ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని అభిమానించి ఆదరించేవారందరిని ఇవాళ ఈ ప్రశ్న తొలిచివేస్తోంది. కారణం యోగి వేమన విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. వినోదిని జూన్ 28 సోమవారం ఆంధ్రజ్యోతి వివిధ లో రాసిన వ్యాసం “ క్లాస్ రూమ్ లో కళా ‘పోర్నో’ దయమ్!-” లో అశ్లీల కావ్యాలను సిలబస్ గా పెట్టొచ్చా? అంటూ సంధించిన ప్రశ్నలు. ( మూల వ్యాసాన్ని ఇక్కడ చదవొచ్చు)."
అసలీ కథకు పాఠ్యాంశం గా వుండే అర్హత ఏమిటి? కామోద్దీపనకు తప్ప జ్నానానికి ఏ మాత్రం ఉపయోగపడని కావ్యం ఇది.స్త్రీలను కించపరిచే, స్త్రీ వ్యతిరేకమైన అంశాలు, నడవడికనిసూచించే అంశాలు, భార్యగా స్త్రీ భర్తకు దాసిలా వుండాల్సిన భార్య భర్తల సూడో సంబంధాన్ని ఈ కావ్యం ప్రబోధిస్తుంది.పెళ్ళి ని కేవలం సెక్స్ దృష్టి లొంచే ఈ కావ్యం చర్చిస్తుంది. 16 వ శతాబ్దం లో రచించిన ఈ కావ్యం లోని ఆలోచనలు భావాలు అత్యంత పురాతనమైనవి." ఇవీ కళాపూర్ణోదయం కావ్యం గురించి స్థూలంగా వ్యాస రచయిత అభిప్రాయాలు .
అసలీ కథకు పాఠ్యాంశం గా వుండే అర్హత ఏమిటి? కామోద్దీపనకు తప్ప జ్నానానికి ఏ మాత్రం ఉపయోగపడని కావ్యం ఇది.స్త్రీలను కించపరిచే, స్త్రీ వ్యతిరేకమైన అంశాలు, నడవడికనిసూచించే అంశాలు, భార్యగా స్త్రీ భర్తకు దాసిలా వుండాల్సిన భార్య భర్తల సూడో సంబంధాన్ని ఈ కావ్యం ప్రబోధిస్తుంది.పెళ్ళి ని కేవలం సెక్స్ దృష్టి లొంచే ఈ కావ్యం చర్చిస్తుంది. 16 వ శతాబ్దం లో రచించిన ఈ కావ్యం లోని ఆలోచనలు భావాలు అత్యంత పురాతనమైనవి." ఇవీ కళాపూర్ణోదయం కావ్యం గురించి స్థూలంగా వ్యాస రచయిత అభిప్రాయాలు .
ప్రాచీన తెలుగు సాహిత్యం లో అధికశాతం శృంగార మయం అయినంత మాత్రాన అవి బోధనకు పనికిరావు , అందులో నేర్చుకోవడానికి ఏమీ లేదు అనడం సరికాదు. కళాపూర్ణోదయం మీద వినోదిని చేసిన కామెంట్లు అర్ధ రహితమైనవి. శృంగారం ఎక్కువ పాళ్ళల్లో వుందనో, స్త్రీలను, కింది కులాల వారిని కించపరిచేవిధంగా వుందనో నిషేధించుకుంటూ పోతే ఇక తెలుగు సాహిత్యం లో చదవటానికి, తెలుసుకోవటానికి, నేర్చుకోవటానికి, రసాస్వాదన చేయటానికి ఏమీ మిగలదు. సెన్సారింగ్ చేయబడటం లో వున్న కష్టానష్టాలు తెలిసి కూడా, ఇన్నేళ్ళ స్త్రీవాద, దళిత స్త్రీవాద ఉద్యమాల తర్వాత కూడా వినోదిని ఆ సెన్సారింగ్ కోరుకోవడం, ఆ దిశగా అడుగులు వేయడం కొంచెం ఆశ్చర్యం కలిగించే అంశం.
ప్రాచీన తెలుగు సాహిత్యం మనకొక సాంస్కృతిక సంపద. దాన్ని గుర్తించి గౌరవించాలి.
ఒక చరిత్ర గా దాన్ని తప్పక చదువుకోవాలి కూడా. ప్రాచీన సాహిత్యాన్ని క్లాస్ లో బోధించేటప్పుడు ఇప్పటి సమాజానికి తగిన అంశాల్ని కూడా కలుపుకుంటూ ఒక రచనగా అప్పటి సాహిత్య సామాజిక అంశాల్ని చర్చించవచ్చు.అలా కాకుండా కళా పూర్ణోదయం లోని సుగాత్రి శాలీనుల శృంగారాన్ని కేవలం ఒక adultery గా ఆమె అభిప్రాయపడటం తప్పు.
" కళాపూర్ణోదయం రచన ఉద్దేశం లోనే " బూతు" వుంది. పైగా రచన మొత్తం కూడా విశృంఖల వర్ణనలతో, విచ్చలవిడి వాక్యాలతో వుంటుంది." అన్న వినోదిని ఆరోపణ కేవలం నిరాధారం. ఆమెకున్న అవగాహనారాహిత్యమనే చెప్పుకోవాలి. మొదట వినోదిని అర్ధం చేసుకోవాల్సిన అంశం రొమాన్స్ కి adultery కి వున్న తేడా. ఆలాగే 16 వ శతాబ్దం సాహిత్య, సామాజిక విలువల్ని ఇప్పటికి అన్వయించి, అంగీకరించమని ఎవరూ అడగరు. ఒక ప్రొఫెసర్ గా ఆ పని ఆమె చేయనక్కర లేదు. కళాపూర్ణోదయం లాంటి కావ్యాల్ని క్లాస్ రూమ్ లో బోధించేటప్పుడు వుండే ఇబ్బందులు అర్ధం చేసుకోదగ్గవి.అయితే అందుకు పరిష్కారం ప్రాచీన కావ్యాల నిషేధం కాదు. శృంగారం పాఠ్యాంశానికి పనికి రాదని చెప్పటం మరీ విడ్డూరం. అసలు తెలుగు ప్రాచీన కావ్యాలు , ప్రబంధాలు చదివే వారు తరం తరానికి తగ్గిపోతున్నారు, తెలుగు వాళ్ళకు తెలుగు సాహిత్యం గురించి కంటే ప్రపంచ సాహిత్యం గురించే ఎక్కువ ఆసక్తి కనపరుస్తున్నారని ఒక వర్గం వారు బాధ పడుతుంటే, ఇప్పుడు విశ్వ విద్యాలయ స్థాయిలో కూడాప్రబంధాలు టీచింగ్ కి పనికిరావని వినోదిని లాంటి వారిది కేవల అర్ధ రహిత వాదన.
అసలు వాస్తవానికి కళాపూర్ణోదయం కావ్యానికి తెలుగు సాహిత్యం లో వున్న విశిష్ట స్థానం ఏమిటి? వినోదిని లాగా తెలుగు సాహిత్యాన్ని అకడెమిక్ గా కూడా క్షుణ్ణంగా చదువుకున్న వారు భ్రమపడుతున్నట్లు అందులో వున్నది కేవలం శృంగారమేనా? లేక ఒక సాహిత్య సృష్టి గా అందులో నుండి మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏమైనా వున్నాయా?
నేను ఎంఏ తెలుగు చేసిన విద్యార్ధిని కాదు కాబట్టి ఒక కావ్యం గా కళాపూర్ణోదయం గొప్పతనాన్ని వివరించి చెప్పలేను. అయితే నాకు అర్ధమైనంత వరకూ అదొక అద్భుత కథాకథనం. కథ ఎలా చెప్పాలి, కథ ని ఎలా నడిపించాలి? కథ లో మలుపులు ఎలా తీసుకురావాలి? లాంటి టెక్నిక్కులు తెలుసుకోవాలనుకుంటే పింగళి సూరన రాసిన కళాపూర్ణోదయం కావ్యం చదివి తీరాల్సిందే.
కళా పూర్ణోదయం కావ్యం కేవలం సుగాత్రి శాలీనుల కథ మాత్రమే కాదు. అది అందులో ఒక భాగం మాత్రమే. ఆ కథ లో పాత్రలు కేవలం ఒక కాలానికి సంబంధించినవి కావు. మూడు, నాలుగు జన్మలకు సంబంధించిన కథ. పాఠ్యపుస్తకం లో ఒక భాగం పెట్టాల్సి వస్తే ఏదో ఒక భాగం ఎంచుకోవాలి కాబట్టి సులువుగా అర్ధం కావటానికి సుగాత్రి శాలీనుల కథ పెట్టి వుంటారు. ఈ ప్రత్యేక కథ లో వినోదిని చెప్పినట్లు వారిరువురి మధ్య తొలి కలయిక కి సంబంధించిన వర్ణనలుంటాయి. అసలు ఈ కావ్యం లో శృంగార రసానికి సంబంధించి ఒక విశిష్టత వుందని చెప్తారు.. కవి నాలుగు రకాల శృంగారభావానల గురించి ఇందులో వర్ణిస్తాడు. మొదట బ్రహ్మ, సరస్వతుల మధ్య దివ్య శృంగారం. కలభాషిణి, మణికందరుల మధ్య గంధర్వ శృంగారం, సుగాత్రి, శాలీనుల మధ్య ప్రజాపత్య శృంగారం, సల్యాసురుడు, అభినవ కౌముది ల మధ్య రాక్షస శృంగారం. ఈ నాలుగు రకాల శృంగార స్వభావాల్ని సూరన తన అద్భుతమైన కథాకథన చాతుర్యం తో వర్ణించాడు.
ప్రాచీన సాహిత్యం లో చంద్రకాంతి తప్ప సూర్యకాంతి లేదన్న అపప్రధకు ఎదురు నిలబెట్టాలంటే ముందు మనకున్న అచ్చ తెనుగు ప్రబంధం కళాపూర్ణోదయం. పింగళి సూరన రాసిన రాఘవ పాండవీయం ధ్వర్ధి కావ్యాన్ని పంచ మహా కావ్యాల్లో ఒకటిగా చేశారు కానీ నాకైతే కళాపూర్ణోదయానికి ఆ గౌరవం దక్కి వుండాల్సిందనిపిస్తుంది. మిగతా ప్రబంధ కవుల్లో కనిపించని ప్రతిభా, అద్భుతమైన భావనా శక్తి, పాత్రోచిత పద్య రచనా అన్నీ ఈ కావ్యం లో కనిపిస్తాయి. ఈ కావ్య రచన ఉద్దేశం వినోదిని అభిప్రాయపడినట్లు బూతు కాదు. సూరన ఈ కావ్యానికి రాసిన సంకల్పం లోనే " సకల లక్షణ లక్షితంబైన మహా ప్రబంధం " తానెందుకూ రాశాడో చెప్పాడు. మామూలుగా ప్రబంధ కావ్యాల్లో నవరసాలు అన్నింటికి సముచిత స్థానం దక్కదు. ప్రబంధం లో ఎప్పుడూ శృంగార రసానికే ప్రాధాన్యత. కానీ సూరన తన కావ్యం లో అన్నీ రసాల్ని చూపించాలన్న పట్టుదలతో రాసిన కావ్యం కళా పూర్ణోదయం. అపూర్వ కథా సంవిధానం, కథాకథన చాతుర్యం గురించి తెలుసుకోవాలనుకుంటే, నేర్చుకోవాలనుకుంటే మళ్ళీ మళ్ళీ కళాపూర్ణోదయం చదువుతూ వుండాల్సిందే.తెలుగు భాష వున్నంత వరకూ పింగళి సూరన కు , కళాపూర్ణోదయం కావ్యామ్ రెండూ సజీవం గా ప్రజల హృదయాల్లో సుస్థిరం గా నిలిచి వుంటాయనటం లో ఎలాంటి సందేహం లేదు.
కళా పూర్ణోదయం కావ్యాన్ని తేట తెలుగులో కె.వి. ఎస్. రామారావు గారు చేసిన అనువాదాన్ని ఇక్కడ చదవచ్చు.