నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Wednesday, February 17, 2010

తెలుగు సాహిత్యం పై అంత చిన్న చూపు ఎందుకు?


మొన్నామధ్య పుస్తకం.నెట్ లో హేలీ రాసిన వ్యాసం “ మనం “ ఫాంటసీ “ బస్సు మిస్ అయినట్లేనా?” చదివిన తర్వాత నా అభిప్రాయాలు ఇవి. హేలీ అడిగిన కొన్ని ప్రశ్నలకు ఇవి నా ఎదురు ప్రశ్నలు అనుకోండి. తెలుగు సాహిత్యం పై నా అభిప్రాయాలు ఇవి.
హేలీ తన వ్యాసం లో తానే వొప్పుకున్నాడు. ఆధునిక తెలుగు సాహిత్యం అంటే ఒక చిన్న అని.. హేలీ ఒక కొత్త తరానికి పాఠక ప్రతినిధిగా వూహించుకుంటే అతను వేసిన ప్రశ్నలు కేవలం వ్యక్తిగతం కాకుండా ఒక తరానికున్న అభిప్రాయాలుగా నేను భావించాను. అందుకే వాటికి సమాధానాలు అని కాదు కానీ నా గోడు కూడా కాస్త చెప్పుకోవాలనిపించింది. తెలుగు సాహిత్యానికి, ఇంగ్లీష్ సాహిత్యానికి పోలికలు తెచ్చి మాట్లాడటం ఎందుకు వీలు పడదో ప్రధానంగా చెప్పటం నా ఉద్దేశం.
తెలుగు సాహిత్యం అంటే హేలీ లాంటి కొత్త తరం యువతకు ఎందుకు ఈ చిన్న చూపు ? తెలుగు సాహిత్యం లో వాళ్ళు నచ్చిన స్థాయిలో, వాళ్ళు మెచ్చుకోదగ్గ స్థాయిలో పుస్తకాలు రాలేదని హేలీ లాగానే చాలా మంది అభిప్రాయం . ఈ మాట తెలుగు సాహిత్యం చదివిన వాళ్ళు ఎవరైనా చెపితే మనం ఒక క్రమ పద్ధతిలో చర్చించుకోవచ్చు.తెలుగు సాహిత్యం చదివి ఇలా మాట్లాడుతున్నారా, అసలు చదవకుండా ఇలాంటి అభిప్రాయాలు ఎవరైనా ఏర్పర్చుకుంటున్నారా అని నాకొక సందేహం.
నేటి తెలుగు యువతకు రావిశాస్త్రి, విశ్వనాధ, శ్రీశ్రీ వద్దు. ఒక వూపు వూపిన యద్ధనపూడి, యండమూరి కూడా పనికి రారు. ఇంకేమిటి కావాలి వాళ్ళకు? కేవలం ఫాంటసీ సరిపోతుందా? ఒక్క ప్రక్రియ మన మొత్తం తెలుగు సాహిత్యానికి దర్పణం పట్టగలదా?
మన తెలుగు సాహిత్యం నన్నయ్య మహాభారతం అనువాదం మొదలుకొని తాజా కేశవ రెడ్డి “ మునెమ్మ” వరకూ వచ్చిన అనేకానేక మంచి పుస్తకాల్లో , ఈ తరం యువత ఎన్ని ప్రక్రియాల్లో , ఎన్ని పుస్తకాలు చదివి వుంటుంది ?తెలుగు సాహిత్యం గొప్పతనం అర్ధం కావాలంటే తెలుగు సాహిత్యం చదవాలి. పీరియడ్.ఆ పని చేయకుందా హఠాత్తుగా ఏదో ఒక ఉదయం జ్నానోదయమై కళ్ళు తెరిచి చుట్టూ చూస్తే మనకు నచ్చిన పుస్తకాలు మన చేతిలో వచ్చి పడవు. అది ఎంత “ ఫాంటసీ” ప్రపంచమైనా.
గొప్ప తెలుగు సాహిత్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా వస్తుంది?
గత రెండు , మూడు తరాల పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో చదువుకొని తెలుగు మాట్లాడటమే గొప్ప , అరుదు అయిన సందర్భాల్లో పాపం తెలుగు రచయితలు ఎవరి కోసం రాసుకుంటారు? తెలుగు పుస్తకాలకు పాఠకులు ఎవరు? పిల్లలా, యువత నా, నడి వయస్కులా?, ముసలివాళ్ళా? ఆర్ధికంగా, సామాజిక పరం గా, భాషా పరం గా కూడా .వీళ్ళంతా ఏ స్థాయిలో వారు?
ఇటీవల కాలంలో అనేక మంది ఇంగ్లీష్ సాహిత్యానికి, తెలుగు సాహిత్యానికి తెస్తున్న అకారణ, అనవసర పోలిక చూస్తే కోపం , కొంత జాలి కూడా కలుగుతోంది. మన దగ్గర ఏ పుస్తకాలు లేవో మాట్లాడుకునే ముందు మన దగ్గర ఏమున్నాయో కూడా మాట్లాడుకోవాల్సిన అవసరముంది.

కనీసం గత శతాబ్దంలో వచ్చిన ఉత్తమ, లేదా ప్రాచుర్యం పొందిన పుస్తకాల్లో నేటి యువత ఎన్ని చదివి వుంటుంది? అసలు నేటి యువతరం లో తెలుగు చదవటం, అచ్చుతప్పులు లేకుండా రాయగలిగిన వాళ్ళు ఎంత మంది వుండి వుంటారు? దీనికి కారకులు ఎవరు? పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో చేర్పిస్తున్న తల్లి తండ్రులదా? ఇంట్లో తెలుగు మాట్లాడటం తప్ప, తెలుగు పుస్తకాలు పరిచయం చేయని పెద్దలదా? క్లాస్ పుస్తకాలు బట్టీలు కొట్టించడం, నూటికి నూరు శాతం మార్కుల కోసం రెసిడెన్షియల్ కాలేజీల్లో బండ మీద చేపల్ని తోమినట్లు తోముతూ జీవితానికి సంతృప్తి నిచ్చే ( వ్యక్తిత్వ వికాస పుస్తకాలు కాదు) పుస్తక పఠనం ఒక అభిరుచి లాగా ప్రోత్సహించలేని విద్యా వ్యవస్థ దా?

తెలుగు సాహిత్యం లో ఎన్ని ప్రక్రియలు వున్నాయో, ఎందులో ఎవరెవరు ఏమీ రాస్తున్నారో కనీస పరిజ్నానమ్ కూడా లేని వాళ్ళకు తెలుగు సాహిత్య క్రమ పరిణామం, గొప్పతనం ఎలా తెలుస్తుంది?

ఇప్పుడు హేలీ కెంత వయస్సుందో, హేలీ పుట్టినప్పుడు నాకు అంతకన్నా ఒక నాలుగేళ్ళు తక్కువ వయస్సు ఉంది. అప్పటికి నేను తెలుగు సాహిత్యంలో ముఖ్యమైన పుస్తకాలు చదివి వున్నాను. ఆ వయస్సులో నేను చదివిన ఇంగ్లీష్ పుస్తకాలు ఏమైనా వుంటే అవి మిల్స్ అండ్ బూన్స్ సిరీస్ మాత్రమే. మిగతావన్నీ నేను చదివినవి అనువాదాలే. ఇప్పుడున్న కొందరు ప్రముఖ రచయితల్లో చాలా మంది ఆ తరంలో హేలీ లాగానే యవ్వనం లో వున్నారు. అప్పుడు మేం చదివిన పుస్తకాలు ఇప్పుడు హేలీ చెప్తున్న ఇంగ్లీష్ పుస్తకాల జాబితా లాంటిది మాత్రం ఖచ్చితం గా కాదు. తెలుగు మీడియం స్కూల్స్ లో చదువుకొని, ఇంగ్లీష్ ని రెండో భాషగా మాత్రమే అవసరార్ధం నేర్చుకున్న తరం మాది. తెలుగు ని రెండో భాష గా నేర్చుకున్న తరం హేలీ లాంటి వారిది .అది ప్రధాన తేడా. అదే అసలైన తేడా. ఆ ప్రధాన తేడా నే ఇవాల్టీ తెలుగు సాహిత్యం పరిస్థితి. అది దుస్థితి అని నేననుకోవడం లేదు. ఆ తేడా ని గుర్తించకుండా, ఆ తేడా ను అంగీకరించకుండా తెలుగు సాహిత్యం తీరు తెన్నుల గురించి ఇప్పుడేమీ మాట్లాడలేం.

20 ఏళ్లలో ఆంగ్ల సాహిత్య ప్రపంచాన్ని ఒక ఊపు ఊపిన పుస్తకాల్ని హేలీ తన వ్యాసం లో ప్రస్తావించారు. అసలు తెలుగు లో ‘ బెస్ట్ సెల్లర్స్ “ కాన్సెప్ట్ నే లేదు.మనకున్నదల్లా మూడో ముద్రణా, పదో ముద్రణా లాంటి లెక్కలు మాత్రమే. ఒక్కసారి శ్రీపాద, మల్లాది కథలుపుస్తకాలు ఎన్నేసి ముద్రణాల్లో వున్నాయో చూస్తే, అవి తరతరాలుగా ఎందుకు మళ్ళీ మళ్ళీ చదువుతున్నారో తెలుస్తుంది. అవన్నీ మన తెలుగు సాహిత్యం గొప్పతనాన్ని కొంత వరకైనా అంచనా వేయటానికి పనికి వస్తాయి. ఎప్పటికప్పుడు కాలానుగుణం గా వస్తున్న రామాయణ భారతాలే కాదు, మాండలీకపు సాహిత్యం, అస్తిత్వ సాహిత్యం ఇవన్నీ హేలీ అడిగిన 20 ఏళ్ళ కాలంలో వచ్చినవే. హేలీ అడిగింది మొత్తం తెలుగు సాహిత్యం గురించి కాదు, ఫాంటసీ ఫిక్షన్ గురించే. అయినా సరే, తెలుగు సాహిత్యం మీద అతని కున్న చిన్న చూపు వల్ల ఇవన్నీ ప్రస్తావిస్తున్నాను. కాశీ మజిలీ కథలు, సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి లాంటివి చదివి చిన్నతనంలో మాకంటూ ఒక వూహా లోకాన్ని సృష్టించుకున్నాము ఆ రోజుల్లో. వేల సంవత్సరాల తరబడి దక్షిణ దేశం లో వీధి నాటకంగా ప్రదర్శించబడుతూ వచ్చిన ఈ కథ కొవ్వలి కలం నుంది వెలువడినది ఒక్కసారి చదివితే పెద్దలకు కూడా రోమాంచితమవుతుంది. దానికి హేరీ పాటర్ ఎదురు నిలబడగలదు అని కూడా నేను అనుకోవటం లేదు. ఇక మీరు చెప్పిన గోల్డెన్ కంపాస్ లాంటి పుస్తకాల కంటే ఎన్నో వేల సంవత్సరాల ముందు మనకు పంచతంత్రం వుంది.
ఇప్పటి పిల్లలు ఆ పుస్తకాలన్నీ చదివి , హెరీ పాటర్ కూడా చదివితే రెండింటికి వున్న తేడా తెలుస్తుంది. అంతే కానీ, తెలుగు లో వున్న ఫాంటసీ పుస్తకాలు చదవటం మానేసి, హేరీ పాటర్ లాంటి ఫిక్షన్ కోసం తెలుగు లో ఎదురు చూడటం అనవసరం.అది మన సంస్కృతి కాదు. మన సాహిత్యం మన సంస్కృతి నుంచి వస్తుంది. లేదా మీలాగా బాగా చదువుకున్న యువతరం తెలుగు లో కలం పట్టి సరికొత్త రచనలు చేస్తే వస్తుంది.

మనకు హేరీ పాటర్ ( పొట్టర్ కాదు) లార్డ్ ఆఫ్ రింగ్స్ లాంటివి ఎందుకు రాలేదని ప్రశ్న. అసలెందుకు రావాలి అనేది నా ప్రశ్న. విశ్వవ్యాప్తంగా పిల్లల్ని మంత్ర తంత్రాలు, దెయ్యాలు, భూతాలు, అడవి నక్కలు (వేర్ ఉల్ఫ్స్ ) వాంపైర్లు, జాంబీ లతో ఫాంటసీ ప్రపంచం చుట్టూ తిప్పటం అద్భుతం గా కనిపిస్తోంది. మనదగ్గరేమో ఒక్కప్పుడు చెప్పుకున్న భేతాళుడి కథలు, విక్రమార్కుడి సాహసాలు లాంటివి పిల్లలకు చెప్పాలంటే అవన్నీ అభివృద్ధి నిరోధకాలు అనిపించి పక్కన పెట్టేస్తున్నారు. చందమామ కి , ఇంగ్లీష్ పుస్తకాల్ని ముడిపెట్టడం అంత అన్యాయం మరొకటి లేదు. ఇప్పటికీ బ్లాగ్స్ లో కూడా ఉన్న చందమామ అభిమానులకు అది అవమానమే.చందమామ మన సంస్ర్కుతి. మీరు చెప్పే ఇంగ్లీష్ పుస్తకాలు వాళ్ళ సంస్కృతి. ఆ సంస్కృతి ని అభిమానించవచ్చు. కానీ , మన సంస్కృతి ని అగౌరవపరచనక్కరలేదు.
అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో క్రియేటీవ్ రైటింగ్ కోర్సులకు ఎంత డిమాండ్ వుంటుందో చాలా మందికి తెలిసిన విషయమే అనుకుంటాను. MFA కోర్సులంటే క్రేజ్. కానీ , మనకు రచన ఒక అభిరుచి. ఒక వృత్తి కాదు. అదొక ప్రవృత్తి. గ్లోబలైజేషన్ తో మన సమాజం లో వచ్చిన పెను మార్పుల్ని పట్టుకొని రచనల్లో చూపిస్తున్న రచయితలే ఇంకా తక్కువ మనకు. మన సమాజం, మన సంస్కృతి, మన జీవన విధానం నుంచి మన రచయితలు పుట్టుకొస్తారు. మన రచనలు పుట్టుకొస్తాయి . మాజిక్ స్కూల్స్, మంత్ర తంత్రాలు, వాం ఫైర్ లు లాంటివి మన సమాజం లో అంత విస్తృతంగా ప్రాచుర్యం లో లేవు. కాబట్టి ఇక్కడ నుంచి హెరీ పాటర్ రాదు. రాలేదు కూడా. వచ్చినా అది చాలా కృతకంగా కూడా వుంటుందెమో మరి. కాబట్టి వాటికి, మన దగ్గర వస్తున్న పుస్తకాలకు పోలికలు తెచ్చి వెతకడం వృధా ప్రయాస.
మన దగ్గర “ ట్వైలైట్ “ లాంటి పుస్తకాలు రాసే రచయితలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తారు అని అడిగితే సరి కొత్త రచయితల నుంచి వస్తాయీ అని నేను చెప్తాను. . ప్రతి తరం నుండి భిన్నమైన రచయితలు వస్తే మీరు అడుగుతున్న పుస్తకాలు కాకపోయినా కొంతైనా విభిన్నమైన రచనలు వస్తాయి. పిల్లలకు, యూత్ కి మన దగ్గర కావాల్సిన సాహిత్యం లేదని ఒక నిందారోపణ. ఇప్పటి యూత్ ఎంతమంది తెలుగు సాహిత్యం చదువుతున్నారో ఎవరైనా లెక్కలు తీయగలిగితే ఎందుకు రావటం లేదో వూహించవచ్చు. యువత తెలుగు పాఠకుల లిస్ట్ లో పెద్ద సంఖ్యలో వున్నారని నేననుకోవటం లేదు. ఉంటే మంచిదే.

విభిన్న రచనలకు ఒక ఉదాహరణ చెప్తాను. యండమూరి తులసీదళం కున్న సాహిత్య విలువల్ని కాసేపు పక్కన వుంచి, ఒక సాహిత్య ప్రయోగం గా తీసుకొని మాట్లాడితే దాని మీద రచయితలు, సాహిత్యాభిమానులు చేసిన రచ్చ ఇప్పటి యువతరానికి తెలిసి వుండదు.కాష్మోరా , చేతబడులు లాంటివి మాట్లాడినందుకు, రాసినందుకు యండమూరిని ఊరి తీసినా తప్పు లేదన్నవాళ్ళున్నారు. తెలుగు సంస్కృతి ని యండమూరి భ్రష్టు పట్టించాడు అని దుమ్మెత్తి పోసిన వాళ్ళున్నారు. అయినా సరే, మామూలు పాఠకులు ఎగబడి ఆ పుస్తకాలు కొన్నారు, చదివారు, మెచ్చుకున్నారు.
ఒక తరం వరకూ నవలలంటే యద్ధనపూడి, లేదా యండమూరి. ఆ మూస ను బద్దలు కొట్టి ఒక మంచి నవల , సమాజానికి అవసరమైన నవల ఒకటి భిన్నమైన దృక్పథంతో , భిన్నమైన ఇతివృత్తం తో వచ్చింది. అదే “ దృశ్యాదృశ్యామ్”. చంద్రలత రాసిన నవల. చంద్రలత ఆ నవల ఎలా రాయగలిగింది? ఆమె కు తెలుగు, ఇంగ్లీష్ రెండు భాషల్లో వున్న పట్టు, ఆమెకున్న ఎక్స్ పోజర్, విస్తృత ప్రపంచ సాహిత్య పరిజ్నానమ్, గ్లోబర్ వార్మింగ్, ఆధునిక వ్యవసాయ పద్ధతుల మీద అవగాహన, వీటన్నింటి కి తోడు తెలుగు జీవన సరళి మీద ఆమెకున్న పట్టు అదీ ఆమె ఆ నవల రాసేలా చేయగలిగింది. ఆ నవల ను ఒక వాసిరెడ్డి సీతాదేవో, ఒక యద్ధనపూడి నో, చివరకు ఒక వోల్గా కూడా రాయగలిగివుండేవారు కాదు.

ఒక్కో తరం నుండి ఎప్పటికప్పుడు కొత్త తరం రచయితలు పుట్టుకు రావాలి. వారి నేపధ్యం నుంచి కొత్త రకం రచనలు వస్తాయి. మన పని ఏమిటంటే అలా వచ్చిన కొత్త రచనల్ని చదివి, బావుంటే మెచ్చుకొని ప్రోత్సహించడం. ఆ ఉత్సాహంతో మరో కొత్త రచయిత కి అవకాశం ఇవ్వడం.అప్పటి దాకా తెలుగు సాహిత్యం ఇలానే నెమ్మదిగా పురోగమిస్తూ వుంటుంది. తెలుగుగడ్డ మీద పుట్టిన తెలుగు పిల్లలకు తెలుగే రెండో భాషగా ఉన్నంత కాలం మన సాహిత్యం ఇలాగే వుంటుంది. పారడైమ్ షిఫ్ట్ ఇక్కడ ఉన్నట్లుండి ఒక ఉదయం జరిగి పోతుందని నేననుకోవటం లేదు.
..మన తెలుగు సమాజం లో ఇప్పుడున్న ఫ్యూచర్ సిటిజన్స్ ఇండియన్ సిటిజన్స్ కాదు, కాబోయే అమెరికన్, కెనెడియన్, ఆస్ట్రేలియన్ సిటిజన్స్. వారికి కావాల్సింది ఇంగ్లీష్ పుస్తకాలు మాత్రమే. తెలుగు పుస్తకాలు కాదు. మాలాంటి వాళ్ళకు అభిరుచి దృష్ట్యా ఇంగ్లీష్ పుస్తకాలు చదివినా, మనస్సంతా తెలుగు పుస్తకాల చుట్టూ పరిభ్రమిస్తూ వుంటుంది. తెలుగు సాహిత్యానికి కూడా ఒక గొప్పతనం ఉంది, దాన్ని గౌరవించడం అంటే ఆ భాషలో మాట్లాడటం, ఆ భాషలో రాయడం, ఆ భాషలో రచన చేయడం అని మాలాంటి వాళ్ళు కొందరు ఇంకా భ్రమపడుతున్నారు వెనకబడ్డ మాలాంటి తెలుగు అభిమానుల్ని ఇలా వదిలేయ్యండి. మమ్మల్ని ఇలా తెలుగు సాహిత్యాన్ని ఎంజాయ్ చేయనివ్వండి. తెలుగు వ్యాసాలకు ఇంగ్లీష్ లో కామెంట్లు పెట్టె మహోన్నత స్థితి కి మమ్మల్ని తీసుకెళ్లద్దు. మేం ఎదగలేము. మేమిలాగే వుంటామ్. మమ్మల్ని ఇలాగే వుండనివ్వండి.

(తెలుగేప్పుడూ రెండో భాషనే అంటూ నిడదవోలు మాలతి గారు రాసిన మరో మంచి వ్యాసం ఇక్కడ చదవండి.)


కల్పనారెంటాల

33 వ్యాఖ్యలు:

Kathi Mahesh Kumar said...

సమస్య తెలుగు సాహిత్యంపై ఉన్న చూపు "సైజు" కాదు. బొల్లోజుబాబా గారు ఒక చర్చలో చెప్పినట్లు కొత్తపాఠకుల్ని తయారుచేసుకోలేని దౌర్భాగ్యానికి సామాజిక రీతులు కొంత కారణమైతే వాటిని ఛాలెంజ్ చెయ్యాల్సిన సాహిత్యరీతులు కూడా మడిగట్టుకుని అటకెక్కడం మరొక కారణం.

మీరు చెప్పిన లిస్టులోని రచయితలంతా మీతరం లేదా మాతరంవాళ్ళు (I am 33).కానీ ఈ తరం రచయితా ఐకాన్లు ఏరీ????

మీరు ఉటంకించిన లేటెస్టు పుస్తకం ‘మునెమ్మ’. దాని సేల్స్ ఇప్పటివరకూ కేవలం మూడువేల ప్రతులు.ఈ పుస్తకం కూడా ఇప్పటికే కొంత సాహిత్యపరిచయం ఉంటేతప్ప వంటబట్టదు. మరి కొత్త పాఠకుల్ని ఎలా తయారు చేస్తుంది?

ఉన్నది చెబితే నిజంగా మనకు ఉలుకే అనిపిస్తోంది మీ వ్యాసం చదువుతుంటే....

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

చాలా బాగా చెప్పారండి. అసలు చదవకుండానే action,thrill ఉండదు. మేం చదవం అనేస్తారు.

S said...

కల్పన గారికి: పాటర్ తో పోల్చింది కథాంశాల పరంగా కాదనుకుంటానండీ. ఇప్పుడు...ప్రస్తుత కాలంలో వస్తున్న పుస్తకాల్లో చదివిస్తున్న పుస్తకాలు అన్న ఉద్దేశంతో అని అనుకుంటాను...ఈ చిన్నచూపు...తెలుగంటే ఉన్న అభిమానంతోనే... బాధకలిగి వచ్చిన చిన్నచూపు ఎందుకు కాకూడదు? రౌలింగ్ తో పాటే చేతన్ భగత్ పేరు కూడా రాసారు ఆ వ్యాసంలో : ఆ లెక్కన చూసినా, ఇద్దరూ పోలిక లేని కథాంశాలతో రాసారు. కనుక, ఇక్కడ కాశీమజిలీకథలో, ఇంకెవో - అని పోల్చనక్కర్లేదు... హేలీ అన్నదల్లా - మనమింకా ’మా తాతలు నేతులు తాగారు’ చందంగా పాత పుస్తకాల గొప్పే తల్చుకుంటున్నాము..వాటి వారసత్వం నిలబెట్టేది ఎప్పుడు? అన్న ఆక్రోశమే అనిపిస్తుంది. అందుకే ప్రత్యేకం గత పదిపదిహేనేళ్ళలో వచ్చిన పుస్తకాలను ప్రస్తావించారు వ్యాసంలో... మొత్తం శతాబ్దానివి కూడా కాదు..

రమణ said...

అద్భుతమైన వ్యాసం. నా భాష తెలుగు. నేను తెలుగులోనే ఆలోచించగలను. నేను ఏదైనా పుస్తకాన్ని ఇంగ్లీష్ లో చదివినా భావం మాత్రం నా చుట్టూ ఉన్న పరిసరాలు, నా సంస్కృతి, వైయక్తిక అనుభవాలు వీటి ద్వారానే నేను అర్ధం చేసుకోగలను. ఇంగ్లీష్ లో చదివినప్పుడు నా ఆలోచనా పరిధి మాత్రం విస్తృతమవ్వదు. కేవలం అనువాద అర్ధం తెలుసుకొని వదిలేస్తాను. అదే తెలుగులో చదివితే నా ఆలోచనలు వేరే కోణాల్లో సాగుతాయి.నాకు ఒక మంచి తెలుగు పుస్తకం ఇచ్చిన ఆలోచన ఇంగ్లీషు పుస్తకం ఇవ్వలేదు. నా పఠన అనుభవం ద్వారా ఈ విషయం చెబుతున్నాను.

దుప్పల రవికుమార్ said...

చాలా బాగా చెప్పారు...!

Raghav said...

I am happy to say this is first time i agree with what mahesh said :)

రమణ said...

@మహేష్ : తెలుగు సాహిత్యంపై చిన్న చూపు కాదంటున్నారు.... మీరు చెప్పిన ఉదాహరణనే ఇంకొక విధంగా చూద్దాం. మునెమ్మ నవలను అర్ధం చేసుకోలేని, ఆసక్తి చూపని పాఠకులు ఉన్నారన్నపుడు వారు కొత్త సాహిత్యాన్ని కోరుకోవటంలో అర్ధం ఉందా? ఇంగ్లీష్ సాహిత్యం తో పోల్చాల్సిన అవసరం ఉందా? ఇక్కడ ఈ ఒక్క నవల అనే కాదు నా ఉద్దేశ్యం. ఇప్పటి తరం పిల్లలకు తెలుగు చదవటం మీద ఆసక్తి లేదనటానికి మంచి పుస్తకాలు లేవన్నది ఖచ్చితంగా కాదు.

yogirk said...

"తెలుగు వ్యాసాలకు ఇంగ్లీష్ లో కామెంట్లు పెట్టె మహోన్నత స్థితి కి మమ్మల్ని తీసుకెళ్లద్దు. మేం ఎదగలేము. మేమిలాగే వుంటామ్. మమ్మల్ని ఇలాగే వుండనివ్వండి."

This is the dumbest argument I have ever heard. జంధ్యాల చొక్కాలు చింపుకునే పాత్రలు అలా ఎందుకు చేస్తాయో ఇప్పుడర్థమవుతోంది! జంధ్యాల చాలామంది మూర్ఖుల్ని కలిసినట్టున్నాడు తన జీవితకాలంలో...

Kalpana Rentala said...

@ మహేష్, , నిజమే ఏమీ చేయలేక ఉలికి ఉలికి పడుతుంటాము.
సాహిత్య రీతులు ఏ రకంగా మడి గట్టుకొని వున్నాయో నాకు కాస్త వివరించకూడడా? ఈ తరం రచయితలకు ఐ కాన్స్ లేరన్నెదే హేలీ బాధ, మీ బాధా, మా బాధ కూడా . కానీ దానికి ఎవర్ని నిందించాలి? రచయితలు , రచనలు రావాల్సింది కొత్త తరం నుంచి.కొత్త తరం వాళ్ళు ఇంగ్లీష్ పుస్తకాలు చదువుకొని ఆనందిస్తే సరిపోతుందా? తెలుగు లో మరి ఎవరో ఒకరు కొత్త తరహా రచనలు చేయవచ్చు కదా....ఆ మాటే నేను చెప్పింది. తెలుగు లో రాయడం మీ తరం తోనే బాగా తగ్గిపోయిందన్న విషయం మీరు కూడా గమనించే వుంటారు. ఇప్పుడు మనకు హేలీ తరం నుంది రచయితలు పుట్టుకురావాలి. ఆ విషయమే నేను స్పష్టం చేశాను.
ఇక ముణెమ్మ విషయం. మనం పుస్తకాల సేల్స్ గురించి మాట్లాడటం అనవసరం. ఎందుకంతే ఇండియా లో అందరూ పుస్తకాలు కొని చదవారు. కానీ మూడు వేల మంది కంటే ఎక్కువ మందే చదివి వుంటారు ఖచ్చితంగా. ఆ చదివిన వాళ్ళు కూడా మీ తరమో, మా తరమో, ఇంకా ముందు తరమో...కొత్త తరం వాళ్ళు అందులో ఎంత మంది వుంటారు? అసలు ఆ పుస్తకం గురించైనా తెలుసా? అమెరికన్ బెస్ట్ సెల్లార్స్ గురించి తెలుసుకునేవాళ్ళు తెలుగు లో మంచివో, చెత్తవో వస్తున్న పుస్తకాలు చదివి ఏమీ బాగతున్నాయో, ఏమీ బాగుందటం లేదో, ఎందుకు బాగుడటం లేదో కొత్త తరం వాళ్ళు చెప్పటం అందరికీ అవసరం అని నేననుకుంటున్నాను.
@సౌమ్య,
చదివించే పుస్తకాలు గురించి మాట్లాడుకోవాలనా ముందు చదవాలి కదా. హేలీ తరం వాళ్ళకు ఏమీ నచ్చుటాయో ఎలా తెలుసుతుంది? వాళ్ళు పుస్తకాలు చదివీ దాని గురించి రాసి మాట్లాడితే తెలుస్తుంది. అవసరమైతే హేలీ లాంటి వాళ్ళు రచనలు చేసి చూపించాలి. అప్పుడు తెలుగు సాహిత్యం మీద ప్రేమ వున్నట్లు అర్ధమవుతుంది. కేవలం నాకు చిన్న చూపు అని బాధతో అన్న కూడా అది సమంజసంగా అనిపించలేదు.
హేలీ తరం వాళ్ళు చదివిన తెలుగు పుస్తకాలు, నచ్చినవి, నచ్చనవి మాట్లాడి అప్పుడు హేరీ పాటర్ లో ని గొప్పతనం మాట్లాడితే బావుంటుందెమో కదా.
వారసత్వం బాధ్యత హేలీ తరం మీదనే వుంది. అతను పది పదిహేనేల్ళ్ళలో వచ్చిన తెలుగు పుస్తకాల్లో తను చదివిన పుస్తకం ఒక్కటి కూడా చెప్పలేదు. అసలు అతను తెలుగు పుస్తకాలు చదువుతున్నాడో, లేదో కూడా నాకు తెలియలేదు. అందుకీ నాకు ఈ ఉలుకు కాబోలు.

bandi said...

ఈ మధ్యకాలంలో వచ్చిన నాకు నచ్చిన ఒక నవల ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ. ఇది ఒక బ్లాగ్ గా వచ్చింది. దాని లొకేషన్: http://bondalapati.wordpress.com

Kalpana Rentala said...

@ఆర్ కె
కదా...మాలాంటి మూర్ఖుల్ని మీలాంటి అతి మంచి వాళ్ళను చూసే జంద్యాల అలాంటి పాత్రల్ని సృష్టించాడు.
తెలుగు రాయడం రాని వాళ్ళు ఇంగ్లీష్ లో కామెంట్ పెడితే పర్వాలేదు. తెలుగు లో రాయడం వచ్చి కూడా కొందరు గొప్ప కోసం కామెంట్లు పెడుతుంటారు . ఆ కామెంట్ వాళ్లకే కానీ. అందరికీ కాదు. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఒప్పుకోరు.
ఇంకో సమస్య కూడా వుంది. కొన్ని బ్లాగ్స్ లో కామెంట్ బాక్స్ లో తెలుగు తీసుకోదు, అప్పుడు చచ్చిన్నట్లు ట్రాన్స్ లిటరేషన్ లోనో, ఇంగ్లీష్ లోనే పెట్టాలి. అది నాకు ఎదురైన సమస్య.
@భవాని ప్రసన్న, నేను ఆ కథ ఇంకా చదవలేదు
@రమణ, నా పాయింట్ కూడా అదే. రచనలు రాకపోవడం కాదు, వచ్చినా చదివే వాళ్ళు యువతరం లో లేరు.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

సాహిత్యమంటే కేవలం ఫిక్షనేనా ? చాలా నాన్-ఫిక్షన్ సాహిత్యం వస్తోంది తెలుగులో ! అది కూడా కనిపించడంలేదా ఆ హేలీకి ? మన సాహిత్యం మనకోసం. అంతర్జాతీయ రీడర్షిప్ కోసం కాదు. మన సాహిత్యప్రమాణాలు మనల్ని అనుసరించి ఉంటాయి. అవి మనకే వర్తిస్తాయి. ఇంగ్లీష్ సాహిత్యప్రమాణాలు ఇంగ్లీషుకు మాత్రమే వర్తిస్తాయి. ఆ దృష్టితో మన సాహిత్యానికి వెలకట్టడం సబబు కాదు. సాహిత్యం సంస్కృతికి సంబంధించినది. ప్రతిసంస్కృతీ ఒక ప్రత్యేకలోకం. ఒక లోకంలో ఇంకో లోకాన్ని ఓవర్‌‍ల్యాప్ చేయించడం సమంజసం కాదు.

మనవాళ్ళ ఆర్థికపుష్టి అల్పమైనది. వందలాది రూపాయల పుస్తకాలు కొని చదివి విలువకట్టి వాటికి ప్రాచుర్యం కల్పించేటంత సీన్ లేదిక్కడ. ఇంగ్లీషుకున్న వలసవాద నేపథ్యం దృష్ట్యా ఆ భాషాసాహిత్యం చదివేవారు ప్రపంచమంతటా ఉన్నారు. మన సాహిత్యం మనలో అయిదుకోట్లమందికి మాత్రమే పరిమితం. అందులో చాలామంది చదివే అలవాటు లేనివారు. పుస్తకాలు కొనే అలవాటు లేనివారు, కొనలేనివారు, కొనడం అనవసరమైన డెడ్ ఇన్వెస్ట్‌మెంటుగా భావించేవారూ కాగా, తెలుగు మాట్లాడ్డమే తప్పని భావించేవారు, అలా తమ పిల్లల్ని తర్ఫీదు చేసి తెలుగుపుస్తకాల మార్కెట్ ని దెబ్బదీసేవారు కూడా గణనీయంగా ఉన్నారు. అసలు తెలుగులో ఏమీ చదవకుండానే తెలుగులో ఏముందని అడిగేవారిక్కూడా కొదవ లేదు. ఈ చివఱిది చాలా ప్రాచీనమైన తెగ (tribe).

మనం ఎల్లప్పుడూ తెలుగునీ, తెలుగు సాహిత్యాన్ని, తెలుగుజాతినీ దూషించడం, తప్పులు పట్టడం మానేసి వాటి అభివృద్ధికి మనవంతుగా ఏం చేయగలమనేది ఆలోచించాలి.

Raghav said...

"తెలుగు వ్యాసాలకు ఇంగ్లీష్ లో కామెంట్లు పెట్టె మహోన్నత స్థితి కి మమ్మల్ని తీసుకెళ్లద్దు. మేం ఎదగలేము. మేమిలాగే వుంటామ్. మమ్మల్ని ఇలాగే వుండనివ్వండి."

:) మేము ఇంగ్లిష్ లో రాసినా మట్లాడినా అలోచించేది తెలుగులొనే కాబట్టి లైట్ తీసుకోండి.

ఇక మీరు ప్రస్తావించిన వ్యాసం లోని అసలు సంగతిని పూర్తిగా మరచిపోయినట్టున్నారు,నేను ఆ వ్యాసాన్ని చదివిన తరువాత నాకు అర్థమయ్యింది ఏంటంటే తెలుగు పుస్తకాలు చదివే అలవాటు పెంచాలంటే ఫాంటసి లో ఎక్కువ కొత్త రచనలు రావలసిన అవసరం ఉంది, ఎందుకంటే వాటిని పిల్లలు టీనేజ్ లో ఉన్నవాళ్ళు ఎక్కువగా చదువుతారు తద్వారా వారిలో తెలుగు చదివే అలవాటు పెరుగుతుంది వయసు పెరిగే కొద్ది తెలుగు సాహిత్యం పైనా మక్కువ పెరుగుతుంది అని.మీరేమో తెలుగు సాహిత్యాన్ని చిన్నపుచ్చాడు అంటున్నారు,ఇది నేను ఒప్పుకోలేను

ఇక మీరు నేను చిన్నప్పుడు చదివిన అపూర్వ చింతామణి,భేతాళ కథలు ప్రస్తావించారు నా వయసు 23 నాకు ఇప్పటికి ఆ కథలన్నా అలాంటి కథలన్నా ఇప్పటికీ ఇష్టమే.ఫాంటసి లో అంత మంచివి కాకపోయినా ఆ రేంజ్ లోని పుస్తకాల పేర్లు చెప్పగలరా మీరు నిజంగా అంత మంచి తెలుగు పుస్తకాలు చెప్తే నేను ఇప్పుడే వెళ్ళి కొనుక్కుంటాను. I bet there are no such books.

బాగున్నాయని జీవితకాలం అవే పుస్తకాలు చదవలేము కదా.

Raghav said...

u can find these lines there

" ఏదో రోజు రోజుకీ తెలుగు సాహిత్యానికి దూరం అవుతున్న ఒక జెనరేషన్ని తిరిగి తెలుగు పుస్తకాలలో పడేయటానికి కొన్నిమంచి పుస్తకాలు వస్తే బాగుండు .. అందుకు ఫేంటసీని మించిన “genre” లేదు అని నా అభిప్రాయం. "

Kalpana Rentala said...

రాఘవ, నేను లైట్ గానీ తీసుకున్నాను.
తెలుగు లో పుస్తకాలు చదివే అలవాటు పెంచడం గురించే నేను కూడా చెప్తోంది. అది ఎలా వస్తుంది? చదవటం మొదలు పెడితే వస్తుంది. చాలా మంది పిల్లలు, అలాగే యువత తెలుగు పుస్తకాలు చదవాల్సిన స్థాయిలో చదవటం లేదు అన్నది నా పాయింట్. అందుకు పుస్తకాలు లేవు అన్నది మీ పాయిట్. పుస్తకాలు చదువుతుంటే రచయితలు రాస్తారు. ఆ రకమైన ఫాంటసీ పుస్తకాలు ఎవరైనా అభిరుచి తో చదువుతున్నారో లేదో రచయిత కు ఎలా తెలుస్తుంది? అలాగే పిల్లల కోసం రాయాలంటే రచయితలో కూడా ఇంకా కోల్పోని, పోగొట్టుకొని బాల్యం వుండాలి. అది రకరకాల కారణాల వల్ల రచయితల్లో లోపించింది అని నా ఊహా. కాబట్టే యంగర్ జనరేషన్ నుంచి రచయితలు రావడం, రచనలు రావడం ఈ సమస్యకు నేననుకున్న ఒక పరిష్కారం. అది తప్పా? అంత కన్నా మంచి ఆలోచన మీ దగ్గర వుంటే చెప్పండి. నేను వింతాను. నేను ఈ వ్యాసం హెలీ మీద కోపం తో రాయలేదు. ఆ వయస్సు అబ్బాయి ఆ మాత్రం వ్యాసం రాయడమే నాకు ఆనందాన్ని కలిగీంచింది. కానీ మన తెలుగు వాళ్ళే వూరికె మన తెలుగు సాహిత్యాన్ని గురించి చిన్న చూపు అని మాట్లాడుతుంటే చూస్తూ వూరుకోలేక ఉక్రోషం తో ఉలికి పాటు తోనే రాశాను.
ఇక మీకు ఆ రేంజ్ లో పిల్లల పుస్తకాలు చెప్పటానికి నేను ఆ పుస్తకాలు చదవటం లేదు. కాబట్టి చెప్పలేను. 10 నుంచి 25 ఏళ్ల వయస్సు వాళ్ళు ఎలాంటి పుస్తకాలు చదువుతున్నారు, చదవాలనుకుంటున్నారు అన్న విషయం రచయితలకు, పబ్లిషింగ్ సంస్థలకు కూడా కన్వే కావాలి. అప్పుడు ఏమైనా మారుతుందేమో? కొత్త తరం నుంది రచయతలు తెలుగు లో ఎందుకు రావడం లేదో మీకు ఒక కారణం తెలిసిటే చెప్పండి. నాకు తెలిసిన కారణాలు నేను చెప్పాను.
తాడేపల్లి గారు చెప్పినట్లు రెండు భిన్నమైన సంస్కృతుల్ని కలిపి మాట్లాడితే ఉండేది గందరగొలమే కానీ ఉపయోగం లేదు.

Kathi Mahesh Kumar said...

సమస్యకు మూలం వేరే దగ్గరుందిలెండి. ఈ క్రింది లంకెలో నేను రాసిన వ్యాసం చూడండి.
http://parnashaala.blogspot.com/2009/07/blog-post_05.html

కాజ సురేష్ said...

హేలీ గారి పోష్టు, @raghav గారి వా్యఖ్య చూసాక నాకు చాలా ఆనందము వేసినది. ఈ మాత్రమైనా తెలుగు సాహిత్యము మీద అభిమానము ఉండటము చాలా హర్షించాల్సిన విషయము. వారు వ్యక్త పరిచిన ఆవేదన కూడా ఆలోచించాల్సిన విషయమే. అంత మంచి పుస్తకాలు, ఈ మధ్య తెలుగులో రావటము లేదనే నిజాన్ని ఎంత కటువుగా ఉన్కాఓప్పుకుని తీరాలి.

కానీ నాదో చిన్న ప్రశ్న. ఓక వేళ తెలుగులో ఓ మంచి "suspense genre" నవల వచ్చింది అనుకోండి, హారీ పోటర్ ప్రమాణము లో, మన తెలుగు యువ సోదరులు ఎంత మంది చదువుతారో లెక్క చెప్పండి. రాఘవ లాంటి కొద్ది మంది చదువుతారు అని నాకు తెలుసు. ఈ కొద్ది మంది కోసము ఓ మంచి రచయితనైన నేను, నా సమయము ఎందుకు వృధా పరుచుకోవాలి? నాకేమన్నా అది కూడు పెడతదా? అదే Rowling గారు ఆ నవల మూలాన multi millionnaire అయ్యే ఉంటారు. మీరు ఈ మధ్యన వచ్చిన నామిని గారి వ్యాసము చూసే ఉంటారు.

మంచి(?) కవిత్వము పుట్టాలంటే కడుపులో కాలనైనా కాలాలి, లేకపోతే కడుపు పూర్తిగా నిండి (శ్రీనాధునిలా తూగుటుయ్యాలలో ఊగుతూ ) అయినా ఉండాలి. ఈ పరిస్థితులకు అతీతముగ కొన్ని గొప్ప రచనలు, రచయితలు రావచ్చు.. వచ్చారు గూడా. వంద కోట్ల భారతీయులలో నుండి అప్పుడప్పుడ ఓ P.T.Usha, ఓ Anand రావటములా? కానీ ఇలాగ రోజువారీ ఓ తెలుగు Rowlingలు ఎవరూ వచ్చే అవకాశము ఎంత మాత్రమూ లేదు.

ఇవాల్టి రోజున మనమందరము, ఓ ప్రవాహములో కొట్టుకుపోతున్నాము (ఈదుతున్నాము). మన గమ్యము (?) చేరాలంటే అది తప్పకుండా చెయ్యవలసిన పనే. కానీ కొంచెము తలతిప్పి, అప్పుడప్పుడు గట్టు పక్కకి చూస్తే ఎన్నో అద్ఫుతమైన దృశ్యాలు కనపడే అవకాశము ఉన్నది. కానీ మనకు అంత తీరికా లేదు, అవసరమూ లేదు. పైగా అది "COOL" కూడా గాదు. అలా చెయ్యటానికి మనకు మన భాష అసలే రాదు.

తెలుగుదేశపు నడిబొడ్డులో పుట్టి, ఒక్క తెలుగు ముక్క కూడా రాయాల్సిన అవసరము లేకుండా స్టేట్ రాంకర్లు అయిన మన భావి మేధావులిని అడగండి. అ అవకాశము ఇచ్చి ప్రోత్సహిస్తున్న మన ప్రభుత్వాన్ని నిలదీయండి. ఈ వ్యామోహములో కొట్టుకుపోతూ మన భాష యొక్క ప్రాముఖ్యతను మరిచిపోయిన తల్లి దండ్రులను అడగండి. అంతే కాని, తెలుగు Rowlings ఎందుకు లేరు అని మాత్రము అడగకండి.

Kalpana Rentala said...

@మహేష్, మీ వ్యాసం చదివాను. మధ్య మధ్యలో బ్లాగ్స్ లో నుంచి నేను గతం లో మాయమైపోవటం వల్ల ఇలాంటి వ్యాసాలు, చర్చలు చాలానే మిస్ అయినట్లు వున్నాను. ఇవేమీ తెలియకుండా అమాయకంగా మళ్ళీ నేను మొదటి నుంచి చర్చల్ని ఎప్పుడూ మొదలుపెడుతున్నాను. మీ వ్యాసం లో నేను వొప్పుకునేవి కొన్ని, వొప్పుకేలేనివి కొన్ని వున్నాయి. అవేమిటో అక్కడే కామెంట్ పెడతాను.
@ సురేష్, కొద్ది మందే చదువుతారని రచయితలు రాయడం మానుకుంటున్నారని అనుకోవడం లేదు. అసలు అలాంటివి రాయగలిగే సత్తా వున్న రచయితల కోసం అందరూ వెతుకుతున్నాము. అది నేను కూడా అంగీకరిస్తాను. కానీ వాళ్ళను ముందు తరాల్లో కాదు వెటకాల్సింది, కొత్త తరాల్లో అన్నది నా వాదన.

కాజ సురేష్ said...

కల్పన గారూ,

చదివేవాళ్లూ, తప్పట్లు కొట్టి శభాష్ అనే వాళ్లూ ఎక్కువ మంది లేకపోయినా, రచయితల కలాల నుండి ఉత్తమ రచనలు వస్తాయి అంటే నేను ఒప్పుకోను. ఈ రూల్ కి అక్కడక్కడ exceptions ఉండొచ్చు.

"తెలుగు అవసరము లేదు" అనే భావము బాగా నాటుకుపోయిన మేధావులతో నిండి ఉన్న తరమిది. మంచి తెలుగు రచయితలు, కొత్తవారూ రావాలని కోరుకోవటము అత్యాశే అవుతుంది.

అష్టదిగ్గజాలు దిగ్గజాలై మనందరికి తెలియటానికి కారణము, రాయలు. నాటి రాజు. ఆయన అదరించారు గాబటి్ట వాళ్లు మరిన్ని మేలైన రచనలు చేశారు. పొతన గారి లాంటి వారు అప్పుడూ, ఇప్పుడూ ఎప్పడైనా exceptionమాత్రమే.

@Mahesh చాలా ఆలోచింపచేసే టపా మీది (tone ని కాసేపు పక్కన పెడితే).

ఈ సమశ్యకి మూలము ఎక్కడ ఉన్నా పరిష్కారము మాత్రము ప్రభుత్వము చేతిలో ఉంది. అందుకే నాకు మరింత దిగులుగా ఉంది :-(

Kalpana Rentala said...

కల్పన గారూ, మీరు హేలీ అభిప్రాయాలకు బాధపడి, ఉలికిపాటుతో రాసిన వ్యాసం,
దానికి పాఠకుల స్పందన సందర్భ సహితంగానే ఉన్నాయి.తెలుగులో ఫాంటసీ
పుస్తకాలు రాలేదంటున్నారు.ఇంగ్లీషుతో పోల్చవద్దంటున్నారు.కానీ తెలుగు
రెండో భాషగా మారిపోయిన సమాజం, తెలుగులో మాట్లాడితే అవమానకరంగా
తలదించుకోవలసి వస్తున్న సమాజం-స్కూళ్లు-, తెలుగు చదవటం మర్చిపోతున్న
సమాజం, ఇంజనీర్లు,డాక్టర్లు,సాఫ్ట్‌వేర్ నిపుణుల తయారీలో నిండా
మునిగిపోయిన సమాజం, పుస్తకాలు చదవటం దండగమారి పని అనే స్థిరాభిప్రాయాలను
తలకెక్కించుకున్న సమాజం ఇప్పుడు తెలుగునాట రాజ్యమేలుతోంది.ఒక్క విషయం
ప్రత్యేకంగా ప్రస్తావిస్తాను.చిన్నప్పటినుంచి సాహిత్య వాతావరణం ఉన్న
కుటుంబాలు, సాహిత్య ప్రభావాలు పనిచేస్తున్న కుటుంబాలు మాత్రమే ఇవ్వాళ
కూడా పుస్తకాలు కొంటున్నాయి.ఈ దరిద్రపు గ్లోబలైజేషన్ పుణ్యమా అని తెలుగు,
ప్రాంతీయ సంస్కృతులు కునారిల్లిపోతున్నాయి తప్పితే,తమ మూలాన్ని మరవని
వారు ఈనాటికీ తెలుగు పుస్తకాలు కొనడం మానలేకపోతున్నారు.

ఉదాహరణకు ఇటీవలే చందమామ ఆఫీసుకు హైదరాబాద్ నుంచి టార్జాన్ రాజు గారు -75
ఏళ్లు, కృష్ణా జిల్లానుంచి ఓ రావుగారు -79 ఏళ్లు- లేఖలు పంపుతూ 1947 జూలై
సంచిక నుంచి తాము చందమామను క్రమం తప్పకుండా కొంటున్నామని, కొనడమే కాదు తమ
పిల్లలు, మనవళ్లు, మునిమనుమళ్ల చేత కూడా చందమామను చదివిస్తున్నామని,తమ
తరం కథల చందమామను బతికించమని అభ్యర్థించారు. 63 సంవత్సరాల చందమామలు
వీళ్లవద్ద పూర్తిగా ఉన్నాయట. ఆన్‌లైన్ చందమామ ఆర్కైవ్స్‌లోకి వెళ్లి
దాసరి సుబ్రహ్మణ్యం గారి 12 ధారావాహికలను చదవగలిగితే తెలుగులో ఫాంటసీ
కథలు లేవనే వారికి చక్కగానే సమాధానం చెప్పగలం. కానీ ఈతరంలో వాటిని
చదవగలిగిన వారేరీ. వాటి విలువ తెలిసిన వారు ఈనాటికీ వాటిని
హత్తుకుంటున్నారు. సాహిత్య వారసత్వం గల కుటుంబాలు తప్పితే తతిమ్మావారు ఏ
పుస్తకాలనూ చదవటం లేదు.అందుకే తెలుగు కథలపట్ల చిన్నచూపు, తెలుగు జీవితం
పట్ల చిన్నచూపు, వ్యావసాయిక సంస్కృతిపట్ల చిన్నచూపు కల తరాలు
పుట్టుకొచ్చిన పాడు కాలంలో పుస్తకాలు ఇంకా అమ్ముడుపోతున్నాయంటే,కథల
పుస్తకాలు వస్తున్నాయంటే బహుశా మనం గర్వపడాలి,సంతోషపడాలి.రాష్ట్ర్లంలో
ఇంకా తెలుగు కత బతికే ఉంది అనడానికి ఇవి నిదర్శనాలు.

చివరలో మీరన్నట్లు "మేం ఎదగలేము. మేమిలాగే వుంటామ్. మమ్మల్ని ఇలాగే
వుండనివ్వండి." ఈ మాటల ముత్యాలకు మీకు మణుగు బంగారంతో సత్కరించాలి.

మీ బ్లాగులో ఈ వ్యాఖ్య చేర్చాలని ప్రయత్నించాను. ఎందుకో సిస్టమ్
మొరాయిస్తోంది. అందుకే మెయిల్లో పంపిస్తున్నాను.

రాజశేఖర రాజు

gaddeswarup said...

ఈవేళ నాబ్లాగులో తెలుగులో రాసాను http://gaddeswarup.blogspot.com/2010/02/blog-post.html
చాలా తప్పులున్నట్లున్నయ్యి. వీలైతే సవరణలు చెప్పండి
(could not find a Telugu spellchecker)

HalleY said...

ఎందుకనో నేను ఆ వ్యాసం రాసినా ముఖ్యోద్ధేశం మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదు అని అనిపించింది ! . నేను విశ్వనాథ ,శ్రీ శ్ర్రీ , రా.వి.శాస్త్రి రచనలు చదివానా లేదా అన్నది అప్రస్తుతం . అయినా కూడా మీకు సమాధానం కావాలి అంటే ఔను అనే చెబుతాను .. అన్నీ కాకపోయినా ఎదో ఓకటి అరా చదివే ఉన్నాను. నేను పాత తెలుగు రచనలని ఎక్కడా తప్పు పట్టలేదు .

@k.mahesh kumar :
"ఉన్నది చెబితే నిజంగా మనకు ఉలుకే అనిపిస్తోంది మీ వ్యాసం చదువుతుంటే...."
I Agree

@S :
"ప్రస్తుత కాలంలో వస్తున్న పుస్తకాల్లో చదివిస్తున్న పుస్తకాలు అన్న ఉద్దేశంతో అని అనుకుంటాను...ఈ చిన్నచూపు...తెలుగంటే ఉన్న అభిమానంతోనే... బాధకలిగి వచ్చిన చిన్నచూపు ఎందుకు కాకూడదు? రౌలింగ్ తో పాటే చేతన్ భగత్ పేరు కూడా రాసారు.హేలీ అన్నదల్లా - మనమింకా ’మా తాతలు నేతులు తాగారు’ చందంగా పాత పుస్తకాల గొప్పే తల్చుకుంటున్నాము..వాటి వారసత్వం నిలబెట్టేది ఎప్పుడు? అన్న ఆక్రోశమే అనిపిస్తుంది. అందుకే ప్రత్యేకం గత పదిపదిహేనేళ్ళలో వచ్చిన పుస్తకాలను ప్రస్తావించారు వ్యాసంలో... మొత్తం శతాబ్దానివి కూడా కాదు.."
I Agree

@Kalpana :
"అవసరమైతే హేలీ లాంటి వాళ్ళు రచనలు చేసి చూపించాలి."
ఇలాంటి సినిమాలు మన దగ్గర ఎందుకు రావు అని ఆంటే .. "ఏదీ నువ్వు తియ్యి చూద్దాం" అంటే మరి నేను ఏమీ మాట్లాడలేను !.

@Lalitha balasubramanyam:

"సాహిత్యమంటే కేవలం ఫిక్షనేనా ? చాలా నాన్-ఫిక్షన్ సాహిత్యం వస్తోంది తెలుగులో ! అది కూడా కనిపించడంలేదా ఆ హేలీకి ?"

నేను చెప్పిందల్లా గడిచిన పదిహేనుఏళ్ళలో ఆంగ్లంలో పెను విప్లవం తెచ్చిన ఫాంటసీ విభాగంలో తెలుగులో ఒక్క గొప్ప రచనా రాలేదు అని !. నా వ్యాసం కేవలం ఆ విషయం గురించే అంతే కానీ తెలుగు సాహితీ రంగం సమస్తం గురించీ కాదు !.

@Raghav :
"ఇక మీరు ప్రస్తావించిన వ్యాసం లోని అసలు సంగతిని పూర్తిగా మరచిపోయినట్టున్నారు,నేను ఆ వ్యాసాన్ని చదివిన తరువాత నాకు అర్థమయ్యింది ఏంటంటే తెలుగు పుస్తకాలు చదివే అలవాటు పెంచాలంటే ఫాంటసి లో ఎక్కువ కొత్త రచనలు రావలసిన అవసరం ఉంది, ఎందుకంటే వాటిని పిల్లలు టీనేజ్ లో ఉన్నవాళ్ళు ఎక్కువగా చదువుతారు తద్వారా వారిలో తెలుగు చదివే అలవాటు పెరుగుతుంది వయసు పెరిగే కొద్ది తెలుగు సాహిత్యం పైనా మక్కువ పెరుగుతుంది అని.మీరేమో తెలుగు సాహిత్యాన్ని చిన్నపుచ్చాడు అంటున్నారు,ఇది నేను ఒప్పుకోలేను "
I Agree

Kalpana Rentala said...

హేలీ, అర్ధం చేసుకోలేదు అని ఎందుకనుకుంటున్నారు? అర్ధమైంది కాబట్టే ఇది రాశాను. కాకపోతే మీరు చెప్తున్నది , నేను చెప్తున్నది రెండు వేర్వేరు కోనాల నుంచి ఎందుకు కాకూడదు?
ఈ వ్యాసం కేవలం మీకు ప్రతిస్పందన కాదు. చాలా సార్లు ఇలాగే వినిపిస్తున మాటలకు నా వైపు నుంది కొన్ని ఆలోచనలు.
తెలుగు సాహిత్యం బాగు పాడాలనే మీరైనా, నేనైనా కోరుకునేది. అయితే మీరు డెప్పుతున్నారు బాధ తో. నేను ఒక ఉచిత సలహా ఇచ్చాను. కొత్త తరం వాళ్ళు తెలుగు పుస్తకాలు చదివి, చక్కగా తెలుగు లో రాయండి అని. అది కూడా నేరమేనని , ఉలికిపాటు అని, ఉక్రోషం అని ఇన్ని మాటలు పడాల్సి వచ్చింది.
మీరే ఎందుకు రాయకూడదు అన్నది నింద కాదు. అర్ధం చేసుకోండి. కొత్త తరం రావలన్నది ఒక ఆశ. ఎవరికి ఏమీ కావాలో వాళ్ళే రాయగలరు అన్నది ఒక విశ్వాసపూరితమైన ఆశ. తెలుగు సాహిత్యం మరింత విస్తరిస్తుంది అన్న ఆశ మాత్రమే. తెలుగు సాహిత్యం విస్తరించటానికి మీరు ఆంగ్లం వైపు చూసి మాట్లాడుతున్నారు. ఆ పోలిక లేకుండా కూడా మన దగ్గర కొత్త రకమైన సాహిత్యం ఎలా వస్తుందో అన్నది ఒక వూహ.
పైన మరో కామెంట్ లో చెప్పినట్లు పిల్లల కోసం రాయడం అతి కష్టమైన ప్రక్రియ. ఎందుకంటే రచయతలో కూడా ఒక పసితనం, మీరు అడిగే ఫాంటసీ లోకాన్ని సృష్టించాలంటే ఇంకా కలలు కనగలిగే మానసిక శక్తి రచయితకు వుండాలి. అది లోపించింది కాబట్టే ఇంకా ఆ పసితనం, ఆ కలలు కనే మనస్సు వున్న తరం నుంది రచనలు రాగలవు. అంతే కానీ, రచనలు రాలేదు అని చెప్పే బదులు మీరే రాయచ్చు కదా అన్నది కాదు నా ఉద్దేశం.
సౌమ్య అడిగింది, మీ తరం నుంది బెస్ట్ సెల్లర్స్ లేకపోతే మా తరం వాళ్ళు ఎలా రాయగలరు అని? మా తరానికి వున్న అభిరుచి వేరు. మీ తరానికి వున్న సమాజం , ఎక్స్పొజర్ వేరు. మా టైమ్ లో హేరీ పాటర్ నో, లేదా మీ లాగా ఎక్కువ ఇంగ్లీష్ పుస్తకాల్నో చదివి వుంటే అదే పద్ధతిలో కొంచెం ఆలోచించేవాళ్ళేమో రచయితలు. ఆ ఎక్స్పొజర్ వున్న తరం నుంచి విభిన్న రచనలు ఆశించడం కూడా మా తప్పే అని మా మీద రుద్దేస్తున్నారు.
ఒక 24 ఏళ్ల నవ యువకుడు వచ్చి తెలుగు సాహిత్యం గురించి ఈ మాత్రం మాట్లాడగలగతమే మాకు గొప్ప ఆనందం. కాకపోతే మీకన్నా ఎక్కువ కాలం నుంది తెలుగు సాహిత్యాన్ని పరిశీలించడం వల్ల ఇల్లా కూడా ఆలోచించవచ్చు కదా అని చెప్పాను. అది మీతో సహా చాలా మందీని బాధ పెట్టినట్లుంది. కాకపోతే, మీ పుణ్యమా అని మళ్ళీ తెలుగు బ్లాగుల్లో హేరీపాటర్, చందమామ, తెలుగు పుస్తక పఠన అభిరుచి, పుస్తకాల అమ్మకాలు ఇలా రకరకాల కోనాల నుంచి చర్చలు జరుగుతున్నాయి. అందుకు మేమంతా మీకు కృతజ్నతలు చెప్పుకోవాలి.

Nrahamthulla said...

విద్యార్ధులు తెలుగులో మాట్లాడకూడదట
* కడప జిల్లా మైదుకూరు సెయింట్‌ జోసెఫ్‌ పాఠశాలలో తెలుగుభాష మాట్లాడకూడదంటూ చిన్నారుల మెడలో బోర్డులు తగిలించారు.తెలుగు భాష మా ట్లాడకూడదంటూ విద్యార్థులపై ఆంక్షలు విధించడం మానవ హ క్కుల ఉల్లంఘనకు పాల్పడటమేనని, ఇది ఘోర తప్పిదమని మా నవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టి స్‌ సుభాషణ్‌రెడ్డి వ్యాఖ్యానించా రు. (ఆంధ్రజ్యోతి 28.10.2009)
పసిపిల్లలు ఏడ్చేది మాతృభాషలోనే
పుట్టకముందే నేర్చుకుంటారు.మాతృభాషలో ఎన్నడూ మాట్లడనంటూ రాసి ఉన్న బోర్డులను చిన్నారి విద్యార్థుల మెడలో 'ఉపాధ్యాయులు' వేలాడదీయటం అనైతికమే కాదు అసహజం కూడా అని సైన్స్‌ నిరూపించింది. అప్పుడే పుట్టిన పసిపిల్లలు ఏడ్చే ఏడుపు కూడా మాతృభాషలోనే ఉంటుందని జర్మనీకి చెందిన శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. అమ్మ గర్భంలో ఉన్న తొమ్మిది నెలల్లో.. చివరి మూడు నెలల సమయంలో తల్లి మాటలు వింటూ పిల్లలు మాతృభాష గురించి తెలుసుకుంటారని, పుట్టిన తర్వాత వారి ఏడుపు అదే భాషను ప్రతిఫలిస్తుందని తెలిసింది.పిల్లలు గర్భంలో ఉండగానే తల్లి మాటలు వింటూ ఉచ్చరణ గురించి తెలుసుకున్నారని స్పష్టమైంది. పిల్లలు వివిధ రకాల ధ్వనుల్లో ఏడ్చే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ.. మాతృభాషకే ప్రాధాన్యమిస్తున్నారని కూడా ఈ పరిశోధనలో తెలిసింది. అమ్మతో అనుబంధాన్ని పెంచుకోవటం కోసమే శిశువు తనకు తెలిసిన మొదటి విద్యను ఇలా ప్రదర్శిస్తుంటారు.(ఈనాడు7.11.2009).కాబట్టి అన్ని మతాల దైవప్రార్ధనలు కూడా మాతృభాషల్లో ఉండటం సమంజసమే.
ద్వితీయ భాషగా తెలుగుకు బదులు ఇంగ్లీష్
ఆరు, ఆపై తరగతులు చదివే విద్యార్థులు ద్వితీయ భాషగా తెలుగుకు బదులు ఇంగ్లీష్‌ తీసుకోవడానికి ఇక మీదట జిల్లా విద్యా శాఖాధికారులే (డీఈఓ) అనుమతి ఇవ్వొచ్చని ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇతర రాష్ట్రాల విద్యార్థులు ద్వితీయ భాషగా ఇంగ్లీష్‌ను తీసుకోవాలంటే పాఠశాల విద్య డైరెక్టరేట్‌ నుంచి అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. (ఆంధ్రజ్యోతి1.11.2009)-
తెలుగుపై పరిశోధన.. అమెరికాలోనే ఎక్కువ
మనదేశంలో భాషలపై పరిశోధనలు జరిపే వారే కరవయ్యారని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి కపిల్‌ సిబాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడితో పోలిస్తే.. అమెరికాలోనే ఎక్కువమంది తమిళ, తెలుగు భాషలపై పరిశోధనలు చేస్తున్న వారు కనిపించారని తెలిపారు.(ఈనాడు31.1.2010)
అంతరించిపోతున్నఅమ్మభాష
దాదాపు రెండుతరాల విద్యార్థులు తెలుగు రాకుండానే, తెలుగుభాషను తూతూమంత్రంగా చదువుకునే కళాశాలల నుంచి బైటికొచ్చారు. వాళ్లంతా ఇంజినీర్లు, డాక్టర్లు, ప్రభుత్వశాఖల్లో పెద్దపెద్ద ఉద్యోగులైపోయారు. తెలుగంటే వెగటు. ఇంట్లో తెలుగక్షరాలు కనపడనీయరు. వినబడనీయరు. ఇక వీరి పిల్లలకు మాత్రం తెలుగంటే ఏం తెలుస్తుంది పాపం! ఇలాగే ఇంకో రెండుతరాలు కొనసాగితే, తెలుగువాచకాన్ని సాలార్‌జంగ్‌ మ్యూజియంలో ఓ పురాతన వస్తువులా ప్రదర్శనకు పెట్టాల్సిందే.పేరుకు భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రమైనా, మనదగ్గర తల్లిభాషది రెండో స్థానమే. మళ్లీ మాట్లాడితే, మూడోస్థానమే.యాభై ఏడక్షరాలు, మూడు ఉభయాక్షరాలున్న మన వర్ణమాల ప్రపంచ భాషల్లోనే రెండో అతి పెద్దది. రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తరువాత కానీ మనం తెలుగుభాషకు అధికార హోదా కల్పించుకోలేకపోయాం. తెలుగుభాషకే మంగళహారతులు పాడేస్తున్నాం.ఇంగ్లిష్‌, రోమన్‌, జర్మన్‌ సహా సంస్కృతం, తమిళం, హిందీ, కన్నడం, మలయాళం వంటి భాషలన్నింట్లోకీ ఒక్క తెలుగు భాషకే భావాలను వేగాతివేగంగా అక్షర రూపంలోకి తర్జుమా చేయగల శక్తి ఉందని నిరూపించారు. 'ఇంగ్లిషులో ఒక అక్షరం 4.71 బిట్ల సమాచారాన్ని అందించగలిగితే, తెలుగు అక్షరం అదే సమాచారాన్ని అందించడానికి 1.14 బిట్లు మాత్రమే ఉపయోగించుకుంటుందని తేలింది. హిందీకి 1.56 బిట్లు, తమిళానికి 1.26 బిట్లు, కన్నడానికీ మలయాళానికీ 1.21 బిట్లు అవసరమయ్యాయి. ఇంగ్లిషులో ఒకే పదానికి అనేక పర్యాయపదాలు ఉండగా, ఒక్కో ప్రత్యేక పదం ద్వారా ఒక్కో ప్రత్యేక భావాన్ని స్పష్టంగా అందించగల సామర్థ్యం తెలుగు భాషకుంది. అదే ఈ వేగానికి కారణం.కంప్యూటరు, మౌజు, కీబోర్డు, హార్డ్‌వేరు, సాఫ్ట్‌వేరు...చివర్లో అచ్చు గుద్దేస్తే చాలు, కాకలుతిరిగిన ఇంగ్లీషు పదమైనా పంచెకట్టులోకి మారిపోతుంది. సాంకేతిక పదజాలాన్ని ఇట్టే ఇముడ్చుకోగల శక్తియుక్తులున్న ఏకైక భాష... భారతీయ భాషలన్నింట్లోకీ ఒక్క తెలుగేనని యాభై ఏళ్ల కిందటే ప్రపంచ ప్రసిద్ధ రసాయనశాస్త్రవేత్త ప్రొఫెసర్‌ హాల్డెన్‌ ప్రశంసించారు.మనదేశంలో 1652 మాతృభాషలున్నాయి. వీటిలో మహా అయితే ఓ పదిహేను, పదహారు భాషలకు లిపి ఉంది. రెండువందల భాషలకు పదహారు వందలకుపైగా మాండలికాలున్నాయి. ముప్ఫైశాతం పిల్లలు తమ మాతృభాషను నేర్చుకోవడం మానేస్తే, ఆ భాష ఉనికి ప్రమాదంలో పడినట్టే.1956 ఫిబ్రవరి 29న పాక్‌ సర్కారు బెంగాలీని కూడా మరో అధికార భాషగా గుర్తించింది. మాతృభాష కోసం నలుగురు బెంగాలీ యువకులు ప్రాణాలర్పించిన ఫిబ్రవరి 21వ తేదీని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం'గా ప్రకటించింది. - కర్లపాలెం హనుమంతరావు (ఈనాడు 21.2.2010)

అక్షర మోహనం said...

mee vedana andaridi.velugu unnanta kaalam telugu untundi..

కొత్త పాళీ said...

ఏవండీ మీ గుండెలో చాలాకాలంగా రగులుతున్న అగ్నిపర్వతం హేలీ తోకచుక్క పుణ్యమాని ఇప్పుడ్ బద్దలయినట్టుంది.
మీవ్యాసమంతా ఓపిగ్గా చదివాను. నేనింతగా ప్రేమించే తెలుగు సాహిత్యాన్ని ఎవరో ఏదో అనేశారే అన్న ఆక్రోశం తప్ప తత్వ విచారణ ఏం కనబళ్ళేదు నాకిక్కడ.
తెలుగు సాహిత్యంలో కొన్ని గొప్ప ఆణిముత్యాలున్నాయి - ఒప్పుకున్నా. మంచిగా బుజ్జగించి చెబితే బహుశా హేలీ కూడా ఒప్పుకుంటాడా విషయం.
ఒక్క ప్రశ్న కల్పన గారూ .. మీరు హేరీ పాటర్ పరంపర చదివారా? దాన్ని సహస్ర శిరఛ్ఛేద చింతామణితోనూ, ఇంకేదో జానపద కథతోనూ పోలిస్తే, మీరు హేరీ పాటర్ చదవలేదేమోనని నాకు అనుమానం వచ్చింది. హేరీ పాటర్ పరంపర మాయ మట్రాలు తంత్రాల గురించి కానే కాదు. అది మనుషుల గురించి, వాళ్ళా మనోభావాల గురించి, ఆసల గురించీ, భయాల గురించి, మనిషిని గొప్ప ఘనకార్యాలకి ఉసిగొలిపే బలమైన భావోద్రేకాల గురించి .. అన్నిటినీ మించి - they were great fun to read - అందుకనే ఆ పరంపర అంత విజయం సాధీంచింది. మన పాత జానపద గాథలు కూడా ఇటుబ్వంటివే .. ఎటొచ్చీ, వాటితో ప్రస్తుత జీవితానికి టచ్ పోయింది. లేకపోతే బాలనాగమ్మ కథలో, పాతాళ భైరవి కథలో ఉన్న భావోద్వేగానికి సాటి వొచ్చే నేటి కథలేవి? కానీ నేటి తరానికి బాలనాగమ్మ సరిపోదు. అది నిజం. తనని తాను పునస్సృష్టి చేసుకోవాల్సిన బాధ్యత సాహిత్యానిదే - పాఠకులది కాదు. హేరీ పాటర్ మొదటి పుస్తకం 1997లో వచ్చింది. గత పదేళ్ళ లో వచ్చిన మెచ్చదగిన తెలుగు పుస్తకం ఒకటి చెప్పండి చూదాం!

Kalpana Rentala said...

కొత్తపాళీ, మీ వ్యాఖ్య చదివేకా మీరు అర్ధం చేసుకునే తీరు మీద, నేను రాసే తీరు మీద కూడా నాకు బోలెడు అనుమానాలోచ్చేశాయి. హాహాహా.
తెలుగులో ఆణిముత్యాలున్నాయని నేను ఎవరినీ బుజ్జగించి వొప్పించాల్సిన అవసరం లేదు. ఆ పని చేయను కూడా. తెలుగు సాహిత్యం బాగుండలేదని ఇంగ్లిష్ సాహిత్యం ఎవరైనా చదువుకున్నా నాకు వ్యక్తిగతం గా ఏమీ నష్టం కూడా లేదు. తెలుగు సాహిత్యం ఇవాళ ఈ స్థితి లో వుందటం వెనుక కొన్ని కారణాలు , అభిప్రాయాలు చెప్పటం మాత్రమే ఇక్కడ నా ఉద్దేశం.అర్ధం చేసుకోగలరు.
హెరీపాటర్ లో వున్నవి కేవలం మంత్రతంత్రాలే కాదని తెలుసు. నేను మొదటి పుస్తకం చదివాను.( మావాడు ఆ పుస్తకం చదివే వయస్సులో లేనప్పుడు) ఇక దాని విజయం గురించి మాట్లాడుకోవటం కాదు ఇక్కడ మన పాయింట్. దానితో పొలుస్తూ తెలుగు లో ఏ పుస్తకం లేదన్న వ్యాఖ్య గురించి. అలాంటి పుస్తకాలు మన దగ్గర రాలేకపోవటానికున్న అనేకానేక కారణాల్లో నాకు తెలిసినవి కొన్ని నేను మాట్లాడాను.
అపూర్వ చింతమని లాంటి పుస్తకాలు ఒకరకమైన గ్రాంధికం లో, ఇప్పుడు పిల్లలు చదివే తెలుగు లో లేవు. వాటిని కాలానుగుణం గా కాస్త వ్యవహారం లోకి తెచ్చి రాస్తే బావుంటుంది. కానీ అసలు పుస్తక పఠనం లేని పిల్లలు మనకున్నపుడు రచయితలు, పుబ్లిషర్స్ ఆ పని చేయలేకపోతున్నారనుకుంటాను.
పునఃసృష్టి బాధ్యత సాహిత్యానిదే. పాఠకులది కాదు అన్నారు. అంటే రచయితలదనా మీ ఉద్దేశం? నేను చెప్పింది కూడా అదే మరి. కొత్త రచయితలు రావాలి. కొత్తగా రాయాలి అనే.
గత పదేళ్ళలో వచ్చిన పుస్తకం ( వాహ్ అనిపించే) పుస్తకం చెప్పమన్నారు....
అది చెప్పలాంటే చాలా మాట్లాడాలి మీరు , నేను కూడా. నేను తెలుగు లో చదవటానికి ఎప్పటికప్పుడు మంచి పుస్తకాలు నాకు నచ్చినవి దొరుకుతున్నాయి.
ఇంగ్లీష్ ఎక్స్పోజర్ లేకుండా ఆంద్రా లో వుండి వుంటే మీకు చాలా పుస్తకాలే దొరికి వుండేవి. కానీ ఇంగ్లీష్ లో సాహిత్యాన్ని ఆస్వాదించటం తెలిసేసరికి తెలుగు సాహిత్యం అంటే చాలా మందికి మొహం మొత్తుతోంది. రెండింటికి పోల్చి చూసుకొని నిరాశ చెందుతున్నారు చాలా మంది అనిపిస్తోంది.

భావన said...

చాలా బాగుంది చర్చ దాని మీద కామెంట్ లు కూడ. నేను పెద్ద గా కలిపేది ఏమి లేదు కల్పన అందరి కి తల వూపటం తప్ప, అందరు తెలుగు చదవాలనే ఆశ ఆకాంక్ష వున్నవాళ్ళే (ఎ తరం వాళ్ళైనా) రాసేరు ఇక్కడ. తెలుగు మీద పెద్ద గా ఏ అభిప్రాయం లేని వాళ్ళు దీని గురించి కామెంటి తే ఏమంటారో వినాలని వుంది.

కొత్త పాళీ said...

కల్పన .. మీరన్నారు ..
-->-->-->
"మీ వ్యాఖ్య చదివేకా మీరు అర్ధం చేసుకునే తీరు మీద, నేను రాసే తీరు మీద కూడా నాకు బోలెడు అనుమానాలోచ్చేశాయి."
--<--<--<--
హమ్మ్. ఇది కొంచెం తీవ్రంగా ఆలోచించాల్సిన విషయమే మీరు నవ్వుతూ అన్నా. అందుకని మీ వ్యాసమంతా మళ్ళీ చదివా.
1. మీదీ నాదీ ఆశయం ఒకటే .. తెలుగులో మంచి రచనలు రావాలి, అవి బాగా అమ్ముడుపోవాలి, యువతరం తెలుగు పుస్తకాలు చదవాలి, ఎట్సెట్రా ..
2. మీరు ఇందాకటి సమాధానంలో క్లారిఫై చేసిన పాయింట్లన్నీ మీ వ్యాసంలో ఉన్నై. ఒప్పుకున్నా. కానీ, వాటితోబాటు (నా దృష్టిలో) అవసరంలేని ఎమోషనల్ రెటొరిక్ కూడా ఉంది. విలువైన పాయింట్ల గురించి మాట్లాడేప్పుడు అసలు పాయింటు ఆ రెటొరిక్ బరువు కిందపడి నలిగిపోయిందిక్కడ (అని కూడా నా అభిప్రాయం మాత్రమే.
3. ఏటా వచ్చే కథా సంకలనాలు, కవితా సంకలనాలు, విశాలాంధ్రా వాళ్ళేసే పాత తరం రచయితల రీప్రింట్లు తప్ప, మెచ్చదగిన పుస్తకం ఒకటి చెప్పండి! దృశ్యాదృశ్యం నవల రచన క్వాలిటీ గురించి నాకు చాలా అభ్యంతరాలున్నై. వాటిని రచయిత్రితో ముఖతః చెప్పాను, వివిధ వ్యాఖ్యల్లో రాశాను. కచ్చితంగా అది గొప్ప పుస్తకం కాదు. కథా సంపుటులు కాని, కవితా సంపుటులు కాని, వ్యాస సంపుటులు కాని - ఏవీ నన్ను ఉత్సాహ పరిచిన పుస్తకం నాకు కనబళ్ళేదు. ఇక కేశవరెడ్డి గారి మునెమ్మ ఒక్కటి మిగిలింది. అదింకా చేతికందలేదు, చదవలేదు. చదివాక చెబుతాను.
4. నాకు నచ్చక పోవటానికి కారణం నాకు పాశ్చాత్య రుచి అలవడ్డం అంటారు. పోనీ, నా టేస్టుని పక్కన పెట్టండి. తెలుగునాట పదిమందీ .. ఇది మంచి పుస్తకం అని కొనియాడిన ఒక పుస్తకం చెప్పండి, దానికి సేల్సు లేకపోయినా సరే.
5. బైదవే, హేరీపాటర్ రేంజిలో కాకపోయినా ఇప్పటికీ మధుబాబు లాంటి పాప్యులర్ రచయితలు ఫేంటసీ ఎడ్వంచర్ ఫిక్షను కొత్తగా రాస్తూనే ఉన్నారు. వాటిల్లో రచన క్వాలిటీ ఎంత చెత్తగా ఉన్నదంటే.. ఈ వాక్యం రాయడం కూడా అనవసరం.

Anonymous said...

కల్పన గారు,
నేను హెలీ గారి వ్యాసం చదవలేదు. మీ అభిప్రాయాన్ని, ఆ తర్వాత దాని మీద వ్యక్తమైన అన్ని అభిప్రాయాల్ని చదివేను. అందుకని హెలీ గారు మరేవనుకోకండి. మీకేంకావాలో మీరు వ్రాశారు, అల్లాటివి తెలుగు సాహిత్యం అందజేయలేకపోతుంది అన్నారు. కానీ కల్పన గారు, హెలీ గారు, తెలుగు సాహిత్యవే కాదు ఏ భాషా సాహిత్యవైనా ముందుతరాలకి సాహిత్యంపట్ల మక్కువగలిగించే వాటి పట్ల కొంచం వెనుకగానే వుంటుంది.

నేను చదవ సాహసించిన మొదటి పుస్తకం బుచ్చి బాబు గారి "చివరకు మిగిలేది," ఇప్పటి వరకు దాన్ని నేను చదవలేదు. నా మొదటి ప్రయత్నం నేను రెండో తరగతి చదువుతున్నప్పుడు. ఆ తర్వాత చదివిన మొదటి పుస్తకం సహశ్ర శిరస్చేద చింతామణి. అప్పుడు నేను నాలుగో తరగతి. ఆ ఏడొందలో, వెయ్యి పేజీల బుక్కో, సాయంత్రం ఆటల్కి కూదా యగనామం పెట్టి చదివేను. ఒక్క సారే చదివేను అది. కానీ ఇప్పటికి విజయ నాకు గుర్తుంది. ఆ గుడిలో ఆ విజయుడే అనుకుంటాను ఆయనకి వినిపించిన ఆ గాజుల గల గల నాదం నాకు గుర్తుంది. ఆడవాళ్ళ సామ్రాజ్యం నాకు గుర్తుంది. ఆ సన్యాసి ఏ రెండో రాణి గారి బీరువా తలుపో తెరిస్తే కారిన రక్తం చుక్కలు నాకు గుర్తే. కథంతా నాకు గుర్తులేదు, కానీ ఆ పుస్తకం చదువుతున్నంతా కాలం ఊపిరి బిగబట్టుకుని చదవడం నాకు గుర్తే భయంతో ఆ చిన్న దేహం వణకటం నాకు గుర్తే. ఆ చదువు కోసం నేను సాయంత్రాలు ఆటలు మానేసుకోవడం గుర్తుంది. అయితే ఏవిటి? ఏవిటి, కల్పన గారు, ఆ పుస్తకాలని మీరు ఈ రోజు రవ్లింగ్ గారి రచనలతో ఎలా పోల్చచగలరు. ఆ రోజు అదృష్టవశాత్తు ఆ పుస్తకాలు మనచేతుల్లో పడ్డాయి. గమనించుకోండి ఆ మాత్రం పుస్తకాల్ని కొని, లేకపోతే ఏ గ్రంధాలయం నుంచో తెచ్చుకోగలిగిన అవకాశం ఉన్న కుటుంబాలు ఎన్నుండేవో. సినిమా చూసినా దాని వెనక వున్న రచన గురించి తెలిసిన కుటుంబాలెన్ని వుండేవో. కానీ ఈ రోజు అలా కాదే, హేర్రీ పోఠర్ తెలియని పిల్లలెవరు. ఆ సినిమా, ఆ నవల, ఆ రచయిత్రి గురించి తెలియని కుంటాబాలెన్ని మధ్య తరగతిలో.

ఏవన్నాను మధ్య తరగతని కదా కల్పన గారు. ఆ రోజు ఈ రోజు పుస్తకాల్ని కొని, అరువు తెచ్చుకుని చదవగలిగిన కుటుంబాలు చాలా తక్కువే, కారణం ఆర్ధికం కానీయండి, అభిరుచి కానీయండి. కానీ మన మధ్య తరగతి పదిహేనిరవై శాతం కన్నా అప్పుడు లేదు, ఇప్పుడు ఇంకో నాలుగైదు శాతం పెరింగిందేవో, అంతే కదా. తెలుగు సాహిత్యాన్ని, ఆంగ్ల సాహిత్యాన్ని, మరో సాహిత్యాన్ని గురించి మనం మాట్లాడుకునేప్పుడు మనం మాట్లాడుతున్నది ఆ పదిహేను ఇరవై శాతం జనాభా గురించే అని మరవకండి (పై వాళ్ళు పెద్ద చదవరు, క్రిందివాళ్ళకా అవకాశవే లేదు). కాబట్టి తెలుగు సాహిత్యాన్ని గురించి బాధపడదలచుకుంటే, మీరూ, నేనూ, హెలీగారు మొదలైన వాళ్ళవందరం కూడా, తెలుగులో వస్తున్న, రాని సాహిత్యాన్ని మరచిపొయ్యి, నూటికి ఢెభై, ఎనభై శాతంగా వున్నటువంటి ఈ తెలుగు ప్రజల్ని ఏరకంగా చదవా, వ్రాయ తెలిసిన వాళ్ళవి చేద్దావా అని ఆక్రోశపడాలి. అంతేగాని, నూటికి పదిహేనుమందో, ఇరవైమందో (వాళ్ళలో ఏ కొందరో చవగలిగి, చదవగలటం ఆఫర్డ్ చెయ్యగలిగుంటారు) చదవలేదని బాధపడితే ఎలా కల్పన గారు? వాళ్ళకోసం ఆంగ్ల విఠలాచార్యలు (రౌలింగులు) మళ్ళా తెలుగులో లేరని నిష్టూరపోతే ఎలా హేలీ గారు.

తెలుగు సాహిత్యాన్ని ఉద్ధరించదలచుకుంటే, తెలుగు అక్ష్యరాశ్యతను ఎలా పెంచాలో ఆలోచించండి. బడికే పోని, పోయినా ఏ నాలుగైదు తరగతుల్లోనో జల్లెడలోనుంచి జారిపోయే ఆ మెజారిటీ తెలుగు బాల బాలికల గురించి ఆలోచించండి. మీరెంత బాధపడినా, నిష్టూరాలాడినా పుస్తకాలు కొనో, అప్పుతెచ్చుకునో చదవగలిగిన కుటుంబాలు చాలా కొద్దే. ఆ రోజైనా, ఈ రోజైనా. దాన్ని మార్చ లేనప్పుడు ఎందరు జే. కే. రౌలింగ్ల్ని తెలుగులో సృష్టించినా ఉపయోగవేవుంది. కానీ ఇవేవీ లేకుండానే, ఇవేవీ తెలియకుండానే, మనకు తెలియకుండానే మెజారిటీ ప్రజలు (ఏ చదవ వ్రాయను రాని జనాలు) ఎంతో సాహిత్యాన్ని (మనం సాహిత్య విలువల్తో అది సరి తూగకపోయినా) వింటున్నారు, చూస్తున్నారు, అనుభవిస్తున్నారు, ఆనందిస్తున్నారు, ఆక్రోశిస్తున్నారు. అవి పుస్తక రూపంలో లేకపోతేనేం, అవి గాలి మాటలగానే రాలిపోతేనేం, అవి వ్రాయని పదాలగానే చెల్లిపోతేనేం కల్పన గారు. ప్రతి ఇల్లు ఒక సాహిత్య కర్మాగారవే కాదా. ప్రతి అమ్మ ఒక అద్భుతవైన జె. కె. రౌలింగ్ కాదా. ప్రతి బాల్యం ఒక గొప్ప ఫేంటసీ కాదా?

మనకు తెలిసిన సాహిత్యం అప్పుడూ, ఇప్పుడూ దాదాపు అదేరీతిలో పోతుంది. ఎవరన్నా మొత్తం తెలుగు సాహిత్య కొనుగోళ్ళని, అరవై, ఢెబ్బైలతోనూ ప్రస్తుతంతోనూ లెఖ్ఖలు తీసి పోల్చితే బాగుండు, బహుశా కొంచం అటూ ఇటుగా సమానంగానే ఉంటుందేవో (జనాబా దామాషా, ఇన్ఫ్లేషన్ రేట్ అవ్న్నీ లెక్కలోకి తీసుకుంటే). ఎందుకంటే పుస్తకవనేది మధ్య తరగతిలో కూడా అది తెలుగైనా, ఆంగ్లవైనా, ఆంధ్రదేశవైనా, అమెరికా దేశవైనా ఆ కొద్ది శాతానికే పరిమితం. రౌలింగ్ని చదివిన వాళ్ళలో ఈ దేశంలో కూడా హెమింగ్వే పేరు వినని వాళ్ళే ఎక్కువేవో. జాక్ లండన్ తోడేళ్ళని గురించి మాత్రవే గాక మనుషుల గురించి కూడా అద్భుతవైన రచనలు చేసేడని తెలిసిన వాళ్ళు ఎంత మంది?

రవికిరణ్ తిమ్మిరెడ్డి.

Kalpana Rentala said...

కొత్తపాళీ,
నా వ్యాసం లో ఎమోషనల్ రీటారిక్ వుందన్న మీ పాయింట్ ని వొప్పుకుంటున్నాను. ఒక భావావేశం తో కవిత్వం రాస్తే ఇబ్బంది లేదు కానీ వచనానికి మాత్రం అది అనవసరం. వచనం లో ఎంత స్పష్టత వుంటే అంత మంచిది.
ఇప్పుడొస్తున్న తెలుగు పుస్తకాల మీద టపా రాస్తాను. అప్పుడు వివరంగా మాట్లాడుకుందాము.
రవికిరణ్, మీరు తెలుగు సాహిత్యాన్ని బాగానే చదివినట్లు కనిపిస్తోంది. మీరు ఒక బ్లాగ్ లో తెలుగు సాహిత్యం లో వస్తున్న మార్పుల గురించి ఒక టపా ఎందుకు రాయకూడదు? ఆలోచించండి. ఒకటి, రెండు విషయాలు మిమ్మల్ని అడగాల్సినవి వున్నాయి. నాకుమైల్ చేయగలరా? నా మైల్ kalpanarentala@yahoo.com
హేరీ పాటర్ కేవలం పుస్తకం గా మాత్రమే వచ్చి సినిమా గా రాకుండా వుంటే ఇండియా లాంటి దేశాల్లో పిల్లలంతా (పల్లెల్లో వున్నవాళ్ళు కూడా) ఆ పుస్తకం ఇంగ్లీష్ లో చదివి వుండేవాళ్ళా? సినిమా గా రావటం వాళ్ళ ఎక్కువ మందికి రీచ్ అయింది. ఇక్కడ బాగున్న ప్రతి పుస్తకం ఒక సినిమా అవుతుంది. పుస్తకం చదవని వాళ్ళు సినిమా చూస్తారు. పుస్తకం చదివిన వాళ్ళూ సినిమా చూస్తారు. పుస్తకం వల్ల సినిమా కు, సినిమా వల్ల పుస్తకానికి రెండింటికి అదనపు లాభాలు.
“నూటికి ఢెభై, ఎనభై శాతంగా వున్నటువంటి ఈ తెలుగు ప్రజల్ని ఏరకంగా చదవా, వ్రాయ తెలిసిన వాళ్ళవి చేద్దావా అని ఆక్రోశపడాలి.”
వొప్పుకుంటున్నాను.
“అవి పుస్తక రూపంలో లేకపోతేనేం, అవి గాలి మాటలగానే రాలిపోతేనేం, అవి వ్రాయని పదాలగానే చెల్లిపోతేనేం”
కఠిన సత్యం.
““ ప్రతి అమ్మ ఒక రౌలింగ్ కాదా? ప్రతి బాల్యం ఒక ఫాంటసీ కాదా?””
నిజం. నిజం. నిజం.

లలిత (తెలుగు4కిడ్స్) said...

ఈ చర్చని పూర్తిగా follow అవ్వలేదని ఇప్పుడే తెలుసుకున్నాను.
మళ్ళీ చూడడం మంచిదయ్యింది.
మీ "అమ్మ చెప్పిన కథలు" టపాకి ముందు జరిగిన కథ ఇదా, ఐతే?
చర్చలో వ్యాఖ్యల రూపంలో ప్రధానాంశాలు ముందుకు వచ్చాయి.
అవును అక్షరాస్యత, తెలుగు అక్షరాస్యత, పెంపొందించాలి.
ఈ నాడు తెలుగు నాట తెలుగు సాహిత్యం అతి ఎక్కువ శాతం జనాభాని చేరడానికి పుస్తకం కాదు మాధ్యమం.
టీవీ లేదా సినిమా.
గ్రంథాలయం లేకున్నా, సినిమా థియేటరు ఉండి తీరుతుంది.
కాదంటారా.
http://www.planetread.org/index.php వారు చేపట్టిన "స్వంత భాషలో subtitles" (Same Language Subtitles) కార్యక్రమం ఆ నిజాన్ని ఆధారంగా చేసుకుని చేపట్టినదే.
http://www.bookbox.com/index.php?pid=129 వారిదే లాభాపేక్ష సంస్థ. ఆ లాభాలు కొంత planetread కు వెళ్తాయి.
నేను కొన్ని (ఉచితంగానే) తెలుగు చేసాను వారి కథలు. ఇంకా చెయ్యాలని నాకు ఉత్సాహం ఉన్నా, వారు హిందీ మీద ఎక్కువ focus పెట్టినట్టున్నారు. విదేశాలలో కన్నా ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ ఆదరణ ఉందన్నారు వారు వారి productsకి. planetread వారు ఇప్పటికే చేసినవి చూస్తే తెలుగు జానపదాలు చాలా కనిపిస్తాయి మీకు. అవి ఎవరు వాడుకుంటున్నారో తెలియదు. కానీ BookBox తెలుగు పుస్తకాలు కొన్ని రిషీ వ్యాలీ గ్రంథాలయంలో చోటు చేసుకున్నాయి. Pratham వారు కూడా కొంటారు వారి పబ్లికేషన్సు.
అవును ఇవన్నీ కూడా అనువాదాలే.
నేరుగా తెలుగులో పిల్లలకి పుస్తకాలి రావాలి. రాగలవు, మనం పూనుకుంటే.
చందమామలు తమ వంతు సాయం తాము చేస్తున్నాయి. ఇతర పుస్తకాలు చాలా చేరలేని చోట చందమామ చేరగలదు. సుధా మూర్తి గారు కన్నడ చందమామలు పాఠశాలలో పంపిణీ చేస్తున్నారని విన్నాను
నాకు ఎక్కడ మొదలు పెట్టాలో తెలియదు.
అంతర్జాలంలో పరిచయమైన వారిననదరినీ publishers తో సహా సంప్రదిస్తున్నాను.
చర్చలలో పాలు పంచుకుంటున్నాను.
నాకు అందుబాటులో ఉన్న మాధ్యమం అంతర్జాలం. అక్కడ నాకు చేతనైనది చేస్తూనే ఉన్నాను, చేస్తూ ఉంటాను.
అదృష్ట వశాత్తూ, చందమామకూ కథలు రాయగలుగుతున్నాను, రాయగలను, సాధన చెయ్యాలి అనే తపన పెరిగింది నాలో.
కొత్తపల్లి పత్రిక వారూ తమ వంతు కృషి చేస్తున్నారు.
http://kottapalli.in/
అమ్మ ఒడి ఆదిలక్ష్మి గారు వంటి బ్లాగర్లూ పాల్గొంటున్నారు.
నిరాశ పడకుండా ప్రయత్నిస్తూ ఉందామన్నారు, నారాయణ గారు.
అలానే పిల్లల నుంచి ఎట్టకేలకు స్పందన మొదలయ్యింది కొత్త శీర్షికకు.
మరింత ప్రయత్నిద్దాం. మనం కోరే మార్పును మనం చేసి చూపిద్దాం.

చందు said...

kalapana,
fabulous and fascinating arguments.
kanee , oka chinna mata . telugu sahityam lo fantacy ledani evaru chepparu.madhira vaari "kasi majili kdhalu " chadavamani cheppalsindi kada.andolo leni fantacy ,ekkadaina vunda,harry potter ni minchi vunde "balaraju -keelugurram","bala nagamma kadha" enni levu cheppukodaniki.

inkoka mukya vishayam,bharahteeya sahithyamantha asava drukpathanni chaduvariki kaligisthundi.
vudaharana ku edaina paschatya viphala prema kadhanu teesukunte ,adi oka vishada bhavana ni chaduvari meeda poorthi prabhavanni chupisthundi.kanee ade vishadanni kuda oka possitive attitude lo chupinche satta mana poorva rachayithaladi ani cheppachchu.

 
Real Time Web Analytics