నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Saturday, December 12, 2009

' పోస్ట్ మోడర్న్ ' అద్దంలో చిన్నబోయిన రాజేశ్వరి (రెండవ భాగం)


బాల్యంలో కన్నతల్లి ప్రేమ పొందలేకపోయి అశ్రధ్ధ కాబడినానన్న భావం రాజేశ్వరికి వున్నందు వల్లే తననే నిరంతరం చూపులతో చుట్టుకునే అమీర్ కనిపించగానే ఆమె లోపల దాగి వున్న దాహం పైకి వచ్చిందని, ఆ దాహాన్ని అమీర్ తీర్చాడన్నారు రఘురామరాజు. " తాను కోల్పోయిన బాల్యాన్ని తన సంతానం ద్వారానైనా పొందాలనే తపనతో, అతీతమైన కోరికతో రాజేశ్వరి అమీర్ తో మైదానం లోకి లేచిపోయింది. అది కూడా కుదరక తాను శారీరకంగా ఇవ్వలేనిది, పొందలేనిది, కోల్పోయింది, మానసికంగానైనా పొందాలని తాపత్రయపడుతుంది. ఈ తాపత్రయమే మీరా -రాజేశ్వరి సంబంధానికి పునాది. రాజేశ్వరి మీరాలో బిడ్డనీ, తమ్ముణ్ణీ చూస్తే మీరా ఆమె లోని స్త్రీ దేహ లైంగిక దృక్పథంతో చూస్తాడు. మొదట రాజేశ్వరి మీరాని తికమక పెట్టినా, మీరా చివరకు రాజేశ్వరిని ఓ చీకటి రాత్రి అనుభవించడం ద్వారా తన కోరికను తీర్చుకుని రాజేశ్వరి లోని మాతృత్వ తపనను దగ్ధం చేస్తాడు.. అలా ఆమె జీవితంలో తటస్థపడిన ఇతర పురుషుల జాబితాలో చేరిపోతాడు. మాతృప్రేమను పొందనీకుండా చేస్తాడు. కానీ ఆమెలోని తల్లి ప్రేమ చాలా గాఢమైంది " అంటూ తేల్చారు రచయత. రాజేశ్వరికి బాల్యంలో తల్లి ప్రేమ దక్కక అశ్రధ్ధ కు గురైందని, తన కడుపున పుట్టే పిల్లల ద్వారా, కోల్పోయిన బాల్యాన్ని పొందటం కోసమే ఆమె అమీర్ తో లేచిపోయిందని, మీర్ తో సంబంధం పెట్టుకుందని, ఈ మొత్తం వ్యవహారంతో పిల్లల కోర్ట్ లో చలం, రాజేశ్వరి మాతృప్రేమ అభాసుపాలైందని స్థూలం గా రాజేశ్వరి పాత్రను నిర్ధారించారు రచయత. రాజేశ్వరి బాల్యం గురించి చలం ఎక్కడా ఎక్కువగా ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. రాజేశ్వరితో ఆమె మామయ్య మాట్లాడుతూ " పోనీ అమ్మను తలుచుకో. నిన్ను పెంచి పెద్దదాన్ని చెసి, ఏదో మా అందరికీ ప్రతిష్ట తెస్తావని అంటాడు. పెంచి పెద్దదాన్ని చేసి అన్నాడు గానీ కని పెంచి అనలేదు కాబట్టి రాజేశ్వరి కి కన్న తల్లి వేరు, పెంచిన తల్లి వేరు అన్న అభిప్రాయానికి వచ్చారు రచయత. అలాగే మరో సందర్భంలో మ పెత్తల్లి సూరమ్మ్మ గారికి నా మీద కోపం వస్తుంది అని రాజేశ్వరి అన్నది కాబట్టి కచ్చితంగా రాజేశ్వరి పెంపుడు తల్లి దగ్గర పెరిగిందని, తల్లి ప్రేమ కొరవడటం, అశ్రధ్ధ కాబడినానన్న భావం రాజేశ్వరిలో చూచాయగా లోపల వుందని రచయత వాదన.

మైదానం మొత్తంలో పుట్టింటి నుంచి రాజేశ్వరితో మాట్లాడిన పాత్ర ఆమె మామయ్య ఒక్కడే. తల్లి రాజేశ్వరితో మాట్లాడి వుంటే ' నిన్ను కనిపెంచి పెద్దదాన్ని చేస్తే’ అనే పదం వాడటం ఆ పాత్రకు సముచితమే. దాన్ని బట్టి రాజేశ్వరి కి కన్న తల్లి లేదని, పెంపుడు తల్లి దగ్గర పెరిగిందని నిర్ధారించలేం. ఇక పెత్తల్లి సూరమ్మ గారి ప్రస్తావన విషయానికి వస్తే, పూర్వకాలం లో వుమ్మడి కుటుంబాల్లో పిల్లలు కేవలం తల్లుల దగ్గరే కాకుండా పెత్తల్లి, పినతల్లుల దగ్గర కూడా పెరిగేవారు. మడీ, ఆచారం లాంటి విషయాల్లో వీరి మాటలకు ఎంతో విలువుండేది. కాబట్టి సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబాల్లో పుట్టిన ఆడపిల్లలు తల్లితో పాటుగా అవసరమైతే వీరందరికీ సమాధానం చెప్పుకోవాల్సి వచ్చేది. రాజేశ్వరి మాటల్లో తల్లి గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా అమ్మ అనే అంటుంది. అమీర్ వదిలేసివెళ్ళినప్పుడు కూడా పోనీ అమ్మ దగ్గర చేరితే అనుకుంటుంది.

రాజేశ్వరి తన లోని మాతృత్వ తపనను తీర్చుకోవడానికే మొదటి నుంచి ప్రయత్నించిదన్న రచయత వాదన మరీ అసంబధ్ధమైంది. అసలు మైదానం లో ఎక్కడా రాజేశ్వరిలో పిల్లలు లేరన్న బాధ కానీ, పిల్లలు పుట్టాలన్న వాంఛా కానీ రేఖా మాత్రంగా కూడా కనిపించదు. తాను కడుపుతో వున్నానని తెలిసినప్పుడు, ఆ కడుపును తీయించేసుకోవాలని అమీర్ శాసించినప్పుడు మాత్రం రాజేశ్వరి చేత చలం అనిపించిన మాట " ఎలా తీయించేసుకోను? అమీర్ బిడ్డ " అంటుంది. ఆ కడుపు తన భర్త వల్ల వచ్చి వుంటే అప్పుడు రాజేశ్వరి నిర్ణయమో, ఆమె వైఖరో ఎలా వుండేదో కానీ ఆ కడుపు అమీర్ వల్ల రావడం, అది తాను అమితంగా ప్రేమించిన అమీర్ బిడ్డ కావడం వల్ల కూడా ఆమె అబార్షన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంది. ఆ తరువాత ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి అనేకానేక కారణాలు కనిపిస్తాయి. చలం తన స్త్రీ పాత్రల్ని ఇప్పటివరకూ సమాజరీతిగా సాగుతూ వస్తున్న ఒక సానుభూతి చట్రం నుండి చూపే ప్రయత్నం చేయలేదు. స్తీని అబలగానో, పతివ్రత గానో చూపటానికి చలమే అవసరం లేదు. ఆ పనిని తరతరాలుగా చాలా మందే చేశారు. ప్రేమో, ఆకర్షణో,, మోహమో, వాంఛా వుధృతో ఏదైనా స్త్రీలకు కలగడం సహజమే అని, అది వివాహానికి పూర్వమైతే, తర్వాతైతే అన్న చర్చ అసంబధ్ధమని చలం నమ్మిక. ఇద్దరు, లేకా ఇంకా అనేక మంది స్త్రీల పట్ల పురుషులకు మోహం కలగటం ఎంత సహజమో, స్త్రీకి కూడా అనేకమంది పురుషుల పట్ల ఆకర్షణ కలగటం అంతే సహజమన్నది ఆయన వాదం. పెళ్ళికైనా, మాతృత్వానికైనా ప్రేమ తప్పనిసరి. ప్రేమ లేని సెక్స్ భార్య భర్తల మధ్య జరిగినా అది వ్యభిచారమేనంటాడు చలం. ఏ రచయత అయినా తాను నమ్మిన సిధ్ధాంతానికనుగుణంగానే తన రచనలు సాగిస్తాడు. రాజేశ్వరి కి అందమైన బాల్యం లేదని, తల్లి ప్రేమ దక్కలేదని , పిల్లల కోసమే అమీర్ తో లేచిపోయిందని, మీర్ తో సంబంధం పెట్టుకుందని చెప్పటమే చలం ఉద్దేశమైతే అప్పుడు రాజేశ్వరి పాత్ర మరో రకంగా వుండేది తప్ప ఇంత నిర్భీతిగా, ఇంత ఆనందంగా వుండేది కాదు. మైదానం లో తను గడిపిన జీవితం గురించి కానీ, అమీర్, మీర్ లతో తన అనుబంధం గురించి కానీ రాజేశ్వరి లో చలం ఎక్కడా ఏ సందర్భంలోనూ అపరాధ భావన చూపించలేదు. అందుకు అవకాశమున్న రెండు సంఘటనల్లో కూడా రాజేశ్వరి చేత ' ప్రాక్టికల్ ' గా ఆలోచింపచేశాడు చలం.

ఆ రెండు సంఘటనలు --ఒకటి అమీర్ తోళ్ళసాహెబ్ కూతురిని మోహించటం, రెండోది రాజేశ్వరి అబార్షన్ చేయించుకోవాల్సి రావడం. ఈ రెండు సందర్భాల్లో కూడా రాజేశ్వరి సంయమనంతో, ప్రాక్టికల్ గానె ఆలోచించింది, ప్రవర్తించింది. మైదానం మొదటి పేజీ లోనే చలం రాజేశ్వరి చేత ఏం చెప్పించాడో చూడండి " ఆ జీవితమంతా సుందరమైన, దివ్యమైన స్వప్నం వలె, ఆ యెడారి పుణ్యభూమి వలె, నా జీవితంలో ఈశ్వరుడికి నేనెత్తే మంగళహారతి వలె తోచింది. ఇంటినే, బంధువుల్నే, భర్తనే మరిపించగల అనుభవం ఎంత వున్నతమో, అద్భుతమో నువ్వే ఆలోచించు. అమీర్ ని, మీరానీ అనుభవించిన తర్వాత, మన చుట్టూ బతికె ఈ ప్రజలందరూ పురుషులేనా, మనుష్యులేనా అనిపిస్తుంది నాకు" అంటుంది. రాజేశ్వరి లేచిపోవడానికి రచయత ఓ బలహీనమైన కారణం వెతికారు. ఆ పేలవమైన పునాది నుండి ఆమె లో ఎక్కడా లేశమాత్రమైనా కనిపించని మాతృత్వ తపనతో ముడిపెట్టి ఆమె మాతృప్రేమ అభాసుపాలైందన్నారు. ఆమెతో పాటు చలాన్ని కూడా పిల్లల కోర్ట్ లో అపరాధిగా నిలబెట్టారు. స్త్రీని ఒక భార్య గానో, ఒక తల్లి గానో, ఒక కూతురిగానో, ఒక మేనకోడలుగానోచూడటానికి సమాజం అలవాటుపడింది. దానికి భిన్నంగా ఆమెకున్న విభిన్న పాత్రల నుండి దూరంగా, మానసికంగా , శారీరకంగా ఆమెలో జరిగే సంఘర్షణ, భావావేశాల ఆధారంగా ఆమెను ఓ స్త్రీగా చూపించే ప్రయత్నం చేశారు చలం. స్త్రీలను కేవలం భార్యలుగా, తల్లులుగా చూడటం వాటి పరిధి నుండి వాళ్ళ జీవితాలను నిర్ణయించాలనుకోవడం అంటే వారిని ఇంకో రకమైన నీతి చట్రంలో బంధించటమే. రాజేశ్వరి లేచిపోవడానికి, బాల్యం, యవ్వనంలో ఎదురైనా నిరాదరణో, లేక భర్త దుర్మార్గాలో, అతను పెట్టే చిత్రహింసలో కాదు. నిజంగా ఇందులో ఏ ఒక్కటైనా ఆమె నిర్ణయానికి కారణమైతే ఆమె ' లేచిపోవడానికి ' ఒక లైసెన్స్ దొరికినట్లే. రాజేశ్వరి సంప్రదాయ కుటుంబాల్లోని హిపోక్రసీని మొత్తంగా తూర్పారబడుతుంది. చచ్చు మొగుళ్ళందరూ ఎలా ప్రవర్తిస్తారో విమర్శిస్తుంది. ప్రత్యేకంగా భర్త లోని దుర్గుణానేమీ బైటపెట్టదు. ఏవో ఒకటి రెండు చిన్న చిన్న విషయాలు తప్ప. పైగా నవల మొదటి పేజీలోనే రాజేశ్వరి తన స్నేహితురాలితో అన్న మాటలు గుర్తు చేసుకుంటే..." లేచిపోవడానికి నీ భర్త లోఫమేమైనా వుందా? అన్న ప్రశ్నకు అమీరే కనిపించకపోతే ఈనాటికీ ఇంకా నా పెనిమిటితో కాపురం సుఖంగా, మత్తుగా చేస్తూ పడివుండేదాన్ని. అమీర్ తో నీకో, ఇంకో పతివ్రతకో స్నేహమే వుంటే మీరూ లేచిపోయే వుందురు. అతని ఆకర్షణను నిగ్రహించలేక " అంటుంది. అమీర్ పట్ల వున్న బలమైన ఆకర్షణ వల్లనే ఆమె కుటుంబ వ్యవస్థ నుండి బైటకు వచ్చింది. అమీర్ రాకతో, చూపులతో ఆమె లో నిద్రాణం గా దాగి వున్న ప్రేమ, వాంఛా, మోహోధృతి, పురుషుడి పట్ల వుండే సహజమైన ఆకర్షణ అన్నీ బైటకు వచ్చాయి. అలా ఒకసారి తనను తాను తెలుసుకున్న రాజేశ్వరిని ఏ సమాజం, ఏ నీతిచట్రాలు, ఏ కుటుంబ వ్యవస్థలు నిరోధించలేకపోయాయి. ఇక మీర్-రాజేశ్వరి ల సంబంధం ఒక కొరకరాని కొయ్య . ఒక ఎనిగ్మా. ఈ క్లిష్టమైన సంబంధాన్ని చాలా మంది కేవలం నీతి-అవినీతి పేటికల్లో బంధించి సరిపెట్టుకున్నారన్నారు రచయత. అంతేకాదు ముందే చెప్పుకున్నట్లు రాజేశ్వరి లోని మాతృత్వ తపనను మీర్ తన దేహ లైంగిక దృక్పథం తో తీర్చుకున్నాడన్నారు. కానీ అమీర్ లాగా మీర్ రాజేశ్వరిని చూడటమే మోహంతో చూడలేదు. అతను ఆమెను అనుమానంతో, విరోధంతో, భయంతో చూసేవాడు. అప్పుడు రాజేశ్వరే తన పని సానుకూలం చేసుకోవటానికి అతనితో సొగసుగా, వయ్యారంగా కులుకుతూ మాట్లాడింది. మళ్ళీ రాజేశ్వరి, మీర్ లాంటి తమ్ముదో, కొడుకో వుంటే బావుండ్ననుకుంటుంది. కానీ అతడిని కౌగలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం, వొళ్ళొ పడుకోబెట్టుకోవడంతో సహా అన్నీ చేస్తుంది. ఈ క్రమంలో రాజేశ్వరి, మీర్ ల మధ్య సాన్నిహిత్యంతో పాటు ఓ విధమైన ప్రేమ కూడా పెరుగుతుంది. అయితే మీర్, రాజేశ్వరిని శారీరకంగా కోరుకుంటున్నా దాన్ని వ్యక్తం చేసే ధైర్యం లేక, రాజేశ్వరి నుంచి సరైన ప్రోత్సాహం లేక ' దీదీ ' అన్న పిలుపు వెనుక దాక్కుంటాడు. అమీర్ కు రాజేశ్వరి మీద వున్నది బలమైన ఆకర్షణ అయితే, మీర్ కు రాజేశ్వరి పట్ల వున్నది ప్రేమతో కూడిన ఆకర్షణ. మీర్ ఆమెను అనుక్షణం వెన్నంటి రక్షించాడు. రాజేశ్వరి అందమొక్కటే కాదు అతనిని ఆకర్షించింది. అమీర్ ని మరో స్త్రీకి అప్పగించినప్పుడే అతనికి రాజేశ్వరి మనసు, ఆమె ఔన్నత్యం అర్ధమైనాయి. రాజేశ్వరి త్యాగాన్ని మొదట్నుంచి అమీర్ పట్టించుకోలేదు. కడుపు తీయించుకున్నప్పుడైనా అతను కనీసం ఓ మెచ్చుకోలు మాట కూడా మాట్లాడలేదు. తిరిగివచ్చాక మీర్, రాజేశ్వరిల సాన్నిహిత్యం చూసి ఏమనలేక రాజేశ్వరి కి రవికెలు తెచ్చి ఇచ్చి ఇక నుండి వేసుకోమంటాడు. చివరికి మీర్, రాజేశ్వరిల శారీరక సంబంధాన్ని చూసి తన ఓటమిని అంగీకరించలేక, తురకబిడ్డను ఇంకొకడితో నిన్ను పంచుకుంటాననుకున్నావా అంటూ తనను తాను పొడుచుకు చచ్చిన భీరువు. అమీర్ తన కళ్ళెదుటే పరస్త్రీతో తనతో ఎల్లా ప్రవర్తించాడొ సరిగ్గ అల్లా ప్రవర్తిస్తే తట్టుకోగలిగింది.అందులోనే ఆనందం వెతుక్కోగలిగింది. కానీ అమీర్ ఒక్క క్షణం కూడా స్థిమితం గా ఆలోచించుకోలేకపోయాడు. రాజేశ్వరే అమీర్ ని చంపేసి వుంటుందేమోననని వూహించిన మీర్ ఆ తప్పు తన మీద వేసుకున్నాడు. మీర్ హత్యానేరం తన మీద మోపుకోవడం చూసిన రాజేశ్వరి మీర్ ని రక్షించడం కోసం ఆ నేరాన్ని తానే చేశానని చెప్పి ఖైదుకెళుతుంది. నిజమైన ప్రేమ అంటూ ఏదైనా వుంటే అది మీర్, రాజేశ్వరిల మధ్య వున్నది మాత్రమే అని సులభంగా అర్ధం చేసుకోవచ్చు.

చలాన్ని ఫెమినిజం లోకి ఇమిడ్చే ప్రయత్నం ఓల్గా లాంటి స్త్రీవాదులు చేశారని, కానీ రాజేశ్వరిలో ఫెమినిజానికి కావాల్సిన పట్టుదల, స్వాతంత్ర్యం , స్వేచ్ఛ లాంటి లక్షణాలు లేవని రచయత అభిప్రాయపడ్డారు. అయితే రాజేశ్వరి తనకు నచ్చని కుటుంబ వ్యవస్థ నుండి బైటపడి అమీర్ తో మైదానంలో స్వేచ్ఛగా జీవించగలిగింది. అర్ధరాత్రి అమీర్ వదిలివెళ్ళినప్పుదు కూడా నిబ్బరంగా ఒక్కతే ఒంటరిగా గుడిసెలో వుండగలిగింది. అమీర్ ని సంతోషపెట్టటం కోసమే కాకుండా తామిద్దరి జీవితానికి సంబంధించిన విషయంగా అబార్షన్ చేయించుకోవాలన్న నిర్ణయం తీసుకోగలిగింది. అమీర్ దగ్గర నిస్సంకోచంగా మీర్ లేకుండా బతకలేనని స్పష్టం చేసింది. వీటన్నింటితో పాటు తన జీవితానికి సంబంధించి తాను స్వతంత్రించి తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి వుంది. జైలు జీవితం అనుభవించి బైటకు వచ్చిన తర్వాత తనను చూడవచ్చిన స్నేహితురాలితో తన జీవితాన్ని ఓ ఆత్మకథలా చెప్పుకున్నప్పుడు కూడా ఎక్కడా కించిత్తు బాధను వ్యక్తం చేయలేదు. మైదానంలో జీవితం ఆమెకు అమృతతుల్యం లానే కనిపించింది. ఫెమినిజానికి కావాల్సిన పట్టుదల, స్వాతంత్ర్యం, , స్వేచ్ఛ ఏవైతే రాజేశ్వరిలో లేవని రచయత అభిప్రాయపడ్డారో అవన్నీ ఆమెలో మనకు స్పష్టం గా కనిపిస్తాయి.


" చలం రచనల్లోని స్త్రీ పాత్రలు సంఘం బయట, లోపలా చాలా రొమాంటిక్ గా , ' కవితాకన్యలు లాగా ' ఏదో వేరే ప్రపంచంలో వున్నట్లుంటారు. ఇందులో విప్లవం నిండుగా వున్నా వాస్తవికత తక్కువే " అంటారు రచయత. రాజేశ్వరి విప్లవాత్మకమైన పాత్ర అని అంగీకరిస్తూనే రచయత ఆమెలో వాస్తవికత పాలు తక్కువన్నారు. కానీ ఈ నవల పరిధిలో ఆమె ఎక్కడా కూడా అవాస్తవికంగా, అసహజంగా ప్రవర్తించలేదు. సహజమైన భావప్రకటనా స్వేచ్ఛనే రాజేశ్వరి కి నిజమైన ఆభరణం. ఆమెను తెలుగు సాహిత్యంలో విలక్షణ స్థాయిలో నిలబెట్టింది ఆమె లోని ఈ అంశమే. మైదానం ఒక అద్భుతమైన రచన, గొప్ప శిల్పం అని చెబుతూనే ఉద్యమంగా ఈ రచన యొక్క అవసరం ముఖ్యంగా ప్రస్తుతం స్త్రీవాద రచనల ప్రభావంతో , కొంచెం తగ్గిన సందర్భంలో మైదానాన్ని వాచకంగా గుర్తించాల్సిన అవసరముందని రచయత అభిప్రాయపడ్డారు. స్త్రీవాదానికి మైదానం అవసరమా, కాదా అన్న చర్చను పక్కనబెడితే మైదానాన్ని కేవలం ఓ వాచకం గా చూచే క్రమంలో ' మైదానం ' లోని వాస్తవికతనీ, రాజేశ్వరి, అమీర్, మీర్ ల బంధంలోని సహజ చిత్రీకరణనీ గుర్తించలేకపోవడమే రఘురామరాజు పరిశీలన లోని ప్రధానమైన లోపం. మైదానాన్ని ఒక వాచకం గా గుర్తించటానికి , పరిశీలించడానికి పోస్ట్ మోడర్నిజం కావాల్సి వస్తుందేమో కానీ ఒక రాజేశ్వరినో, ఒక అరుణనో, మరో శశిరేఖ నో అర్ధం చేసుకోవడానికి మాత్రం కాదు. పోస్ట్ మోడర్న్ విమర్శనాపనిముట్ల మధ్య కూడా సంప్రదాయ భావనలతో రాజేశ్వరి పాత్ర మరింత అపార్ధానికి గురైందని ఈ పుస్తకం ద్వారా మరో సారి స్పష్టమైంది.

34 వ్యాఖ్యలు:

Kathi Mahesh Kumar said...

మీరు చెప్పిన విశ్లేషణలో నాకెక్కడా "పోస్టుమాడ్రనిజం" కనిపించలేదు. అంతో ఇంతో సైకోఅనాలిసిస్ కనిపించింది. కానీ, అదికూడా చాలా వరకూ అప్ డేటెడ్ కాదు.

ఎందుకో చలం మైదానన్ని భౌతిక ప్రపంచంగా ఊహించుకోలేను.అదొక మానసిక కాల్పనిక ప్రపంచం అనిపిస్తుంది నాకు. అందుకే సర్రియలిజం కోణం నుంచీ మైదానంని అర్థం చేసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను. కొంత విశ్లేషణ నేను నా బ్లాగులో చేశాను. దాన్నిక్కడ పెడుతున్నాను. చూసి, వ్యాఖ్యానించండి.

"మైదానం - ఒక సర్రియల్ (surreal ) నవల:
Surrealism was a means of reuniting conscious and unconscious realms of experience so completely, that the world of dream and fantasy would be joined to the everyday rational world in "an absolute reality, a surreality."
- The Surrealist Manifesto, André Breton,1924

మైదానం నవల్లో ఏది నిజం, ఏది కల్పన, ఏది కల, ఏది ఆలోచన,ఏది అపోహ అనేవి ప్రశ్నార్థకాలు. కానీ, అన్నీ మనకు తెలిసిన లోకంలో జరుగుతున్నట్లుగానే భ్రమింపజేస్తాయి. ఈ కారణంగా కథలో జరుగుతున్న "కాల్పనిక వాస్తవాన్ని" భౌతికనిజంగా పరిగణించి, చలం పంధా బరితెగించిన పంధా అని అప్పటికే నిర్ణయించేసిన చాలా మంది పాఠకులు, ప్రతిస్పందించండం మొదలుపెడతాం. ఒకసారి ప్రతికూల ప్రతిస్పందన మొదలైతే, రసస్పందనకు మిగిలింది అభాసుపాలే.అందుకే,ఈ సాహితీప్రక్రియ మూలాల్ని లేక ఉద్దేశాల్ని గ్రహించకుండా ఈ నవలను సాధించడం అపోహల్ని కలిగిస్తుందేతప్ప ఆర్ధ్రతను కాదు.

ఈ నవల, నాయిక రాజేశ్వరి మానసిక చేతన(conscious),ఉపచేతన(subconscious),అచేతన (unconscious)ల అభివ్యక్తి. రాజేశ్వరి అమీర్ తో నివసించే మైదానం అణచివేయబడ్డ శారీరక,మానసిక వాంఛల ఫలసిద్ధికి సాక్షాత్కరించిన మాయాలోకం . అదొక ప్రతీక.అదొక బలీయమైన కోరిక. అదొక కాల్పనికవాస్తవం.అమీర్, మీరాలు రాజేశ్వరి మనోజనిత కాంక్షలు.

ఒక స్త్రీగా రాజేశ్వరి లోని శారీరక చైతన్యానికి సరిదూగే పురుషశక్తికి అమీర్ ప్రతీకైతే, మీరా స్త్రీలోని మాతృహృదయ పరిపూర్తికి చిహ్నం. స్త్రీలోని మూలభావనలైన (basic instincts) ప్రేమవాంఛ, మాతృకాంక్షల కథ మైదానం.

రాజేశ్వరి-అమీర్ ల కలయిక, సంసారం-దాంపత్యం- నాగరికత మాటున అణవేయబడుతున్న శారీరక చైతన్యాన్ని అందుకోవడానికి, హిపోక్రటిక్ సామాజిక విలువల కూర్పుని కాలదన్ని, కేవలం ప్రాధమిక (rudimentary) కాంక్షల్ని ఆకాంక్షించే విప్లవానికి సంకేతం. మీరా తో రాజేశ్వరి ప్రేమ, తన వంచిత మాతృకాంక్షను ఆవిష్కరించే ప్రయత్నం. మీరా రాజేశ్వరికి కొడుకు,తమ్ముడు, ప్రేమికుడు, ఆరాధకుడు,రక్షకుడు. అమీర్ - మీరా- రాజేశ్వరిల మధ్యజరిగే ప్రేమ-ద్వేషం-మళ్ళీ ప్రేమలను అర్థం చేసుకోవాలంటే ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ ( psychoanalysis ) సహాయం తీసుకోకతప్పదు.

చలం ఇందులో స్త్రీస్వేఛ్ఛని ప్రబోధించలేదు. ఎవర్నీ ఇలా సంసారాలు వదిలి కాల్పనిక మైదానాల కోసం పరిగెత్తమని చెప్పలేదు. అణగదొక్కబడిన స్త్రీత్వం సాక్షిగా, ఒకధీటైన సమాంతర ప్రపంచాన్ని సృష్టించి అందులో ఆ స్త్రీని సంతుష్టురాల్ని చేసే ప్రయత్నం చేసాడు. సంసారాలూ,దాంపత్యాలూ ఇలా ఏడిస్తే, స్త్రీలో జరిగే మానసిక విచ్ఛిన్నతి (fragmented consciousness)ని ఆవిష్కరించి, సమాజానికి ఒక హెచ్చరిక జారీచేసాడు.

ఈ సిద్ధాంతాలనూ, సాహితీప్రక్రియలనూ,ఆలోచనా విధానాలనూ నేపధ్యంగా తీసుకోకుండా మైదానాన్ని చదివి అర్థం చేసుకోవడం కష్టమయితే, అస్వాదించి, అనుభవించడం అసంభవం. చలం రచనల మీదున్న అపోహని ప్రాతిపదికగా తీసుకుని లేక "సామాజిక సృహ" అనే మరొక హిపోక్రటిక్ టూల్ ని ప్రమాణంగా తీసుకుని మైదానాన్ని బేరీజు చెయ్యాలని చూసినా మిగిలేది అనుభవం కాదు అపభ్రంశమైన మానసిక సంతులన."

Kalpana Rentala said...

మహేష్ గారు,

చాలా రోజులైంది మిమ్మల్ని నా బ్లాగ్ లొ చూసి. వోపికగా వ్యాసం మొత్తం చదివినందుకు ముందు ధన్యవాదాలు.

ఇక నా సమధానం.

"మీరు చెప్పిన విశ్లేషణలో నాకెక్కడా "పోస్టుమాడ్రనిజం" కనిపించలేదు. అంతో ఇంతో సైకోఅనాలిసిస్ కనిపించింది. కానీ, అదికూడా చాలా వరకూ అప్ డేటెడ్ కాదు."

మైదానాన్ని నేను ' పోస్ట్ మోడర్న్ ' విమర్శనా పనిముట్లతో ( tools) విశ్లేషించలేదు. అందుకే మీకు నా విశ్లేషణ లో అది కనిపించలేదు. ఆ పని చేసింది రఘురామరాజు. ఆయన పోస్ట్ మోడర్న్ సాధనాలతో చేసిన విమర్శలకు నా సమాధానం నా వ్యాసం.

నేను చేసింది సైకో అనాలిసిస్ అన్నారు. నాకైతె అంత పెద్ద మాటలు తెలియవు. నేను అలా ఒక థియరి బేస్ చేసుకొని మాట్లాడలేదు. నేను చేసింది సైకో అనాలిసిస్ అయితే దానికి సంబంధించిన references ఇచ్చి వుండేదాన్ని. అసలు అలా ఏదో ఒక థియరి ఆధారం గా రాజేశ్వరి ని, మైదానాన్ని చూడటమే పెద్ద లోపం అనుకుంటాను. చివరకు మీ సర్రియలిజం కూడా. ఎందుకంటే ఎలాంటి గొప్ప సిధ్ధాంతానికైనా కొన్ని పరిమితులు వుంటాయి. అది వాస్తవం. అది మనిషిని అర్ధం చేసుకోవడానికి పనికివస్తుంది అని అనుకుంటాము కాని అది ఒక్కోసారి సాధ్యపడకపోవచ్చు. రాజేశ్వరి చేసింది న్యాయం అని చెప్పటానికి కొన్ని థియరీలు, తప్పు అని చెప్పటానికి కొన్ని థియరిలీలు పనికివస్తాయి.

మైదానం మీద నా పొయింట్ అల్లా ఒకటే తప్పా, వొప్పా అని కాదు. ఒక స్త్రీ అలా చెయాలనుకుంటుంది. చేస్తుంది. చేయగలదు. చలం చెప్పదల్చుకున్నది అంతే. పీరియడ్. అనుకుంటాను. That is Rajeswari. అందుకే ఆమె అంత విలక్షణం. ఇది చలం వూహించి రాశాదా? ఎక్కడైనా చలం జీవితం లో తారస పడిందా? ఏమొ మనకు తెలియదు. ఇప్పటికైనా ఎక్కడైనా ఒక రాజేశ్వరి ఏదొ ఒక మైదానపు లోకంలో వుండే వుంటుంది. మనకు కనిపించినా కనిపించకపోయినా. అది నా నమ్మిక....దానికి సిధ్ధాంతాలు, వాదనలు నా దగ్గర లేవు. just చలం మీదున్న నమ్మిక, ప్రేమ. అందుకే మనమంతా చెప్పుకుంటున్నట్లు అలాంటి రచయత ఇక మళ్ళీ తెలుగుదేశం లో పుడతాడన్న నమ్మకం ఇప్పుడైతే లేదు.

Praveen Mandangi said...

>>>>>
మనమంతా చెప్పుకుంటున్నట్లు అలాంటి రచయత ఇక మళ్ళీ తెలుగుదేశం లో పుడతాడన్న నమ్మకం ఇప్పుడైతే లేదు.
>>>>>
చలం గారి గురించి వెన్నవరం ఈదారెడ్డి గారు వ్రాసిన పుస్తకం చదివితే అలాగే అనిపిస్తుంది. చలం గారి సాహిత్యంలో కూడా కొన్ని నెగటివ్స్ ఉన్నాయి. చలం గారి సాహిత్యం గురించి రంగనాయకమ్మ, చందు సుబ్బారావు గార్లు వ్రాసిన రివ్యూలు కూడా చదవండి.

cartheek said...

అక్క రఘురామరాజు గారు చేసిన చలం మైదానంలోని రాజేశ్వరి పాత్ర విశ్లేషణ, ఆ విశ్లేషించ బడ్డ పాత్రపై మీరు స్పందించిన తీరు , మళ్లీ అందులో మీ వ్యక్తీకరణ, నిజ జీవితంలో ఆ పాత్ర సంభవించడానికి సాద్యాసాద్యాల విశ్లేషణ చాలా బావున్నాయ్..

నేను మైదానం చదవ లేదు కాని మీ ఈ విశ్లేషణ చూసినా తర్వాత రాజేశ్వరి పాత్ర పై ఒక స్పష్టమైన అవగాహ వచ్చిందనే అనుకుంటున్నాను ...

ఈ రాజేశ్వరి లాంటి పాత్ర కేవలమూ కల్పనేన?,ఒకవేళ చలం జీవితంలో ఎవరినా ఒక రాజేశ్వరి తారస పడిందా ? అందుకే చలం ఈ మైదానం సృష్టించాడ? అనే ప్రశ్నలు ఎంత వరకు సబబు కాదు అని నా అబిప్రాయం?

ఈ పాత్రను చలం కాలం నాటి స్త్రీ పరిస్థులకు, కట్టుబాట్లకు లేక ఈ కాలంనాటి స్త్రీ పరిస్థితులకు కట్టుబాట్లకు ముడి పెట్టి చూసినా చలం వంద మంది రాజేశ్వరి లను సృష్టించినా అవి మహేష్ గారు పై
వ్యాక్యలో చెప్పినట్టు
"ఎందుకో చలం మైదానన్ని భౌతిక ప్రపంచంగా ఊహించుకోలేను.అదొక మానసిక కాల్పనిక ప్రపంచం అనిపిస్తుంది నాకు." నిజమే అనిపిస్తుంది ...

కాని ఇక్కడ చలం ఆలోచన కట్టుబాట్ల సంకెళ్ళు తెంచుకుంది, ఆచారాల అవధులు దాటింది,బార్య (స్త్రీ) ప్రపంచాన్ని( ఎక్కువ మంది స్త్రీ పురుషుల అబిప్రాయంలో ) కించ పరిచింది , మనం ఎక్కడైనా నిజ జీవితంలో ఇలాంటి స్త్రీని చూసామా అన్న ప్రశ్నా రేపుతుంద, రాజేశ్వరి కళ్ళ ముందు కన్పించే వాస్తవికానికి దూరం కాబట్టి చలం రాజేశ్వరి కేవలం కల్పితం అని కాని, లేక కోటిలో ఏ ఒక్కరో మాత్రమే రాజేస్వరిలా ఉంటారునుకోవడం పొరబాటే నా దృష్టిలో .....
నేటి సమాజం లోనైనా , చలంకాలం నాటి సమాజంలోనైనా ఎప్పుడైనా స్త్రీ ,లేక పురిషుడి అంతఃస్వబావం ఒక్కటే.. అది మారలేదు, సృష్టి అంతం వరకు మారబోదు కూడా అదే చలం చేప్పినటువంటి " ఒక పురుషుడు అనేకమైన స్త్రీలను లైంగిక వాన్చలకు కోరుకోవడం ఎంత సహజమో , ఒక స్త్రీ అనేకమైన పురుషుల్ని కూరుకోవడంకూడా అంతే సహజం " ఇది అక్షర సత్యం ఎందరు పతివ్రతలు వ్యతిరేకించినా , ఎందరు ఆదర్శ పురుషులు వ్యతిరేకించినాసరే ...

ప్రతి పది కొట్లలో ఏ ఒక్కరో మాత్రమే రాజేశ్వరి లా ఉండక , మనం పురాణాల్లో చెప్పుకుంటున్న ఆదర్శ పతివ్రతల లిస్ట్లోకి వస్తారు ...
నేటి సమాజంలో అయినా,చలంకాలంనాటి సమాజం లో అయినా రాజేశ్వరి ఒక " భరి తెగించిన స్త్రీ ల లిస్త్లోకే వస్తుంది " ఇది బాహ్యంగా అందరూ చెప్పే మాటే కాని అంతరంగా ప్రతి స్త్రీలోనూ ఒక రాజేశ్వరి ఉంది ,ప్రతి పురుషుడి లోను ఒక రాజేశ్వరి ఉంది.. ఇది నిజం,నిష్కర్శమయిన నిజం , నిర్మలమైన నిజం కూడా... ఎవరు ఒప్పుకున్నా ,ఒఇప్పుకొకపొయినా ఇటివంటి లక్షనాలుప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి కాని సమాజానికి , ఆచారాలకి ,కట్టుబాట్లకి దడిచి మాత్రమే మనసు చంపుకొని బ్రతుకుతున్నారు ......
ఇదే మనిషి మనసుకుతోడుక్కున్నమేలి ముసుగు ఆ మేలిముసుగునే చలం తొలగించి చూపించాడు, ఆ పాత్ర ఒక్క రాజేస్వరిది మాత్రమేకాదు ప్రతి స్త్రీది ,ప్రతి పురుషుడి...

మీరు చెప్పింది నిజమే "మనమంతా చెప్పుకుంటున్నట్లు అలాంటి రచయత ఇక మళ్ళీ తెలుగుదేశం లో పుడతాడన్న నమ్మకం ఇప్పుడైతే లేదు"
ఎందుకు? అది కూడా చెప్ప దలిచాను.. దీన్ని బట్టి చూస్తే చలం సంగాన్ని ఎదిరించి రచించిన కవిలా , రచయితలా కన్పిస్తున్నాడు,నిజాన్ని నిర్భయంగా తనదైనా శైలిలో చెప్పడంలో సందేహించే వ్యక్తి కాదు అని తెలుస్తుంది....

అంత ఎందుకు అక్క నేను రాసిన నా వాణి మీకు నచ్చలేదు అన్నారు అలాగే ఉష అక్క కూడనచ్చలేదు అన్నారు అందుకే నే అది ప్రస్తుతానికి తీసేసి వేరేది ఆ స్థానంలో చేర్చాను(దానిగురించే నా జేవితంలో చోటు చేసుకున్న ఒక సంగటనను మరో టపా రాసి ఒప్పిన్చాలనుకున్తున్నాను మిమ్మల్ని అది నిజమని ) ... అదే చలం అయితే దానిని సమర్దించి ఒప్పించే వాడు లేక పోతే అది నమ్మని వాళ్ళ కర్మ అని వదిలేసే వాడు దానిని మిలియన్ డాలెర్ ప్రశ్నగా సమాజానికి విసిరేసే వాడు అదే చలం గొప్పతనం అని తెలుస్తుంది....

ఏదేమైనా నేటి సమాజంలోనైనా ,చలం కాలంనాటి సమాజంలో నైనా నే చెప్పినట్టు అతి ఎక్కువమంది స్త్ర్రీలు రాజేస్వరిలే , ప్రతి పురుషుడు ఒక రాజేస్వరే ఇదే చలం చెప్పదలిచిన నిజం .

Kathi Mahesh Kumar said...

కల్పనగారూ, ఏ థియరీ అయినా రచయిత మూలభావనల్ని probe చెయ్యడానికేతప్ప conclude చెయ్యడానికి వాడటం విమర్శనరీత్యా కూడనిపని. అందుకే నేను సర్రియలిజాన్ని కూడా నా personal choice గా ఉటంకించాను.That is surely not the end all and be all.

నావరకూ, రాజేశ్వరి చేసింది న్యాయమా,అన్యాయమా,అపవిత్రమా లాంటి భౌతిక ప్రశ్నలు మైదానం విశ్లేషణలో అప్రస్తుతాలు. రాజేస్వరిద్వారా చలం సమాజానికి కొన్ని ప్రశ్నలు సంధించి, ఛాలెంజ్ విసిరాడు. సమాజం ఇలాగే ప్రవర్తిస్తే ఎందరో రాజేశ్వరిలకు మనోలోకాలే భావప్రాప్తి జగత్తులౌతాయని వార్నింగ్ ఇచ్చాడు.సంసారాలూ,దాంపత్యాలూ ఇలా ఏడిస్తే, స్త్రీలో జరిగే మానసిక విచ్ఛిన్నతి (fragmented consciousness)ని ఆవిష్కరించి, సమాజానికి ఒక హెచ్చరిక జారీచేసాడు.

వాటికి సమాధానం as a society do we have it even NOW? అనేది ముఖ్యమైన ప్రశ్న. దానికి సమాధానం లేనన్నినాళ్ళూ "మైదానం" బ్రతికే ఉంటుంది.

భావన said...

హ్మ్... చాలా బాగుంది కల్పన. మీ విశ్లేషణ దానీమీద కామెంట్ లు కూడా... చలం రచన ను విశ్లేషించటం అంటే కొండ ను అద్దం లో చూపించటమే కాని ప్రయత్నం మాత్రం అవసరమేమో. కాని మైదానాన్ని ఒక సిద్ధాంతం తో ముడి పెట్టటం అది ఏ సిద్ధాంతమైనా కష్టమేమో.. చదివి ఎవరికి వారు ఆలోచించి ఎవరికి వారు అనుభవించి అర్ధమ్ చేసుకునే సత్యం.. ఏమిటా సత్యం అందరు రాజేశ్వరి లా లేచి పోవటమా అని కొందరు విరుచుకు పడతారేమో కాని

మైదానం మీద నా పొయింట్ అల్లా ఒకటే తప్పా, వొప్పా అని కాదు. ఒక స్త్రీ అలా చెయాలనుకుంటుంది. చేస్తుంది. చేయగలదు. చలం చెప్పదల్చుకున్నది అంతే. పీరియడ్.
100% మీతో ఏకీభవిస్తా.

రాజేస్వరిద్వారా చలం సమాజానికి కొన్ని ప్రశ్నలు సంధించి, ఛాలెంజ్ విసిరాడు. సమాజం ఇలాగే ప్రవర్తిస్తే ఎందరో రాజేశ్వరిలకు మనోలోకాలే భావప్రాప్తి జగత్తులౌతాయని వార్నింగ్ ఇచ్చాడు.సంసారాలూ,దాంపత్యాలూ ఇలా ఏడిస్తే, స్త్రీలో జరిగే మానసిక విచ్ఛిన్నతి (fragmented consciousness)ని ఆవిష్కరించి, సమాజానికి ఒక హెచ్చరిక జారీచేసాడు. మహేష్ అంటే మీరన్నది ఎలా వుంది అంటే "రాజేశ్వరి చేసింది తప్పు సమాజం ఇలానే వుంటే ఇలాంటి రాజేశ్వరు లు తయారవుతూనే వుంటారు అన్నట్టు వుంది".. మీరు రాసింది ఆ వుద్దేశం తో ఐతే నేను ఒప్పుకోను అండి. అసలు రాజేశ్వరి చేసింది తప్పు అని చలం అనుకున్నారా అని అనుకోవటానికే అసంభద్దం గా వుంది.

Kalpana Rentala said...

"సమాజం ఇలాగే ప్రవర్తిస్తే ఎందరో రాజేశ్వరిలకు మనోలోకాలే భావప్రాప్తి జగత్తులౌతాయని వార్నింగ్ ఇచ్చాడు.సంసారాలూ,దాంపత్యాలూ ఇలా ఏడిస్తే, స్త్రీలో జరిగే మానసిక విచ్ఛిన్నతి (fragmented consciousness)ని ఆవిష్కరించి, సమాజానికి ఒక హెచ్చరిక జారీచేసాడు.
వాటికి సమాధానం as a society do we have it even NOW? అనేది ముఖ్యమైన ప్రశ్న. దానికి సమాధానం లేనన్నినాళ్ళూ "మైదానం" బ్రతికే ఉంటుంది."

మహేష్, అదే వచ్చిన చిక్కల్లా...మీరు , నేను ఇద్దరం మైదానం బతికే వుంటుందంటున్నాము.కానీ భిన్న కారణాలతో...రాజేశ్వరి ది విలక్షణమే కాని అది ఆమె సహజ ప్రవృత్తి. రాజేశ్వరి ది తనదైన మానసిక ప్రపంచం అనటానికి, అది ఆమె మనోలొక భావప్రాప్తి జగత్తు అనటానికి తేడా వుందేమొ అనుకుంటాను. మీ fragmented consciousness నాకు అర్ధం కాలేదు.

@భావనా, నేనైతే రఘురామరాజు గారి పుస్తకం చదవమనే అంటాను. లేకపొతే నేనెలా రాశానో తెలియదు కదా....

""రాజేశ్వరి చేసింది తప్పు సమాజం ఇలానే వుంటే ఇలాంటి రాజేశ్వరు లు తయారవుతూనే వుంటారు అన్నట్టు వుంది".. మీరు రాసింది ఆ వుద్దేశం తో ఐతే నేను ఒప్పుకోను అండి. అసలు రాజేశ్వరి చేసింది తప్పు అని చలం అనుకున్నారా అని అనుకోవటానికే అసంభద్దం గా వుంది."
నేను కూడా వొప్పుకోలేను. మరి మహేష్ ఏ వుద్దేశం తో రాశారో ఆయనే చెపితే బావుంటుంది.

@కార్తీక్, ఏమి చదవలేదని అంత విశ్లేషణ రాశావు. మంచి పుస్తకాలు చదివే వుంటావు. చెప్పకుండా దాగుడుమూటలు ఆడుతున్నట్లు వున్నావు అక్కలే కదా ఏమి అనరులే అని. చదివి ఓపిగ్గా నీ భావల్ని వ్యక్తీకరించినందుకు థాంక్స్.

@ప్రవీణ్, సారీ, మీరు చెప్పిన పేర్ల వాళ్ళు రాసినవేమీ నేను చదవలేదు కాబట్టి ఏమి చెప్పలేను. చలం సాహిత్యం లో నెగెటివ్ అంశాలు తప్పకుండా వుండే వుంటాయి. ఎందుకంటే ఆయన కూడా రక్తమాంసాలతో పుట్టిన మాములు మనిషే. రచయత గా మాత్రం దార్శనికుడు.

Kathi Mahesh Kumar said...

@భావన: నిజమే అలాక్కూడా అనుకునే ఉద్దేశం ఉందికదూ!

చలానికి నైతిక విలువలతో నిమిత్తం లేదు. కానీ ఒక వ్యక్తి యొక్క మానసిక ఏకత్వం (phsychological integrity)చాలా ముఖ్యం. ఒక వ్యక్తి వ్యక్తిగా బ్రతకలేనినాడు, తన వాంఛల్నీ,కోరికల్నీ,ఆకాంక్షల్నీ అణగదొక్కిననాడు సామాజిక పతనం ఆరంభమవుతుందని బలంగా నమ్మినవాడు చలం. రాజేశ్వరి విషయంలో కూడా అదే చెప్పాడు. సమస్య రాజేశ్వరి చేసింది తప్పా..ఒప్పా అనికాదు. రాజేశ్వరి మానసిక విచ్చితికి కారణమైన సమాజాన్ని చలం ప్రశ్నించాడంతే.

Kalpana Rentala said...

మహేష్, మీరు మానసిక విచ్చిత్తి నెగెటివ్ గా వాడుతున్నారా? నాకు నిజం గా అర్ధం కాకే అడుగుతున్నాను. మీరు కొంచెం క్లారిఫై చేస్తే నేను మీరు ఏ పాయింట్ నుంచి మాట్లాడుతున్నరో అర్ధం చేసుకోవటానికి ప్రయత్నిస్తాను.

తెలుగు వెబ్ మీడియా said...

>>>>>
" ఒక పురుషుడు అనేకమైన స్త్రీలను లైంగిక వాన్చలకు కోరుకోవడం ఎంత సహజమో , ఒక స్త్రీ అనేకమైన పురుషుల్ని కూరుకోవడంకూడా అంతే సహజం " ఇది అక్షర సత్యం ఎందరు పతివ్రతలు వ్యతిరేకించినా , ఎందరు ఆదర్శ పురుషులు వ్యతిరేకించినాసరే ...
>>>>>
నేను అలా అనుకోను. చలం గారు చాలా సందర్భాలలో మోనోగేమీని సమర్థించారు. http://blogzine.sahityaavalokanam.gen.in/2009/11/blog-post_4422.html

Kathi Mahesh Kumar said...

@కల్పనగారూ,self respecting, self conscious, integrity కలిగిన వ్యక్తులు తమ ఆంకాంక్షలకూ సామాజిక ఆంక్షలకూ మధ్య సయోధ్య కుదరక తీవ్రమైన మానసిక ఒత్తిడి మధ్యన జీవిస్తారు. దాని పర్యవసానంగా కొన్ని ఆలోచనలను ఆవిష్కరిస్తారు, సిద్ధాంతాలను ప్రతిపాదిస్తారు...లేదా...తమదైన కాల్పనిక ప్రపంచాల్ని సృష్టించుకుని అందులో జీవిస్తారు.

ఈ ఒత్తిడుల నడుమ చలం కొన్ని ఆలోచనల్ని ఆవిష్కరిస్తే, చలం పాత్ర రాజేశ్వరి తన suppressed sexuality ని realize చేసుకోవడానికి, తన fragmented consciousness ని ఆధారం చేసుకుని ఒక imaginary మైదానాన్ని సృష్టించుకుంది.

అది తప్పా-ఒప్పా? నెగిటివా, పాజిటివా? అనేది నైతిక ప్రతిపాదన. అది అనవసరం అని నేననుకుంటాను. మనం అడగాల్సిన ప్రశ్నలు ‘ఇంకా మన సమాజంలో sexual suppression ఉందా?’, ఎంతమంది మహిళలు ఈ fragmented consciousness తో జీవిస్తున్నారు?’ ‘స్త్రీలు/పురుషులు ముసుగులతో ప్రమేయం లేకుండా వాళ్ళు వాళ్ళుగా బ్రతికే పరిస్థితి ఇప్పటికైనా ఉందా?’అనేవి మనం అడగగలిగి...ఈ సమాజం వాటికి సమాధానం చెప్పగలిగే వరకూ మైదానం evergreen novel గా ఉంటుంది. ఎందుకంటే it asked those fundamental questions.

Kathi Mahesh Kumar said...

@ప్రవీణ్: చలం మొనోగమీని కాదు,వ్యక్తిగత సంబంధాల్లో integrity ని కాంక్షించారు.

cartheek said...

@ ప్రవీణ్ ఏమో చలం దేన్నీ సంర్దిన్చాడో నాకు తెలియదు, దాని పై మాట్లాడటానికి కూడా నాకుచలం గురించి ఏమి తెలియదే :(
నా విశ్లేషణ చలాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పలేదు, నేటి సమాజాన్ని దృష్టిలో పెట్టుకిని చెప్పాను ,చలం కాలన్ని దృష్టిలోపెట్టుకుని చెప్పాను...
చలం గురించి నాకు తెలిసిందల్లా నేకోద్దిగా చదివిన ( ఎన్ని సార్లు చదివినా పూర్తిగా అర్ధం కాని )మహాప్రస్థానం యోగ్యతా పత్రం రాసిన చ్లమ్మాత్రమేనాకు తెలుసు... అందులో చలం మొట్ట మొదటి వాక్యాలలోనే ఇలా అన్నాడు "దీంట్లో మీ సెక్సుని ఉద్రేకించే సంగతులేమి లేవు" అని అప్పుడే నాకు అర్ధమయ్యింది చలం రచనల్లో సెక్స్ గురిన్చి ప్రస్తావిస్తాడు కాబోలు,దానిని జనం వ్యతిరేకించి ఉంటారు కాబోలు అని అనిపించింద.
ఇప్పుడు కల్పన అక్క విశ్లేషణ చూసిన తర్వాత రాజేశ్వరి పాత్ర ద్వారా చలమేమితో చాలావరకు అర్ధమయ్యింది... చలం మనుషుల లోని అంతః స్వబావాన్ని విడమర్చి బయట పెట్టిన వ్యక్తి, అది కొంత మంది జీర్ణించుకోలేక చలాన్ని అతని రచనలని తప్పు పట్టి ఉంటారు అని రూడి అయ్యింది...

@కల్పన అక్క నిజంగా నే ఏ పుస్తకాలు ఇంతవరకు చదవలేదు, శ్రీశ్రీ మహాప్రస్తానం మాత్రం కొద్దిగా చదివాను అలా అని నేను మహా ప్రస్తనంచాదివేసాను అని చెప్పుకో లేను కదా ,అందుకే ఏ పుస్తకాలు చదవ లేదు అని చెప్పాను, ఇక్కడే నాకు చలానికి పరిచయంజరిగింది.....
చలం అంటే ఏమిటో కొద్దిగా అర్ధమయ్యింది..

ఇకపోతే నే ఇంతవరకు ఏ పుస్తకం చదవ పోవడానికికారణం ,చదవాల్సిన అవసరం రాక పోవడానికి కారణం?
"ప్రపంచమే నా పుస్తకం ,జన జీవనమే నా అక్షరం" అని నే అనుకుంటాను .
సమాజం కన్న గొప్ప పుస్తకమేమీ లేదు అని నా ఉద్దేశం. నే ఏదైనా అనుభవించి,లేక ప్రత్యక్షంగా అనుభవించిన వారిని కలిసి లేక ఎదుటి వారిని పూర్తిగా అర్ధంచేసుకుని రాస్తాను, అప్పుడే నిజం రాయగలుగుతాను, నా రాతలకు న్యాయం చేయగలను అని నా నమ్మకం.
నే శవాలు తగలబడటం ఎన్నో సార్లు చూసాను ఎందరికో ,కపాల మోక్షం ప్రత్యక్షంగా చూసాను,
ఈ మద్యనే వేశ్యా గృహాలను సందర్శించి అక్కడ స్త్రీలతో మాట్లాడాను. వాళ్ళు నిజంగా త్రుప్తి పొందటానికే ఇలాంటివి చేస్తున్నారా అని నిర్దారించి కోవడానికే, వాళ్ళను ఆ నరకకూపంనుంచి ఎలా తప్పించాల అని తెలుసు కోవడానికి .. ఇదే నేను త్వరలో నా బ్లాగులో ప్రస్తావించ బోతున్నాను... దీని ఫలితమే నే రాసిన "సత్యం" లో నా వాణి అది చాలా మందికి నచ్చ లేదు :) :) ...

ఇక పోతే చలం పుస్తకాలు చదవాలి అనుకుంటున్నాను అక్క ,ఇప్పుడే మైదానం కొన్న విశాలాంద్రలో..
ఇంకా వేరే పుస్తకాల పేర్లు చెప్పండి అక్క చలం రాసినవి...

తెలుగు వెబ్ మీడియా said...

మహేష్. చలం గారు మోనోగేమీనే కోరుకున్నారు.
>>>>>>>>>>
మోనోగేమీ (ఏకపత్నీవ్రత్యం)నాగరిక సమాజానికే కాక వ్యక్తులకి కూడా క్షేమకరం. బలమూ, ధనమూ, అధికారమూ గల పురుషులు స్త్రీలని తీసుకుపోతే, హీనులైన వాళ్ళకి స్త్రీలు దొరకరు. మోనోగేమీలో ప్రతి స్త్రీ పెళ్ళి చేసుకుంటే ప్రతి పురుషుడికి స్త్రీ దొరుకుతుంది. కాని రేస్ గొప్పది కావాలంటే, గొప్ప అతనికి పది మంది స్త్రీలు ఉండడమే ఎక్కువ ఉపయోగకరం. హీనులైన వాళ్ళకి స్త్రీలు దొరకకపోవడం అట్లానే మంచిది.
>>>>>>>>>>

వ్యక్తికి ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలుండే ఆచారం భూస్వామ్య సమాజ ఆచారమే. పెట్టిబడిదారీ సమాజానికి గానీ, సోషలిస్ట్ సమాజానికి గానీ అది సరిపడదు. చలం గారు పుట్టిన టైమ్ లో ఇండియా ప్యూర్ ఫ్యుడల్ (శుద్ధ భూస్వామ్య) సమాజం. ఇప్పుడు ఇండియా సెమి ఫ్యూడల్ (అర్థ భూస్వామ్య) సమాజం. అప్పటికీ, ఇప్పటికీ సమాజంలో గొప్ప మార్పులు రాలేదు.

Kathi Mahesh Kumar said...

@ప్రవీణ్: మీరెప్పటిలాగే పదాల అర్థాల్ని పట్టుకుని భావాన్ని మిస్ అవుతున్నారు. మొదటిలైన్ తరువాత ఉన్న వాఖ్యాల్ని మళ్ళీమళ్ళీ చదువుకోండి. అయినా,మీరు ఔటాఫ్ కాంటెక్స్ట్ చలాన్ని కోట్ చేసి, "చలం ఇలాగే prescribe చేశాడు" అనడం చిత్రంగా ఉంది. చలమెప్పుడూ prescribe చెయ్యలేదు. Suggest చేసి వదిలేసాడు. అందుకే he stands tall in world literature.

@కల్పనగారూ: నిజానికి fragmented consciousness చలం మైదానం రాసిన నాటికి ఒక బృహత్తరమైన సమస్య. కానీ పోస్టుమాడ్రన్ యుగంలో "Each of us is several, is many,is a profusion of selves. So that the self who disdains his surroundings is not the same as the self who suffers or takes joy in them. In the vast colony of our being there are many species of people who think and feel in different ways"(Fernando Pessoa) అని అంగీకరించాక అది సమస్య కాదు. సమాధానం దిశగా ఒక discovery. మైదానాన్ని నిజంగా పోస్టుమాడ్రన్ ధృక్కోణంలో చూడాలంటే ఈ కోణంలోంచీ చూడటానికి ప్రయత్నించాలి.

తెలుగు వెబ్ మీడియా said...

మహేష్. చదివిన తరువాత ఆచరించకపోతే ఏ రచనైనా వృధా. అది మైదానం కావచ్చు, మరొక రచనైనా కావచ్చు. మీ లాంగ్వేజ్ ఆచరణ ఎందుకు అనుకునేవాడి లాంగ్వేజ్ లాగ ఉంది.

cartheek said...

ఆగండి ఆగండి
మహెష్ గారు , ప్రవీన్ గారు మా కల్పన అక్క బ్లాగు ముఖంగా మీరిద్దరూ వాదులాడుకొవద్దూఊఊఊఊఊఉ :) :)
అవును ప్రవీణ్ గారు ఆచరణ ఉండాలి కానీ అన్ని ఆచరించ థగినవి కాదు..

ఎమొనయ్య మీ ఇద్దరకు మా కల్పన అక్కే సమాదానం చెప్పాలి

ఎవరి interpretation వాళ్ళది అంతె..

తెలుగు వెబ్ మీడియా said...

ఆచరణ ఇష్టం లేకపోతే కబుర్లు ఎందుకు? మైదానం రాజేశ్వరిలాగే రంగనాయకమ్మ గారు కూడా సంప్రదాయ కుటుంబం నుంచే వచ్చారు. ఆమె మొదటి సంసారం కూడా విఫలమయ్యింది. రంగనాయకమ్మ గారు గాంధీ గారితో కొత్త జీవితం మొదలు పెట్టారు. గాంధీ గారు రంగనాయకమ్మ గారి కంటే వయసులో 9 ఏళ్ళు చిన్నవారు. వాళ్ళది ఒకే కులం కాదు, మైదానంలో రాజేశ్వరి, అమీర్ లది ఒకే మతం కానట్టు. చలం గారు వ్రాసినవి ఆచరించడం ఇష్టం లేకపోతే చలం కబుర్లు చెప్పడం ఎందుకు? మైదానంలోని నిజజీవితంలో ఊహించలేము అనేవాళ్ళు చలం భక్తులా?

Kathi Mahesh Kumar said...

@ప్రవీణ్ గారూ: నాకు ఎవరూ దేవుడు కాదు. నేనెవరికీ భక్తుడ్ని కాదు. నా జీవితంలో నేను ఏ భావజాలాన్నీ,సిద్ధాంతాన్నీ,వ్యక్తులనూ unconditional గా అంగీకరించలేదు. సరెండర్ అస్సలు కాలేదు. కాబట్టి మీ ఆరోపణలూ ఆపాదనలూ నాకు చెల్లవు. I am no blind follower of anything. I question every thing and accept bit of everything.చలం ఇందుకు exception కాదు.

చలంను నేను అనుభవించగలను కానీ అర్థం చేసుకోలేను. ఆ అనుభవాల్ని సూత్రీకరించే ప్రయత్నం చేస్తున్నానే తప్ప నా సూత్రీకరణలు నిత్యసత్యాలనే అపోహా భ్రమా నాకు లేవు. వాటిల్లో ఏది ఆచరణ యోగ్యం ఏది కాదు అనేది నా జీవితంలో నేను ఎంచుకునే choice. దాని గురించి మీ జడ్జిమెంటులు నాకు అఖ్ఖరలేదు.

సమాజాన్నీ,సాహిత్యాన్ని,సమూహాల్నీ,భావజాలాల్నీ,సిద్ధాంతాల్నీ ఇంకా అర్థంచేసుకునే ప్రయత్నాల్లోనే ఉన్నాను. బహుశా అది నా జీవితం అయిపోయేవరకూ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మీ అంత నిర్ధుష్టంగా నేను దేన్నీ dismiss చేసి జడ్జ్ చెయ్యలేను. కాబట్టి నన్ను క్షమించెయ్యండి.

Kalpana Rentala said...

మొదట ఒక విషయం. నేను సమాధానం ఇవ్వటానికి ఆలస్యం అవుతుంది. మీరు మీ ఉదయం పెట్టిన కామెంట్లు నేను మా ఉదయం చూస్తాను కాబట్టి.

ప్రవీణ్, మీకు ఒక సూచన. మనం కేవలం మైదానం లో రాజేశ్వరికి సంబంధించి మాత్రమే మాట్లాడుతున్నాము. మధ్యలో మనం మళ్ళీ చలం, ఏకపత్నీవ్రతం, రంగనాయకమ్మ గారి జీవిత చరిత్ర ఇక్కడ వద్దు. మహేష్ ఒక పాయింట్ లేవనెత్తారు. వీలైతె అది డిస్కస్ చేద్దం. ఏమంటారు?

మహేష్( నన్ను గారు అని పిలవకపోతేనే బావుంటుంది), మీరు చెప్పింది అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. కాని మీరు చెప్పిన self respect, self conscuiousness, integrity స్త్రీలకు మాత్రమే వుంటాయా? పురుషులకు కూడా వుంటాయా? అలాంటప్పుడు ఇద్దరికీ వుంటే రాజేశ్వరి మానసిక విచ్చిత్తి లో మనోజగత్తు లో ప్రవర్తించినట్లే పురుషులు కూడా ప్రవర్తిస్తారా?

నేను కొంచెం నెమ్మదిగా టైప్ చేస్తాను. మిగతా ప్రశ్నలు కొంచెం సేపట్లో...

కార్తీక్, ఇందులో ఎవరికి ఎవరం సమాధానాలు చెప్పము. జస్ట్ డిస్కస్ చేసుకుందాము.

@భావనా, మహేష్ వాదన మీకెలా అనిపించిందో చెప్తారని ఆశిస్తున్నాను.

Kathi Mahesh Kumar said...

@కల్పన: స్వతంత్రభావాలుగల పురుషుడైనా స్త్రీ అయినా సమాజంలోని ఈ అర్థరాహిత్యాన్ని ప్రశ్నిస్తే (శారీరకంగా,మానసికంగా) బలైపోతారు. పురుషులకు కనీసం ఎలుగెత్తి అరిచే స్వతంత్రమన్నా ఉంది.They have a went for their frustration. కానీ స్త్రీకి మైదానం సమయానికి అదికూడా లేదు.

కాబట్టి ఆ చెప్పుకోలేని, పోరాడలేని,అసహాయమైన suppression లోంచీ రాజేశ్వరి ఒక ఊహాజనిత మైదానాన్ని సృష్టించింది.అందులో తన ప్రేమవాంఛ, మాతృకాంక్షల ఆపూర్తికై తపించిందని నాకనిపిస్తుంది. వాటికి ప్రతీకలే అమీర్,మీరా.

అదొక ప్రయత్నం. అదొక మనోజనిత కాంక్ష.అదొక కాల్పనిక వాస్తవం. భౌతికంగా కాకపోయినా, మానసికమైన "నిజం". అందుకే రాజేశ్వరిని ఈ కాల్పనిక వాస్తవంలోకి వెళ్ళడానికి ఏర్పడ్డ పరిస్థితి/కారణాలు ఆ లోకంలో తను చేసిన ప్రయత్నం ముఖ్యమౌతాయిగానీ వాటి ఫలితం, ఆ ఫలితాల మీద మన "అభిప్రాయం" కాదు.

తెలుగు వెబ్ మీడియా said...

Cartheek wrote:
>>>>>
ఇప్పుడు కల్పన అక్క విశ్లేషణ చూసిన తర్వాత రాజేశ్వరి పాత్ర ద్వారా చలమేమితో చాలావరకు అర్ధమయ్యింది... చలం మనుషుల లోని అంతః స్వబావాన్ని విడమర్చి బయట పెట్టిన వ్యక్తి, అది కొంత మంది జీర్ణించుకోలేక చలాన్ని అతని రచనలని తప్పు పట్టి ఉంటారు అని రూడి అయ్యింది...
>>>>>
చలం గారు మనిషిలోని అంత:స్వభావాన్ని బయటపెట్టిన మాట నిజమే. చలం గారి సాహిత్యం చదివినప్పుడు మొదట్లో నాకు కూడా కొంత ఆశ్చర్యం కలిగింది. నిజంగా సంకోచిస్తూ సంకుచిత నమ్మకాల నుంచి బయటపడలేనివాళ్ళు ఉన్నారు. బయటకి ఒకలా మాట్లాడుతూ, అంతర్గతంగా ఇంకోలా ఆలోచించేవాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా సంకోచించేవాళ్ళని చూసినప్పుడు మనిషి యొక్క అంత:స్వభావం ఒకలాగ, బాహ్య స్వభావం ఒకలాగ ఉంటాయనేది నిజమేనా అని కొన్ని సార్లు డౌట్ వచ్చింది. ఆ మధ్య చలం మైదానం గురించి నాకు ఈ-మెయిల్ వచ్చింది. సామాజిక కట్టుబాట్లని విమర్శించే రచనని సమాజం అంగీకరించదు కనుక మైదానం నవలని సంప్రదాయవాదులు విమర్శించడం విచిత్రం కాదు అని మెయిల్ పంపిన వ్యక్తి వ్రాసారు. దాంతో మైదానం నవల మళ్ళీ చదవాల్సి వచ్చింది.

తెలుగు వెబ్ మీడియా said...

మెయిల్ పంపిన ఆమె ఇంకొక విషయం కూడా వ్రాసింది "చలం రాజేశ్వరి అమీర్ ని ఇంకొక ఆమె దగ్గరకి తీసుకువెళ్తున్నట్టు వ్రాసాడు, అది ఏమాత్రం స్త్రీవాదం కాదు" అని. కొంత వరకు ఆమెతో ఏకీభవిస్తాను. రాజేశ్వరి జెలసీ చంపుకుని ఆ పని చేసింది అని ఆ నవల మళ్ళీ చదివితే అర్థం అవుతుంది. స్త్రీకి జెలసీ లేకపోతే పురుషునికి కూడా జెలసీ ఉండకూడదు. ఆమె చలం గారు వ్రాసిన "స్త్రీ" పుస్తకం చదవలేదు. అందుకే చలం గారిని సరిగా అర్థం చేసుకోలేకపోయింది. చలం గారిని అర్థం చేసుకోవడానికి మైదానం నవల సరిపోదు.

Bolloju Baba said...

good discussion

తెలుగు వెబ్ మీడియా said...

చలం గారు వ్రాసిన ఒక పుస్తకం ఆధారంగా చలం గారిని అంచనా వెయ్యలేం. చలం గారి రచనలన్నీ చదివితేనే చలం గారు పూర్తిగా అర్థమవుతారు. మార్చి, ఏప్రిల్ నెలలలో మహేష్ కేవలం మైదానం నవల ఆధారంగా చలం సాహిత్యం అర్థం కాదు అని వాదించాడు. నేను "స్త్రీ" పుస్తకంలోని చలం కోట్స్ ఉదహరిస్తే అతను సమాధానం చెప్పలేకపోయాడు. జెలసీ గురించి చలం గారు వ్రాసిన రచనలు చదివితే రాజేశ్వరి జెలసీ లేని పవిత్ర స్త్రీ అని కూడా అర్థం అవుతుంది.

భావన said...

కల్పన మీరు కామెంట్ ఫాంట్ సైజ్ పెంచకపోతే నావంటి వాళ్ళకు జీవిత కాలం సరి పోదు కళ్ళు చించుకుని చదవటానికి. :-)
"కాబట్టి ఆ చెప్పుకోలేని, పోరాడలేని,అసహాయమైన suppression లోంచీ రాజేశ్వరి ఒక ఊహాజనిత మైదానాన్ని సృష్టించింది.అందులో తన ప్రేమవాంఛ, మాతృకాంక్షల ఆపూర్తికై తపించిందని నాకనిపిస్తుంది. వాటికి ప్రతీకలే అమీర్,మీరా."

ఏమిటో మరి మైదానం చదివినప్పుడు రాజేశ్వరి అసహాయత నాకు ఎక్కడా తోచలేదు.. అంటే అసహాయత వస్తే కాని చేసే పని కి ( చెడూ ఐతే సమాజం దృష్టి లో) న్యాయం చేకురదా మహేష్.. ;-)

ఈ డిస్కషన్ అంతా చదివేక నాకు అనుమానం వస్తోంది నేను మైదానం సరిగా చదవలేదా.. నాకెందుకు ఈ కల్పానిక వాస్తవం అనిపిన్చలేదు చలం అలా రాసేరా కధ? రాజేస్వరి మనోజనిత కాంక్షలు అమీర మీరా అన్నారు్, మనోజనితమా ఆ కధలో నిజ పాత్రలే కదా.. నేను ఏదో మిస్స్ అయ్యానా?
:-|

తెలుగు వెబ్ మీడియా said...

చలం గారు ఇంటెన్షనల్ గా కాల్పనికాలు వ్రాస్తారనుకోను. చలం గారి పుస్తకాలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇంటిలోనూ, షాప్ లోనూ ఖాళీ సమయాలలో అవి చదువుతుంటాను.

భాస్కర రామిరెడ్డి said...

కల్పనగారూ ముందుగా అసందర్భ వ్యాఖ్యకు క్షమించండి. ఈ వ్యాఖ్యను మీరెప్పుడైనా తొలిగించవచ్చు.

ప్రవీణ్ గారూ చలం వ్యక్తిత్వాన్ని బాగా అధ్యయనం చేసి, వారు సూచించిన బాటలో తూచా తప్పకుండా నడుచుకుంటూ, బ్లాగుల్లో కాలం వెళ్ళబుచ్చుతూ మధ్యలో పొరపాటున టైం దొరికితే చలం పుస్తకాలన్నింటినీ మడత పెట్టి నమిలేసి జీర్ణం చేసుకోని ప్రొద్దునే మామీద ఇలా విసర్జించెస్తున్నారు, ఏంచేద్దాం సరే కానివ్వండి. మామూలుగా అయితే ఇలా వ్రాద్దామనుకున్నా కానీ మైదానం మీద చర్చిస్తున్నాం కాబట్టి , కల్పన గారికి కోపం రాకుండా ఈ పోష్ట్ కు సరిపోయేట్టు వ్యాఖ్య వ్రాయాలి కాబట్టి ఇదిగో ఈ కామెంట్. నాకు కొన్ని సందేహాలున్నాయి తీర్చవలసిందిగా మనవి.

ఇంతకీ ఈ మైదానం ఏ వూర్లో వుంది? చాలా వూర్లలో మైదానాలు వుంటాయి కదా, మరి ఇది ఏవూరి మైదానం.

తెలుగు వెబ్ మీడియా said...

మహేష్. నువ్వు మైదానం అర్థం కాదు అన్నావు కదా. ఈ లింక్ చదువు: http://blogzine.sahityaavalokanam.gen.in/2009/12/blog-post_15.html

Kathi Mahesh Kumar said...

@భావన: చలం ఇలారాశారా కథ? అని ప్రశ్నిస్తే దానికి సమాధానం కేవలం చలం మాత్రమే చెప్పగలరు. రచయిత ఉద్దేశం రాయడంతో సమాప్తమైపోతుంది. మూలభావనలు మాత్రం పుస్తకంలో నిక్షిప్తమైపోతాయి. ఒకసారి పాఠకుడిదగ్గరికి ఆ పుస్తకం వచ్చాక పుస్తకం కాలమాన పరిస్థితి,పాఠకుడి కాలమాన పరిస్థితి, మానసిక స్థితి, పూర్వజ్ఞానం ఇవన్నీ రచనను "తనదైన" అర్థంచేసుకోవడానికి పురిగొల్పుతాయి. కాబట్టి మైదానం చలం సర్రియల్ నవలగా రాశారా అనే ప్రశ్నకన్నా, సర్రియల్ framework లోంచీ చూస్తే ఇంకా అర్థమవుతుందా అనేది సరైన ప్రశ్న అనుకుంటాను. ఒకసారి ఆ కోణంలోంచీ మైదానాన్ని చదవడానికి ప్రయత్నించండి.

తెలుగు వెబ్ మీడియా said...

మైదానంలో అర్థం కాకపోవడానికి ఏముంది మహేష్? రాజేశ్వరి ప్రేమని కోరుకుంది, హిపోక్రిసీని కోరుకోలేదు. మైదానం మళ్ళీ చదువు. ఈ విషయాలు స్పష్టంగానే అర్థమవుతాయి.

తెలుగు వెబ్ మీడియా said...

Surrealism అంటే ఏమిటి మహేష్? ప్రేమని కోరుకోవడం surrealism అనా? Simultaneousగా మాతృత్వాన్ని కోరుకోవడం surrealism అనా?

Kathi Mahesh Kumar said...

@ప్రవీణ్: మీ మేధతొ నాలాంటి తెలీనివాళ్ళ తెలివితక్కువతనాన్ని ప్రశ్నించి మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి.

తెలుగు వెబ్ మీడియా said...

స్త్రీ మనసు అర్థం కాకపోతే స్త్రీవాదం ఎలా అర్థం అవుతుంది? సంప్రదాయ బంధం కంటే ప్రేమ బంధం అభివృద్ధికరం అని రాజేశ్వరి అనుకుంది. అది ఆచరణయోగ్యం కాని surrealism అనుకుంటున్నావు.

 
Real Time Web Analytics