నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Friday, March 05, 2010

తెలుగు డయాస్పోరా ఒక మూస ఘోష ?

డయాస్పోరా తెలుగు సాహిత్యం గురించి కొంచెం సీరియస్ గా చర్చించుకోవాలని, మాట్లాడుకోవాలని అనుకుంటున్న అనేక మంది లో నేను కూడా ఒకరిని. తెలుగు సాహిత్యం లో డయాస్పోరా సాహిత్యం ఒక పాయ గా మొదలైందని, ముందు ముందు దాన్ని కూడా కలుపుకొని తెలుగు సాహిత్యాన్ని సమగ్రం గా విశ్లేషించాల్సి వుంటుందని నా అభిప్రాయం. అందుకనే “ 20 వ శతాబ్దం లో అమెరికా తెలుగు కథానిక మరియు అమెరికా తెలుగు సాహితీవేత్తల పరిచయ గ్రంధం “ పుస్తకం వస్తోందని ఓ ఏడాది క్రితం అనుకుంటాను వంగూరి చిట్టెన్ రాజు గారు చెప్పగానే ఆసక్తి గా ఎదురుచూడటం మొదలు పెట్టాను. పుస్తకం చేతికి వచ్చింది కానీ 600 కంటే ఎక్కువ పేజీలున్న ఈ బృహత్ గ్రంధాన్ని ఇంకా చేతిలో పట్టుకొని చదివే సాహసం మాత్రం ఇంకా చేయలేదు.

ఆ సాహసం చేసి దాని మీద పెద్ద వ్యాసం కూడా రాసేశారు ఈమాట ప్రధాన సంపాదకులు వేలూరి వెంకటేశ్వరరావు.
ఈ పుస్తకం చదివి మాట్లాడటం ఉత్తమం. అయితే పుస్తకం చదవకపోయినా కూడా ఈ పుస్తకం పై వేలూరి వ్యాసాన్ని చదివి మాట్లాడుకోవచ్చు.

డయాస్పోరా తెలుగు సాహిత్యం గురించి మొదటి నుంచి సీరియస్ గా మాట్లాడుతున్న వారిలో ప్రధములు వేలూరి. డయాస్పోరా తెలుగు సాహిత్యాన్ని గురించి మాట్లాడటమే కాకుండా సీరియస్ గా ప్రచురణలు కూడా మొదలుపెట్టిన వ్యక్తి వంగూరి చిట్టెన్ రాజు. ఇప్పుడు ఈ పుస్తకం ప్రచురించినది చిట్టెన్ రాజు . వ్యాసం రాసింది వేలూరి. ఆ రకంగా ఇద్దరు ఉద్దండులకు సంబంధించిన అంశం ఇది.

డయాస్పోరా సాహిత్యం గురించి వేలూరి చాలా చోట్ల ప్రసంగాల్లోనూ, వ్యాసాల్లోనూ చెప్పిన విషయాల్ని మరింత వివరంగా సమగ్రం గా ఈ వ్యాసం లో మరో సారి చెప్పారు.. దానికి సందర్భం 20 వ శతాబ్దం లో తెలుగు కథానిక పై ఆయన చేసిన సమీక్ష అనుకోండి. విశ్లేషణ అనుకోండి, లేదా ఆ పుస్తకం చదివాక ఆయనకు కలిగిన అభిప్రాయాలు అనుకోండి. అది ఈ వ్యాసం. పుస్తకం లో వున్న అక్షరదోషాలు, జనరల్ గా అమెరికా తెలుగు కథల్లో లోపించిన నాణ్యతా మొదలైన విషయాల్ని కూడా వ్యాసంలో ప్రస్తావించారు. పుస్తకం లో వున్న కథల మీద మాత్రం సమీక్ష లేదు. అసలు ఈ 40 ఏళ్ళల్లో మంచి కథలు రాలేదా? లేక ఈ సంపాదకులు ఎంచుకున్న కథలు అలా నాసిరకంగా వున్నాయా అన్నది స్పష్టం గా చెప్పి వుండాల్సింది. ఈ సంకలనం లో వున్న కథల్లో అసలైన డయాస్పోరా కథ ( వేలూరి గారు, జంపాల గారి ప్రమాణాల మేరకు) ఒక్కటి కూడా లేదా? వుంటే ఆ కథ మిగతా వాటికంటే ఏ రకంగా భిన్నమైంది? అనేది చర్చించి వుంటే ఒక సమగ్రత వచ్చేది. అసలు ఒక్క డయాస్పోరా కథ కూడా లేకపోతే ఆ సంగతినే స్పష్టం గా చెప్పాల్సింది. డయాస్పోరా సాహిత్యం మీద వేలూరి తన అభిప్రాయాల్ని మొదట ఒక వ్యాసం గా రాసి, రెండో భాగం ఈ పుస్తకం మీద సమగ్ర విశ్లేషణ చేస్తే సముచితం గా వుండేది. సమీక్షిస్తున్న పుస్తకం లోని విషయాల కంటే, డయాస్పోరా కి సంబంధించిన ఇతర విషయాలతో నిండి వుండి ఈ వ్యాసం మొత్తం.

““అమెరికా నుంచి వచ్చిన ప్రతి రచనా డయాస్పోరా రచనగా భావించడం గాని మొదలయ్యిందా? లేదా, డయాస్పోరా రచన అంటే నాకున్న అభిప్రాయాలు తప్పుడు అభిప్రాయాలా?” అని. వేలూరి అడిగారు. అలాగే “ఈ సంకలనంలో అధ్యక్షుల ముందుమాటలో “డయస్పోరా ఇతివృత్తాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం,” అన్నమాటలు చూసిన తరువాత, ఈ డయాస్పోరా అనే ‘వింత పదం’ ఊత పదంగా తయారయ్యిందా అన్న అనుమానం వస్తుంది. “ అన్నారు వేలూరి. ఆయన లేవనెత్తిన ఈ రెండు కూడా ముఖ్యమైన విషయాలు. దాని మీద ఎంత సమగ్రమైన విశ్లేషణ జరిగితే అంత మంచిది. ఈ సంకలనాన్ని పై పైన చూసినప్పుడు నాకు అదే ఆలోచన కలిగింది. ఎందుకంటే వంగూరి వారి కథా సంకలనానికి పెట్టుకున్న టైం పీరియడ్ 1964-2000. ఆ టైమ్ లో రచయితలు ఏం కథ రాస్తే దాన్నే ఈ సంకలనం లో చేర్చినట్లు కనిపించింది. ఆ రకంగా ఆ టైమ్ పీరియడ్ లో వాళ్ళు మామూలు కథ ( అమెరికాకు సంబంధించిన ఇతివృత్తం కాకపోయినా ) రాసినా ఇందులో చేర్చి వుండాలి.

వేలూరి తన వ్యాసం లో అమెరికా లో వచ్చే తెలుగు కథల ఇతివృత్తాల గురించి సోదాహరణం గా పేర్కొన్నారు. కుటుంబం లో విషయాలు, భార్యాభర్తల గొడవలు,పిల్లల పెళ్ళిళ్ళు , నోస్తాల్జియా, ఇవేమీ డయాస్పోరా కాకపోతే ఇక ఏది డయాస్పోరా? సింగపూర్ చైనా వారి డయాస్పోరా సాహిత్యం లో వున్న ఇత్రివృత్తాలు , అనుభవాలు ఏవేమిటి? అవి ఏ రకంగా తెలుగు సాహిత్యానికంటే విభిన్నమైనవి, ఉత్తమమైనవి అని వేలూరి గారు అనుకుంటున్నారో అది చెపితే ఈ వ్యాసానికి ప్రత్యేక ప్రయోజనం వుండేది.

వంగూరి వారు ఈ పుస్తకం లో ఇచ్చిన వివరాల ప్రకారం అమెరికాలో 1964 లో తెలుగు వారి కలం నుండి మొదట కథ వెలువడింది. అమెరికా తెలుగు వారి సాహిత్య కృషి 1970 నుంచి ప్రారంభమైనట్లు వివరాలిచ్చారు ఈ పుస్తకం లో. అంటే అమెరికా తెలుగు సాహిత్యం వయస్సు ఇంకా నలభై ఏళ్లు కూడా లేదు. ఈమాట సాహిత్య కృషి వయస్సు ఓ 12 ఏళ్లు. చిట్టెన్ రాజు గారి ప్రచురణాల సంస్థ వయస్సు 15 ఏళ్లు. దీన్ని బట్టి కూడా డయాస్పోరా తెలుగు సాహిత్యం , రచయితలు ఇంకా శైశవ దశ లోనే వున్నారని అర్ధం చేసుకోవచ్చు. అమెరికా లో తెలుగురచయితలు ఎవరు? వారి రచనలు ఏమిటి? ఎవరెవరు ఎలాంటి రచనలు చేస్తున్నారు, అనేది సరిగ్గా అర్ధం చేసుకుంటే తప్ప మనకు డయాస్పోరా సాహిత్యం ముందు ముందు ఎదుగుతుందా, లేక ఇలాగే వుంటుందా అనేది కూడా తెలియదు.

ఈ సంకలనం లోని కథల నాణ్యత గురించి మాట్లాదేముందు అసలు ఇంత మెటీరీయల్ ఒక చోట దొరకడం ఒక మంచి విషయం గా మనం గుర్తించాల్సి వుంది.

వేలూరి వ్యాసం ఈ నెల ఈమాట లో వచ్చింది. దానిని ఇక్కడ చదవండి.
తెలుగు డయాస్పోరా సాహిత్యం పై ఆసక్తి వున్న వారు నేను రాసిన వ్యాసం ఇక్కడ , సావిత్రిమాచిరాజు వ్యాసం ఇక్కడ , అఫ్సర్ రాసిన వ్యాసం ఇక్కడ చదవవచ్చు.

కల్పనారెంటాల

12 వ్యాఖ్యలు:

Kathi Mahesh Kumar said...

అసలు డయాస్పొరా అంటే ఏమిటీ?

Anil Dasari said...

@మహేష్:

అంటే ఏంటో తెలీనట్లు :-)

@కల్పన:

>> "వేలూరి తన వ్యాసం లో అమెరికా లో వచ్చే తెలుగు కథల ఇతివృత్తాల గురించి సోదాహరణం గా పేర్కొన్నారు. కుటుంబం లో విషయాలు, భార్యాభర్తల గొడవలు,పిల్లల పెళ్ళిళ్ళు , నోస్తాల్జియా, ఇవేమీ డయాస్పోరా కాకపోతే ఇక ఏది డయాస్పోరా?"

అలాగైతే ఆంధ్రదేశంలో ఉండే తెలుగు రచయిత/త్రుల రచనల్నీ డయాస్పోరా సాహిత్యమే అనాలేమో. ఎందుకంటే ఇంచుమించు వాళ్లందరి ఇతివృత్తాలూ అవే కదా.

Kalpana Rentala said...

మహేశ్,

అన్నీ లింకుల్లోని వ్యాసాల్లో చెప్పింది డయాస్పోరా అంటే ఏమిటి అనే.

అబ్రకదబ్ర,

డయాస్పోరా ఇత్రివృత్తాలు అని ప్రత్యేకం గా ఒక ఫార్ములా తో వుండదు అని నేననుకుంటాను. వలస జీవిత విధానం లో ఇండియా లో నే కాదు , ప్రపంచం లో ఎక్కడ బతికినా వుండే మామూలు సమస్యలు కూడా వుంటాయి. అయితే వాటికి అమెరికా జీవిత విధానానికి ఒక లింక్ వుంటుంది. తప్పనిసరిగా కాస్త తెలివైన రచయిత అనకాపల్లి లో జరిగే సంఘటన, అమెరికా లో కూడా ఎలా జరగవచ్చో, దానికి అమెరికా లో వుండే ఏదో ఒక చిన్న లింక్ కూడా కలిపి చెప్తాడు. అంత చేయి తిరిగిన , తెలివైన రచయితలు ఇంకా ఇక్కడ తయారై వుండకపోతే సాహిత్యం పేలవంగానే వుంటుంది. శైశవ దశలో వుండే బాలారిష్టాలు ఇవన్నీ. మీలాంటి కొద్ది మంది మంచి రచయితలు ఇక్కడ వున్నారు కాబట్టి ముందు ముందు మంచి రచనలు వస్తాయని నేనైతే కాస్త పాజిటివ్ గానే ఎదురుచూస్తున్నాను. మీ కొత్త కథ ఎప్పుడూ?

chandrabose lyricist said...

kalpana garu meeru chaala manchi samaachaaram andisthunnaaru-dhanyavaadaalu-chandrabose

Kalpana Rentala said...

“ నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పు అడిగింది ఇవ్వద్దు ఇవ్వద్దు “ లాంటి మంచి పాటలు రాసిన మా అభిమాన పాటల రచయిత చంద్రబోస్ గారేనా మీరు ?
నా బ్లాగ్ మీకు నచ్చిందంటే నాకు చాలా సంతోషంగా వుంది.
వేటూరి గారి తర్వాత అన్నీ వందల పాటలు రాసింది మీరే అనుకుంటాను. అందుకోండి మా అభినందనలు.

కొత్త పాళీ said...

మంచి కథ వేరూ, డయాస్పోరా కథ వేరూ. అమెరికాలో కూచోని మనవాళ్ళు రాస్తున్నవి (బొత్తిగా ప్రవాస జీవితం ప్రస్తావన లేకుండా ఉన్న ఏ కొద్దో తప్ప) కచ్చితంగా డయాస్పోరా కథలే. ఎందుకంటే, ఆ రచయితలూ మన తోటి వాళ్ళే .. వాళ్ళు రాసిందీ మన వోలుమొత్తం వలస జీవితానుభవంలో భాగమే. అవి ఏ సింగపూరు చైనీయుల కథల్లాగానో లేవంటే .. ఉండవు, ఎందకంటే మనం చైనీయులమూ కాదు, మనం ఉన్నది సింగపూర్లోనూ కాదు.
అవి మంచి కథలూ గొప్ప కథలూ కాకపోవచ్చు. కానీ అవి డయాస్పోరా కథలే.
అదే లెక్కన, అమరికాకి విహారానికి వచ్చి వెళ్ళే రచయితలు అమెరికా గురించి రాసిన రచనలు కచ్చితంగా డయాస్పోరా రచనలు కావు, అవి యెంత గొప్ప కథలైనా సరే.
డయాస్పోరా కథల్లో కూడా మంచి కథలూ గొప్ప కథలూ రావాలని ఆశిద్దాం.

Anonymous said...

kalpana gaaroo,

"డయాస్పోరా తెలుగు సాహిత్యాన్ని గురించి మాట్లాడటమే కాకుండా సీరియస్ గా ప్రచురణలు కూడా మొదలుపెట్టిన వ్యక్తి వంగూరి చిట్టెన్ రాజు. ఇప్పుడు ఈ పుస్తకం ప్రచురించినది చిట్టెన్ రాజు." అని రాసారు. చిట్టెన్ రాజు గారి సంకలనం అమెరికా రచయితలది మాత్రమే! అది ఖచ్చితంగా డయాస్పోరా క్రిందకి రాదు. అందులో ఎనభై శాతం కథలు డయాస్పోరా క్రిందకి రావు. అమెరికా రచయితలు రాసిన ప్రతీ కథా డయాస్పోరాకావు. డయాస్పోరా కథలు రాస్తామనుకునే ఎంతమంది రచయితలు డయాస్పోరా సమస్యలన్ని చూస్తున్నారు? అమెరికా వచ్చి పదిహేనేళ్ళు దాటినా ఇంకా తెలుగు జీవితమే మనది. వారం వారం తెలుగు వాళ్ళనే కలవడం. లేదంటే నాలుగు తెలుగు డీవీడులు ముందేసుక్కూచోడం. లేదంటే ఇంటర్నెట్ రాజకీయ పత్రికల్ని పోషించడం. ఇదే కదా మనం చేసేది. ఇదంతా డయాస్పోరా క్రిందకి రాదు.

Anonymous said...

ఇంతకు ముందు వ్యాఖ్య రాసింది నేను.

-బ్రహ్మానందం గొర్తి

KumarN said...

బ్రహ్మానందం గారూ,
చాలా బాగా చెప్పారండీ. ఈ ధోరణి గత కొద్ది సంవత్సరాలుగా మరీ ఎక్కువయ్యింది తెలుగు కుటుంబాలలో. ఇహ ఇండియన్(తెలుగు) ఛానెల్స్ కూడా వచ్చే ఇళ్ళల్లో పరిస్థితి ఇంకా ఘోరం.

నిజమే, మీరన్నట్లుగా దాన్నంతా డయాస్పోరా అంటారా? నాకు గత రెండు సంవత్సరాలుగా ఇదో బాధ పట్టుకుంది. మన కమ్యూనిటీ కూడా, స్పానిష్ కమ్యూనిటీ(అందరూ కాదు) లాగా, స్పానిష్ టి వి చానెల్సే చూస్తూ, స్పానిషే మాట్లాడుకుంటూ, స్పానిష్ రేడియో చానెల్స్ మాత్రమే వింటూ, అట్లా సెక్లూడెడ్ గా బ్రతుకుతూ ఉండిపోతామా వచ్చే తరాలంతా అని.

కొత్త పాళీ said...

@kumarN .. ఆ మాత్రం చేస్తే బానే ఉణ్ణు. కానీ మన పిల్లలకి మాత్రం ఏ మాత్రం తెలుగు రాకూడదు!

భావన said...

ఆవ్యాసలు,ఆ పైన ఇక్కడ కామెంటు లు చూస్తే రాయాలంటేనే భయం వేస్తోంది కల్పన, ఇన్ని పద్దతులు రూల్స్ తెలియాలా రాయాలంటే.అమ్మో నయమే ఏమి కధ రాసేను కాదు ఇంతవరకు. :-)

Anonymous said...

charcha baagundi. telisina vaarikee teliyani vaarikee koodaa subhaakaankshalu. kadha raadayam mukhyam. adi didsporaanaa kaadaa anedi pakkana pedite. bahusaa jeevitam konchem tedaato andaridee okatenemo. charchalloninci koodaa kadhalu puuttuku vostaayini nammutoo bhuvana chandra

 
Real Time Web Analytics