నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Sunday, September 12, 2010

వానలో వసంతం !




కనురెప్పల కింద
వొద్దికగా వొదిగి వొదిగి
రెక్క విప్పుకుంటున్న కలలకు
కాపలా కాస్తున్న కళ్ళ చెట్లు

హృదయం లోపల ప్రేమ మొగ్గలకు
మాటలు రాకుండా అడ్డుపడుతున్న పెదాల పువ్వులు

యే స్వేచ్ఛా తీరాల కోసమో
పరుగెత్తాలనుకునే అంటు మొక్కల పాదాలకు
ఎటు చూసినా అడ్డు గోడలే!



ప్రేమలో పడ్డ ప్రకృతి తనువుకి
పదహారేళ్ళ ప్రాయం వసంతం
***
చెప్పా పెట్టకుండా వచ్చేసి చుట్టుకునే ప్రేమలా
ఆకాశం చూరు నుండి హోరున వర్షం

ప్రేమికుల రహస్య సంభాషణల్లా
గాలి గుసగుసలు

వాన కౌగిలింతతో
తడిసి ముద్దయిన కిటికీ రెక్క

ఎప్పటి విరహ వేదనో
ఈ వసంతపు వాన!

కల్పనారెంటాల

(మార్చి 20, 2010 టెక్సాస్ లో తెల్లవారుఝామున భారీ వర్షంతో స్ప్రింగ్ సీజన్ మొదలైనప్పుడు ఆ వసంతపు తొలి వానని స్వాగతిస్తూ రాసుకున్న కవిత సెప్టెంబర్ 13 ఆంధ్రజ్యోతి వివిధ లో ప్రచురితం. వసంతాన్ని ఆలింగనం చేసుకుంటూ రాసిన ఈ కవిత ఆకురాలు కాలాన్ని ఆహ్వానిస్తూ అచ్చయింది. ఈ కవిత కు మంచి చిత్రాన్ని గీసిన చిత్రకారుడు అక్బర్ కి ధన్యవాదాలు)

5 వ్యాఖ్యలు:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

బాగుందండీ!

భాను said...

కల్పనా గారు

ఈ రోజు ఉదయమే వివిధలో మీ కవిత చూసా. వానలో వసంతం చాలా బాగుంది

సవ్వడి said...

కల్పన గారు! చాలా బాగుంది. సూపర్బ్..

భావన said...

కనురెప్పల వెనుక రెక్క విప్పేక కాపలా కాసే కళ్ళచెట్టూ ఆపగలదా కలల రెక్కల కలల విహంగాలను?
ప్రేమ మొగ్గ సువాసనలను విరజిమ్మేటప్పుడు పెదల పువ్వులు నవ్వులు రువ్వవా
అంటుమొక్కల పాదాలుబలమై అడ్డుగోడలెన్నున్నా బీటలు కొట్టీంచి బయటకు రావా కల్పన నీ పిచ్చి కాని. :-)

వసంతపు వాన గుర్తు చెసి రాని వాన కోసం బాధ పెంచేసేవు కల్పన. :-(

అక్షర మోహనం said...

వసంతపు వానకి పదహారేళ్ళ వయసు తడిసినట్లుంది.

 
Real Time Web Analytics