నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Thursday, September 23, 2010

చుప్కే...చుప్కే...చోరీ!(గ్రంధ చౌర్యాలు ---కొన్ని పిట్ట కథలు..)

మాలతీ గారి బ్లాగ్ లో " శారద" “ స్వార్ధ పరుడు" మీద జరిగిన చర్చ లో ఆస్ట్రేలియా శారద ఒక ఆసక్తి కరమైన విషయం చెప్పారు...రావూరి భరద్వాజ గారి కాదంబరి నవల, స్వార్ధపరుడు కి చాలా దగ్గర పోలికలున్నాయని...దాదాపుగా రెండూ ఒకేలా వున్నాయని, అందులో ఒక హోటల్ సర్వర్ పేరు నటరాజన్ అని కూడా.. ఇంత ఆసక్తికరమైన వివరాలు తెలియచేసినందుకు శారద గారికి ధన్యవాదాలు.

అది చూడగానే...నాకు వచ్చిన మొదటి ఆలోచన...శారద రాసిన చిన్న కథ ని చదివి ఆ స్ఫూర్తి తో రావూరి భరద్వాజ గారు ఓ నవల రాసివుంటారని...ఆ మాట ఒకరిద్దరితో కూడా అన్నాను...పాపం శమించు గాక!

అలా అనుకోవటానికి అంతకు ముందు ఒకరిద్దరితో అంతకు ముందు జరిగిన కొన్ని చర్చల ఫలితం కూడా వుందనుకోండి...ఈ మధ్య కాలం లో తరచూ రచయితలు కాపీలు కొట్టేసి వేరే వాళ్ల వర్క్ ని తమది గా చెప్పుకోవటం, లేకపోతే " ఆ, ఈ కథో, ఆ నవలో ఎవరు చదివి వుంటారు లే...” అనుకోని మార్చి రాసేసుకోని తమ పేరుతో చెలామణీ చేయించుకోవటం...లాంటి సంఘటనలు వింటూనే వున్నాము..ఈ రకమైన పనులు చేసిన వాళ్ళల్లో చిన్నవాళ్ళ దగ్గర నుంచి మహా మహా పేరు పొంది రచయితలుగా ట్రెండ్ సెట్టర్స్ ముద్ర వేయించుకున్నవాళ్ళ దాకా అన్నీ స్థాయిల్లో వున్నారు.

ఈ సందర్భంలో మా స్వానుభవం ఒకటి ఇక్కడ గుర్తు చేసుకుంటాను.

2005 లోనో, 2006 లోనో కాలిఫోర్నియా లో ఆటా సమావేశాలు జరిగినప్పుడు యథావిధిగా కథలు, కవితలు, నవలల పోటీ లు నిర్వహించారు..నాకు జ్నాపకం వున్నంత వరకూ ఆంధ్రజ్యోతి వారి సౌజన్యంతో ఆ ఏడాది ఆ పోటీలు నిర్వహించినట్లున్నారు. సరే, పోటీలకు రచనలు ఆహ్వానించారు. అందులోంచి కథల్ని, కవితల్ని ఎంపిక చేసి బహుమతులు ప్రకటించారు. అప్పుడు ఒక తమాషా జరిగింది. కవితాల్లో ఒకాయన కి ( ఆయనో, అబ్బాయో మాకు తెలియదు) కి మొదటి బహుమతి వచ్చింది. ఆ విజేతల పేర్లు కూడా పేపర్లో ప్రకటించేశారు. ఇక ఆ బహుమతి పొందిన కవితలు సువనీర్ లో అచ్చు కావాల్సి వుంది. ఆ సమయం లో తెలిసిన విషయం...ఆ మొదటి బహుమతి వచ్చిన కవిత....కాపీ కవిత...అది శివారెడ్డి నో, మరెవరో ప్రముఖ కవి ఆ కవిత ని గుర్తు పట్టి ఆ విషయాన్ని వెల్లడించారు. దాంతో ఆ కవిత కి ఆ బహుమతి ని వెనక్కు తీసేసుకున్నారు. అలా ఆయనెవరో కాపీ కొట్టిన కవిత ఎవరిదో కాదు...అఫ్సర్ ది..ఆ విషయం తెలియగానే...ఆటా వాళ్ళు నాలికకరుచుకొని అఫ్సర్ కి సారీ చెపుతూ మైల్స్ చేశారు. పాపం ఆ కాపీ కొట్టే ఆయనకు ఆ కవిత అఫ్సర్ ది అని తెలియదనుకోవాలో, లేక ఆ కవిత ని ఎవరూ గుర్తు పట్టలేరనుకున్నాడో ఆ పైన్న వాడికి తప్ప మరొకరికి తెలియదు. అప్పుడు అఫ్సర్ ఒక జోక్ చేశాడు...కాపీ కొడితే కొట్టాడు కానీ.. అప్పుడు ఇప్పుడు కూడా నా కవిత కి మొదటి బహుమతి వచ్చే విలువ వుందన్న విషయం తెలిసేలా చేశాడు అని....అదీ అఫ్సర్ కవిత్వానికి వున్న బలం అని తెలుసుకోవాలి.

ఇక ఇంకో ఉదాహరణ చెప్తాను...ఆ మధ్య కొద్ది కాలం క్రితం సీతాలక్ష్మి గారని మంచి తెలుగు పండితురాలు ( చాలా మందికి తెలిసే వుంటుంది..కానీ తెలియని వారి కోసం....బ్లాగు లో మలక్పేట రౌడీ గా సుప్రసిద్ధులైన వెలమకన్ని భరద్వాజ కు జన్మనిచ్చిన పుణ్యాతురాలు....భరద్వాజా...మీ స్టైల్ లో...హెహెహే.. ..)

మేమిద్దరం ఏదో సాహిత్య చర్చ చేస్తుంటే ఆవిడ ఒక ఆసక్తి కరమైన విషయం చెప్పారు...అడవి బాపిరాజు గారి నవల తుఫాన్ కి, యద్ధనపూడి సులోచనారాణి గారి ప్రసిద్ధ సెక్రెటరీ నవల కి దగ్గర పోలికలున్నాయని. అడవి బాపి రాజు గారి రచనలంటే ఆమెకు ప్రాణం. అలాగే సులోచనారాణి గారి అంటే అమితమైన అభిమానమున్న ఆవిడ నోటి నుంచి ఈ అభిప్రాయం విని నోరెళ్ళబెట్టడం నా వంతు అయింది...అదేమిటండీ బాబూ..ఇంత మంచి విషయాన్ని ఎక్కడా రాయకుండా ఇలా మీ దగ్గరే దాచుకున్నారు....ఇక లాభం లేదు...మీరొక వ్యాసం రాసేసేయండి..ఏ ఆంధ్రజ్యోతి వివిధ వాళ్లకే ఇచ్చేసి అచ్చేయిద్దాము. అసలే వాళ్ళకు ఈ మధ్య మంచి వ్యాసాలు ఏవీ దొరకటం లేదు...( సారీ కె. శ్రీనివాస్) ప్రపంచం మొత్తానికి ఈ విషయం తెలియచేద్దాము అన్నాను....పాపం ఆ తెలుగు టీచర్ గారు...కొంచెం మొహమాటపడి రాస్తానండీ అన్నారు కానీ...ఇప్పటి వరకూ రాయలేదు...ఈ విషయం మలక్ పేట రౌడీ కి తెలియదు..లేకపోతే 500 కామెంట్లు వచ్చే పోస్ట్ ఒకటి రాసే పడేసేవారు...( సారీ రౌడీ గారు....మీకు ఆ ఛాన్స్ ఇవ్వటం లేదు).

ఇక మూడో విషయం...ఈ కాపీ కొట్టే రచనల గురించి ఒక ప్రముఖ రచయిత్రి అనుభవం మీలో ఎంత మందికి తెలుసో లేదో అని మళ్ళీ ఇక్కడ గుర్తు చేస్తున్నాను.
మనందరి అభిమాన రచయిత యద్దనపూడి సులోచనారాణి నవలలు మొత్తం తమిళం లోకో, కన్నడం లోకో పూర్తిగా అనువాదమైపోయాయి. అది మంచి విషయమే కదా అనుకొకండి. అనువాదమైంది ఆమె పేరుతో కాదు,,,వేరేవరి పేరుతోనో. ఆ విషయం తెలుసుకున్న సులోచనారాణీ గారు ఒక మూడు నాలుగేళ్ళ క్రితం అనుకుంటాను...ఒక పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ విషయం లో ఆమె కోర్టుకీ కూడా వెళ్ళినట్లు తెలుసు,దానివల్ల పెద్ద గా ఉపయోగం లేకపోయినా....సులోచనారాణి గారి కథనం ప్రకారం దీని వెనుక వున్న ప్రసిద్ధ రచయత( ఆమె పేరు బాహాటం గా చెప్పకపోయినా ) ఎవరో ( యండమూరి వీరేంద్రనాథ్ అని వినికిడి) అందరికీ తెలుసు.

” ఎనకు తమిళం తెరియాదు...కన్నడ కురియాదు ( కన్నడం రాదు కాబట్టి ఏదో ప్రాస కోసం వాడాను.} కాబట్టి నేను చదివి చెప్పలేను. ఎవరైనా తమిళ తంబి లు...( సోదరీమణులను ఏమంటారబ్బా తమిళం లో.?)చెప్పాల్సిందే..అది నిజమైతే...అదే...నిజమైతే....హా..హతవిధీ...

ఇది కాక తాజా గా ఈ ఇతివృత్తం అలియాస్ కథాంశం చోరీల వివాదం లో చిక్కుకున్న ఖదీర్ బాబు, గోపిని కరుణాకర్ ల విషయం లో కూడా ఆరోపణలే తప్ప...నిజానిజాలు..ఎనకు తెరియాదప్పా....

ఇప్పుడు మళ్ళీ పాపం రావూరీ భరద్వాజ గారి దగ్గ్రకు వస్తాను....

నిన్న కారు లో వెళ్ళేటప్పుడు ” ఏంటీ మాలతి గారి దగ్గ్రర విశేషాలు? ఈ మధ్య నువ్వు బొత్తి గా ఆమె తో మాట్లాడినట్లు లేవు? అని ..పతి దేవుడు ఎంతో ప్రేమతో మాలతి గారి గురించి అడిగాడు...
నాకు టక్కున శారద గారి కామెంట్ గుర్తొచ్చి....కాదంబరి వెర్సస్ స్వార్ధ పరుడు మీద ఆవేశం గా లెక్చర్ ఇచ్చేశాను...పాపం ఆ మానవుడు డ్రైవ్ చేస్తూ కూడా నా ప్రసంగానికి తట్టుకున్నాడు..నా ఆవేశం చల్లారాక...అతి నిదానం గా నా నోరు మూయించాడు....
అఫ్సర్ చెప్పిన విషయాలు ఏమిటంటే....ఆహా. ఆ విషయం అంత తొందరగా చెప్పేస్తే ఎలా...సహనం స్త్రీలకే కాదండీ ....పాఠకులకు కూడా వుండాలి...( ఇది నా కొత్త స్లోగన్)

( ఇంకో టపా కోసం ఎదురుచూడండి...చూస్తూనే వుండండి....)

నోట్: బాబూ, ఈ పోస్ట్ లో చాలా చోట్ల స్మైలీ లు పెట్టాలని ప్రయత్నించి విఫలమైనాను. అర్థం చేసుకోండి.

20 వ్యాఖ్యలు:

kavitha said...

ఇప్పుడే నేను మా తమ్ముని తో చాట్ చేస్తూ ' five point some one ' novel ని ౩ idiots లో ఎలా కాపీ చేసారో మాట్లాడుకుంటున్నాం. అప్పుడే మీ ఈ వ్యాసం చదివాను. ఇప్పుడు చాల కామన్ అయిపోయిందండి. హ్మ్న్ ఏమి చేస్తాము...

ఇది నా తొలి కామెంట్ మీ బ్లాగ్ లో...చాల నచ్చింది నాకు మీ బ్లాగ్. మీ కల్హార తో సహా...త్వరగా మీ suspence విప్పండి....

శరత్ కాలమ్ said...

మీ టపా వల్ల సాహిత్యానికి చెందిన కొన్ని సైడ్ లైట్స్ తెలుసుకున్నాను. టపా సరదాగానూ వుంది. అఫ్సర్ గారికి కూడా ఆవేశంగా లెక్చర్లూ ఇస్తుంటారన్నమాట!

కొత్త పాళీ said...

brilliant :)

మీరు స్మైలీలరాణి మధురవాణి (నాక్కూడ ప్రాసలొచ్చేస్తున్నై) గారి దగ్గర అర్జంటుగా ట్యూషనుకి చేరిపోవాలి.

తుఫాను, సెక్రటరీ పోలికలు నాకూ తట్టాయి తుఫాను చదివినప్పుడు. కానీ కాపీ అనలేమనే నా భిప్రాయం. యద్దనపూడి ఇంచుమించుగా అదే ఫార్ములాని కీర్తికిరీటాలు, ఇంకో నవల్లో కూడ వాడారు.

ఈ విషయం సినిమాల చర్చల్లో జరిగిందో లేదో నాకు తెలీదు. మోహనకృష్ణ అష్టాచెమ్మా సినిమా చూసి బాగా ముగ్ధుణ్ణయ్యాను. సుమారు ఆర్నెల్ల కిందట ఆస్కార్ వైల్డ్ ప్రసిద్ధ నాటకం The Importance of Being Earnest చదువుతూ ఒక్క పదిపేజీలు చదివేప్పటికీ నా కళ్ళు బైర్లు కమ్మాయి. మోహనకృష్ణ మక్కీకి మక్కీ దించేశాడు, ఆఖరికి తనికెళ్ళ - హేమ ప్రేమాయణంతో సహా. కానీ 19వ శతాబ్దపు విక్టోరియన్ ఇంగ్లాండుని ఇరవయ్యొకటో శతాబ్దపు కోనసీమకి అంతలాఘవంగా ఎక్కడా అనుమానం రాకుండ తర్జుమా చెయ్యగలిగిన అతని నేర్పుని మెచ్చుకోకుండా ఉండలేకపోయాను.

తెలుగుయాంకి said...

పిట్ట కథలు బాగున్నాయి. తన్హాయి సీరియల్ గా రాస్తున్న ఎఫెక్టా ఇది.. టపాను కూడా సీరియల్ చేసారు :-)

Kalpana Rentala said...

@కవిత---మీ తొలి కామెంట్ కి స్వాగతం.కల్హారా ....అభిమానినా మీరు, మరి చెప్పేరు కాదూ...మీ కల్హార కాదు...మన కల్హారా..సస్పెన్స్ వుంటేనే బావుంటుంది. వుందనిద్దాము.

@శరత్ --అఫ్సర్ గారికి కూడా....కాదు....అఫ్సర్ గారికే ...ఇంకెవరు వింతారు, మన ప్రసంగాల్...
@కొత్తపాళీ--అవును. మంచి విషయం గుర్తు చేశారు. నేను ఆరు నెలల క్రితం మోహన కృష్ణ తో మాట్లాడినప్పుడు ఈ సినిమా విషయం చర్చ కు వచ్చింది. నేను సరిగ్గా చూడలేదో, సరైన టైం లో చూడలేదో కానీ నాకు ఈ సినిమా అంత గొప్పగా అనిపించలేదు. ఆ హాస్యం అసలు నచ్చలేదు. గ్రహణం చూసిన కళ్ళతో చూడటం వల్ల అనుకుంటాను...అప్పుడు తను ఆ సినిమా ఏదో ఇంగ్లిష్ కథకు స్ఫూర్తి గా తీశాను అన్నట్లు వున్నాడు కానీ .....మరి నాకు గుర్తు వూన్నంత వరకూ ఆస్కార్ వైల్డ్ నాటిక కి అనుసరణ అని సినిమా కు ముందు క్రెడిట్స్ ఇచ్చినట్లు లేదు...చూద్దాము మా ఇష్టపది తమ్ముడు కి ఏమైనా ఎక్కువ వివరాలు తెలుసెమో....

@తెలుగు యాంకీ....తన్హాయి ప్రభావం నుంచి తప్పుకొని ఏదో ఒకటి సరదాగా రాయాలనుకున్నాను. సీరియల్ కాదులే ఇంకొక చిన్న పోస్ట్....అంతే

మాలతి said...

:)) ఇదివరకు థీసిస్ అంటే తీసి, తీసి రాయడం - అంటే ఆ పండితుడు అలా అన్నాడు, ఈ పండితుడు ఇలా అన్నాడు అంటూ పేజీలు నింపేసుకోడమే అని విన్నాను. ఇప్పుడు కథలు కూడా అంతే. పోనీలే, అచ్చులో లేని పాతకథలన్నీ ఇలాగైనా వెలుగు చూస్తున్నాయని సంతోషిద్దాం.
-మాలతి

Kalpana Rentala said...

" ఇదివరకు థీసిస్ అంటే తీసి, తీసి రాయడం - "

మాలతి గారు సూపర్ జోక్. మా జర్నలిస్ట్ పరిభాష లో ఇలాంటి వాటిని " ఎత్తిపోతల పథకం " అంటారు. ఎవరు రాసినదైన ఎత్తేసి మార్చేసి మన పేరు తో వెసుకుంటే...

Malakpet Rowdy said...

జన్మనిచ్చిన పుణ్యాతురాలు
__________________

రౌడీలకి జన్మనిచ్చినవారు పుణ్యాత్ములా? తెలుగు సినీమాల్లో మోహన్ బాబుకి నీతులు చెప్పే అన్నపూర్ణలాగా?


కాపీకొట్టడం అనేది సంగీత సాహిత్యాలలో మమూలే లేండి.

Kalpana Rentala said...

మలక్పేటరౌడీ,

ఏదో మీ అంత మంచి హాస్యం, వ్యంగమ్ రాయటం రాదు కదా. ఏదో ప్రయత్నించాను. మీరు రౌడీ లాగా అల్లరి చేసినా, మీ అమ్మగారు చాలా సౌమ్యం గా, మృదువు గా నెమ్మదిగా మాట్లాడతారు కదా...అందుకు ఆవిడ తప్పక పుణ్యాత్మురాలే...మోహన్ బాబు తో మీరే పోల్చుకున్నారు. మీ టైప్ లో చెప్పాలంటే ...నా దగ్గర రుజువు వుంది కానీ నేను ప్రూఫ్ చేయలేను....

మీకు తెలియటం లేదు..మీ అమ్మగారి దగ్గర మంచి సమాచారం వుంది. ఆమె చేత వ్యాసాలు రాయించే బాధ్యత మీదే....ఏమంటారు?

కొత్త పాళీ said...

మాలతి గారు, "థీసిస్ అంటే తీసి, తీసి రాయడం" .. యకడమీకుల నడ్డి విరగ్గొట్టారుగా! హ హ హ
కల్పన .. ఎత్తిపోతల పథకం .. భలే. మా ఇంజనీరింగ్ కాలేజి రోజుల్లో ఎసైన్మెంట్లని ఇలాగే పిలిచేవాళ్ళం :)

జేబి - JB said...

కల్పనగారు, పిట్టకథలు కొన్ని విషయాలు తెలియజేశాయి, కృతజ్ఞతలు.

@కవిత: ఫైవ్ పాయింట్ సంవన్ హక్కులు కొనే త్రీఇడియట్స్ తీశారు; చౌర్యమేమీలేదు. ఇంకా, హక్కులు తీసికొనీ, తన కథను ఇష్టమొచ్చినట్లు మార్చారని చేతన్ భగత్ నిర్మాత (విదువినోద్ చోప్రా),దర్శకుల (హిరాణీ) మీద కోర్టుకెక్కాడు.

@కొత్తపాళీ, @కల్పన: మోహనకృష్ణ ఆ నాటిక స్ఫూర్తని తీసేటప్పుడే చెప్పాడు. http://www.idlebrain.com/movie/postmortem/ashtachemma.html

సినిమా కథాచౌర్యాల చర్చల్లోకి వెళ్ళితే ఇక దానికి అంతుండదు.

cbrao said...

"రావూరి భరద్వాజ గారి కాదంబరి నవల, స్వార్ధపరుడు కి చాలా దగ్గర పోలికలున్నాయని...దాదాపుగా రెండూ ఒకేలా వున్నాయని" -నటరాజన్ తెనాలిలో హోటల్ లో పనిచేస్తున్న దరిదాపుల్లో, రావూరి భరద్వాజ తెనాలి నుంచి ఆలపాటి రవీంద్రనాథ్ సంపాదకత్వంలో వెలువడే జ్యోతి మాసపత్రికలో పని చేస్తున్నారు. శారద కధ చదివిన స్ఫూర్తితో భరద్వాజ తన నవల వ్రాసి ఉండవచ్చు. ఆ రెండు రచనలు నేను చదవలేదు. ఒక రచన చదివి inspire అయి వ్రాసే రచనలను కాపీ అనవచ్చునా? ఒకే సామాజిక పరిస్థితులలో నివసించిన ఈ ఇద్దరూ ఒకే విషయం పై స్పందించి తమ పద్ధతిలో తమ రచన వెలువరించి ఉండవచ్చు. Great men think alike అని నానుడి. ఖచ్చితంగా తెలుసుకోవాలంటే భరద్వాజ గారిని అడిగి తెలుసుకోవచ్చు.

budugu said...

kotta paaLeee gaaru,

mohanakrishna duly credits oscar wilde and openly mentioned that it was inspired by that story. (he did nt breach any rights).

same with 3idiots too. they bought the rights to adapt 5.someone.
just an fyi.

Anonymous said...

Kalpana garu - chala bavundi.

@ Kottapali garu

ASHTACHEMMA credits lo, OSCAR WILDE kadha the importance of being ernest ani rasaru. Adi nenu cinima aipoyaka, pattubaTTi choodadam valla (akharna vacche creits lo) telusukunnanu.

Anonymous said...

A Anonymous comment nadi. (Ernest)

- sujata (gaddipulu)

కొత్త పాళీ said...

@ Sujata and Budugu - ok, thanks. glad Mohanakrishna has that much integrity!

Anonymous said...

ఆ కాపీ కొట్టిన కవిత అఫ్సర్ ది...హన్నా..నేను చదివినంత వరకు అఫ్సర్ గారి కవితని తేలికగా గుర్తు పట్టవచ్చు..మరి ఆ గుడ్డి న్యాయ నిర్ణేతలెవరో, అంత గుడ్డి గా వుంటానికి! దయచేసి, ఆ కవిత ఏమిటో చెప్పండి, ఈ చర్చల రచ్చలో కనీసం ఒక మంచి కవిత చదివినట్టు వుంటాది.

ఆ.సౌమ్య said...

హ హ హ హాస్యం రాయడం రాదంటూనే బాగా రాసారుగా. చురకలు బాగానే అంటించారు, ఇంతకీ అఫ్సర్ గారేమి చెప్పారు? మేమైనా కుటుంబరహస్యాలడిగామా ఓపికతో వేచి చూడడానికి ;) తొందరగా రాయండి.

కొత్తపాళీ గారూ
అష్టాచమ్మా సినిమా నాకూ చాలా ఇష్టం, ముఖ్యంగా అందులో సంభాషణలు. ఆ సినిమా టైటిల్స్ లోనే thanks to OSCAR for his WILD imagination అని రాసారు. టైటిల్స్ చూస్తున్నప్పుడు అదేదో జోక్ అనుకున్నాను. ఆహా ఇదా సంగతి!

కానీ అది అచ్చ ఇంగ్లీషు పుస్తకం, ఇది అచ్చ తెలుగు సినిమా...మోహనకృష్ణగారికి క్రెడిట్స్ ఇచ్చేయాల్సిందే :)

వేణూశ్రీకాంత్ said...

టపా బాగుందండీ. బాధాకరమైన విషయమైనా సరదాగా రాశారు.
First line in end credits for అష్టాచమ్మ was "To OSCAR for WILDE INSPIRATION !"
అంటే సినిమాను తనకి అంకితమిచ్చినట్లే కదా ఆ విషయంలోనూ మోహన కృష్ణని మెచ్చుకోవాల్సిందే

Kalpana Rentala said...

@కొత్తపాళీ, జెబి,సి బి రావు గారు, గడ్డిపూలు సుజాత గారు( కరెక్ట్ గానే చెప్పానా?)బుడుగు, సౌమ్య, వేణూ శ్రీకాంత్ మీ అభిప్రాయాలు చెప్పినందుకు ధన్యవాదాలు....

రావు గారు, భరద్వాజ గారు ఆ టైం లో జ్యోతి లో పనిచేశారన్న వివరం మీ నుంచి తెలుసుకోవటమే. నాకు తెలియదు. అందుకు ధన్యవాదాలు..

సుజాత గారు, మీ నో కామెంట్ల సంఘం లో నన్ను చేరుకోరాదూ...బొత్తిగా నాకు ఎవరూ ఎందులో సభ్యత్వం ఇవ్వటం లేదు...

సౌమ్య...హాస్యం ఒక టపా లో నాలుగు వాక్యాలు రాసేటప్పటికి.....చాలా కాష్టమైపోయింది. అందుకే రెండో భాగం ఎంత మామూలుగా రాశానో చూడండి. అందరికీ మాయా శశిరేఖా లెవెల్ లో హాస్యం వ్యంగమ్ రాయాలన్నా వస్తుందా చెప్పండి...

బుడుగు, వేణూ శ్రీకాంత్, జె బి....ఆ క్రెడిట్స్ అన్నీ నేను చూడలేదు అంది. ఏదో ఇంటర్వ్యూ లో చెప్పారని మీరు చెప్పారు...అలా అయితే ఓకే. కానీ ఆస్కార్ వైల్డ్ నాటికకు తెలుగు అనుసరణ అనేది సినిమా ముందు వేస్తే కొంచెం ప్రముఖంగా తెలిసి వుండేడెమో...మాలాంటి వాళ్ళం మిస్ అయి అపార్థం చేసుకోకుండా వుండటానికి....

 
Real Time Web Analytics