" గుర్తుకొస్తున్నాయి " శీర్షికన ఏమైనా రాయమని అడిగారు ప్రమదావనం ప్రమదలు. ఏం గుర్తుకొస్తున్నాయి? ఏం రాద్దాం? అనుకుంటూ ఒక కప్పు కాఫీ పెట్టుకుందామని వంటింటి లోకి వెళ్ళగానే దేని మీద రాయొచ్చో ఒక అవుడియా వచ్చేసింది. అమ్మాయిలకు వంటింటి లోకి వెళ్ళగానే అమ్మ గుర్తుకు వస్తుంది. నాకు మాత్రం మా నాన్న గుర్తుకు వస్తారు. నన్నూ, నా వంటింటి ని అంతంగా ప్రభావితం చేసిన ఆయన మహోపకారం కూడా గుర్తుకువస్తుంది.
నేను టెన్త్ లోనో,ఇంటర్ లోనో వున్నప్పుడు ఒకరోజు మా నాన్నగారితో సంఖ్యాశాస్త్రం నుంచి సాహిత్యం దాకా సవాలక్ష విషయాల్లో సందేహాలను అడుగుతున్న సమయాన మా అమ్మ వచ్చి " ఎప్పుడూ చూసినా మీ నాన్న తో కబుర్లేనా? వంటింటి లోకి రా, కనీసం కూరలు తరిగి పెడుదువు గానీ!” అంటూ ఆర్డర్ పాస్ చేసింది.
అప్పుడు నా పితృదేవుడు మా అమ్మ ఆర్డర్ ని ధీటుగా ఎదిరించి " ఛత్ నా కూతురికి వంట నేర్చుకునే ఖర్మెమిటి? దానికి నేను పెట్టిన పేరేమిటి? నువ్వు చెయ్యమంటున్న పనులేమిటి? అరిసెలు వత్తడం ఎవరైనా చేస్తారు. నేర్చుకుంటే ఎవరికైనా వస్తుంది. కానీ మంచి పుస్తకాలు చదవడం, రాయడం అందరికీ వచ్చే విద్య కాదు. " అంటూ ఎదురు క్లాస్ తీసుకుంటే మా అమ్మ మూతి మూడు వంకర్లు తిప్పి లోపలకు వెళ్ళిపోయింది.
అప్పుడు డిసైడ్ అయ్యాను. ఆ రాయటం ఏదో కష్టపడి నేర్చుకుంటే వంట చెయ్యక్కరలేదనుకున్నాను. అలా మొదలైంది నాలో రాయాలన్న తపన..తృష్ణ...
అలా మా నాన్న నన్ను వంటింటి లోకి వెళ్ళకుండా రక్షణ కల్పించటం వల్ల చాలా మంది అమ్మాయిలు పద్ధతి ప్రకారం వైనంగా నేర్చుకునే కుట్లు,అల్లికలు, పూలు మాలలు కట్టడం, కంది పచ్చడి రోట్లో మెత్తగా రుబ్బడం లాంటివి ఏవీ రాకుండానే పెద్దదాన్ని అయిపోయాను.
సామాన్యం గా మగవాళ్ళు పెళ్ళి చేసుకోవాలంటే స్వేచ్ఛ పోతుందని భయపడిపోతారు. కానీ నేను పెళ్ళి చేసుకుంటే వంట చేయాల్సి వస్తుందని భయపడి పోయాను.
కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలిగా!
అలా అనుకోని పోనీలే, వంటే కదా, పక్కవాళ్లకు నేర్పిద్దాం లే అని పెళ్ళి చేసుకున్నాను.
ఇక వంటింటి లోకి వెళితే కుక్కర్ ఎలా పెట్టాలో తెలియదు, ( ఇంట్లో మనం చేసిన పని ఏదైనా వుంటే...పది విజిల్స్ రాగానే స్టవ్ ఆపేయ్యటమే)ఇడ్లీ పిండికి ఏ కొలతలు, గ్రైండర్ ఎలా పనిచేస్తుంది, అది ఆగకపోతే రీసెట్ బటన్ ఎక్కడుంటుంది లాంటి జనరల్ నాలెడ్జి బొత్తిగా నిల్.
నా ఖర్మ చాలక నేను వంటింట్లో కుస్తీలు పడుతున్న రోజుల్లో మా ఇంట్లోకి రెండు కూరగాయలు వచ్చి నా ప్రజ్నా పాటవాల్ని మరింత బట్టబయలు చేశాయి. ఒకటి పొట్లకాయ, రెండోది సొరకాయ . రెండూ వేటికవే గొప్ప కూరగాయలు లెండీ! ఇక చూస్కొండి నాకు డౌట్స్ మీద డౌట్స్. పొట్ల కాయకు చెక్కు తీయాలా, వద్దా? సొరకాయ కి తొక్కు తీస్తారని తెలుసు( కొంచెం పనిమంతురాలినే కదా) . అప్పటికే మనకి కొద్ది మందికి తాట తీసిన అనుభవం వుంది కదా. ఆ రెండింటి కి లోపల అదేమిటో తెల్లగా బ్రహ్మ పదార్ధం, కొన్ని గింజలు కనిపించాయి. అవేం చేయాలో తెలియలేదు. పారేయ్యాలా? లేక అవి కూడా ముక్కలతో పాటు వేసి కూర చేయాలా? అని.
అలా అప్పటి నుంచి నేను , నా వంట కొద్ది కొద్దిగా ఎదుగుతూ వచ్చాము. ఇప్పుడు ఈ దేశం లో ఏదైనా పాట్ లక్ ఫంక్షన్ అంటే ఏవో నాలుగైదు రకాల వంటలు చేసుకొని తీసుకెళ్లగలిగే స్థాయి కి ఎదిగాను.
అయినా కూడా విధికి నా మీదేప్పుడూ చిన్న చూపే!
సునాయాసం గా వంట చేయగలిగే స్థాయి కి ఎదిగినా సరే...నాకు తెలుగు భాష లో నచ్చని అనేక పదాల్లో ఒకటి " రెసెపీ". అసలు ఎవరైనా ఏదైనా ఇలా చేయండి అని చెప్తే తింగరిబుచ్చి లాగా తప్పకుండా అలా చేయకుండా వుండెలా జాగ్రత్త పడతాను.
ఒక గ్లాస్ కి రెండు గ్లాసుల నీళ్ళు పోసి అన్నం వండమని ఎవరైనా చెపితే ఒకటి కి ఒకటిన్నరో, రెండున్నరో పోసి ఎలా వస్తుందో చూడాలని నాకు మహా ఉత్సాహం గా, క్రియేటీవ్ అవుడియాలు అన్నీ వస్తుంటాయి.
ఇండియా లో ఎప్పుడూ ఈ రెసెపీ ల అవసరం పడలేదు. బండి ఎలాగోలా నెట్టుకొచ్చేసాము. అదృష్టవశాత్తూ పేపర్ ఆఫీస్ లో ఉద్యోగం..మధ్యాహ్నం వెళితే ఏ రాత్రి 11 కో, 12 కో ఇంటికి చేరటం.చేతి కింద నలుగురు పనివాళ్ళతో " సర్వ స్వతంత్రం " గా బతికాను. నేను వంట బాగా చేయాల్సిన టైం వచ్చేసరికి ఇండియా లో రెస్టారెంట్ల కల్చర్, కర్రీ పాయింట్ల కల్చర్ పెరిగింది. అలా అవన్నీ నన్నూ, నా మాంగల్యాన్ని కాపాడాయి.
నా జాతకం లో మహర్దశ అయిపోయేటప్పటికి నేను అమెరికా వచ్చి పడ్డాను. ఇక మా నలుగురు పని మనుషులు చేసే పని, మా ఇంట్లో మా ముగ్గురి పని ( నా పని కూడా నేనే చేసుకోవాల్సి వచ్చిందని ప్రత్యేకం గా మనవి చేసుకుంటున్నాను.) కూడా నేనే చేయాల్సి వచ్చింది.
వారం వారం ఎక్కడో అక్కడ పాట్ లక్ లు. ఏదో ఒక మహత్తర వంటకం చేసి తీసుకెళ్ళాలి. అక్కడితో మన పని అయిపోదు. అది తిన్నాకా వావ్, వీవ్ అంటూ కాకుల్లా ఏవో ధ్వనులు చేసి ఎలా చేయాలి అంటూ రెసెపీ లు అడుగుతారు. ఏమిటి చెప్పటం నా మొహం వాళ్ళకు...మనకు అన్నీ ఉజ్జాయింపు గా వేయటమే తెల్సు కానీ కొందరేమో సుతారం గా ఉప్పు వేయటానికి కూడా ఒక స్పూన్ తీసుకొని తయారవుతారు. ఇంత ఉప్పు తీసుకొని అలా పడేసి ఆ చేతిని ఇలా నైటీ కో, ఫాంట్ కో పులుముకోవడం మన సంప్రదాయం, ఆచారం . ఏ మాటకామాటే చెప్పుకోవాలి. నేను మాత్రం ఇలాంటి ఆచారాల్ని తూచా తప్పకుండా పాటిస్తాను..
మొదట్లో ఈ పాట్ లక్ లకు పులిహోర చేసి తీసుకెల్ళేదాన్ని.అదైతే వీజీ...వీజీ...అప్పట్లో మా దగ్గర ఒక్క తెలుగు మొహంకూడా వుండేది కాదు. సౌత్ ఇండియన్ ఫుడ్ అంటూ ఏది తీసుకెళ్ళినా మొత్తం గిన్నె అంతా ఖాళీ చేసెసేవారు. కానీ ప్రతి సారీ అదే తీసుకెళ్లలేమ్ కదా. అలా తీసుకేళితే మనకు పెద్దగా వంటలు రావన్న విషయం తెలిసి పోతుంది కదా. పైగా వాళ్ళేమే కష్టపడి రాజ్మా కూర్మా లాంటివి చేసుకొస్తుంటే మనకు కూడా ప్రేస్టేజి పాయింట్ వచ్చేసింది. అది నాకె కాదు మొత్తం సౌత్ కె అవమానం గా ఫీల్ అయి వెరైటీ వంటలు నేర్చుకోక పోతే ఇక్కడ ఐడెంటిటీ ఇస్యూ వస్తుందని భయపడ్డాను.
ఇక అప్పటి నుంచి నా కష్టాలు మొదలండీ బాబూ...రెసెపీ ల కోసం వెతకటం..నెట్ ఎక్కి కూర్చొని ఆంధ్ర వెజిటేరియన్ అని కొట్టగానే వందలాది వెబ్సైట్లు, రెసెపీలు, యూ ట్యూబ్ లింక్ లు కూడా. ఇండియాలో వున్నప్పుడు ఎవరైనా చేసి పెడితే తినడం, లేకపోతే కొనుక్కోని తినడం తప్ప..ఈ కుక్ బుక్ ల కల్చర్ బొత్తిగా మనకు అలవాటు లేదయ్యే! అలాంటిది నెట్ లో నుంచి రెసెపీ లు ప్రింట్ చేసుకోవడం, పక్కన పెట్టి అది చదువుతూ వంట చేయడం...
అదేమిటో నేను రెసెపీ ప్రకారమే చేద్దామని కొన్ని సార్లు అనుకునేదాన్ని కానీ ఎప్పుడూ కూడా అందులో చెప్పినవి ఒకటో రెండో నా దగ్గర వుండేవి కావు. పోనీలే లేని వాటిని వదిలేసి వున్న వాటితో చేసుకుందాం అని అలా చేసెసేదాన్ని. ఈ సారి షాపింగ్ కి వెళ్ళినప్పుడు గుర్తు గా అవి తెచ్చేదాన్ని. కానీ ఇంకో రెసెపీ లో ఇంకేవో అడిగేవాడు.ఇలా నా కిచెన్ కౌంటర్ నిండా వెనెగర్, సోయి సాస్ లాంటి బ్రహ్మ పదార్దాలు అన్నీ వచ్చి చేరిపోయాయి కానీ వాటిని నేను మూత తీసి వాసన చూసే సందర్భాలు కూడా రాలేదు.
ఇలా వుండగా...నాకు ఇంట్లోనే ప్రతిపక్షం తయారైంది.
నాకెమో ఏవీ లేకపోతే వేడి అన్నం, కంది పచ్చదో, పొడి నో వుంటే చాలు. అఫ్సర్ కెమో కక్కా, ముక్కా తిన్న నోరు....మనమేమో ప్యూర్ ఆంధ్రా వెజిటేరియన్ ఫుడ్ తో సంవత్సరాల తరబడి వాయించేస్తున్నాము. కంది పొడి తోనా అంటూ అయోమయం గా చూస్తాడు. మా చిన్నూ గాడికి మాటలు రానంత కాలం అన్నం నోట్లో కుక్కేస్తే సరిపోయేది. వూహ తెలిశాక, ఇదేమిటి అని అడగటం కాకుండా, ఎందుకిలా వుంది అని ప్రశ్నించటం కూడా నేర్చుకున్నాడు. అలాంటప్పుడు మాత్రం ఆ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ని పగల గొట్టాలనిపిస్తుంది. వాడు నెమ్మదిగా ఎదిగాడు.ఎంత దాకా ఎదిగాడు అంటే రోజూ నా వంటకు మార్కులు వేసే వరకూ...పప్పో, కూరో నోట్లో పెట్టుకొని పది కి మూడు, పోనీలే నాలుగు అంటాడు...అవి నాకు ఆ రోజు వచ్చిన వంట కి మార్కులన్న మాట. నేను నోట్లో పెట్టుకొని తిని బాగానే వుంది కదరా అంటూ వాడి వైపు, చెప్పవేమిటి అంటూ తన వైపు ( ఎవరో తెలుసు లే మీకు) ఉరిమి చూస్తే...” మీ టేస్ట్ బడ్స్ పాడైపోయాయి.” అంటాడే గానీ వాడి అభిప్రాయాన్ని మాత్రం మార్చుకోడు.
ఇలా అమెరికా లో ఏదో మా ఇంట్లో మా వంటలు మేం తిని మా మానాన మేం బతుకుతూ వుంటే ఇండియా నుంచి ఒక స్నేహితుడు అమెరికా ట్రిప్ కి వచ్చాడు. నేను అలవాటు ప్రకారం రోజూ ఎవడు వంట చేస్తాడు అనుకోని అతను వచ్చిన మొదటి రోజు ప్రేమ గా సాంబారు , కూర, పప్పు చేశాను. అందరం తిన్నాక ఇంకా బోలెడు మిగిలింది. అన్నీ ఫ్రిజ్ లో పెట్టాను. అవి అయితే కానీ కొత్తవి చేయటానికి లేదు. ఎందుకంటే అవి మిగిలితే పెట్టడానికి ఫ్రిజ్ లో ఖాళీ వుండోద్దు? ఈ రకమైన టెక్నికల్ డిఫికల్తీ వల్ల అతను వున్న మూడు రోజులు అదే సాంబారు, పప్పు, కూర పెట్టి పంపించాను. అందుకని ఇప్పటికీ నన్ను దెప్పుతుంటాడు " మీ ఇంటికి వస్తే చద్ది కూడు పెట్టారు " అని.
అదేమిటో ఎవ్వరూ అర్థం చేసుకోరూ....!
ఇది ఇలా వుండగా...నా టైం బాగుండక క్రితం సారి ఇండియా వచ్చినప్పుడు మా వాడు మా అమ్మ చేతి వంట, మా అక్క చేతి వంట తిన్నాడు. మా అక్క చాలా బాగా వంట చేస్తుంది. అన్నింటి లో మనకు పూర్తి వ్యతిరేకం. మా అక్క అచ్చంగా " డొక్కా సీతమ్మ" టైపు. పెద్దల ఎదుట నోట్లోంచి మాట రాదు. వినయ విధేయతలు పూర్తిగా పుణికి పుచ్చుకున్న సాధ్వీమ తల్లి. ఇక్కడకు తిరిగి వచ్చేసే ముందు మా అక్క వాళ్ళింటికి వెళ్ళి భోజనం చేసాకా మా వాడు " ఆమ్మా! నువ్వు కూడా అమెరికా వచ్చేసి మాతో వుండిపో" అని తెగ గొడవ చేస్తుంటే మా అక్క అబ్బా, వీడికి నా మీద ఎంత ప్రేమ అని మా బావ గారికి చెప్పి మురిసిపోతుంటే...ఓసీ పిచ్చిమొహమా! అది నీ మీద ప్రేమా కాదే తల్లీ,,,నువ్వు వస్తే హాయిగా కడుపు నిండా భోజనం చేయచ్చని వాడి ఆశ అంటే..ఇక మా అక్క....పిల్లాడికి ఇష్టం గా వంట చేసి పెట్టక నువ్వు చేసే పనేమిటే అని నాకు హితబోధలు మొదలుపెట్టింది.
నేను విననట్లు పక్కకెళ్లిపోయాను. అంతకన్నా మనమేం చేయగలమ్ చెప్పండి....
ఏదో ఇలా వంట వచ్చీ రాక...ఇలా బ్లాగుల్లో కళ్ళనీళ్ళు వత్తుకుంటూ ఏవో నా బాధలు రాసుకుంటూ బతికేస్తుంటే...ఇప్పుడు నా ప్రాణానికి జ్యోతక్క తయారైంది. షడ్రుచుల పేరుతో...ఏవో ఒకటి రాయడం, ఇది చాలా ఈజీ..చాలా టేస్టీ అంటూ ఏదో ఒక పోస్ట్ రాయడం , దానికి రెసెపీ లు ఇవ్వడం,పైగా నోరూరిస్తూ ఫోటోలు ఒకటి....
వొట్స్ తో ఇవి చేసుకోవచ్చు. అవి చేసుకోవచ్చు. ఓట్స్ దద్దోజనం, ఓట్స్ పులిహోర, ఓట్స్ పాయసం, ఓట్స్ తద్దినం అంటూ....ఒక చేంతాడంతా లిస్ట్.
అది చూశాక ప్రాణం వొప్పదు. తెల్లారి లేచి వంటింటిలోకి వెళితే అక్కడ ఆ ఓట్స్ డబ్బా కనిపిస్తుంది. చేయాలో, వద్దో తెలియదు. మళ్ళీ ఆ కంప్యూటర్ మీదకెక్కి ఆ రెసెపీ చదివి వచ్చి అలా చేసి అది ఎందుకు అంత బాగా రాలేదో అర్థం కాక బాధపడి, మళ్ళీ అక్కడ కామెంట్ పెట్టి, ఆమె మరో సలహా ఇచ్చి ...ఇదంతా నాకిప్పుడు అవసరమా....అనుకోని కామ్ గా అంతఃసాక్షి ని, మనఃసాక్షి ని. ...ఇంకేం సాక్షులున్నాయో వాటినన్నింటిని అణగతొక్కేసుకొని ఎప్పటిలాగానే అందులో ఇన్ని పాలు పోసుకొని ఒక నిముషం మైక్రో వేవ్ లో వేడి చేసుకొని హాయి గా తింటూ " Eat, Pray, Love” చదువుకున్నాను.
అది అయిపోయిందా ఆండీ...మళ్ళీ మొన్న రకరకాల సమోసాలు అంటూ...ఇంకో పోస్ట్ పెట్టింది. అసలు సమోసాలు చేయటమే కొంచెం టైం తో కూడుకున్న వ్యవహారం. చాలా వోపికగా, నిదానం గా, కొన్ని గంటలు వంటింటి లో కష్టపడితే ఓ కే ... కొన్ని సమోసాలు వస్తాయి. మనమేమో వారానికి ఒకసారి ఆ ఇండియన్ షాప్ కి వెళ్ళి డాలర్ కి ఒక సమోసా కొనుక్కోని తినేసి వస్తున్నాం కదా. మళ్ళీ ఇదంతా ఎవరు పడతారు అనుకోని చూసీ చూడనట్లు వూరుకున్నాను.
ఇంతలో లాప్ టాప్ మీద నుంచో,లోపల నుంచో ఒక కేక....ఎందుకంటే ఆ లాప్ టాప్ ఎదురుగుండా చాలా సేపు కూర్చున్నాక ఏమవుతుంది అంటే వారే వీరు, వీరే వారు అయిపోతారు. ఎవరు లాప్ టాప్ నో? ఎవరు రూప స్వరూపమో తెలియదు. అలా ఒక కేక వినిపిస్తే వెళ్ళి మళ్ళీ ఏంటీ అని అడిగితే....ఎన్ని రకాల సమోసాలో చూడు...కొంచెం ట్రై చేయచ్చు కదా...ఆ తన్హాయి రాసుకునేబదులు రోజంతా..అన్నాడు. ఇక చూడు...నా సామి రంగా...అరికాలి మంటలు ఇలా మౌస్ మీదకు వచ్చేశాయి.
చాలా మంది మహిళలు ఇలా తమకు వచ్చిన వంటలన్నీ రెసెపీలు, ఫోటోలతో కూడా బ్లాగుల్లో పెట్టడం వల్ల నాలాంటి అమాయక స్త్రీలు ఇంట్లో నానా రకాలా వేధింపులకు గురవుతున్నారని , కాబట్టి ఇక నుంచి వంటలు అని టాగ్ వున్న బ్లాగుల్నీ ముఖ్యం గా షడ్రుచుల్ని యాగ్రి గేటర్ ల నుంచి తీసేయ్యాల్సింది గా కోరుతూ కూడలి,మాలిక, హారం,జల్లెడ కి ఒక విజ్నాపనపత్రం పంపించేశాను.
ఇప్పుడు చెప్పండి.ఎవరైనా నాకు రెసెపీ లు పంపిస్తారా? పంపిస్తే....
( సరదాగా రాసిన ఈ పోస్ట్ లో ....జ్యోతి, షడ్రుచుల పేర్లను వాడుకున్నందుకు క్షమాపణలు)
మూసుకున్నతలుపులు
-
పిల్లగాలులు చల్లగా వీస్తున్నాయి. దినకరుడు అలవోకగా దిగంతాల అస్తమిస్తున్నాడు
శిశిరం ప్రవేశిస్తోంది వృక్షాలు పండినఆకులని దులుపుకుంటున్నాయి. దినకరుడు ఉదయం
తిరి...
2 weeks ago
22 వ్యాఖ్యలు:
హహహహ నేను కూడా మీ బాపతే. చాలా రోజుల వరకు గేస్ స్టవ్ ఎలా వెలిగించాలో తెలీదు. వారనికో ఒకటో, రెండో రోజులు వంట చెయ్యొచూగానీ రోజూ ఎవడు చేస్తాడు :( మా ఇంట్లో అన్నీ 50-50 కాబట్టి సగం రోజులు వంట తప్పించుకుంటున్నాను...కాస్త హాయి ప్రాణానికి :) అవసరమైనప్పుడల్లా అమ్మకో ఫోన్ కొట్టి అడగడం, కొత్తగా ఏమైనా చెయ్యాలనుకుంటే ఈనాడు వసుంధర తిరగేయడం మెల్లిగా అలవాటవుతున్నాయి. మా అమ్మ చేతినపుణ్యం నాకూ కాస్త అంటిందేమో, నేనేమి చేసినా బానే వస్తాయి కాబట్టి నోటికి కొరత లేకుండా కాలం వెళ్ళదీస్తున్నాను, మరి పిల్లా-జల్లా వచ్చాక భవిష్యత్తులో కష్టాలుంటాయేమో తెలీదు.
Excellent narration! చాలా చాలా బాగుంది మీ కథనం. మీ తన్ హాయీ కూడా ఈ మధ్యే మొదలు పెట్టాను చదవటం. ఇంకా 4 పార్టులు ఉండిపోయాయి. చదివాక కామెంట్ చేస్తాను..
మీరు చాలా మంచి రచయిత్రి.
అప్పుడెప్పుడో, మీ నవల మొదటి పార్ట్ చదివాను, ఈ నవలలు, కవితలు, కధలు నాకు అర్ధం కావులే మీ జోలికి రాలెదు, అఫ్సర్, రావురి, అన్న పేర్లు కనపడ్డాక మీ బ్లాగ్ అంటే కాస్త ఇంట్రెస్ట్ వచ్చింది, ఇపుడ్డు ఈ వంటల టపా ఏంటో?
బాగుంది కానీ, మీరు నాణానికి ఒకవైపే చూస్తున్నారు.....బాగా వంటొచ్చి తినటానికి ఎవరూ లేని నాబోటివాళ్ళకు కుక్కరీ బ్లాగుల్లో రెసిపీలు రాసుకోవటమే తుత్తి...:) అదీ నిషేధిస్తే కష్టం అధ్యక్షా కష్టం...!!
నేనున్నానండీ మీకు తోడు అసలు వంట అనే పదం వినపడని చోటుకి వెళ్ళిపోదాం. జ్యోతి షడ్రుచులు డౌన్ ..డౌన్.. చక్కటి పోస్ట్ వ్రాసారు. మా అబ్బాయి కూడా వాళ్ళ పెద్దమ్మల వంట అంటే పడి చస్తాడండీ, వాడికి పెద్ద వంటలక్క దొరకాలి, తిని బాగా లావయిపోవాలి.అరిగేదాకా ట్రెడ్ మిల్ చేయాలి. నేను వాడిని చూసి నవ్వాలి. In front there is crocodile festival.
కల్పన.. మాటలు బానే వస్తాయి కాని వంట చేయాలి. కొత్తవి నేర్చుకోవాలంటే మాత్రం తప్పించుకుంటావ్.. పాపం అఫ్సర్ గారు ఎలా వేగుతున్నారో ఏమో? :(
Idanta chadivaka.......paapam afsar gaarni chuste jalestundi...mee nalabheema(streelingam ento!)paakam baristunnanduku..:-)
హాహా, నీకు హాస్య, వ్యంగ్య రాతలు రావన్నావు ముందు టపాలో. ఇప్పుడు నాకే ఎసరు పెట్టేవు :(
భలే ఉంది నీ పాకశాస్త్రప్రావీణ్యం. నల, భీమ, అఫ్సరాదులు ఇంక వంక పెట్టడానికి లేదు.
>>ఇంత ఉప్పు తీసుకొని అలా పడేసి ఆ చేతిని ఇలా నైటీ కో, ఫాంట్ కో పులుముకోవడం మన సంప్రదాయం, ఆచారం
ఈ విషయం లో తెగ నచ్చేసారండి...నా నైటీలన్నీ సైడ్ చక్కగా రక రకాలయిన కలర్ లతో భలే ముచ్చటగా ఉంటాయి..
>>>ఇలా నా కిచెన్ కౌంటర్ నిండా వెనెగర్, సోయి సాస్ లాంటి బ్రహ్మ పదార్దాలు అన్నీ వచ్చి చేరిపోయాయి కానీ వాటిని నేను మూత తీసి వాసన చూసే సందర్భాలు కూడా రాలేదు.
ఈ విషయం లో కూడా డిటో డిటో సూపరు ..చాలా చాలా చాలా ఒక 1000 వేసుకోండి బాగా రాసారు
brilliant :)
ఆడాళ్ళ వంట బ్లాగులు సరిపోనట్టు భాస్కరుడేమో నలభీమపాకం ఓటి మొదలెట్టాడు. నేనుగూడా ఆలోచిస్తున్నా కొంతకాలంగా ఒక రెసిపీ బ్లాగు మొదలెడదామా అని! కాచుకోండి మరి! :)
బాగుందండి మీ వంటోపాఖ్యానం .
:)
Miku recipes ekkadiki pampali chepparaa.
హహ చాలా బాగా రాశారు :)
మొన్న టెంపుల్ సాహితీ సదస్సులో, అఫ్సర్ గారు కూడా నాతోపాటే ఫుడ్ మీద దాడిచేస్తే ఏంటో అనుకున్నాను. 'కల్పనా'వంటల ఫలితమన్నమాట, నాకులాగ. :-).
యాంకీ:
అవును మీరు మీ ప్లేట్ సంగతి చూసుకోకుండా, నా ప్లేట్ లోకి ఎందుకు దాడి చేశారు? అయినా, కె సీ రాకపోవడం వల్ల మన ప్లేట్లు మనకి దక్కాయి!
స్త్రీ పాత్ర వున్న సాహిత్య నాటకం ఎంత విందుగా వుంటుందో తెలిసింది కదా!
నాకెందుకో కల్పనగారు వంటచెయ్యటములోని వారి ప్రావీణ్యతను కొంచెము డౌన్ ప్లే చేస్తున్నారేమో అనిపిస్తుంది.
హాస్యరసముతో గూడిన రచనలు చెయ్యటము రాదన్నారు ఇప్పుడేమో ఇంత చక్కని హాస్యరసభరితమైన టపా రాసారు.
కల్పన..అబ్బో నాకు సహోదరి విగా నువ్వు. అధ్బుతం. నీ వంట... నువ్వు ఇంకా పర్లే నీ కొడుకు మూడో నాలుగో వేసేడూ..మొన్న నా కొడుకు ను బటర్ చికెన్ తిను అంటే గిరుక్కుమని వెనక్కు తిరిగి నువ్వు వండేవా... నువ్వు ఇలాంటి వి కూడా వండుతున్నావా అన్నాడు తెలుసా... నాకు బలే మండింది. మొన్నకు మొన్న జ్యోతి బ్లాగ్ చూసి ఇరవయ్యోకొటో సారి చికెన్ 65 చేస్తుంటే మా అమ్మ నా కొడూకు ఎంత నవ్వేరో.. సిగ్గులేదా ఎన్ని సార్లు చేసినా మళ్ళీ జ్యోతి బ్లాగ్ లో రెసిపీ చూస్తావు నీకు ఈ జన్మ కు వంట రాదు.. అని. చీ చేసిన చికెన్ 65 కు గుర్తింపు లేదు. ప్రతి సారి జ్యోతి బ్లాగ్ చూస్తానని ఎగతాళి. :-(
baabooyy meeru ee subject touch chesinaa keka.
హ..హ ...హ్హా ....కల్పనగారు! నా వంటా ఏదో అంతంత మాత్రం ! ఎప్పుడూ ఆ వచ్చిన ఐదారు రకాలే చేసి చేసి బోర్ కొట్టి, టివీల్లో వస్తున్నా వంటల ప్రోగ్రామ్స్ చూసి బోలెడు ఇన్స్పైర్ అయిపోయి కొత్తరకాలు చేస్తుంటే ...మాయింట్లోనే ప్రతిపక్షం:( నేనోక్కదాన్నీ తినాల్సిందే :( మీక్కావాలంటే నేను రెసిపీలు పంపిస్తా ధైర్యం చేసి!
"ఇలా నా కిచెన్ కౌంటర్ నిండా వెనెగర్, సోయి సాస్ లాంటి బ్రహ్మ పదార్దాలు అన్నీ వచ్చి చేరిపోయాయి కానీ వాటిని నేను మూత తీసి వాసన చూసే సందర్భాలు కూడా రాలేదు."నాక్కూడా :(
అన్నట్టు కల్పన గారు, మీ తన్హాయి మొన్నామధ్య ఒకేరోజు మొదటి పార్టునుండీ చదివేశానండీ...ఏకబిగిని చదివించేలా ఉంది మీ శైలి అభినందనలు.
షడ్రుచులు అంటూ ఫొటోలు కూడా పెట్టి నోరూరుంచేలా టపాలు రాస్తూ ఆడవాళ్లను వంటింటికతుకుపోయేలా కుట్ర చేస్తున్న జ్యోతక్క బ్లాగును అన్ని అగ్రిగేటర్లనుంచీ బహిష్కరించాల్సిందే. ఫెమినిజ్మ్ జిందాబాద్. మా కాలేజీ రోజుల్లో -మీరు నమ్మండి-నమ్మకపోండి మాకు ఇచ్చిన వకృత్వ పోటీ అంశం "Kitchen is the kingdom of women". ఈ వంటల బ్లాగులకు వ్యతిరేకంగా ఒక కొత్త సంఘం స్థాపనకు వేళయింది. మొదటి కార్యక్రమం ధర్నా ఎక్కడ? జ్యోతక్క ఇంటిముందు -షడ్రుచులుకు వ్యతిరేకంగా , అది తక్షణం మూసివేయాలని, ఆడవారు వంటింటి బానిసలు కారు అంటూ నినాదాలిస్తూ.
ఈ సరదా పోస్ట్ కు, సరదాగా వ్రాసిన వ్యాఖ్య.
-cbrao
Hyderabad,India.
స్పందించిన వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. రెసెపీ లు పంపవద్దు అని చెప్పినా సరే, పంపిస్తామని బెదిరించేవాళ్ళ సంగతి నేను బ్లాగ్ ఆగ్రి గేటర్ లకు కంప్లైంట్ చేస్తానని చెప్పినా సరే కొందరు బ్లాగర్ లు నా బెదిరింపు ను లెక్క చేయకుందా ఇంకా వంటల మీద పోస్ట్ లు రాస్తున్న విషయం చూస్తూనే వున్నాను. త్వరలో కార్యాచరణ ప్రకటిస్తాను.
ఈ పోస్ట్ కి వచ్చిన అశేష ఆదరణ తో ( నా మొహానికి ఇన్ని కామెంట్ లు రావడం గొప్పే) మరిన్ని పోస్ట్ లు ఇదే తరహా లో రాయబోతున్నానని మిమ్మల్ని అందరిని బెదిరిస్తున్నాను.
ఈ పోస్ట్ తో నా బ్లాగ్ లో కొందరు కొత్త స్నేహితుల నుండి కామెంట్ లు వచ్చాయి. కృష్ణప్రియ, తార, జాబిల్లి,నీహారిక, నేస్తం, సి బి రావు తదితరులు.ఎవరి పెరైనా మర్చిపోతే వంట రావడం లేదన్న బాధ తో కామెంట్ లు కూడా సరిగ్గా రాయలేకపోతున్నానని క్షమించి వదిలేయండి.
తెలుగు యాంకీ గారు చెప్పినట్లు...నేను బాగా వంటచేస్తాను...అందుకు సాక్ష్యం సన్న్గగా రివట లా వుండే అఫ్సర్ బాగా బొద్దు గా మంచి బుగ్గలతో తయారవటమే. అయినా సరే, అఫ్సర్ వాళ్ళ అమ్మగారు ....వాళ్ళ కొడుకు నా వల్ల సరిగ్గా తినలేకపోతున్నాడని వెళ్ళిన ప్రతి సారి...మాంస భక్షణ చేయిస్తారు...తల్లి మనసు కదండీ ఎంతైనా...
aha nenu meeku laagane andi..asalu 2 cups vadamante rendee enduku veyyali..vinegar vaadamante ledu olive oil enduku vadakudadu ani vadaattanu..ivi tini ma tammudemo ma amma ki roju complaint lu..ponee kothavi try cheddama ante vatikee vankale..sare ani cheppi naku kavalsina recipe la url's save chesi pettukoni avasaram ayiinappudu chusi correct ga cheddam ani open chestunte enni sarlu chustav akka chesinavi kuda antu vekkirintalu..labham ledandi..maku oka cook kavali..roju inti kelle time kalla snacks dinner chesi dishes wash chesi pedithe enta happies oo life..roju enchakka blogs chaduvkoni kastha inspire ayyi blog rasukundunu..annattu me lagane ma nannaru kuda ma amma ki strict warnings icharu vanta cheyyamani ma amma ante danikem kharme vanta cheyyadaniki antu..aa tarvata america vachaka naa madipoyina vantalu tinnaka telisindi lendi ma amma khanta sosha..ippudu aithe survival ki kavalsina vantalanni vachesayi :))
Post a Comment