నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Friday, January 22, 2010

నువ్వు తిరిగి రాకూడదా శరత్!


శరత్. ఈ పేరు వినగానే, అతని సాహిత్యం గుర్తుకు రాగానే మనసంతా ఓ రకమైన ఉద్వేగానికి లోనవుతుంది.అతను పరాయీ రాష్ట్రం వాడు అన్న భావన ఊహా మాత్రంగానైనా రాదు. బెంగాలీ రస గుల్లాల కంటే శరత్ సాహిత్యమంటేనే భారతీయులకు ఎక్కువ ఇష్టం అని హాయిగా, గట్టిగా పైకి చెప్పాలనిపిస్తుంది. రచయిత అంటే గౌరవంతోనో, అభిమానంతోనో నమస్కరించటం వేరు. ప్రేమతో అతన్ని హృదయంలో దాచుకోవడం వేరు. నాకొక్కరికే కాదు, వేన వేల మందికి అలా హృదయానికి దగ్గరైన రచయిత శరత్. భాషా భేదం లేకుండా భారతీయులందరికీ అభిమానమైన రచయితల్లో అగ్రగణ్యులు రవీంద్రనాథ్ టాగూర్, శరత్చంద్ర చటర్జి. తెలుగు వారు విపరీతంగా ఆరాధించిన రెండు పేర్లలో ఒకటి శరత్. రెండోది వంశీ ( లత మోహన వంశీ ప్రభావం) . ఒకటి, రెండు దశాబ్దాలు అదేదో ఒక ఉద్యమంలా పిల్లల పేర్ల దగ్గర నుంచి, రోడ్డు మీద షాపుల పేర్ల దాకా ఎటు చూసినా శరత్ అనో, వంశీ అనో కనిపించేవి.

శరత్ అంటే దేవదాస్ గుర్తుకు వస్తాడు సాహిత్యంతో ఏ మాత్రం పరిచయం లేనివారికైనా. నాకైతే అతని రచనలన్నీ ఒకదానికొకటీ పోటీ పడి నచ్చేస్తాయి.మరీ ముఖ్యం గా శ్రీకాంత్, శేషప్రశ్న. శ్రీకాంత్ లో రాజ్యలక్ష్మి, శేషప్రశ్న లో కమల గురించి ఎన్ని సార్లు చదివినా, మాట్లాడినా విసుగు పుట్టదు. శ్రీకాంత్ చదువుతున్నంతసేపు అది మనఆరాధ్య రచయిత శరత్ బాబేనని, శరత్ ఆత్మకధనే మనం శ్రీకాంత్ గా చదువుతున్నామని అనిపిస్తుంటుంది.” శ్రీకాంత్ నవల రాసేటప్పుడు తానేప్పుడు అలిసిపోలేదని, పైగా, ఎప్పుడైనా నిస్సత్తువుగా అనిపిస్తే, ఈ నవలలో ఒకటి రెండు భాగాలు రాసేవాడినని “శరత్ ఎక్కడో ఒక సారి చెప్పారట. సామాన్యంగా రచయిత కి నచ్చిన తన కధో, కవితో, నవలో , పాఠకులకు అంతగా నచ్చకపోవచ్చు. లేదా దానికి పూర్తి భిన్నంగా కూడా జరగవచ్చు. పాఠకులకు బాగా నచ్చినది రచయిత కి అంత గొప్ప ఆనందాన్ని ఇవ్వలేకపోవచ్చు.కానీ శ్రీకాంత్ అటు రచయిత కి, ఇటు పాఠకులకు కూడా బాగా నచ్చిన పుస్తకం. ఈ నవల ఫ్రెంచ్ లోకి అనువాదమై నడిబజారులో అనేక కాపీలు అమ్ముడుపోయిందట. శ్రీకాంత్ నవల ఉత్తమ పురుష లో సాగుతుంది. నాలుగు భాగాల నవల చదవటం పూర్తి అయినా మనకు ఇంకా శ్రీకాంత్ గురించి తెలిసినట్లు అనిపించదు. ఇంకా ఏదో మనం శ్రీకాంత్ గురించి తెలుసుకోవాల్సి వుంది అన్న ఫీలింగ్ కలుగుతుంది. అంటే నవల అసంపూర్తి గా వున్నట్లు గా కాదు. మనకు శ్రీకాంత్ మీద కలిగే ప్రేమ కొద్దీ అతని గురించి ఇంకా వినాలని, చదవాలని, తెలుసుకోవాలని అనిపించటం.

శరత్ స్త్రీ పాత్రలు, చలం స్త్రీ పాత్రలు పూర్తిగా ఒకరికొకరు భిన్నమైన వారు. శరత్ రచనల్లోని స్త్రీలు వితంతువులు, అభాగినులు,శ్రీ శ్రీ మాటల్లో బాధా సర్పద్రష్టలు. అలాగని శరత్ స్త్రీ పాత్రలు బలహీనమైన వారు కాదు. నెమ్మదిగా, మృదువుగా మాట్లాడుతూనే తమ బలమైన వ్యక్తిత్వాలను నిలుపుకునే స్త్రీలను సృజించిన శరత్ ని స్త్రీ, పురుషులు సమానంగా ప్రేమించారు. శరత్ నవలలు చదివాక అతని స్త్రీ పాత్రలతో పాటు అతని నవలల్లోని కథానాయకులంటే కూడా అంతే ప్రేమ పుట్టుకువస్తుంది. శరత్ సాహిత్యాన్ని చదివిన స్త్రీలకు అతనొక రహస్య స్నేహితుడు. ప్రేమికుడు.అది కేవలం అతని అక్షరాల మీద ప్రేమ కాదు. అతని మనస్సు అంతా వొంపి అతను సృజించిన సాహిత్యాన్ని ప్రేమించటం . అతను, అతని సాహిత్యం రెండూ వేర్వేరు కావు. అది మొత్తం కలిపి ఒకటే ప్రపంచం అనిపిస్తుంది. ఒక్కోసారి ఆ నవలలు, స్త్రీ, పురుష పాత్రలు అన్నీ కలగలిసిపోయి శరత్చంద్రుడు గా దర్శనమిచ్చేవాడు. ఒకటే మనిషి స్త్రీగా, పురుషుడిగా, రకరకాల పుస్తకాలుగా అవతారమెత్తాడు కాబోలు అనుకునేదాన్ని. ఆ రకంగా శరత్ నా యవ్వనవనంలో ఒక రహస్య స్నేహితుడయ్యాడు. ఎప్పుడో అప్పుడు బెంగాల్ వెళ్తానని, అక్కడ తెల్లని కుర్తా, పైజమా వేసుకొని వొత్తైన జుట్టుతో ఒక అందమైన బెంగాలీ బాబు కనిపించి నన్ను ప్రేమిస్తాడని రకరకాల ఊసులాడుకునేదాన్ని. ఇప్పటికీ అచ్చమైన బెంగాలీ బాబు అంటే ఒకే ఒక్క శరత్ మాత్రమే అనిపిస్తుంటుంది నాకు.

సరే, శరత్ పుస్తకాలతో రహస్య ప్రణయం గురించి కాసేపు పక్కనపెట్టి శరత్ జీవితం లోకి వెళితే...

శరత్ కి తెలిసినంతగా పేదరికం గురించి మరే రచయిత కు తెలీదు. (తెలుగు రచయితల విషయానికి వస్తే కథకుడు శారద గా పేరుపడ్డ నటరాజన్ కి). ఆ పేదరికం కేవలం భౌతికమైనదే కాదు, దానికున్న అనేకానేక మానసిక కోణాల నుంచి కూడా అతనికి పేదరికం గురించి సమగ్రంగా తెలుసు. సెప్టెంబర్ 15, 1933 తన 57 వ పుట్టినరోజు సందర్భంగా జరిగిన సమావేశం లో మాట్లాడుతూ శరత్ “ నేను తీర్చుకోవాల్సిన ఈ సాహిత్య రుణం కేవలం నా పూర్వీకుల కోసమే కాదు. అణగారిన, సాధారణ ప్రజలకు నేనెప్పటికీ రుణపడి వుంటాను. వాళ్ళు ఈ సమాజానికి అన్నీ ఇచ్చారు. అయినా ఎలాంటి ప్రతిఫలం పొందలేదు. బలహీనమైన , అట్టడుగు వర్గాల ప్రజల కన్నీళ్ళు ఎవరికీ పట్టవు. వారి గురించి ఎవరూ ఒక్క క్షణం కూడా ఆలోచించరు. నన్ను వారి తరఫున మాట్లాడించేలా చేసింది వారే. వారి పక్షాన నిలబడి వాదించేలా వారు నన్ను ఉత్తేజితుల్ని చేశారు. ఈ ప్రజలకు జరిగే నిరంతర అన్యాయాల్ని నేను కళ్ళారా చూసాను. ఈ ప్రపంచంలో ఎప్పుడో అప్పుడు తన సౌందర్య శోభతో, సంపదతో , తన తియ్యని గాలులు, వికసించిన పుష్పాలతో, కోయిల పాట తో వసంతం వస్తుంది. కానీ ఆ సుందర విషయాలన్నీ నా పరిధిలో లేనివి. నాకు అందని విషయాలు.ఈ పేదరికమే నా రచనలకు ప్రాణం” అన్నారు.

శరత్ తన సాహిత్యానికి కావాల్సిన ముడి సరుకును చరిత్రపుటల్లోంచి తవ్వి తీసుకోలేదు. తన రోజూ వారీ పల్లె జీవితం నుండి, తనకు తెలిసిన వ్యక్తులను, అనుభవాలను, సంఘర్షణలని తన పాత్రలుగా మలుచుకున్నాడు. బెంగాలీ సాహిత్యంలో మేరునగం లాంటి టాగూర్ ప్రభావం పడకుండా దూరంగా వుండి రాయగలిగాడు. శరత్ రాయడం మొదలుపెట్టిన తొలిదినాల్లో , కలం పేరుతో టాగూర్ రాసేడని అనుమానించారు కూడా. ఎలాంటి సంస్కృత భాషాడంబరం లేకుండా శరత్ అచ్చమైన , అందమైన బెంగాలీ పదాలు వాడాడని బెంగాలీలు శరత్ ని మెచ్చుకుంటారు. ఆ రోజుల్లో అది పెద్ద విప్లవాత్మకమైన కొత్తదనం. ఆ సంప్రదాయానికి ఆద్యుడు శరత్ కాదు. బంకిమ్ చంద్ర చట్టోపాధ్యాయ ప్రభావంతో మాత్రమే శరత్ అలా చేయగలిగాడు.

శరత్ చంద్ర చటెర్జీ పశ్చిమ బెంగాల్ లోని హుగ్లీ జిల్లాలోని దేవానంద్పూర్ గ్రామంలో సెప్టెంబర్ 15, 1876 న జన్మించారు. కుటుంబ ఆర్ధిక పరిస్థితుల్లో తరచూ వచ్చే మార్పుల వల్ల శరత్ స్కూల్ జీవితం కూడా అనేక మార్పులు వచ్చాయి.

“ నా చిన్నతనం, యవ్వనం రెండూ కూడా అత్యంత పేదరికంలో గడిచాయి. ఆర్ధిక అవసరాల కోసం నేను ఎలాంటి విద్యను నేర్చుకోలేదు. మా నాన్న నుండి నేను వారసత్వం గా పొందింది రెండు విషయాలను. ఒకటి ఎప్పటికీ అలసిపోని ఆయన ఉత్సాహం, స్ఫూర్తి. రెండోది ఆయన సాహిత్య జిజ్ణాస. ఆ నిరంతర ఉత్సాహం నన్నొక దేశ దిమ్మరిగా భారతదేశం అంతా పర్యటించేలా చేస్తే, ఆయన సాహితీ జిజ్ణాస నా జీవితమంతా నన్నొక స్వాప్నికుడిగా మిగిల్చింది” అంటారు. కాలేజీలో శరత్ ఇంగ్లీష్ సాహిత్యం చదువుకున్నారు. అందులో భాగం గా చార్లెస్ డికేన్స్ లాంటి మహా రచయితలను చదువుకున్నా తన నిజమైన స్ఫూర్తి తన తండ్రి అసంపూర్తి, అముద్రిత రచనలే అని చెప్పుకునేవారు శరత్. వాటిని చదువుతూ, వాటిని తానే పూర్తి చేస్తూ, తన రచనా వ్యాసంగాన్ని శరత్ మెరుగులు దిద్దుకున్నారు. శరత్ తండ్రి బాగా చదువుకున్న పండితుడు. ఆయన చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు. కధలు, నవలలు, నాటికలు, కవిత్వం అన్నీ వ్రాశారు. కానీ ఏదీ కూడా పూర్తి చేయలేదు. అన్నీ అసంపూర్తి గా వదిలేశారు. ఆ అసంపూర్తి సాహిత్యం శరత్ ని నిరంతరం వెంటాడేది. ఏ అర్ధరాత్రో లేచి కూర్చొని వాటికి ముగింపు ఇచ్చి వుంటే అవి ఎలా తయారై వుండేవో ఆలోచిస్తూ వుండేవారు. ఆ ఆలోచనల వల్లే శరత్ తనకు 17 ఏళ్ళ వయసున్నప్పుడే చిన్న చిన్న కథలు రాయటం ప్రారంభించారు. తల్లి చనిపోవటం తో శరత్ కాలేజీ చదువు ఆపేసి భాగల్పూర్ కి మకాం మార్చాల్సి వచ్చింది. శరత్ రాయడమే కాదు, పాడేవారు, నటించేవారు. ఫ్లూట్, తబలా వాయించేవారు. మంచి ఆటగాడు కూడా.యువకుడైన శరత్ సున్నిత మనస్కుడు. తండ్రితో వచ్చిన విభేదాల కారణంగా ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. వొంటరితనం, అసంతృప్తి, దుఃఖం ఇవన్నీ శరత్ ని బాధపెట్టినా అతని లోని సాహిత్య ప్రేమను ఏమీ చేయలేకపోయాయి. పగలు, రాత్రి అకారణంగా శ్మశానాల వెంబడి తిరుగుతూ వుండేవాడు. తండ్రి మరణం తో ఆయన అంత్యక్రియలు పూర్తి చేశాక కలకత్తా చేరుకొని అక్కడొక హిందీ పేపర్ లో నెలకు రూ.30 ల జీతం పై అనువాదకుడిగా ఉద్యోగం ప్రారంభించారు.

మంచి ఆర్ధికపరమైన భవిష్యత్తు కోసం రంగూన్ వెళ్ళటానికి ముందు ‘ కుంతలీన ‘ సాహిత్య పోటీల కోసం తన చిన్న కథ ‘ మందిర్ ‘ ని పంపించారు. ఇలాంటి పోటీల పట్ల శరత్ కి వ్యక్తిగతం గా ఎలాంటి ఆసక్తి లేకపోయినా స్నేహితుల బలవంతం మీద సురేంద్రనాథ్ గంగూలీ అనే పేరుతో పోటీ కి తన కథ పంపారు. 150 కథల్లో మందిర్ ఉత్తమమైనది గా ఎంపికైంది. అదే శరత్ అచ్చైన మొదటి కథ. అనిల, అనుపమ పేర్లతో చాలా కాలం శరత్ తన కథల్ని ప్రచురణకు పంపేవారు. అలా వేరే పేర్లతో ఎందుకు పంపవలసి వచ్చిందో కారణం మాత్రం మనకు తెలియదు.

చిన్నతనం నుండే రాయడం మొదలుపెట్టిన శరత్ మధ్యలో 18 ఏళ్ళ పాటు ఏమీ రాయకుండా వుండిపోయారు. మళ్ళీ ఒక అనుకోని పరిణామం వల్ల రాయడం మొదలుపెట్టాల్సి వచ్చింది. శరత్ స్నేహితులు కొందరు ఒక చిన్న సాహిత్య పత్రికను ప్రారంభించారు. అది బాగా చిన్న పత్రిక కావటం వల్ల, దానికి పెద్దగా పేరు ప్రఖ్యాతులు లేకపోవడం వల్ల దానికి ఎవరూ ఏమీ రాసేవారు కాదు. అలాంటి నిరాశకరమైన పరిస్థితుల్లో స్నేహితులను ప్రోత్సహించే ఉద్దేశంతో , వారి బలవంతపు వొత్తిడి వల్ల మళ్ళీ 1913 లో శరత్ రాయడం ప్రారంభించారు. జమున లో ప్రచురితమైన ఒక్క కథ తోనే రాత్రికి రాత్రి శరత్ లబ్ద ప్రతిష్టు డయ్యాడు. శరత్ కథలకు వచ్చే అసంఖ్యాక ఉత్తరాలు, టెలిగ్రామ్ ల తో రచనని శరత్ మళ్ళీ సీరియస్ గా తీసుకొని రాయడం పునః ప్రారంభించాడు. అదే మన పాలిట వరమైంది. శరత్ అనేకానేక నవలలు, కథలు చదివే అదృష్టం మనకు దక్కింది.

శరత్ మొదటి భార్య శాంత దేవి, ఏడాది వయసున్న బిడ్డ ఇద్దరూ ప్లేగ్ వ్యాధితో మరణించటంతో జీవితం లో ఏర్పడ్డ శూన్యాన్ని పూరించేందుకు సోషియాలజీ, సైకాలజీ, హిస్టరీ, ఫిజిక్స్, ఫిలాసఫీ , పాలిటిక్స్ అన్నీ విపరీతం గా చదివాడు. అనారోగ్యం వల్ల చదువు తగ్గించి చిత్రలేఖనం ప్రారంభించాడు. 1910 లో యవ్వనంలోనే భర్తను పోగొట్టుకున్న వితంతువు మోక్షదా ని వివాహమాడాడు శరత్.

కలకత్తా కు తిరిగి వచ్చిన తర్వాత శరత్ రచనలు అన్ని పత్రికల్లో ప్రచురితమవుతుందేవి. 1922 లో శ్రీకాంత్ మొదటి భాగాన్ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ఇంగ్లీష్ లో ప్రచురించింది. కలకత్తా విశ్వవిద్యాలయం బంగారు పతకం తో సత్కరిస్తే రోమైన్ రోలాండ్ 1925 లో ప్రపంచం లో ఉత్తమ నవలాకారుల్లో ఒకరిగా గుర్తించింది. ఢాకా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ని ప్రదానం చేసింది.

బెంగాలీలు ‘ ఇమ్మోర్టల్ వర్డ్ స్మిత్ ‘ గా ప్రేమ గా పిలుచుకునే శరత్ లివర్ కాన్సర్ తో జనవరి 16, 1938 కలకత్తా లో మరణించారు. శరత్ చంద్ర ది భౌతిక మరణం. ఆయన సాహిత్యానికి మరణమెక్కడిది? ఈ 70 ఏళ్ళుగా భారతీయ సాహిత్య ప్రపంచం అలాంటి రచయిత మళ్ళీ మన కోసం తిరిగి వస్తాడని ఎదురుచూస్తూనే ఉంది. ఎప్పటికైనా మన ఎదురుచూపులు ఫలిస్తాయా? మనం అమితంగా ప్రేమించిన శరత్ మళ్ళీ మన కోసం వస్తాడా? ఏమో...అప్పటిదాకా మనకున్నవి శరత్ వదిలివెళ్ళిన పుస్తకాలు.

కల్పనా రెంటాల

14 వ్యాఖ్యలు:

తెలుగు వెబ్ మీడియా said...

>>>>>
శరత్ స్త్రీ పాత్రలు, చలం స్త్రీ పాత్రలు పూర్తిగా ఒకరికొకరు భిన్నమైన వారు. శరత్ రచనల్లోని స్త్రీలు వితంతువులు, అభాగినులు,శ్రీ శ్రీ మాటల్లో బాధా సర్పద్రష్టలు. అలాగని శరత్ స్త్రీ పాత్రలు బలహీనమైన వారు కాదు
>>>>>
చలం గారి కథలలో కూడా విధవలు ఉండేవారు. అనసూర్య, బ్రహ్మణీకం వంటి కథలు విధవల జీవితాలు గురించి వ్రాసినవే.

నిషిగంధ said...

నాకెంతో ఇష్టమైన రచయిత గురించి ఎన్నో తెలియని విషయాలు చెప్పారండి.. బోల్డన్ని కృతజ్ఞతలు :-)
నాకు చాలా ఇష్టమైన రచన శ్రీకాంత్.. అందులో రాజ్యలక్ష్మి అతనిని ప్రేమతో తనతోనే బంధించిన తీరు చాలా విస్మయాన్ని కలుగజేస్తుంది.. నాకెప్పటి నించో ఓ కోరిక.. శరత్ రాజేశ్వరినీ, చలం రాజేశ్వరినీ ఎవరైనా పోలిస్తే చదవాలని! నాకు రెండు పాత్రలూ నచ్చుతాయి మరి :-)

malathi said...

శరత్ నవలలు ఏవో చదివేను కానీ ఇంత విస్తృతంగా ఆయన జీవితంగురించి తెలుసుకోడం ఇప్పుడే ఇక్కడే. ధన్యవాదాలు.

సురేష్ - మ్యూజింగ్స said...

ఏంటో! నేను చదవాల్సిన పుస్తకాల లిష్టు మరీ పెరిగిపోతున్నది. ఈ పరిచయము మూలాన 'శేషప్రశ్న'ని లిష్టులో మొదటి వరసకు పంపిస్తున్నాను. ధన్యవాదాలు.

భావన said...

మా అమ్మమ్మ పేవరేట్ రచయత శరత్. ఆమె దగ్గర ఎప్పుడూ ఆయన పుస్తకం ఏదో ఒకటీ వుండేది చేతిలో. నాకు అంత గా ఎక్కేది కాదు. (మనలో మన మాట అర్ధం అయ్యేది కాదేమో). కాని దేవదాసు అనేది ఒక రచన కాదు మన నిజ జీవితం లో మన మధ్య జరిగిన నిజం అన్నంత గా ఆయన కధ జనాలలో చొచ్చుకుని పోయింది అంటే గొప్పే కదా. అంత స్లో గా నెమ్మది గా అన్ని సార్లు టీ లు తాగుతూ తీపి కారం తింటూ వాళ్ళు నెమ్మది గా చేరెడేసి కళ్ళలో నీళ్ళు పెట్టుకుంటూ మాట్లాడుతుంటే నాకు నిద్దరొచ్చేసేది.. కాని ఒక్క మాట అన్నా మా అమ్మమ్మ అమ్మ వీపు చీరతారని వూరుకునే దానిని. ఆయన పుస్తకాలను పరిచయం చేయవలసింది శ్రీకాంత్ ఒక్కటే కాకుండా.

తృష్ణ said...

శరత్ గురించి చాలా బాగా రాసారండీ..నాకు కూడా చాలా ఇష్టమైన రచయిత. ఆయన పుస్తకాలలో నాకు "బడదీదీ" "చరిత్రహీనులు"(ఈ నవలను నా చిన్నప్పుడు దురదర్షన్వళ్ళు సీరియల్గా వేసారు) "పరిణీత" ఇష్టం.

మురళీ కృష్ణ said...

మా అక్కగారు సదరు శరత్ గారికి పెద్ద విసనసర్ర, ఈయన పుస్తకాలు చాలా వున్నాయి ఇంట్లో... journey లో ఐనా చదవమని మరీ bag లో వుంచేది. కానీ, చదవుతూవుంటే హాయిగా నిద్రపట్టేది. బహుశా.. గాలి తుఫాను(చలం) గారి speed కు బాగా అలవాటుపడ్డానేమో... శరత్ పాత్రలతో, అలా నెమ్మదిగా నడవలేక పోయేవాణ్ణి.
ఇంటికెళ్ళినప్పుడంతా... మా ఇద్దరికీ ఇదే గొడవ... వాళ్ళిద్దరి రచనలపై(శరత్ vs చలం)...

ఆమె కవితలు కొన్ని ఇక్కడ(http://surapaala.blogspot.com/) publish చేశాను. వీలు ఉన్నప్పుడు చూడగలరు.
ధన్యవాదాలు.

Praveen Mandangi said...

శరత్ చంద్ర స్త్రీవాదని నాకు తెలియదు. అందుకే నేను అతని రచనలు చదవలేదు. నేను ఎక్కువగా చదివేవి కార్మికవర్గ & స్త్రీవాద రచనలు. Thanks for introducing about him.

Kalpana Rentala said...

నిషిగంధ, ,ఎన్నాళైంది మిమ్మల్ని నా బ్లాగ్ లో చూసి.
మీ కోరికే నాది కూడా. సమయం అనుకూలిస్తే తప్పకుండా రాజేశ్వరి ని, రాజ్య లక్ష్మి ని ఇద్దరి పాత్ర చిత్రణ గురించి రాస్తాను.
మాలతి గారు, మీరు చదివినందుకు నా ఎదురు ధన్యవాదాలు.
సురేష్, నా మీద నమ్మకంతో శేష ప్రశ్న ని మీ రీడింగ్ లిస్ట్ లో ముందుకు జరపటం బావుంది.
భావన... మీ అమ్మమ్మల కాలం వాడే కానీ ఇప్పటికీ అంత గొప్ప రచయిత మళ్ళీ రాలేదు. సమయం అనుకూలిస్తే, మీలాంటి అభిమాన పాఠకులు ఉత్సాహం గా వుంటే చదివేందుకు తప్పక శరత్ రచనల గురించి మాట్లాడుకోవచ్చు.
తృష్ణ, మీరు, నిషిగంధ నా బ్లాగ్ కి వచ్చి చాలా కాలమైంది. దాన్ని బట్టి మీ ఇద్దరికీ శరత్ అంటే చాలా ఇష్టమైన రచయిత అని తెలుస్తూనే వుంది.
మురళీకృష్ణ గారు, ఇంతకీ మీ అక్క అంటే కోపమా? శరత్ అంటే కోపమా? విసనకర్ర అనేశారు. శరత్రచనలు స్పీడ్ గా వుండవు కానీ తప్పక చదివిస్తాయ్..కాకపోతే మీరు అల్రెడీ చలం మత్తులో కూరుకుపోయి వుంటారు. అందుకే మీ అక్క పాపం ప్రేమతో పుస్తకాలు బాగ్ లో పెట్టినా చదవలేదు. పోనీ ఆ పుస్తకాలు మాకు ఇవ్వకూడదా? ఈ వారం చాలా బిజీ గా వుంది. అందుకనే మీ అందరికి సమాధానాలు కూడా ఆలస్యమయ్యాయి. మీ అక్కయ్య గారి కవితలు చదివి చెప్తాను. మొన్న తెలంగాణ విషయమై ఒక స్నేహితుడి బ్లాగ్ పంపింది మీరెనా? అది కూడా ఇంకా చదవలేదు. చదివిన తర్వాత మైల్ ఇస్తాను.
శరత్ స్త్రీవాది అవునా కాదా అన్నది పక్కన పెట్టి మీరు కేవలం చలం చదివితే లాభం లేదు. మామూలు రచయితలు రాసిన మామూలు పుస్తకాలు కూడా చదవండి. అది మీకే మంచిది.

gaddeswarup said...

Interestingly, the same Sarat who wrote Mahesh, had very strong anti-Islamic views:
http://www.hvk.org/articles/0605/1.html

mohanramprasad said...

Sarat gaari gurinchi chaala details
chepparu. Ayana rachanala venuka inta ananta vedana undaa! Mallee
Sarat rachanalu chadavaalani undi.

మురళీ కృష్ణ said...

ఈ టపా గురించి మా అక్కగారికి చెప్పాను. చాలా సంతోషించారు... and almost మీమాటలన్నీ మళ్ళీ ఆమె స్వరంలో వినగలిగాను. speed తగ్గించి శరత్ వనానికి త్వరలోనే బయలుదేరుతాను.
ఇంటికెళ్ళగానే... ఎదురుగా ఆ పుస్తకాల rack ను చూస్తూ వుంటే తెలీని నిశ్శబ్దం ఆవరిస్తుంది... ఆ పుస్తకాలను చదవనీ చదవకపోనీ. బహుశా.. అలా ఆ racks ను decorate చెయ్యటానికి పుస్తకాలకు మించిన గొప్ప వస్తువు ఇక లేదేమో.

Anonymous said...

అన్నపూర్ణల గురించి మనం చాలా సార్లే వినుంటాం, కొంచం ఓపిక చేసుకుని చూస్తే మన కుటుంబాల్లోనే అన్నపూర్ణని చాలాసార్లే చూసి, మాట్లాడి కూడా వుంటాం. కానీ మీరు కమలలతని, అభయని మర్చిపోయారా. ఆ వైష్ట్ణవ మఠం మీకు గుర్తుకురాలేదా. తెల్లవారిజావున మసక చీకట్లో ఆ పూలతోటని మర్చిపోయారా, ఆ చక్కని గొంతుని, ఏరకవైన ఆశింపులేని ఆప్రేమని, రా గోశాయి మనం బృందావనం వెళ్ళిపోతాం అన్న కమలలత, ఒంటరిగా ఆ బృందావనానికి ప్రయాణాన్ని మర్చిపోగలవా.

అభయ, ఈ రోజు ఈ ఎరవయ్యొకటవ శతాబ్ధానికి కూడా మరికొంచం ముందుందేవో.

రాజ్యలక్ష్మి, కలలో తప్ప ఇలలో అంత ప్రేమ సాధ్యవా? శ్రీకాంత్ శరత్ స్వీయ కథంటారు గాని, రాజ్యలక్ష్మి కల కాక నిజమవుతుందా? నిజంగా, నిజంగా రాజ్యలక్ష్మి నిజవవుతుందా?

శరత్ సాహిత్యవంతా చదివేను నేను, అసంపూర్తి కథలోసహా, కానీ శ్రీకాంతని మాత్రం ఏ మూడు నాలుగొందలసార్లో చదివుంటాను. నాకెందుకో ఆ పుస్తకం మాత్రం కష్టవనిపించినపుడు చదవాలనిపిస్తుంది, మనసంతా హాయిగా వున్నప్పుడూ చదవాలనిపిస్తుంది.

రవికిరణ్ తిమ్మిరెడ్డి.

Kalpana Rentala said...

రవికిరణ్,
నేను కమలలత ని , అభయ ని మర్చిపోగలనా? రాజ్యలక్ష్మి ని, కమల ని ప్రస్తావించటం ఒక ఉదాహరణ కు మాత్రమే. ఈ టపా బేసిక్ గా శరత్ లైఫ్ గురించి రాసింది. అతని సాహిత్యం గురించి రాసినప్పుడు , అతని స్త్రీ పాత్రల గురించి రాస్తే మరింత వివరంగా మాట్లాడుకోవచ్చు. శరత్ స్త్రీ పాత్రలు మన మధ్యతరగతి ఇళ్ళల్లో ఒకప్పుడు నిత్యం కనిపించే స్త్రీలే. మీరన్నట్లు శరత్ ని సంతోషం గా ఉన్నప్పుడు, బాధతో ఉన్నప్పుడూ రెండూ సార్లు చదువుకోవచ్చు. అసలు ఇప్పుడు శరత్ పుస్తకాలు ఇంకా దొరుకుతున్నాయా? నాకైతే తెలియదు. యవ్వనం లో చదివిన జ్నాపకాలే.
మీరు శరత్ స్త్రీల గురించి ఏమైనా రాస్తే ఇక్కడ లింక్ ఇవ్వడం మర్చిపోకండి.

 
Real Time Web Analytics