నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Tuesday, January 12, 2010

నా జ్ఞాపకాల పేటికలో సాహితి ‘లత‘ !

తెలుగు సాహిత్య రంగంలో సుప్రసిధ్ధ నవలా రచయిత్రి తెన్నేటి హేమ లత. లత అంటే మోహనవంశీ లతా, ఊహాగానం లత. సాహిత్యం ఆమె ప్రాణం.అందుకే ఆమె సాహితీ లత ‘. మోహనవంశీ వేణు నాద తరంగధ్వనులు ఆమె ఉచ్చ్శ్వాస నిశ్వాసలు. వంశీ మోహనుడ్ని అణువణువునా నింపుకున్న రాధ ఆమె. .సంచలనాలకు, ఊహాగానా లకు, వాద వివాదాలకు మారుపేరు ఆమె. ఆడ చలం గా పేరు పొందిన లత వందకు పైగా నవలలు, నాటికలు, అనువాదాలు, కాలమ్స్ ,ఆత్మ కథలు రాశారు . ఆమె రచనలు ఒక ఎత్తు. ఆమె రేడియో ప్రసంగాలు, నాటకాలు ఒక ఎత్తు. ఆమె రచనలు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసాయనటంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. అక్కర్లేదు కూడా.

లత అంటే నిర్భీతి అన్న విశేషణం గుర్తుకు వస్తుంది. ఆమె మాటల్లో కానీ, చేతల్లో కానీ , రాతల్లో కానీ భయం అన్నది లేశమాత్రమైనా కనిపించదు. నిక్కచ్చిగా మాట్లాడుతుంది. రాస్తుంది. ఒక రచయిత కి వ్యక్తిగతం గానూ, రచనాపరం గానూ వుండవలసిన సూటిదనం, నిజాయితీ ఆమెలో పుష్కలంగా వున్నాయి. ఏమంటే ఏం ముంచుకొస్తుందో, ఏం రాస్తే ఏం వివాదం అవుతుందో అన్న భయం లేని అతి కొద్దిమంది రచయితల్లో లత ఒకరు.

సాహిత్య పరంగానూ, వ్యక్తిగతం గానూ లత నాకు సుపరిచితురాలు. విజయవాడ లో పుట్టి పెరిగి, లత గురించి తెలియని సాహితిప్రియులు వుండరు. చలంకు, లత కు ఇద్దరికీ దాదాపు ఒకే రకమైన అప్రతిష్ట. సెక్స్ విశృంఖలంగా రాస్తారని. నాకైతే ఇద్దరి విషయంలోనూ సమాజం అపార్ధం చేసుకుందనే అనిపిస్తుంది. కీర్తి, అపకీర్తి రెండింటిని సమంగా మోసిన రచయిiతలంటే నాకు వాళ్ళిద్దరే గుర్తుకు వస్తారు. లత రచనలు ఒక ఎత్తు. ఆమె స్వీయ చరిత్ర, ఆత్మ కధ, లేదా డైరీ ఒక ఎత్తు. లత రాతల్లోని వాతల గురించి మాట్లాడాలంటే ఒక ఉద్గ్రంధమే తయారవుతుంది. ముందు ఆమెతో నాకున్న అనుబంధం గురించి మాట్లాడి తర్వాత తీరిక చిక్కినప్పుడు ఆమె రచనల గురించి రాస్తాను .

లతని అనేక సార్లు విజయవాడ లో చిన్నతనం నుంచి కలుసుకున్నాను. 1995-96లో విజయవాడ లో సిటీ కేబుల్ వారి కోసం లత ని ఇంటర్వ్యూ చేశాను. అదే నేను ఆమె తో చివరి సారిగా మాట్లాడటం, చివరి సారి ఆమెను చూడటం. 1997 లో ఆమె కన్ను మూశారు.15, 16 ఏళ్లకే “ గాలి పడగలు –నీటి బుడగలు” నవలతో సాహిత్య రంగం లో ఆమె కాలు మోపింది. నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆమెకు 58 నో, 59 నో వయస్సు. విజయవాడ హనుమాన్ పేట లో మేడ మీద వున్న ఇంట్లో ఆమెను ఇంటర్వ్యూ చేశాం. టీవీ ఇంటర్వ్యూ అంటే వుండే హడావిడీ, హంగామా గురించి ప్రత్యేకం గా చెప్పక్కరలేదు. మేకప్, ఇంటి అలంకరణ లేకుండా ఏ టీవీ షూటింగ్ జరగదు. కానీ ఆ షూటింగ్ లో న్యూస్ ఎడిటర్, ప్రొడ్యూసర్ చంద్ర శేఖర్ , సిటీ కేబుల్ కెమెరామెన్ , నా హడావిడీ తప్ప ఆమె ఏమీ పట్టనట్లు, పట్టించుకోనట్లు , నిశ్చలంగా, నిశ్చింతగా కూర్చొని వున్నారు ఆమె . మా బలవంతం మీద కాబోలు ఆమె మోహానికి కాస్త పౌడర్ అద్దుకున్నారు.” నాకేమిటే మేకప్పు లం...ముం...!. అతి లోక సౌందర్యవతిని. ఎప్పుడూ రాధనే నేను....” అనేవారు మధ్య మధ్యలో బ్రేక్ తీసుకున్నప్పుడు నాతో సరదాగా. పూర్వకాలం బ్రాహ్మణ కుటుంబాల్లో లం...ముం....తిట్లు ముద్దుగా, ప్రేమతో తిట్టే తిట్లు. ప్రేమ మరీ ఎక్కువైతే బ్రాహ్మణులకు అంతకన్నా మంచి పదం మరొకటి నోటికి వచ్చేది కాదనుకుంటాను. ఇవాళ్టి సంస్కారాల ప్రకారం అది తప్పో, అనాగరికమో కానీ అది ఆమె సహజ ప్రవృత్తి. ఇంటర్వ్యూలో కూడా ఆమె ఆ పదాలు ఎక్కడ వాడేస్తారేమోనని నేను హడలిచచ్చాను కానీ పాపం ఆమె అంత పని చేయలేదు. పైగా ఆమె నాకంటే ముందు నుంచీ ఆకాశవాణిలో పనిచేసిన అనుభవజ్నురాలు. ఏ పదం మైక్ ముందు, టీవీ ముందు వాడాలో, వాడకూడదో తెలియకుండా వుంటుందా..నా పిచ్చిగాని.

కేబుల్ టీవీ కి ఆమె ను చేసింది సాధారణ రొడ్డకొట్టుడు ఇంటర్వ్యూ అన్నట్లు గుర్తుంది. ( ఈ సారి ఆ కాసెట్ సంపాదించాలి ఎక్కడైనా) మీరెక్కడా పుట్టారు? మీ మొదటి పుస్తకం ఏమిటి? ఎన్ని అవార్డులు వచ్చాయి టైప్ అన్న మాట. మధ్య మధ్యలో బ్రేక్ తీసుకునేటప్పుడు నవ్వులే నవ్వులు. మాటలే మాటలు. ఆమె వేసే చెణుకులకు, మామూలుగానే ఒక మాటకు పది సార్లు నవ్వే నేను మరింత ఎక్కువగా నవ్వాను ఆ రోజు. ఆమె కి భేషజాలు లేవు. నేను ఇంత పెద్ద రచయిత్రి అంటూ గొప్పలు వుండేవి కావు. ఎవరితోనైనా అలా ఆత్మీయంగా మాట్లాడేస్తుంది. వొట్టి మాటలే కాదు విమర్శించేస్తుంది కూడా. ఆమె ను అర్ధం చేసుకోలేనివాళ్ళు మొదటి పరిచయంలో కొంత బెంబేలు పడిపోయినా నెమ్మదిగా ఆమె ప్రేమ అర్ధమైతే అంతే ఆత్మీయంగా ఆమె తో కలిసిపోతారు. ఆ ఇంటర్వ్యూ కోసం వెళితే ఆమె కానీ, వాళ్ళ ఇల్లు కానీ ప్రత్యేకంగా ఏమీ సర్ది లేదు. ఎప్పుడూ వున్నట్లే ఆ హాలు నిండా పుస్తకాలు, ఆమె అవార్డులు. ఈ రూమ్ కాస్త సర్దితే బావుంటుందెమో , మీరు కొంచెం ఆ చీర సరిచేసుకుంటే బావుంటుందెమో అని అంటే, ఒరేయి, ఓ అబ్బాయి, (ఆమె అందర్నీ ఇలాగే పిలుస్తుంది) నేనేమిటో అందరికి ఇలాగే తెలుసు. నీక్కావాలంటే నువ్వే సర్దేసుకో నాయనా అనేసింది. ఇక తప్పుతుందా, అలా షూట్ చేయలేక మా వాళ్ళే అవన్నీ సర్ధి ఆమె ఇంటర్వ్యూ ని షూట్ చేశారు. అలా అనుకున్న దానికన్నా ఎక్కువ సమయం పట్టడంతో మేమిద్దరం చాలా సేపే మాట్లాడుకున్నాం. మా నాన్నగారితో తన స్నేహం గురించి, ఆయన దగ్గర ఆమెకు ఏమీ నచ్చవో అన్నీ చెప్పుకొచ్చింది.

అప్పటి ఆమె రూపు ఇప్పటికీ నా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోంది. పొడుగాటి జుట్టు వదులుగా అలా వదిలేస్తుంది. ఆ చీర కట్టూ అంతే. భౌతికమైన విషయాలకు ఆమె అంత ప్రాధాన్యమిచ్చినట్లు కనిపించదు. టాపు వేసుకోకుండా రిక్షాలో ఒక్కతే విశాలంగా కూర్చొని వెళుతుంటుంది. మధ్యలో మనమేవరైనా కనిపిస్తే అక్కడ ఆ రిక్షా అబ్బిని ఆపి “ ఏమోయ్ ! రెంటాల! ఎక్కడిదాకా?” అంటూ కబుర్లు మొదలెడుతుంది. కంఠస్వరమేమో చిన్నది కాదు. ఆమె మాటలు ఆ రోడ్దంతా వినిపిస్తూ వుండేవి. వెళ్ళేవాళ్ళంతా ఆగి, విచిత్రంగా చూసుకుంటూ వెళ్తున్నా ఆమె ఏమీ పట్టించుకోదు. ఆమె మీద వచ్చిన దుమారాల్నే పట్టించుకోని ఆమెకు ఇలాంటి విషయాలు ఒక లెక్కా?

విజయవాడ అంటే కళలకు పుట్టినిల్లు. రోజూ వూర్లో ఎక్కడో ఓ చోట సినిమా సభనో, సాహిత్య సమావేశమో, సంగీత కచేరీనో, నృత్య ప్రదర్శన నో జరుగుతుంది. సామాన్యం గా అన్నింటికీ నేను, మా నాన్నగారు క్రమం తప్పక హాజరు. మా నాన్నగారిది జర్నలిస్ట్ గా ఉద్యోగా బాధ్యత. నేను కల్చరల్ రిపోర్టర్ ని కాకముందు నుంచి కూడా మా నాన్నగారితో కలిసి వాటన్నింటికి హాజరు. బాలమురళి , వోలేటి, చిట్టిబాబు తదితరుల కచేరీలకు లతా కూడా వచ్చేవారు. మొదటి సారి ఆమెను చూసినప్పుడు “ మన లత “ తెలుసు కదా అన్నారు మా నాన్నగారు ఏక వాక్యంలో. అవును అంటూ నేను తలూపటం, మన అమ్మాయా?” అంటూ ఆమె ఆప్యాయంగా పలకరించటం ఒక మధుర స్మృతి. లత రెండో అబ్బాయి పేరు మోహనవంశీ. వాసిరెడ్డి కనకదుర్గ గారి దగ్గర భరతనాట్యం నేర్చుకున్నప్పుడు అతను నాకు సహపాఠి. మోహనవంశీ ఇప్పుడెలా వున్నాడో కానీ వాళ్ళ అమ్మ లా కాదు. చాలా ముక్తసరిగా మాట్లాడతాడు. అన్నీ భావాలు ఆ కళ్ళతో పలికించేవాడు. లత కి మాత్రం ముక్తసరిగా మాట్లాడటం, రాయటం నప్పదు. ఆమె మాట్లాడినా, రాసినా గంగా ప్రవాహంలా వుండాల్సిందే. మధ్య మధ్యలో “ స్వైరిణి అన్నారే నన్ను శ్యామసుందరా ..” అంటూ రజని పాటనో, అలవోకగా గాలిబ్ నో, ఉమర్ ఖయ్యాం నో ఎవరినో ఒకరిని కోట్ చేస్తూ వుంటుంది. ఆమె వాగ్ధాటి ముందు మనం తట్టుకోలేం అనిపిస్తుంటుంది. అంత బలమైన వ్యక్తిత్వం ఆమెది, ఆమె సాహిత్యానిది. ఆమె ని మర్చిపోకుండా వుండటం అంటే ఆమె రచనలు తరుచూ చదువుతూ వుండటమే. ఆమె డైరీల్లో ఈ తరం వాళ్ళకు తెలియని ఎన్నో సాహిత్య విశేషాలు, గొడవలు, దుమారాలు వున్నాయి. ఇప్పుడు ఆ పుస్తకాలు బయట లభ్యమవుతాయో, లేదో తెలియదు కానీ , వీలైతే ఇంట్రెస్టింగ్ గా అనిపించినవి అప్పుడప్పుడూ టపాలుగా పెట్టడానికి ప్రయత్నిస్తాను. కాలం మర్చిపోలేని సాహితిమూర్తి లత.

లత రచనల గురించి నిడదవోలు మాలతి గారు తన బ్లాగ్ లో రాసిన సమగ్ర వ్యాసం ఇక్కడ చదవండి.

కల్పనారెంటాల

10 వ్యాఖ్యలు:

మాలతి said...

ఇలాటి కబుర్లే రచయతని పాఠకులఊహాలోకాల్లోంచి, వెలికి తీసి, ఆయనో ఆవిడో కూడా మనలాటి మనిషే అనిపించి, మరింత నమ్మదగ్గమనిషి అనుకోడానికి బలం ఇస్తాయి. నీజ్ఞాపకాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు, కల్పనా.
ఇంకా నీకు పరిచయమున్న రచయితలని ఇలాగే పరిచయం చేయగలవని ఆశిస్తూ..

సుజాత వేల్పూరి said...

మాలతి గారి బ్లాగ్ లో మీ వ్యాఖ్య చూశాక ఇక్కడ ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాను! లత లాంటి కొంతమంది పరిచయం కాకుండానే జీవితాలు గడిచిపోతున్నాయని తల్చుకుంటే దిగులుగా ఉంటుందొక్కోసారి.

చదువుతుంటేనే చాలా అడ్మైరింగ్ గా అనిపిస్తోంది ఆమె వ్యక్తిత్వం! అలా ముసుగుల్లేకుండా స్వేచ్ఛగా ఉంటే ఎంత మనశ్శాంతి!ఎంత ఆత్మ సంతృప్తి!

ఆమె విప్లవాత్మకమైన రచనా ధోరణి గురించి అక్కలు, అమ్మ చర్చించుకోవడం చిన్నప్పటి జ్ఞాపకం నాకు!

ఆమె రచనల గురించి రాసేటపుడు మీరైనా "పౌలస్త్యుని ప్రేమ కథ" గురించి రాస్తారని చూస్తాను.

Kalpana Rentala said...

మాలతి గారు, మీ ఆశీస్సులతో తప్పకుండా నాకు పరిచయమున్న రచయితల గురించి క్రమం తప్పక రాస్తాను.
సుజాతా, నిజమే ఆ ముందు తరం వాళ్ళకు వున్న ఆత్మ విశ్వాసం కూడా మన తరానికి కరువై పోతోందేమో అనిపిస్తుంటుంది ఒక్కోసారి. ముసుగులు ల్లేకుండా వుండగలగటం ఎంత అదృష్టమో కదా. “ పౌలస్ట్యూని ప్రేమ కథ “ గురించి ప్రయత్నించి తప్పక రాస్తాను.

కొత్త పాళీ said...

ఇటువంటి కథనాలకి వ్యాఖ్యలేమి రాయలేం. మనసు విప్పు మాతో పంచుకున్నందుకు .. థాంక్యూ! అనడం తప్ప.

మధురవాణి said...

మాలతి గారి వ్యాసంతోనే 'లత' అనే ఒక విలక్షణమైన రచయిత్రి గురించి మొదటిసారి తెలిసింది. మీ వ్యాసం ఆవిడ వ్యక్తిత్వాన్ని పరిచయం చేసింది. లత గారి గురించి మీరు వ్రాయబోయే మరిన్ని విభిన్న కోణాల కోసం ఎదురుచూస్తాను.

Kalpana Rentala said...

కొత్తపాళీ, థాంక్స్ ఫర్ ది థాంక్స్.
మధురవాణి గారు, తప్పకుండా. మీ నమ్మకాన్ని వొమ్ము చేయను.

భావన said...

బాగుంది కల్పన మీ జ్నాపకాల పేటిక నుంచి తీసిన మధుర జ్నాపకం. నా చిన్నప్పుడు అమ్మ వాళ్ళు మాట్లాడుకోవటం విన్న గుర్తు. లత గారి రచనల వివరాలతో ఇంకో టపా కోసం ఎదురు చూస్తాను.

Kalpana Rentala said...

భావన, లత గురించి రాయాల్సింది చాలా వుంది. లేనిదల్లా టైమ్ ఒక్కటే. తప్పకుండా రాస్తాను లతా గురించి. ముఖ్యం గా తన డైరీ లో విషయాల వల్ల మనకు అప్పటి విషయాలు చాలా తెలుస్తాయి. రచనల మీద మాలతి గారు సవివరమైన పరిచయం చేశారు. చదివారు కదా?

S said...

చాలా ఆసక్తికరంగా ఉన్నారండీ లత గారు! మీ అనుభవాలు పంచుకున్నందుకు చాలా థాంక్స్. మా లైబ్రరీలో కొన్ని పుస్తకాలు చూశాను ఆవిడవి. ఈసారెప్పుడన్నా వెళ్ళినప్పుడు చదవాలి.

పూర్వ ఫల్గుణి (poorva phalguni) said...

అబ్బ! ఎన్ని రోజులనుంచో అనుకుంటున్నాను. ఎవరన్నా లత గారి గురుంచి రాసి వుంటారేమో అని. మీ వ్యాసం చదివేసరికి నాకు చాల ఆనందం వేసింది. లత నిజంగా ఆవిడ మణి పూసే! ఆవిడ నవలలో 'మోహన వంశి' ఉమర్ ఖయ్యం. ఈ రెండు నా మనసును ఆకట్టుకోన్నవి.
ఒక మాటలో చెప్పాలంటే అవి చదివిన తరువాత ఇంక ఎందుకీ జీవితం, చచ్చి పోదాము అనిపిన్స్తుంది. భాద ఏమిటింటే ఆవిడ పుస్తకాలు ఇప్పుడు దొరకటం లేదు.
ఆవిడ లాస్ట్ ఇంటర్వ్యూ నేను కూడా చూసాను.
అలాగే ఆవిడ పిల్లనగ్రోవి మీద ఒక కధ రాసారు. అది కూడా ఎంత బావుంటుందో!

మణి వడ్లమాని.

 
Real Time Web Analytics