నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Thursday, May 27, 2010

తృష్ణ చెప్తున్న అమ్మ చెప్పిన కథ


అమ్మ చెప్పిన కథల కోసం అన్వేషణ శీర్షిక కు వస్తున్న స్పందన చూస్తే చాలా సంతోషం గా వుంది. లలిత( తెలుగు4కిడ్స్) మధురవాణి, జ్యోతి, జయ, తృష్ణ ఇలా అందరూ తాము చిన్నప్పుడు చెప్పించుకున్న కథల గురించి, ఆ జ్నాపాకాల గురించి టపాలు రాస్తున్నారు. ఏమిటి? అంతా అమ్మాయిలే రాస్తున్నారు...అబ్బాయిలు కథలు చెప్పించుకోలేదా? లేకా గుర్తు లేవా?

ఈ శీర్షిక కోసం ఓపిక, తీరిక చేసుకొని మరీ రెండు కథలు పంపించింది తృష్ణ. అమ్మ చెప్పిన కథ చెప్పిన మరో అమ్మ తృష్ణ కి ధన్యవాదాలు.

ఈ సారి ఈ చిట్టి పొట్టి కథలు చెప్తోంది తృష్ణ ......



ఈగ కథ:

(బాగా చిన్నప్పుడు అన్నం పెడుతూ మా అమ్మ ఈ కధ చెప్పేది)

ఒక ఈగ ఇల్లు అలుక్కుంటూ తన పేరు మర్చిపోయిందట. పేదరాశి పెద్దమ్మ దగ్గరకు వెళ్ళి "పెద్దమ్మా పెద్దమ్మా నా పేరేమిటి?మర్చిపోయాను" అని అడిగిండట. అప్పుడు పెద్దమ్మ "నీ పేరు నాకేం తెలుసు. నా కొడుకు నడుగు " అందట. ఈగ పేదరాశి పెద్దమ్మ కొడుకు దగ్గరకు వెళ్ళి, "పేదరాసి పెద్దమ్మ కొడుకా నా పేరు నీకు తెలుసా? అన్నదట.

అప్పుడతను "నీ పేరు నాకేం తెలుసు? నా చేతిలోని గొడ్డలిని అడుగు అన్నాడట.

అప్పుడు ఈగ, "పేదరాశి పెద్దమ్మ, పెద్దమ్మ కొడుకా,కొడుకు చేతిలో గొడ్దలా నా పేరేమిటి?" అనడిగిండట.

అప్పుడు గొడ్డలి, "నీ పేరు నాకేం తెలుసు? నేను నరికే ఈ చెట్టునడుగు" అందట.

ఈగ చెటు దగ్గరకు వెళ్ళి "పేదరాశి పెద్దమ్మా, పెద్దమ్మ కొడుకా, కొడుకు చేతిలో గొడ్డలా, గొడ్దలి నరికే చెట్టా, నా పేరేమిటి?" అనడిగిండట.

అప్పుడా చెట్టు "నీ పేరు నాకేం తెలుసు? చెట్టుకట్టేసిన గుర్రాన్నడుగు" అందట.

అప్పుడు ఈగ, "పేదరాశి పెద్దమ్మ, పెద్దమ్మ కొడుకా, కొడుకు చేతిలో గొడ్డలా, గొడ్డలి నరికే చెట్టా, చెట్టుకట్టేసిన గుర్రమా నా పేరేమిటో తెలుసా?" అనడిగిందట. అప్పుడా గుర్రం " నీ పేరు నాకేం తెలుసు? నా పొట్టలో ఉన్న పిల్లనడుగు" అందట.

అప్పుడు ఈగ, "పేదరాశి పెద్దమ్మ, పెద్దమ్మ కొడుకా, కొడుకు చేతిలో గొడ్డలా, గొడ్డలి నరికే చెట్టా, చెట్టుకట్టేసిన గుర్రమా, గుర్రం పొట్తలోని పిల్లా నా పేరేమిటో తెలుసా?" అనిఅడిగిండట.

అప్పుడు గుర్రం పొట్టలోంచి గుర్రపిల్ల " ఇహీ...నీ పేరు నీకు తెలియదా? నీ పేరు ఈగ" అందట.

పేరు గుర్తొచ్చిన ఈగ సంతోషంగా ఎగిరిపోయిందట.

*****************************************************************

లొట్టాయ్ కథ:

అనగనగా ఒక ఊళ్ళో సన్నగా ఉన్న ఒక అబ్బయి ఉండేవాడు. వాడిని అందరూ "లొట్టాయి" అని పిలిచేవారుట. వాడికి ఆ పిలుపు నచ్చేది కాదట. ఎవరన్నా అలా పిలిస్తే బోలెడు కోపం వచ్చేసేదట. ఒకరోజు నడుచుకు వెళ్తూంటే దారి పక్కగా ఉనా తోటకూర మొక్కలు "రివ్వు రివ్వు లొట్టాయ్..రివ్వు రివ్వు లొట్టాయ్.." అని ఊగాయిట. వాడికి కోపం వచ్చి ఆ తోటకూర మొక్కలను కోసేసి ఇంటికి తెచ్చి పులుసు వండమని వాళ్ళమ్మకు ఇచ్చాడట.

ఆ తోటకూర పులుసు ఉడుకుతూ ఉడుకుతూ "కుతకుత లొట్టాయ్..కుతకుత లొట్టాయ్..." అందట. వాడికి ఇంకా కోపం వచ్చి పులుసంతా తీసుకెళ్ళి పెరట్లో పారబోసాడుట. అది తిన్న ఆవు పాలు ఇస్తూ "చుయ్ చుయ్ లొట్టాయ్..చుయ్ చుయ్ లొట్టాయ్..." అందట. అప్పుడు లొట్టాయ్ కి ఇంకా కోపం వచ్చి ఆ ఆవును చంపివేసి చెప్పులు కుట్టించుకున్నాడట. నడుస్తూంటే ఆ చెప్పులు కూడా "కిర్రు కిర్రు లొట్టయ్..కిర్రు కిర్రు లొట్టయ్.." అనటం మొదలెట్టాయిట. అప్పుడు వాడు వాటిని దూరంగా విసిరేసాడట.

ఆ చెప్పుల్ని తిన్న కుక్క ఒకటి "భౌ భౌ లొట్టయ్..భౌ భౌ లొట్టాయ్.." అని అరవటం మొదలెట్టిండట. ఈసారి లొట్టాయికి అమితమైన కోపం వచ్చి ఆ కుక్కను పక్కనే ఉన్న బావిలో పడేసాడట. బావిలోంచి "బుడుగు బుడుగు లొట్టాయ్..బుడుగు బుడుగు లొట్టాయ్.." అని శబ్దమ్ రాసాగిందట. ఇక వాడు ఊరుకోలేక మితిమీఇన కోపంతో బావి లోకి దూకాడుట..."బుడుంగ్ లొట్టాయ్.." అని ములిగిపోయాడుట.

ఈ కధలో ఆవుని చంపాడనగానే అదేంటమ్మా, ఆవును ఎలా చంపుతాడు? తప్పు కదా? అనడిగేవాళ్ళం అమ్మను. "ఏమో మా అమ్మ అలానే చెప్పేది. "తన కోపమే తన శత్రువు" అనే నీతిని తెలిపే కథ ఇది. దీనిలో లాజిక్కులు వెతకకూడదు" అనేది అమ్మ...:)

తృష్ణ.

http://trishnaventa.blogspot.com


17 వ్యాఖ్యలు:

మధురవాణి said...

నాకు ఈగ కథ తెల్సు కానీ,లొట్టాయ్ కథ తెలీదు. భలే బాగున్నాయి తృష్ణ గారూ మీ కథలు :)

lalithag said...

నాకూ "లొట్టాయ్" కథ తెలియదు.
ఈగ కథ తెలుగు4కిడ్స్ కోసం చెయ్యడానికి ప్రయత్నించి పక్కకి పెట్టాను. ఇప్పుడు మళ్ళీ ఉత్సాహంగా అనిపిస్తోంది, ప్రయత్నిస్తాను.
సంతోషంగా ఉంది ఇలా అందరూ చిన్నప్పటి కథలు గుర్తు చేసుకుంటుంటే.
ఈ ఆలోచన ప్రతిపాదించిన వారికీ, ప్రకటించిన వారికీ, ఇందులో పాల్గొంటున్న వారందరికీ ధన్యవాదాలు.

Anonymous said...

ఈగ కథ, లొట్టాయ్ కథ చెప్పిన వారికి ఒక గుండెనిండుగా నమస్కారం. అమ్మ చెప్పిన కథలు, నాన్న చెప్పిన కథలు, అవ్వ, తాత చెప్పిన కథలే కాదు, ఈ మధ్య అప్పుడప్పుడే కథలు చెప్పడం నేర్చుకున్న కొంగ్రొత్త అమ్మలు, నాన్నలు, వాళ్ళు, వాళ్ళకి తెలిసిన లోకంలొ, వాల్లు మీక్కి మౌసుల్నీ, సూపరు మాన్లనీ కలిపేసి, కొంగృత్తగా సృష్టించిన కథలు, ఏవైనా సరే అన్నీ కథలు కావాలిప్పుడు.

ఏ విశ్వనాద సత్యాన్నారయణ కథలో, కాకపోతే ఏ మొపాసా కథలో మాత్రవే నిజవైన కథలనే భ్రమలో వుండకండి, మీరు మీ బుజ్జి బాబుకో, బుజ్జి పిల్లకో చెప్పే కథలు, అప్పటికప్పుడు మీరు అల్లే కథలు(అవి పాతవే కానక్కరలేదు) కూడా మొపాస కథలు, ఓ హెన్రీ కథలతోపాటివేనని సందేహంలేకుండా అనుకోండి. అందువలన, హే నాకీ కథ మా అమ్మ చెప్పలేదు, మా నాయన చెప్ప లేదు, దీంట్లో కొత్త, కొత్త కేరక్టర్లున్నాయ్ అని సందేహించకండి. అన్నీ గొప్ప కథలే. ఇప్పటికి నలభై సంవత్సరాల తర్వాత, మీ పిల్లలకి, ఓ హెన్రీలు, మొపాసాలు, విస్వనాధలు, నామినీలు గుర్తుండరేవో కానీ, మీరు చెప్పిన, ఏ మాత్రం, ఏ విధవైన లాజిక్ లేని మీరు చెప్పిన కథ మాత్రం గుర్తుంటుంది. అంత కాలం గుర్తుండే కథేది ఆషామాషీ కథ కాదు. ఖచ్చ్కితంగా గొప్ప కథే. కాబట్టి ఏ మాత్రం సందేహం లేకుండ, అవి అమ్మ, నాన్నలు చెప్పిన కథలా, అవ్వా, తాతలు చెప్పిన కథలా, నేను కల్పించిన కథలా అని ఆలోచించకుండా, మీరు మీ పిల్లలకి చెప్పిన కథలన్నీ ఇక్కడ చెప్పండి. తలలు, మొలలు నరిసిపోయినా, మనందర్లో ఒక పిల్లో, పిలగాడో ఇంకా ఎక్కడో వుంటాడు, వాడా కథల్ని నిజంగా, గుండె నిండుగా, మనసంతా పరచుకునేలా ఎన్జేయ్ చెయ్యగలడు, చెయ్యగలదు. కాబట్టి, అమ్మల్ని, నానల్ని, అవ్వల్ని, తాతల్ని, వాళ్ళందరితోబాటు మీరు కల్పించిన కథల్ని కూడా చెప్పండి. అంతకు మించిన సరళవైన, అద్భుతవైన సాహిత్యం మరొకటిలేదు. నోబెల్ ప్రైజెస్ ఇచ్చే సాహిత్యం నాలుగైదేళ్ళలో మరపుకు రావొచ్చ్కు, కానీ ఏ గుర్తింపూ లేని అమ్మా, నాన్నల సాహిత్య సృష్టి దశాబ్దాల తరబడి, తరాల తరబడి నిలచిపోతుంది.

ఆఖరగా, తిమ్మిని, బమ్మిని చెయ్యొచ్చేవో గానీ, తిమ్మిరెడ్డిని, తమ్మిరెడ్డిని చెయ్యకూడదు కల్పన గారు.

తిమ్మిరెడ్డి రవికిరణ్

భావన said...

చాలా బాగున్నాయి ఈ కధలన్ని. బలే ఐడీయా కల్పన ఇంకా కధలు రాస్తున్న అందరికి.
ఆఖరు గా మన తమ్మిరెడ్డీ అదే తిమ్మిరెడ్డి గారి కామెంటు చాలా బాగుంది.

Kalpana Rentala said...
This comment has been removed by the author.
Anonymous said...

"ఇహిహి , నీ పేరు ఈగ కాదా అని నవ్వింది"
---------------
ఇంకోటి - మీరే పోస్టు చేసుకోవాలి మరి- నాకు గుర్తున్న కధ.

అనగనగా ఓ రాజుగారు.
ఆ రాజుగారికి ఏడుగురు కొడుకులు
ఏడుగురు కొడుకులు వేటకెళ్ళారు.
వేటకెళ్ళి ఏడు చేపలు తెచ్చారు.
ఏడు చేపల్ని ఎండ బెట్టారు.
అందులో ఓ చేప ఎండ లేదు
చేప చేప ఎందుకు ఎండలేదు అంటే
గడ్డిమోపు అడ్డమొచ్చింది అంది
గడ్డిమోపా గడ్డిమోపా ఎందుకు అడ్డమొచ్చావు అంటే
ఆవు నన్ను మేయలేదు అంది
ఆవూ ఆవూ ఎందుకు మేయలేదు అంటే
గొల్లవాడు మేపలేదూ అంది
గొల్లవాడ గొల్లవాడ ఎందుకు మేపలేదూ అంటే
అవ్వ బువ్వెట్ట లేదూ అన్నాడు
అవ్వా అవ్వా ఎందుకు బువ్వెట్టలేదూ అంటే
పిల్లవాడు ఏడ్చాడు అంది
పిల్లవాడ పిల్లవాడ ఎందుకు ఏడ్చావూ అంటే
చీమ కుట్టింది అన్నాడు
చీమ చీమ ఎందుకు కుట్టావు అంటే
నా బంగారు బొడ్డులో /పుట్టలో వేలు పెడితే కుట్టానా అంది
(పిల్ల/పిల్లవాడి బుడ్డులో గిలిగింత పెట్టి నవ్విస్తూ ముగించాలి)

lalithag said...

రవికిరణ్ గారి వ్యాఖ్య చూశాక మరి ఇంకొన్ని కథలు చెప్పాలనిపించింది:
ఈ మధ్యనే మా అక్క మా అన్నయ్య కూతురికి చెప్తుంటే ఈ కథ నేను కూడా మళ్ళీ చిన్న పిల్లనైపోయి విన్నాను. తర్వాత ఇలా దాచుకున్నాను:
http://www.youtube.com/watch?v=mSpZYCx2F4A

ఇంకా, ఏడు చేపల కథకి మా పిల్లలు అడగగా, కథ సుఖాంతం చేస్తూ కొంచెం పొడిగించి చెప్పిన కథ ఇది:
http://www.youtube.com/watch?v=rIr0Uz44wKY


ఈ కథను పిల్లవాడి బొడ్డులో వేలు పెట్టి సరదాగా ముగించవచ్చని ఇప్పుడే తెలిసింది.అలాగే మిరపకాయ కథ (మధురవాణి గారు తన బ్లాగులో రాశారు) అన్నీ వరసగా గుర్తు పెట్టుకుని గబ గబా చెప్పగలగడం అనే challenge బావుంది. మా పిల్లలకి చెప్పాలి.


కొన్ని కొత్త కథలు తెలుస్తున్నాయి. తెలిసిన వాటికి సరదా twistలు తెలుస్తున్నాయి. చాలా బావుంది.

lalithag said...

శ్రావణ భాద్రపదాలు

అనగా అనగా ఒక బ్రాహ్మడు ఉండే వాడు. ఆయన ఒక సారి చాలా రోజుల కోసం ఊరు విడిచి వెళ్ళవలసి వస్తుంది. అప్పుడు భార్యకు అన్ని జాగ్రత్తలతో పాటు, "శ్రావణ భాద్రపదాలు వచ్చేలోగా ఆవకాయ, ఊరగాయలూ చేసి పెట్టుకో" అని చెప్తాడు. వర్షాకాలం వచ్చాక ఆమెకు సరుకులు తెచ్చుకోవటం ఇబ్బందౌతుంది కనక పచ్చళ్ళు ఉంటే ఆమెకు కలిసొస్తుందని ఆయన ఉద్దేశం. ఈ మాటలు ఇద్దరు దొంగలు వింటారు. బ్రాహ్మడు ఊరు వదిలి వెళ్ళాక, వాళ్ళు బ్రాహ్మణుడి ఇంటికి వచ్చి తమను తాము శ్రావణమూ, భాద్రపదమూ అని పరిచయం చేసుకుంటారు. వాళ్ళాయన చెప్పిన శ్రావణ భాద్రపదాలు వీరే అనుకుని వారికి అతిథి మర్యాదలన్నీ చేసి చక్కగా ఊరగాయలూ అవీ వేసి కడుపు నిండా భోజనం పెడుతూ వస్తుంది. కొన్నాళ్ళకు ఆ దొంగలు దోచుకోవల్సినవన్నీ దోచుకుని, "శ్రావణ భాద్రపదాలు వచ్చి వెళ్ళారని మీ ఆయనకు చెప్పమ్మా" అని చెప్పి వెళ్ళిపోతారు. పాపం ఆ బ్రాహ్మడు తిరిగి వచ్చి జరిగిందంతా తెలుసుకుని భార్యకు శ్రావణ భాద్రపదాలంటే నెలల పేర్లని చెప్పి నెత్తీ నోరూ బాదుకుంటాడు.

ఈ కథకు రూపాంతరం http://kottapalli.in/2008/08/%E0%B0%AA%E0%B1%86%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B0%A6%E0%B0%BF%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B1%81

ఆషాఢభూతి కథ మా అమ్మమ్మ చెప్పినట్లే ఉంది ఇక్కడ:
http://www.maganti.org/PDFdocs/ashadhabhuti.pdf

గాడిద - ఉప్పు బస్తా:
ఒకడు ఉప్పు అమ్ముకునే వాడు. ఉప్పు బస్తాలు రెండు తన గాడిద మీద అటూ ఇటూ వేసి దాన్ని నడిపించుకు వెళ్ళే వాడు. దారిలో ఒక కాలవ దాట వలసి వచ్చేది. ఒక రోజు కాలు జారి గాడిద కాలవలో పడిపోతుంది. తీరా అది లేచి నిలబడే సరికి సంచీల్లో ఉప్పు కాస్తా కరిగిపోయి గాడిదకి బరువు తగ్గి తేడా తెలుస్తుంది. అప్పట్నించీ కొన్ని రోజులు వరసగా కాలు జారినట్టు నటించి గాడిద ఉప్పును నీళ్ళల్లో ముంచేస్తుంది. ఈ విషయం గ్రహించిన యజమాని ఒక రోజు ఉప్పు బదులు పత్తి నింపిన బస్తాలు వేస్తాడు గాడిద మీద. అలవాటు ప్రకారం జారినట్టు నటించి గాడిద నీళ్ళల్లో పడి లేచేసరికి ఆ పత్తి కాస్తా తడిసి మోపెడై గాడిద నడుము విరిగేంత బరువౌతుంది. అప్పట్నించీ బుద్ధి తెచ్చుకుని గాడిద మళ్ళీ సవ్యంగా కాలవ దాటుతుంది.

ఇప్పటికివి. ఇంకా గుర్తుకొస్తే రాస్తాను. (పరవాలేదంటేనే :-))

Kalpana Rentala said...

Lalitha garu,

sraavana bhaadrapadaalu katha nenu koodaa vinnanu. kaani uppu bastaa katha vinaledu. meeru imkaa kotta kathalu cheppaalsimde ani dimaamd chestunnaamu adhyakshaa...

lalithag said...

Thanks for the encouragement Kalpana.
ఇప్పటికి రెండు కథలు. పూర్తిగా గుర్తుకొస్తే ఇంకో రెండు ఇంకెప్పుడైనా చెప్తాను(ఈ లోగా ఇంకెవరూ అవి గుర్తు చేసుకోకపోతే).
అనగా అనగా ఒక రాజు ఉండే వాడు. ఆయనకి కథలంటే చాలా ఇష్టం. ఏ కథైనా చివరికి ఐపోతుంది కదా. అలా ముగింపు లేని కథ కావాలని ప్రకటన చేశాడు. ఏదోలా పొడిగిస్తూ చెప్పలేమా అనుకుని చాలామంది ప్రయత్నించి ఎన్నో నాళ్ళు సాగదీయగలిగారు కానీ ముగించకుండా ఉండలేక పోయారు. అప్పుడు ఒకతను చెప్తానని ముందుకు వచ్చాడు. రాజు గారు కనక కథ ఆపమని అడిగితే తనకు అర్ధ రాజ్యం ఇవ్వల్సి ఉంటుందని షరతు పెట్టాడు. ఒకవేళ తను కథ చెప్పలేకపోతే అతని తల తీసేస్తామని రాజు గారు చెప్పారు. షరతు ఒప్పుకుని అతను కథ మొదలు పెట్టాడు. ఒక రైతు పంట కోసాక పొలంలో ధాన్యం కుప్పలుగా పోసి ఉంచాడు. అప్పుడొక పిచ్చిక వచ్చి ఒక గింజ తీసుకుని "తుర్" మని ఎగిరింది. రాజు గారు బహుశా నవాబు అయుంటాడు. లేదా అరాబీ కథనో మరి ఇది. "ఫిర్?" అని అడుగుతాడు ఆ రాజు. ఆ పిచ్చిక మళ్ళీ వచ్చి ఇంకో గింజ పట్టుకుని "తుర్" మని ఎగిరిపోయింది అని చెప్తాడు కథకుడు. ఇలా చాలా సేపు "ఫిర్","తుర్" లు నడిచాక రాజు గింజలన్నీ తీసుకెళ్ళాక ఏమౌతుంది అని అడిగితే, ధాన్యం కుప్ప ఎంత పెద్దదో, ఎన్ని గింజలు ఉంటాయో, అవన్నీ ఖతం అయ్యే దాకా కథ నడవాల్సిందే అంటాడు కథకుడు. రాజు విసిగిపోయి ఇంక కథ ఆపమంటాడు. షరతు ప్రకారం అర్ధ రాజ్యమూ ఇస్తాడు కథకుడికి.

సరే మరి నా లాగా కథలు చెప్పమని పీక్కు తినే వాళ్ళని ఎలా మాయ చేస్తారు అక్కలూ, అన్నలూ అంటే ఇలాగ:

వాళ్ళు - "నీకు చిన్న కథ కావాలా, పెద్ద కథ కావాలా?"

నేను (ఆశగా) - "పెద్ద కథ!"

వాళ్ళూ - "ఐతే విను. ఒక ఊర్లో నాలుగు తాడి చెట్లున్నాయి. ఒక దాని మీద "పె" అని రాసుంది. రెండో దాని మీద "ద్ద" అని రాసుంది. మూడో దాని మీద "క", నాలుగో దాని మీద "థ". అన్నీ కలిపి చదివితే ఏమయ్యింది?"
నేను - "పెద్ద కథ".
వాళ్ళూ - "అదిగో పెద్ద కథ ఐపోయింది!".

నేను చావని ఆశతో చిన్న కథ ఐనా పర్వాలేదు చెప్పమంటే ఏం చెప్పే వారో ఊహించగలరు కదా.

మిరియప్పొడి said...

super lalitha gfaru

lalithag said...

ఈ కథ మా అక్కని అడిగి గుర్తు చేసుకుని రాస్తున్నాను. ఇందులో నాకు చిన్నప్పుడు ప్రధాన ఆకర్షణ తల్లి పిల్లల పేర్లు పిలుస్తూ పాడడం. ఈ కథ గురించి అడగగానే అది వాళ్ళ అబ్బాయి చిన్నప్పుడు ఇష్టంగా వినేవాడు అని తను గుర్తు చేసుకుంది. నా చిన్నప్పుడు నాకు తను చెప్పింది. తరవాత తన పిల్లలకి చెప్పింది. నేను ఇప్పుడు మా పిల్లలకి చెప్తుంటాను.
------------
రామ గుమ్మడి, రత్న గుమ్మడి, చంచలామణి, పద్మలోచన

అనగా అనగా ఒక కోడి పెట్ట ఉండేది. దానికి నాలుగు కోడిపిల్లలు.
అది రోజూ తిండి కోసం బయటికి వెళ్ళేటప్పుడు పిల్లలని జాగ్రత్తగా తలుపు వేసుకోమని చెప్తూ ఇలా పాడేది:
"రామ గుమ్మడి తలుపు వేయవే. రత్న గుమ్మడి తలుపు వేయవే. చంచలామణి తలుపు వేయవే. పద్మలోచన తలుపు వేయవే."
అలాగే ఇంటికి తిరిగి వచ్చాక ఇలా పాడేది:
"రామ గుమ్మడి తలుపు తీయవే. రత్న గుమ్మడి తలుపు తీయవే. చంచలామణి తలుపు తీయవే. పద్మలోచన తలుపు తీయవే."
అది విని, తల్లి వచ్చిందని తెలిసి కోడి పిల్లలు తలుపు తీసేవి.
పక్కన ఉండే ఓ నక్క వీటిని తిందామని ఆత్రంగా తల్లి బయటికి వెళ్ళాక తలుపు కొడితే ఆ పిల్లలు తలుపు తీసేవి కాదు.
కొన్ని రోజులు ప్రయత్నించి, బాగా గమనించి, తల్లి ఎలా పిలుస్తుందో నేర్చుకుని, ఒక రోజు నక్క కూడా,
"రామ గుమ్మడి తలుపు తీయవే. రత్న గుమ్మడి తలుపు తీయవే. చంచలామణి తలుపు తీయవే. పద్మలోచన తలుపు తీయవే." అని పాడేసరికి, ఆ కోడి పిల్లలు తలుపు తీస్తాయి. అప్పుడు నక్క కోడి పిల్లలను తీసుకుని ఇంతికి తన ఇంటికి వెళ్తుంది. తిరిగి వచ్చిన కోడి పెట్ట తన పిల్లలు ఇంట్లో లేకపోవడం చూసి ప్రతి ఇంటికీ వెళ్ళి,
"రామ గుమ్మడి ఈ ఇంట్లో ఉన్నావా? రత్న గుమ్మడి ఈ ఇంట్లో ఉన్నావా? చంచలామణి ఈ ఇంట్లో ఉన్నావా?పద్మలోచన ఈ ఇంట్లో ఉన్నావా?" అంటూ పాడుతుంది.
నక్క కోడి పిల్లలని రుచిగా వండుకు తిందామని మసాలా కొనుక్కోవడం కోసం బయటికి వెళ్ళి ఉంటుంది. తల్లి "రామ గుమ్మడి ఈ ఇంట్లో ఉన్నావా? రత్న గుమ్మడి తలుపు ఈ ఇంట్లో ఉన్నావా? చంచలామణి ఈ ఇంట్లో ఉన్నావా?పద్మలోచన తలుపు ఈ ఇంట్లో ఉన్నావా?" అని పాడడం విని, పిల్లలు గబ గబా బయటికి వచ్చేస్తాయి. తల్లి పిల్లలని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది.
మర్నాడు నక్క వచ్చి మళ్ళీ,"రామ గుమ్మడి తలుపు తీయవే. రత్న గుమ్మడి తలుపు తీయవే. చంచలామణి తలుపు తీయవే. పద్మలోచన తలుపు తీయవే." అని పాడి తలుపు కొడితే, ఈ సారి కోడి పెట్ట తలుపు తీసి, నక్కని లోపలకి రమ్మంటుంది. మాంసం వండి పెడతానని, పెరట్లో పీట మీద కూర్చుంటే వడ్డిస్తానని చెప్తుంది. ఆశగా నక్క పెరట్లోకి వెళ్ళి అక్కడ ఉంచిన పీట మీద కూర్చుంటుంది. నిజానికి ఆ పీట కింద గొయ్యి తవ్వి అందులో నిప్పులు వేసి పెట్టి దాని మీద పీట వేసి ఉంచి ఉంటుంది కోడిపెట్ట. దాంతో, కాసేపయ్యేసరికి పీటకి మంట అంటుకుని నక్కకి కాలి, పరుగు తీస్తుంది.
--------
ఇంకా కథలు కావాలంటే ముందు మాలా కుమార్ గారి కథలో సూది ఎలా దొరికిందో ముందు చెప్పాలి మరి.
మా చిన్నప్పట్నుంచీ ప్రయత్నిస్తున్నాను. ఇప్పటివరకూ నాకైతే తెలియలేదు :-)

Kalpana Rentala said...

లలిత గారు, మీ కథలన్నీ తాపీగా వూరు నుంచివచ్చి చదివి నవ్వుకుంటూ మళ్ళీ పసితనం లోకి జారుకుంటున్నాను. ఈ సారి వేసవి సెలవుల్లో మావాడికి బోలెడు కథలు చెప్పవచ్చు. కొత్త కొత్త కథలు వోపికగా వచ్చి చెప్తున్నందుకు మీ అందరికి కృతజ్నతలు అనే పదం సరిపోదనుకుంటాను.
లలిత గారు మరిన్ని కథలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాము.ఏరీ లలిత గారు?రావాలి. కథలతో రావాలి.
రేరాజ్ గారు, ఇంకొన్ని కొత్త కథలు చెప్పరాదా? విని పెడతాము. చదివి చెప్తాము.

మిరియ్యపొడి గారు, మీ పేరు బావుంది. మీరు కూడా కథ చెప్పవచ్చు కదా.

సుభగ said...

లలిత గారు, మీరు చెప్పిన పిచుక కథ నేను మరోలా విన్నా నా చిన్నప్పుడు.
రైతు ధాన్యం కుప్పలుగా పోసి ఉంచాక, 'ఒక గుడ్డి పిచుక వచ్చి ఒక గింజ తీసుకుని వెళ్ళిపోతుంది, తర్వాత ఒక చెవిటి పిచుక వచ్చి ఒక ధాన్యపు గింజ తీసుకుపోతుంది, తర్వాత ఒక కుంటి పిచుక వచ్చి ఒక గింజ తీసుకుపోతుంది, ఇలా కొంత కథ అదయ్యాక, ఇంక combinations అన్నమాట, ఒక కన్ను గుడ్డీ, ఒక కాలు అవిటి పిచుక వచ్చి ఒక గింజ తీసుకు పోతుంది, ఇలా కథ ఎంతకీ అయ్యేదే కాదు, మంచి కథ గుర్తుచేసారు :-)

తృష్ణ గారూ..మీరు చెప్పిన రెండు కథలు చిన్నప్పటి తర్వాత ఇప్పుడే వినడం. ఆ రోజులకు భలే తీసుకెళ్ళారండీ, నెనర్లు

lalithag said...

రామ గుమ్మడి కథ ఆడియో సిద్ధం.

http://balasahityam.wordpress.com/2010/11/17/%e0%b0%b0%e0%b0%be%e0%b0%ae-%e0%b0%97%e0%b1%81%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b0%a1%e0%b0%bf-%e0%b0%b0%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a8-%e0%b0%97%e0%b1%81%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b0%a1%e0%b0%bf/?preview=true&preview_id=409&preview_nonce=54662e0fe2

Anonymous said...

మా అమ్మా రామా గుమ్మడి, రత్న గుమ్మడి, పేరు పెద్దలతల్లి, పెద్దప్ప దొరసాని, పద్మనాభుడు అనే పేర్లతో e కథ చెప్పేది.

తనికెళ్ళ శ్రీనివాస్ said...

మా అమ్మ ఈ కథలో రామగుమ్మడి, రత్న గుమ్మడి, పేరుపెద్దల తల్లి పెద్దప్ప దొరసాని ,పద్మనాభుడు అనే పేర్లతో చెప్పేది.

 
Real Time Web Analytics