నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Thursday, December 17, 2009

From Eveపెదాలు గాయపడ్డపుడు కదా తెలిసేది
మనం పండు కొరికామని!


హృదయాన్ని పోగొట్టుకున్నప్పుడు కదా తెలిసేది
మనం ప్రేమించామని!


స్వప్నాలేవీ రానప్పుడు కదా తెలిసేది
మనం పుట్టుగుడ్డివాళ్ళమని!


భాష రాక, స్పర్శ లేక దేహం ఏడ్చినప్పుడు కదా తెలిసేది
మనకూ వాంఛలున్నాయని!


మానమో, అభిమానమో పోయినప్పుడు కదా తెలిసేది
మనం ఆడవాళ్ళమని!


( ఈ కవిత ఒక online పత్రికలోనూ, వార్త ఆదివారం అనుబంధం లోనూ 2002 లో ప్రచురితం)

12 వ్యాఖ్యలు:

భావన said...

మొదటి లైన్ అర్ధం కాలేదు.. మిగతా అంతా చాలా బాగుంది. అవమానం జరిగినప్పుడు కదా మనకూ ఒక మానమూ అభిమానము వున్నాయని గుర్తు వచ్చేది.. మనకే తొందర గా గుర్తు రాని మన హక్కులు తోటి మనిషికి ఎప్పుడూ అర్ధం అవుతాయో.. అవుతాయా ?

cartheek said...

కవిత బావుంది అక్క, అంతా అర్ధమయింది కానీ ఆ మొదటి లైన్ అర్ధం కాలేదు ...
హహ :) భావన అక్కకే అర్ధం కాలేదు నాకు అర్ధంకాక పోవడంలో విచిత్రమేముంది...
" గాయపడ్డపుడు కదా తెలిసేది
మనం పండు కొరికామని!"
మీరే చెప్పండి ఆ వాక్యానికి భావం .

బొల్లోజు బాబా said...

nishidda phalamaa?

మరువం ఉష said...

ఏదైనా అంతే కదా పోగొట్టుకున్నప్పుడో, పోలిక తెచ్చి మనసు బేరీజులు వేసినప్పుడో కదా అవగతమయ్యేది వాస్తవం. ఆ సరికి అది గతమౌతుంది. మళ్ళీ రేపటిలోకి అర్రులు చాపటం, ఆపై చరిత్రచర్వాణం.

Kalpana Rentala said...

@ కార్తీక్, భావన, ఉష, బాబా గారూ, కవిత చదివి మెచ్చుకున్నదుకు థాంక్స్. బాబా గారు చెప్పేసారు కదా. మొదటి రెండు పాదాలకు, పైన శీర్షిక కు కనెక్షన్ వుంది. ఈవ్ ఆ నిషిద్ధ ఫలం తిన్న దగ్గర నుంచి రకరకాల గాయాలు. అవి చెప్పే చిరు ప్రయత్నం ఈ కవిత.

ఈ కవితలన్నీ ఎప్పుడో రాసినవి. పత్రికల్లో ప్రచురితమైపొయాయి. కానీ ఏవి ఎప్పుడు ఎక్కడ ప్రచురించారో కూడా గుర్తులేదు. అందుకే కొన్నింటికి సంవత్సరాలు, పత్రికల పేర్లు ఇస్తున్నాను .కొన్నింటికి ఇవ్వడం లేదు. ఇవన్నీ మీరందరు ఈ బ్లాగ్ మూలం గా ఇప్పుడు చదివి మెచ్చుకుంటుంటే మళ్ళీ కొత్త ఉత్సాహం వస్తోంది.

కత్తి మహేష్ కుమార్ said...

ఈ కవితలో ఏదో తేడా ఉంది!
మొదటి couplet లోని అర్థం...అర్థం కాలేదు.
పుట్టిగుడ్డికి స్వప్నాలు రావు. అలాంటప్పుడు స్వప్నాలుంటాయనే స్పృహమాత్రం ఎలా వస్తుంది?
ఆఖరి పంక్తి highly objectionable.మానమో,అభిమానమో కేవలం ఆడవాళ్ళకే ఉంటుందా!?!

Kalpana Rentala said...

మహేష్,

ఒక స్త్రీ గా కొన్ని అనుభూతులు, అనుభవాలు ప్రత్యేకం గా వుంటాయి. కాదంటారా? కవిత్వీకరించడం లో అభ్యంతరమేముంది? కవిత్వాన్ని కెవలం పదాల అర్ధం తొ మాత్రమే చూడకూడదు అని నేను మీకు చెప్పక్కరలేదు. కలలు కనలేకపోవడమే అసలైన అంధత్వం , కళ్ళు వున్నా సరే...ఇక మొదటి రెండు వాక్యాల గురించి. శీర్షిక చూడండి From Eve .ఈవ్ నిషిద్ధ ఫలం తినండం వల్ల ఈ సృష్టి,ఇదంతా జరిగిందని, అది ఆమె తప్పని ఒక వాదన. నేను జస్ట్ దాన్ని తీసుకొని ఆ పండు తినటం మొదలుగా కొన్ని గాయాలనండి, వేదనలనండీ వాటిని చెప్పాను. నాకు నచ్చిన నా కవితల్లో ఇదొకటి. ఇక మానమో, అభిమానమో స్త్రీలకే కాదు, పురుషులకు కూడా వుంటుంది. కానీ అవి పోయినప్పుడు నేను స్త్రీని కదా అని లోపల ఒక కలుక్కుమనే బాధ వుంటుంది. లేదూ కొందరికి వుండకపోవచ్చు. కవిత్వం ఒక భావావేశం. దాన్ని కొన్నిసార్లు justify చేయలేం.ఏమంటారు?

Kalpana Rentala said...

@భావన, మనకే గుర్తు కి రాని మన హక్కులు తోటి మనిషికి ఎప్పుడు అర్ధం అవుతాయో, అసలు అవుతాయా ? అన్నారు. నిజమే . మంచి ప్రశ్న. మన హక్కులే కాదు మనకు మనమే అర్ధం కాము ఒక్కోసారి. ఆ అర్ధం చేసుకునే క్రమమే ఈ జీవితమంతా...మీ లేఖ కౌముది లోది బావుంది. కామెంట్ ఇందాక ప్రయత్నించాను. ఏదో ఎర్రర్ చూపిస్తోంది. అందుకని ఇక్కడ చెప్తున్నాను.

కెక్యూబ్ వర్మ said...

మానావమానాలు ఇద్దరికీ సమానమే. కానీ అనాదిగా స్త్రీ పడ్డ బాధను ఇప్పటికైనా గుర్తించాల్సిందే.

మరువం ఉష said...

కల్పన, నేను ఈవ్ గానో, సర్పంట్ గానో వేసి ఈ నృత్యనాటికని చాలా సార్లు నటించాను కనుక నాకు "పండు" అనగానే అర్థం అయింది. అప్పుడు ఇప్పుడు కూడా నాకు అర్థం కానిది ఏం స్త్రీ ని ఆ కూతూహలపడి, ప్రలోభ పడిన వ్యక్తిగా చిత్రీకరించారు, అది తన జిజ్ఞాస, చుట్టూ పరిసరాల పట్ల ఆసక్తిగా ఎందుకు కాదు అని. అలాగే నిషిద్దాన్ని ఎందుకు కనుల ముందు వుంచాలి, ఆపై పరీక్షించి, శిక్షించాలి అని. ఈ కథ మొత్తం నాకు మన గతకాల నీతి "స్త్రీని నేతికుండతోను, పురుషుని అగ్నితోను పోల్చవచ్చును . పండితుడైనవాడు యిది తెలిసికొని నేతిని అగ్నిని ఒకచోట నుంచరాదు.". అదిప్పటి కాలానికి అన్వయించకపోయినా నేను అంగీకరించలేనిది. అలాగే అనుభూతి మనసుది, స్త్రీకి స్పందన ఎక్కువ. కనుక అది పలువిదాలుగా వ్యక్తీకరించబడుతుంది. నిజానికి నా కలలు, భావాలు నేను సాటి స్త్రీలతోనే అంగీకరించేయలేను. కనుక ఇవి భావసామీప్యం వున్న soul mates నడుమ అవగతమయ్యే భావనలు. మీరన్న "కవిత్వం ఒక భావావేశం. దాన్ని కొన్నిసార్లు justify చేయలేం" మాత్రం నిజం.

కొత్త పాళీ said...

పద్యంలోని వేర్వేరు వాక్యాల మధ్య, వాక్య నిర్మాణ సారూప్యత తప్పించి, భావసారూప్యత కనబళ్ళేదు నాకు :(

Kalpana Rentala said...

ఉషా. నిషిద్ధఫలం, నీతి, అగ్ని ఇవన్నీ ఒకనొక కాలానికి సంబంధించిన భావనలు. ఇప్పటికీ చాలా విషయాల్లో కొందరి మీద బలవంతంగా రుద్దబడుతున్న భావనలు. కవిత కొన్ని సర్లు subjectiveగా, కొన్నిసార్లు objective గా రాస్తాము. దేని గురించి రాసినా కవి వాయిస్ ఎంతో కొంత అందులొ కలిసిపోయి వుంటుంది.ఈ కవిత లో నేను ఈవ్ ని తప్పు పట్టలేదు. మానాన్ని గ్లోరిఫై చేయలేదు. అది కాదు నా మూలభావన. ఇవాల్టి మానవి తరతరాలుగా కొన్నింటిని అనుభవించింది. అది చెప్పటం అనివార్యం. నా ఇంకో కవిత " ఎవ్వెతవీవు" ఎప్పుడైనా చదివారా? పాత బ్లాగ్ లో వుంది. అది కూడా అంతే. కాకపోతే వేరే రకం గా చెప్పాను. ముగింపు లిబెరేటెడ్ సోల్ గా చూపించాను. ఇది కేవలం ఒక్స్ స్త్రీ కి సంబంధించి కొన్ని వేదనలు. ఆ స్త్రీ నేనో, మీరో కానక్కరలేదు.లేదా కొన్ని మనం అనుభవించవుండవచ్చు. ఇదొక సహానుభూతి కవిత. నాకైతే అభ్యంతరం కనిపించలేదు.

కొత్తపాళి, భావ సారూప్యతనే అసలు అందం ఆ కవిత కు. మీకు ఎక్కలేదంటే నాకు కూడా ఆశ్చర్యం గానే వుంది.

 
Real Time Web Analytics