నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Thursday, February 04, 2010

బైరాగి “ పాప పోయింది”



బైరాగి నవల “ పాప పోయింది “ పుస్తకం గురించి ఇలాంటి సందర్భం లో రాస్తానని వూహించలేదు. విజయవాడ లో చిన్నారి వైష్ణవి అతి కిరాతకంగా హత్య కు గురికావటం, ఆ దుఃఖంతో తండ్రి మరణించిన వార్తా కథనాలు చదివాక మనస్సు స్థబ్దుగా వుండిపోయింది. ఒక్కోసారి మనస్సు చలించటానికి కూడా శక్తి సరిపోక బాధతో రాయిలా గడ్డ కట్టుకుపోతుంది. మనలో చాలామంది పరిస్థితి ఇప్పుడు ఇదే. ఈ దురాగతం పట్ల జ్యోతి, సుజాత, భరద్వాజ, ఇంకా అనేక మంది బ్లాగర్లు తమ ఆవేదనను అక్షరరూపంలో ప్రకటించారు. “ పాప పోయింది “ దుఃఖ తత్త్వం నుండి తేరుకుంటుంటే ఈ వార్త మళ్ళీ ఆ గాయాన్ని రేపింది. ఒక పాప పట్ల ఓ తండ్రి కుండే అపరిమితమైన ప్రేమను బైరాగి మాటల్లో మళ్ళీ ఒక్కసారి అందరూ చదివితే బాగుండుననిపించింది. అందుకే ఈ సంక్షిప్త పరిచయం.

“ She who was born and is now dead
And she who is not born and yet is dead
Has left my heart in sorrow, wandering from door to door!”
“ Cordelia!cordelia! stay a while!”
“ Look, look she breaths, she lives! “


( షేక్స్పియర్ కింగ్ ఆఫ్ లియర్ నుంచి...)

బైరాగి కథల సంపుటి “ దివ్య భవనం” చదివిన తాలూకు మత్తు లో వుంటూనే అతని నవల “ పాప పోయింది “ చదవటం మొదలుపెట్టాను. బైరాగి ఈ నవల బావుంటుంది అని వినటమే కానీ వివరాలు తెలియవు. మొన్నీమధ్య పుస్తకం.నెట్ లో బైరాగి కథల్ని మెహర్ సమీక్షించినప్పుడు శ్రీనివాస్ అనే రీడర్ పెట్టిన కామెంట్ ద్వారా ఈ పుస్తకం గుర్తుకు వచ్చింది. బైరాగికి ఓ పాప వుండేదని, ఆ పాప చనిపోయాక బైరాగి ఈ నవల రాశాడని అతను చెప్పటం తో ఒక విధమైన ఆసక్తి కలిగింది. బైరాగి కవిత్వం, కథల తీరూ తెలిసిన తర్వాత, ఈ పుస్తకం రచయిత స్వానుభవం నుండి వెలువడిన రచన అనటంతో ఇక క్షణం ఆలస్యం చేయకుండా చదవటం మొదలెట్టాను. పుస్తకం టైటిల్ ద్వారా పుస్తకం లో ఏం జరుగుతుందో ముందో తెలిసిపోవటం వల్ల చాలా మందికి చదవాలన్న ఆసక్తి వుండదు. కానీ, ఈ పుస్తకం అందుకు పూర్తి మినహాయింపు. ఆపకుండా ఏకబిగిన చదివించే గుణం వున్న ఈ పుస్తకాన్ని కావాలనే ఆగి, ఆగి, ఆపి, ఆపి చదివాను. ఏకధాటిగా చదవాలని ఒక పక్కా, చదవలేక మరో పక్కా పడిన బాధ వర్ణనాతీతం. ఆ నవల ఎంతలా చదివించిందంటే నేను పూర్తిగా అందులో లీనమైపోయాను. నవల నేను బస్ లో ప్రయాణం చేస్తూ చదివేదాన్ని. ఒక సన్నివేశం లో కళ్ళనీళ్ళు ఆగలేదు. నా బస్ ప్రయాణం అరగంట చదివి ఆపేసే దాన్ని. సగంలో ఆపబుద్ధి అయ్యేది కాదు. కానీ బలవంతంగా ఆపాను. ఎందుకంటే బైరాగి బాధ అనుభవంలోకి వచ్చేసేది. ఒక పాప మీద ఒక తండ్రికి అంత ప్రేమ వున్నట్లు చదువుతుంటే నేనే ఆ పాపనైతే ఎంత బాగుండుననిపించేది. అంతలా ఏ తండ్రి అయినా తన పాప ను ప్రేమించగలడా అని ఒక చిన్న అనుమానం పొడసూపేది. అంత ప్రేమను పొందగలిగినందుకు ఆ పాప మీద, అంత ప్రేమ ను ఇవ్వగలగిన ఆ తండ్రి పై కూడా ఈర్ష్య కూడా పడ్డాను.

ఈ పుస్తకం గురించి రాయటానికి, విశ్లేషించటానికి ఏమీ లేదు. నిశ్శబ్దంగా, నిర్లిప్తంగా, నిస్సత్తువుగా, నిర్ణిద్రంగా, నిర్నిమిత్తంగా చదువుకుంటూ వెళ్ళిపోవడమే.

ఈ పుస్తకం ప్రధమ ముద్రణ 1985 లో జరిగింది. అప్పటికి బైరాగి చనిపోయారు. బైరాగి బతికుండగా ఈ నవల ఏ పత్రికలోనైనా ప్రచురితమైందో, లేదో నాకు తెలియదు. పుస్తకం ముఖ చిత్రం కూడా భిన్నంగా వుంది. బైరాగి ఫోటో నే కవర్ పేజీ. పేజీ పైన బైరాగి పేరు. పేజీ చివర ఒక కొసాన పాప పోయింది అనే అక్షరాలు.
ఆవుల సాంబశివరావు గారు ఈ పుస్తకానికి రాసిన చిన్న ముందుమాట యథాతధంగా …..

“ పునరుజ్జీవనం “


“ ఇక్కడ ఏదీ మరుపులో మరుగు పడదు! ఏదీ చనిపోదు. రక్తా,శ్రుపిచ్చిలమైన మార్గాన మానవుడు తనను తాను మించి అధిగమించి పోతూ వుంటాడు.

నేనే పునరుజీవనాన్ని! నేనే జీవనాన్ని! నన్ను నమ్మినాతడు, చనిపోయినప్పటికీ మళ్ళా జీవిస్తాడు. జీవించి వుండగా నన్ను నమ్మినాతడు ఎన్నటికీ చనిపోడు”.

ఇవీ ఈ రచన ముగింపు మాటలు. ఇది ఇందులో ఆలూరి బైరాగి ప్రవచించిన తత్త్వం .

బైరాగి కి పునరుజ్జీవనం మీద ప్రగాఢమైన నమ్మకం ఉన్నట్లున్నది. అయితే ఆ పునరుజ్జీవనం మరో జన్మ కాదు. చనిపోయిన మనిషి ఆత్మ తిరిగి పుట్టడం కాదు. కొన్ని అనుభవాలతో క్రుంగి, కృశించిపోయిన మానవుడు, తనకు తానుగా నూతన తేజస్సును సంతరించుకొని, స్థైర్యాన్ని తిరిగి సంపాదించుకొంటాడు. “రక్తా,శ్రుపిచ్చిలమైన మార్గాన మానవుడు తనకు తాను మించి, అధిగమించి పోతూ వుంటాడు” అంటాడు బైరాగి. “ పునరుజ్జీవనం “ తో అనిపిస్తాడు. “ నేను జీవనాన్ని. నన్ను నమ్మినాతడు చనిపోయినప్పటికీ మళ్ళీ జీవిస్తాడు” అని. అయితే మానవునికి అందులో, అనగా పునరుజ్జీవనం లో నమ్మకం ఉండాలి. అనగా తనను తాను పునర్నిర్మించుకోగలననే విశ్వాసం ఉండాలి. అలాంటి విశ్వాసమే ఉంటే ఎన్నటికీ చనిపోడు.

ఈ చనిపోవడం, పునరుజ్జీవనం పొందడం భౌతికంగా కాదు. దానికి జన్మలతో సంబంధం లేదు. ఈ జన్మలోనే మానసికంగా చనిపోయే వారు చాలా మంది ఉంటారు. మనిషికి నూతన జీవితాన్ని కల్పించుకోగలననే నమ్మకమే ఉంటే, చితికిపోయిన తన మనస్సుకు తిరిగి చైతన్యం కలిగించుకోగలడు. జీవించినన్నాళ్ళు, జీవచ్ఛవంగా కాక, మనిషిగా బతకగలడు. బ్రతుకును సార్ధకం చేసుకోగలడు.

ఈ భావానికి రూపకల్పన చేస్తూ బైరాగి ఈ రచన ఎప్పుడు చేశాడో నాకు తెలియదు. అందుకు పరిశోధన జరిపే సామాగ్రి నా వద్ద లేదు. ఆ మాట వరసకు వస్తే, అంతటి పరిశోధన జరపడానికి ఎంత మంది తెలుగు రచయితలను గురించి ఆ సామాగ్రి వుంది?

ఈ ఆలోచనల్ని బైరాగి తర్వాత మార్చుకున్నాడా? నేను చదివినంతలో , చివరి వరకూ దాన్ని మార్చుకున్నట్లు లేదు. మనిషి లో నమ్మకం పోగొట్టుకోకుండానే బైరాగి చనిపోయాడు.
బైరాగి ని కవిగా చాలా మంది ఎరుగుదురు. తెలుగులో వచన రచయితగా చాలా మంది ఎరగరు. నేనూ ఎరగను. ఆయన వచన రచన నేను చదవడం కూడా ఇదే మొదలు.

ఇందులో కథ చాలా చిన్నది. రామారావు కు కన్నకూతురు ఎడల గొప్ప అనుబంధం ఉంది. ఆ బిడ్డే తన జీవితం గా భావిస్తాడు. అయితే ఆ పాప పోయింది. పాప పోవడంతో అతన్ని నిరాశా నిస్పృహలు అలముకుంటాయి. దంపతుల మధ్యే సంబంధం తారుమారవుతుంది. అయితే రామారావుది వాత్సల్యంతో నిండిన మనస్సు . ప్రేమించగల హృదయం. పోయిన తన పాప లాంటి మరో పాప కనిపిస్తుంది. ఇంటికి తెచ్చుకుంటాడు. తిరిగి ఇల్లాలును తన వద్దకు జేర్చుకుంటాడు. ఎండి, మోడై పోయిన తన బ్రతుకు కు పునరుజ్జీవనం కల్పించుకుంటాడు.

ఈ సంఘటనల చుట్టూ తన తాత్త్విక చింతనను అల్లడంలో బైరాగి కృతకృత్యుడైనాడు. కలిగిన అనుభవాలతో మనిషి ప్రవర్తన, రీతి ఎలా మారుతూ వుంటుందో చూడదలుచుకున్న వారికి ఆసక్తి కలిగిస్తుంది. మౌలికంగా ఇది తాత్త్విక రచన.

ఇటువంటి రచనను ప్రచురించడం సాహసమే. అయితే మిత్రుడు శ్రీ కొల్లూరి కోటేశ్వరరావు కు సాహసం సహజ లక్షణం. తెలుగు విద్యార్ధి ప్రచురణలు ఆ లక్షణానికి మచ్చు తునకలు. ఆ మచ్చు తునకలలో ఈ గ్రంధం ఒక మెరుపు.
మనిషి ని అవగాహన చేసుకోవడం శాస్త్రజ్నులు సదా చేస్తున్న ప్రయత్నం. ఆ అవగాహనకు ఇది ఉపకరించగలదు.

ఆవుల సాంబశివరావు
హైదరాబాద్,24-12-1984.




( ఈ టపా వైష్ణవికి అంకితం)




12 వ్యాఖ్యలు:

భావన said...

చాలా బాగుంది కల్పన రెండూ పరిచయాలూనూ. అవును కొన్ని కధలు చదవటం ఆపలేము ఒకే సారి మొత్తం గా చదవలేము ఆ రచనలలోని తీవ్రత ఘాడత సూటి గా బుర్ర లోకి ఎక్కి జీర్ణించుకోవటానికి కొంచం టైం కావాలి. భావాలను నియంత్రించుకోవటం కష్టం, సరే నా పుస్తకాల లిస్ట్ లో వేసేను. చాలా సంధర్బోచితం గా కూడా వుంది. పరిచయం చేసినందుకు థ్యాంక్స్.

మెహెర్ said...

బాగా రాసారు.

"Cordelia!cordelia! stay a while!"

— పై పద్యంలో ఈ పంక్తి ప్రస్తావన "దివ్య భవనం" కథా సంపుటిలో "ఒక గంట జీవితం" కథలో కూడా వస్తుంది. అందులో ఒక అమ్మాయి కాన్సర్‌తో చనిపోవడానికి సంబంధించిన ప్రస్తావన కూడా ఏదో వుంది. అప్పుడు వాటిని దేనికి అన్వయించుకోవాలో అర్థం కాలేదు. ఇప్పుడర్థమైంది.

మధురవాణి said...

కల్పన గారూ,
బహు చక్కటి పరిచయం. చాలా ఆసక్తికరంగా ఉంది ఈ పుస్తకం. కాస్త అదే చేత్తో ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుందో చెప్పండీ..
వైష్ణవికి అంకితమివ్వడం ఆర్ద్రంగా అనిపించింది :( ఆ చిన్నారి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తాను.

malathi said...

@ కల్పనా, బాగుంది నీశైలి. కేవలం నవల అంతా మనోవేదనగానే రాయడం సులభసాధ్యం కాదు. చూడాలి దొరికితే. జేబుకథమీద వ్యాసం కోసం ఎదురు చూస్తున్నాను.

Kalpana Rentala said...

భావన, మధురవాణి ఆ పుస్తకం ఇప్పుడు అందుబాటు లో లేదు అనుకుంటాను. నాకైతే సమయం వుంటే , లేకపోయినా తీరిక చేసుకొని ఒక సీరియల్ లాగా ఆ పుస్తకం కంపోజ్ చేసి పెట్టాలని వుంది. కాపీ రైట్ సమస్య లేకపోతే ఆ పని ధైర్యం గా చేయవచ్చు కొంచెం కష్టమైనా కూడా. ఇక నేను చేయగలిగిన పని ఆ పుస్తకాన్ని స్కాన్ చేసి కావాలన్నవాళ్లకు మైల్ లో పెట్టడం.
మెహర్, నాకు కూడా మొదట అది అర్ధం కాలేదు. ఈ పుస్తకం లో ఇన్నెర్ టైటిల్ లో ఆ స్టాంజా పెట్టారు. కొంచెం గూగుల్ చేస్తే విషయం అర్ధమైంది. షేక్స్పియర్ ది అది నేను చదవలేదు. అదే కాదు . ఇంకా చాలా చదవలేదు. జీవితం మరీ చిన్నది, పుస్తకాలు మరీ ఎక్కువ అయిపోతున్నాయి. రెండింటికి సమన్వయం కుదరడం లేదు.
మాలతి గారు, జేబుదొంగ కథ మీద రాయాలి. బైరాగి ఏ కథ మీద రాయాలా అని ఆలోచించి అసలు రాయడం మానేస్తున్నాను.

కొత్త పాళీ said...

బాగా రాశారు. ఆ సంఘటనలు జరిగినప్పుడు అక్కడే ఉన్నాము. అక్కడ స్థానికంగా అదో మాయా లోకం.

తెలుగు వెబ్ మీడియా said...

మొదటి భార్య కొడుకుకి అన్యాయం చేసి రెండవ భార్య పిల్లలకి ఆస్తి కట్టబెట్టాలనుకున్న పలగాని ప్రభాకర్ ని గొప్ప తండ్రి అనుకోవడం ఒక స్త్రీవాద రచయిత్రికి తన స్థాయికి తగినట్టు ఉంటుందా? నాకేమీ వైష్ణవి హంతకులపై సానుభూతి లేదు. కానీ వైష్ణవి తండ్రిని గొప్ప తండ్రి అనుకోవడం మాత్రం ఫార్సే. నేను మహిళల బ్లాగుల అగ్రెగేటర్ డిజైన్ చేశాను. http://women.bloggers.teluguwebmedia.net ఇందులో నేను ఇండెక్స్ చేసిన బ్లాగులలో రెండవ బ్లాగ్ మీదే. నాకు మొదటి నించి మీరంటే అభుమానమే. కానీ నా అభిమాన రచయిత్రి స్త్రీవాదానికి విరుద్ధంగా పలగాని ప్రభాకర్ ని పొగడడం బాధాకరమే.

Kalpana Rentala said...

ప్రవీణ్,
వైష్ణవి ని కిరాతకంగా హత్య చేయడానికి, వాళ్ళ నాన్న కి ఆ పాప మీద ఉన్న ప్రేమ కి, స్త్రీవాదానికి సంబంధం లేదు. ప్రభాకర్ చేసిన తప్పులకు ఈ సంఘటన జరిగి తీరాలని ఎవరైనా అంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకొకటి వుండదు.
మీకు నా మీద ఉన్న అభిమానానికి థాంక్స్.
కల్పన

తెలుగు వెబ్ మీడియా said...

మొదటి భార్య కొడుకుకి అన్యాయం చేసినవాడిని గొప్ప తండ్రి అనుకోవడం హాస్యాస్పదమే. అది స్త్రీవాదులైనా, కాకపోయినా. నేనేమీ వైష్ణవి హంతకులని జస్టిఫై చెయ్యడం లేదు. ఆస్తి అంటే ఏమిటో తెలియని చిన్నపిల్లని ఆస్తి కోసం హత్య చెయ్యడాన్ని నాగరికులెవరూ జస్టిఫై చెయ్యరు. ప్రభాకర్ పై సానుభూతి చూపడం హాస్యాస్పదంగా ఉంది అని అన్నాను కానీ ప్రభాకర్ చేసిన తప్పుకి చిన్నపిల్ల బలి పశువు అవ్వాలనలేదు.

మధురవాణి said...

కల్పనా గారూ,
"బైరాగి కథల సంపుటి “ దివ్య భవనం” చదివిన తాలూకు మత్తు లో వుంటూనే అతని నవల “ పాప పోయింది “ చదవటం మొదలుపెట్టాను." అన్నారు మీరు. నేను ఇవాళ AVKF లో ఆ పుస్తకం చూసాను. అయితే, ఆ 'దివ్యభవనం' కథల పుస్తకం తప్పక చదవదగినది అంటారా.? మీ అభిప్రాయం తీస్కుని కొందామని అడుగుతున్నాను. ధన్యవాదాలు.

Kalpana Rentala said...

మధురవాణి ,
నాకైతే బైరాగి కథలు నచ్చాయి. కొనుక్కోమనే చెప్తాను. ఇప్పుడే బైరాగి ఒక కథ గురించి పోస్ట్ పెట్టాను. చూడండి. జేబుదొంగ కథ మైల్ లో పెడతాను. నచ్చితే చదివి పుస్తకం కొనుక్కుందురు గాని. పుస్తకం ఖరీదు తక్కువే కానీ మీకు పోస్తేజీ ఎక్కువ పడుతుంది కదా అందుకని సాహసించలేకపోతున్నాను. నా మైల్ అడ్రెస్ kalpanarentala@yahoo.com. బైరాగి మొత్తం కథల గురించి మెహర్ పుస్తకం లో రాసిన సమీక్ష చదవండి. మీకు కథలు ఎలా వుంటాయో అర్ధమవుతాయి.

మధురవాణి said...

కల్పన గారూ,
మీ స్నేహపూరితమైన సలహాకి ధన్యవాదాలు. అలాగే మీరన్నట్టు మీ 'జేబు దొంగ' సమీక్ష, అలాగే పుస్తకం లోని వ్యాసం రెండూ చదివి నాకేమనిపిస్తుందో చెప్తాను ;)
మీ 'జేబుదొంగ' పోస్టు చదవుదామని నిన్నటి నుంచీ అనుకుంటున్నా..పని హడావిడిలో కుదరలేదు :( చదివేసి తొందరలోనే మీకు వివరంగా మెయిల్ చేస్తానండి :)

 
Real Time Web Analytics