నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Sunday, January 17, 2010

కథా శిల్పి చాసో కథ ‘ కుంకుడాకు ‘


కథానుభవం-3

కవిగా సాహిత్య జీవితాన్ని ప్రారంభించి కథాశిల్పిగా ప్రసిధ్ధికెక్కిన రచయిత చా.సో. - చాగంటి సోమయాజులు 1915 జనవరి 17 న శ్రీకాకుళం లో జన్మించారు. ఆచార్య రోణంకి అప్పలస్వామి గారి సాహచర్యంతో ప్రభావితులై చాసో సాహిత్యం వైపు దృష్టి మళ్ళించారు. ఆంగ్ల సాహిత్యంతో పాటు మార్స్కిజాన్ని కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేశారు చాసో. అరసం –అభ్యుదయ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు. తర్వాత అరసం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. విజయనగరంలో చాసో వారి ఇల్లు శ్రీశ్రీ, నారాయణ బాబు, ఆరుద్ర మొదలైన రచయతలందరికీ సాహిత్య చర్చా వేదిక గా వుండేది. అరసం తాలూకు చర్చలు, ఎందరో రచయితలతో సమావేశాలు ఆ ఇంట్లో జరిగేవని చెపుతుంటారు. ఆరుద్ర తన గురువు గారైన చాసో గురించి “ విశ్వ సాహిత్యంలో ఏ ప్రధమ శ్రేణి రచయిత కు తీసిపోని కథానికా శిల్పం ఆయన సొత్తు “ అని ప్రశంసించారు.

చాసో అనగానే ఎక్కువమంది కథాప్రియులకు గుర్తొచ్చే కథ వాయులీనం ‘. ఈ మధ్యకాలంలో నేను చదివిన చాసో కథలు ఏలూరెళ్ళాలి,’ ఊహా ఊర్వశి’, కర్మ సిధ్ధాంతమ్ ,’ కుంకుడాకు ‘. చాసో రాసిన కథలు దాదాపు అరవై లోపే వుంటాయట. ఆంగ్ల సాహిత్యాన్ని క్షుణ్ణంగా చదివినా ఆయనవన్నీ అచ్చ తెనుగు కథలు. ఇంగ్లీష్ రచయితల ప్రభావం శైలి లోనూ, శిల్పం లోనూ వుందేమో కానీ ఇతివృత్తం లోనూ, పాత్రల స్వరూపాల్లోనో లేశ మాత్రమైనా కనిపించదు. ఆయన కథల్లో ఆర్ధిక అంశాల చుట్టూ అల్లుకున్న మనుష్యుల చిత్రవిచిత్ర మనస్తత్వాల చిత్రీకరణ కనిపిస్తుంది. కానీ ఆయన కథల్లో ఆశ్చర్యపరిచే మరో గుణం కథల్లో ఎక్కడా రచయిత టోన్ వినిపించదు. కథ అచ్చంగా కథ లా వుంటుంది.కథని శిల్పంలా చెక్కుతాడు. ఎక్కడా అనవసర సంభాషణలు, వర్ణనలు వుండవు.

నేను చదివిన కుంకుడాకు కథ 1943 లో అరసం రచయితల తొలి సభాసంచికలో ప్రచురితమైన కథ. 1985 లో చాసో సప్తతి సందర్భంగా (ఆయనకు 70 ఏళ్ళ సందర్భంగా) కళింగ కథల సంకలనం ఆయన తన సొంత ఖర్చుతో ప్రచురించారు. గురజాడ వారి ప్రాంతానికి, అంటే కళింగ ప్రాంతానికి చెందిన కథకుల సంకలనం “ కళింగ కథానికలు” పేరిట చాసో ప్రచురించారు. ఆ సంకలనంలోని కథలు చాసో తన భావాలకు అనుగుణంగా ఏర్చి కూర్చినవి. “ ఈ కథ నేను రాస్తే ఎంత బావుణ్ణు” అనే భావం కలిగించిన కథలను ఎంపిక చేసుకున్నానని ఆయన తన ముందు మాటలో చెప్పుకున్నారు. అంటే అది కేవలం ఆయన వ్యక్తిగత ఇష్టాలతో కూడుకున్న సంకలనం అన్న మాట. అందులో ఆయన తన కథ కుంకుడాకు ను ఎంపిక చేసుకున్నారు. ఆ రకంగా అది ఆయనకు నచ్చిన కథ కాబోలు అనుకున్నాను. అంటే కాదు ఆ ముందు మాటలో ఆయన ఇంకో మంచి మాట అన్నారు “ నేను కథా రచనా నేర్చిన రీతిలో ఈ సంకలనాన్ని రూపు దిద్ది యువతరానికి అందిస్తున్నాను. యువతరం కోసమే ఈ సంకలనం” అని చెప్పారు.

ఇక కుంకుడాకు కథ గురించి...ఇందులో వర్గ దోపిడీ లాంటి పడికట్టు పదాలు ఏవీ వుండవు. కానీ కథ మాత్రం అందుకు సంబందించిందే. ఇద్దరు బాలికలు. అందులో ఒకమ్మాయి వయస్సు ఎనిమిదేళ్ళు. రెండో అమ్మాయి వయస్సు చెప్పరు.ఇద్దరూ పొలాల్లోకి వెళ్తారు. ఒకమ్మాయి మోతుబరి రైతు కూతురు. కొంచెం హోదా వున్నది. రెండో అమ్మాయి కూలివాడి కూతురు. రైతు కూతురు పారమ్మ చింకి పరికిణి కట్టుకుంటే, కూలి కూతురు గవిరి గోచి కట్టుకుంది. పారమ్మ ఊరగాయ తింటే , గవిరి ఇంట్లో పొయ్యి లేవక పస్తు వుంది. నెత్తి మీద కొండంత సంసార భారం పెట్టుకున్న గవిరి ఆకు, అలమా, కర్ర ఏరుకుంటుంటే పారమ్మ పట్టుబడతాన్న భయం లేకుండా పక్క పొలంలో పెసరకాయలు తెంపుకొని తింటుంది. ఎందుకంటే ఆ పిల్ల అప్పలనాయుడు బొట్టి. అదే పని గవిరి చేస్తే అది పెద్ద నేరమవుతుంది. అందుకని రాత్రంతా తిండి లేక కడుపు కాలుతున్నా పారమ్మ చేసిన పని గవిరి చేయలేకపోయింది. కుంకుడాకు చూడగానే గవిరి ఆకలి కూడా మర్చిపోగలిగింది. ఎందుకంటే కుంకుడాకులు దళసరివి. నాలుగాకులు ఎరితే తట్ట నిండుతుందని గవిరి ఆశ. కుంకుడాకులు గంపకెట్టుకొని ఇద్దరూ కాంభుక్తా కళ్ళాం వార పోతుండగా సింత కాయాలు కనిపించాయి. పాపం అవి తినాలని గవిరి రాళ్ళు విసురుతుంటే కాంభుక్తా వచ్చేశాడు. గవిరి తట్టని కిందపడేసి అక్కడ కనిపించిన పేడ ని కూడా అదే దొంగతనం చేస్తోందని అనుమానించి దాన్ని చెప్పు తో కొట్టి గవిరి కిందపడి ఏడుస్తుంటే తృప్తీగా వెళ్ళిపోయాడు. చెయ్యని తప్పు కి నెత్తి నోరు కొట్టుకొని చెప్పినా వినకపోతే, వూరంతా భయపడే కాంభుక్తా ని బూతులతో తిట్టడం ప్రారంభించింది గవిరి. లమిడీ కొడకా! నీ సింత కంప లెవిడికి అక్కరనేదు అనుకుంటూ కుంకుడాకు ని కూడదీసి తట్టకెత్తి ఇంటికి బయలుదేరింది. గవిరి, పారమ్మ పొలాల్లోకి వెళ్తున్నప్పుడు పక్కనున్న స్కూల్లో పిల్లలు తల్లీ నిన్ను దలంచి, సరస్వతీ నమస్తుభ్యం పాడుతున్నారు. గవిరి ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు ఆ పిల్లలు ఎక్కాలు వల్లే వేస్తున్నారు. అంతే కథ.

కథ చిన్నదే. విషయం మాత్రం పెద్దది. డబ్బున్నవాడు తప్పులు చేస్తే తప్పించుకోగలటం. పేదవాడు చిన్న చిన్న తప్పులకు పెద్ద శిక్షలు అనుభవించటం అనే అంశాన్ని ఇద్దరు పిల్లల వైపు నుండి రచయిత చూపించాడు. ఇక స్కూల్ పిల్లల ప్రస్తావన మామూలుగా చూస్తే కథ కి అనవసరం గా కనిపిస్తుంది. కానీ, ముందే చెప్పినట్లు రచయత అనవసరమైనవేమీ కథ లో చూపించడు . గవిరి వయస్సు పిల్లలు బళ్ళో చదువుకుంటూ పాఠాలు నేర్చుకుంటున్నారు. ఆ చదువు సమాజంలో బతకటానికి పనికివస్తుందని మనందరి నమ్మకం. కానీ పేదవాళ్ళు జీవితం నుంచి బతుకు పాఠం నేర్చుకుంటారని చెప్పాడు రచయిత ఈ కథ ద్వారా. తప్పు చేయలేదని కాంభుక్తా కి నెమ్మదిగా చెప్పింది గవిరి. వినలేదు. అతడ్ని బూతులతో తిట్టటానికి కూడా వెనకాడలేదు. అలాగే అతని చింత కంపల్ని ఇవెవడికి కావాలి అని తిరస్కరించి తన అభిమానాన్ని చాటుకుంది. ఎవరి సొత్తు కానీ కుంకుడాకు ని ఏరుకుంది. రైతు కూతురు అయివుండి పారమ్మ పొలంలో పెసరకాయలు తిని పబ్బం గడుపుకుంది. డబ్బు తక్కువైనా, పేదవాడు గుణానికి మిన్న అని కూడా అర్ధమవుతుంది. అభ్యుదయాన్ని కాంక్షిస్తూ , మార్స్కిజాన్ని నమ్మిన రచయిత చాసో సామాజిక అవగాహనకు అద్దం పట్టే కథ ఇది.

ఎప్పటినుంచో మాట్లాడాలనుకుంటున్న చాసో ఏలూరెళ్ళాలి కథ గురించి మరో సారి....

( జనవరి 17 చాసో 95వ పుట్టినరోజు సందర్భంగా...)

కల్పనారెంటాల



12 వ్యాఖ్యలు:

మాలతి said...

ఎప్పటిలాగే చాలామంచి విశ్లేషణ. నీవ్యాసం చూసింతరవాత గుర్తొచ్చింది. ఈకథ నేను చదివేను కానీ మార్క్సిజం ఆలోచనలు రాలేదు. థాంక్స్.

కెక్యూబ్ వర్మ said...

బాగా విశ్లేశి౦చారు. ఆయన కథా శైలిలో చెహోవ్ కు ఏమాత్రం తీసిపోరు. చిన్న చిన్న కథల్లోనే విషయాన్ని ఎలా చెప్పొచ్చో రాసి చూపిన కథకుడు చాసో. ఆయన అ౦ది౦చిన రచనా వారసత్వాన్ని పరిచయం చేసిన౦దుకు ధన్యవాదాలు.

Anonymous said...
This comment has been removed by a blog administrator.
కాజ సురేష్ said...

చక్కటి కథ గుర్తు చేసినందుక ధన్యవాదాలు. ఎప్పుడో చదివాను. ఆ పుస్తకము కోసము వెతుకుతుంటే దొరకటంలేదు. ఎవరికి ఇచ్చానో ఏమో!!

ఏలూరెళ్ళాలి.. తనకు తెలియకుండా పుట్టిన కొడుకు గురించి సడన్ గా వచ్చే ప్రేమ గురించి అన్నట్టు గుర్తు..

ప్రేరణ... said...

మంచి విశ్లేషణ....good one.

Vasu said...

పరిచయం (నేనసల చాసో గురించి కనీ, ఈ కథ గురించి కానీ వినలేదు కనుక పరిచయమే ) బావుంది.

Kalpana Rentala said...

మాలతి, వర్మ, వాసు, ప్రేరణ, సురేశ్.. వ్యాసం చదివి మీ అభిప్రాయం చెప్పినందుకు థాంక్స్.
ఏలూరెళ్ళాలి కధ కొంచెం భిన్నమైన కథ . ఇతివృత్తపరంగా, శైలి పరం గా కూడా. ఎవరైనా చదువుతామంటే స్కానేడ్ కాపీ పెడతాను. అప్పుడు మాట్లాడుకోవచ్చు.

సుజాత వేల్పూరి said...

ఈ లెక్కన ఇదొక్కటే ఏం సరిపోతుంది? మీరు ఏలూరెళ్లాలి మాత్రమే కాదు, కర్మ సిద్ధాంతం గురించి, ఏకరువు గురించీ, ఊహా ఊర్వశి గురించి, భల్లూకం గురించీ ఇలా బోలెడన్ని కథల గురించి కూడా రాయాలి. ఏ కథ తక్కువ? ఇలాంటి కథల్ని మళ్ళీ ఎవరైనా సృష్టించగలరా అని దిగులేస్తుంది ఒక్కోసారి! ఇవి కథలా స్కెచ్ లా అని ఆశ్చర్యం వేస్తుంది మరో సారి! అంత అలవోగ్గా ఎలా రాయగలరా అని అబ్బురంగా అనిపిస్తుంది ఎన్నో సార్లు.

కుంకుడాకు కథని సింగిల్ ఎపిసోడ్ నాటిక గా దూరదర్శన్ లో వేశారు ఒక సారి. నాకు నచ్చ్చలేదు. సరిగ్గా తీసారా లేదా అన్నది పక్కన పెడితే, మనసుకు ఎంతగానో నచ్చి ఒక గాఢమైన ముద్ర వేసుకున్న కథల్ని ఎంత చక్కగా తెరకెక్కించినా ఇంకా ఏదో లోపించిందనే అసంతృప్తి. ఆ ఎపిసోడ్ నాకు నచ్చకపోవడానికి బహుశా ఇదే కారణం.

కరమ సిద్ధాంతం కూడా ఒక అద్భుతమైన కథ! ఎందుకు పారేస్తాను నాన్నా, బబ్బబ్బా ఇలాంటి కథల్లో ఆవిష్కృతమైన బాల్యం ఇంకెక్కడా చూడలేదు నేను.

రమణ said...

మంచి వ్యాసం. చాసో గారివి కర్మ సిద్ధాంతం, ఎంపు కధలు, దుమ్ములగొండి చదివాను. ఈ కధ చదవలేదు. ఈ సారి గ్రంధాలయానికి వెళ్ళినపుడు చదువుతాను. ఇప్పటి వరకు చాసో గారి కధల్లో నేను చదివిన వాటిలో 'ఎంపు' ఉత్తమ కధ అనిపించింది.

Kalpana Rentala said...

సుజాత, నాకు కూడా రాయాలనే వుంది. కాకపోతే మిమ్మల్ని మరీ ఎక్కువ కథల గురించి చెప్పి బోరు కొట్టిస్తున్నానేమోనని సంకోచం తో కాస్త ఆగుతున్నాను. నిజమే. కదా. అంత అలవోకగా ఆ తరం వాళ్ళు అన్నేసి మంచి కథలు ఎలా రాయగలిగారా? అని ఆశ్చర్యపోతూనే వుంటాను నేను కూడా. ఇప్పటికీ అంత బాగానూ, అంత విస్తృతంగానూ మంచి కథలు రాస్తున్న వాళ్ళలో మాలతి గారు ఒకరు.
కుంకుడాకే కథ ఎంత మంచి కథనైనా చెడగొట్టగలిగే నైపుణ్యం దూరదర్శన్ వాళ్ళకు వుంది. అది మాత్రం నిజం. అమరావతి కథలు కూడా తీసి పుణ్యం కట్టుకున్నట్లు వున్నారు కదా వాళ్ళు. మరి సుజాత మీరు ఎందుకు పారేస్తాను నాన్నా కథ గురించి రాయండి.
వెంకట రమణ గారు, మీరు ఎంపు కథ గురించి రాయవచ్చు కదా. ఆ రకంగా అందరమూ తలాఒక కథ తీసుకొని చర్చిస్తే బావుంటుంది.
మాలతి గారు, మేమందరమూ ఒకొక్క కథ గురించి రాస్తాము. మీరేమో , మరేమో, అన్నీ కథల గురించి కలిపి రాస్తారన్నమాట....ఏమంటారు?

మాలా కుమార్ said...

ఈ మధ్య స్వాతి లో " ఈ టైం మీకోసం " రాసిన కల్పనా రెంటాల మీరేనాండి ?

తెలుగు వెబ్ మీడియా said...

కెక్యూబ్ వర్మ గారు సాహిత్య అవలోకనం ద్వారా ఆంటోన్ చెహోవ్ గురించి పరిచయం చేశారు. నిన్ననే నేను విశాలాంధ్రలో ఆంటోన్ చెహోవ్ కథలు కొన్నాను. సోమయాజులు గారి కథలు మాత్రం దొరకలేదు.

 
Real Time Web Analytics