నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Sunday, July 08, 2012

కీలుబొమ్మలు నవల పై ఓ సంభాషణ


డాలస్ లోని  రేడియో ఖుషీ ఆధ్వర్యం లో  మదర్స్ డే సందర్భం గా  మహిళా సంబరాల కార్యక్రమం జరిగింది. వివిధ రంగాల్లో కృషి చేసిన మహిళలను సన్మానించటం లో భాగం గా సాహిత్య రంగం లో  మేం చేసిన కృషి ని గుర్తిస్తూ నాకు, మాలతి గారికి కూడా సన్మానం  చేశారు. సన్మాన కార్యక్రమాలు ఎలా ఉంటాయో, ఎలా జరుగుతాయో బాగానే అనుభవం వున్న మేమిద్దరం  ఆ కార్యక్రమం కంటే కూడా ఆ సందర్భంగా మేమిద్దరం ఒక పూట గడిపే అవకాశం కోసం ఎదురుచూసాము.    ప్రముఖ నవలా రచయిత జి‌.వి. కృష్ణారావు గారు రాసిన నవల “ కీలుబొమ్మలు” చదవటం అప్పుడే  మేమిద్దరం కూడా పూర్తి చేశాము కాబట్టి దాని మీద మాట్లాడాలని అప్పటికప్పుడు అనుకున్నాము. ఇదేదో పెద్ద సాహిత్య చర్చ లాగా కాకుండా చాలా మామూలుగా మేమిద్దరం మా అభిప్రాయాలూ ఒకరితో మరొకరం పంచుకున్నాము. దోసెలు, అరటికాయ కూర, మామిడి  కాయ పప్పు, చింత చిగురు పొడి  తో మంచి రుచికరమైన భోజనం పెట్టడం తో పాటు మా మాటలను ఆడియో, వీడియో ల రూపం లో భద్రపరిచిన మాలతి నిడదవోలు గారికి నా కృతజ్నతలు.
కీలు బొమ్మల పై , ఇతర సాహిత్య విషయాల పై మా ఇద్దరి సంభాషణ ఆడియో, వీడియో ల రూపం లో ఇక్కడ వినండి, చూడండి.
ఆడియో -
http://archive.org/details/InterviewWithKalpanaAndMalarhi
విడియో -
http://archive.org/details/KeeluBommaluDiscussion
రెండు లింకులకీ దారి చూపే పుట ఇదీ, -
http://archive.org/search.php?query=kalpana%20rentala

9 వ్యాఖ్యలు:

voleti said...
This comment has been removed by a blog administrator.
voleti said...

Madam, ఇంతకుముందు పోస్ట్ లో నా కామెంట్ స్వీకరించలేదు.. మీ స్థాయికి మేము తగాము కావనా..

jp said...

కుటుంబరావు గారి పరిచయం చందమామ వల్ల కాదనుకుంటాను. నాకు తెలిసి యువ మాసపత్రిక ద్వారా ఎక్కువగా పరిచయం అయ్యారు.ఎక్కువ పేజీలున్న నవలలు చదవటానికి యిష్టపడకపోవటానికి కారణం టైం పర్మిట్ చేయకపోవడమే. ఇప్పటి యువత అంతా కెరీరిజం పైన ద్రుష్టి పెట్టడమే దీనికి కారణం అనుకోవచ్చు. అందుకే సంక్షిప్తీకరణ మీద ఆసక్తి చూపుతున్నారు.పాశ్చ్త్యాత్య సంస్క్రుతి లో ఏవి మంచివో చెపితే బాగుంటుంది కదా ! నాకు కనిపించింది కేవలం వ్యక్తిగత సమాజం మాత్రమే ! గతంలో వుమ్మడికుటుంబాలు వుండటంతో పని విభజన వుండేది.కనుక సాహిత్య పఠనానికి సమయం వుండేది.ఇపుడు అలాటి అవకాశం లేదు , అందుకే యువత సాహిత్యం పట్ల ఆసక్తి కనపరచడం లేదు. పాశ్చ్త్యాత్య సాహిత్యం అంతా పడకకుర్చీ సాహిత్యంగా భావిస్తుంటారు చాలామంది.కాని మన సాహిత్యం గతంలో లాగ కాకుండా సమాజంపట్ల బాధ్యతతో రాస్తున్నట్లు కనిపిస్తుంది.పాఠకులు వస్తున్న రచనల పట్ల విమర్శ చేయడంలేదనటం సరికాదు. కల్పన గారు వ్రాసిన తన్ హాయి మీద వచ్చిన స్పందన దీనికి వుదాహరణ.పుస్తకం ఖరీదు కూడా పాఠకులు ఆసించినంతగా పెరగకపోవడానికి ఒక కారణంగా చెప్పుకోవచు.

మాలతి said...

@ jp, కుటుంబరావుగారివిషయంలో మీరు చెప్పినమాట నిజమేనేమో. అలాగే విమర్శలవిషయంలో కూడా పాఠకులు అందరూ పైపైమాటలతోనే సరిపుచ్చుతున్నారని నాభావం కాదు. చాలావరకూ చెప్పుకోదగ్గస్థాయిలో రావడంలేదు అని అనుకున్నాను. మీఅభిప్రాయాలు తెలిపినందుకు ధన్యవాదాలు.

Kalpana Rentala said...

వోలేటి గారు,

సారీ. మీ ముందు కామెంట్ నేను ఐఫోన్ నుంచి పబ్లిష్ చేశాను. అది ఎందుకు ప్రచురితం కాలేదో నేను చూసులేదు మీరు చెప్పేవరకు. ఇక్కడ స్థాయి భేదాలు ఏమీ లేవండి.
జె.పీ. గారు, మొత్తం ఆడియో, వీడియో లు శ్రమ, సమయం తీసుకొని విన్నందుకు ముందు థాంక్స్. తన్హాయీ మీద స్పందన విషయం లో నాకెలాంటి అభ్యంతరం లేదు ( ఆన్ లైన్ లో..) మేము మాట్లాడింది మొత్తం సాహిత్యం మీద...
పాశ్చ్యత్య సంస్కృతి లో మంచి విషయాలను ఇక్కడై ప్రవాసాంధ్ర రచయితలు ఎప్పటికప్పుడు తమ రచనల్లో తమ అనుభవాల ద్వారా చెప్తూనే వున్నారు. ఇంకా చెప్తారు కూడా. ప్రత్యేకంగా కూడా చెప్పే ప్రయత్నం మేము కూడా చేస్తాము.

Anonymous said...

చాలా అసక్తికరంగా వుంది కల్పనా!

జె పి గారూ,
నేను మీ అభిప్రాయంతో విభేదిస్తానండీ. యువతలో, ఆ మాట కొస్తే దాదాపు మొత్తం ప్రజల్లో పుస్తక పఠనం తగ్గటానికి ఉమ్మడి కుటుంబాలు అంతరించి పోవటం కంటే మీడియా ప్రభావం ఎక్కువనిపిస్తుంది నాకు.
మా తరంలో చిన్నప్పుడూ టీవీలూ, సినిమాల దాడి ఇంతగా వుండేది కాదు. అందుచేత సెలవులొస్తే పుస్తకాలే గతి. నేను చదివిన గొప్ప సాహిత్యమంతా స్కూలు సెలవుల్లో చదివిందే! అలాగే పుస్తకాల ధరలు అందుబాటులో లేకపోవటమన్నది అంత నమ్మబుధ్ధి కాదు. సినిమా టికెట్ల ధరలూ, మేకప్ సామాగ్రి ధరలూ ఎలా వున్నాయి? అయినా వాటికాదరణ ఏమైనా తగ్గిందా?

పెరిగిపోతున్న వినిమయ సంస్కృతిలో మనిషి తనకి వస్తు ప్రయోజనం లేనిదే ఏ వ్యాపకమూ చేపట్టడు. సాహిత్యాభిలాష కంటే కెరీర్ మీద దృష్టి పెడితే భవిష్యత్తుకి మంచిది. ఈ తరహా లాజిక్కూ మనలో పెరిగిపోయింది.
ప్లస్
మనిషికి తన మెదడును చైతన్యవంతం చేసే వ్యాపకం కంటే మెదడును జోకొట్టే వ్యాపకాలే ఎక్కువ నచ్చుతాయి. అందువల్ల ఎప్పుడైనా సినిమా టీవీలు పుస్తకాలకంటే ఎక్కువ ప్రాచుర్యం కలిగి వుంటాయి.

అందుకే అంతరించి పోతున్న పుస్తకపఠనాసక్తిని ఒక యుధ్ధ ప్రాతిపదిక మీద అందరం ఎదుర్కోకపోతే రాబోతున్న తరాలు చాలా నష్టపోతాయి.

jp said...

మురళి గారూ ,

మీ అభిప్రాయాలు కొంతవరకు నిజమే. నా చిన్నతనంలో పాఠ్యపుస్తకాలతో పాటు , ప్రతిరోజూ గ్రంధాలయంలో కనీసం రెండు గంటలు గడిపేవాళ్ళము.అందుకే సాహిత్యం తో కొంత పరిచయం కలిగింది. ఇప్పటికీ వచ్చిన/నచ్చిన ప్రతి పుస్తకం స్వంతం చేసుకొని , పదిమందితో నా అభిప్రాయాలను పంచుకొంటాను. మీరన్న మేకప్ సామాగ్రి , సినిమా టికెట్ ధరలు అధిక శాతం ఎగువ మధ్యతరగతి వారి పైనే పడింది.ఎగువ మధ్యతరగతి , పై తరగతి వారు పుస్తకాలు కొన్నా వాటిని కాఫీ టేబుల్/టీ పాయ్ మీద పెట్టడానికి మాత్రమే వుపయోగిస్తారు.[శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారి వువాచ]. అన్ని తరగతులవారూ కెరీర్ కి సంబంధించినవి,సబ్జెక్టుకి సంబంధించిన పుస్తకాలు కొనడానికి మాత్రమే ఇష్టపడుతున్నారు.తల్లిదండ్రులు కూడా వాటిని చదివించడానికే ఇష్టపడుతున్నారు. సాహిత్యం పట్ల వారికి ఏమాత్రం ప్రవేశం కల్పించడం లేదు.ఒక వేళ కొందరు ప్రయత్నించినా , నాలాటి వారు , పిల్లలు సున్నితంగా తిరస్కరిస్తున్నారు.మీరన్నట్లు తమకు ప్రయోజనం లేనిదే ఏ వ్యాపకం చేపట్టడానికి వాళ్ళు ఇష్టపడటం లేదు.సినిమాలు , టీవీలు కేవలం కొన్ని గంటలు విశ్రాంతి కోసమే.పుస్తకాల ధరలు కూడా ఒక కారణమేనని నా అనుభవంలో తెలుసుకొన్నాను. అందరూ అన్ని పుస్తకాలు కొనలేరు. ప్రస్తుతం గ్రంధాలయాల సంగతి చెప్పనక్కరలేదనుకుంటాను.

Kalpana Rentala said...

శారద గారు,
చాలా రోజులయింది. ఎలా వున్నారు?
మీరన్న మాటతో నేను ఏకీభవిస్తాను. పుస్తకాల ధరలు పాఠకుల పఠనాసక్తి తగ్గటానికి కారణం కూడా కాదనుకుంటాను. కొన్ని పుస్తకాలు అయిదేశీ వందల రూపాయల పెట్టి కూడా కొనుక్కుంటున్నారు.
మొన్న శ్రీరమణ గారు టీవీ 9 బుక్ పాయింట్ లో నవల మీద ఒక కామెంట్ చేశారు. నవలలు ఎవరూ ఓపిక గా చదవటం లేదని. నా తన్హాయి దాదాపు 400 పేజీల పుస్తకం. చక్కగా కొని చదివారు. తర్వాత తర్వాత తరాల వాళ్ళలో పఠనాసక్తి గురించి కామెంట్ లో చెప్పటం కుదరదు కానీ నా అభిప్రాయాలూ మరో పోస్ట్ లో రాస్తాను.
కల్పనారెంటాల

Anonymous said...

కల్పనా,
బాగున్నాను.
పని వొత్తిడి మరీ ఎక్కువ కావటంతో ఇదివరకులా తరచూ కాకుండా అప్పుడప్పుడూ (ఎప్పుడో ఒకప్పుడు) బ్లాగులు చూడటం వీలవుతుంది.
ఇలా ఇంకొన్నాళ్ళు...
శారద

 
Real Time Web Analytics