నేనొక వరూధినిని
భీతహరిణేక్షణను, తిరస్కృతను!
వలచిన నేరానికి
దగాపడ్డ వెలయాలిని!
హిమవత్పర్వత సాక్షిగా
దక్కింది నిర్నిద్ర వేదనే!
వలచి వచ్చిన వనితల్ని
మోసగించే మాయప్రవరుల వారసులే మనువులు!
*****
నేనొక శకుంతలను!శాపగ్రస్తను!
ఓ మగవాడి అవ్యక్త స్మృతిని!
నేను మినహా అన్ని గుర్తున్న అతను
అతను వినా మరేమి గుర్తు లేని నేను
ఇద్దరి నిరవధిక సుఖవారాశికి
మనఃప్రకృతే మౌనసాక్షి!
అభిజ్ఞానం తప్ప మగని ఆదరణ పొందలేనిదాన్ని!
******
నేను పంచభర్తృక ద్రౌపదిని
అర్జునుణ్ణి వలచి అయిదు ముక్కలైనదాన్ని
మగవాడి మాయాజూదంలో ఓ పణాన్ని
నిండు కొలువులో నిలువెత్తు పరాభవం
ఇల్లాలితనమే లేదన్న ధర్మసూనుడు
వంతుల కాపురానికి మిగిలింది
జీవన నటనా విషాదం!
*****
నేను యయాతి పుత్రికను మాధవిని
దురహంకార పురుషజాతి ఆస్తిని
నియోగినిని!నిలువెత్తు సౌందర్యరాశిని!
నలుగురితో సంసారం
నాకు మాత్రం నగుబాటు కాదట
నాది క్షాత్రధర్మమట
నాలుగు పసిమొక్కల క్షేత్రధర్మమట
నిత్య యవ్వనకన్యనట
అకటా!
మగువ మనసు తెలియని వీరా
మహరాజులు!మహర్షులు!మగవారు!
*****
కనుదోయిపై కలల నీలి నీడలు
కాలం చెప్పిన కధల్లో
అందరూ దుఃఖభాగినులే
ఈ స్త్రీపర్వమంతా దుఃఖస్మృతుల దొంతర!
****
ఇప్పుడు నేను మానవిని
అవ్యక్తనూ, పరిత్యక్తనూ కాను
అయోనిజనో, అహల్యనో కాబోను
వంచిత శకుంతల వారసురాలిని అసలే కాను
స్త్రీత్వపు కొలమానం గానే మిగలనింక
నేను అపరాజితను
కనిపించని సంకెళ్ళను ఛేదించే కాళిని
సస్యక్షేత్రాన్నే కాదు, యుద్ధ క్షేత్రాన్ని
సిగ్గుతో చీలిపోయిన భూమిని నేనే
నెర్రెలు విచ్చిన నేలను విశాలమైన బాహువులతో కప్పే ఆకాశాన్ని నేనే!
కల్పనారెంటాల
10 వ్యాఖ్యలు:
సరైన సమయంలో సందర్భోచిత కవిత. చాలా బాగుంది. ఎన్ని ప్రశ్నలున్నాయో!!!
really great
చరిత్ర
తవ్వి తలకెత్తుకున్న
ఘనచరిత్ర
కుష్టురోగి కాయంలా
కంపుకొడుతోంది.
రేపటి తరంతో
రమింపజేయటానికి
మోసుకెళుతున్నాం
ఈ పాతివ్రత్య భారాన్ని
దుర్గంధం భరించటం
కష్టంగా ఉంది
అత్తరుబుడ్డి ఇచ్చి
అగరొత్తులు
వెలిగిస్తారా ఎవరైనా?
నేను అపరాజితను
మా అమ్మాయి పేరది.
అంతకు మించి మీ కవితతో ఏకీభవించటానికి మరేముంటుంది?
wonderful
bollojubaba
కల్పనా మీ కవిత బావుంది నా కనులు చెమ్మగిల్లేలా!
ఎంత స్పష్టంగా వివరించారండి స్త్రీ పై యుగయుగాల దారుణ మోసకాండను.
అధ్భుతం!!!
కవితా నచ్చిందని చెప్పినవారికి పేరు పేరునా కృతజ్నతలు.అయితే ఒక చిన్న వివరణ. ఈ కవితా ఇప్పుడు ఈ గొడవకు సంబంధించి రాసినది కాదు. ఈ కవిత రాసి చాలా ఏళ్లు అయింది. అలాగే ఇది నా పాత బ్లాగ్ లో కూడా ప్రచురితమైంది. ద్రౌపాదాయణం జరుగుతోంది కదా సందర్భోచితం గా వుంటుందని మళ్ళీ పెట్టాను.
కల్పన, "ఎవ్వతెవీవు?" అలా అడిగిన సమాజమే, నీవొక అబలవీ అని అన్నది. అందుకే నేనిలా వ్రాసుకున్నాను - http://maruvam.blogspot.com/2009/05/blog-post_29.html
నా ఆలోచనలవి అంతే. అది కూడా మునుపటి రచనే...
చాలా బాగుంది కల్పన. హ్మ్మ్... జీవితపు అనేక పార్శ్వాలలో వంచిత ఐన స్త్రీ మనసుకు అద్దం పట్టేరు.
భావన, ఉషా కవితా నచ్చినందుకు థాంక్స్. ఉషా, మీ కవితా చదివాను.
Post a Comment