలను ఎదుర్కోవటానికి సిద్ధపడ్డాడు. 1897 లో భార్య ను పోగొట్టుకున్న ఏడు నెలల తర్వాత సిడ్నీ కేసు విచారణ జరిగింది. ఈ సమయంలో నే సిడ్నీ మొదటి చిన్న కథ ను ఒక నేషనల్ పబ్లికేషన్ కొనుక్కుంది. తన మూడు రోజుల కోర్టు విచారణ లో సిడ్నీ పెదవి విప్పి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా వుండిపోయాడు.అయితే సాక్ష్యాలు మాత్రం అతడిని అపరాధిగా నిలబెట్టాయి. నేరం నిర్ధారణ కావటం తో అయిదు సంవత్సరాల కారాగార శిక్ష విధించారు. ఒహాయో లోని కొలంబస్ లో ని ఫెడరల్ జైలు కి సిడ్నీ ని పంపారు. ఇక ఆ తర్వాత సిడ్నీ టెక్సాస్ కి తిరిగి రాలేదు.

జైల్లో వున్నప్పుడు సిడ్నీ తన రచనా వ్యాసంగం మీద ఎక్కువ దృష్టి పెట్టగలిగారు. అక్కడ వున్నపుడే ఆయన ఓ.హెన్రీ అనే కలం పేరు పెట్టుకొని కథలు రాశారు.మూడున్నర ఏళ్లకే జైలు నుంచి బయటకు వచ్చేనాటికి ఓ.హెన్రీ కలం పేరు కింద దాదాపు 14 కథలు ప్రచురితమై మంచి రచయిత గా పేరు సంపాదించుకున్నాడు.

1902 లో ఒహాయో జైలు నుంచి బయటకు వచ్చాక , పిట్స్ బర్గ్ లో అమ్మమ్మ, తాతయ్యల దగ్గర పెరుగుతున్న కూతురు మార్గరెట్ తో కొద్ది కాలం గడిపాడు. అప్పటికి మార్గరెట్ వయసు 13 ఏళ్ళు. ఆ అమ్మాయికి తండ్రి జైలు కి వెళ్లిన సంగతి తెలియదు. వ్యాపార పని మీద తన తండ్రి వేరే దేశాలు తిరుగుతున్నట్లు ఆమె ను నమ్మించారు. ( సిడ్నీ చనిపోయాక మాత్రమే ఆమెకు తండ్రి మీద వున్న కేసు, ఆయన జైల్లో వున్న వివరాలు తెలిసాయి. ). కూతురిని తిరిగి కలుసుకోవటం పట్ల సిడ్నీ ఎంతో సంతోషంగా వున్నప్పటికీ రచనా వ్యాసాంగం మీద జీవనం గడపటానికి గాను పబ్లిషర్స్ కి దగ్గరలో వుండేందుకు గాను న్యూయార్క్ లో స్థిరపడ్డాడు. నిరంతరం మేల్కొని వుండే ఆ నగరం సిడ్నీ కి ఎన్నో రకాలుగా స్ఫూర్తి నిచ్చింది. చివరకు అదే ఆయన స్థిర నివాసమయింది. విజయపు అంచులను ఆయన చవి చూచినది అక్కడే. జైల్లో వున్నప్పుడు రాసి ప్రచురితమైన కథలకు మంచి పేరు రావడంతో , అప్పట్లో విశేష ప్రజాదరణ పొందిన “ The New York World Sunday Magazine” తో కాంట్రాక్ట్ కుదుర్చుకొని ప్రతి వారం వారికి ఒక కథను అందించారు. ఆయన జీవితం లోని చివరి ఎనిమిది సంవత్సరాల్లో సిడ్నీ పోర్టర్ మొత్తం 381 కథలు రాశారు.ఆయన కథల్లోని సామాన్య పాత్రలు, హాస్యం, చదివింపచేసే శైలి, కథ ను నడిపించే విధానం, పదాల ఎంపిక, వూహించలేని మలుపులు, పాత్ర చిత్రణ ఇవన్నీ కూడా ఆయనను అమెరికా కు చెందిన ఉత్తమ కథకుడిగా తీర్చిదిద్దాయి.

ఓ.హెన్రీ కి దక్కిన కీర్తి సిడ్నీ పోర్టర్ గా ఆయనకు ఏమాత్రం ఉపయోగపడలేదు. జూదం, తాగుడు లాంటి వ్యసనాల వల్ల పబ్లిషర్స్ నుంచి ముందే పెద్ద మొత్తం లో పొందిన అడ్వాన్స్ లకు సరిపడా ఎప్పటికప్పుడు రచనలు సాగించాల్సి వచ్చింది. ఒకప్పుడు బాంక్ టెల్లర్ గా పనిచేసిన సిడ్నీ తన జీవితం లో ఎప్పుడూ కూడా ఆర్థిక వ్యవహారాలను కానీ, తన ఆరోగ్యాన్ని కానీ సరిగ్గా చూసుకోలేకపోయాడు.
డయాబిటీస్, లివర్ సంబంధిత వ్యాధి, గుండెజబ్బులతో 48 ఏళ్లకే ఓ.హెన్రీ గా ప్రపంచ సాహిత్య చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్న సిడ్నీ పోర్టర్ జూన్ 5, 1910 వ తేదీన కన్ను మూశాడు. ఓ.హెన్రీ గా ఆయన కన్ను మూసి వందేళ్లు గడిచినప్పటికీ ప్రపంచ సాహిత్యం ఆయనను మర్చిపోలేదు.

భారతదేశం లో లాగా కాకుండా అమెరికా లో రచనల్ని , రచయితలను గౌరవించి, గుర్తుంచుకొని సదా స్మరించే సత్సంప్రదాయం వుంది. ఆయన నివసించిన ఇంటిని మ్యూజియం గా వుంచటంద్వారా ఆయన రచనలనే కాకుండా ఆయన జీవితాన్ని కూడా భావితరాలకు తెలియచెప్తోంది ఈ ఓ.హెన్రీ మ్యూజియం. ప్రసిద్ధ ఓ.హెన్రీ క్లాసిక్ స్టోరీ “ Gifts of the Magi” రాయటానికి స్పూర్తినిచ్చిన ఆయన రైటింగ్ డెస్క్, వికర్ రాకింగ్ ఛైర్ ను ఈ మ్యూజియం లో చూసినప్పటి అనుభూతి వర్ణనాతీతం. ఆయన వాడిన డిక్షనరీ, ఆయన తన కూతురు కోసం కొన్న బొమ్మలు, సిడ్నీ భార్య వాయించిన పియానో, ఆయన జీవించిన కాలానికి సంబంధించిన వస్తువులు అవన్నీ అక్కడకు వచ్చే సందర్శకులను మౌనంగా పలకరిస్తూ వుంటాయి. వాటిని ఎవరూ తాక రాదు, ఫోటోలు కూడా తీసుకోకూడదు. ఆస్టిన్ సిటీ మేనేజిమెంట్ డొనేషన్ లు సేకరించి ఆ మ్యూజియం చూడటానికి వచ్చేవారికి టూర్ గైడ్ గా వ్యవహరించేందుకు పార్ట్ టైం సిబ్బంది ని కూడా నియమించింది.
ఓ.హెన్రీ మ్యూజియం చూసినంత సేపూ ఒకటే ఆలోచన. మన దేశం లో, మన రాష్ట్రం లో ఒక గొప్ప రచయిత కు ఇంతటి గౌరవం ఎప్పుడైనా లభించి వుంటుందా? అని. అలా అనుకోగానే ఆదరణకు నోచుకోని మహా కవుల, రచయితలు నివసించిన శిధిల భవనాలు కళ్ళముందు కదలాడాయి.


కల్పనారెంటాల

(మార్చి 7, ఆంధ్రజ్యోతి వివిధ లో ఈ వ్యాసం ప్రచురితం)

 
Real Time Web Analytics